S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉభయ కుశలోపరి..

తోకలేని పిట్ట జోరు తగ్గలేదు....
కాస్తంత సొబగులు అద్దుకుని మరీ మన దగ్గరకు
వస్తోంది బోలెడన్ని కబుర్లతో..
ఆధునిక కాలానికి తగ్గట్లు తన పంథాను మార్చుకున్న
తపాలా వ్యవస్థ భారతీయ సమాజంలో విడదీయలేని బంధాన్ని... పెనవేసుకుంది....
ఒకప్పుడు ఆ ఒక్క కాగితం ముక్క మనసులోని మాటను మోసుకొచ్చేది.. రాయబారాలు నడిపేది.. శ్రీవారికి ప్రేమలేఖ అదేమరి. మంచి వార్తలను, బాధ కలిగించే పరిమాణాలకు ప్రమాణపత్రంలా ఉండేది. ఊసులు, ఉబుసుపోని కబుర్లు, ప్రేమపాఠాలు, ప్రేమరాగాలు, సందేశాలు ఒకటేమిటి.. కవితలు.. కాలక్షేపానికి రాసే ఉపన్యాసాలు అంతేనా.. తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రయోగాలు ఈ ఉత్తరాలలో దొర్లేవి. చివరకు కోపాలు తాపాలు అన్నీ ఆ కాగితం ముక్కపైనే సాగిపోయేవి. విరహవేదన కన్నా జవాబుగా ఉత్తరం రాకపోవడానే్న భరించలేని కథనాయికల వ్యవహారం వెండితెరపై ఎన్నిసార్లు చూళ్లేదుకనుక. ఆ ఉత్తరాలను తీసుకువచ్చే పోస్టుమన్‌లు మనలో ఒకరుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉత్తరం.. ఉభయ కుశలోపరితోనే మొదలయ్యేది. ఎప్పుడూ ఎదుటివారి క్షేమానే్న కదా కోరేవాళ్లం. అందుకే పైన క్షేమం అనో, నచ్చిన వారి పేరు వ్రాసో మొదలెట్టేవాళ్లు.
ఆ కబుర్లు మరోసారి చెప్పుకోవచ్చు.. మన తోకలేని పిట్టకు అలుపూసొలుపూ రాలేదు.. ఔను మనదేశంలో అది దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి వార్తలు మోసుకొస్తూనే ఉంది.. ఆధునిక కాలంలో అధికారిక వ్యవస్థలో తనదైన ముద్రవేసి భారత్‌లో ఆ పిట్ట అలికిడి మొదలై ఇప్పటికి 163 ఏళ్లు దాటింది. ఒకప్పుడు ఉత్తరాలు, ఆపై డబ్బు చెల్లింపులు, తంతి మోతలు ఇవన్నీ తపాలా వ్యవస్థలో ముఖ్యమైన విభాగాలు. ఇప్పుడు ఆధునిక కాలానికి తగ్గట్లు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు సేవలు అందిస్తోంది తపాలా వ్యవస్థ. ప్రతి ఏటా అక్టోబర్ 9వ తేదీని ‘పోస్టల్ డే’గా పాటిస్తారు. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో యూనివర్శల్ పోస్టల్ యూనియన్ ఆవిర్భావానికి గుర్తుగా ప్రపంచ పోస్ట్ డేను అనుసరిస్తున్నారు. భారత్‌లోనూ అదే రోజు ఈ వేడుక నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు ‘పోస్టల్’ వారోత్సవాలు నిర్వహించడం చాలా దేశాల్లో సంప్రదాయం. ఈ సందర్భంగా మన ‘తోకలేనిపిట్ట’ కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం ఉంది.
‘ఎన్నాళ్లయిందో వాళ్ల కబుర్లు తెలిసి. ఒక్క కార్డుముక్క రాసిపడేయరా అంటే వినడు. ఈసారి రానీ వాడి సంగతి తేలుస్తా’.. అలనాడు పిల్లలనుంచి ఏ సమాచారం తెలియక అల్లల్లాడే అమ్మ మనసులోని బాధతో కూడిన ప్రేమ ఇలా మాట్లాడించేది. ‘రాసే ఉంటాడులే.. పోస్టుమేన్‌ను అడిగి చూద్దాం.. ఇవ్వడం మరిచిపోయాడేమో’ వెనకేసుకొచ్చే బంధువుల మాటసాయంలో దాగి ఉండే అభిమానం అలా మాటల్లో దొర్లేది. ఇలా ఒకటేమిటి.. మానవ సంబంధాలు, ప్రేమబంధాలు పెనవేసుకుపోయేలా చేసిన కాగితం ముక్క మన తోకలేనిపిట్ట. తెలుగు నానుడిలో ఒకటైపోయిన వార్తాహరి అది. కార్డుముక్కపై కుదురుగా, ఇరుకిరుకుగా రాసినా చెప్పాల్సిన విషయం మిగిలిపోతే కుదించి, ఆ పక్కల అంచుల్లో కూడా కిక్కిరిసిపోయే అక్షరాల మాటను దాగిన ఆదుర్దా, ఆప్యాయతలకు లెక్కగట్టగలగడం ఎవరికి సాధ్యం. పది పైసలో, అర్ధరూపాయో, ఐదు రూపాయలో కానీండి కార్డుముక్క నాలుగు మాటలు రాస్తే ఉండే తృప్తి, చదివితే దక్కే శక్తికి కొలమానం మామూలు మానవులవల్ల సాధ్యం కాదు. రాసినవారి మనసు, చదివినవాళ్ల మనసుకు సంబంధించిన విషయం అది. పసుపురంగులో ఉండే కార్డు శుభం పలికితే, నీలిరంగులో ఉండే లేఖ కాస్తంత గోప్యతకు, మనసువిప్పి చెప్పాల్సిన విషయాలకు అక్కరకొచ్చేది. ఇంటికొచ్చిన కవరు వేరెవరికో అందితే దానిని విప్పకుండా ఆ సందులోంచి, ఈ సందులోంచి విషయసంగ్రహానికి ప్రయత్నించడంలో సరదా, హాస్యం ఇప్పుడు సాధ్యమా అంటే ఔను అనలేం. మనం రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం కోసం ఎదురు చూడటంలోని ఆనందం, ఉత్కంఠ ఇప్పుడు ఏ సినిమా, ఏ నవల, ఏ సన్నివేశం ఇస్తుందో చెప్పగలవారెవరైనా ఉన్నారా? అందమైన దస్తూరీ కొన్నింట కనిపిస్తే చిత్రగుప్తుడి లిపిలా మరికొన్ని ఉండటం, చిరునామా తెలీక, స్టాంపులు అతికించక అవస్థలు పెట్టేవారి చిల్లరచేష్టలు మన జీవనయానంలో మజిలీలే. ఇక మనియార్డర్ల వ్యవహారంతో తపాలా శాఖపై ఆధారపడ్డ సగటు మనిషి జీవితంలో మధురిమలే నింపేది. వచ్చినదాంట్లో అంతోఇంతో పోస్టుమ్యాన్‌కు ఇస్తే దక్కే తృప్తి, అడగకపోయినా వినియోగదారుడి మందహాసంతో దక్కే దమ్మిడీ కడుపునింపకపోయినా మనసు నిండిపోయేది. ఇప్పుడైతే చీత్కారాలు కానీ ఒకప్పుడు పోస్టుమ్యాన్ ఆత్మబంధువు. మంచికబురు తెచ్చినపుడు మనం చిందులేస్తే, అశుభవార్త మోసుకొచ్చినపుడు అతడి మనసూ బరువెక్కేది. ఇవన్నీ తపాలాశాఖ తమవాళ్ల కష్టంగా భావించేది. ఇక వచ్చిన ఉత్తరాలను విడదీసి ఎక్కడికక్కడ సర్ది, పోస్టుమాన్లకు అందించే ‘సార్టింగ్’ ప్రక్రియ సవ్యసాచులకే సాధ్యం. అందులోని రిథమ్ చూస్తే మన కళ్లూ గిర్రున తిరుగుతాయి. వచ్చిన ఉత్తరాలపై పడే ముద్ర చెరిగిపోదు. ఆ ముద్ర కొట్టడంలో పక్కాలెక్క ఉంటుందంటే నమ్మాల్సిందే. ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు అంతకంటే నమ్మకంగా, విశ్వాసంగా విధులు నిర్వర్తించినది మనమే. ఒకప్పుడు మన కుటుంబ సభ్యుడిగా ఉండిన తపాలా వ్యవస్థ ఆధునిక సమాజానికి తగ్గట్టు రూపుమార్చుకుంది. కార్డులు, స్టాంపులు, కవర్లు కాస్త నాజూకుగా, ఖరీదుగా ఉంటే ఉండవచ్చుగాక. ఇప్పటికీ తగిన సంఖ్యలోనే వాటిని వినియోగించేవారు కోట్లలోనే ఉన్నారు. సామాజిక మాధ్యమాల జోరు పెరిగాక తపాలాకు తిప్పలు తప్పవనుకున్నారు కానీ.. అదంతా వట్టిమాటే. తక్షణ స్పందనలు, తక్షణ సమాచారానికి, పొడిపొడి మాటలకు, జవాబులకు ఆ సామాజిక మాధ్యమాలు సిద్ధంగానే ఉన్నాయి కానీ.. ఉత్తరాల మాట ఉత్తదే అంటే కుదరదు. కంప్యూరీకరణ తరువాత కాస్తంత చదువుకున్నవారికి ఈ మాధ్యమాల మాట సొగసైపోయింది కానీ.. ఇంకా ఐటీ మాట, ఊసు తెలీని ఊరికి ఉత్తరమే ఉపకారి. ఇవన్నీ మన మనసుకు, అవసరానికి సంబంధించిన వ్యవహారం. ఆదాయవ్యయాలు, ఉద్యోగాలు, వ్యాపారం వంటి విషయాల్లో మనవారి ‘ఉభయకుశలోపరి’ వ్యవహారం రికార్డుల మోతమోగిస్తోంది. ఈ పోస్టల్ డే సందర్భంగా వాటిని తెలుసుకోవడం అవసరమేగా.
అప్పటి నుంచి..
ఉత్తరాల మాట ఇవాళ్టిది కాదు. పురాణాల్లోనూ ఇలాంటి ఉత్తరప్రత్యుత్తరాల ప్రక్రియలు లెక్కలేనన్ని విన్నాం. ఉత్తరంలోని ‘విషము’నిమ్ము.. పదాన్ని మార్చి పరిణయానికి దారిచేసిన కథ తెలియనివారెవ్వరుకనుక. ఇలాంటి ఉదంతాలు లెక్కలేనన్ని. పావురాల కాళ్లకు లేఖలు కట్టి సమాచారాన్ని పంపడం ఎన్ని సినిమాల్లో చూళ్లేదు కనుక. నిజానికి ఒడిశ్శాలో మొన్నమొన్నటి వరకు పావురాల ద్వారా రహస్య సమాచారాన్ని ఉత్తరాల ద్వారా బట్వాడా చేసేందుకు ఏకంగా పెద్ద అధికార వ్యవస్థ, శిక్షణ వ్యవస్థ ఉండేదంటే నమ్మాల్సిందే. ఆధునిక సౌకర్యాలు వచ్చాక వాటికి విశ్రాంతి ఇచ్చారే తప్ప ఉత్తరాల బట్వాడాను ఆపేయలేదు. సరే ప్రపంచంలో తొలిసారిగా 1874లో స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో యూనివర్శల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైంది. చాలా దేశాల్లో పోస్టల్ వ్యవస్థలకు ఇది కేంద్రం. 1854 వరకు అప్పటి భారత్‌లోనూ పోస్టల్ సేవలు దాని పరిథిలోనే సాగేవి. ఆ ఏడాది నుంచి సొంతంగా మన దేశంలో తపాలా వ్యవస్థ మొదలైంది. మూడునాలుగు రకాల సేవలు మాత్రమే, పరిమిత ప్రాంతాలకు మాత్రమే సేవలు అందేవి. రానురాను విస్తృతమయ్యాయి. అంటే దాదాపు 163 ఏళ్ల క్రితం తపాలా వ్యవస్థ మనదగ్గర మొదలైందన్నమాట. ప్రస్తుతం మన తపాలా వ్యవస్థకు ప్రపంచ రికార్డు ఉంది. ఎక్కడా లేనంత సంఖ్యలో పోస్ట్ఫాసులు, ఉద్యోగులు ఉన్న తపాలా వ్యవస్థగా ప్రపంచ రికార్డు మనదే. దేశం మొత్తం మీద 154,934 పోస్ట్ఫాసులు ఉంటే వాటిలో 89.86 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలు అందిస్తున్నాయి. పట్టణాల్లో ఉన్న పోస్ట్ఫాసుల సంఖ్య కేవలం 15,826 మాత్రమే. ఎందుకంటే ఉత్తరాల ద్వారా సమాచారాన్ని పంపుకునే అవసరం గ్రామీణులకే ఎక్కువ ఉంది. పూర్వం రోజుల్లో వౌలిక రవాణా సదుపాయాలు లేకపోయినా కేవలం సామాజిక బాధ్యత, సేవాదృక్పథంలో తపాలా వ్యవస్థ పనిచేసేది. అందులోని సిబ్బంది కూడా లాభాపేక్ష లేదా ఆర్థిక లాభాన్ని బేరీజు వేసుకోకుండా శ్రమతోకూడిన వ్యాపకమే అయినా మనస్ఫూర్తిగా పనిచేసేవారు. అందుకే తపాలా అన్నది కుటుంబ వ్యవహారంగా మారిపోయింది. ప్రతి ఎనిమిదివేల జనాభాకు సగటున ఒక పోస్ట్ఫాసు ఏర్పాటు చేయడం సాధారణమైపోయింది. ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న పోస్ట్ఫాసు మనదే. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘హిక్కిం’ పోస్ట్ఫాస్ సముద్ర మట్టానికి దాదాపు 15వేల అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. ఏడాదిలో ఆరునెలలపాటు మిగతా ప్రాంతంలో సంబంధాలు ఉండని ఈ గ్రామంలో ఉండే కొద్దిపాటి కుటుంబాలకు సమాచార వారథి ఈ పోస్ట్ఫాసు. ఒకప్పుడు మూడు లేదా నాలుగు రకాల సేవలు మాత్రమే అందించే తపాలాశాఖ ఇప్పుడు విస్తృత స్థాయిలో సేవలు అందిస్తూ వ్యాపారం చేస్తోంది. చిన్నమొత్తాల పొదుపు ఉద్యమాన్ని ఊరూరా ప్రోత్సహించిన వ్యవస్థ ఇది. కేవలం పొదుపుఖాతాల ద్వారా డిపాజిట్లలో సేకరించి ఉన్న మొత్తం గత ఏడాది లెక్కల ప్రకారం రూ.6,19,317.44 కోట్ల రూపాయలంటే నమ్మక తప్పదు. చిన్నమొత్తాల పొదుపుఖాతాదారుల సంఖ్య అక్షరాలా ముప్పైమూడు కోట్ల 3వేల మంది. 195 దేశాలకు డబ్బులు పంపి, తీసుకునే వెసులుబాటుకూడా ఈ శాఖ కల్పిస్తోంది. మనీ ట్రాన్స్‌ఫర్, బ్యాంకింగ్, లెటర్‌పోస్ట్, పార్శిల్ సర్వీస్, ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీసు, ఫ్రైట్ సేవలు, థర్డ్‌పార్టీ లాజిస్టిక్ సేవలు, డిపాజిట్లు, పొదుపుఖాతాల నిర్వహణ, స్టాంపుల విక్రయం, మై స్టాంప్ వంటి పథకాలు, ఎటిఎమ్ సేవల రూపంలో తపాలా వ్యవస్థ విస్తృతమైంది. గత మార్చి నాటికి ఈ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 448,840. వీరు కాక ఇడి ఉద్యోగుల సంఖ్య అదనం. ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఉంటుంది.
ఆధునిక సౌకర్యాలతో..
మారిన కాలానికి అనుగుణంగా తపాలాశాఖలో మార్పులు చేశారు. ‘ఆపరేషన్ యారో’ పేరిట చేపట్టిన చర్యలు ఆ శాఖ రూపురేఖలను మార్చాయి. ఆధునిక వాహనాలు సమకూర్చారు. కంప్యూటరైజేషన్ విస్తృతంగా చేశారు. బ్యాంకింగ్ సేవలు, ఎటిఎమ్ సేవలు, ప్రత్యేకంగా ఖాతాదారులకు డెబిట్ కార్డులు, రూపే కార్డులు అందచేశారు. 2008 నుంచి తపాలా శాఖలో ఆధునికత మొదలైంది. దాదాపు 23,500 పోస్ట్ఫాసులను అప్‌గ్రేడ్ చేశారు. అందులో దాదాపు 3వేల పోస్ట్ఫాసుల్లో ఈ మార్పుల తరువాత సేవలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి 1991లోనే తపాలా శాఖలో కంప్యూటరైజేషన్ మొదలైంది. అప్పట్లోనే 25,464 పోస్ట్ఫాసుల్లో కంప్యూటర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఇక తపాలాశాఖ విశ్వరూపం దాల్చిందనే చెప్పాలి. వ్యాపారం, సేవలు కలగలపి విజృంభిస్తోంది. ‘మై స్టాంప్’ వంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రత్యేక సందర్భాలలో విడుదల చేసే తపాలా స్టాంపుల మాదిరిగా మనకు నచ్చినవారి స్టాంపులను నియమిత ఛార్జీలకు, నియమిత సంఖ్యలో నిర్ణీత ధరకు అందించడం ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతమైన పథకంగా నిలిచింది. ఉత్తరాల బట్వాడాలో కొన్ని సందర్భాలలో పొరపాట్లు దొర్లుతూంటాయి. ఎన్నో ఏళ్లకు గాని ఉత్తరాలు రాకపోవడాన్ని తప్పుబడతారు. కానీ ఒకప్పుడు ఎలాంటి వౌలిక సౌకర్యాలు ఉండేవి కావు. ఒకటీ అరా సంఘటనలను ఆ వ్యవస్థను తప్పుపట్టడానికి ఉపయోగించడం సరికాదు. ఆ జాప్యం జరగకుండా త్వరితగతిన ఉత్తరాల బట్వాడాకు ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని 990 మొబైల్ పోస్టల్ వ్యాన్‌లు ఉంటే 926 వాహనాలకు జిపిఎస్ అనుసంధానం చేయాలని నిర్ణయించడం, వాటిలో 500కి ఆ సౌకర్యం అందుబాటులోకి రావడం విశేషం. మొత్తం పోస్టల్ ఇండెక్స్ నెంబర్ల (పిన్ కోడ్) వ్యవస్థలో 9 సర్కిల్స్ ఉంటే తొమ్మిది సంఖ్యతో మొదలయ్యే పిన్‌కోడ్ రక్షణ విభాగానికి సంబంధించినదన్నమాట. చివరిగా ఓ మాట చెప్పుకోవాలి. మన దేశంలో భూటాన్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, పోర్చుగల్, ఇథియోపియా స్టాంపులు ముద్రించుకుంటాయ.

ఎతె్తైన ప్రాంతంలో పోస్ట్ఫాస్ మనదే
హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం కొండ ప్రాంతపు గ్రామంలో ఉన్న పోస్ట్ఫాసు ప్రపంచంలోనే ఎతె్తైన ప్రాంతంలో ఉన్న తపాలాశాఖగా రికార్డు సాధించింది. ఇక్కడ ఉండేవారిలో అత్యధికులు బౌద్ధులు. 8వ తరగతివరకు విద్యాభ్యాసం చేసే వెసులుబాటు ఉంది. దీనికి ప్రత్యేకమైన పిన్‌కోడ్ 1721114 ఇచ్చారు. తొలిసారిగా విమానంలో పోస్టల్ సేవలు అందించిన పోస్ట్ఫాస్‌గా కూడా దీనికి రికార్డు ఉంది. 1911లో ఫ్రెంచ్ పైలట్ దాదాపు 6 వేల ఉత్తరాలతో 15 కిలోల కార్డులు, కవర్లతో కూడిన బ్యాగేజీని విమానంలో తరలించడం అప్పట్లో రికార్డు. ఆ పైలట్ పేరు హెమి పెకెట్. అలహాబాద్, నైని మీదుగా 27 నిమిషాలు ప్రయాణించి వాటిని అందజేశాడు. హిక్కింలో ఒక హాస్టల్‌కు సంబంధించిన దాతృత్వ కార్యక్రమానికి చెందిన లేఖలు అవి. అక్కడ ప్రజలకు లేఖలు అందచేయడం విభిన్నంగా ఉంటుంది. రాళ్లతోపక్కపక్కనే కట్టుకున్న ఇళ్లలో నివసిస్తారు. ఏడాదిలో మూడొంతుల కాలం మంచు కప్పేస్తుంది. మిగతా రోజుల్లో వ్యాయామం కోసం వచ్చే ప్రజలకు పరుగున వెళ్లి అసలు చిరునామాదారులకు ఇవ్వాల్సిందిగా పోస్టుమాస్టర్ కోరతారు. టూరిస్టులు, స్థానికులు ఈ పోస్ట్ఫాసులో పొదుపు చేసుకోవచ్చును. ఉత్తరాలు, స్టాంపుల విక్రయాలు సాగుతాయి. అక్కడి పోస్ట్ఫాసు, పోస్టుమాస్టర్ ఇల్లు ఒకటే. అన్నట్లు, అత్యంత ఎతె్తైన ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతం కూడా ఇదే.
జ్ఞాపకాల దొంతర!
చిన్నప్పుడు అమ్మరాసిన ఉత్తరమో, యవ్వనంలో ప్రేయసి రాసిన ప్రేమలేఖో కాస్తంత వయసు మీదపడ్డాక చదువుకుంటే అప్పటి మధుర స్మృతులు గుర్తుకువచ్చి చిరుదరహాసం చిందడం చాలామందికి అనుభవమే. మనం రాసి పోస్టు చేయని ఉత్తరాలు కనిపించినా నవ్వుకోని లేదా గుండె బరువెక్కని సంఘటనలు ఎదురుకాని జీవితాలు ఉండనే ఉండవు. కొందరి ఉత్తరాలకు విలువకట్టలేం. కొందరి ఉత్తరాలను ఖరీదుపెట్టి కొని గర్వపడతాం. మన ఉత్తరాల్లో కొన్ని వాటికన్నా విలువైనవిగా భావిస్తాం. మంచి వార్త మోసుకొచ్చిన లేఖలను ఓ తీగకు గుచ్చి ఉంచడం పాతకాలం అలవాటు. చెడువార్త మోసుకొచ్చిన వాటిని చదివి కన్నీటి పర్యంతమై.. అక్కడితో ఆ చెడును వదిలేయాలని అనుకోవడం, అలాంటి ఉత్తరాలను నీళ్లలో పడవేయడంలో ఆంతర్యం మనసును తేలికచేసుకోవడమే. భార్య, పిల్లలకు దూరంగా ఉన్నప్పుడు మురిపెం కొద్దీ పిల్లలు వచ్చీరాని అక్షరాలతో రాసిన ఉత్తరాలు ఇప్పుడు వారికి చూపించి నవ్వుకోవడంలో ఆనందాన్ని ఎవరు కొలిచి చెప్పగలరు. ఎదురుగా మనిషి ఉన్నా చెప్పలేని, చెప్పుకోలేని ఎన్నో అంశాలను ఒక్క ఉత్తరం ముక్కలో ఎంచక్కా వివరించగలగడం మనవాళ్లకి ఓ సులువైన మార్గం. ఒకరికి రాసిన ఉత్తరం చేరకూడని మరొకరికి చేరడం, అది మనకంట పడటం, ఇరుక్కుపోవడం, చేసేది లేక పళ్లు ఇకిలించడంలో మజా అనుభవిస్తేనే తెలుస్తుంది. బెదరింపులు, అదలింపులు, నేరుగా చెప్పలేక రాసే ఆకాశరామన్న ఉత్తరాల్లో ఉండే నిజం కన్నా రహస్యమే ఎక్కువ. రామన్న ఉత్తరాలనే ఎందుకనాలి, సీతమ్మ ఉత్తరాలని ఎందుకనకూడదని ఎవరైనా మహిళలు ప్రశ్నిస్తే ఏం చెప్పలేంగానీ, ఎక్కువగా ఉత్తరాలు రాసేది మగవాళ్లేమో. చదివేది, పడేసేది ఆడవాళ్లేనేమో! ఈ వివాదం సంగతి పక్కనపెడితే చరిత్రలో పేరుమోసిన పెద్దవాళ్ల ఉత్తరాల్లోని విషయాలు సంచలనాలకు కారణమవడం చరిత్రలో చాలాసార్లు జరిగింది. అయితే సగటు మనిషి ఉత్తరప్రత్యుత్తరాల్లో తొంగిచూసే మనసు కోరేది.. ఉభయ కుశలోపరి మాత్రమే!

తేలియాడే పోస్ట్ఫాస్
మన దేశంలో తేలియాడే పోస్ట్ఫాస్ ఒకటి ఉంది. కశ్మీర్‌లోని దాల్ సరస్సులో దీనిని ఏర్పాటు చేశారు. ఓ హౌస్‌బోట్‌లో తపాలా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ అమ్మే పోస్టుకార్డులు, ఇన్‌లాండ్ కవర్లపై కశ్మీర్‌కు చెందిన అందాల చిత్రాలను ముద్రిస్తారు. స్టాంపులు విక్రయిస్తారు. కశ్మీర్ సావనీర్ ఇక్కడ లభిస్తుంది. 2011లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిని ప్రారంభించారు.

-ఎస్.కె.రామానుజం