S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం - 17

‘మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ, ఆ అశోక్ చేస్తున్న గారడీ బాబూ ఇది...’ ఆవేదనగా అన్నాడు రామభద్రం.
‘అశోక్ ఏం చేశాడు? అసలామాట కొస్తే ఏం చేయగలడు?’
‘నేనూ అదే అనుకున్నాను చంద్రం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చాక మోసానికి తావు ఉండదనుకున్నాను. కానీ చాలా పెద్దఎత్తున ఎవరూ ఊహించని విధంగా మోసం జరిగింది. అశోక్ మనందరికన్నా పదడుగులు ముందున్నాడు...’ చెప్పింది వసుంధర.
‘అసలేం జరిగిందో చెప్పండి...’
‘ఒక ఉదాహరణ చెప్తాను విను. ఈ దావీదు సంగతే తీసుకో...’ అంటూ ఒక వ్యక్తిని చూపించింది వసుంధర. ‘ఇతను పుట్టినప్పటి నుండి ఒకే ఊళ్లో ఉంటున్నాడు. ఇతనికి ఎప్పటి నుండో ఓటుహక్కు ఉంది. ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది. కానీ ఓటింగ్ రోజున ఓటు వెయ్యటానికి వెళ్లిన ఇతని పేరు ఓటరు జాబితాలో కనపడలేదు. ఇతని దగ్గర ఎన్ని రుజువులు ఉన్నా, ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటు వెయ్యటానికి అనర్హుడే!’
‘అదెలా సాధ్యం? ఓటరు జాబితాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారనీ, ఎవరైనా చూసుకుని తమ పేరు లేకపోతే తిరిగి నమోదు చేయించుకోవచ్చనీ పేపర్లలో చదివానే...’
‘అది థియరీ. నిజ జీవితంలో ఎప్పటి నుండో ఉన్న ఓటుహక్కు పోతుందని ఎవరయినా ఎందుకనుకుంటారు? కొత్తగా నమోదు చేయించుకున్న వారయితే చూసుకుంటారేమో గానీ, తమ ఓటు ఉందా లేదా అని చూసుకోవటం అందరూ చెయ్యరు’
‘ఇంతకీ దావీదు ఓటు ఎలా పోయింది?’ అడిగాడు చంద్రం.
‘ఒక్క దావీదు ఓటు మాత్రమే కాదు, నాకు ఓటు వేస్తారనుకున్న వేలాదిమంది పేర్లు ఓటింగ్ రోజు కనపడలేదు’
‘అదే! అదెలా సాధ్యం అయిందని అడుగుతున్నాను?’
‘అశోక్ విశ్రాంతిగా ఇంట్లో కూర్చుని తనకు ఓటు వేయరనుకున్న పేర్లన్నీ జాబితా నుండి తొలగింపజేశాడు’
‘ఇది నమ్మేదిగా లేదు. నువు చెప్తున్నట్లు అంత తేలిగ్గా ఓటర్ల లిస్టు మార్పు చేయగలిగితే, ప్రతి ఒక్కరూ అదే చేస్తారుగా..!’
‘నిజమే! అందుకే నా మాటలు ఎవ్వరూ నమ్మలేదు. కానీ జరిగింది అదే!.. ఒకరి పేరు కాదు, వందల, వేల పేర్లు చాలా చాకచక్యంగా మాయం చేశారు. అదీ మనకి ఓటు చేస్తారనుకున్న వాళ్లకే!’
‘అతనీ పని ఎలా చేయగలిగాడంటావ్?’
‘ఓటర్ల లిస్టులో మార్పులు చేర్పులు చేయటానికి అధికార్ల వద్ద పాస్‌వర్డ్ ఉంటుందిగా! దాన్ని అతను సంపాదించాడు. అధికార్లు తెలిసి ఇచ్చారో, తెలియక ఇచ్చారో కానీ తమ పాస్‌వర్డ్ అతనికి ఇచ్చారు. దాని సహాయంతో అతను తనకు ఇష్టమొచ్చిన మార్పులు చేసుకున్నాడు’
‘మరి మనమేం చెయ్యలేమా?’
‘ముందుగా తెలిసి ఉంటే ఎలా ఉండేదో? ఇలాంటి మోసం కూడా జరగవచ్చన్న ఐడియా లేకపోవటంతో, మనకెవరికీ అనుమానం రాలేదు. ఓటింగ్ రోజు గానీ విషయం బయటపడలేదు. తరువాత ఎలక్షన్ కమీషన్ దృష్టికి తీసుకువెళ్లాను. వాళ్లు ఈ విషయంలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవటానికి సమయం పడుతుంది. అప్పటికయినా జరిగిన మార్పులు ఉద్దేశపూర్వకంగా చేశారని రుజువు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. పాస్‌వర్డ్ ఇచ్చిన ఏ అధికారీ తను కావాలని అలా చేశానని ఒప్పుకోడు. ఏదో ప్రోగ్రాంలో బగ్ కారణంగా అలా జరిగిందంటారు. ఎంక్వైరీ తేలేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. మనకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది...’
‘అలా అయినా అశోక్ కచ్చితంగా నీకు ఓటు వేసే వాళ్లను ఎలా గుర్తించగలడు?’ ఇంకా నమ్మకం కుదరక అడిగాడు చంద్రం.
‘పిచ్చి చంద్రం! పల్లెటూళ్లలో ఎవరు ఎవరికి ఓటు వేస్తారో అందరికీ తెలిసిపోతుంది. అది పెద్ద విషయమే కాదు..’ అంటూ వసుంధర ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమె ఫోన్ మోగింది.
అశోక్ మాట్లాడుతున్నాడు. ‘నీ అడ్వైజర్ వచ్చినట్లున్నాడు. ఇంకా ఎవరైనా సపోర్టర్లుంటే వాళ్లని కూడా పిలిపించుకో... నీకు ఇప్పుడు సానుభూతి చాలా అవసరం’
‘నీ మీద పోరాటం చెయ్యటానికి ఎన్నికలు ఒక మార్గం అనుకున్నాను. అంతే తప్ప ఇందులో ఓడిపోయినంత మాత్రాన నా ప్రయత్నం ఇంతటితో ఆగదు. నీ నిజ స్వరూపం సమాజం ముందు బయటపెట్టే వరకూ విశ్రమించను...’
‘నీవు కనుక ఆ ప్రయత్నంలో ఉండేటట్లయితే నీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక నీకు విశ్రాంతి ఉండదు కాబట్టి. ఇప్పటివరకు మెజారిటీలో ఉన్నానని ఆనందపడి ఉంటావు. ఇక చూడు ఏం జరుగుతుందో?’
‘మోసం చేసి గెలవటం కూడా ఒక గెలవటమేనా? దమ్ముంటే నిజాయితీగా పోరాడు...’ ఫోన్ దగ్గరకు వచ్చి గట్టిగా అన్నాడు చంద్రం.
‘ఆ చంద్రం తనో పెద్ద హీరోననుకుంటున్నాడేమో. వాడిని జీరో చెయ్యటం నాకు పెద్ద విషయం కాదని చెప్పు’ అంటున్న అశోక్ మాటలు పూర్తి కాకముందే ఫోన్ కట్ చేసింది వసుంధర.
‘అతనితో శత్రుత్వం నీకు మంచిది కాదు చంద్రం..’ అంది.
‘నాకు ఇంకొక విషయం అర్థం కావటంలేదు. అశోక్ ఓటర్ లిస్ట్ తారుమారు చేసిన మాట నిజమయితే, మరి ఇప్పటిదాకా నీకు ఎలా మెజారిటీ వచ్చింది?’
‘అందరు అధికారులూ అశోక్ చెప్పినట్లు చెయ్యరుగా! ఎవరో ఒకరిద్దరు ఉంటారు అతని మాట విని చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు. అన్ని చోట్లా ఓటర్ల లిస్ట్ తారుమారు కాలేదు. ఏయే మండలాల్లో అలా జరిగిందో వాటి లెక్కింపు ఇప్పటివరకూ జరగలేదు. అందుకే అతను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు తనే గెలుస్తున్నానని...’
‘అయినా నువ్వే గెలుస్తావు. ఎన్ని ఓట్లు తారుమారు చేసినా, ప్రజల్లో నీ మీద ఉన్న అభిమానాన్ని వాడు తారుమారు చెయ్యలేడు. నేను చెప్తున్నాను చూడు. చివరకు నువ్వే గెలుస్తావ్...’
‘ఆఖరి నిమిషం వరకూ పట్టువిడవని ఈ గుణమే నిన్ను పైకి తెచ్చింది చంద్రం. కానీ నా విషయంలో ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, ఓటమిని హుందాగా అంగీకరించటం తప్ప..’ అంది వసుంధర.
నిట్టూర్చాడు రామభద్రం. ఇంతలో మరో రౌండ్ ఫలితాలు వచ్చినట్లు తెలియటంతో వివరాలు కనుక్కోవటానికి అటు వెళ్లాడు.
వసుంధర
అనుకోని సంఘటనల సమాహారమే జీవితం.
నేను అస్సలు అనుకోని సంఘటన ఆ రోజు నా జీవితంలో జరిగింది.
నాకు పిలిచి సినిమా ఛాన్సు ఇస్తారని ఎవరైనా అంటే చిన్నప్పుడు కలల్లో బ్రతికిన రోజుల్లో నమ్మేదానే్నమో కానీ.. ఇప్పుడు అసలు నమ్మలేను.
కానీ, అదే జరిగింది.
చంద్రం నుండి ఫోన్ వచ్చినపుడు మాట్లాడుతున్నది ఎవరో నాకు అర్థం కాలేదు.
అతనే నాకు గుర్తు చేయాల్సి వచ్చింది. ‘నా పేరు చంద్రం మేడమ్! వసంతరావ్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుంటాను. ఆ రోజు స్టూడియోలో మీ ఆల్బమ్ నాకు చూపించారు. మీ ఫొటో ఒకటి తీసుకున్నాను కూడా. ఏదైనా అవకాశం వస్తే కబురు చేస్తానన్నాను..’
‘ఆ!...గుర్తు వచ్చింది. చెప్పండి...’ అన్నాను కాజువల్‌గా. నాకు అతని మాటలు పెద్దగా ఎగ్జయిట్‌మెంట్ కలుగజేయటం లేదు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చాలామంది చెప్పగా విని ఉన్నాను. మొదట్లో ఆ మాటలన్నీ నిజమని నమ్మేదాన్ని. వాటిని బేస్ చేసుకుని కలలు కూడా కనేదాన్ని. తరువాత అనుభవం మీద తెలిసింది అవన్నీ వేషాల కోసం తిరిగే అమ్మాయిలను వలలో వేసుకోవటానికి మొగాళ్లు చెప్పే మాటలని. ఆ మాటల్లో నిజం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, అంతే!
‘... అప్పుడు మీకు చెప్పటానికి మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఊళ్లో లేరు మేడమ్! ఇప్పుడు వాళ్లకి మీ ఫొటో చూపించాను. వాళ్లు మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు’ అన్నాడు చంద్రం.
‘ఎక్కడకు రావాలి?’ ఏ గెస్ట్‌హౌస్ పేరు చెప్తాడా అన్నట్లు అడిగాను.
అయితే చంద్రం మాత్రం, ‘ఇక్కడ ఫిల్మ్‌నగర్‌లో ప్రొడ్యూసర్‌గారు ఆఫీసు తెరిచారు. మీరు అక్కడకు వచ్చెయ్యండి మేడం...’ అంటూ దాని అడ్రస్ చెప్పాడు.
అతని గొంతులో ఉత్సాహం చూస్తుంటే అతను చెప్పేదంతా నిజమే అనిపిస్తోంది. తరువాత తెలిసింది ఇది నాకు మాత్రమే కాదు అతనికి కూడా కలిసి వచ్చిన అవకాశం అని.
‘ప్రస్తుతం నేను మాల్‌లో ఉన్నాను. నేను ఇక్కడ హెల్పర్‌గా పని చేస్తుంటాను. సగంలో వదిలి బయటకు రాలేను. రేపు వస్తే కుదురుతుందా?’
‘నో ప్రాబ్లమ్!... రేపు మీ కోసం ఎదురుచూస్తుంటాను’ అన్న అతని మాటల్లో నేను వెంటనే రాలేకపోవటం గురించి నిరుత్సాహం కనిపించింది.
నేను వెళ్లటం అతనికి ఎందుకు అంత ఉత్సాహం కలిగిస్తుందో నాకు అర్థం కాలేదు. సినిమా రంగంలో మగవాళ్లంటే ఏర్పడిన అభిప్రాయంతో, ఇతనితో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
మాల్ నుండి బయటకు వెళ్లేటప్పుడు మేనేజర్‌తో రేపు రావటం కుదరదని చెప్పి ఒక్క రోజుకు సెలవు తీసుకున్నాను.
అనుకున్నట్లుగా ప్రొడక్షన్ ఆఫీసుకు చేరుకున్న నన్ను చంద్రం సంతోష్ దగ్గరకు తీసుకువెళ్లాడు.
సంతోష్ నా ఆల్బమ్ చూశాడు. ఇంప్రెస్ అయినట్లే అనిపించింది. రెండు మూడు డైలాగులు ఇచ్చి చెప్పమన్నాడు.
మనసులోనే మాడ్యులేషన్ సెట్ చేసుకుని చెప్పాను.
‘డాన్స్ చేయగలరా?’ అడిగాడు సంతోష్.
‘నేను కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేయగలనూ అనుకుంటే అది డాన్స్ ఒక్కటే..’
ఇంతలో అభిమన్యు అక్కడకు వచ్చాడు. అతనే ఆ సినిమాలో హీరో అని చెప్పారు. అతను మరీ కొత్తవాడు కాదు. దాదాపు పది సినిమాల అనుభవం ఉన్నవాడు.
ఇద్దరినీ కలిపి ఒక డాన్స్ బీట్ చేయమన్నాడు సంతోష్.
అతని పక్కన నటించాలంటే కాస్త బెరుగ్గా అనిపించింది. ఇంతలో లేటెస్ట్ హిట్ పాట ఒకటి పెట్టాడు చంద్రం.
నా అడుగులు ఆటోమేటిగ్గా కదిలాయి. అభిమన్యుతో కలిసి డాన్స్ చేయటానికి నా వేగాన్ని కాస్త తగ్గించు కోవలసి వచ్చింది.
నా మూవ్‌మెంట్స్‌లో ఈజ్ సంతోష్ గమనించాడు. అతనికి దర్శకుడిగా మొదటి సినిమా కావచ్చు కానీ, అసోసియేట్‌గా బానే అనుభవం ఉంది. కాబట్టే నా ప్రతిభని అంచనా వేయటానికి పది నిమిషాల కంటే ఎక్కువ తీసుకోలేదు.
‘మీరు కాసేపు బయట కూర్చుంటారా?’ అన్నాడతను.
భుజాలు ఎగరేసి బయటకు వచ్చాను నేను. ఇంత జరిగినా ఆ వేషం నాకిస్తారన్న నమ్మకం నాకు లేదు. వేషం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇంతవరకూ ఎవరి ప్రవర్తనా అభ్యంతరకరంగా కనిపించలేదు నాకు.
లోపల జరుగుతున్న సంభాషణ లీలగా వినిపిస్తోంది నాకు.
సంతోష్ అంటున్నాడు- ‘అదిరిపోయే నటి అని చెప్పలేం. కానీ.. ఫరవాలేదు. డైలాగ్ డెలివరీని మనం ఇంప్రూవ్ చెయ్యవచ్చు. ఇకపోతే తేలవలసింది ఇంకొకటి ఉంది. అభిమన్యుతో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి...’
ఇంతలో బయట కారు దిగి సుబ్బరాజు హడావిడిగా లోపలకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ నన్ను ఓరగా చూసుకుంటూ వెళ్లాడు. ‘ఏంటి డైరెక్టర్‌గారూ.. హీరోయిన్ దొరికినట్లేనా? బయట కూర్చున్న అమ్మాయేనా?’ ఉత్సాహంగా అడుగుతున్నాడు.
‘ఇంకా ఏమీ అనుకోలేదండీ! అభిమన్యుతో ఆ అమ్మాయి జంటగా ఎలా ఉంటుందో చూడాలి...’
‘అదెలా తెలుస్తుంది?’
‘ట్రయల్ షూట్ చేసి చూద్దాం!’ సలహా ఇచ్చాడు చంద్రం.
‘మళ్లీ అదేంటి?’ కుతూహలంగా అడిగాడు సుబ్బరాజు.
‘రెండు మూడు సీన్లు వీడియో కెమెరాతో షూట్ చేసి చూద్దాం. అంతా బాగుంటే అప్పుడు ప్రొసీడవుదాం..’ వివరించాడు సంతోష్.
‘సరే!... అదేదో చూడండి. నాకు మా ఊళ్లో పని పడింది. రెండు రోజుల్లో వెళ్లి వస్తాను. ఈలోపు ఈ పని పూర్తి చెయ్యండి. రాగానే షూటింగ్ మొదలెడదాం...’ అన్నాడు సుబ్బరాజు.
అభిమన్యు కూడా ఆ ప్రపోజల్‌కి ఒప్పుకున్నాడు.
అందరి అభిప్రాయం అదే అనుకున్న తరువాత నన్ను లోపలకు పిలిచారు. వాళ్ల ప్రపోజల్ చెప్పారు.
‘నాకేమీ అభ్యంతరం లేదు...’ చెప్పాను.
‘ఇంకొక విషయం. ఇది లోబడ్జెట్ సినిమా. రెమ్యూనరేషన్ పెద్దగా ఇవ్వలేం. ఏదో కొద్దిగా ఇస్తాం. సినిమా హిట్ అయి లాభాలు వస్తే మీ ప్రతిఫలం తప్పక ఇప్పిస్తాను...’ చెప్పాడు సంతోష్.
దానికి కూడా నేను అభ్యంతరం చెప్పకపోవడంతో మరుసటి రోజు ట్రయల్ షూట్ చేద్దామని నిర్ణయించుకున్నాం.
మరుసటి రోజు బొటానికల్ గార్డెన్‌లో ఒక సీన్ చిత్రీకరించారు. అది పూర్తి కావటానికి మధ్యాహ్నం అయింది.
సాయంత్రం ఆఫీసుకు తిరిగి వచ్చి, కెమెరాను టివికి ఎటాచ్ చేసి ‘రా’ ఫుటేజ్ చూడసాగారు.
‘ఎలా ఉందంటారు?’ అడిగాడు చంద్రం సంతోష్‌ని.
సంతోష్ నా వైపు చూసి చెప్పాడు. ‘మీ మొహంలో బిడియం ఎక్కువ కనిపిస్తోంది. ఫ్రీగా నటించాలంటే సహ నటుల మధ్య చనువు ఉండాలి. నటించేటప్పుడే కాదు, బయట కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవండి. అప్పుడు ఇంటిమసీ తెర మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది’
‘ఆ విషయం నాకు వదిలెయ్యండి. వసుంధరగారు మాతో ఎలా కలిసిపోతారో మీరే చూస్తారుగా...’ అని భరోసా ఇచ్చిన చంద్రం, ‘ఏమండీ వసుంధరగారూ! మరో రెండు మూడు రోజులు మాల్ నుండి సెలవు తీసుకోగలరుగా!..’ అన్నాడు.
‘అన్నీ అనుకున్నట్లు జరిగితే పూర్తిగా ఆ ఉద్యోగమే మానేయవలసి రావచ్చు. సెలవు పెట్టటానికి అభ్యంతరం ఏమి ఉంటుంది?’ నా తరఫున తనే చెప్పాడు అభిమన్యు.
నా ప్రమేయం లేకుండానే అన్ని నిర్ణయాలూ జరిగిపోతున్నాయి. ముఖ్యంగా అభిమన్యు నా విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నట్లు అనిపించింది. కానీ నేనున్న పొజిషన్‌లో ఎవరినైనా ఏమి అనగలను?
‘ముందు మీరు ఒకరిని ఒకరు ఏకవచనంలో సంబోధించుకోవటం మొదలు పెట్టండి. రేపటి నుండి కలిసి నటించవలసిన వారు ఒకరిని ఒకరు అంత గౌరవించుకో నవసరం లేదు..’ సలహా చెప్పాడు సంతోష్.
‘అయితే ఇక నుండి మిమ్మల్ని నేను ‘వసు’ అని పిలుస్తాను. మీరు కూడా నన్ను ‘అభి’ అని పిలవండి చాలు...’ అన్నాడు అభిమన్యు.

........... మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002