S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలమైన ఎలిబీ

జార్జ్ తన పథకాన్ని అమలుచేసేది ఆ శుక్రవారమే.
అతని భార్య మెడ్జ్ అందం పెళ్లైన కొత్తల్లో కంటే సగం తగ్గింది. మెడ్జ్ మళ్లీ తాగడం మొదలుపెట్టింది. అతను ఇంటికి వెళ్లేసరికి జిన్, టానిక్ కలిపి తాగుతూ కనిపించింది. ఆ రాత్రే తను ఆమెని చంపబోతున్నాడు కాబట్టి ఆమెతో పోట్లాడదలచుకోలేదు.

‘ఈ శుక్రవారం కూడా నువ్వు బయటకి వెళ్తున్నావనుకుంటాను?’ మెడ్జ్ ప్రశ్నించింది.
‘అవును’
ఆమె అతని కంటే కొన్ని సంవత్సరాలు పెద్దది. వారి మధ్య ప్రేమ, పెళ్లి వేగంగా జరిగిపోయాయి. ఆమె పేర లక్ష డాలర్ల షేర్లు, బాండ్‌లు ఉండటంతో నలభై మూడేళ్ల మెడ్జ్ తనకి ముప్పై నాలుగు అని చెప్పినా నమ్మినట్లు నటించి పెళ్లి చేసుకున్నాడు. గత ఐదేళ్లలో జార్జ్ ఆమె డబుబని పెట్టుబడిగా పెట్టి దాన్ని రెండున్నర లక్షల డాలర్లకి పెంచాడు. ఈ ఐదేళ్లలో మెడ్జ్ బ్యూటీపార్లర్లకి వెళ్లడం తగ్గించి, సన్నపడే ప్రయత్నాన్ని విరమించుకుంది. దాంతో ఆమె అసలు వయసు బయటపడింది. నలభైలలో ఉన్నా ఏభైలలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆమెలో బద్దకం పెరగడంతో ఆమె ఎర్ర జుట్టు మొదట్లోని తెలుపు భాగం పావు అంగుళం దాకా కనిపిస్తోంది. మెడ్జ్ మొహంలో ముడతలు కూడా మొదలయ్యాయి.
‘నీ అందం గురించి శ్రద్ధ తీసుకోవచ్చుగా?’ జార్జ్ సూచించాడు.
‘నువ్వు నన్ను కాదు. నా డబ్బుని పెళ్లి చేసుకుంది’ ఆమె బదులుగా అరిచింది.
‘డబ్బు గురించి నాకో సత్యం తెలుసు. దానికి వయసు లేదు. ముడతలు పడ్డ ఏభై డాలర్ల నోట్ కూడా సరికొత్త నోటు విలువతో సమానం. నేను నిన్ను నీ డబ్బుని చూసి పెళ్లి చేసుకుని ఉంటే దాన్ని ఈ ఐదేళ్లల్లో ఐదింతలు చేసేవాడ్ని కాను. ఈ ఇంటి ఖరీదే సామానుతో కలిపి లక్ష డాలర్లు చేస్తుంది.’
‘నాకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన చేయకు. ఈ రాష్ట్ర కమ్యూనిటీ చట్టాల ప్రకారం మన ఆస్థిలో సగ భాగం నాకు వస్తుందని గుర్తుంచుకో’ మెడ్జ్ తాగిన మత్తులో అరిచింది.
‘తాగావు కాబట్టి ఇక నిద్రపో. నా కోసం వేచి ఉండద్దు’ అతను బయటకి వెళ్తూ చెప్పాడు.
బదులుగా ఆమె అరిచిన అరుపు తలుపు మూయడంతో అతనికి సరిగ్గా వినపడలేదు. అతను మూడు కార్లు పట్టే గేరేజ్‌లోని పాతికవేల డాలర్ల ఖరీదు చేసే కారెక్కి బయలుదేరాడు. తమ పెళ్లైన రెండో ఏటే దాన్ని అతను కొన్నాడు.
తను కష్టపడి సంపాదించింది మెడ్జ్‌తో పంచుకోలేదు. అందువల్ల విడాకులు ఇవ్వలేడు. అలా అని ఆమెతో కలిసి జీవించలేడు. దాంతో జార్జ్ రెండో మార్గమైన హత్యని ఎన్నుకున్నాడు. ఓ లాయర్ మిత్రుడ్ని సంప్రదిస్తే నిజానికి సగం ఆస్థి కంటే ఎక్కువే మెడ్జ్‌కి చెందచ్చని చెప్పాడు.
హంతకుడ్ని రక్షించేది ఎలిబీనే. దాని గురించి ఆలోచిస్తే ఆ సమయంలో ఆరేడు మందితో పేకాట ఆడటం ఉత్తమమని అనిపించింది. తను చదివిన ఓ కథలో హంతకుడు పేకాట బల్ల ముందు నించి లేచి వెళ్లి పది నిమిషాల్లో హత్య చేసి తిరిగి వస్తాడు. రాత్రంతా ఆడిన ఆటలో ఆ పది నిమిషాలు అతను వెళ్లడం ఎవరికీ గుర్తుండదు. జార్జ్ ఆ పథకానే్న అమలు చేయాలని అనుకున్నాడు. ఆ కథలో హంతకుడు కార్లో తిరిగి వస్తూ స్టాప్ సైన్ దగ్గర కారుని ఆపకపోవడంతో పోలీస్ చలాన్ ఇస్తాడు. అదే అతన్ని ఎలక్ట్రిక్ చెయిర్‌కి పంపుతుంది.
జార్జ్‌కి మొదటి నించి పేకాటలో ఆసక్తి లేదు. థర్డ్ స్ట్రీట్‌లోని ఓ క్షవర శాల వెనక గదిలో అక్రమంగా పేకాట సాగుతుందని జార్జ్ విన్నాడు. అలాగే స్వాంకీ హేంబర్గర్ అనే రెస్ట్‌రెంట్ వెనక గదిలో కూడా. అక్కడ ఆడేవాళ్లు తనకి ఎలిబీ ఇవ్వరు. తనతో పేకాట ఆడామని ఎవరూ పోలీసుల ముందు ఒప్పుకోరు. కొన్ని క్లబ్బుల్లో కనీసం రెండు వేల డాలర్లకి చిప్స్ కొంటే కాని పేకాటకి అర్హత ఉండదు. దాంతో ఓ సరస్సు ఒడ్డున కేబిన్‌ని అద్దెకి తీసుకున్నాడు. తన ఆరుగురు మిత్రులతో ప్రతీ శుక్రవారం రాత్రంతా పేకాట ఆడాక శనివారం ఉదయం కొద్దిసేపు పడుకుని లేచి సమీపంలోని సరస్సులో చేపలు పడతాడు.
మార్విన్, టామ్, హేరీ, పీటర్, డాన్, అల్ ఆ రాత్రి పేకాటకి వచ్చారు. గత నాలుగు నెలలుగా ఎలిబీ కోసం జార్జ్ ప్రతీ శుక్రవారం వాళ్లతో పేకాట ఆడుతున్నాడు. గత మూడు శుక్రవారాలు పేకాట మధ్యలో లేచి తన ఇంటి దాకా వెళ్లి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో గమనించాడు. ఎనిమిది నిమిషాలు. ఇంట్లో రెండు నిమిషాలు ఉంటే పది నిమిషాలు మాత్రమే తను వారి మధ్య నించి మాయం అవుతాడు. ఆట మజాలో ఉన్న వారికి అతను ఏమయ్యాడా అనే ప్రశ్న రాలేదు.
ఆ శుక్రవారం రాత్రి తొమ్మిదికి మెడ్జ్ పడుకుంటుందని జార్జ్‌కి తెలుసు. ఆ రాత్రి గార్డన్, పాల్ కూడా ఆటకి వచ్చారు. ఎనభై డాలర్లు గెలుచుకున్నాక ఆట మధ్యలో జార్జ్ నిర్లక్ష్యంగా ఆడసాగాడు. అంతకంటే ఎక్కువ గెలుచుకుంటే మిత్రులకి కోపం వస్తుంది. లేచి బయటకి వచ్చి దూరంగా పార్క్ చేసిన కారెక్కి ఎప్పటిలా దాన్ని సూపర్ మార్కెట్ పార్కింగ్ లాట్‌లో పార్క్ చేశాడు. అక్కడ ఇంకా చాలా కార్లున్నాయి. కారు దిగి పేవ్‌మెంట్ మీద నడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు. తాళం చెవితో ఇంటి తలుపు తెరచుకుని లోపలకి వెళ్లాడు. దారిలో అతనికి కార్లు కాని, పాదచారులు కాని తారసపడలేదు.
అర్ధరాత్రి పనె్నండు దాటాక బయట ఎవరూ ఉండరని అతనికి తెలుసు. బాగా తాగిన మెడ్జ్ పడక గదిలో గాఢ నిద్రలో ఉంది. జార్జ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా అందమైన యువతి కోసం తయారుచేసిన, పసుపుపచ్చ నైట్ గౌన్‌లో ఉన్న మెడ్జ్‌ని నిర్దయగా తన రివాల్వర్‌తో కాల్చాడు. తర్వాత రివాల్వర్‌ని జేబులో ఉంచుకుని ఆమె ఒంటి మీది దుప్పటిని తొలగించి ఆమె కుడి కాలుని నేల మీద ఉంచాడు. ఆ భంగిమ వల్ల అలికిడి విని ఆమె మంచం దిగబోతోందని పోలీసులు అనుకుంటారు. ఆమె వేళ్లకి ఉన్న వజ్రాల ఉంగరాలని, డ్రసర్ మీది పెట్టెలోని ఆభరణాలని, మరి కొన్ని విలువైన వస్తువులని జేబులో ఉంచుకుని బయటకి నడిచాడు.
అతను పూర్తిగా నీడల్లో నడుస్తూ కారు దగ్గరికి చేరుకున్నాడు. ఒకటి, రెండిళ్లల్లోని లైట్లు వెలిగాయి. రివాల్వర్ శబ్దానికి వాళ్లు లేచారని అనుకున్నాడు. కారెక్కి కొద్ది దూరం వెళ్లాక దొంగిలించిన వాటిని రోడ్ మీద ఉన్న డ్రైనేజ్ జల్లెడలోంచి కిందకి పడేశాడు. తర్వాత గ్లవ్స్‌ని కూడా.
తను పట్టబడకుండా కారు దగ్గరికి క్షేమంగా రావడం అదృష్టం. రివాల్వర్ చప్పుడు విన్న వారిలో ఎవరైనా తనింట్లోకి రావచ్చు. లేదా అదే సమయంలో పాదచారులు వెళ్తూండచ్చు. ఇలాంటి డజను అవాంతరాలని ఊహించాడు కాని ఏ ఒక్కటీ జరగలేదు.
జార్జ్ కారుని మళ్లీ సరస్సు దగ్గర పార్క్ చేశాక వాచ్ చూసుకుంటే అర నిమిషం ముందే వచ్చాడు. కేబిన్‌లోకి నడిచాడు. ఆట మజాగా సాగుతూండటంతో ఎవరూ అతన్ని ఎక్కడికి వెళ్లావని అడగలేదు. మళ్లీ ఆటలో పాల్గొన్నాడు.
గంటలు నెమ్మదిగా గడిచాయి. ఒద్దనుకున్నా అతనికి మెడ్జ్ రూపమే గుర్తొస్తోంది. ఆశ్చర్యంగా అతను తర్వాతి ఆటల్లో గెలుస్తూనే ఉన్నాడు. అందుకు కారణం మెడ్జ్ చావు అని స్ఫురించింది. ఇంటికి వెళ్లాక శవాన్ని చూడటం, పోలీసులకి ఫోన్ చేయడం, వారి ప్రశ్నలకి అనుమానం కలగకుండా సమాధానం ఇవ్వడం మిగిలి ఉన్నాయని అతనికి తెలుసు.
తెల్లారుఝామున నాలుగుకి మార్విన్, పీటర్, అల్ మాత్రమే మిగిలారు.
‘ఇంక నేను ఆపేస్తాను’ నాలుగున్నరకి జార్జ్ చెప్పాడు.
‘ఇంకొంచెంసేపు ఆడదాం. నా దగ్గర చాలా చిప్స్ ఉన్నాయి’ పీటర్ కోరాడు.
అల్ మాత్రం వెళ్లిపోయాడు. ఐదున్నర దాకా జార్జ్ ఆటని కొనసాగించాక ముగ్గురూ కాఫీ కలుపుకుని తాగారు.
‘నాతో మా ఇంటికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేయచ్చుగా?’ జార్జ్ మార్విన్‌ని ఆహ్వానించాడు.
మార్విన్ నిరాకరించాడు.
జార్జ్ ఇంటికి చేరేసరికి అప్పుడే వెలుగు వస్తోంది. తన వీధిలోకి కారుని తిప్పగానే అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అతని ఇంటి ముందు ఓ పోలీస్ కారు ఆగి ఉంది. మెడ్జ్ శవాన్ని అప్పటికే పోలీసులు కనుగొన్నారు! ఇరుగు పొరుగు వాళ్లు బహుశ ఫోన్ చేసి ఉంటారు. తలుపు ఎలా తెరిచారు? పగలగొట్టుకుని వెళ్లారా? తను శవాన్ని చూసి పోలీసులకి ఫోన్ చేసే కంటే ఇదే మంచిది అనుకున్నాడు.
కార్లోని మీట నొక్కి గేరేజ్ తలుపు తెరచుకోగానే కారుని లోపలకి పోనించాడు. గేరేజ్‌లోంచి ఇంట్లోకి ఉన్న తలుపు తెరచుకుని లోపలకి వెళ్తూ అక్కడ అనేక మంది పోలీసులు ఉంటారని అనుకున్నాడు. కాని ఎవరూ లేరు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కాఫీ కెటిల్‌లో నీళ్లు నింపి స్విచ్ వేయగానే డోర్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తెరిస్తే ఎదురుగా ఇద్దరు పోలీసులు.
‘గుడ్‌మార్నింగ్ రండి. ఇప్పుడే కాఫీ కలుపుతున్నాను. మా ఆవిడ ఇంకా నిద్ర లేవలేదు. పేకాట ఆడి ఇప్పుడే ఇంటికి వచ్చాను’ జార్జ్ వాళ్ళని ఆహ్వానించాడు.
‘అది మాకు తెలుసు. మీ కోసమే వేచి ఉన్నాం’ ఒకడు చెప్పాడు.
ఇద్దరూ లోపలకి వచ్చారు. జార్జ్ పెర్కొలేటర్ లోంచి మూడు కప్పుల్లో కాఫీని వంచి, పాలు, చక్కెర వేసి కప్పుల్లో చెంచాలని ఉంచాడు. బ్రెడ్ బాక్స్‌లోంచి స్వీట్ రోల్స్, ఫ్రిడ్జ్‌లోని వెన్న తీసుకుని ట్రేలో ఉంచి వాళ్ల దగ్గరికి తీసుకెళ్లాడు. పోలీసులు తనని ఇంకా ఎందుకు ప్రశ్నించలేదో అతనికి అర్థం కాలేదు. మెడ్జ్ శవాన్ని ఇప్పటికే తీసుకెళ్లిపోయారా? తనకా వార్త చెప్పడానికి వాళ్లు వేచి ఉన్నారా? అనేక ఆలోచనలు.
‘నిన్న రాత్రి నాకు అదృష్టమైన రాత్రి. చాలా డబ్బు సంపాదించాను’ నవ్వుతూ చెప్పాడు.
‘కూర్చోండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి’ రెండో అతను చెప్పాడు.
‘ప్రశ్నలా? మీరు ఎందుకు వచ్చారు?’
వాళ్ల వరకు తను ఇంకా తన భార్య శవాన్ని చూడనే లేదు.
‘ఐతే నిన్న రాత్రంతా మీరు పేకాట ఆడారా?’ ఒకతను స్వీట్ రోల్‌కి నిదానంగా వెన్న పూసుకుంటూ అడిగాడు.
‘అది చట్ట విరుద్ధమా? అంతా డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నారు కదా?’
‘దాంతో మాకు సంబంధం లేదు. ఆటకి ఎప్పుడు కూర్చున్నారు? ఎప్పుడు లేచారు?’ రెండో పోలీస్ ఆఫీసర్ అడిగాడు.
‘ఎప్పటిలానే నిన్న రాత్రి తొమ్మిదికి మొదలైంది. ఇరవై నిమిషాల క్రితం పూరె్తైంది’
‘ఆ మొత్తం సమయం మీరు అక్కడే ఉన్నారా?’
‘అవును. ఎందుకలా అడుగుతున్నారు?’ జార్జ్ అమాయకంగా అడిగాడు.
‘మీతో ఎవరెవరు ఆడారు?’
‘ప్రతీ శుక్రవారం రాత్రి ఆరుగురం కలిసి ఆడతాం’
‘అక్కడ ఆడిన వారందరి పేర్లు మాకు తెలుసు. అల్ తొమ్మిది నించి అక్కడే ఉన్నాడా?’
‘అవును. నాకన్నా ముందే వచ్చాడు’
‘అతను ఎప్పుడు వెళ్లాడు’
‘తెల్లవారుఝామున నాలుగు - నాలుగున్నర మధ్య అనుకుంటాను. ఎందుకు అడుగుతున్నారు?’
‘అంతకు మునుపు కూడా వెళ్లాడా?’
‘లేదు. ఎవరం వెళ్లలేదు’
జార్జ్‌కి అల్ ప్రసక్తి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు.
‘కోర్ట్‌లో ఈ విషయం సాక్ష్యం చెప్తారా?’
జార్జ్ కొద్దిగా సందేహించి చెప్పాడు.
‘తప్పకుండా. అతను కాని, ఎవరూ కాని అక్కడ నించి వెళ్లలేదు’
‘సరే ఐతే. మిగతా వాళ్లు కూడా మీరు చెప్పిందే చెప్పారు. అంటే అల్ కూడా నిజమే చెప్పినట్లు. అది నిజమని తెలిసినా తనిఖీ చేయాలని వచ్చాం’
ఇద్దరూ స్వీట్ రోల్స్ తిన్నాక కాఫీ తాగసాగారు.
‘ఏం తనిఖీ చేయాలని?’ జార్జ్ అడిగాడు.
‘అల్ భార్య రాత్రి పదకొండున్నరకి కాల్చి చంపబడింది’
‘అయ్యో? నిజంగా?’
‘బహుశ ఓ దొంగ ఆమెని చంపి ఉంటాడు. ఆమె వొంటి మీది, ఇంట్లోని విలువైనవి మాయం అయ్యాయి. దొంగ లోపలికి బలవంతంగా ప్రవేశించిన గుర్తులు లేవు. ఏడుగురు సాక్షులు అల్‌కి ఎలిబీ ఇస్తే ఇంక అతని మీద అనుమానం ఉండదు’
జార్జ్ కుర్చీలో బలహీనంగా వెనక్కి వాలాడు.
‘అల్ మీకు బెస్ట్‌ఫ్రెండా? మీ మొహం అంతగా పాలిపోయింది?’ ఓ పోలీస్ ఆఫీసర్ సానుభూతిగా అడిగాడు.
‘మేం ఇద్దరం చాలారోజులుగా శుక్రవారం రాత్రుళ్లు పేకాట ఆడుతున్నాం. ఇద్దరం ఒకే రకం పుస్తకాలు చదువుతున్నాం.’
‘కాని ఆ పుస్తకంలోని ఆ కథ గురించి అల్ నాకు చెప్పలేదు’ జార్జ్ మనసులో అనుకున్నాడు.
‘సారీ. మీరు ఫోన్‌లో అతన్ని ఓదార్చండి’ చెప్పి వాళ్లు వెళ్లిపోయారు.
జార్జ్ నిద్రలో నడిచేవాడిలా నడుస్తూ పడక గది తలుపు తెరిచాడు. లోపల ఇంకా లైట్ వెలుగుతోంది. తను ఆమెని ఎలా వదిలి వెళ్లాడో అలాగే ఉంది. దుప్పటికి అంటిన రక్తం ఎండిపోయింది.
‘అల్! నువ్వు నీ భార్యని క్రితం శుక్రవారం ఎందుకు చంపలేదు?’ జార్జ్ బాధగా బయటకి చెప్పాడు.
తన భార్య శవాన్ని ఎలా వదిలించుకోవాలో అతనికి అప్పటికే కొన్ని ఆలోచనలు కలిగాయి. తన పథకం ప్రకారం పోలీసులకి ఫోన్ చేసే ధైర్యం చేయలేదు. ఇద్దరు హతుల శరీరాల్లోని రెండు గుళ్లు ఒకే రివాల్వర్‌లోంచి రాలేదు. ఒకే రాత్రి ఇద్దరు భర్తలకి ఒకే రకం ఎలిబీని పోలీసులు అంత తేలిగ్గా నమ్మరు.
‘ఇప్పుడు నేనేం చేయాలి మెడ్జ్?’ జార్జ్ గొణిగాడు.

(రగ్ ఫిలిప్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి