S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొడవు-పొట్టి (స్ఫూర్తి )

చిత్రేష్, వాడి కజిన్స్ వాడి తాత ఇంట్లో సెలవులు గడుపుతున్నారు.
‘నా ఎత్తు కొలుస్తావా తాతయ్యా? నేను ఎంత పొడవో తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ చిత్రేష్ అడిగాడు.
‘సరే’
పిల్లలంతా వాళ్ల తాతని అనుసరించి ఓ గోడ దగ్గరికి వెళ్లారు. ఏటా వేసవిలో ఆ గోడ మీదే గీత గీసి, పేరు రాసి ఆయన వారి ఎత్తులని కొలుస్తున్నాడు. వారి ఎత్తుని పెన్సిల్‌తో గీత గీసి, తాతయ్య దాని ఎదురుగా పేరు రాసి, తారీఖు వేశాడు.
‘నేను అందరికన్నా ఎతె్తైన వాడిని’ త్రిదీప్ చెప్పాడు.
‘చిత్రేష్! నా తొమ్మిదో ఏట నేనున్నంత ఎత్తు కూడా నువ్వు నీ పదో ఏట లేవు. కావాలంటే గోడ మీద గీతలని చూసుకో’ సంపర్క్ కూడా ఎగతాళిగా నవ్వుతూ చెప్పాడు.
‘చిత్రేష్ పొట్టి బుడంకాయ్’ త్రిదీప్ ఎగతాళిగా చెప్పాడు.
చిత్రేష్‌కి బాధ కలగడం గుర్తించిన తాత గట్టిగా చెప్పాడు.
‘ఇంక చాలు. చేతులు చాపండి’
తాత త్రిదీప్ చేతిలో ఓ నల్లటి గింజని, సంపర్క్ చేతిలో గోధుమరంగు గింజని, చిత్రేష్ చేతిలో సన్నటి నల్లటి గింజని ఉంచాడు. గార్డెనింగ్ పుస్తకాన్ని వాళ్లకిచ్చి అడిగాడు.
‘త్రిదీప్! నీకిచ్చిన విత్తనం గురించి చెప్పు’
త్రిదీప్ దాన్ని పరిశీలించి చెప్పాడు.
‘ఇది తోటకూర విత్తనం. రెండడుగుల నించి ఐదడుగుల ఎత్తు ఎదుగుతుంది. ఇంత చిన్నది అంత ఎత్తు ఎదుగుతుందా?’
‘నాకిచ్చిన విత్తనం మొక్కజొన్న. దీని మొక్క ఏడు నించి పది అడుగుల ఎత్తు ఎదుగుతుంది. త్రిదీప్ మొక్కకన్నా ఇది పెద్దది’
‘కానీ నా విత్తనం కన్నా నీ విత్తనం పెద్దది’ త్రిదీప్ చెప్పాడు.
‘నాది ఆవగింజ. ఇది ఎనిమిది అడుగులు దాకా ఎదుగుతుంది’ చిత్రేష్ చెప్పాడు.
‘అంత చిన్న విత్తనం నించి ఇంత ఎత్తయిన చెట్టా?’ త్రిదీప్ ఆశ్చర్యపోయాడు.
‘విత్తనం ఏ సైజులో ఉందన్నది కాదు ముఖ్యం. అది ఎంత ఎత్తు ఎదుగుతుందన్నది ముఖ్యం. అలాగే మనిషి పొట్టా, పొడుగా అన్నదికాక, ఎంత తెలివి గలవాడన్నది ముఖ్యం’ తాతయ్య వివరించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి