S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అలా జరిగింది

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
సాయంత్రం ఏడు గంటలు.. వైజాగ్ బీచ్‌కి దగ్గరగా ఉన్న ఒక బంగళా టెర్రెస్ మీద ఆరుగురు రచయిత్రులు కూర్చుని సరదా కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరందరూ వివిధ ప్రదేశాల నుండి ఉదయమే వచ్చారు. రేపు మధ్యాహ్నం వీరి స్నేహితురాలు రచయిత్రి సరళాదేవి కుమార్తె వివాహం. ముందు రోజు వచ్చి వైజాగ్ అందాలు ఆస్వాదించారు. సాయంత్రమంతా అలలతో ఆడుకుని అలసిపోయారు. స్నానాదులు కానిచ్చి తేనీరు సేవిస్తూ సేద తీరుతున్నారు.
‘ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తుంటే నాకు మరో చరిత్ర సినిమా జ్ఞాపకమొస్తోంది’ అన్నది మనోరమ.
‘అంతేనా గత స్మృతులు ఏవీ గుర్తురావట్లేదా?’ ఛలోక్తి విసిరింది శిరీష.
‘ఎన్ని వందల ప్రేమకథలు ఇక్కడ నుంచి మొదలయ్యాయో’ యువ రచయిత్రి వౌనిక. అలా మాటలు ఊపందుకున్నాయి. ‘ఎవరైనా మంచి ప్రేమ కథ చెప్పకూడదూ? ఈ ఆహ్లాదకర వాతావరణంలో! చెప్పేవారికి వినేవారికీ కూడా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’ అన్నది సులోచన.
అంతలో సరళాదేవి తన కుమార్తె కవితతోపాటు అక్కడకు వచ్చి కూర్చుంది. ‘ఏమిటి ప్రేమకథలు అంటున్నారు? సముద్రాన్ని చూసేసరికి టీనేజీలోకి వెళ్లిపోయారా?’ అన్నది నవ్వుతూ.
‘అబ్బ! సమయానికొచ్చావు సరళా! పెళ్లికి పిలిచావు. ఆతిథ్యమిస్తున్నావు. అలాగే ఒక మంచి ప్రేమకథ చెప్పి ఆహ్లాదాన్ని కూడా పంచు!’ అడిగింది సులోచన.
అందరూ సమర్థిస్తూ చప్పట్లు కొట్టారు.
‘బాగానే ఉంది! వారం నుంచీ పెళ్లి పనుల్లో తలమునకలై బుర్ర వేడెక్కి ఉన్నాను. నేను ఇప్పుడు కథ చెప్పడమా! నో వే! అదుగో మనందరిలో సీనియర్ రచయిత్రి సరోజమ్మగారు. ఆమె చెబుతారు. మనం వింటాం అంతే!’ అన్నది సరళాదేవి.
‘సీనియర్ సింగినాథం ఒకప్పటి మాట. ఇప్పుడు రాస్తున్నది తక్కువేగా. అదుగో అక్కడ యువ రచయిత్రులు వౌనిక, మానస ఉన్నారు. వాళ్లల్లో ఒకరు చెబుతార్లే’ అన్నది. వాళ్లిద్దరూ తలలు అడ్డంగా ఒకేసారి ఊపేశారు.
కాసేపు నిశ్శబ్దం. మెల్లగా అందరి చూపులు పెళ్లికూతురు కవితపై పడ్డాయి. ‘రచయిత్రి కాకపోయినా మరో ఈ కాలం అమ్మాయి ఇక్కడే ఉందిగా! ఆమె పెళ్లికొచ్చినందుకు మనకు మంచి కథొకటి చెప్పి కాస్త వినోదాన్ని పంచుతుందిలే!’ హుషారుగా చెప్పింది మనోరమ.
‘అమ్మో నేనా? మీ అందరి ముందూ కథ చెప్పడమా? సింహాల ముందు చిట్టెలుక విన్యాసాలు చెయ్యడమా? నా వల్ల కాదు’ అన్నది, కానీ వాల్లు వదల్లేదు. ‘మీ అమ్మ గొప్ప రచయిత్రి. నీ రక్తంలో, నీ పేరులో సాహిత్యముంది’ లాంటి మాటల్తో ఊదరగొట్టేశారు. కవితకు ఇక తప్పలేదు.
ఆలోచిస్తూ కళ్లు మూసుకుంది. ఆమె చెప్పబోయే కథకు సముద్ర ఘోష నేపథ్య సంగీతంలా మారిపోయింది. మేమూ సిద్ధమే అన్నట్లు ఆమె పెదవులు చిరునవ్వు చిందించాయి.
మెల్లగా కళ్లు తెరిచి అందరి వైపు ఒకసారి చూసి ‘ఇది నిజంగా జరిగిన కథ. ఇందులో కల్పనలూ లేవు’ అంటూ చెప్పనారంభించింది. సరళాదేవితో సహా అందరూ ఆసక్తిగా కవిత వైపు చూశారు.
‘చైతన్యకు శ్రావణికి సంవత్సర కాలంగా పరిచయం. ఆమె ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అతను ఫైనలియర్. ఒకే కాలేజీలో. శ్రావణి అమాయకురాలనే చెప్పొచ్చు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. పరిచయం ఉన్న కొద్దిమందితో మాత్రం ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమెను చూస్తే ఎవరికైనా చాలా మంచమ్మాయి అనిపిస్తుంది.
చైతన్య ఇష్టపడటానికి కారణాలు కూడా అవే. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూస్తే అప్పటికే వాళ్లు భార్యాభర్తలేమో అన్నట్లుండేది. అతనికి కాస్త చిరుకోపం. అతని చిరాకును కూడా ఆమె ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆమె చదువు విషయంలో కాస్త అశ్రద్ధ కనబర్చినా, ఆరోగ్యం సరిగా చూసుకోకపోయినా.. ఎప్పుడైనా కాలేజీ బంక్ కొట్టినా కాస్త కోపగించుకుంటాడు. బదులుగా ఆమె తల కాస్త పక్కకు తిప్పుకొని నవ్వుతుంది. వాళ్లిద్దర్నీ చూస్తే ముచ్చటేస్తుంది.
చైతన్య క్లాస్ టాపర్. అంతేకాదు ఏ చెడు అలవాట్లు లేనివాడు. అందరితో చాలా సభ్యతగా వ్యవహరిస్తాడు. వాళ్లిద్దరూ తప్పక పెళ్లి చేసుకుంటారని వాళ్ల గురించి తెలిసిన వాళ్ల నమ్మకం. కానీ రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మరో విధంగా మారిపోయింది.
శ్రావణి ప్రేమ గురించి వాళ్లింట్లో తెలిసి పెద్ద గొడవ జరిగింది. చైతన్యకు సమాచారం అందింది. వెంటనే వాళ్లింటికి వెళ్లాడు. తన గురించి చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరం చదువు మీదే దృష్టి పెట్టామని, వాళ్లు ఎప్పుడు సరే అంటే అప్పుడే పెళ్లి చేసుకుంటామని, త్వరలో తల్లిదండ్రులను తీసుకొచ్చి మాట్లాడిస్తానని కూడా చెప్పాడు.
వాళ్లు ముభావంగా ఉన్నారు. చైతన్య మాటలకు సరైన స్పందన చూపలేదు. ముందు అతన్ని చదువు పూర్తి చెయ్యమని, తరువాత మాట్లాడుకోవచ్చని, అప్పటిదాకా శ్రావణితో మాట్లాడవద్దని, అలా చేస్తే కాలేజీ మానిపిస్తామని సున్నితంగానే చెప్పారు.
వాళ్ల మాటలు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా లేనందుకు అతను తృప్తిపడ్డాడు. కానీ శ్రావణితో మాట్లాడకూడదనే నిబంధన అతన్ని బాధిస్తున్నది. అక్కడ ఇంక ఏమి మాట్లాడినా పరిస్థితి ఇంకా సున్నితంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతానికి వౌనమే మంచిదని వచ్చేశాడు.
తరువాత పది రోజులు శ్రావణి కాలేజీకి రాలేదు. ఏదో ఊరెళ్లిందని అస్పష్ట సమాచారం. శ్రావణి మొబైల్ కూడా ఆఫ్ చేసి ఉంది. చైతన్య రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
హఠాత్తుగా ఒకరోజు చైతన్యకు శ్రావణి స్నేహితురాలు అపర్ణ ఫోన్ చేసి ‘సారీ చైతన్యా! శ్రావణికి ఇష్టం లేకపోయినా బెదిరించి, వారం క్రితమే వాళ్లు ఎప్పట్నుంచో అనుకుంటున్న వాళ్ల బంధువుల అబ్బాయితో, వాళ్ల పల్లెలోని రామాలయంలో నిశ్చితార్థం చేసేశారుట. నిన్ను కలవాలంటున్నది. ఒక్కదానే్న ఎక్కడికీ పంపరు. నేను వెళ్లి తీసుకొస్తాను. కాలేజీ దగ్గర్లో ఉన్న పార్క్‌కు వెంటనే వచ్చెయ్యి’ అని ఫోన్ పెట్టేసింది.
చైతన్య నిర్ఘాంతపోయాడు. శ్రావణి వాళ్ల పెద్దల వైఖరి అతనికి అనుమానంగానే ఉంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఇంత పని చేస్తారనుకోలేదు. ఒక్కసారిగా ఆమె తన నుండి దూరమై పోయినట్లు అనిపించింది. శ్రావణితో తన పరిచయం మొదట్నుంచీ ఒకసారి కళ్ల ముందు మెదిలింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ప్రస్తుతం శ్రావణి పరిస్థితి ఏంటి? ఆమె గురించే ఆలోచిస్తూ హడావిడిగా పార్కుకు బయలుదేరాడు.
పార్కులో ఒకచోట కుదురుగా కూర్చోలేదు. అటూ ఇటూ తిరుగుతూ శ్రావణి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలో వాళ్ళిద్దరూ ఆటో దిగి రావడం దూరం నుంచే చూశాడు. శ్రావణి వచ్చి అతని ముందు నిలబడింది. చాలా నీరసంగా కనబడుతున్నది. ఏమీ మాట్లాడలేదు.
ఆమె పరిస్థితి అతనికి అర్థమయింది. ముందు ఆమెను కుదుటపరచాలి. అందుకు తను నిబ్బరంగా ఉండాలి. శ్రావణిని కూర్చోమన్నాడు. ఆమె చాలా గంభీరంగా ఉంది. ఆమెనెప్పుడూ అతను అలా చూడలేదు.
‘నువ్వు వాళ్లింటికెళ్లినపుడే వాళ్లు ఆ ఆలోచనలతో ఉన్నారుట. నీతో గొడవ పడకుండా సౌమ్యంగా నిన్ను పంపించి వాళ్లు చెయ్యదలచుకున్నది చేశారుట’ మెల్లగా చెప్పింది అపర్ణ.
కాసేపటికి శ్రావణి అతని కళ్లలోకి తీక్షణంగా చూసింది. ‘యాసిడ్ పోయటం, కత్తితో పొడవటం లాంటివి నువ్వు చెయ్యలేవు. కనీసం చెంప పగిలేలా నన్ను కొట్టకూడదా చైతన్యా? ఏదో ఒకటి చెయ్యి. అప్పుడే నాకు ఉపశమనం’ అన్నది. ఆమె కంఠం కాస్త వణకటం అతను గమనించాడు.
‘రిలాక్స్ శ్రావణి! ఇందులో నీ తప్పేమీ లేదు. నాకు తెలుసు మీ వాళ్లను నువ్వు కాదనుకోలేవు. నిజానికి వాళ్లు అనుకున్న సంబంధం గురించి నీకు ముందే చెప్పి ఉంటే నాతో కేవలం స్నేహితురాలిగానే మసలేదానివేమో! వాళ్లు కూడా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోనే నువ్వు ఎవరినో ప్రేమిస్తావని ఊహించి ఉండరు. నాటుకు నేను ఇప్పటకి మా ఇంట్లో మన విషయం చెప్పలేదు. ఒప్పుకుంటారు అనే ధీమాతో. జాప్యం లేదా దాచిపెట్టడం వల్ల విషయం జఠిలం అవుతుంది లేదా చేజారిపోతుంది. మనకు అదే జరిగింది.
ఇప్పుడు మన ముందు ఉన్నది అందరూ విఫల ప్రేమికులకు ఉన్నట్లే మూడు మార్గాలు. మొదటిది ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకొని చనిపోవడం. అలా చేసి పైకిపోయి ఏమి సాధిస్తామో మనకు తెలియదు. పదోరోజు కర్మకాండ తరువాత అందరూ క్రమేపీ మనల్ని మర్చిపోవడం మాత్రం ఖాయం.
రెండవది ఇద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవడం. దాని పర్యవసానాలు నువ్వు నిష్పక్షపాతంగా ఆలోచించి నిర్ణయించుకోవచ్చు.
ఇక మూడవది జరిగినదాన్ని అంగీకరించే ప్రయత్నం చెయ్యటం. ప్రేమించుకున్నన్నాళ్లు భార్యాభర్తలు కాకపోతే శ్రేయోభిలాషులుగా ఉండలేరా? ప్రేమ అనేది పెళ్లికి సంసారానికే పరిమితమా? జరిగిన దానిలో ఒక విధంగా మనతో సహా అందరి తప్పూ ఉంది. మరో విధంగా ఎవరి తప్పూ లేదు.
మూడు మార్గాల్లో మొదటిది చావు. చంపడం, చావడం అనేవి అసలు ప్రేమంటే తెలియని వాళ్లు చేసే పనులు. ఎవరూ చెయ్యకూడదు. మరొకర్ని చెయ్యనివ్వకూడదు.
ఇక రెండూ మూడు మార్గాల్లో ఏది సమంజసమో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. నేను దేనికైనా సిద్ధం. ఒక విషయం గుర్తుంచుకో శ్రావణి! మనం జీవితాన్ని ప్రేమించాలి. ప్రేమతో జీవించాలి అనే సూత్రం మీద నిర్ణయాలుండాలి’ అన్నాడు నవ్వుతూ.
చైతన్యను ఆసక్తిగా చూసింది శ్రావణి.
అతని మాటలు ఆమె మనసులోని కల్లోలాన్ని చాలావరకూ పోగొట్టాయి. జరిగిన దానికి కుదురుగా ఆలోచించటానికి బాట వేశాయి. మరికాసేపు ఆమెతో మాట్లాడి ఆమె తను అనుకున్నట్లు స్థిమితపడిందని అనిపించాక తోడుగా వెళ్లి ఆమెను అపర్ణను ఆటో ఎక్కించాడు’ అని కథ చెప్పడం ఆపింది కవిత.
రచయిత్రులందరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. కాస్త గట్టిగానే నిట్టూర్చారు. ‘చిన్నపిల్ల కదా ఏదో కథ చెప్పమంటే ఉతికి ఆరేసింది’ అనుకుంటూ కుర్చీలో వెనక్కి జారగిలపడింది సరోజమ్మ.
ఇప్పటిదాకా మాట్లాడని మానస ‘ఇంతకీ ఆ శ్రావణి పెద్దలు చూపించిన వాణ్ణి చేసుకుందా?’ శోధనగా చూస్తూ డిగింది. ‘ఆమె అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటేనే కథ. చేసుకుంటే ఏముంది?’ అన్నది మళ్లీ.
‘చేసుకుంది’ అన్నది కవిత. ఒక్కసారిగా నిశ్శబ్దం. సముద్ర ఘోష అందరి మనస్సుల్లోనూ ప్రతిధ్వనిస్తున్నది. చైతన్యకు అన్యాయం జరిగిందని వాళ్ల భావన.
వౌనిక పైకి లేచింది. ‘చైతన్య ఏమైనాడు? చదువు చెడగొట్టుకొని గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నాడా?’ అడిగింది.
‘లేదు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోబోతున్నాడు’ అన్నది కవిత.
‘ఎవర్ని?’ అందరూ ఒక్కసారిగా అడిగారు.
‘అపర్ణని’ బదులిచ్చింది కవిత.
‘వాట్? క్రేజీ! అదెలా?’ అడిగింది మానస.
ఎలా అంటే, నిజానికి మొదట్నుంచీ చైతన్య అంటే అపర్ణకు చాలా ఇష్టం. తన స్నేహితురాలిని ఇష్టపడుతున్నాడని తెలిసి మనసులో మాట చెప్పలేకపోయింది. కానీ శ్రావణి తన ప్రేమ విషయాలు అన్నీ ఆమెకు చెప్పేది. అతను తనకు దక్కలేదని బాధపడినా అతని వ్యక్తిత్వాన్ని మనసులో ఎంతో మెచ్చుకునేది.
అనుకోని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగలేదు. అపర్ణ తన తల్లిదండ్రులతో విషయం చెప్పి చైతన్య తల్లిదండ్రులను కలవమని కోరింది. అతనూ ఒప్పుకున్నాడు. ఏది ఏమైనా చైతన్యలో ప్రేమే ఉంది పగ లేదు’ అన్నది కవిత.
‘కవితా! వాళ్లందరూ నీకు తెలుసా? కాలేజీమేట్సా? లేక విడిగా స్నేహితులా?’ అడిగింది సరోజమ్మ.
‘కాలేజీమేట్సే!’ అన్నది నవ్వుతూ.
‘మరి వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారా? చేసుకున్నారా?’ మళ్లీ అడిగిందావిడ.
‘ఆ పెళ్లికేగా ఇప్పుడు మీరొచ్చింది’ అన్నది కవిత.
కాసేపు నిశ్శబ్దం.
‘మైగాడ్! ఈ అమ్మాయి వాళ్లమ్మ తల్లో దూరిపోయింది’ అంటూ అందరూ కవిత అదే! అపర్ణ చుట్టూ చేరి ఉక్కిరిబిక్కిరి చేశారు.
*

భీమరాజు వెంకటరమణ