సుందర మందారం
Published Saturday, 10 March 2018ఎప్పుడో 1965 ప్రాంతంలో జరిగిన ఘటన. రోహిణీకార్తి, మిట్టమధ్యాహ్నం. పక్కనే గలగలా గోదావరి వున్నా చల్లదనమనే మాట లేదు.
నేనూ, మా అక్కయ్యా, ఇన్నీసుపేటలో ‘సుబ్రాయ మహాత్ముల ఆశ్రమంలో భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాం. తెల్లని బట్టలతో, ఎంతో నీరసంగా కనిపిస్తూ ఎవరో నడివయస్సులో వున్న వ్యక్తి ఆశ్రమంలో ప్రవేశించి మా అందర్నీ ఆకర్షించాడు. మా అందరితో కబుర్లు చెబుతూ కూర్చున్న కాషాయాంబరధారియైన ఆ మహాత్ముడికి పాదాభివందనం చేసి కూర్చున్నాడు. కుశల ప్రశ్నలయ్యాయి.
‘సరిగ్గా భోజన సమయానికి వచ్చావ్. ఎండ మండిపోతోంది. కాస్త భోంచేసి వెళ్లవోయ్!’ ఆప్యాయంగా పలికిన ఆ మాటలకు పరవశించి వచ్చి మా ప్రక్కనే కూర్చున్నాడు, మారు మాట్లాడకుండా.
అందరి భోజనాలై తాపీగా కూర్చున్నాం. ‘ఒక చిన్న పాట పాడి వెళ్లవోయ్’ అన్నారు ఆ కాషాయాంబరధారి.
‘దీపముండగనిల్లు దిద్దుకోలేవా?/ చీకటిలొ ఒంటరిగ చిందులాడేవా’ గుండె లోతుల్లో నుంచి వచ్చిన పాట విన్నాను.
‘సింధుభైరవి’ రాగంలో కంపోజ్ చేసుకుని పాడిన ఆ పాటకు తనే రచయిత. ఎందుకో ఒక్కసారి విన్న ఆ పాట కొనే్నళ్లపాటు గుర్తుండిపోయింది.
రాజమండ్రిలో మా చిన్నక్క టిటిసి ట్రైనింగ్ నిమిత్తం వున్న రోజుల్లో నేను చూసిన గాయకుణ్ణి మళ్లీ దశాబ్ద కాలం తర్వాత చూశాను.
1971లో నేను రేడియోలో చేరటం, అడపాదడపా ఏవేవో పాటలు కంపోజ్ చేయటంలో వుండగా, ఓ రోజు సాయంత్రం రేడియోలోని (అప్పటికే బాగా ప్రసిద్ధుడైన) ఉషశ్రీ స్టూడియోలోకి వచ్చి ‘ఒరేయ్! ఈయనకు నమస్కారం చెయ్యి. ఎం.ఎస్. రామారావంటారు’ అంటూ పరిచయం చేస్తే నిర్ఘాంతపోయాను.
దశాబ్ద కాలంనాడు చూసిన వ్యక్తే.
గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటైన రేడియో ప్రోగ్రాం కోసం వచ్చారు. ఆయనతో బాటు, నేనూ పాల్గొని పాడటం మరవలేను. ఆ సాయంత్రం ఎం.ఎస్. రామారావు ‘చందమామ చందమామ’ అనే తత్త్వం పాడారు. వోలేటి గారు స్వరపరచిన ‘ఏలా ఈ మధుమాసం, ఇంకేదీ ప్రణయ విలాసము’ అనే డా.సి.నారాయణరెడ్డి పాట నేను పాడాను. మాధవపెద్ది సత్యం, సీత అనసూయతోబాటు ఇంకా చాలామంది పాల్గొన్న ఆ కార్యక్రమానికి ఆ వేళ హాలంతా క్రిక్కిరిసిపోవడం నాకు గుర్తే.
సుమధుర గాత్రం పరమేశ్వరుడిచ్చే వరం - అందరికీ లభ్యమయ్యేది కాదు.
నాభి నుంచి హృదయగతమై,
హృదయాంతరాళాల్లో నుంచి
కంఠగతమైన గానానికి ఎవరు
పరవశించకుండా ఉంటారు?
అటువంటి అరుదైన గాత్ర సంపద కలిగిన వారిలో ఎం.ఎస్.రామారావు ఒకరు.
ఎం.ఎస్.రామారావు కంఠంలోని ఆర్ద్రత, భావలాలిత్యంతో మృదుమధురమైన పొందికతో కూడిన పదాలూ చెవిని పడగానే ఏదో కమ్మని అనుభూతి. తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి ప్లేబాక్ సింగర్ ఆయనే అంటారు.
కేకలు పెట్టకుండా వినేవాళ్లు కాస్త స్థిమితంగా, కూర్చుంటే భావం బోధపడేలా పాడే పాటకు ఎంతటి వాడైనా దాసోహవౌతాడు. ఒక కంఠస్వరాన్ని పోలిన మరో కంఠం వుండదు. ‘ముఖే ముఖే సరస్వతి’ ఒకరితో మరొకరిని పోల్చకూడదు. ఎవరి ప్రతిభ వారిదే.
ఆ రోజుల్లో ఉత్తర హిందూస్తాన్‌లో ప్రసిద్ధి పొందిన కుందన్‌లాల్ సైగల్, సిహెచ్.ఆత్మా, పంకజ్ మల్లిక్ పాట ఈ తరం వారికి తెలియకపోవచ్చు. కె.ఎల్.సైగల్ పాట, మహమ్మద్ రఫీ కిషోర్ కుమార్ లాంటి వారికి ఆదర్శంగా వుండేది. ఎం.ఎస్.రామారావు పాట కూడా సరిగ్గా అలాగే ఉంటుంది.
సంప్రదాయంలో రాగానికుండే గమకాలన్నీ అందరి గొంతుకల్లోనూ పలకాలన్న నియమం లేదు. రక్తి ప్రధానంగా వుండాలని భావించేవారు ఈ విషయాలు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యమైనది భావం. కొందరి కంఠాల్లో శృతి బాక్స్ సహజంగానే ఉంటుందేమో అనిపిస్తుంది.
ముకేష్, కిషోర్ హేమంత్‌కుమార్ లాటి గాయకులు దీనికి ఉదాహరణ. వీరి గొంతుల్లో గమకాలు లేనిలోటు తెలియదు. ఈ కోవకు చెందిన గాయకులలో ఒకరైన రామారావు ఆ రోజుల్లోనే బాగా పేరున్న లలిత సంగీత గాయకుడు. రేడియో కోసం ఆయన పాడిన పాటలెన్నో ప్రసిద్ధమై శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన కంఠంలో ఒదిగిన మాటలన్నీ నాదాన్ని మోసుకుని చెవులకు యింపుగా చేరి హాయిగా వినాలనిపిస్తాయి.
నండూరి రామ్మోహనరావు (ఒకప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్) రాసిన లలిత గీతమొకటి రామారావు పాడారు రేడియో కోసం. ఎదురుగా కూర్చుని పలకరిస్తున్నట్లుగా ఉంటుందాయన పాడే పాట.
‘వెళ్లిపోయే వెనె్నలయ్యా, మళ్లి వచ్చేదెన్నడయ్యా!’ రేడియో కోసం ఎం.ఎస్. పాడిన వందలాది పాటల్లో బాగా ప్రసిద్ధమైనవి.
‘నావికా ఎచటికోయి ఈ పయనం’
‘ఈ సముద్ర తటాన ఏ సఖుని కోసమో’
‘నవ్వింది నవ్వింది’ లాంటి అనేక గీతాలు ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో -తాజ్‌మహల్’ అనే పేరుతో వున్న పాట వినే వుంటారు. హెచ్‌ఎంవి కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసిన మొదటి తరం గాయకులలో రామారావు ప్రముఖుడు. ‘తాజ్‌మహల్’ పాట ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది ‘సుందరకాండ’. మోపర్తి సీతారామారావు... సుందరదాసుగా మారి భక్తజన హృదయాల్లో శాశ్వతుడై పోయాడంటే కారణం ఆయన ‘సుందరకాండ’ గానం.
సరళమైన మాటలతో, హనుమాన్‌చాలీసాకు ప్రతిరూపమే ఆయన సుందరకాండ. హనుమద్వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించి సుందరకాండ పారాయణానుభవాన్ని కలిగించిన ఎం.ఎస్.రామారావును భక్తులెలా మరచిపోగలరు?
సంగీతం, ఆత్మోన్నతి కోసమే అని నమ్మి, అవతలి వారు అభినందించినా నిందించినా లెక్కచేయకుండా
‘ఉండేది రాముడో సోముడో ఎవరో ఒకణ్ణి నమ్మి నాదోపాసన చేసిన త్యాగరాజాది మహనీయులే ఈ సుందర దాసుకు స్ఫూర్తి. తననే నమ్మిన ఈ సుందరదాసును, సంసార క్లేశాల నుంచీ కష్టాల కడలి నుంచీ రక్షించి, అభయ హస్తంతో ఒక్కసారి గట్టిగా పైకి లాగి నిలబెట్టినది మాత్రం ఆ వాయుపుత్రుడైన హనుమంతుడే. సందేహం లేదు.
సుందరకాండ గానావిర్భావం ఎలా, ఎందుకు జరిగిందో తెలియదుగానీ ఆయన గానం శ్రోతలకెంతో చేరువై, అసంఖ్యాక భక్తజనాన్ని ఒక ఊపు ఊపేసింది.
సాహితీ ప్రపంచంలోనే అసలు వాల్మీకి రామాయణానికే ఎంతో విలువుంది.
అందులో సుందరకాండ తలమానికం.
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా
సుందరే సుందరం వనమ్
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరమ్
శ్రీరాముడు సుందరుడు. సీత సుందరి. రామాయణ కథే సుందరం. వనమే సుందరం. కావ్యం సుందరం. హనుమ సుందరుడు. మంత్రం సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? అందుకే ఆ సీతారామారావు సుందరదాసై ధన్యుడైయ్యాడు. మనం ఏదైనా పని సంకల్పిస్తే ఏ నిరోధమూ లేకుండా కొనసాగాలన్నా, మానసిక క్లేశాల నుంచి గట్టెక్కాలన్నా కనిపించేది సుందరకాండే. ఇది చాలా మందికి అనుభవమే.
సంస్కృతంలో వున్న సుందరకాండ పారాయణ కొందరికే సాధ్యం. సరళమైన మాటలతో, సుస్వరంతో, భావం తిన్నగా గుండెకు చేరేలా పాడిన ఘనత మాత్రం ఎం.ఎస్.రామారావుకే చెందుతుంది. ఆయన తదనంతరం ఆయన మనవడు ఈ సుందరకాండ గానాన్ని కొనసాగిస్తున్నట్లు విన్నాను.
గానయోగ్యమైన ‘అవధి’ భాషలో రాసిన గోస్వామి తులసీదాసు ఒక మహాపురుషుడైతే ఆ ఛాలీసాను నిత్య పారాయణ యోగ్యంగా అందరూ పాడుకునేలా చేసిన గాయకుడు ఎం.ఎస్.రామారావు.
ఏలూరులో వున్న రోజుల్లో నా బాల్యంలో నృత్యం చేస్తూ అద్భుతంగా సంకీర్తనా గానంలో సిద్ధహస్తుడైన ‘రఘువరదాస్’ ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధుడు.
ఆయన పాటకు ఆబాలగోపాలమూ ఊగిపోయేవారు. శ్రుతి శుద్ధమైన గాత్రం ఒక్కటే కాదు. భక్తి భావ సమన్వితమై వుండేది ఆయన పాట.
హనుమాన్ ఛాలీసా గానాన్ని ప్రోత్సహించి ఎం.ఎస్.కు మార్గనిర్దేశనం చేసినది ఈ రఘువరదాసే - తీరా సుందరకాండను సిద్ధం చేసుకు, మద్రాసు రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరిగినా రికార్డు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఆయన నిరుత్సాహపడలేదు.
అవకాశం లభించిన అన్ని చోట్లా పాడి ప్రచారం చేయటంతో హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీ వారే మళ్లీ పిలిచి రికార్డు చేయటంతో ఒక్కసారిగా ఆయన పేరు వాడవాడలా మారుమ్రోగింది.
చెరువు పార్థసారథి అనే ఒక వీరాభిమాని ఈయన సుందరకాండ విని పరవశించిన మొదటి వ్యక్తి. ఏడెనిమిదేళ్లపాటు ఆయన భక్తి పారవశ్యంతో పాడిన సుందరకాండ వినని వారెవరూ లేరంటే ఆశ్చర్యం లేదు. ఆయన జయదేవుని అష్టపదులు కూడా పాడారు. పాటకు ప్రథమ లక్షణం భక్తి. ఇది సహజంగానే పుట్టాలి. రామారావు సుందరకాండ గానంలో మనకు కొట్టొచ్చినట్లు కనిపించేదిదే! ఈ భక్తి భావమే ఆయన కీర్తిని వ్యాపింపజేసిందనటంలో సందేహం లేదేమో!
chitram... ఆర్కెస్ట్రాతో ఎం.ఎస్. రామారావు