S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చదువా.. చంపకే!

బాగా చదువుకుంటే బాగా బతకొచ్చు..
ఓ మాదిరిగా చదువుకున్నా బతకొచ్చు..
కోరుకున్నట్లు చదువుకోకపోయినా బతికేయొచ్చు..
అసలు చదువే అబ్బకపోయినా జీవనయానం
కష్టమేమీ కాదు..
కానీ... చదువుల సరస్వతులు, సరస్వతీ పుత్రులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు. వారిని చంపుతున్నది చదువా? జీవితంలో ఎందుకు ఓడిపోతున్నారు. ఒక మార్కు తగ్గిందనో, అనుకున్న ర్యాంకు రాలేదనో, ఉపాధ్యాయ వర్గం మందలించిందనో, తల్లిదండ్రుల ఆశలు తీర్చలేకపోతున్నామనో, తనకు నచ్చని కోర్సులో చేర్చారనో.. ఏదో ఒక కారణం వారి ప్రాణాలను ఎందుకు తీసేస్తోంది. వారి మనసు మరణాన్ని ఎందుకు కోరుకుంటోంది. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న మన దేశంలో యువతరం ఆత్మహత్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి. అంతా స్వయంకృతం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య దాదాపు 30. ఆత్మహత్యకు ప్రయత్నించి, అదృశ్యమైనవారి సంఖ్య మరో నాలుగైదు. చక్కటి భవిష్యత్‌కోసం ఒక్కో మెట్టూ ఎక్కవలసిన వీరు... నిర్జీవులైపోతున్నారెందుకు? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు హతాశులైపోవలసివస్తోంది ఎందుకు? మన ఆకాంక్షలు, ఆశలు.. మన శక్తిసామర్థ్యాలు, అవకాశాలు, పిల్లల ఇష్టాయిష్టాలు, విద్యాసంస్థల్లోని పరిస్థితులు ఒకదానికి ఒకటి పొంతన కుదరక, చదవలేక, ఒత్తిడిని తట్టుకోలేక, ఆ విషయాన్ని పెద్దలకు చెప్పలేక చిన్నబోయిన మనసుతో చితిని ఎంచుకుంటున్నారు రేపటిపౌరులు.
మరణమృదంగం
ప్రపంచంలో 14 నుంచి 29 ఏళ్లలోపు కుర్రకారులో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య భారత్‌లో అత్యధికం. నవయువతరంతో దూసుకుపోతున్న భారత్‌లో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించిన గణాంకాల ప్రకారం 2015లో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య 8934. 2011 నుంచి 2015 మధ్య ఇలా ఆత్మహత్యలు చేసుకున్న చదువరుల సంఖ్య దాదాపు 40వేలు. ఏటా విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యల రేటు పెరుగుతూనే ఉంది. సమాజంలోని పిల్లలకు చక్కటి భవిష్యత్‌కు బాటలు వేద్దామన్న తల్లిదండ్రులు వాస్తవాలను మరచి కష్టసాధ్యమైన, అయిష్టమైన లక్ష్యాలను వారిపై రుద్దడం మొదటి కారణం. పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకోవడం తప్పుకాదు. అవసరం. కానీ ఆ పిల్లల ఇష్టాయిష్టాలను, వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ కోర్కెలను, ఇష్టాలను వారిపై రుద్దడం తొలి తప్పు. ప్రభుత్వ విద్యాసంస్థలంటే చిన్నచూపు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా శ్రద్ధగా చదువుచెబుతారన్న అపోహతో అక్కడ చేర్పించడం రెండో తప్పు. టాప్ స్కోరర్, టాప్ ర్యాంకర్‌గా తమ పిల్లలు నిలవాలన్న తపన, తహతహ మరో తప్పు. మనసు, శరీరానికి వ్యాయామం, విశ్రాంతి ఇవ్వకుండా చదువు తప్ప మరో వ్యాపకం లేకుండా చేయడం, వారితో మనసారా కొంతసేపైనా మాట్లాడకపోవడం, మాట్లాడిన విషయాలన్నీ చదువు చుట్టూనే ఉండటం అసలు సమస్య. పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి ఇబ్బందులు ఏమిటి, అసలు వారి ఇష్టం ఏమిటి, చదవగలుగుతున్నారా వంటి విషయాలపై పరిశీలనే ఉండదు. ఎంతసేపూ మార్కులు, ఫలితాలు తప్ప మరో ధ్యాస ఉండదు. వారిని చదివించడానికి తాము ఎంత కష్టపడుతున్నదీ వల్లెవేయడం, అప్పుల చిట్టాను విప్పి చెప్పడం, విద్యాసంస్థల కఠినవైఖరిని సమర్ధిస్తూ తమ పిల్లల్ని తప్పుబట్టడం వంటివి విద్యార్థినీవిద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. చదవలేకపోతున్నామని, లేదా ఇతర సమస్యలని చెబితే తల్లిదండ్రులు ఏమనుకుంటారోనన్న భయం వారిని నోరువిప్పనీయడం లేదు. ఫలితాలు ఆశాజనకంగా లేవన్న దిగులు మరోవైపు. ఏం చేయాలో తెలీని స్థితిలో వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఫీజులు, ఎలాగైనా ఉత్తమ ఫలితాలు సాధించాలన్న తపన తప్ప విద్యార్థి బాగోగులపై ఏమాత్రం శ్రద్ధలేని విద్యా సంస్థల కర్కశ వైఖరి అప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న యువతరాన్ని బెంబేలెత్తించి మరణానికి దగ్గర చేస్తోంది. తిండి, చదువు, శిక్షణ, శిక్ష అన్నీ యాంత్రికంగా, కఠినంగా ఉండటం అసలు సమస్య. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వారిని చక్కదిద్దడానికి తీసుకోవలసిన వ్యవస్థ రెండు తెలుగు రాష్ట్రాల కార్పొరేట్ విద్యాసంస్థలలో లేనేలేదు. అసలు ఆయా సంస్థల తీరుతెన్నులు, పనిచేసే విధానాన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. దాంతో వారిష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. అది విద్యార్థుల పాలిట యమపాశంగా మారిపోయింది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేరిస్తే చాలు, అంతా వారే చూసుకుంటారన్న ధోరణి తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. తమ కుమారుడు లేదా కుమార్తె ఎలా చదువుతోంది, వారికి ఎదురవుతున్న సమస్యలేమిటి అన్నది స్వయంగా పరీక్షించే తల్లిదండ్రులు తక్కువ. కుంగుబాటు, దిగులు, భవిష్యత్‌పై ఆశ సన్నగిల్లడం, భరోసా ఇచ్చేవారు లేకపోవడం, తమ ఆలోచనలు, భయాలను చెప్పుకోవాడనికి ఎవరూ లేరన్న భావన వారిని భయపెడుతున్నాయి. అవే బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. మరణించడానికి ముందు వారు రాస్తున్న లేఖల్లోని చిన్నచిన్న అంశాల వెనుక వారు మానసికంగా ఎంత కుంగిపోయారో, ఎంత ఆవేదనకు గురయ్యారో తెలిపే బాధ నిక్షిప్తమై ఉంటుంది. భవిష్యత్‌లో తమవాళ్లు ఎంతో ఉన్నతస్థానానికి వెళతారన్న ఆశలతో విద్యాసంస్థల్లో చేర్పించిన తల్లిదండ్రులు గర్భశోకంతో కాలం గడపాల్సిన దుస్థితికి ఎవరిని నిందిస్తాం.
తమిళనాడులో అధికం..
విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నది తమిళనాడులో. మహారాష్ట్ర రెండో
స్థానంలో ఉంది. చత్తీస్‌గఢ్ మూడో స్థానంలో ఉంది. బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థినీవిద్యార్థుల సంఖ్య 2015లో 8934. వారిలో 14 శాతం మహారాష్టల్రో ఉంటే తమిళనాడులో దాదాపు వెయ్యిమంది ప్రాణాలు తీసుకున్నారు. అసలు యువతీయువకుల ఆత్మహత్యల్లో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరుగుతున్న విద్యార్థినీవిద్యార్థులు ఆత్మహత్యల సంఘటనలు ఆందోళనకలిగిస్తున్నాయి. దాదాపు 30 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో సగానికి పైగా ఇంటర్ చదువుతున్నవారే. సరిగా ఫలితాలు సాధించలేకపోతున్నామని, తల్లిదండ్రుల కోర్కె తీర్చలేకపోతున్నామని వారి సూసైడ్ నోట్‌లలో పేర్కొనడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తున్న పరిణామం. రెండు ప్రభుత్వాలు స్పందించినమాట నిజమే. ఇది కేవలం ప్రకటనలకు పరిమితం కాకూడదు. విద్యార్థి సంఘాల ఆందోళన తూతూమంత్రంగానే సాగుతుంటాయి. ఇక్కడ ప్రధానంగా మార్పు రావలసినది తల్లిదండ్రుల వైఖరిలో. వారి బాధ్యతల నిర్వహణలో. వారి ఆశలు, లక్ష్యాలలో. కన్నవారు కళ్లెదుట ఉండాలో, చేరలేని, ఛేదించలేని లక్ష్యాలను వారిముందుంచి దూరం చేసుకునే పరిస్థితులు కల్పిస్తారో వివేచనతో నిర్ణయించుకోవాలి.
కుటుంబ వ్యవస్థతో లాభం
కుటుంబం అంతా కలసి ఉండటం, ఆనందంగా ఉండటం అనే పరిణామాలు విద్యార్థినీ విద్యార్థులకు అవసరం. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ఆత్మహత్యలు చాలా అరుదు. ఒకరు కాకపోతే మరొకరు మన కష్టాన్ని వినేవారు. లోకం గురించి చెప్పేవారు. కష్టాలను గట్టెక్కే మార్గాలను స్వానుభవాలతో ఉదహరించేవారు. చిన్నప్పటి నుంచే కథలు, నీతిసూత్రాలు, చిట్కాలు, మనసు చదివే మార్గాలను నేర్పేవారు. ఇప్పుడు చిన్నకుటుంబాలు ఎక్కువయ్యాయి. దంపతులకు వ్యాపకాలు జాస్తి. పిల్లలను ఖరీదైన విద్యాసంస్థల్లో చేర్పిస్తే చాలు వారి భవిష్యత్ బాగుంటుందన్న వైఖరి పెరిగిపోయింది. విద్యాసంస్థల్లో ఫలితాలు బాగున్నా తమ పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో పర్యవేక్షణ, ఆప్యాయతానురాగాలు కలగలపిన పలకరింత దూరమైపోయింది. పదహారు నుంచి పద్దెనిమిది గంటలపాటు చదువు వారిని అచేతనులను చేస్తోంది. అదే చిన్నారుల ఒంటరితనం, కుంగుబాటుకు దారితీస్తున్నాయి. మోయలేని బరువు, తీరికలేని చదువు, పలకరింపు కరవు...ఇలా పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో తనువు చాలిస్తున్నారు.
మానసిక వైద్యంపై అశ్రద్ధ
పూర్వం మన విద్యావ్యవస్థ కేవలం చదువుకే పరిమితం కాలేదు. యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగేది. ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను రోబోలుగా మార్చేశాయి. అదే ప్రాణాలు తీస్తోంది. ఒత్తిడికి గురైన విద్యార్థులను గమనించి, వారికి సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్టులతో చికిత్స చేయించే విధానం మనదగ్గర లేదు. పెద్దపెద్ద విద్యాసంస్థల్లోనే లేదు. అసలు ఆ ఆలోచనే ఇప్పటివరకు లేదు. విదేశాల్లో అలా ఉండదు. మానసిక ఆరోగ్యాన్ని అందించే నిపుణుల కొరత మనదేశంలో చాలాఎక్కువ. దాదాపు 87 శాతం మంది నిపుణల కొరత మనకు ఉంది. బంగ్లాదేశ్ పరిస్థితి మనకన్నా మెరుగు. ప్రతి లక్షమందికి 5.6 మంది మానసిక వైద్యులు ఉండాలని ప్రపంచఆరోగ్య సంస్థ చెబుతున్నది. కానీ మనదగ్గర ప్రతి పదిలక్షల మందికి ముగ్గురు సైకియాట్రిస్ట్‌లు ఉన్నారు. ఇది సాధారణ స్థితి. ఇక విద్యాసంస్థలు ఎక్కడి నుంచి
తీసుకువస్తాయి. మానసిక వైద్యం అంటే ‘పిచ్చి’ కుదర్చడానికే అన్నది అపోహ. అసలు దిగులు, ఒత్తిడి, కుంబాటు, యాంగ్జైటీ వంటి ఎవరికైనా రావచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు కాస్త ఎక్కువ అవకాశం ఉంటుంది. వారి నడవడిక, వ్యవహార శైలిని గమనించి కాస్త ఊరడింపుగా వ్యవహరించి, చాలా తక్కువగా మందులు వాడితే సరిపోతుంది. కానీ వారితో ఆ మాత్రం గడిపే తీరుబడి ఎవరికి ఉంది. దాని ఫలితమే కడుపుకోత. ఈ ఏడాది మార్చిలో మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ అంశంపై మాట్లాడారు. కుంగుబాటు నుంచి యువతరం బయటపడేందుకు ప్రయత్నించాలని, వారికి అన్ని విధాలా తోడుండాలని పిలుపునిచ్చారు. దేశంలోని సెలబ్రిటీలు ఈ ప్రచారంలో ముందుండాలని కోరారు. ప్రఖ్యాత నటుడు, రచయిత అనుపమ్‌ఖేర్ స్పందిస్తూ తన ట్విట్టర్, మెయిల్ ఐడీలను ఇస్తూ కుంగుబాటుతో బాధపడేవారు, ఈ అంశంపై చర్చించేవారు తనతో మాట్లాడవచ్చని సూచించారు. సంతోషంగా ఉండే కుటుంబాలలో ఉండి చదువుకుంటున్న వారికి ఎటువంటి సమస్య ఉండదని, పేదకుటుంబాలు, పెద్ద లక్ష్యాలు, ఆశాజనకంగా లేని ఫలితాలు, కుటుంబ సమస్యలు ఉన్నవారి పిల్లలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నది ఎన్‌ఫోర్డ్ ఇండియా అనే స్వచ్చంద సంస్థ అధ్యయనంలో తేలింది. భారత్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలపై ఆ సంస్థ అధ్యయనం నిర్వహించింది. గత ఏడాది అక్టోబర్‌లో చేసిన సర్వే ఫలితాలపై స్పందించిన ఆ సంస్థ ప్రతినిది షయ్యబ సల్ధానా మాట్లాడుతూ ‘సంతోషంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థుల నడవడికను బట్టి మానసిక సమస్యలుంటే గుర్తించగలిగి వారికి ధైర్యం చెబుతున్నారు. ఎటొచ్చీ పిల్లలను కార్పొరేట్ సంస్థల్లో చేర్పించి ఆ తరువాత పట్టించుకోనివారితోనే సమస్య. పెద్దపెద్ద లక్ష్యాలు పిల్లలను భయపెడుతున్నాయి. వారినుంచి ఫలితం తప్ప మరేమీ ఆశించని యాజమాన్యాల కర్కశవైఖరి పసిమనసులను ఉక్కిరిబిక్కిరి చేసి ప్రాణాలు తీసుకునేందుకు ఉసిగొల్పుతున్నాయి’ అని ఆమె అంటారు. అనుకున్న ఫలితం సాధించలేకపోవడం, వైఫల్యం విద్యార్థినీవిద్యార్థులు ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంటోందని ఆ అధ్యయనం చెబుతోంది. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్లు ఫలితం సాధించలేకపోవడంతో వారు ఈ నిర్ణయానికి వస్తున్నారు. అసలు ప్రతి కార్పొరేట్ విద్యాసంస్థలో మెంటల్ హెల్త్, వెల్‌నెస్ సెంటర్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ సత్యకాంత్ త్రివేది సూచన.
ఆత్మహత్యల ‘కోట’
రాజస్థాన్‌లోని ‘కోట’ నగరం విద్యారంగానికి పెట్టనికోట. లెక్కలేనన్ని కోచింగ్ సెంటర్లు అక్కడ ఉన్నాయి. అయితే కార్పొరేట్ విద్యాసంస్థలు ధనార్జనపైనే దృష్టిపెట్టాయి. దీంతో అక్కడ చేరిన విద్యార్థులు ఫలితం సాధించాల్సిందే. అలా సాధించలేనివారు ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కువగా విద్యార్థినీవిద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నగరం ‘కోట’. ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించకుండా ఎక్కువ డబ్బు ఇచ్చినవారికి సీటు ఇచ్చి శిక్షణ ఇవ్వడం అక్కడి సంప్రదాయం. విద్యార్థి శక్తిసామర్థ్యాలను అంచనా వేయకుండా ప్రవేశం కల్పిస్తారు. ఫలితం సాధించకపోయినా, మధ్యలో మానేసి వెళ్లిపోదామనుకున్నా విద్యార్థులకు తిరిగి రుసుము చెల్లించరు. దీంతో మధ్యతరగతికి చెందినవారు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు. సగటున ఏడాదికి 60 మంది విద్యార్థినీవిద్యార్థులు అక్కడ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఐఐటి జెఇఇ, మెడికల్ ఎంట్రన్స్‌ల శిక్షణ కోసం ఏడాదికి 1.75 లక్షలమంది అక్కడి విద్యాసంస్థల్లో చేరుతుంటారు. గడచిన పదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. రోజుకు పద్దెనిమిది గంటల శిక్షణ ఉంటుంది. కేవలం 30 శాతం మాత్రమే ఉత్తీర్ణత ఉంటోంది. అయినా తల్లిదండ్రుల అత్యాశ ఫలితంగా అక్కడి విద్యాసంస్థలు డబ్బు గడిస్తున్నాయి. వీరు గర్భశోకం అనుభవిస్తున్నారు.

-ఎస్.కె.రామానుజం