S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుశీలమ్మగారి వీలునామా

‘‘ఏవండీ! మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం, పట్టింపు ఎందుకు? సంసారం అన్న తరవాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు పంచుకుంటారు. అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటినే పట్టుకుని శపధాలు చేయడం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. ఇంతకీ మావయ్య గారి కోపం, ఎవరిమీద? కొడుకుమీదా? కోడలి మీదా? లేక మనవల మీదా? అంది సునీత.
‘‘చూడు సునీతా! మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే నీకు, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి ముందే చెప్పాను. అయితే మీరెవరూ నా మాటలు పట్టించుకోలేదు. చాలా తేలికగా తీసుకున్నారు. ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు. ఆత్మాభిమానం ఎక్కువ’’ అన్నాడు రాజారాం.
‘‘కాదనలేదండీ! ఏదో పొరపాటు జరిగింది. నోరు జారింది. అది ఆయనకు తప్పు అనిపించింది. పెద్దవారు కనుక నాలుగు చీవాట్లు వేసి వదిలేయాలి. తప్పులు క్షమించడమే పెద్దరికం. తప్పుచేసిన వారి కది పెద్ద శిక్ష. సరే అది వదిలేయండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తండ్రిని పట్టించుకోలేదు, కోడలు ఆలనా పాలనా చూడడం లేదు అని లోకులు అయిన వారంతా మనల్ని తప్పు పడతారు. అంచేత మీకు, పిల్లలకు మూడురోజులు సెలవులు వచ్చాయి కదా? మరో మూడు రోజులు సెలవు పెట్టండి అందరం కలిసి భవానీపురం వెడదాము. మామగారి యోగక్షేమాలు తెలుసుకుందాం. వారిని ఒప్పించి మనతోకూడా ఇక్కడికి తీసుకువద్దాం ఏమంటారు?’’అంది సునీత.
భార్య సూచన కాదనలేకపోయాడు.
రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం. రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు. అయితే వారు తరతరాలుగా తమ స్థిర చరాస్తులను దాన ధర్మాలకు, గుడులు, గోపురాలు కట్టించడం కొరకు, వాటి నిర్వహణ కోసం, రాజకీయాలకు హరింపచేసి రామశర్మ చేతికి పాతిక ఎకరాల మాగాణీ, ఐదు ఎకరాల కొబ్బరితోట వచ్చింది. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు. డిగ్రీ చదువుకుని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు. సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు. సుశీలమ్మ కన్నవారూ సంపన్నులే. వివాహ సమయంలో కూతురికి ఏడువారాల నగలు బాలతొడుగు పెట్టారు. అంతేకాదు పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేర భవానీపురంలో పది ఎకరాల మాగాణీ, ఐదు ఎకరాల పండ్లతోట కొని ఇచ్చారు. సుశీలమ్మ చదివింది హైస్కూల్ చదువైనా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. మనస్తత్వం బాగా తెలుసు. దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు. రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు. తన క్లాస్‌మేట్ సునీతని ప్రేమించి పెళ్ల చేసుకోవాలని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు.సునీత తండ్రి కాలేజీ లెక్చరర్. కులం గోత్రం అన్నీ సరిపోవడంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. సంప్రదాయం ప్రకారం పిల్లను చూడ్డానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు పంజకవల్లి, సుందరరావులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు. పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారు ఇక పెద్దలు చూడాల్సింది కులం గోత్రం, జాతకాల పొంతన. అవికూడా నప్పాయి. ఇక మేము వచ్చి చేసేదేంవుంది అన్నారు రామశర్మ దంపతులు. కాగా సునీత తల్లి తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లను చూడ్డానికి వెళ్లారు. కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ ‘మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు?’ అని అడిగింది.
మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు. పట్నంలో పుట్టి పెరిగింది. పట్నంలో నాగరీకులెవరూ గంగిరెద్దులాగ నగలు దిగవేసుకుని తిరగరు. మా అమ్మాయికి మేమిచ్చిన అమూల్యమైన ఆభరణం చదువే అంది పంకజవల్లి గర్వంగా.
ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది.
అది కాదండీ మా అమ్మగారి ఉద్దేశం అని ఏమో చెప్పబోయాడు రాజారాం. మాట మధ్యలోనే కొడుకును మాట్లాడవద్దని సంజ్ఞ చేసి వారించింది సుశీలమ్మ.
పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు.
వివాహానంతరం గృహప్రవేశం, గ్రామ సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మగారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే వివాహానంతరం గృహప్రవేశం, రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని అది కూడా మీ కొత్త బంగళా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని పంకజవల్లి కూతురు సునీత చేత రాజారాంకు చెప్పించి బలవంతంగా వొప్పించి తన పంతం నెగ్గించుకుంది. తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డారు. అల్లుడిని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది.
శ్రావణమాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకుని వచ్చింది పంకజవల్లి. వారికి రాజారాం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన ఏడువారాల నగలు, పసుపు కుంకం నిమిత్తంగా కొని ఇచ్చిన భూములు చూపించాడు. సుశీలమ్మ గారి నగలు చూసి తల్లీ కూతుర్లు చకితులయ్యారు. ఆ నగలన్నీ తన కూతురు పరం చేయాలని పంకజవల్లి కూతుర్ని ఉసికొల్పింది. అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది. తను కూడా వియ్యపురాలిని మంచి చేసుకుని అభిమానం చూరకొనాలని ప్రయత్నించసాగింది.
రామశర్మగారు తన కొడుక్కు ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగళా కొని దానిలో అన్ని వసతులు కల్పించారు. కారు కూడా కొని ఇచ్చారు. సుశీలమ్మ కోడల్ని ఆమె చర్యలని నిశితంగా గమనించింది. తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది. రాజారాం దంపతులకు ఇద్దరు కొడుకులుపుట్టారు. పెద్ద మనవడికి ఎనిమిదేళ్లు, చిన్న మనవడికి ఐదేళ్లు రాగానే రామశర్మగారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన స్థిర చరాస్తులు అమ్మి ఆ సొమ్ము ఇద్దరు మనవల పేరా బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్‌గా పెట్టారు. తండ్రి చర్యలు అర్ధం కాక రాజారాం ఎంతో విచారించినా సునీత పరమానందం చెందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మగారు గుండెపోటుతో మరణించారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు వచ్చి రామశర్మగారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి పనె్నండు రోజులుండి కర్మకాండ జరిపించి వచ్చినవారంతా తిరుగు ప్రయాణమయ్యారు.
పంకజవల్లి కూతురితో ‘అమ్మా మేము బయలుదేరుతున్నాం, అల్లుడుగారు ఏరి? మీ ప్రయాణమెప్పుడు?’ అని అడిగింది.
‘ఏమోనమ్మా ఇంకా తెలియదు. మామగారిని అడగాలి. ఆయన్ని ఈ కష్ట సమయంలో వంటరిగా వదలివెళ్లలేము కదా! ఆయన పట్నం ఎప్పుడు వస్తారో అడగాలి. ఆయన బాగోగులు ఇకమీదట చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా!’ అంది సునీత.
‘అవునుతల్లీ ఇక నీ జీవితాంతం ఆ ముసలాయన సేవలు, నీకు తప్పవు!’ అంది పంకజవల్లి సానుభూతితో.
అటుగా వస్తున్న రామశర్మ చెవిని వారి సంభాషణ పడింది. ఆయన మనస్సు ఎంతగానో గాయపడింది
‘చూడమ్మా! మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు. నేను రానీయను. ఈ క్షణం నుంచీ మీ అమ్మాయి గడపలో నేను ఏనాడూ కాలు మోపను. ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను. మీరు నిశ్చింతగా ఉండండి. అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి.’ అన్నారు
అతని మాటలు విని వారు ఖంగుతిన్నారు.
కోడలిమీద తన భార్య వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేననిపించింది రామశర్మకు.
రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు.
‘ఇక మీదట మా నాన్నగారు తన జీవితంలో నా ఇంటి గడప తొక్కరు’ అన్నాడు ఎంతో వేదనతో.
‘అదేమిటి బాబు అలా అంటావు ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు’ అని ఏమో చెప్పబోయింది పంకజవల్లి.
మా నాన్నగారి పంతం పట్టింపు మీకు తెలియవండీ! ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అన్నాడు రాజారాం.
సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది.
* ** * *
రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు.
‘బాబుగారు! సిన్న బుగతగోరు, కోడలమ్మగోరు, మనవలు, కార్ల వొచ్చీసినారండి’ అని బిగ్గరగా కేకపెట్టి బయట కారు వద్దకు వెళ్లి వారి సామానులు లోనికి తెచ్చాడు వీరయ్య.
ఆ వరకే రాజారాం, సునీత లోనికి వచ్చి రామశర్మగారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. మనవలిద్దరు వచ్చి తాతగారిని వాటేసుకున్నారు. వంటావిడ సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటుచేసింది. మర్నాడు ఉదయమే సుందరం, అతని భార్య పంకజవల్లి వచ్చారు. వారి రాకకు రామశర్మ, రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు.
‘మరేమీలేదు అన్నయ్యగారు, మీ యోగక్షేమాలు అల్లుడుగారు, అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం. అయినా ఉండపట్టలేక స్వయంగా ఓమారు మిమ్మల్ని చూసి పోదామని వచ్చాము’ అంది పంకజవల్లి లౌక్యంగా.
సునీత తల్లి ప్రోద్బలంతో అత్తగారి ఏడువారాల నగలు గురించి భర్తను అడిగింది. వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు. అవి బ్యాంకు లాకర్లో వుంటాయి. నువ్వు, మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది. లాకర్ కీ ఇదిగో తీసుకుని వెళ్లి చూడు’ అన్నారు.
రాజారాం బ్యాంకు లాకర్ కీ తీసుకుని వెళ్లి లాకర్ తెరిచి చూసాడు. అందులో నగలు లేవు. ఒక సీల్డ్ కవరుంది. దానిని తీసుకుని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు. రామశర్మ అచ్చెరువొంది కొడుకుతో దానిని తెరిచి చూడమన్నారు. రాజారాం కవరు తెరిచి కాగితాలు బయటకుతీసి చదివాడు.
అది సుశీలమ్మ గారి వీలునామా!...‘మాకు ఆడపిల్లలు లేరు. కనుక కూతురైనా కోడలైనా మా రాజారాం భార్య మాత్రమే!మా కన్నవారు నాకు వివాహ సమయంలో బాలతొడుగుగా ఏడువారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా పది ఎకరాల మాగాణీ, ఐదు ఎకరాల పండ్లతోటలు ఈ భవానీపురంలో నా పేర కొని ఇచ్చారు. ఇవన్నీ కోడలుకివ్వాలనుకున్నాను. కాగా మా కోడలు సునీతకు అత్త మామలంటే గౌరవం, భక్తి, అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరివారంటే చులకన. చదువులేనివారని చిన్నచూపు.వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం లేదు.
చేతిలో డబ్బుండి పిల్లలచేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు, సౌకర్యాలతో వోల్డేజి హోము నిర్మించతలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు. అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది. నేను అతనితో చేయి కలిపాను. భాగస్వామిగా చేరాను. నా ఏడువారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను. మాకోసం హోములో గదులు కేటాయించుకున్నాము. నా పేర వున్న పొలాల ఫలసాయంలో సాలీనా హోముకు లక్ష రూపాయలు ఇవ్వాలని, మా తదనంతరము ఆ భూములు హోముకు చెందాలని ఈ నా వీలునామ రాయించి రిజిస్ట్రేషన్ చేయించడమైనది. వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు.

-రావి ఎస్.అవధాని