S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 6

‘సినిమా హాల్లో సినిమా చూడటానికి కాక దేనికొస్తారేమిటి?’ వెటకారంగా అన్నాను నేను.
నా వెటకారాన్ని పట్టించుకోకుండా మల్లిఖార్జున, ‘ఇప్పుడెక్కడ పని చేత్తన్నార్రా?’ అని అడిగాడు.
‘బోసు రోడ్లో అపార్ట్‌మెంట్ కడుతున్నారే!... ఆడ..’
‘మీ అమ్మా అయ్యా కూడా ఆడే పని చేత్తన్నారా?’
‘ఆ!... మా చెల్లి కూడా!’
‘చెల్లికి పెళ్లి చెయ్యరంటరా?’
‘మా అయ్య అదే పనిలో ఉన్నాడులే!...’ నాకు వాడి నస విసుగ్గా ఉంది.
‘మొదటాటకి వచ్చావు. అప్పుడే పని అయిపోయిందట్రా?’
‘పని అయినా కాకపోయినా ఆరయ్యిందంటే సినిమా హాలుకి రావలసిందే! మిగులూ, తగులూ ఉంటే ఆళ్లే చూసుకుంటారులే...’ అన్నాను నేను.
‘ఆళ్లు’ అంటే నా ఉద్దేశంలో మా కుటుంబ సభ్యులు. నేను మిగిల్చిన పని ఏదన్నా ఉందంటే వాళ్లే పూర్తి చేస్తారు.
‘నీ పనే బాగుందిరా! బరువూ బాధ్యతా లేదు...’ అన్నాడు మల్లిఖార్జున.
నన్ను చూసి కూడా ఈర్ష్య పడేవాడు ఒకడు ఉన్నందుకు ఆనందించాను.
ఇంతలో సినిమా మొదలు పెట్టబోతున్న సూచనగా బయట బెల్లు మోగింది.
నేను వెనక్కి తిరిగి ప్రొజెక్టర్ ఉండే వైపు చూశాను. ప్రొజెక్టర్ నుండి వచ్చే వెలుతురు కిరణాలు తెర వరకు రావటానికి వీలుగా గోడకి రంధ్రాలు ఉన్నాయి. ఒక్కసారిగా వెలుగులు చిమ్ముతూ రంగురంగుల కాంతి కిరణాలు ఆ రంధ్రంలో నుండి తెర మీదకు దూసుకు వచ్చాయి.
ఆ కిరణాలతోపాటు నా చూపు తెర మీదకు మరలింది.
అంతే! సినిమా అనే ఆ మాయలో మునిగిపోయాను. చీకటి, వెలుగులు, సప్తవర్ణాల మిశ్రమంతో తయారయిన అందమయిన కలలో లీనమయ్యాను.
కల్లాకపటం లేని తెల్లని తెర మీద ప్రదర్శితమవుతున్న ఆ రంగుల కలలో మునిగిపోయిన నేను బాహ్య ప్రపంచాన్ని మరచిపోయాను.
నా సినీ ఆరాధన అంతటితో పూర్తి కాదు.
సినిమా పూర్తి అయి తిరిగి మరొక సినిమా చూసేవరకూ నా స్వంత కలల్లో మునిగిపోతాను. నా స్వంత కథలు తయారు చేసుకుంటాను.
ఆ కలల్లో నేనే హీరోని. నేనే దర్శకుణ్ణి.
అన్ని పాత్రల్లోనూ నేనే! అన్ని కథల్లోనూ నేనే!
అద్భుతం, బీభత్సం, భయానకం, శృంగారం, హాస్యం.. ఏ రసమయినా కావచ్చు అన్నిటికీ నేనే న్యాయం చేస్తాను.
సినిమా అయిపోయినట్లు మోగిన బెల్‌తో అందరూ మత్తు అనుకునే ఆ తపస్సు నుండి తేరుకుని బయటకు నడవక తప్పలేదు.
మల్లిఖార్జునతో కలిసి హాలులో నుండి బయటకు నడిచాను.
దూరం నుండి సైరన్ మోతలు ఆగకుండా వినిపిస్తున్నాయి.
జనం హడావిడిగా ఒకవైపు వెళ్తుండడం కనిపించింది.
‘ఏమయింది..?’ హడావిడిగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి అడిగాను.
‘కడుతున్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్ భూమిలోకి కుంగిపోయిందంట...’ చెప్పాడతను.
‘ఎక్కడ?’ అదురుతున్న గుండెలతో అడిగాను.
‘బోస్ రోడ్డులో...’
అతని మాటలు పూర్తి కాకముందే పరుగు అందుకున్నాను. పది నిమిషాల్లో సైటు దగ్గరకు చేరుకున్నాను.
అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది.
మొత్తం బిల్డింగంతా భూమిలోకి కూరుకుపోయింది. ఒక స్లాబు మీద మరొకటి కూలి కాంక్రీట్ దిబ్బలా ఉంది అక్కడి పరిస్థితి.
దానికి కారణం కూడా నాకు తెలుసు. ఆ స్థలం ఉన్న నేల లూజ్ సాయిల్ అని టెస్ట్ రిపోర్టుల్లో వచ్చింది. అలాంటప్పుడు వేయవలసిన రాఫ్ట్ ఫౌండేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంజనీరు మాటలను పెడచెవిన పెట్టి బిల్డర్ మామూలు ఫౌండేషన్‌తో పని కానిద్దామని చూశాడు. బిల్డర్ అంటే ఎవరో కాదు మా మేస్ర్తినే! డబ్బొచ్చాక పేరు అలా మారింది.
నాలా బయట ఉన్న ఒకరిద్దరు కూలీలు తప్ప మొత్తం 18 మంది భూస్థాపితమయ్యారు.
మిగిలిన వారి సంగతేమో కానీ నాకు మాత్రం అక్కడి పరిస్థితి గమనించిన మొదటి క్షణంలోనే అర్థం అయింది - నా వారెవరూ బతికి ఉండే ఛాన్సు లేదని.
ఆ విషయం కన్ఫర్మ్ కావటానికి మరో మూడు రోజులు పట్టింది.
మీడియాలో పెద్ద గోల అయింది.
ప్రభుత్వం కల్పించుకుని చనిపోయిన ప్రతి మనిషికీ యాభై వేలు నష్టపరిహారం బిల్డర్ నుండి ఇప్పిస్తానని ప్రకటించింది.
నేను వెళ్లి బిల్డర్ని కలిశాను.
చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయించమని అతను పదివేలు చేతిలో పెట్టాడు. ‘మిగిలిన డబ్బు తరువాత ఇస్తాను...’ అన్నాడు.
నేను ఇవతలకు రాగానే, ‘మిగిలిన వాళ్లతోపాటు వీడూ చచ్చి ఉంటే, దరిద్రం వదిలి ఉండేది. ఇప్పుడు అనవసరంగా నాకు తగులుకుంది...’ అని గ్యారంటీగా అనుకుని ఉంటాడు.
బిల్డర్ సంగతి నాకు బాగా తెలుసు. నాన్నకి కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని - ఎప్పుడు డబ్బులు అప్పుడు తీసుకోమని. ఆయనే వినలేదు. ఆయనకి ఈ బిల్డర్ మీద గుడ్డి నమ్మకం. నాకు రావలసిన నష్టపరిహారం సంగతి పక్కన పెడితే, నాన్న దాచుకున్న డబ్బులు ఆ బిల్డర్ నుండి వసూలు చేసుకోవటమే పెద్ద విషయం. అయితే నాకు చదువు లేదేమో కానీ సినిమా పరిజ్ఞానం ఇచ్చిన వెధవ తెలివితేటలు బానే ఉన్నాయి.
అయినా ఆ విషయాలు ఆలోచించటానికి చాలా సమయం ఉంది. ముందు చనిపోయిన వారికి జరగవలసింది చూడాలి.
ఆ పనులన్నీ పూర్తయ్యాక ఒక రోజంతా కూర్చుని బిల్డర్‌తో ఎలా డీల్ చెయ్యాలా అని ఆలోచించాను. ఒక ఆలోచన వచ్చింది. ఆ తరువాత అతన్ని కలవటానికి బయలుదేరాను.
నన్ను కలవటానికే మూడు రోజుల సమయం తీసుకున్నాడు.
ఎట్టకేలకు అతన్ని కలిశాను. నాన్నకి ఇవ్వవలసిన డబ్బులు సంగతి అడిగాను.
‘మీ నాన్న ఏమన్నా ముల్లెలు ముల్లెలు నా దగ్గర దాచాడంట్రా! పోగేసి నీకు ఇవ్వటానికి. ఎప్పడు డబ్బులు అప్పుడు తీసుకుంటూనే ఉన్నాడుగా. ఇంకేం మిగిలింది?’
నేనేం మాట్లాడకుండా నిలబడే ఉన్నాను.
‘ఇకపోతే ప్రభుత్వం ప్రకటించిన సహాయం సంగతంటావా? నీ డబ్బులు నాకెందుకు? వీటి మీద సంతకాలు పెట్టు...’ అని నా ముందుకు రకరకాల కాగితాలు తోశాడు.
మాట్లాడకుండా వాటి మీద సంతకాలు పెట్టాను.
‘నీకు రావలసిన యాభై వేలలో మొన్న ఇచ్చిన పదివేలు పోనూ ఇదిగో నలభై వేలు...’
వాటిని తీసుకున్నాను. తరువాత కూడా వౌనంగా అక్కడే నిలబడ్డాను.
‘ఏంటి?’ అన్నట్లు చూశాడు ఆయన.
‘ఒక్కొక్కరికీ యాభై వేలు కదా సార్!’
‘అంటే ఇంకా నేను నీకు ఎంత ఇవ్వాలంటావ్?’
‘లక్ష
‘ఆశకి అంతుండాలి. అడగ్గానే ఎదురు చెప్పకుండా డబ్బులు ఇచ్చినందుకా? ప్రభుత్వం ప్రకటించింది కుటుంబానికి యాభై వేలు. అవి నీకు ఇచ్చి వేశాను. ఇక నువ్వు వెళ్లవచ్చు’ కటువుగా అన్నాడు.
నేను అలానే నిలబడి ఉండటంతో తనే లోపలికి నడవబోయాడు బిల్డర్.
‘నిన్న ఒకాయన నన్ను కలిశాడు సార్...’ నెమ్మదిగా చెప్పాను.
‘అయితే...’
‘రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరంట సార్. జరిగిన దుర్ఘటన మీద ఆయన్ని ఎంక్వయిరీకి నియమించారంట’
ఇంట్లోకి వెళ్లబోతున్న బిల్డర్ ఆగిపోయాడు. ‘ఏమన్నాడు?’ అన్నాడు ఆ మాటలో మునుపటి ఆత్మవిశ్వాసం లేదు.
‘బిల్డింగ్ ఎందుకు పడిపోయి ఉంటందో నీకేమైనా తెలుసా? అని అడిగాడు’
‘నువ్వేం చెప్పావ్?’ వెనక్కి తిరిగి వచ్చి కూర్చుంటూ అన్నాడు.
‘నేనేం చెప్పలేదండీ! ఏదో ఫౌండేషన్ గురించి అడిగాడు. ఇంజనీర్ చెప్పినట్లే కట్టారా? అని కూడా అడిగాడండీ...’
‘అట్లా అడిగాడా? వాడికి ముట్టజెప్పవలసినవన్నీ అందించాను కదా? మళ్లీ ఈ గోలేమిటీ? అది సరే... వాడి ప్రశ్నలకు నువ్వేం సమాధానం చెప్పావ్?’
‘ఏం చెప్పలేదండీ! నేనేదో దాస్తున్నానని ఆయనకు అనుమానం వచ్చినట్లుంది. ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి చెప్పమన్నాడండీ...’
బిల్డర్ సూటిగా నా కళ్లలోకి చూవాడు. నేను ఈసారి చూపు దించలేదు.
కాసేపు ఆలోచించుకున్న బిల్డర్ ‘ఏం కావాలో చెప్పు?’ అన్నాడు.
‘మీకంటే ఎక్కువ నాకేం తెలుసండీ?’ అన్నాను.
అతను లోపలికి వెళ్లి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇచ్చాడు. ‘ఇదిగో నువ్వడిగిన లక్షా! ఇక వెళ్లిరా!’ అన్నాడు.
‘మరి మా నాన్న దాచుకున్న డబ్బు కోసం ఎప్పుడు రమ్మంటారండీ?’
బిల్డర్ మళ్లీ లోపలకు వెళ్లాడు. ఈసారి మరో లక్ష తెచ్చాడు. ఆ డబ్బు నా చేతికి ఇవ్వకుండా గాలిలో ఊపుతూ ‘ఇది కూడా ఇస్తాను. అయితే ఒక షరతు. ఇక ఈ ఊళ్లో నువ్వు ఉండకూడదు. ఒప్పుకుంటావా?’
ఎలాగూ నేను ఆ ఊళ్లో ఉండదలచుకోలేదు. కాబట్టి ఆ షరతుకు ఒప్పుకోవటంలో ఎలాంటి నష్టం నాకు కనిపించలేదు.
ఆ డబ్బు కూడా తీసుకుని అక్కడ నుండి బయటపడ్డాను.
బయట మల్లిఖార్జున కలిశాడు. ‘ఎంత ఇచ్చాడు?’ అని అడిగాడు.
‘నలభై వేలు...’ చెప్పాను.
‘అదే గొప్ప...’ అన్నాడతను. అంతటితో ఆగకుండా ‘ఆ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావ్?’ అని అడిగాడు.
నవ్వాను తప్ప సమాధానం చెప్పలేదు.
‘ఏదన్నా కిళ్లీ కొట్టు పెట్టుకో...’ అని సలహా ఇచ్చాడు.
‘లేదు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను.’ అన్నాను.
‘అక్కడేం చేస్తావ్?’ ఆశ్చర్యంగా అడిగాడు మల్లిఖార్జున.
‘సినిమాలు తీసేది అక్కడేగా?.. ఏదో ఒక పని అక్కడే చేసుకుంటాను..’ చెప్పాను.
నన్ను పిచ్చివాడిని చూసినట్లు చూశాడు మల్లిఖార్జున.
అదేమీ పట్టించుకోని నేను మరుసటి రోజు హైదరాబాద్ వెళ్లటానికి రైల్వేస్టేషన్‌కి వెళ్లాను.
నేను వచ్చేదాకా ఆగటానికి రైలు ‘దురదృష్టం’ కాదు. సరైన సమయానికి రావటం, బయలుదేరటం కూడా జరిగిపోయింది.
వెళ్తున్న రైలును అందుకోవటానికి పరుగెత్తాను. జనరల్ కంపార్ట్‌మెంట్ దాటిపోయింది. ఎదురుగా రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్ ఉంది.
అది కూడా నేను ఎక్కగలిగేవాడిని కాదు, ఆ కంపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి నాకు చేయి అందించి లోపలకు లాగకపోయి ఉంటే....
‘హాయ్! అయామ్ సారధి...’ అన్నాడతను నా అలుపు తగ్గాక. అతను కూడా నా ఈడు వాడే! చూడటానికి చాలా స్టైల్‌గా ఉన్నాడు.
‘నా పేరు చంద్రం’ చెప్పాను.
‘రండి. కూర్చుని మాట్లాడుకుందాం...’
‘ఇది రిజర్వేషన్ బోగీలా ఉంది. నా దగ్గర రిజర్వేషన్ లేదు...’ సంకోచిస్తూ అన్నాను నేను.
‘అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు?’
‘ట్రైన్ ఆగగానే వెళ్లి జనరల్ కంపార్ట్‌మెంట్ ఎక్కుతాను’
‘అది ఎలా ఉందో తెలుసా? కాలు పెట్టటానికి కూడా ఖాళీ లేదు. నా దగ్గర కూడా రిజర్వేషన్ లేదు. అయినా ధైర్యం చేసి ఇక్కడ ఎక్కాను. టిసి వచ్చాడు. బెర్త్ రాసి ఇచ్చాడు’
‘అట్లా కూడా చేయవచ్చా?’
‘ఇంతకీ డబ్బులున్నాయిగా...’
‘ఉన్నాయ్’
‘అది ఉంటే చాలు. ఏ ఇబ్బందీ ఉండదు. కమాన్!’ అంటూ నన్ను లోపలకు తీసుకువెళ్లాడు.
అదే బోగీలో ఉన్నాడేమో టీసీ వెంటనే వచ్చాడు. ‘టికెట్ చూపించండి..’ అంటూ.
జనరల్ టికెట్ చూపించాను. ‘వీలయితే బెర్త్ ఎలాట్ చేయండి...’ రిక్వెస్ట్ చేస్తూ అడిగాను.

‘నీ అదృష్టం కొద్ది ఖాళీ ఉంది. లేకపోతే దిగిపోవలసి వచ్చేది’ రిసీట్ రాస్తూ అన్నాడు.
రిసీట్‌లో ఉన్న మొత్తం ఇచ్చాను.
‘ఇంకో వంద...’ అన్నాడు.
‘ఎందుకు?’ అన్న మాట నోటి చివరిదాకా వచ్చింది. సారధి సైగతో ఆ మాట గొంతులోనే ఆపుకుని అతను అడిగిన వంద ఇచ్చాను. అది తీసుకున్న టిసి వెళ్లిపోయాడు.
ఏదో గుర్తు వచ్చి ఒకసారి నడుము తడుముకుని చూసుకున్నాను. అక్కడ వంటికి కట్టుకున్న డబ్బుల సంచి చేతికి తగిలింది.
బిల్డర్ ఇచ్చిన డబ్బు రెండు లక్షల నలభై వేలు. అంత డబ్బు ఒక్కసారి రావటం నాకు అదే మొదలు. అంత డబ్బుతో రైలెక్కిన నాకు మొదటి సమస్య ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవటం ఎలా అన్నది. రైల్లోనే కాదు, హైదరాబాద్‌లో కూడా అంత డబ్బు జాగ్రత్త చేసుకోవటం సమస్యే! అక్కడ అసలే మోసగాళ్లు, దొంగల బెడద ఎక్కువంట. ఆ డబ్బులో రెండు వేలు మాత్రం జేబులో పెట్టుకుని మిగిలినదంతా గుడ్డ సంచిలో కట్టి నడుముకు కట్టుకున్నాను.
నా దగ్గర పెద్ద సామాను ఏమీ లేదు. ఉన్న కొద్ది వస్తువులూ కుటుంబంతో పాటే అపార్ట్‌మెంట్ గోడల మధ్య సమాధి అయిపోయాయి. కొత్తగా కొనుక్కున్న నాలుగు జతల బట్టలు మాత్రం ఒక సంచిలో సర్దుకుని రైలెక్కాను.
‘ఏంటండీ ఒక్కసారిగా ఆలోచనల్లో కూరుకుపోయారు?’ పలుకరించాడు సారధి.
‘సారీ... ఇంటి దగ్గర విషయం ఏదో గుర్తుకు వచ్చింది’ చెప్పాను.
‘పర్లేదు లెండి. నాకు ఏదో ఒకటి మాట్లాడకపోతే అస్సలు తోచదు. ఇంతకీ మీరు హైదరాబాదులో ఎక్కడ ఉంటారు..’
‘తెలియదు...’ అన్నాను.
‘అదేమిటి?’ ఆశ్చర్యంగా అన్నాడతను.
చిన్నగా నవ్వి, క్లుప్తంగా నా కథ చెప్పాను. ఒక్క డబ్బు విషయం తప్ప మిగిలినదంతా యథాతథంగా చెప్పాను.
ఒక్క క్షణం నోట మాట రానట్లు అయిపోయాడు సారధి. ‘మైగాడ్ ఆ కూలిపోయిన అపార్ట్‌మెంట్ దుర్ఘటన గురించి పేపర్లలో, టీవీల్లో చూశాను. అందులో బాధితులయిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే...’
‘జరగాల్సింది జరిగింది. మన చేతుల్లో ఏముంది?’
‘మరి ఇంత హఠాత్తుగా మీరు హైదరాబాద్ ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు. అక్కడకు వచ్చి ఏం చేద్దామని?’
‘నాకు సినిమాల్లో నటించాలని కోరిక. అక్కడయితే అవకాశాలు దొరుకుతాయి కదా అని...’
పెద్దగా నవ్వాడు సారథి.
ఒక్కసారిగా అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో నాకు అర్థం కాలేదు.
‘నటనలో అనుభవం ఉందా?’ అడిగాడు సారథి.
‘లేదు’
‘ఎప్పుడైనా స్టేజ్ ఎక్కావా..?’
‘లేదు’
‘మరేమిటి నీ ధైర్యం?’
‘తెలియదు. కానీ.. ఏదో నమ్మకం. అవకాశం వస్తే అందరి కంటే భిన్నంగా చేసి చూపించగలనన్న నమ్మకం’
‘నటనలో పదేళ్ల అనుభవం, వేసిన నాలుగు వందల నాటకాలు చూసిన ప్రజల మెచ్చుకోలు, అయిదు పరిషత్తుల్లో ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చిన ఆత్మవిశ్వాసం... ఇన్ని ఉన్న వాడికి రాని అవకాశం నీకు వస్తుందని అంటుంటే నవ్వొస్తుంది’
‘ఎవరి గురించి నువు చెప్తోంది?’
‘నా గురించే..’
ఒక్క క్షణం అతను చెప్పింది అర్థమై నిరాశ కలిగింది. ఒక్క క్షణమే! తిరిగి మామూలు మనిషినయ్యాను. సారథికి అవకాశం రానంత మాత్రాన నాకు రాకూడదని ఏముంది?... అన్న సాంత్వనతో నన్ను నేను ఓదార్చుకున్నాను. అదేనేమో సినిమాకున్న ఆకర్షణ. రాలిపోయే తొంభై తొమ్మిది శలభాలను ఎవరూ పట్టించుకోరు. వెలుగుతున్న మిణుగురునే అందరూ ఆరాధిస్తారు.
నా భావాలతో సంబంధం లేకుండా సారథి చెప్పుకుంటూ పోతున్నాడు. ‘పిచ్చివాడా... నీలాంటి వారు అక్కడ కోకొల్లలుగా ఉన్నారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లలో తర్ఫీదు పొంది సినిమా నటుడికి కావలసిన అన్ని హంగులూ ముందే సమకూర్చుకుని, అయినా అవకాశాలు రాక స్టూడియో గేట్ల ముందు తారట్లాడుతున్నారు. వారి మధ్య నువ్వెంత?’
‘ఎక్కడయినా పని చేసుకుని బ్రతకవలసిందే కదా! అదేదో హైదరాబాదులో చేసుకుంటాను...’ భయపడకుండా చెప్పాను.
‘నేనూ నీలానే సినిమాల మీద మోజుతో ఊరు వదిలి వచ్చాను. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ ఒక్క అవకాశం కూడా రాలేదు. అవకాశాల కంటే ముందు ఆకలి బాధ ఎక్కువ అయింది. ఏది ఎలా పోయినా కడుపు నింపుకోవటం అయితే తప్పదు కదా!... సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం తిండికే సరిపోతోంది. ఒక్కొక్క నెల రూము అద్దె కట్టటానికి కూడా కటకట అవుతోంది. మొన్నటి వరకూ ఇంకొకతను కూడా రూములో ఉండేవాడు. పెళ్లి చేసుకుని మొనే్న అతనూ వెళ్లిపోయాడు. నీకు అభ్యంతరం లేకపోతే నువు కూడా నాతోనే ఉండు. ఇద్దరికీ వెసులుబాటుగా ఉంటుంది...’ అన్నాడు సారథి.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002