S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం..70 మీరే డిటెక్టివ్

ఆనందింపజేసే వాళ్లలో శ్రేష్ఠుడైన రాముడు ఆ చెట్టు దగ్గరికి చేరి, పడమటి సంధ్యని ఉపాసించి లక్ష్మణుడితో చెప్పాడు.
‘ఇప్పుడు మనం మన దేశం లోంచి బయటకి వచ్చేశాం. సుమంత్రుడు కూడా వెళ్లిపోయాడు. ఇక మీదట మనం ఒంటరిగా ఉండాల్సిన రాత్రుల్లో ఇది మొదటిది. విచారించకు లక్ష్మణా! ఈ రోజు నించి మనిద్దరం రాత్రిళ్లు మేలుకుని ఉండాలి. సీత క్షేమం మనిద్దరి మీదే ఆధారపడి ఉంది కదా? గడ్డిని స్వయంగా తెచ్చి నేల మీద పరచుకుని ఈ రాత్రిని ఏదో విధంగా గడుపుదాం’
ఉత్తమమైన పక్క మీద పడుకోడానికి అలవాటుపడ్డ రాముడు నేల మీద పడుకుని లక్ష్మణుడితో కొన్ని మంచి మాటలు చెప్పాడు.
‘లక్ష్మణా! మహారాజుకి ఇప్పుడు విచారంతో నిద్ర పట్టదు. కైకేయి మాత్రం తన కోరిక తీరిందని సంతోషిస్తుంది. భరతుడు తిరిగి వచ్చాక కైకేయి రాజ్యం కోసం మహారాజు ప్రాణాలనే తీయదు కదా? రాజు కామబుద్ధితో కైకేయికి లొంగిపోయాడు. ఇప్పుడు నా నించి కూడా దూరం అయ్యాడు. దిక్కులేని ముసలివాడైన ఆ రాజు ఏం చేయగలడు? ఈ కష్టాన్ని, రాజు బుద్ధిలో కలిగిన భ్రాంతిని చూస్తే అర్ధ, ధర్మాల కంటే కూడా కామమే గొప్పదనం నాకు అనిపిస్తోంది. మన తండ్రిలా ఎంత తెలివితక్కువ వాడైనా ఆడదాని మాట విని తన ఇష్టప్రకారం నడుచుకొనే కొడుకుని విడిచిపెడతాడా? కైకేయి కొడుకైన భరతుడు ఒక్కడే భార్యాసమేతంగా, మహారాజులా ఐశ్వర్యంగల కోసల రాజ్యాన్ని సుఖంగా అనుభవిస్తాడు. రాజు వృద్ధాప్యం వల్ల మరణిస్తాడు. నేను అడవిలో ఉన్నాను. అందువల్ల భరతుడు రాజ్యానికి మహారాజు అవుతాడు. అర్థ, ధర్మాలనలి వదిలి కామానే్న అనుసరించేవాడు దశరథుడిలా త్వరగా ఇలా ఆపదల్లో చిక్కుకుంటాడు. లక్ష్మణా! కైకేయి దశరథుడి చావుకి, నా వనవాసానికి, భరతుడికి రాజ్యానికి మనింట్లో చేరిందని అనుకుంటున్నాను.
‘కైకేయి తనకి కలిగిన సౌభాగ్యం వల్ల గర్వంతో ఒళ్లు తెలీక నా మూలంగా కౌసల్యని, సుమిత్రని కూడా బాధించదు కదా? నా వల్ల సుమిత్ర కూడా బాధపడకూడదు. అందువల్ల నువ్వు తెల్లారి లేచి అయోధ్యకి వెళ్లు. నేను ఒక్కడ్నే సీతతో కలిసి దండకారణ్యానికి వెళ్తాను. అనాధైన కౌసల్యని నువ్వు రక్షించు. నీచమైన పనులు చేసే కైకేయి ద్వేషంతో నా తల్లి విషయంలో అన్యాయంగా ప్రవర్తించచ్చు. అందువల్ల నా తల్లిని ధర్మాలు తెలిసిన భరతుడికి అప్పచెప్పు. నన్ను ఇంతకాలం పోషించి, కష్టపడి పెంచిన నా తల్లి నా నించి ఫలాన్ని పొందాల్సిన సమయంలో నాకు దూరం చేయబడింది. నేను నా తల్లికి అనంతమైన శోకాన్ని కలిగిస్తున్నాను. ఏ తల్లీ కూడా నాలాంటి కొడుకుని కనకూడదు. లక్ష్మణా! నా వనవాసం మాట వినగానే గోరువంక చిలుకతో ‘ఓ చిలుకా! శత్రువైన కైకేయి పాదాన్ని కొరుకు’ అని చెప్పింది. ఆ గోరింకకి కౌసల్య మీద నాకంటే ఎక్కువ ప్రేమ ఉందని అనుకున్నాను. నేను తప్ప వేరే సంతానం లేని, అభాగ్యురాలైన నా తల్లి ఏడుస్తూండగా ఆమెకి ఏ విధమైన ఉపకారం చేయలేని నేను కొడుకునై ఉండి ఏం ప్రయోజనం? దురదృష్టవంతురాలైన నా తల్లి నేను దగ్గర లేకపోవడంతో అత్యధిక విచారంతో శోకసముద్రంలో ముణిగి ఉంటుంది. లక్ష్మణా! కోపగిస్తే నేను ఒక్కడినే బాణాలతో అయోధ్యని, ఈ భూమి అంతటినీ కూడా పొందగలను. కాని ఇది పరాక్రమం చూపించే సమయం కాదు కదా?’
రాముడు ఆ రాత్రి నిర్మానుష్యమైన ఆ అడవిలో ఇలాంటి మరికొన్ని మాటలు దీనంగా చెప్తూ, కన్నీళ్లతో మొహం తడవగా వౌనంగా కూర్చున్నాడు. ఇలా బాధపడ్డాక, మంటలు లేని అగ్నిలా, మేఘం లేని సముద్రంలా నిశ్శబ్దంగా ఉన్న రాముడ్ని లక్ష్మణుడు ఓదార్చాడు.
‘ఆయుధాలు ధరించిన వారిలో గొప్పవాడివైన ఓ రామా! నువ్వు విడిచి వెళ్లిపోవడంతో అయోధ్య ఇప్పుడు చంద్రుడు లేని రాత్రిలా కాంతి లేకుండా ఉండటం నిశ్చయం. నువ్వు ఇలా బాధపడటం మంచిది కాదు. ఇందువల్ల నాకూ, సీతకీ కూడా బాధ కలుగుతుంది. నీ సాన్నిధ్యం లేకపోతే సీత కాని, నేను కాని నీటి బయటి చేపల్లా క్షణకాలం కూడా జీవించలేం. నిన్ను వదిలి తండ్రిని కాని, శతృఘు్నడ్ని కాని, సుమిత్రని కాని, స్వర్గాన్ని కాని చూడాలనే కోరిక నాకు లేదు.’
సుఖంగా కూర్చున్న రామలక్ష్మణులు చక్కగా అమర్చిన పక్క మీద పడుకున్నారు. రాముడు లక్ష్మణుడు చెప్పిన ఉత్తమమైన, పరిపూర్ణమైన మాటలని సాదరంగా విని చాలాకాలం వానప్రస్థ ధర్మాన్ని అవలంబించి, పధ్నాలుగు సంవత్సరాలు పూర్తిగా వనవాసం చేయాలని నిర్ణయించాడు.
మహా బలశాలులైన రామలక్ష్మణులు నిర్జనమైన అడవిలో పర్వతాల మీద సంచరించే రెండు సింహాల్లా ఏ మాత్రం భయంకాని, తొందర కాని లేకుండా ఉన్నారు. (అయోధ్యకాండ 53వ సర్గ)
హరిదాసు కథని ఈసారి చాలా చక్కగా చెప్పాడు. రామాయణంలో ఈ సందర్భంలో రాముడు లక్ష్మణుడితో చెప్పిన ఓ ముఖ్యమైన మాటని విస్మరించాడు.’ అశే్లషతోపాటు కథ వినడానికి వచ్చిన ఆశే్లష పక్కింటి ఆవిడ చెప్పింది.
ఆ ఒక్క మాట మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న

పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన రామాయణం పేరు?
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.మొదటి వాక్యంలో సుమంత్రుడు రాముడితో చెప్పింది హరిదాసు పొరపాటున గుహుడు చెప్పాడని చెప్పాడు.
2.అమరావతి దేవేంద్రుడి రాజధాని. కుబేరుడి రాజధాని కాదు.
3.రాముడు జడలు కట్టడానికి ఉపయోగించింది మర్రి పాలు. వేపపాలు కాదు.
4.వానప్రస్థాన్ని ప్రతిపాదించింది విఖనస మహర్షి. అగస్త్య మహర్షి కాదు.
5.బుద్ధిమంతుడైన లక్ష్మణుడు అన్న చెప్పిన ప్రకారం కాక, ముందుగా సీతని ఎక్కించి తర్వాత తను ఎక్కాడు. కాని హరిదాసు లక్ష్మణుడు రాముడు చెప్పినట్లే చేశాడని తప్పు చెప్పాడు.
6.పడవ దక్షిణ తీరాన్ని చేరింది. కాని హరిదాసు తప్పుగా ఉత్తర తీరాన్ని చేరింది అని చెప్పాడు.
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
‘రామ’ పేరు ఉచ్ఛారణని కవులు ఎలా చమత్కరించారు?
‘రా’ అని పలికినప్పుడు తెరచుకున్న నోటిలోంచి పాపాలు బయటకి వెళ్లి, ‘మ’ అని పలికినప్పుడు తిరిగి అవి లోపలికి రాక భస్మం అవుతాయి అని.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి