S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎవరీ పందిరి? (లోకాభిరామమ్)

కృష్ణమోహన్‌గారు, నేను, అప్పుడప్పుడు, నారాయణగూడ తాజ్‌మహల్ హోటేల్లో కలిసి భోజనం చేస్తూ, వీలయినంతసేపు మాట్లాడుకోవటం అలవాటు. అప్పుడప్పుడు ఆయన ఒక అనుకోని మిత్రుడిని కూడా పిలుస్తారు. కృష్ణమోహన్, నేను మంచి స్నేహితులం. అట్లని సమవయస్కులం మాత్రం కాదు. ఆయన కొడుకు ఇంచుమించు నా వయసు వాడు. ఒకనాడు ఆయనతోబాటు, ఇంచుమించు ఆయనంత వయసున్న పెద్ద మనిషి ఒకరు వచ్చారు. లాంఛనంగా పరిచయాలు జరిగినయి. వచ్చిన మిత్రులు మిరపకాయ బజ్జీ తినాలి, అన్నారు. కృష్ణమోహన్ తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నేనూ ఇంచుమించు అంతేగానీ, అతిథి కోసం మిరపకాయ బజ్జీ తింటాను అన్నాను. అదీ ఇదీ మాట్లాడుతున్నాము. బజ్జీలు వచ్చాయి. తింటుండగా నేను, ‘గుప్తగారూ, మీరు బ్యాంకర్ కదా!’ అన్నాను. ఆయన అంతగా ఏమి ఆశ్చర్యపోలేదు. ఆయన ఒకానొక పెద్ద బ్యాంకుకు చెయిర్మన్ మరి! ‘తాను మా నీస్ భర్త!’ అన్నారు కృష్ణమోహన్. ‘సీతారత్నంగారు లలిత సంగీతం బాగా పాడతారు’ అన్నాను నేను. ఈసారి ఇద్దరూ ఆశ్చర్యం దాచుకోలేక పోయారు. ‘అదీ! గోపాలం అంటే!’ అన్నట్టున్నారు కృష్ణమోహన్!
మరోసారి కృష్ణమోహన్ గారి అతిథిగా, పోలీసు శాఖలో అత్యున్నత అధికారి, తర్వాత రాజకీయ నాయకుడు అయిన విజయరామారావు వచ్చారు. ఆనాడు ఆయన ఇడ్లీలో రకాల గురించి వెయిటర్‌తో చర్చించిన తీరు నాకు ఇంకా గుర్తుంది. ఎంతయినా, పోలీసు అధికారి కదా! చివరికి చాలా మామూలు ఇడ్లీయే తిన్నట్టున్నారు ఆయన! కాంజీవరం ఇడ్లీ అని ఒకటి ఉంటుందని కూడా ఇక్కడ ఎవరికీ తెలియదేమో?
ఇంతకూ ఎవరీ కృష్ణమోహన్? ఒక్క మాటలో చెప్పాలంటే, మంచితనం, మైత్రి పాకడానికని వేసిన పందిరి ఆయన. వాళ్ల ఇంటి పేరు పందిరి వారు. పందిరి మల్లికార్జునరావు గారి కొడుకులలో కృష్ణమోహన్ ఒకరు. ఆయన అమెరికాలో దశాబ్దాలపాటు ‘్భరతీయ తత్వశాస్త్రం’ ప్రొఫెసర్‌గా పని చేశారు. అమెరికా వదిలేసి వచ్చేశారు. ఒక్కరే బంజారాహిల్స్‌లో ఉంటారు. ఆయనకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదు. ఆసుపత్రిలో ఉన్నారని తెలిసింది. ఆరోగ్యం మామూలయినా, ఆయన స్థూలకాయుడు, కీళ్లనొప్పులు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ చెప్పవలసిన అంశాలు కావు. ఆయన ఎక్కడయినా తిరుగుతూ కనపడితే, అని ఒక వాక్యం రాయాలనిపించింది. తిరగరు అని తోటి, మనసు చెరువయి ఇన్ని మాటలు చెప్పాను. ఆయన మరీ శుభ్రంగా కనిపించని లాల్చీ, పైజామాలతో ఎక్కడయినా కనపడితే, ఏ మామూలు కిరాణం వ్యాపారమో చేసుకునే చెట్టిగారు అనిపించక మానదు. కానీ, ఆయన ఒక సముద్రం. ఒక ఉన్నత శిఖరం! ఆయనతో నాకు దోస్తీ కుదిరింది అంటే, అదొక విచిత్రం!
నేను అప్పట్లో ఆంధ్ర మహిళా సభ వారి లిటరసీ హౌస్‌కు తరచు పోయేవాడిని. అప్పటి కార్యదర్శి సుబ్బరామన్ మరో పెద్ద వయసు మిత్రులు. అక్కడ రకరకాల కార్యక్రమాలలో నేను కలుగజేసుకున్నాను. ఏమీ లేదంటే మంచి మిత్రులంతా చేరి చర్చలు సాగించడం తప్పక కుదిరేది. అక్కడ ఒక చెట్టిగారు తరుచు రావడం కనిపించింది. కానీ, ఆయన మా కబుర్లలోకి ఎన్నడూ చేరలేదు. లేక దూరలేదు. ఒకానొకనాడు సుబ్బరామన్ పుట్టినరోజు అన్నారు. అమెరికా నుంచి వచ్చిన అబ్బాయి, వాళ్ల ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు. చెట్టిగారు కూడా ఆ రాత్రి భోజనానికి వచ్చారు. మమ్మల్ని పనిగట్టుకుని ఎవరూ పరిచయం చేసినట్టు గుర్తులేదు. మీడియా మనిషిగా, మరింత సులభంగా ఒప్పుకుంటే స్వతహాగానే నేను గోల మనిషిని. నేనే వెళ్లి ఆయనతో మాట కలిపాను. కృష్ణమోహన్ గారితో పరిచయం మొదలయింది.
‘మా నాన్నగారు మల్లికార్జునరావుగారు ఒకప్పుడు ‘కినె్నర’ అనే పత్రిక నడిపించారు. అది అప్పట్లో చాలా పేరు పొందిన సాహిత్య పత్రిక. పత్రిక చాలాకాలం నడవలేదు. వచ్చిన సంచికలలోని వ్యాసాలన్నింటినీ కొన్ని సంకలనాలుగా అచ్చు వేయించే పనిలో ఉన్నాను, అన్నారు కృష్ణమోహన్. నాకు, కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషం అయిందని బాహాటంగా ఒప్పుకుంటున్నాను. ఇక ఆయనతో ముచ్చటించడంతో మొదలయి మా దోస్తీ రానురాను పెరిగింది. సంకలనాల తయారీ విషయంగా నేను ఏ రకంగా సాయం చేశానో నాకు నిజంగా గుర్తు లేదు. కానీ, ఎనిమిది పుస్తకాలలోనూ ఎందరో పెద్దల సరసన, కృష్ణమోహన్ నాకూ చోటిచ్చారు. పుస్తకాలు అచ్చయి వచ్చాయి. మొదట్లో ఏడు సంకలనాలు మాత్రమే వచ్చాయి. కళాజ్యోతి ప్రెస్ దగ్గర కలవడం, ఆయన నాకు ఒక పుస్తకాల సెట్ అందించడం, నేను వాటిని తల మీద పెట్టుకోవడం ఏనాటికీ మరవజాలని సంఘటన. ఇంటికి వచ్చి చూస్తే, ప్రతి పుస్తకం మొదటి పేజీలోనూ పెద్ద అక్షరాలలో ‘సరస్వతీ పుత్రులు గోపాలంగారికి’ అని రాసి ఉంది. కింద కృష్ణమోహన్ సంతకం ఉంది. నాకు కళ్లు చెమర్చడం గాదు, ధారగా వర్షించాయి. అంత కొద్దికాలంలో ఆయనకు నా మీద ఎందుకంత అభిమానం కలిగింది? నాకు ఈనాటికీ అర్థంగాలేదు!
గాంధీ అహింస సిద్ధాంతం గురించి కృష్ణమోహన్ సిద్ధాంత వ్యాసం రాశారు. అది అచ్చయింది కూడా. కానీ, అంతగా ప్రచారంలోకి రాలేదు. అదే గదా ఆయన పద్ధతి. వారి తండ్రిగారు మల్లికార్జునరావు గురించి ఒక వ్యాసం రాస్తే అన్యాయం అవుతుంది. ఒక పుస్తకం రాయమని కృష్ణమోహన్ నన్ను అడిగారు. మాలతీ చందూర్‌గారు ఒక పుస్తకం రాశారు. కానీ అందులో ఆ మహామహుని గురించి సమగ్రంగా రాలేదు. ఎన్నార్ చందూర్‌గారు రాసిన ఒక వ్యాసం ప్రతి నా దగ్గర కూడా ఉంది. అదీ అసమగ్రంగానే ఉంది. మల్లికార్జునరావుగాను, ఆయన పత్రికలు సుభాషి, కినె్నల గురించి ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. కృష్ణమోహన్ అచ్చు వేయించిన సంకలనాలను అమ్మదలచుకోలేదన్నారు. సంస్థలకు, యోగ్యులయిన వ్యక్తులకు ఉచితంగా ఇద్దాము, అన్నారు. ఆ దిశగా చాలా ఆలోచనలే జరిగాయి. అమలు ఎంత జరిగిందీ తెలియదు. ఏమీ జరగనట్టే ఉంది.
కృష్ణమోహన్ శ్రీమతి, అబ్బాయి, అమ్మాయి అందరూ ఆయనలాగే గొప్పవాళ్లు. అందరూ ఆయనలాగే మరొకరు పట్టకుండా ఎవరిచోట వారు, తమకు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు. ఇంతగా చెపుతున్నాను. నేను ఎన్నడూ కృష్ణమోహన్ ఇంటికి పోలేదు. ఆయన మా ఇంటికి రాలేదు. మా బాబు పెళ్లి రిసెప్షన్‌కు మాత్రం ఊరి ఒక చివరి నుంచి, మరో చివరికి ఆయన శ్రమ అనకుండా వచ్చారు. మేము తాజ్‌మహల్ హోటేల్లో కలిసి కూడా చాలా కాలమయింది. మా తీరు గురించి అక్కడి వెయిటర్లకు కూడా అర్థమయినట్లు కనిపించేది!
బతుకు గురించి కృష్ణమోహన్ నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. నేనూ ఆయనలాంటి మనిషినే. అందరూ చెప్పింది వింటాము. మా పద్ధతిలో బతుకుతాము. తండ్రి కారణంగా కొంత తన మంచితనంవల్ల కొంత, కృష్ణమోహన్‌కు గొప్పవాళ్లంతా మిత్రులు! అందులో నేనూ ఒకడినిగా ఉన్నాను. కానీ, నేను గొప్పవాడిని మాత్రం కాదు. గొప్పదనమంతా ఆయనదే. ఆరోగ్య కారణంగా ఇంక విమానం ఎక్కడం కుదిరేట్లు లేదు. ఇక్కడే ఉండిపోవాలేమో అన్నారాయన. తాజ్‌మహల్ హోటేల్ పక్కన ఫ్లాట్స్ కడుతున్నారంటే, మనం ఒకటి కొనేద్దాము, సులభంగా ఉంటుంది, అన్నారు ఒకసారి. కినె్నర పత్రిక కవర్‌పేజీల కొరకు వేయించిన పెయింటింగ్‌లన్నీ ఉన్నాయి, అవి మీకు ఇవ్వాలిమరి, అని కూడా అన్నారు. మేం ఇద్దరం కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. చేసి తీరతాము!

- కె.బి. గోపాలం