S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చైల్డ్స్ ప్లే

పదకొండేళ్ల క్రేగ్‌కి ఊహాగానాలు ఎక్కువ. వాడి కోసం బయటకి వచ్చిన వాడి తల్లి సారా నేల మీద పడున్న చెట్టు బోదె మీద చేతుల్ని బేలన్స్ చేస్తూ, కొద్దికొద్దిగా ముందుకి నడిచే క్రేగ్‌ని చూసి చెప్పింది.
‘అన్నం వడ్డించాను. రా’
‘నన్ను తరిమే నల్ల పక్షి నించి నేను పారిపోతున్నాను. వెనక్కి తిరగను’ వాడు చెప్పాడు.
‘అది వెళ్లిపోయింది. నువ్వు రా’ కొడుకు ఊహాశక్తి గురించి తెలిసిన సారా చెప్పింది.
‘నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు. కాలు జారితే వెయ్యడుగుల కింద లోయలోకి పడిపోతాను’ క్రేగ్ చెప్పాడు.
‘ఆట ఆపి రా’ సారా కోపంగా చెప్పింది.
‘ఏం జరుగుతోంది?’ అప్పుడే వచ్చిన క్రేగ్ తండ్రి బర్ట్ అడిగాడు.
క్రేగ్ కాలుజారి చెట్టు బోదె మీద నించి గట్టిగా అరుస్తూ కిందపడ్డాడు. తల్లిదండ్రులు వాడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లారు.
‘నేను పైనించి వెయ్యి అడుగుల లోయలో పడ్డాను’ కళ్లు మూసుకున్న క్రేగ్ చెప్పాడు.
‘అబద్ధాలాడకు. లోపలకి వెళ్లి భోజనం చెయ్యి’ బర్ట్ హెచ్చరించాడు.
‘నేను నిజమే చెప్పాను.’
బర్ట్ వాడిని రెక్కపట్టి లేవదీస్తే ఇంట్లోకి వెళ్లిపోయాడు.
‘వీడి ఊహాశక్తి రోజురోజుకీ అధికం అవుతోంది’ సారా నవ్వి చెప్పింది.
‘రేపు ఆదివారం వీడ్ని వదిలేసి మనం ఫిషింగ్‌కి, బోటింగ్‌కి వెళ్దామా?’ బర్ట్ అడిగాడు.
‘అంత చిన్న పిల్లవాడ్ని వొంటరిగా ఎలా వదిలి వెళ్తాం?’
‘మరీ చిత్రం చెప్తావు. కొన్ని గంటలు వాడు వొంటరిగా ఉండలేడా?’ బర్ట్ చిరుకోపంగా అడిగాడు.
‘వాడి ఈడు వాళ్లు ఎవరూ లేకపోబట్టే వాడు ఇలా కౌబాయ్‌లు అని, నల్ల పక్షులు అని ఊహల్లో ఆడుకుంటున్నాడు. మనం వాడిని వొంటరిగా వదిలితే ప్రమాదం కలగచ్చని నా భయం. రండి. వడ్డిస్తాను’ సారా చెప్పింది.
ఇద్దరూ లోపలికి వెళ్లారు.
‘మనం నిద్ర పోయేప్పుడు ఇంట్లోకి ఒక మొసలి వచ్చి వెళ్తూంటుందని తెలుసా? నిన్న రాత్రి నేను అగ్గిపెట్టె, ఫోర్క్‌లతో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాను. కాని అది పారిపోయింది’ క్రేగ్ భోజనం చేస్తూ తండ్రికి చెప్పాడు.
‘నీ ఊహల్ని అబద్ధాలు అంటారు’ బర్ట్ హెచ్చరించాడు.
‘ఆదివారం మాతో సరస్సుకి వస్తావా?’ సారా చిన్నగా నవ్వి అడిగింది.
బర్ట్ భార్య వైపు కోపంగా చూసాడు.
‘వస్తాను’ క్రేగ్ ఆనందంగా ఒప్పుకున్నాడు.
‘క్రేగ్! మీ అమ్మ కొంచెం అయోమయంలో ఉంది. రేపు ఆదివారం నిన్నొదిలి మేం ఇద్దరమే వెళ్తున్నాం’ బర్ట్ చెప్పాడు.
‘వేసవి సెలవులకి ఈ సమ్మర్ కాటేజ్‌కి మనం వచ్చింది అలాంటి వాటికి వెళ్లడానికేగా?’ చిన్నబుచ్చుకున్న క్రేగ్ అడిగాడు.
‘ఎక్కడికి?’ వాడు లేచి వెళ్తూంటే సారా అడిగింది.
‘నల్ల పక్షికి ఆహారం పెట్టడానికి. లేదా చచ్చిపోతుంది’
వాడు టాయ్ గన్ ఉన్న హోల్‌స్టర్ బెల్ట్‌ని నడుంకి కట్టుకున్నాడు. అనుకోకుండా వాడి దృష్టికి గోడకి ఉన్న షెల్ఫ్‌లోని మూడు రైఫిల్స్ మీద పడింది. వెంటనే బెల్ట్‌ని విప్పదీసి, సోఫాలో పడేసి, గోడకి ఉన్న ఓ రైఫిల్‌ని పిల్లిలా తీసుకున్నాడు. చప్పుడు చేయకుండా బల్ల సొరుగుని లాగి అందులోని బుల్లెట్ పెట్టెని తీసి జేబులో ఉంచుకున్నాడు. తర్వాత తలుపుని నిశ్శబ్దంగా తెరచి రైఫిల్‌తో బయటకి నడిచాడు. వంట గదిలో కబుర్లు చెప్పుకునే భార్యాభర్తలు అది గమనించలేదు.
ఇంటికి దూరంగా అడవిలోకి వెళ్లిన క్రేగ్ రెండుసార్లు రైఫిల్‌ని గాల్లోకి గురిపెట్టి చెప్పాడు.
‘కదలక నల్లపక్షి. లేదా కాల్చేస్తాను.. నువ్వు కదిలావు’ చెప్పి రెండుసార్లు రైఫిల్‌ని పేల్చి ముందుకు సాగాడు.
* * *
‘క్రితం సమ్మర్ కేంప్ నించి క్రేగ్‌ని వెళ్లగొట్టారు’ సారా తన భర్తతో చెప్పింది.
‘దేనికి?’ నివ్వెరపోయిన బర్ట్ అడిగాడు.
‘హేంక్‌తో వీడు విలియం టెల్ ఆటని ఆడాడు. హేంక్ తల మీద ఏపిల్ పండుని పెట్టి నిజం రైఫిల్‌తో...’ చెప్పడం ఆపింది.
‘చెప్పు. నిజం రైఫిల్‌తో?’
‘కాల్చాడు. గుండు వెళ్లి ఏపిల్‌లో దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది’
బర్ట్ నిశే్చష్టుడయ్యాడు.
‘దాంతో క్రేగ్‌ని వెళ్లగొట్టారు. వాడు హేంక్‌ని చంపేసి ఉండేవాడు’
‘నాకది అప్పుడే ఎందుకు చెప్పలేదు?’ బర్ట్ కోపంగా అడిగాడు.
‘ఇంతదాకా ఆ అవకాశం రాలేదు. క్రితం వేసవిలో నువ్వు జర్నలిస్ట్‌గా నీ అసైన్‌మెంట్‌కి మమ్మల్ని వొంటరిగా వదిలేసి వెళ్లావు. చాలా రోజుల తర్వాత నువ్వు ఇంటికి వచ్చాక చెప్తే వాడ్ని మీరు తిడతారు. అది ఇష్టంలేక చెప్పలేదు’
‘మరి ఇంతదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పి ఉంటే వాడ్ని పెంచే పద్ధతిలో మార్పు తెచ్చేవాడిని. వాడ్ని హంటింగ్‌కి నాతో ఎప్పుడూ తీసుకెళ్లే వాడిని కాదు. వాడ్ని ఇక క్రమశిక్షణలో పెట్టాలి. రైఫిల్‌తో ఆటలు ఆడటం ప్రమాదం అని బోధించాలి. వాడ్ని శిక్షించావా?’ బర్ట్ కోపంగా అడిగాడు.
‘లేదు’ సారా బదులు చెప్పింది.
‘ఎందుకని?’
‘ఎందుకంటే చాలా నెలల తర్వాత ఆ రోజే నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు. కాబట్టి మనం ముగ్గురం హేపీగా ఉండాలని నేనా విషయాలు చెప్పలేదు’
‘అంటే మీ ఇద్దరూ ఏం జరగనట్లే అమాయకంగా నటించారన్నమాట. అది వాడి మీద చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని ఆలోచించావా?’
‘తను చేసింది తప్పని క్రేగ్ బాధపడ్డాడు. నీకు తెలుస్తుందని భయపడ్డాడు కూడా’
‘అందుకని మీ ఇద్దరూ కలిసి దాన్ని దాచి, నన్ను ఫూల్‌ని చేసారన్నమాట! అసలు ఎందుకు భయపడ్డాడు? నన్ను రాక్షసుడిగా చూపించి నువ్వే భయపెట్టి ఉంటావు. ఇంకోసారి ఇలాంటివి నా నించి దాచకు. క్రేగ్ వచ్చాక నేను వాడితో మాట్లాడుతాను. వాడ్ని నా గదిలోకి పంపు.’
‘బర్ట్! ఇది జరిగి ఏడాది అవుతోందిగా’ సారా బతిమాలుతున్నట్టుగా చెప్పింది.
‘వాడితో మాట్లాడి తీరాలి. ఇంకేమైనా బాంబులు నా మీద వేస్తావా?’ లేస్తూ అడిగాడు.
* * *
చేతిలోని రైఫిల్‌తో క్రేగ్ హుషారుగా అడవిలో పరిగెత్తుతూ, దారిలో కనపడ్డ తాగి పడేసిన బీర్ సీసాలని, కేన్‌లని గురి చూసి పేల్చసాగాడు.
ఓ వాగులో చేపలు పట్టే వ్యక్తికి ఏభై అడుగుల పైన జలపాతం పడే చోట రైఫిల్‌ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని నడిచి వెళ్లే క్రేగ్ కనిపించాడు.
‘ఆగబ్బాయ్! ఏమిటా అఘాయిత్యం? వెనక్కి వెళ్లు. ఆ నీటి ఫోర్స్‌కి నువ్వు కిందపడి మునిగిపోతావు’ ఆ వ్యక్తి అరిచాడు.
జలపాతం హోరులో ఆ మాటలు వినిపించని క్రేగ్ దాన్ని దాటి అవతలి వొడ్డుకి చేరుకున్నాడు.
‘నల్లపక్షి! నిన్ను వెంటాడుతున్నాను. ఇవాళ చంపేస్తాను’ అరిచాడు.
* * *
చేత్తో కాఫీ కప్పుతో బర్ట్ టైప్ చేసుకునే గదిలోకి వచ్చిన సారా దాన్ని పక్కన పెట్టి చెప్పింది.
‘నీతో మాట్లాడాలి’
‘నేను బిజీగా ఉన్నాను. క్రేగ్ గురించా?’ టైప్ చేస్తూనే అతను అడిగాడు.
‘కాదు. మన గురించి’
‘ఏమిటి?’
‘మనం విడిపోదాం’
అతను టైప్ చేయడం ఆపి వెనక్కి తిరిగి భార్య వైపు చూస్తూ అడిగాడు.
‘నీకు విడిపోవాలని ఉందా?’
‘ఏమో? నువ్విలా మాకు దూరంగా ఉంటే నాకు నచ్చడం లేదు’ బాధగా చెప్పింది.
‘నేను దూరంగా ఉండటం లేదు. పని చేసుకుంటున్నాను’
‘అది దూరం చేయడమే అనుకుంటున్నాను’ ఆమె బాధగా చెప్పింది.
‘ఐతే ఈ జర్నలిస్ట్ పని మానేసి నన్ను ఏ బస్ కండక్టర్ ఉద్యోగంలోనో చేరమంటావా?’ అడిగాడు.
* * *
‘నల్లపక్షి. మళ్లీ తప్పించుకున్నావు. కాని ఇవాళ నిన్ను చంపి కాని వదలను’ క్రేగ్ మరోసారి రైఫిల్ పేల్చి అరిచాడు.
పొదల వెనక నించి చేతిలో ఫిషింగ్ రాడ్‌తో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి క్రేగ్‌ని చూసి నవ్వుతూ చెప్పాడు.
‘నువ్వు ఇక్కడ చాలా గొడవ చేస్తున్నావబ్బాయ్’
క్రేగ్ అతనికి రైఫిల్‌ని గురి పెట్టి చెప్పాడు.
‘చేతులు పైకి ఎత్తు’
‘ఏమన్నావు?’ అతను ఆశ్చర్యంగా అడిగాడు.
‘సరిగ్గానే విన్నావు. నువ్వు నల్లపక్షివి. నిన్ను చంపితే నేను గెలిచినట్లే. చేతులు పైకెత్తు’ క్రేగ్ ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పాడు.
‘ఎప్పుడూ మనుషులకి రైఫిల్‌ని గురిపెట్టక. సరదా కోసం కూడా’ చెప్పి అతను వెనక్కి తిరిగాడు.
‘ఆగు’ క్రేగ్ అరిచాడు.
అతను వెనక్కి తిరిగి చూసి కోపంగా చెప్పాడు.
‘ముందు తుపాకీని నానించి పక్కకి మళ్లించు’
‘నల్లపక్షి! నువ్వు ఒక్క అడుగు కదిలినా చచ్చిన వాడితో సమానం’ క్రేగ్ కోపంగా చెప్పాడు.
‘నేను మీ నాన్నతో నీ గురించి మాట్లాడుతాను. ముందా రైఫిల్ నాకు ఇవ్వు’
చేతిలోని గేలాన్ని కిందపడేసి అతను క్రేగ్ వైపు అడుగులు వేశాడు. తక్షణం క్రేగ్ చేతిలోని రైఫిల్ పేలి గుండు అతని ముందు నేలలో గుచ్చుకుని దుమ్ము రేగింది.
‘ఈసారి నేను బానెట్‌ని నీ గుండెకి గురి పెడతాను. నువ్వు చచ్చిన వాడితో సమానం’
‘నీకు పిచ్చెక్కిందా? నువ్వేం ఆట ఆడుతున్నావో నీకు తెలుసా?’ అతను అది గుళ్లున్న రైఫిల్ అని గ్రహించగానే అరిచాడు.
‘కూర్చో. ఇంకోసారి నా నోట్లోంచి మాట రాదు. తుపాకీ లోంచి గుండు బయటకి వస్తుంది’ క్రేగ్ అతని ఛాతీకి గురి పెట్టి ఆజ్ఞాపించాడు.
కోపంతో ఎర్రబడ్డ క్రేగ్ మొహాన్ని చూసి అతను భయపడి కింద కూర్చున్నాడు.
* * *
‘ఒకోసారి నువ్వు నన్ను ప్రేమించడం లేదని నాకు అనిపిస్తూంటుంది’ సారా చెప్పింది.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ బర్ట్ చెప్పాడు.
‘అది ఒకప్పుడు. నువ్వు మొదట్లోలా ఉండటం లేదు. నీక్కావాల్సింది భార్య కాదు. ఇల్లు చక్కదిద్దుకునే మనిషి. నీ కొడుక్కో తల్లి. నేను నీకిప్పుడు ముఖ్యం కాదు’
బర్ట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘నా శక్తి మొత్తం నా ఉద్యోగంలో ఖర్చయిపోతోంది. అది తప్పని తెలిసినా నా ఉద్యోగం అలాంటిది. ఇంట్లో అన్నీ సాఫీగా జరగాలి. లేదా నేను నా పనిని చేయలేను. దానర్థం నేను నిన్ను ప్రేమించడం లేదని కాదు. నేను అలసిపోయానని. ప్రతీరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేలా నిన్ను నమ్మించేలా ప్రవర్తించడం నా వల్ల కాదు. అది నువ్వే గ్రహించాలి’
‘నాకు నీ పని మీద అసూయగా ఉంది. అది మనల్ని వేరుచేస్తోంది’ సారా ఏడుస్తూ చెప్పింది.
* * *
క్రేగ్ కూడా అతని ఎదురుగా నేల మీద కూర్చుని ఉన్నాడు. జేబులోంచి తీసుకున్న ఏపిల్‌ని కొరుక్కు తింటున్నాడు.
‘ఎంతసేపు ఈ ఆట ఆడదలచుకున్నావు?’ అతను నిస్పృహగా అడిగాడు.
‘నినే్నం చేయాలో నేను నిర్ణయించుకునే దాకా నల్లపక్షి’
* * *
‘సరే. మనం విడిపోతే క్రేగ్ మాటేమిటి?’ బర్ట్ అడిగాడు.
‘వాడు నాతోనే ఉంటాడు.’
‘జీవితంలో అన్ని సమస్యలనీ ఈ కాస్త మాటలతో పరిష్కరించుకోలేం’ బర్ట్ చెప్పాడు.
‘నేను మూడేళ్ల నించి ఈ విషయం నీకు చెప్పాలని ఆలోచిస్తున్నాను. కాని నిన్ను బాధ పెట్టకూడదని చెప్పలేదు’
‘నాకు ఆలోచించుకోడానికి కొంత టైం కావాలి సారా’ బర్ట్ కోరాడు.
ఆమె బయటకి వెళ్లాక ఓ వాక్యం టైప్ చేసి, తర్వాత ఇక చేయలేక కుర్చీలోంచి లేచిపోయాడు.
‘రేపు మనం క్రేగ్‌ని కూడా తీసుకెళ్దాం. ఇప్పుడు నేను హంటింగ్‌కి వెళ్లొస్తాను’ చెప్పాడు.
‘క్రేగ్. రేపు నువ్వూ మాతో వస్తున్నావు’ ఆమె ఆనందంగా అరిచింది.
బర్ట్ షెల్ఫ్‌లోని ఓ రైఫిల్‌ని అందుకోబోయాడు. దాని కిందది కనపడకపోవడంతో భార్యని అడిగాడు.
‘ఇంకో రైఫిల్ ఏది?’
‘నాకు తెలీదు’
వెంటనే అతను బల్ల సొరుగు తెరచి వెదకి చెప్పాడు.
‘గుళ్ల బాక్స్ కూడా లేదు. వీడు ఎక్కడికి వెళ్లాడు?’
‘లంచ్ తర్వాత నల్ల పక్షి ఆట కోసం బయటకి వెళ్లుంటాడు. వాడు ఎప్పుడూ ఆడే ఆటే అది. వాడి ఊహలో నల్లపక్షి నువ్వే. మీ మీది కోపాన్ని బయటకి చెప్పలేక వాడు ఈ ఆట ఆడుతున్నాడని నాకు తెలుసు.’
‘వెంటనే నేను వాడ్ని పట్టుకోవాలి’ చెప్పి బర్ట్ రైఫిల్‌ని అందుకున్నాడు.
తన చేతిలోని రైఫిల్ వంక సారా తీవ్రంగా చూడటంతో దాన్ని యథాస్థానంలో ఉంచి బర్ట్ బయటకి నడిచాడు. సారా అతన్ని అనుసరించింది. ఇద్దరూ వాడు వెళ్లిన దారిలో గుళ్లు తగిలి పగిలిన సీసాలు, కేన్స్‌ని బట్టి ఆనవాలుని బట్టి అడవి మార్గంలో వేగంగా ముందుకి నడిచారు.
‘వాడు కనిపిస్తే నువ్వేం చేస్తావో అని నాకు భయంగా ఉంది’ సారా చెప్పింది.
‘నల్ల పక్షిని చంపడానికి సహాయం చేస్తాను’ బర్ట్ చెప్పాడు.
దారిలో వాగులో చేపలు పట్టే వాడిని చూసి అడిగాడు.
‘ఓ చిన్న పిల్లాడిని చూసారా?’
‘చూసాను. వాడు మీ కొడుకా? మీరు జాగ్రత్తగా ఉండాలి. రైఫిల్‌తో ఇష్టం వచ్చినట్లు షూట్ చేస్తున్నాడు. అటువైపు వెళ్లాడు. అక్కడ్నించి పడితే మునిగిపోయేవాడు’ పైన జలపాతం వైపు చూపిస్తూ చెప్పాడు.
‘ఎంత సేపైంది?’ బర్ట్ ఆదుర్దాగా అడిగాడు.
‘గంటైంది’
బర్ట్ భార్య చేతిని పట్టుకుని వాగుని దాటించి కాలి బాట మీద ముందుకి సాగాడు.
* * *
‘ఇంకెంతసేపు?’ ఆ వ్యక్తి క్రేగ్‌ని అడిగాడు.
‘నినే్నం చేయాలో ఆలోచించాను నల్లపక్షి. నువ్వు తప్పించుకునేందుకు నీకో అవకాశం ఇస్తాను’ క్రేగ్ చెప్పాడు.
‘ఏమిటది?’
క్రేగ్ జేబులోంచి ఓ ఏపిల్ పండుని తీసి అతని వైపు విసిరాడు.
‘నాకు ఆకలిగా లేదు’ అతను చెప్పాడు.
‘దాన్ని నీ నెత్తిన పెట్టుకో’ క్రేగ్ చెప్పాడు.
‘దేనికి?’
‘ఇదే నేను నీకు ఇచ్చే అవకాశం. పెట్టుకో’
‘సరే. పెట్టుకుంటాను. తర్వాత?’ అతను అడిగాడు.
‘విలియం టెల్ తన కొడుకు నెత్తి మీద ఏపిల్‌ని ఉంచి బాణంతో కొట్టినట్లు నేను తుపాకీ గుండుతో...’
‘నా నెత్తి మీది ఏపిల్‌ని కాలుస్తానంటావా?’ అతను భయంగా అడిగాడు.
‘అవును. తల మీద వెంటనే ఉంచుకో. నేనెప్పుడూ విలియం టెల్‌లా గురి తప్పను’
‘నువ్వు గురి తప్పినా, తప్పకపోయినా నేను పెట్టుకోను. ఐనా ఎందుకిలా?’
‘నీకు నా గురి మీద నమ్మకం ఉందా లేదా తెలుసుకోడానికి. లే’
అతను లేచి నిలబడితే క్రేగ్ అరిచాడు.
‘కూర్చో’
అతను క్రేగ్ వైపు కోపంగా ఓ అడుగు వేయగానే రైఫిల్ పేలింది. అది అతని ముందు నేలలో గుచ్చుకుంది. ఆ శబ్దం విన్న బర్ట్‌కి క్రేగ్ ఎక్కడ ఉన్నాడో అర్థమై వేగంగా అటు వైపు పరిగెత్తాడు.
అతను నేల మీద కూర్చుని ఏపిల్‌ని నెత్తి మీద ఉంచుకుని భయంగా క్రేగ్ వైపు చూడసాగాడు. క్రేగ్ రైఫిల్‌ని ఏపిల్‌కి గురిపెట్టాడు. అక్కడికి చేరుకున్న బర్ట్ అరిచాడు.
‘ఆగు క్రేగ్! ఏం చేస్తున్నావు?’
‘చూడు మిస్టర్. మీరు ఎవరైనా సే. ఈ పిల్లవాడ్ని డిస్టర్బ్ చేయకండి. వాడికి పిచ్చని నా అనుమానం...’ అతను జరిగింది బర్ట్‌కి వివరించాడు.
‘క్రేగ్. రైఫిల్‌ని కింద పెట్టు’ బర్ట్ అరిచాడు.
‘నా గురి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రాణాలతో వెళ్తావు’ క్రేగ్ తన తండ్రి కంఠం వినపడనట్లే అతని తల మీది ఏపిల్‌నే చూస్తూ చెప్పాడు.
‘అతనికి నీ గురి మీద నమ్మకం ఉంది. ప్రత్యేకంగా చూపించక్కర్లేదు’ బర్ట్ కొడుక్కి చెప్పాడు.
‘అది అతనికి తెలియడానికి నేను అతని నెత్తి మీది పండుని కాల్చాలి’
‘క్రేగ్. నువ్వు పొరబడ్డావు. నల్ల పక్షి అతను కదా. నేను’ చెప్పి బర్ట్ అతని తల మీద నించి ఏపిల్‌ని తీసి తన తల మీద పెట్టుకున్నాడు.
క్రేగ్ ఏపిల్‌కి గురి పెట్టాడు. సారా వారించింది. కాని వాడు ట్రిగర్ నొక్కాడు. ఢాం అనే శబ్దంతో ఆ అడవి మార్మోగింది.
బర్ట్ నెత్తి మీద ఆ ఏపిల్ పండు ముక్కలై వెనక్కి పడిపోయింది.
‘క్రేగ్! ఏం చేస్తున్నావు?’ సారా వాడి దగ్గరికి వెళ్లి వాడి చేతిలోని రైఫిల్‌ని లాక్కుంది.
‘నేను నల్లపక్షిని భయపెట్టాలని అనుకున్నాను. అంతే’ క్రేగ్ ఏడుస్తూ చెప్పాడు.
‘నువ్వు నిజంగానే భయపెట్టావు’ బర్ట్ లేచి వెళ్లి వాడి తల మీద అనునయంగా నిమురుతూ చెప్పాడు.
*
(రాబర్ట్ కోజియర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి