S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరణశిక్ష

14 నవంబర్ 1880.
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని ఆ చెట్టు దగ్గరికి ఆరుగురు గుర్రాల మీద చేరుకున్నారు. నెక్ టై పార్టీగా ముద్దుగా పిలిచే ఆ కార్యక్రమం కోసం వారు అక్కడికి చేరుకున్నారు. చెట్టు నించి ఉరి తాడు వేలాడుతోంది. గుర్రం మీద కూర్చుని చేతులు వెనక్కి కట్టబడ్డ జోసెఫ్ కేజువల్ మెడకి ఉరి తాడు తగిలించారు. హింసాత్మక జీవితం గడిపిన జో కేజువల్ ఆఖరి నిమిషాల్లో ప్రశాంతంగా కనిపించాడు.
‘నీకు క్రిస్టియన్ ప్రవచనం మీద ఆసక్తి ఉందా?’ ప్రీస్ట్ అడిగాడు.
‘నాకు నా మెడ మీద ఆసక్తి ఉంది. మాటలు ఆపి త్వరగా పని చూడండి’ అతను నిర్లక్ష్యంగా చెప్పాడు.
‘నీ కాళ్లు భూమికి కొన్ని అడుగుల ఎత్తున వేలాడటం చూడటం నాకు ఆనందంగా ఉంది’ షెరీఫ్ చెప్పాడు.
‘నువ్వు ఆఖరికి ఏదైనా చెప్పదలచుకుంటే చెప్పచ్చు’ జడ్జి సూచించాడు.
‘అవకాశం ఉంటే నేను చంపిన ఆ యువకుడ్ని ఇంకోసారి కూడా చంపుతాను’
‘నువ్వు చాలామందిని చంపావు. గాల్లో నీ కాళ్లు ఎంతసేపు తన్నుకుంటే వారికి అంత న్యాయం జరుగుతుంది’ షెరీఫ్ చెప్పాడు.
‘నీ కోరికని తీరుస్తాలే షెరీఫ్’
‘నువ్వు చాలా దుర్మార్గుడివి. నిన్ను ఉరి తీయడం ప్రపంచానికి సేవ చేయడమే. ఉరి తీయండి’ జడ్జి ఆజ్ఞాపించాడు.
ఓ సాక్షి సమక్షంలో కోర్ట్ నించి వచ్చిన ఉద్యోగి కేజువల్ ఎక్కిన గుర్రాన్ని కొరడాతో కొట్టాడు. అది ముందుకి పరిగెత్తడంతో అతను కొద్ది క్షణాల్లో గాల్లో వేలాడాడు. కాని అకస్మాత్తుగా అతని శవం ఉరి తాడు నించి మాయమైంది!
‘ఓ మై డియర్ గాడ్! ఏడి వీడు?’ ఫాదర్ వెంటనే ఆశ్చర్యంగా చెప్పాడు.
* * *
కళ్లు తెరిచిన కేజువల్‌కి ఎదురుగా ఓ కొత్త మొహం కనిపించింది.
‘విశ్రాంతి తీసుకో. నీకేం కాలేదు’ ఆ కొత్త వ్యక్తి చెప్పాడు.
‘నేను ఎక్కడ ఉన్నాను?’ అతి కష్టం మీద కేజువల్ అడిగాడు.
‘మీ ఇంటికి చాలా దూరంగా ఉన్నావు’
‘ఎక్కడ?’ మళ్లీ ప్రశ్నించాడు.
‘న్యూయార్క్‌లో. ఏం జరిగిందో నీకు వివరిస్తాను. ఎనభై సంవత్సరాలు ముందుకి ప్రయాణించి దీని ద్వారా నువ్వు ఇక్కడికి చేరుకున్నావు. దీని పేరు టైం మెషీన్. ఇది ఎలా పని చేస్తుందో చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు మానవ చరిత్రలో మొదటి టైం ట్రావెలర్‌వి.’
కేజువల్ లోపల అనేక మీటలు గల ఓ మనిషి పట్టేంత గదిని చూశాడు.
‘ఐతే నీ గతం గురించి నాకేం తెలీదు. నేను నీకు చాలా కొత్త ప్రపంచాన్ని చూపిస్తాను. నువ్వు నీ పాత ప్రపంచం గురించి చెప్పాలి’
మెడ నొప్పితో బాధపడే అతన్ని ఆ శాస్తజ్ఞ్రుడు జాగ్రత్తగా పరిశీలించాడు. కేజువల్ సొమ్మసిల్లినట్లుగా నిద్ర పోయాడు. కొద్దిసేపు మాట్లాడి తిరిగి అతను నిద్రపోతూంటే ఆ శాస్తజ్ఞ్రుడు టేప్‌రికార్డర్‌ని ఆన్ చేసి చెప్పసాగాడు.
‘ఉదయం ఎనిమిది పదిహేనుకి అతను వచ్చాడు. అలసిపోయినట్లుగా నాకు కనిపించాడు. అతను రెండు గంటలు నిఅద పోయాక నాకు ఈ విషయాలని చెప్పాడు. అతని పేరు జోసెఫ్ కేజువల్. అతనికి గుర్తున్న ఆఖరి సంఘటన, మోంటానా లోని ఓ ప్రాంతంలో నవంబర్ 14, 1880న మరో ఆరుగురితో కలిసి గుర్రాల మీద ప్రయాణించడం. ఆ తర్వాత జరిగింది మర్చిపోయాడు. నేను ఒకటి గమనించాను. దానికి అతను వివరణ ఇవ్వలేదు. అతని మెడ మీద తడి తాడు గుర్తులు కనిపించాయి. శాస్ర్తియమైన విషయం కానిది ఒకటి చెప్తాను. అతని కళ్లు, మొహం, ప్రవర్తన ఓ ఆటవికుడివిగా అనిపించాయి. పంతొమ్మిదో శతాబ్దపు ఆటవికుడ్ని ఇరవై శతాబ్దపు అడవిలోకి తీసుకువచ్చాను. అతని దారిలో వచ్చే వారికి దేవుడే సహాయం చేయాలి...’
కేజువల్ లేచాక సిగరెట్‌ని ఇచ్చి ఆ శాస్తజ్ఞ్రుడు సిగరెట్ లైటర్‌ని ఆన్ చేశాడు. అతను దాన్ని ఆశ్చర్యంగా చూడటంతో రెండుసార్లు ఆర్పి మళ్లీ వెలిగించాడు.
‘అందులోంచి నిప్పు ఎలా వస్తోంది?’
‘క్రమంగా తెలుస్తుంది. నువ్వు ఇంకా అలసటగా కనిపిస్తున్నావు’
‘అవును. కాని నిద్ర పోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. మీరు చెప్పిన బయట ప్రపంచాన్ని చూడాలి. గుర్రాలు లాగని బళ్లు, ఎతె్తైన భవంతులని చూడాలని అనుకుంటున్నాను’
శాస్తజ్ఞ్రుడు కిటికీ దగ్గరకి వెళ్లి తెరని పక్కకి లాగి అద్దాని ఎత్తి చెప్పాడు.
‘నువ్వు ఎన్నడూ చూడని ప్రపంచాన్ని చూడు’
కేజువల్ బయటకి తొంగిచూస్తే హెడ్ లైట్స్‌తో కదిలే కార్లు కనిపించాయి. తను ఎంత ఎతె్తైన భవంతిలో ఉన్నాడో కూడా అర్థమైంది. చెవులు మూసుకుని భయంగా వెనక్కి వచ్చాడు.
‘కాని ఆనాటికీ, ఈనాటికీ మారనిది మంచి - చెడు’ శాస్తజ్ఞ్రుడు చెప్పాడు.
‘మంచి - చెడు గురించి చెప్పక. నాకు బాగా తెలుసు. డాడ్జి సిటీలోని డిప్యూటీ షెరీఫ్ నా మెడ చుట్టూ ఉరి తాడుని ఉంచి న్యాయం కోసం ఉంచానని చెప్పాడు’ కేజువల్ కోపంగా చెప్పాడు.
‘ఓ! భూమికి ఆరడుగుల ఎత్తున ఉరిలో నీ మెడ వేలాడుతూండగా అక్కడ నించి ఇక్కడికి తెప్పించానన్న మాట!’
‘ఉరి తాడులోంచి వేలాడే వాడికి భూమికి ఎన్నడుగుల ఎత్తున వేలాడానన్నది, అది ఒకటా లేదా వందడుగులా అన్నది అనవసరం’
‘న్యాయం ఎప్పుడూ ఉరి తాడు చివర ఉంటుంది. నువ్వు ఎవర్నో చంపావు కదా?’
‘నా ప్రాంతంలోకి వచ్చి దొంగతనం చేసిన ఇరవై మందిని చంపాను’
‘ఐతే నేను నిన్ను వెనక్కి పంపాలి. వీలుంటే సరిగ్గా ఆ క్షణానికి’ శాస్తజ్ఞ్రుడు చెప్పాడు.
‘అది న్యాయం అని నువ్వు భావిస్తున్నావా? నేను ఓసారి మరణించి నరకానికి వచ్చాను’
‘నువ్వు చంపిన ఇరవై మంది గురించి ఏం చెప్తావు? వారు సౌకర్యంగా మరణించారని చెప్తావా?’
‘మంచి, చెడు, న్యాయం గురించి మాట్లాడడానికి బావుంటుంది. కాని ఇతరుల కోటు, బ్రెడ్‌ని దొంగిలిస్తేనే నువ్వు జీవిస్తావా? లేదా? అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఈ యంత్రంలో నువ్వు నేను ఎక్కడ నించి వచ్చానో అక్కడికి వెళ్లి అక్కడ న్యాయం, చట్టం గురించి మాట్లాడు. అప్పుడు తేడా నీకు అర్తం అవుతుంది. మీలాంటి మనుషుల గురించి నాకు తెలుసు. మిమ్మల్ని నేను ద్వేషిస్తాను’
తన మీదకి వస్తున్న కేజువల్‌ని చూసి ఆ శాస్తజ్ఞ్రుడు భయంగా వెంటనే సొరుగుని తెరిచాడు. అందులోని రివాల్వర్ తీసే లోపల కేజువల్ టేబిల్ లేంప్‌ని అందుకుని అతని తల మీద బలంగా మోదాడు. తక్షణం ఆ శాస్తజ్ఞ్రుడు కుప్పకూలాడు. ఆ రివాల్వర్‌ని అందుకుని కేజువల్ వేగంగా బయటకి వెళ్లాడు.
అతనికి కిక్కిరిసిన ప్లాట్‌ఫాం మీది మనుషులు అడ్డు వచ్చారు. రోడ్డు మీది హెడ్‌లైట్స్‌తో వెళ్లే కార్లని, వాటి శబ్దాని చూస్తే భయం వేసింది. అంత శబ్దం వినని కాలంలోంచి వచ్చిన అతను చెవులు మూసుకుని రోడ్‌ని దాటాలని ప్రయత్నించి ఓ కారు కింద పడబోయాడు. వారి దుస్తులు, ధోరణి అతనికి అర్థంకాలేదు. ఒయాసిస్, ఆర్కేడ్ లాంటి అక్షరాల లైట్లు భవంతుల మీద వెలుగుతూ కనిపించాయి.
ఓ టెలీఫోన్ బూత్‌లోంచి ఫోన్ మోగే శబ్దం విని అర్థం కాక లోపలకి వెళ్లాడు. పబ్లిక్ ఫోన్‌ని తడుముతూంటే రిసీవర్ కింద పడింది. అందులోంచి ఆపరేటర్ కంఠం వినపడింది.
‘ఓవర్ టైం. దయచేసి పాతిక సెంట్లని వేయండి’
అతనికి అది అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న తలుపు లోంచి సంగీతం వినిపిస్తూండటంతో లోపలకి వెళ్లాడు. జూక్ బాక్స్ లోంచి సంగీతం పెద్దగా వినిపిస్తోంది. ఓ కుర్చీని అందుకుని ఆ జూక్ బాక్స్‌ని పగలకొట్టడంతో అక్కడ నిశ్శబ్దం అలముకుంది.
‘అది మా సొత్తు కాదు. దాన్ని ఇక్కడ ఉంచిన వ్యాపారస్థుడిది. నీకు ఏం కావాలి?’ బార్ టెండర్ అడిగాడు.
కేజువల్ కౌంటర్ మీది విస్కీ సీసాని అందుకుని గటగట రెండు గుక్కలు తాగి అడిగాడు.
‘గుర్రాలు లేని బళ్లు, భరించలేని శబ్దాలు. ఆ సంగీతం అందులోంచి ఎలా వచ్చింది?’
‘నువ్వు నక్షత్ర లోకం లోంచి వచ్చావా? నిద్ర లేక బాగా అలసిపోయినట్లున్నావు. ఇంటికి వెళ్లి పడుకో’ బార్ టెండర్ విసుగ్గా చెప్పాడు.
అతను తల ఎత్తి కౌంటర్ మీది టివిని చూస్తూంటే బార్ టెండర్ మళ్లీ అడిగాడు.
‘ఎప్పుడూ చూడనట్లు చూస్తావే? అదేమిటో తెలీదా?’
‘కిటికీ’
‘కాదు. చూపిస్తాను ఉండు’ చెప్పి దాని స్విచ్‌ని ఆన్ చేశాడు.
వెంటనే ఓ కౌబాయ్ చేతిలో రివాల్వర్‌తో ముందుకి నడుస్తూ చెప్పాడు.
‘ఆల్‌రైట్. నీకు ముందుగా రివాల్వర్‌ని తీసే అవకాశం ఇస్తున్నాను’
తక్షణం కేజువల్ తన జేబులోని రివాల్వర్‌ని తీసి ఆ టివిలోని వ్యక్తి కాల్చడానికి ముందే అతన్ని కాల్చాడు. వెంటనే టివి స్క్రీన్ పగిలి గాజు ముక్కలు కిందకి గలగల రాలాయి. బార్ టెండర్ కోపంగా చెప్పాడు.
‘అది నీ సొత్తు కాదు. నువ్వు దాని ధరని చెల్లించాలి’
అతను బయటకి వెళ్లిపోతూండటంతో అరిచాడు.
‘పోలీస్.. పోలీస్’
* * *
తిరిగి కేజువల్ ఆ శాస్తజ్ఞ్రుడి ఇంటికి వెళ్లి చెప్పాడు.
‘ఏయ్ మిస్టర్! లే. నన్ను తిరిగి వెనక్కి పంపు’
కాని మరణించిన ఆ శాస్తజ్ఞ్రుడు లేవలేదు. సరిగ్గా ఆ సమయంలో లోపలకి వచ్చిన స్థానిక దొంగ పాల్ రివాల్వర్‌ని కేజువల్‌కి గురి పెట్టి చెప్పాడు.
‘హలో బఫెలో బిల్! కదలక. ఆ బల్ల సొరుగులో ఎంతుంది?’
అక్కడికి వెళ్లి దాని వెనక నేల మీద పడి ఉన్న శాస్తజ్ఞ్రుడ్ని గమనించి దొంగ పాల్ చెప్పాడు.
‘తలుపులు తీసి లోపల చీకటిగా ఉండటంతో ఎవరూ ఉండరనుకుని వచ్చాను. మనిద్దరం ఒకే పని మీద ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు సహాయం చేసి నా పని తగ్గించావు. థాంక్స్ బఫెలో బిల్! ఇందులో డబ్బు నువ్వు తీసావా? ఐనా ఎక్కువ ఉంటుందనుకోను. ఇక్కడ వాల్ సేఫ్ ఏదైనా ఉందా?’
అదను చూసి కేజువల్ అతని మీదకి తిరగబడ్డాడు. దొంగ చేతిలోని రివాల్వర్ దూరంగా పడిపోయింది. ఇద్దరి మధ్యా పోట్లాట జరిగింది. ఇద్దరూ కిటికీ దగ్గరకి చేరుకోగానే పాల్ దాని తెరని తెరవడానికి లాగే తాడుని కేజువల్ మెడ చుట్టూ చుట్టి కొసని గట్టిగా లాగి పట్టుకున్నాడు. నాలుగైదు నిమిషాల్లో కేజువల్ శరీరం కొట్టుకోవడం ఆగిపోయింది.
ఆ దొంగ వాల్ సేఫ్ కోసం వెదుకుతూంటే గోడకి కొన్ని స్విచ్‌లు కనపడ్డాయి. వాటన్నిటినీ ఆన్ చేయగానే టైం మెషీన్‌లోంచి శబ్దాలు వినిపించాయి. అతను ఆసక్తిగా దాంట్లోకి వెళ్లగానే తలుపులు మూసుకుని లోపల లైట్లు ఆగి వెలగసాగాయి. అతను భయంగా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూ ఆ తలుపుని తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అకస్మాత్తుగా అతను అందులోంచి మాయం అయాడు. అదే సమయంలో లోపల లైట్లు వెలగడం ఆగిపోయి తలుపు తెరచుకుంది. సరిగ్గా 14, నవంబర్ 1880న రాత్రి ఎనిమిదింపావుకి పాల్ మోంటానాకి చేరుకున్నాడు.
* * *
‘అతన్ని దింపండి’ జడ్జి చెట్టు ఉరితాడుకి వేలాడే పాల్‌ని చూసి చెప్పాడు.
‘అరె! మనం తప్పు వ్యక్తిని ఉరి తీసామా?’ చెప్పి షెరీఫ్ అతన్ని దింపాడు.
‘ఇతని బట్టలు ఇలా కొత్తగా ఉన్నాయి ఏమిటి?’ డాక్టర్ చెప్పాడు.
‘ఇతను పూర్తిగా అపరిచితుడు’ ఫాదర్ చెప్పాడు.
‘మనం అమాయకుడ్ని ఉరి తీయలేదు కదా?’
‘లేదనే ఆశిస్తున్నాను’ షెరీఫ్ ఫాదర్ ప్రశ్నకి జవాబు చెప్పాడు.
‘ఇది ఏ డెవిల్ పని?’ సాక్షి అడిగాడు.
‘నాకు తెలీదు. ఇది డెవిల్ పని కాకపోవచ్చు’ ఫాదర్ చెప్పాడు.
న్యాయం! న్యాయం జరగడానికి కాల పరిమితి కాని, దూరాభారం కాని ఉండదని, న్యాయం తన పనిని తాను చేసుకు వెళ్తుందని రుజువైంది.
*
(జార్జ్ క్లేటన్ జాన్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి