S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రయాణంలో పద్ధతులు

యజమాని, యజమానురాలు, ‘జక్కడిని జాతరకు పంపించాలె’ అని మాట్లాడుకుంటున్నరట. ఆ మాటలు జక్కని చెవులలో పడినయి. జక్కడు, అర్థానికి యక్షుడయినా, వాస్తవానికి ఆ ఇంట్లో జీతగాడు. అంటే జీతము దీసుకోని పనిజేసేవాడు. ఈ లెక్కన సర్కారు కింద, కంపెనీలలో నౌకరీ చేసేటి వాండ్లందరు గూడ జీతగాండ్లే గదా! మాటల ఎనుక నడిస్తే, అసలు మతులబు మరుగున వడుతుంది. మనము జక్కని ఎంట, అంటే వెనుక, అంటే అనుసరించి పోదము. జాతర దగ్గరలోనే జరుగుతున్నట్లున్నది. మనవాడు అక్కడికి పోయినడు. తిరిగి ఇంటికి వచ్చినడు. మరునాడు ఉదయాన అమ్మగారు జక్కనితోని జాతర సంగతి ఎత్తింది. ఏ కుంకుమనో, మరొకటో తెప్పించాలని ఆయమ్మ ఆలోచన అయి ఉంటుంది. ‘నేను జాతరకు పోయిన, మళ్ల ఒచ్చిన, నిన్ననే!’ అన్నడు జక్కన. ‘చక్కదనము సంకనాక! పొయ్యి ఏంజేసి వొచ్చినవురా?’ అన్నడు అయ్యగారు. ‘నాకేమి ఎరుక? జాతరకు పంపాలని మీరు మాట్లాడుకుంటుంటె యిన్న (విన్న, వింటిని, వినియుంటిని) పొయ్యొచ్చిన! ఎందుకంటని నన్నడిగితే, మీరు చెప్పినరు గనుకనా? అన్నడు చక్కనయ్య జక్కయ్య!’ మా దగ్గర ఎవరన్న ప్రయోజనం లేకుండ పని చేస్తే, ‘జక్కడు జాతర పొయినట్టు’ అంటరు!
నేను ఈ మధ్యన ఒకటి, రెండు, మూడు ప్రయాణాలు చేసిన. మరీ జక్కయామాత్యుని తీరుగాదుగాని, నాకు ఆ ప్రయాణాల గురించి తలుచుకుంటే జక్కయమంత్రి మనసులో మెదిలినడు.
విజయవాడలో ఒక సభ. ఒక పత్రిక స్థాపించి ఇరువయి అయిదు సంవత్సరాలు నిండినందుకు జరుగుతున్న సంబరము. ఆ పత్రిక మొదటి సంచికలో నేను రాసిన వ్యాసమున్నది. తరువాత సంవత్సరాలలో ఆ పత్రికలో నా వ్యాసాలు వచ్చిన తీరు గురించి నేను చెప్పను. ఎందుకంటే, నేను ఏమీ రాయలేదు గనుక! అయినా పత్రిక నిర్వాహకులకు ఆ సభలో నేను గూడ ఉండవలెనని గట్టి అభిప్రాయం కలిగింది. సంగతి తెలియకుండనే జాతరకు పోయి వచ్చిన జక్కన నాకు ఆదర్శము. మరి యింక ‘నేను రావలెనా? అవసరమా?’ వంటి ఆలోచనలకు తావులేదు గదా?
హైదరాబాదు నుంచి బయలుదేరి విజయవాడ చేరేటందుకు చాలారకాల సౌకర్యాలు ఉన్నయి. అందులో, లేదా వాటిలో కారు అనేది ఒకటి. అలవాటు లేకున్నా తెల్లవారకు ముందు లేచి స్నానాదికాలు ముగించి ఎదురు చూస్తుంటే, ‘మొత్తానికి’ ఏదో ఒక సమయానికి కారు వచ్చింది. యాత్ర అనే జాతర (రెండు మాటలు ఒకటేనండి!) మొదలయింది. పట్నం అనే జంటనగరాలను వదిలి బయట పడేటందుకే గంటకు పైన పట్టింది. మరింత పట్టింది. మమ్మల్ని, మమ్ములను కదిలింపజేసిన కారు సారథి మంచితనం గురించి చెప్పడానికి పూనుకుంటే కథ మరొక మార్గంలోకి మళ్లుతుంది. రాష్ట్రం దాటి మరో రాష్ట్రంలోకి దూరినందుకు సుంకం కట్టాలెనట. అది ఎక్కడ, ఏమి అన్న వివరం తెలియక మేము ఏ చెల్లింపులు చేయకుండనే ముందుకు పోయినము. మరొక రాష్ట్రంలోకి దూరకముందే, దారి పక్కనున్న పూరిపాక హొటేల్లో పూరీలు లేనందుకు దోశెలో, మరొకటో తినే తతంగం కూడ అయ్యింది.
మొత్తానికి అనుకున్న సమయం కంటే చాలా తరువాత నగర ప్రవేశం అయ్యింది. అక్కడ ఆరంభములోనే కనకదుర్గమ్మ గుడి దగ్గర, దారి మీద ఆకాశ మార్గం అనే ‘ఫ్లై ఓవర్’ కడుతున్నరట. ఎడమకు తిరిగి చుట్టుతోవన పోవాలె, అన్నరు. డ్రయివరుకు నగరం కొత్త. మిగతా వారిలో ఒకరికి మాత్రం, దారి గురించి చూచాయగ తెలుసు. మొత్తం మీద గమ్యం చేరినము. అప్పటికి మట్ట మధ్యాహ్నమయింది. సభ మొదలయింది. నాలుగు భాగాల సభలో మొదటిది ముగింపునకు వస్తుంటే మేము అక్కడికి చేరినము. చిత్రమేమిటంటే, మమ్ములను వెంటనే వేదిక మీదికి పిలిచినరు. అప్పటికే అక్కడ కావలసినంత మంది (దేనికి? అంటే ఎక్కుమంది అని భావము లెండి!) కూచుని ఉన్నరు. మాకు గూడ జాగా చేసినరు. మిగిలిన వాండ్లతో బాటు, మా జట్టులోని ముగ్గురము కొంత (!) (నిజంగ కొంత) సేపు మాట్లాడినము. అయిదు గంటల పయనము. నాది అయిదు నిమిషాల ప్రసంగము! మొత్తం మీద సభను విరిచినరు. అంటే బ్రేక్ చేసినరు. మెదడుకే కాకుండ, పొట్టకు గూడ తిండి ఉండాలె గద! తిన్నము. ఇంక వెంటనే తిరుగుదారి పట్టాలని ప్రయత్నము. కానీ, మాతో వచ్చిన ఒక ప్రొఫెసర్‌గారు తరువాతి సభా భాగానికి అధ్యక్ష స్థానాన్ని అలంకరించినరు! ఆయన లేకుండ తిరిగిపోయే వీలులేదు. మొత్తానికి బయలుదేరినము. మళ్లా అయిదు గంటలు కారులో కదిలి మొత్తానికి ఇండ్లు చేరినము. కార్యక్రమం జరిగిన ఆ కాలేజి కాంపౌండును కూడ కలియచూడలేదు. అయినా విజయవాడ వెళ్లి వచ్చినట్లే గదా!
ఉన్న ఆ కొంతసేపటిలో ఎంతో మందితో మాటలు సాగినయి. అది ఫలితం!
ఇంక, అనంతపురానికి ఒక పెండ్లికి పోవలసి వచ్చింది. మనము పోకుంటే, పెండ్లి ఆగదు. కాని, కొంత కొరత తెలుస్తుందేమో? రైలు సమయానికి గంట ముందే కాచిగూడ స్టేషనుకు చేరుకున్నము. రైలు రావలసిన సమయానికి ఒక ప్రకటన మాత్రం వినిపించింది. ఆ రైలు రాత్రి ఒంటిగంటకు ‘ఆనేకీ సంభావనా’ అనగా వచ్చే అవకాశము ఉన్నదని! ఎగబెట్టి ఇంటికి పోయి పండుకోవాలన్నది నా సంకల్పము. కానీ మన మాట నడవదు గదా! ఒంటిగంటన్నరకు ఏ ప్రకటనా లేకుండ, చడీ చప్పుడులు మాత్రము తోడుగా రైలు రాజము వచ్చినది. ఎక్కవలసిన పెట్టె ఎంచుకుని, ఎతుకి, అంటే వెతికి ఎక్కితే, అందుల్లో తొడతొక్కిడగ జనం. అయినా గొప్ప గోల లేకుండనే మా రెండు బెర్తులనే చెక్కమంచాలను మాకు వదిలిపెట్టినరు. మొత్తం మీద అనంతపురం చేరినము. పెండ్లి జరిగే హాలు కిలోమీటరు దూరం గూడ లేదని తెలుసు, ఆటో మిత్రుడు అర్ధశతం అనగా యాభయి రూపాయలు అడిగినడు. మొత్తం మీద సంచులతో సహా హాలులో అడుగుపెట్టినము. ‘జిలకర, బెల్లము’ అనే ముహూర్తము జరుగుతున్నది. అంటే మొత్తం మీద సకాలానికి వచ్చినట్టే గదా! స్నానాలు ముగించి హాలులోకి చేతనయినంత త్వరగా వస్తిమి. మొత్తం మీద పెండ్లి సంబరాలలో పాల్గొన్న సంతోషం దక్కింది.
కొంతమంది, ఏదో రకంగ తప్పించుకుని నగరంలో, చుట్టుపక్కల తిరిగినట్లున్నరు. మేము ఒక బంధువుల యింటికి మాత్రము పోయి, రాగలిగినము. ఆ యిల్లు కూడ మాకు తెలిసింది చూచాయగ మాత్రమ. అయినా మొత్తం మీద పోగలిగినము. తిరిగి పెండ్లి హాలుకు తిరిగి రాగలిగినము. రాత్రికి మళ్ల రయిలు. తిరుగు ప్రయాణము.
విజయవాడలో ఒక సందులోని ఒక కాలేజీ. గొల్లపూడి ప్రాంతంలో పొట్టి అరటిపండ్లు. ఇవి మాత్రమే నాకు గుర్తున్నయి. అనంతపురంలో మంచినీళ్ల సీసా కొంటే, రెండు రూపాయలు ఎక్కువ తీసుకున్న ముసలమ్మ గుర్తున్నది! జక్కనికి జాతర గురించి ఏం గుర్తున్నదో?
ఈ నాలుగు మాటలు రాస్తూ నేను మొత్తం మీద, ‘మొత్తం మీద’ అనే మాట ఎన్నిసార్లు ప్రయోగించిన? అంటే వాడిన? మీరు లెక్కవెట్టండి. చూచాయగ తెలిసినాసరే, మొత్తం మీద పొయ్యి, పోయి రావచ్చు. జక్కనికంటే, ఈ రకంగ మనమే మేలు! పని జరిగింది గద మరి!

కె.బి. గోపాలం