S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అజ్ఞాతవాసం

జార్జ్ రేమండ్ తమ ఇంటి ఆవరణలో ఉన్న తొమ్మిదడుగుల లోతు గల స్విమ్మింగ్ పూల్‌లోని రెండో నిచ్చెనకి బిగించిన స్క్రూలని స్క్రూ డ్రైవర్‌తో తీస్తున్నాడు. అప్పటికే జార్జ్ స్క్రూలని విప్పిన మొదటి స్టీల్ నిచ్చెనని తీసుకెళ్లి అతని భార్య బెత్ గేరేజ్‌లో పెట్టేసింది. వాళ్లు ఊళ్లో లేనప్పుడు పిల్లలు వచ్చి నిచ్చెనని దొంగిలిస్తారని ఆమె భయం.
‘ఈ నిచ్చెనని ఇక్కడే ఉంచేస్తున్నారు. మనం బయలుదేరబోయే ముందు ఆఖరిసారి స్విమ్మింగ్ చేశాక దీన్ని తీసేయచ్చు’ బెత్ చెప్పింది.
ఇద్దరూ లాస్ ఏంజెలెస్‌కి దూరంగా గల ఓ కొండ పక్కన ఉన్న తమ ఇంట్లోకి వెళ్లి సూట్‌కేసులు సర్దుకోసాగారు.
‘చెరో రెండో చిన్న ఎయిర్ బేగ్స్ మాత్రమే తీసుకెళ్తున్నాం. తక్కువ బరువుతో ప్రయాణం చెయ్యాలి. అవసరమైనవే తీసుకెళ్లాలి’ జార్జ్ భార్యకి చెప్పాడు.
‘మనం దేన్నించో పారిపోతున్నామని నాకు అనిపిస్తోంది. దేన్నించో చెప్పవా? నీకు ఉదయం వచ్చిన ఉత్తరం చదివాక ఈ ప్రయాణం పెట్టావు’ బెత్ అడిగింది.
‘మనం స్పెయిన్‌కి చేరుకున్నాక చెప్తాను. ప్రస్తుతం మనం వలస వెళ్లే పక్షులం’
ఆమెకి ఆశ్చర్యం, కొద్దిగా భయం కూడా కలిగాయి. కానీ మళ్లీ ప్రశ్నించలేదు.
ఓ గంట తర్వాత వారింటి ముందు అంతమైన చోట ఓ పాత కారు ఆగింది. దాన్ని నడిపే వ్యక్తి పొట్టిగా, లావుగా ఉన్న మధ్యవయస్కుడు. ఇంటి ప్రహరీ గోడ మీద ఉన్న పేరు చదివి, ఆ పొట్టి వ్యక్తి తనతో వచ్చిన యువకుడితో చెప్పాడు.
‘జో! మొత్తానికి ప్రొఫెసర్ ఇంటిని కనుక్కోగలిగాం’
‘ప్రైవేట్ రోడ్. చెట్లు పొదల మధ్య డెడ్ ఎండ్‌లోని ఇల్లు. తను బయటకి ఎవరికీ కనపడని ఇంట్లోనే ఉంటున్నాడు’ సిగరెట్ తాగే ఆ యువకుడు తల ఊపి చెప్పాడు.
‘గత మూడేళ్లలో రెండు బెస్ట్ సెల్లర్ నవలలని రాశాడు. రెండేళ్ల క్రితం అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒలింపిక్ డైవింగ్ టీమ్‌లో సభ్యురాలు అని చదివాను’
పొట్టి వ్యక్తి వెళ్లి గేటు తెరిచాడు. తర్వాత కారుని లోపలికి పోనించాడు. కొద్ది దూరంలో ఇంటి పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గర తెరిచి ఉన్న గేరేజ్ ముందు ఆ రోడ్ అంతమైంది. ఇద్దరూ కారు దిగారు.
‘ఎంత పెద్ద స్విమ్మింగ్ పూలో! అతని భార్యకోసమై ఉండచ్చు’ పొట్టి వ్యక్తి చెప్పాడు.
ఆ యువకుడు గేరేజ్‌లోని జార్జ్ కారుని చూశాడు. దాని ట్రంక్ తలుపు ఎత్తి ఉంది. అందులో రెండు సూట్‌కేస్‌లు కనిపించాయి.
‘మనం టైంకి వచ్చాం. వాళ్లు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు. పనయ్యాక స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఈ పూల్‌లో ఈతకొడదాం’ యువకుడు నవ్వుతూ చెప్పాడు.
సూట్‌కేస్‌లు సర్దాక జార్జ్ కారు ట్రంక్‌లో పెట్టి వచ్చి చేతి గడియారం చూసుకుని భార్యతో చెప్పాడు.
‘ఇంకో గంట టైముంది. దారిలో బేంక్ దగ్గర ఆగాలి. నువ్వు ఓ అరగంట ఈదాక పూల్‌లోని నీటిని తీసేయాలి’
ఆమె బయటికి రాగానే ఆ పొట్టి వ్యక్తి కుర్చీలో కూర్చుని అక్కడి బాటిల్‌లోని బ్రాందీ తాగుతూ కనిపించాడు.
‘ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? డోర్ బెల్ కొట్టలేదే?’ బెత్ అతన్ని గట్టిగా ప్రశ్నించింది.
‘నా పేరు మేక్స్. బ్రాందీ బావుంది’ అతను నవ్వుతూ చెప్పాడు.
‘వెంటనే బయటికి నడవండి. లేదా పోలీసులకి ఫోన్ చేస్తాను’ కోపంగా చెప్పింది.
‘మీరా పని చేస్తారనుకోను’ అతను నవ్వుతూ చెప్పాడు.
ఆమె వెంటనే స్విమ్మింగ్ పూల్ పక్కనున్న రిసీవర్ అందుకుని డయల్ చేయసాగింది. చెమట వాసన వేసే బలిష్ఠమైన ఆ యువకుడు ఆమె ప్రయత్నాన్ని ఆపాడు.
‘ప్రొఫెసర్‌కి టేస్ట్ ఉంది. నువ్వు అందంగా ఉన్నావు’ నవ్వుతూ చెప్పాడు.
‘ఆమెని వదులు జో. తొందర పడాల్సిన అవసరం లేదు. మనకి చాలా టైమ్ ఉంది’ మేక్స్ చెప్పాడు.
అతను ఆమెని వదిలాడు.
‘మీరెందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ ఇలా చొరబడే వారిని పోలీసులు వదలరు’
‘మీ భర్త మా గురించి పోలీసులకి ఫోన్ చేస్తాడని నేను అనుకోను. అవునా?’ వాళ్ల మాటలకి బయటకి వచ్చిన ప్రొఫెసర్ వంక నవ్వుతూ చూస్తూ మేక్స్ చెప్పాడు.
‘వద్దు బెత్. పోలీసులని దీనికి దూరంగా ఉంచుదాం’ జార్జ్ తన భార్య మీద అనునయంగా చేతులు వేసి చెప్పాడు.
‘వీళ్లు నీకు తెలుసా?’ బెత్ అడిగింది.
‘మేక్స్ నాకు తెలుసు. ఒకప్పుడు మేమిద్దరం రూమ్‌మేట్స్’
‘అది సగం నిజం మాత్రమే మిసెస్ జార్జ్’ మేక్స్ పకపక నవ్వాడు.
‘తర్వాత నేను చెప్తాను మేక్స్... బెత్. నా గతం గురించి నువ్వు ఎప్పుడు అడిగినా నేను చెప్పకపోవడానికి కారణం ఉంది. మనం స్పెయిన్‌కి వెళ్లాక నేను ఈ విషయాలు చెప్తాను. న్యూయార్క్‌లోని జైల్లో మేక్స్, నేను సెల్‌మేట్స్. ఎనిమిదేళ్ల క్రితం తప్పించుకున్నాను’
బెత్ మొహంలోని ఆశ్చర్యాన్ని, భయాన్ని గమనించిన మేక్స్ వెంటనే చెప్పాడు.
‘ఓ పెట్రోల్ బంక్‌ని దోచుకోవడానికి ఇద్దరు రౌడీలు వెళ్లినప్పుడు నీ భర్త దాన్ని నడిపే కారు డ్రైవర్. పెట్రోల్ బంక్ మనిషి చంపబడ్డాడు. అందులో నీ భర్త ప్రమేయం లేకపోయినా ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడింది’
‘ఇది నీ నించి దాచినందుకు సారీ బెత్’ జార్జ్ చెప్పాడు.
‘నువ్వు హంతకుడివి కాదు కాబట్టి నాకు దుఃఖంగా లేదు’ బెత్ చెప్పింది.
‘అర్థం చేసుకున్నందుకు థాంక్స్ బెత్. మేక్! నా అడ్రస్ నీకు ఎలా తెలిసింది?’
‘నీ తాజా పుస్తకాన్ని నేను చదివాను. ఆ నవల్లో మన సెల్ నెంబర్ 403లో జరిగిన రెండు సంఘటనల గురించి రాశావు. దాంతో నాకు ఆసక్తి ఏర్పడింది. నేను పెరోల్ మీద బయటికి వచ్చాక జో, నేను కలిసి ప్రఖ్యాత రచయిత జార్జ్ రేమండ్ గురించి విచారించాం. అడ్రస్ కానీ, ఫొటోలు కానీ ఎక్కడా లేవు. ఇలా అజ్ఞాతంగా ఉండడం పబ్లిసిటీ కోసం అని చాలామంది చెప్పారు. కానీ నేను నిజాన్ని గ్రహించాను. జార్జి రేమండ్ అసలు పేరు నా సెల్‌మేట్ జార్జ్ రైస్ కాకపోతే ఇలా దాక్కోవల్సిన అవసరం లేదు. దాంతో నేను నీ లిటరరీ ఏజెంట్ సెక్రటరీని కలిశాను. ఆమె అయిష్టంగానే నాకు నీ అడ్రస్ చెప్పింది. ఓ పాత కారు కొని ఇక్కడికి చేరుకున్నాం. పారిపోయాక బాగానే సంపాదించావు ప్రొఫెసర్’ మేక్స్ నవ్వి చెప్పాడు.
‘నా ఏజెంట్ నీ గురించి రాసిన ఉత్తరం నాకు అందింది. ఇప్పుడు నీకేం కావాలి. డబ్బా’? జార్జి పొడిగా అడిగాడు.
‘డబ్బా? దాన్ని నీ నించి ఎలాగైనా సంపాదించవచ్చు. జో, నేను పోలీసుల నించి దాక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మేమిద్దరం మీ ఇంట్లో తల దాచుకోదల్చుకున్నాం.’
‘నో! మేము విదేశాలకు వెళ్తున్నాం’ బెత్ వెంటనే చెప్పింది.
‘వెళ్లబోయారు. మేము ఇక్కడికి వచ్చేలోగా వెళ్దాం అనుకున్నారు కదా. జార్జ్?’ మేక్స్ అడిగాడు.
‘అవును. పీటర్ నించి ఆ ఉత్తరం రాగానే నా గురించి జైల్లోని ఎవరికో తెలిసిందని గ్రహించాను. వెంటనే స్పెయిన్‌కి వెళ్లాలనుకున్నాను’ జార్జ్ చెప్పాడు.
‘మనిద్దరం ఇక్కడ జైలు విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయచ్చు. జో, నీ భార్య చక్కగా కాలం గడపచ్చు. ఆమె జోకి ఈత నేర్పచ్చు. ఐతే మనుషుల్ని చంపడంకన్నా ఈత పోటీలు ఎక్కువ డబ్బుని ఇవ్వలేవు అని జోకి తెలుసు’
‘అవును. ఇంతదాకా నేను పట్టుబడలేదు’ జో చూపుడు వేలుని తుపాకీ గొట్టంలా వేలిని ఆమె వైపు ఉంచి నోటితో పిస్తోలు పేలిన చప్పుడుని చేశాడు. జార్జ్ చెయ్యి ఆమె చుట్టూ గట్టిగా బిగుసుకుంది.
‘చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. మేం స్నానం చేసేలోగా లంచ్ ఏర్పాట్లు చూడండి’ మేక్స్ చెప్పాడు.
‘లంచ్‌కి మునుపు నేను బెత్‌తో ఈదుతాను. ఇంతదాకా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లో నేనెన్నడూ ఈదలేదు’ జో నవ్వుతూ చెప్పాడు.
‘ఓకే. మీ ఇంట్లో స్పేర్ స్విమ్మింగ్ ట్రంక్స్ ఉన్నాయా?’ మేక్స్ ప్రశ్నించాడు.
‘గెస్ట్‌రూమ్‌లో. పై డ్రాయర్‌లో. ఆ తలుపు...’
‘మేము వెళ్లి స్విమ్మింగ్ ట్రంక్స్ తొడుక్కుని వస్తాం. ప్రొఫెసర్, అతని భార్య ఈలోగా మా గురించి కొంత మాట్లాడుకోవచ్చు’
ఇద్దరూ గెస్ట్‌రూంలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు.
‘జార్జ్! ఏమిటి ఇదంతా?’ బెత్ భయంగా అడిగింది.
‘నేను భద్రంగా ఉన్నానని భావించాను. లేదా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. నువ్వు కారెక్కి ఎక్కడికైనా వెళ్లు. నన్ను మర్చిపో. నీకు విడాకులు ఇస్తాను’ జార్జ్ సూచించాడు.
‘నా భవిష్యత్‌ని నిర్ణయించే ముందు నువ్వు నీ గతం గురించి చెప్పు’ బెత్ కోపంగా అడిగింది.
‘అదేమంత అందమైంది కాదు. చిన్నప్పటి నించే దొంగని. ఇరవయ్యో ఏడు రాకుండానే జైలుకి వెళ్లాను. జైల్లో మేక్స్ ద్వారా నవలలు చదవడంలో అభిరుచి ఏర్పడింది. బయటికి వచ్చాక ఇందాక మేక్స్ చెప్పింది జరిగింది. ఇద్దరు దొంగలకి సహాయకుడిగా వెళ్లాను. నా పాత రికార్డ్ వల్ల నేనే హంతకుడినని జూరీ సభ్యులు భావించారు. అలా నా ఇరవై నాలుగో ఏట మళ్లీ జైలుకి వెళ్లాను. లైబ్రరీలో పుస్తకాలు చదివే నాకు ప్రొఫెసర్ అనే ముద్దు పేరు పెట్టారు. అక్కడ నాకు తెలిసిన మనుషుల గురించి కథలు రాయసాగాను. ఓ రోజు డాక్టర్ల డెలిగేషన్‌తోపాటు నేను కూడా జైలు బయటికి నడిచి వెళ్లిపోయి ఒకరి కారెక్కాను. కేలిఫోర్నియా వచ్చి రాయడం ఆరంభించాను. రచయితగా నా ఫొటోని ఇవ్వకుండా, పబ్లిసిటీకి దూరంగా ఉండసాగాను. నిన్ను కలిసే సరికి నన్ను ఎవ్వరూ పట్టుకోరనే ధీమా ఏర్పడింది. ఇప్పుడు నేను మేక్స్ దయ మీద ఆధారపడి ఉన్నాను. అతను పోలీసులకి ఒక్క మాట చెప్పేంత చాలు. నేను మళ్లీ జైలుకి వెళ్తాను. కాబట్టి దయచేసి నన్ను వదిలి వెళ్లిపో’
‘నిన్ను వదిలి వెళ్లడమా? నేను ఎలాంటిదాన్ని అనుకున్నావు? ఎప్పటికీ వదలను. ముఖ్యంగా ఇప్పుడు’
‘్థంక్ యూ బెత్’
‘నువ్వేం చేయదల్చుకున్నావు? వాళ్లుంటే ఏదైనా బీభత్సం జరగచ్చు అనిపిస్తోంది. జో అంటే నాకు భయంగా ఉంది’
‘బెత్! నువ్వు పోలీసుల దగ్గరకు వెళ్లు. నా దగ్గర డబ్బుంది. లాయర్ల సహాయంతో ఆ కేసుని మళ్లీ తెరిపించి, నాలో నేరప్రవృత్తి లేదని రుజువు చేసుకోగలను’
‘ఒకవేళ జడ్జ్ అది నమ్మకపోతే? అలా మనం దూరమయ్యే అవకాశం తీసుకోను’
మేక్స్, జో స్విమ్మింగ్ ట్రంక్స్ ధరించి రావడం ఆమె చూసింది.
‘స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ మరీ కిందకి ఉంది. ఏమైంది?’ జో అడిగాడు.
‘మేము వెళ్దాం అనుకున్నాం కాబట్టి నీళ్లు తీసేస్తున్నాం’
‘వెంటనే ఆపు. మీ ఇంటికి అతిథులు వచ్చారు కాబట్టి మీరు ఎక్కడికీ వెళ్లడంలేదు’ జో చెప్పాడు.
జార్జ్ స్విమ్మింగ్ పూల్ నించి నీటిని ఖాళీ చేసే వాల్వ్‌ని మూసేసి నీళ్లు వచ్చే వాల్వ్‌ని ఆన్ చేశాడు.
‘బెత్! సరిపడా నీళ్లు నిండాక నాకు డైవింగ్ నేర్పించు’ జో అడిగాడు.
బెత్ వెంటనే ఇంట్లోకి వెళ్లింది.
‘నా జీవితాంతం నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తావా?’ జార్జ్ అడిగాడు.
‘అది నీకు అలవాటవుతుంది. నీ విషయాలన్నీ ఆమెకి చెప్పావా? నా మాట విని నువ్వు అసూయ చెందకు. జోని చాలా మంది ఆడవాళ్లు ఇష్టపడతారు’ మేక్స్ నవ్వాడు.
వెంటనే రిసీవర్ అందుకుంటూ జార్జ్ చెప్పాడు.
‘ఏమైనా కానీ. నేను పోలీసులకి చేస్తున్నాను’
వెంటనే మేక్స్ జోకి సైగ చేశాడు. జో జార్జి తల వెనక బలంగా బాదాడు. వెంటనే అతను కుప్పకూలాడు.
‘కంగారుపడక. చిన్న గుణపాఠం అరగంటలో తేరుకుంటాడు’ జో నవ్వుతూ చెప్పాడు.
‘పోలీసులకి ఫోన్ చేస్తా అన్నాడు. అతని బుద్ధి మార్చు. లేదా ప్రాణాలతో ఉండడు. మాకు అనవసరంగా ఎవర్నీ చంపడం ఇష్టం ఉండదు’ అక్కడికి వచ్చిన బెత్‌తో మేక్స్ చెప్పాడు.
‘ఇప్పుడు ఈత పాఠాల సమయం’ జో చెప్పాడు.
‘నాకు మిమ్మల్ని ఎదిరించే అవకాశం లేదు’ చెప్పి బెత్ డైవింగ్ ప్లాట్‌ఫాం మీదకి ఎక్కి నిలబడి కిందకి నీళ్లల్లోకి దూకి చెప్పింది.
‘చూశావా? సరిపడా నీళ్లున్నాయి. ఇది తొమ్మిదడుగుల ఈతకొలను. ఆరడుగుల మేరకి నీళ్లు ఉన్నాయి’
‘వస్తున్నా’ చెప్పి జో కూడా నీళ్లల్లోకి దూకాడు.
‘మేక్స్! నువ్వూ రా’ బెత్ పక్కకి వెళ్లి నిలబడి అరిచాడు.
మేక్స్ కూడా స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు.
‘మీరొకటి నాకు చూపిస్తారా?’ బెత్ ఉత్సాహంగా అడిగింది.
‘ఒకటేం ఖర్మ. ఒకేసారి రెండు చూపిస్తాం’ జో పగలబడి నవ్వుతూ చెప్పాడు.
బెత్ పూల్‌లోని స్టీల్ నిచ్చెన దగ్గరికి వెళ్లి ఎక్కి ఒడ్డుకి చేరుకుంది. వెంటనే అప్పటికే జార్జి బోల్ట్‌లు తీసేసిన ఆ నిచ్చెనని పైకి లాగేసి కోరింది.
‘స్విమ్మింగ్ పూల్‌లోంచి ఇప్పుడు బయటికి ఎలా రాగలరో చూపించండి’
జో స్విమ్మింగ్ పూల్ గోడ దగ్గరికి ఈదుతూ వెళ్లి చేతిని పైకి చాపాడు. కానీ, అంచు మూడడుగుల పైకి ఉండడంతో అందుకోలేక పోయాడు. రెండు మూడుసార్లు ఎగిరి కుడిచేత్తో అంచుని పట్టుకోగలిగాడు. అతను రెండో చేత్తో కూడా అంచుని పట్టుకుని పైకి పాకే ప్రయత్నం చేస్తూంటే, బెత్ రబ్బరు గొట్టంతో అతని చేతి వేళ్ల మీద బలంగా బాదింది. పెద్దగా అరుస్తూ అతను నీళ్లల్లోకి పడిపోయాడు.
‘నేను బయటికి రాగానే నీ పనుంటుంది’ జో అరిచాడు.
‘ఐతే బయటికి వచ్చి చూపించు. నీరు తగ్గుతోంది. మెట్లు లేకుండా ఎలా రాగలవు? మూడు గంటలు మించి ఎవరూ ఈదలేరు. ఈ మూడు గంటల్లో మీ వేళ్లు అంచుని తాకినప్పుడల్లా చితికిపోతూంటాయి. మూడు రోజులు ఈదగలవా?’
‘జో’ మేక్స్ భయంగా అరిచాడు.
జో అతని దగ్గరికి ఈదుతూ వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే జో అవతలి వైపుకి ఈదుకుని వెళ్లాడు. మేక్స్, జో భుజాల మీద కాళ్లుంచి ఒడ్డుకి చేరుకునే ప్రయత్నం చేశాడు. ఆమె చేతిలోని ట్యూబ్ నాబ్ తిప్పగానే వేగంగా బయటికి వచ్చిన నీళ్లు మేక్స్ మొహానికి బలంగా తాకడంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వెనక్కి పడిపోయాడు.
‘నేను ఎక్కువసేపు ఈదలేను. మిసెస్ జార్జ్. మమ్మల్ని ఏం చేయకు. మేము తమాషాగా మాట్లాడాం. అంతే’ మేక్స్ అర్థించాడు.
‘మీరు నా భర్తని కొట్టారు. ఇంకా ఎంతమందినో హింసించారు. ఇవాళ అవన్నీ రుచి చూపిస్తాను’ బెత్ క్రోధంగా చెప్పింది.
‘ఏ క్షణంలోనైనా ఎవరైనా రావచ్చు. నువ్వు తప్పించుకోలేవు’ జో అలసటగా చెప్పాడు.
‘ఆహ్వానిస్తే కాని మా ఇంటికి ఎవరూ రారు. మీరు అరిచినా ఎవరికీ వినపడదు. నా భర్తని, మా ఆనందాన్ని నాశనం చేయడానికి మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉచ్చులో చిక్కుకున్నారు’ బెత్ కోపంగా చెప్పింది.
‘దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు’ మేక్స్ మళ్లీ అర్థించాడు.
‘మీరిక్కడికి ఉండడానికి వచ్చారు. కాబట్టి ఉండండి. మీరున్న చోటే. స్విమ్మింగ్ పూల్లో’ బెత్ నవ్వుతూ చెప్పింది.
‘మేక్స్! నువ్వు అవతలి వైపు పైకి వెళ్లే ప్రయత్నం చెయ్. నేను ఇవతలి వైపు నించి ప్రయత్నం చేస్తా. ఆమె ఒకేసారి రెండు చోట్లా ఉండలేదు’ జో చెప్పాడు.
ఆమె జో వెళ్లిన వైపే నవ్వుతూ వెళ్లింది. మరో రెండుసార్లు అతని వేళ్ల మీద కొట్టి లోపలికి పడేలా చేసింది. జోకన్నా అడుగున్నర పొట్టి వాడైన మేక్స్‌కి ఎంత ప్రయత్నించినా అంచు అందలేదు.
‘్భయపడ్డ ఆడవాళ్లు ఏం చేయలేరనుకోకు. వాళ్లే ఎదురు తిరగగలరు. పోరాడగలరు. నేను నా భర్త కోసం, నా ఆనందం కోసం మీతో పోరాడుతున్నాను’
‘పోలీసులు వచ్చి మా శవాల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తారు’ జో చెప్పాడు.
‘మీరు అలసటతో ఈత మానేశాక మీ శవాలని కారులో వేసుకుని కొండల్లోకి తీసుకెళ్లి చీకట్లో పారేస్తాం. ఇక్కడ మనిషి మాంసం తినే జంతువులు చాలా ఉన్నాయి. మీ శవాలని ఒకవేళ ఎవరైనా కనుగొన్నా, వాటికి, మాకు ఎలాంటి కనెక్షన్ ఉండదు’
‘జో. నేను ఇంక ఈదలేక పోతున్నాను. నువ్వే ఏదైనా ఆలోచించు’ మేక్స్ దీర్ఘశ్వాసతో చెప్పాడు.
భయంతో మేక్స్ జో భుజాల చుట్టూ చేతులు వేశాడు.
‘మేక్స్ వదులు. మనిద్దర్నీ ముంచేస్తున్నావు’ జో చెప్పాడు.
కానీ మేక్స్ చావు భయంతో అతన్ని వదల్లేదు.
జో మూడుసార్లు పైకి వచ్చాక, నాలుగోసారి పైకి రాలేదు. కొద్దిసేపటికి ఇద్దరి శవాలు నీళ్లల్లో తేలసాగాయి.
జార్జ్‌కి స్పృహ వచ్చింది.
‘ఎలా ఉంది?’ బెత్ అడిగింది.
‘బావుంది. వీళ్లేరి? ఇంట్లో ఉన్నారా?’ చుట్టూ చూస్తూ అడిగాడు.
‘నేను, నా ఈతకొలను కలిసి వాళ్లకి తగిన శాస్తి చేశాం. వాళ్లిద్దరూ పరమ దుర్మార్గులు. జీవించి ఉంటే మనల్ని బాగా హింసించేవారు. నేను స్ర్తిని. తన ఆనందాన్ని రక్షించుకోడానికి ఓ స్ర్తి ఏదైనా చేస్తుంది. నిన్ను నా నించి ఎవరూ, ఎప్పుడూ దూరం చేయలేరు’ తన తలని అతని భుజం మీద ఉంచి ఏడవసాగింది.
(ఏండ్రూ బెనడిక్ట్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి