S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గజదొంగ

కోపంతో అరవడం, అసంబద్ధమైన ఆజ్ఞలు జారీ చేయడం, చిన్నచిన్న విషయాల్లో కూడా మండిపడటం మొదలైనవన్నీ వత్తిడికి గురైన మనిషి లక్షణాలు. ఆ లక్షణాలు అతని కింద పని చేసేవారు పోలీస్ చీఫ్ లోపెజ్‌లో గమనించారు. దాంతో వారు ఆయనకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే కెప్టెన్ మేజా చొక్కా పై గుండీని పెట్టుకోలేదని హెడ్ క్వార్టర్స్‌కి ఫిర్యాదు చేస్తానని లోపెజ్ బెదిరించాడు. ఆయన గదిలోంచి బయటకి వచ్చిన మేజా మిగిలిన సిబ్బందికి చెప్పాడు.

‘ఆ మూర్ఖుడికి మనమంతా దూరంగా ఉండాలి. బహుశ ఆయన తన భార్యతో పేచీ పడి వచ్చినట్లున్నాడు’
‘లేదా అతని గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరితో’ విక్టర్ నవ్వుతూ చెప్పాడు.
కెప్టెన్ మేజా బల్ల మీది ఇంటర్‌కం మోగింది. వెంటనే రిసీవర్ని అందుకుని అవతల నించి చెప్పేది విని మృదువుగా రిసీవర్‌ని పెట్టేసి చెప్పాడు.
‘విక్టర్! ఇప్పుడు నీ వంతు. చీఫ్ వెంటనే నిన్ను చూడాలనుకుంటున్నారు’
‘పరిగెత్తు. సింహం ఆకలితో గర్జిస్తోంది’ ఒకరు నవ్వుతూ చెప్పారు.
‘మీరంతా నా కోసం ప్రార్థించండి’ చెప్పి విక్టర్ తలుపు తెరచుకుని చీఫ్ గదిలోకి వెళ్ళాడు.
సింహం ముందు నిలబడ్డ మేకలా తన ముందు నిలబడ్డ విక్టర్‌ని లోపెజ్ కొన్ని క్షణాలు చూశాడు. తర్వాత అడిగాడు.
‘ఏమిటి?’
‘మీరు ఇప్పుడే నన్ను పిలిచారు సర్’ విక్టర్ వినయంగా చెప్పాడు.
‘పిలిచానా? పిలవలేదే? అదిగో తలుపు. వెళ్లు. బయటకి వెళ్లేప్పుడు తలుపుని నెమ్మదిగా ముయ్యి’
విక్టర్ వెంటనే ఆనందంగా తలుపు దగ్గరికి చేరుకున్నాడు.
‘ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు?’ లోపెజ్ కంఠం కఠినంగా వినపడింది.
అతను ఆగి వెనక్కి తిరిగాడు. లోపెజ్ లోగొంతుకతో చెప్పాడు.
‘సరే. ఎటూ వచ్చావుగా? కూర్చో. నా సమస్యని నీకు చెప్తాను’
విక్టర్ కూర్చున్న కొద్దిసేపు దాకా లోపెజ్ మీమాంసగా ఆలోచిస్తూ ఏం చెప్పలేదు. తర్వాత చెప్పాడు.
‘నువ్వు నాకో సహాయం చేయాలి. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. పూర్తిగా వ్యక్తిగతం. రహస్యంగా ఉంచాలి’
లోపెజ్ ఆడవాళ్ల సమస్యలో చిక్కుకుని ఉంటాడని విక్టర్‌కి అనిపించింది.
‘ఎవరికీ చెప్పను సర్’ నమ్రతగా చెప్పాడు.
‘ఈ విషయం బయటకి పొక్కితే నినే్నం చేస్తానో నేను ప్రత్యేకంగా చెప్పను’ లోపెజ్ హెచ్చరించాడు.
‘బయటకి పొక్కదు సర్. మీకు హామీ ఇస్తున్నాను’
కొద్ది క్షణాల వౌనం తర్వాత లోపెజ్ నెమ్మదిగా చెప్పాడు.
‘నేను ఒకరి వల్ల బాధ పడుతున్నాను’
‘ఎవరు సార్?’
‘దొంగ.’
పోలీస్ చీఫ్ దొంగవల్ల బాధపడటమా? విక్టర్‌కి అది చిత్రంగా అనిపించింది.
‘ఇది ఎందుకు రహస్యంగా ఉంచాలో నాకు అర్థమైంది సర్’
‘లేదా నేను నవ్వులపాలు అవుతాను’
‘మిమ్మల్ని నవ్వులపాలు కానివ్వనని హామీ సర్’
‘ఆ దొంగ ఎవరో నాకు తెలుసు’
‘వాడు ఎవరు సర్? వెంటనే అరెస్ట్ చేస్తాను’
‘ఆడ దొంగ’
‘ఐనా అరెస్ట్ చేస్తాను. ఆమె చిరునామా తెలుసా?’
‘ఆగు. విక్టర్. ఇదంత తేలికైన విషయం కాదు.’
విక్టర్ వౌనంగా ఉన్నాడు.
‘ఆవిడ తన జీవితం ఆఖరి దశలో ఉన్న వృద్ధురాలు’
‘చిన్నవాళ్లయినా, పెద్ద వాళ్లయినా, మగైనా, ఆడైనా.. దొంగల విషయంలో ఎలా ప్రవర్తించాలో మాకు శిక్షణ ఇచ్చింది మీరే కదా సర్. ఈవిడ పేరు చెప్తే వెంటనే వెళ్లి...’
‘అరెస్ట్ చేయకు. ఆ దొంగ విషయంలో ఇది అంత తేలిక కాదు.’
‘కాని ఏదో ఓ దారి దొరక్కపోదు సర్’
‘నాకది తట్టకనే నిన్ను సంప్రదిస్తున్నాను’
విక్టర్ మళ్లీ వౌనంగా ఉండిపోయాడు.
‘ఆవిడ మా అత్తగారే’ లోపెజ్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘ఓ! అర్థమైంది. మనం మీ స్వంత అత్తగారిని అరెస్ట్ చేయడం భావ్యం కాదు’
‘లేదా మా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. ఆవిడ మా ఇంట్లోని చాలా వస్తువులని దొంగిలించింది. ఏష్ ట్రేలు, ఖరీదైన టీ కప్పులు, గోడకి వేలాడే మంచి చిత్రాలు.. గినె్నలు.. ఒకటేమిటి. చాలా.’
‘అది మీ అత్తగారి పనని ఎలా చెప్పగలరు? మీ పని వాళ్లు...’
‘నేను గుడ్డివాడిని కాను. వాటిని ఆవిడ తన ఇంటికి తీసుకెళ్లడంలో దాచే ప్రయత్నం చేయడం లేదు.’
‘వింతగా ఉందే?’
‘వింతేం లేదు. అల్లుడు అత్తని అరెస్ట్ చేయడం భావ్యం కాదు. రేపు పేపర్లో ఈ వార్త వస్తే నన్ను చూసి అంతా నవ్వుతారు.’
‘ఆవిడ ఎవరూ తనని అరెస్ట్ చేయరనే ధైర్యంతో దొంగగా మారి ఉంటుంది.’
‘అందువల్ల ఆవిడ బాధ్యతలేని దొంగైంది. నువ్వు ఆవిడని బెదిరించో, మరో విధంగానో దొంగతనాన్ని ఆపించాలి.’
‘ఈ పని మీ ఆవిడ చెప్తే కుటుంబందేమో సర్?’
‘సరిగ్గా చెప్పావు. ఆ పిచ్చి ముసలావిడ మా ఇంటిని సర్వం దోచేయక మునుపే నువ్వేమైనా చేయాలి. ముందుగా దొంగిలించిన సామానుని నాకు వెనక్కి తెచ్చి ఇవ్వాలి. వాటిని మళ్లీ కొనటానికి చాలా డబ్బు ఖర్చవుతుంది’ లోపెజ్ కోరాడు.
‘కాని ఆవిడతో నేను ఆ విషయం మాట్లాడి కూడా ఉపయోగం ఉండదేమో సర్. కారణం ఆవిడ మీ అత్తగారు’
లోపెజ్ కోపంగా బల్ల మీద చేత్తో కొట్టాక తను తప్పుగా మాట్లాడానని విక్టర్‌కి తెలిసింది.
‘నువ్వా పని చేసి తీరాలి. ఏదో దారి వెదికి నా సామానుని వెనక్కి తీసుకురా’
‘ఓ దారి కనుక్కోలేక పోను. కాని అందుకు కొంత సమయం పట్టచ్చు’
‘సరే. కాని మరీ ఎక్కువ సమయం తీసుకోకు’
‘ప్రయత్నిస్తాను సర్’
‘అందుకు నువ్వు పడే కష్టం మీద నాకు ఆసక్తి లేదు. నా సొత్తు నాకు వెనక్కి రావడం మీదే నా ఆసక్తి అంతా’
కోపంగా ఉన్న సింహంతో వాదించడం నిష్ప్రయోజనం అని విక్టర్ వౌనంగా ఉండిపోయాడు.
‘ఏం?’
‘ఎస్ సర్. మీ నించి దొంగిలించిన వస్తువుల జాబితా నాకు కావాలి సర్’
వెంటనే లోపెజ్ డ్రాయర్ తెరిచి అందులోంచి ఓ కాగితాన్ని బయటకి తీసిచ్చి చెప్పాడు.
‘నువ్వు ఇది అడుగుతావని నాకు తెలుసు’
‘ఇన్నా?’ ఆశ్చర్యపోయాడు.
‘ఇరవై నాలుగు గంటల్లో ఇవన్నీ తిరిగి నాకు చేరాలి. లేదా.. వెళ్లు’ లోపెజ్ కోపంగా చెప్పాడు.
విక్టర్ లోపెజ్ అత్తగారిని మనసులో తిట్టుకుంటూ బయటకి నడిచాడు. అతని మొహాన్ని చూసిన మేజా అడిగాడు.
‘ఏమైంది? నిన్ను ఎద్దు కుమ్మినట్లుగా కనిపిస్తున్నావు’
‘నువ్వు తక్కువగా ఊహించావు’
‘ఏమిటి సమస్య?’
విక్టర్ అది చెప్పకుండా హెడ్‌క్వార్టర్స్ లోంచి బయటకు నడిచాడు. ఎదురుగా ఉన్న బ్లూ మూన్ రెస్ట్‌రెంట్‌లోకి వెళ్లాడు. ఓ కప్పు వేడి, నల్లటి, స్ట్రాంగ్ కాఫీని అడిగాడు. అది తాగినా అతనికి ఎలాంటి ఆలోచనలు స్ఫురించలేదు. తర్వాత ఎండలో కొద్దిసేపు చురుగ్గా నడిచాడు. అదీ సహాయం చేయలేదు. మెదడుకి తుప్పు పట్టినట్లుగా ఎలాంటి పరిష్కారాలు తట్టలేదు. గంట తర్వాత సమస్యలని మర్చిపోయే బ్లేక్ కేట్ బార్‌కి వెళ్లాడు.
‘డబుల్ టెకీలా. పేంఛో’ విక్టర్ ఆర్డర్ చేశాడు.
‘మీరు డ్యూటీలో లేరా విక్టర్?’ దాని యజమాని అడిగాడు.
‘ఉన్నాను. లేను’
‘లోపెజ్ బాధితులంతా ఇక్కడికే వస్తారు. ఈసారి ఏమిటి?’ అడిగాడు.
‘నేను చెప్పినా మీరు నమ్మలేరు’
వారి సంభాషణ అక్కడితో ముగిసింది కాని టెకీలాలు ముగియలేదు. రాత్రి చీకటి పడేదాకా విక్టర్ అక్కడే కూర్చున్నాడు.
‘హలో బాస్’ ఫ్రాన్సిస్కో పలకరించాడు.
అతను తన నాయనమ్మ నించి ఊతకర్రలు దొంగిలించే రకం. అతని గురించి పోలీసులకి, ముఖ్యంగా విక్టర్‌కి బాగా తెలుసు. అతన్ని చూడగానే విక్టర్ ఆల్కహాలిక్ మెదడులో ఓ మెరుపు మెరిసి తన సమస్యకి తగిన పరిష్కారం లభించిందని అనిపించింది.
‘ఫ్రాన్సిస్కో సర్’ అతన్ని పిలిచాడు.
విక్టర్ మాట్లాడిన ఆ మాటలకి ఫ్రాన్సిస్కోకి రెండు విషయాలు అర్థం అయ్యాయి. ఒకటి విక్టర్ ఏదో సమస్యలో ఉన్నాడని. రెండోది బాగా తాగాడని.
‘నువ్వు అప్పుడే పుట్టిన పసికందులా అమాయకుడివి. అవునా?’ విక్టర్ ప్రశ్నించాడు.
‘కాదని మీకు తెలుసు’
‘ఐతే నువ్వు నాకో పని చేసి పెట్టాలి’
‘ఏమిటి?’
విక్టర్ తన మనసులో ఏం ఉందో చెప్పాడు. అది విన్నాక ఫ్రాన్సిస్కో చెప్పాడు.
‘మీరు బాగా తాగి ఉండాలి. లేదా జోక్ చేస్తూండి ఉండాలి’
‘రెండూ నిజం కాదు. నేను కోరింది చేస్తావా?’
‘మీరు మళ్లీ నన్ను జైలుకి పంపించే పథకం ఎందుకు వేస్తున్నారు?’
‘నేను నీకు ఒకప్పుడు చేసిన సహాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు’
తను ఓసారి గతంలో చేసిన దొంగతనం విషయంలో విక్టర్ సీతకన్ను వేయడం ఫ్రాన్సిస్కోకి గుర్తొచ్చింది.
‘ఒకవేళ ఆ ప్రయత్నంలో నేను పట్టుబడితే?’ అడిగాడు.
‘ఒకవేళ మీద నాకు ఆసక్తి లేదు. నేను చెప్పింది చేస్తావా? లేదా?’
వేరే దారి లేక ఫ్రాన్సిస్కో తల ఊపి కొన్ని వివరాలని అడిగి తెలుసుకున్నాడు. లోపెజ్ తనకి ఇచ్చిన జాబితాని అతనికి ఇచ్చి ఆ ఇంటి అడ్రస్ చెప్పాడు.
‘రేపు ఉదయం ఈ సామానుతో నువ్వు నాకు కనపడాలి’
‘కానీ సర్...’
‘అంతే. గుడ్ లక్’
తన సమస్య తీరడంతో విక్టర్ ఆనందంగా లేచి ఇంటి దారి పట్టాడు.
* * *
మర్నాడు ఉదయం విక్టర్‌ని అతని కూతురు నిద్రలేపి చెప్పింది.
‘నీ కోసం ఎవరో వచ్చారు నాన్నా’
‘ఇంత పొద్దున్నా? నా తల పగిలిపోతోంది. తర్వాత రమ్మను’ కళ్లు తెరవకుండా చెప్పాడు.
‘నేనా మాట ముందే చెప్పాను. అది ముఖ్యమైన విషయం అని చెప్పాడు’
విక్టర్ చిరాగ్గా మూలిగి మంచం దిగి ముందు గదిలోకి వెళ్లాడు.

ఉత్త చేతులతో కనిపించిన ఫ్రాన్సిస్కోని చూసి కోపంగా అడిగాడు.
‘నేను చెప్పిన పని చేయలేదా?’
‘అది చాలా కష్టమైన పని సర్. ఐనా చేసాను’
‘వివరాలు అనవసరం. సామాను ఎక్కడ?’
‘మీ కారులో ఉంచాను సర్’
‘అంటే నా కారు తలుపుని మారుతాళంచెవితో తెరిచావా?’
‘కాని దొంగిలించడానికి కాదు సర్. దొంగిలించిన సామానుని మీ కారులో ఉంచడానికి’ ఫ్రాన్సిస్కో చెప్పాడు.
‘సరే. థాంక్స్ ఫ్రాన్సిస్కో’
‘డోంట్ మెన్షన్ సర్. ఇంక ఇలాంటి పనులు నాకు చెప్పకండి. ఇంత సామాను కోసం నా కారు నించి ఇంట్లోకి మూడుసార్లు తిరగాల్సి వచ్చింది’
‘మోంటెన్ నగరంలో నీ అంత నైపుణ్యం గల దొంగ ఇంకొకరు లేరు’ విక్టర్ మెచ్చుకున్నాడు.
‘అదే మీ సమస్య’ నవ్వుతూ చెప్పి అతను వెళ్లిపోయాడు.
‘అతను ఎవరు?’ వంట గదిలోకి వచ్చిన తండ్రిని కూతురు ప్రశ్నించింది.
‘పరిచయస్థుడు’
‘నీకు ఎలాంటి వారు పరిచయస్థులు?’ నిట్టూరుస్తూ చెప్పింది.
‘నా వృత్తిలో మంచివాళ్లు, చెడ్డ వాళ్లు పరిచయం అవుతూంటారు. అతను చెడ్డవాడు. అలా అని మరీ చెడ్డవాడు కాడు. నాకో గొప్ప ఉపకారం చేసాడు’
‘నాకు తెలుసది. నిన్న రాత్రి బ్లేక్ కేట్ బార్ నించి నిన్ను మోసుకువచ్చాడు’
‘దారిలో ఏదో చర్చించడానికి నేనే రమ్మన్నాను. నాకు బ్లాక్ కాఫీ ఇస్తే నేను ఆఫీస్‌కి వెళ్తాను’
అతను హెడ్‌క్వార్టర్స్‌కి వెళ్లేసరికి ఇంకా లోపెజ్ రాలేదు. మూడు గోనె సంచీలని అతని గదిలో ఉంచి మరి కాస్త బ్లేక్ కాఫీ కోసం బ్లూ మూన్ హోటల్‌కి వెళ్లాడు.
లోపెజ్ మధ్యాహ్నం కాని రాలేదు. సంచీలు తెరిచి వాటిలోని సామానుని చూసి ఇంటర్ కమ్‌లో కెప్టెన్ మేజాతో చెప్పాడు.
‘విక్టర్‌ని లోపలకి పంపు’
‘తలారి నిన్ను వెంటనే రమ్మంటున్నాడు విక్టర్’ మేజా చెప్పాడు.
‘చివరకి నువ్వు సాధించావు విక్టర్. అందరిలోకి నేను నిన్ను నమ్మడమే తెలివైన ఆలోచన ఐంది. కూర్చో. సిగార్ వెలిగించు’ లోపెజ్ ఓ సిగార్‌ని ఇస్తూ చెప్పాడు.
ఇద్దరూ సిగార్లని వెలిగించాక అడిగాడు.
‘ఏం చేసావు? ఆవిడ్ని హిప్నటైజ్ చేసావా?’
లోపెజ్‌కి నిజం చెప్తే ప్రమాదం అని విక్టర్‌కి అనిపించింది.
‘ఏమిటి? మాట్లాడవే?’ లోపెజ్ ప్రశ్నించాడు.
‘అది చాలా పెద్ద కథ సర్..’
అకస్మాత్తుగా తలుపు తెరచుకుంది. పెద్దగా అరుస్తూ లోపెజ్ అత్తగారు ఆ గదిలోకి వచ్చింది. లోపెజ్ అత్యంత నమ్రతగా, వినయంగా ఆ తుఫాను వెలిసేదాకా వేచి ఉన్నాడు. తర్వాత ఆవిడతో చెప్పాడు.
‘ఘోరం! మీరు నిద్రపోతూండగా మీ ఇంట్లో దొంగ పడి మీ సామాను దొంగిలించడం నిజంగా ఘోరం. బాధ పడకండి. విక్టర్ మా శాఖలోని ఉత్తమ డిటెక్టివ్. వాటిని తిరిగి సంపాదిస్తాడు. ఏం విక్టర్?’ ఆవిడ చూడకుండా విక్టర్‌కి కన్నుకొట్టి అడిగాడు.
‘తప్పక సంపాదిస్తాను సర్. మేడం! మీరు పోయిన ఆ వస్తువు జాబితాని రాసివ్వండి. దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తాను. వాటిని కొన్న రసీదులు కూడా కావాలి’
ఆ గదిలో అకస్మాత్తుగా నిశ్శబ్దం ప్రవేశించింది. లోపెజ్ మాట్లాడలేదు. ఆవిడ కూడా వౌనంగా ఉండిపోయింది.
‘లేదా దొంగ తనవి మేము స్వాధీనం చేసుకున్నామని గొడవ పెట్టచ్చు’
ఆవిడ వెళ్లాక విక్టర్ చెప్పాడు.
‘ఇక మీకు ఆవిడ నించి ప్రమాదం ఉండదనే అనుకుంటున్నాను సర్’
‘అవును. మంచి జలక్ ఇచ్చావు. ఇంతకీ వీటిని ఎలా సంపాదించావు?’
‘అది చాలా పెద్ద కథ సర్.. ఎప్పుడైనా ఈ సంచీలో మీ అత్తగారిని తేవాల్సిన అవసరం ఉంటే చెప్పండి సర్. అది చిటికెలో పని’
లోపెజ్ ఆనందంగా తల ఊపి చెప్పాడు.
‘ఇంకో సిగార్ తీసుకుని వెళ్లి నీ పని చూసుకో’
బయటకి వచ్చాక కెప్టెన్ మేజా అడిగాడు.
‘ఏమిటి? గుహలోని సింహం గర్జించలేదే?’
‘పంజా కూడా విసరలేదు’ విక్టర్ నవ్వుతూ సమాధానం చెప్పాడు.
(హాల్ ఎల్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి