S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుస్వర సంగీత నిధి.. సుమధుర గాన వినోది (అమృతవర్షణి)

నూజివీడులో ఫణిభొట్ల సుబ్రహ్మణ్య శాస్ర్తీ అనే ఓ వైణికుడుండేవాడు.
పది మంది సంగీత రసజ్ఞులను చేరదీసి ఒక చిన్న సంగీత సభ ప్రారంభించి నిర్వహిస్తూ విజయవాడలో సంగీత సభలకొచ్చే పెద్ద విద్వాంసులతో ముందే మాట్లాడుకొని, సంగీత కచేరీలు వారి గ్రామంలో ఏర్పాటు చేస్తూ, ఊళ్లో వున్న వారికి సంగీతాభిరుచి కలిగించే ప్రయత్నం చేస్తూండేవాడు. ఇంటింటికీ తిరిగేవాడు.
నిజంగా సంగీతం వినాలనుకునే వారు క్రమం తప్పక వచ్చేవారు. మిగిలిన వారు ఆయనతో వున్న మొహమాటం కొద్దీ కచేరీలకు హాజరౌతూ, కాసేపుండి వెళ్లిపోతూండేవారు.
ఒకప్పుడు నూజివీడు వీణల తయారీకి పెట్టింది పేరు. అక్కడ సంగీతాన్ని కూడా అలా వ్యాపింపచేయాలనేది ఆయన సంకల్పం.
ఓసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు ఆయనలోని సంగీతాభిరుచిని గమనించి ఒక సంగీత సభను, అక్కడ స్థానికుల సమక్షంలోనే ఏర్పాటు చేశారు. దక్షిణాదిలో పేరున్న ఒక విద్వాంసురాల్ని పిలిచారు. ఆమె పేరు రీటా రాజన్. కచేరీ అద్భుతంగా జరిగింది. ఆమెతో ఆమె భర్త కూడా వచ్చారు. మద్రాసు తిరుగు ప్రయాణం టికెట్టు ఖాయమవ్వలేదు. అత్యవసర కోటాలో ప్రయత్నం చేయమని వోలేటివారు రాజన్‌తో నన్ను డివిజనల్ ఆఫీసుకు పంపారు.
తెలిసిన వారిని ప్రాధేయపడి అడిగితే టిక్కెట్లు ఖాయమయ్యాయి. దానికి నాతో కూడా వున్న రాజన్ ఎంతో స్థిమితపడి అడిగాడు.
‘వోలేటి గారితో ఎన్నాళ్లుగా మీకు పరిచయం? ఏయే కీర్తనలు నేర్చుకున్నారు?’ అనడగటం మొదలెట్టాడు. ‘సంగీతమంటే ఇష్టమేమో’ అనుకున్నాను మనసులో.
‘దర్బారు రాగంలో నారద గురుస్వామి’ అనే కీర్తన నేర్చుకుంటున్నానని చెప్పానంతే. ‘ఓహో! చాలా అద్భుతమైన కీర్తనండీ’ అని వెంటనే ఆ కీర్తన పాడేశాడు. ఆశ్చర్యపోయాను. ‘మీరింత బాగా పాడతారని తెలియదే? చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు?’ అన్నాను.
‘మా ఆవిడే నా గురువు’ అని ఎంతో సగర్వంగా చెప్పేసరికి నిర్ఘాంతపోయాను.
దక్షిణాదిలో సంగీతం పెరగటానికి కారణాలు ఎవరినీ అడగనక్కరలేదు. ఈ ఉదాహరణ చాలు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడైన రామ్నాడ్ కృష్ణన్ శిష్యురాలే ఆ రీటా రాజన్.
‘రామ్నాడ్ కృష్ణన్ గురువుగా లభించటం నా సుకృతం. శ్రుతి శుద్ధమైన గానం ఒకటే కాదు. సుస్వరంతో నిండిన నిండైన గాత్రం ఆయనది. ‘గుంపులో గోవిందా’ మాదిరిగా కాదు. శిష్యులందరినీ కలిపి కూర్చోబెట్టి బృందగానంలా పాడించటం కాదు. విడివిడిగా కీర్తనలు నేర్పుతూ ప్రతి కీర్తనలోని విశేషాన్ని ఓపికతో విపులీకరించి చెప్పే ఆయన సంగీత శిక్షణ నాకో పెద్ద వరం.’ అన్నారు రీటా రాజన్.
విద్వాంసులందరూ అధ్యాపకులు కాదు. అధ్యాపకులంతా విద్వాంసులు కానవసరం లేదు. నాద విద్యా మర్మాలు తెలిసిన గురువులే నిజమైన సంగీత సద్గురువులు. అటువంటి వారు అరుదుగా వుంటారు.
కర్ణాటక సంగీత రంగంలో తనదైన ఒక శైలిని సొంతం చేసుకున్న రామనాథపురం కృష్ణన్ ‘తక్కువ కాలమే జీవించి పాడవలసినదంతా పాడేసి వెళ్లిన గాన గంధర్వుడు. లయ బ్రహ్మ’ అని సంగీతజ్ఞులనుకునే మాట.
కర్ణాటక సంగీతంలో అప్పటికప్పుడు సృష్టించే అంశాలు మూడు. అందులో ఒకటి రాగాలాపన. మాటలను నెఱవు చేసి పాడటం, స్వరాలను అల్లుకుంటూ రాగభావంతో పాడగలగటం. యివన్నీ కేవలం విద్వాంసుడి ప్రతిభను చాటేవే.
ఈ మూడు అంశాలపై పూర్తిగా నియంత్రణ కలిగి రక్తిగా పాడే విద్వాంసులు అరుదుగా ఉంటారు.
చక్కని మనోధర్మంతో, సుస్వరంతో మాటలను నాదమయం చేస్తూ, రసికులను ఆనందపరచగలిగే కృష్ణన్ లాంటి విద్వాంసులు చాలా అరుదుగా ఉంటారు.
‘నేను మనోధర్మంతో పాడవలసినప్పుడు ఆయన గానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూంటాను. ఆయనే నాకు స్ఫూర్తి’ అంటారు ప్రఖ్యాత సినీ, గజల్ గాయక చక్రవర్తి హరిహరన్.
హరిహరన్ తల్లి మంచి గాయని. బృంద ముక్త సంగీత సంప్రదాయానికి చెందిన విద్వాంసురాలు.
పరమేశ్వరుడు ఈ లోకంలోని ప్రాణులకు అనుగ్రహించిన వెల కట్టలేని వస్తువు నాదం.
బ్రహ్మానంద స్వరూపాన్ని కొంతవరకూ చూపించగల వస్తువేదైనా వుందంటే, అది ఒక్క నాదమే. సంగీతమంటే రుచి లేని వారెవ్వరూ వుండరు. ఆబాల గోపాలాన్నీ వశం చేసుకోగల నాదవిద్య సంగీత విద్య. చెప్పాలంటే, ఇది మన జాతి సంస్కృతిలో ఒక ప్రధాన భాగం. తెచ్చుకోవలసిన బయట వస్తువు కాదు. విడవలేని లోపలి గుణం.
ఒకప్పుడు ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో విధిగా సంగీతం వినేవారు.
చిత్రలేఖనం, కవిత్వం, శిల్ప చాతుర్యం మొదలైన వాటిని ఆశ్రయించుకున్న వారి దారి వేరు.
వారు తృప్తిపడే వరకూ ఆ విద్యలో ఉత్తమ స్థితికి వెళ్లేవరకూ ఆలోచించగల అవకాశం ఎక్కువగా ఉంటుంది. భావ ప్రభావం తగ్గి, దేహశక్తి లేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు. తాను చేసిన కళాఖండాలు తానే వెళ్లి ప్రదర్శించనక్కరలేదు. సర్వాంగ సుందరంగా ఒక వస్తువును తయారుచేసేవరకూ ఒకరికి చూపించవలసిన అవసరమూ వుండదు. అంతేకాదు నిర్బంధంగా తానే తిరగనక్కర్లేదు.
సంగీతం అలా కాదు. అప్పటికప్పుడు చూపించి మెప్పు పొందవలసిన గారడీ విద్య. ఆ క్షణంలో రాగాన్ని సృష్టించాలి. అప్పటికప్పుడు స్వరం పాడాలి. అదివరకే వల్లించుకున్న వర్ణాలు, కీర్తనలు, మొదలైనవన్నీ ముడి వస్తువులే.
అపూర్వమైన రస భావాలు సృష్టించడంలో నేర్పున్న గాయకులే గుర్తించబడి గౌరవింపబడుతూంటారు.
సంగీతం అంటే ఇష్టపడే వారందరికీ అన్నీ బుర్రకెక్కవు. సహృదయమనే మాటకు రెండర్థాలు. ఒకటి, స‘హృదయముండటం’, రెండోది పాటలో వనె్న, వాసన, నాదం మొదలైన వస్తు గుణాలను అర్థం చేసుకుంటూ ఆనందించగల సహృదయత కలిగి ఉండటం. సాధారణంగా ఈ లక్షణాలు అందరికీ వుండవు. కొందరే నాదానుభూతిలోని సౌఖ్యాన్ని వాంఛిస్తారు. దేనికైనా రంగు, రుచి, వాసన, అన్నీ ఒకటే. కానీ నలుపు కంటే ‘నీలి వనె్న బాగుంటుందనీ, ఉల్లి కంటే ‘మల్లె’ వాసన యోగ్యమనీ, కాంచనం కంటే కంచు నాదం శ్రావ్యంగా ఉంటుందని తెలిస్తే అది మంచి సంస్కారానికి లక్షణం.
గాయకుడిలా శ్రోతలు పాడలేకపోయినా, పాటలోని రస భావాలను అర్థం చేసుకోగలిగితే చాలు. ఇద్దరూ ధన్యులే. యిదే సహృదయమనే శబ్దానికి అర్థం. దీనే్న మన పెద్దవాళ్లు ‘వాసనా పరిపక్వ బుద్ధి’ అని పేరు పెట్టారు.
కొన్ని దశాబ్దాల క్రితం మద్రాసులో సంగీత రసికుడైన ఒక చెట్టియారు తన కూతురు చెవులు కుట్టించే సందర్భంలో ఆ రోజుల్లోనే వేలాది రూపాయలు ఖర్చు చేసి సంగీత కచేరీలు ఏర్పాటు చేసి, వింటూ పరవశించిపోయేవాడని మా గురువుగారోసారి చెప్పారు.
మన వాళ్లు దీన్ని ‘పిచ్చి’ అంటారు గానీ నిజానికి లలిత కళలన్నీ ఈ పిచ్చి కారణంగానే అభివృద్ధి చెందాయనేది నిజం. ఈ పిచ్చియే కవి సార్వభౌముడైన శ్రీనాథుడికి ముత్యాల పందిట్లో కనకాభిషేకం చేయించింది. ఈ పిచ్చియే హర్షవర్థనుణ్ణి బాణుడు లాంటి మహాకవులను ప్రోత్సహించేలా చేసింది. లేకపోతే అష్టదిగ్గజాలెక్కడ? వారి మహా కావ్యాలెక్కడ? పిచ్చికి ఆ వైభవం ఒక పరాకాష్ట. పాశ్చాత్య దేశాల్లో చిత్రకారులు, శిల్పులూ, కవులు, గాయకుల పేరున స్మారక మందిరాలు ఏర్పాటు చేసేలా చేయించింది కూడా ఇదే పిచ్చి.
మీకు తెలుసు. మహామహులైన చిత్రకారుల చిత్రాలు ఎంతెంత ఖరీదు పెట్టి కొంటారో. దీన్ని ‘పిచ్చి’ అనుకుంటాం. కానే కాదు. ప్రపంచంలోని 7 వింతల్లో మన తాజ్‌మహల్ నిర్మాణం ఒకటి.
ఎన్నో కోట్లు ఖర్చు చేసి, వేలాది కూలీల చేత ఓ ‘గోరీ’ (సమాధి)ని కట్టించిన షాజహాన్ చక్రవర్తిది. అనురాగంతో నిండిన పిచ్చి కాకపోతే, ఆయన్ని తలుచుకుంటామా? అలాగే మనిషికి పాట మీద అనురక్తీ, వినాలనే ఆశ, రెండూ సహజంగానే పుట్టే లక్షణాలు. సంగీతానికి జీవభాష, తెలుగు. ఇళ్లల్లో ఏ భాష మాట్లాడుకున్నా సంగీతానికొచ్చేసరికి దాక్షిణాత్యులంతా ఆంధ్రులే.
దక్షిణాది విద్వాంసుల సంగీతానికీ తెలుగు భాషకూ వున్న ఈ దగ్గర సంబంధమే వారి పట్ల గౌరవాన్ని పెంచి పెద్దది చేసింది. త్యాగరాజు తెలుగు వాడే కానీ ఆయనను పెంచి పెద్ద చేసినవి కృష్ణా గోదావరులు కావు. కావేరీ నీరు. ఆహార విహారాలతో ఏర్పడే సంస్కారాలు వేరుగా వుంటాయి. దీనికి మరో ఉదాహరణ మన నారాయణ తీర్థులు, క్షేత్రయ్య.
తెలుగుగడ్డ మీద పుట్టిన క్షేత్రయ్య కూడా వెళ్లి అక్కడే తిరిగాడు. ఆ నీళ్లే తాగాడు. శ్యామశాస్ర్తీ సాక్షాత్తూ కంచి కామాక్షమ్మకు దత్తు. ఆయన్ని ఆస్థానానికి పిలిపించుకుని ఆయన పాట విన్న వారు మలయాళం వారు, మైసూరు వారూను.
దక్షిణాదిలో పుట్టి పెరిగి, త్యాగయ్యను తమ వాడిగా చేసుకుని ఆయన కీర్తనలు కడుపునిండా పాడుకుంటూ ఓ మంచి సంప్రదాయాన్ని నిలబెట్టిన విద్వాంసులూ, వారి గానం ఎవరికి ఆదర్శమైందో చెప్పేందుకే, ఈ ఉపోద్ఘాతం.
ఒకప్పుడు జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, అలత్తూర్ సోదరులు.. వంటి మహా విద్వాంసులు తమ అనితరసాధ్యమైన గానంతో రసిక జన హృదయాలను ఆనంద పరవశులను చేస్తూ, అంతర్జాతీయంగా సంప్రదాయ సంగీత స్థాయిని పెంచారు. ఎందరో శిష్యుల్ని తయారుచేశారు. అటువంటి వారిలో ముఖ్యుడు రామ్నాడ్ కృష్ణన్. ప్రముఖ వాగ్గేయకారుడైన ముత్తయ్య భాగవతార్ శిష్యుడైన సి.ఎస్.శంకరశివం శిష్యరికంలో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని సొంతం చేసుకున్న కృష్ణన్ విద్వాంసులకే విద్వాంసుడై పేరు తెచ్చుకోవడానికి పెద్ద చరిత్రే ఉంది.
సోదరులు రాఘవన్, ఈశ్వరన్‌లు వయొలిన్, మృదంగాలలో నిష్ణాతులై కృష్ణన్ పాటకు సహకారమందిస్తూండేవారు.
‘సంగీతం’ సంగీతం కోసమే అని భావించే విద్వాంసులలో నిజాయితీ కనిపిస్తుంది. నిర్దుష్టమైన సాధనా బలం కనిపిస్తుందనటానికి సాక్ష్యం రామ్నాడ్ కృష్ణన్.
మనస్సు అంతర్ముఖమైనప్పుడే శుద్ధమైన నాదానుభూతికి మార్గం దొరుకుతుంది.
త్యాగయ్య చెప్పినట్లు ‘వేకువ జామున వెలయుచు తంబుర చేకొని, శుద్ధమైన మనస్సుతో సుస్వర లోలుడైన గాయకుడి ఆనందాన్ని అనుభూతుల్ని మాటల్లో వర్ణించలేం.
అలాటి శ్రుతిశుద్ధమైన గానానికి చిక్కనైన సంప్రదాయ సంగీతానికి సాక్షి కృష్ణన్ గానం.
కొందరు విద్వాంసుల వల్ల కొన్ని కీర్తనలు, కొన్ని కీర్తనల వల్ల విద్వాంసులు ప్రసిద్ధవౌతారు. శహన, కీరవాణి, కన్నడ, బేగడ, మాయామాళవ గౌళ వంటి రాగాలను గానం చేయటంలో రామ్నాడ్ కృష్ణన్‌ను ప్రముఖంగా చెప్తారు. క్షీర సాగర శయన, నగుమోము గనలేని, నను పాలింప నడిచి వచ్చితివో, ఎవరని నిర్ణయించితిరా.. వంటి త్యాగరాజ కీర్తనలన్నీ లోకవిదితమవ్వటానికి ప్రధాన కారణం ఆ కీర్తనలు గ్రామఫోన్ రికార్డులుగా ప్రచారం చేయటంవల్ల ప్రఖ్యాత విద్వాంసులు పాడి, కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధమైన శంకరాభరణం, తోడి, కాంభోజి, కల్యాణి, కీరవాణి, ఖరహరప్రియ, భైరవి వంటి ప్రధానమైన రాగాలను అనుష్టానం చేసి సాధనతో స్వాధీనం చేసుకున్న విద్వాంసులున్నారు. కొందరికి కొన్ని రాగాలు స్వంతమై పోయాయి. కొన్ని రాగాలు ఆరోహణ, అవరోహణకే పరిమితమై విస్తృతంగా పాడే అవకాశాన్నివ్వవు. కొన్ని రాగాలు కొందరికి పూర్తిగా వశమై పోయి, ఆ రాగం ఆ విద్వాంసుడు మాత్రమే పాడాలనేలా ఉంటాయి. కొన్ని రాగాలు పాడటంలో రామ్నాడ్ కృష్ణన్ అటువంటి ప్రసిద్ధుడు. ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు, నాదస్వర చక్రవర్తిగా సంగీత లోకానికి తెలిసిన టి.ఎన్.రాజరత్నం పిళ్లై, తోడి రాగాన్ని ఈనాటికీ ‘నభూతో న భవిష్యతి’ అని భావిస్తారు.
తోడి రాగాన్ని ఓ రికార్డులో ఆయన 7 నిమిషాల సేపు, వినిపించిన సంగతి మళ్లీ వినిపించకుండా అపారమైన మనోధర్మంతో వాయించి రికార్డు సృష్టించాడు.
రాజరత్నం పిళ్లైలా ఈనాటికీ ఆ తోడి రాగాన్ని అంత పరిపూర్ణంగా, అపూర్వంగా పాడిన గాత్ర విద్వాంసులు గానీ, వాద్య విద్వాంసులు గానీ లేరంటే అతిశయోక్తి కాదు. విద్వాంసులకూ, విద్యార్థులకూ ఆయన తోడి రాగం ఆదర్శంగానూ, పరిశోధనాంశంగానూ నిలిచిపోయింది. అఖండ మనోధర్మానికి ప్రతీకగా చెప్పుకునే వీణ విద్యాధరి వీణ ధనమ్మాళ్ వీణా వాద్య ప్రభావం రామ్నాడ్ కృష్ణన్‌పై వుండటంతో ఆయన పాటకు వనె్న హెచ్చిందంటారు. ఆ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న కృష్ణన్, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. దక్షిణాదిలో ధనమ్మాళ్ సంగీతానికి ఓ ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవిస్తారు.
ధనమ్మాళ్ మనవరాళ్లైన, బృంద, ముక్తలతో ఏర్పడిన సంగీతానుబంధం కృష్ణన్ గానానికి సొగసునిచ్చింది. విద్వాంసులకే విద్వాంసునిగా నిలిపింది. పూర్ణ షడ్జం, బేగడ, కన్నడ వంటి క్లిష్టమైన రాగాలు పాడటంలో ఆయన చూపే ప్రజ్ఞ అనన్య సామాన్యం, అసాధారణమని సంగీతజ్ఞులు భావిస్తారు. దీనికి ప్రధాన కారణం ఒక్క సాధన మాత్రమే కాదు - ఆయనకు లభించిన సంగీత వాతావరణమే.
1967 సంవత్సరంలో కృష్ణన్ అమెరికాలోని వెస్లియన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొన్నాళ్లుండి అక్కడ కొంతమంది సంగీత విద్యార్థులను తయారుచేసి భారతదేశానికి వచ్చేశారు.
సంగీత విలువలను గ్రహించగలిగే రసజ్ఞులు మెచ్చేలా పాడాలని నిరంతరం భావించే రామ్నాడ్ కృష్ణన్ గానం ఈ వేళ ఎందరో విద్వాంసులకూ సంగీత విద్యార్థులకూ ఆదర్శప్రాయమై నిలిచిందనటంలో సందేహం లేదు.
సునాదం నిండిన గాత్రం, శుద్ధమైన సంప్రదాయం, భావంతో కూడిన పాట, రామ్నాడ్ కృష్ణన్ స్థాయిని పెంచాయి.
ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు లాల్‌గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, టి.చౌడయ్య, టి.వీరరాఘవన్, ఉమయాల్పురం శివరామన్, ప్రొఫెసర్ టి.శంకరన్, పాల్ఘాట్ మణిఅయ్యర్, పళని సుబ్రహ్మణ్య పిళ్లై లాంటి విద్వాంసులెందరో రామ్నాడ్ కృష్ణన్‌కు సహకరించగా జరిగిన సంగీత కచేరీలు సంగీత రసికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
*
(ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ‘రామనాథపురం కృష్ణన్’ శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

- మల్లాది సూరిబాబు 9052765490