S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ.. అబ్ లౌట్ చలే!

అందరూ ఈ లోకంలో బతుకుతారు. అతను మాత్రం ఊహాలోకాల్లో బతుకుతాడు. అంతమంది జనం మధ్యన నడుస్తూ, అందరినీ పరిశీలిస్తున్నాను, అనుకునే అతను అమాంతంగా అదేదో లోకంలోకి వెళ్లిపోతాడు. అయితే అక్కడ కూడా మనుషులే ఉంటారు. అతనికి మనుషులంటే ఇష్టం. మనుషులు ఉంటే బాగుంటుంది. కానీ, వాళ్లెవరూ తనతో మాట్లాడకూడదు. ఎవరూ తనను పట్టించుకోకూడదు. తాను మాత్రం అందరినీ చూడాలి. ఎవరినీ పలకరించడం ఉండదు. అట్లా మరో లోకంలోకి వెళ్లిన అతను, సినిమాలో ఇంటర్వెల్‌లాగ, సీరియల్‌లో వ్యాపార ప్రకటనల లాగ, మరోసారి చుట్టూ ఉన్న నిజం ప్రపంచాన్ని గమనిస్తాడు. అతను నడవడం లేదు. కాళ్లు నడుస్తున్నాయి. కాళ్లకు దారి తెలియదు. కదలడం మాత్రమే తెలుసు. ఈసారి కళ్లు పనిలోకి దిగాయి. కనిపించే అంగళ్లు, ఇళ్లు తెలిసినవే. కానీ, తాను అటుగా కాదు పోవలసింది. ఇంటికి వెళ్లిపోదాం అని గదా, ఆలోచన. కానీ, ఇంకా కొంచెం ముందుకు నడిచినట్టున్నాడు.
అక్కడ ఒక టీ దుకాణం, పాల అంగడి, కూల్‌డ్రింక్‌ల అంగడి, చిన్న హొటేల్, చపాతీల అంగడి, ఫాస్ట్ ఫూడ్ స్టాల్... అవును, ఏమిటిది? మనుషులకు తిండి యావ మరీ ఎక్కువయింది ఎందుకు? స్పెషల్ కార్న్ సమోసా అని పెద్ద ప్రకటన. అందుకు ఒక అంగడి. సమోసాలు ఆలూ ఉన్నంతవరకు బీహార్‌లో లాలూ ఉంటాడు, అనే నినాదం గుర్తుకు వచ్చింది. అంటే ఏమిటి అర్థం. బంగాళాదుంప మసాలా నింపి సమోసా తయారుచేస్తారు, అని గదా! జంట నగరాలలో సమోసాలు పిడికిలి ప్రమాణంలో ఉంటాయి. బెంగాలీ వారు సింగాడా అనే పేరుతో చిన్నచిన్న సమోసాలు తయారుచేస్తారు. ఈరానీ, చాయ్ దుకాణాలలో అదో రకం సమోసాలు ఉంటాయి. మిఠాయి అంగళ్లలో, ఎంత కాలమయినా నిలువ ఉండే, డ్రయ్ సమోసాలు దొరుకుతాయి. మరి ఈ కార్న్ సమోసా ఏమిటి? మొక్కజొన్న, లేదా మక్కలు వాడి, సమోసా తయారుచేస్తారా? కొని చూస్తే తెలుస్తుంది. తిని చూస్తే తెలుస్తుంది. అన్ని సంగతులు, ఆలోచిస్తే, అర్థంకావు.
ఈరానీ చాయ్ దుకాణాలు ఉన్నాయా? ఇక్కడ ఒక టీ బంక్ ఉంది. అది చిన్న హొటేల్ ముందు ఉంది. అంటే హొటేల్లో టీ అమ్మరని అర్థమా? అక్కడ టీ తయారుచేసే పద్ధతి చిత్రంగా ఉంది. తనకు తెలిసిన పద్ధతిలో లేదు. ఇంట్లో చేసుకుంటే కూడా టీ రుచించడం లేదు. ఇట్లా గంటలపాటు మరిగిన చాయ్ ఏం బాగుంటుంది?
అంతా సులభంగా జరగాలి. అన్నీ కష్టపడకుండా, అందుబాటులోకి రావాలి. దాని పేరు ప్రగతి. వంట చేసుకునే ఓపిక గూడా లేకుంటే, ఇక బతుకు ఎందుకు? ఆ తిండి ఎందుకు. అడుగడుగునా కరీపాయింట్‌లు. దోశె బండ్లు. ఏం బాగలేదు. మనిషికి మరీ తిండి ధ్యాస ఎక్కువయినట్టుంది. గుడి గోడ పక్కన గుడిశె వేసి, అక్కడ ఒక హొటేల్ స్థాపించాడు ఒక మహానుభావుడు. రోడ్ మీద నిలబడి తినడం మరీ ఎక్కువయినట్లు...
ఇక్కడే వచ్చింది చిక్కు. ఇంటికి పోదాం అనుకున్నాడు. కాళ్లు మరింత ముందుకు కదిలి మరెక్కడికో తెచ్చాయి. ఇంటిదారి పట్టవలసింది పోయి, అతను మళ్లీ ఆలోచనా లోకంలో తేలుతున్నాడు. ఇప్పుడు తేరుకున్నాడు లాగుంది. నడక ఆగింది, అటుయిటు చూస్తున్నాడు. రోడ్ దాటాలనే ప్రయత్నంలో ఉన్నట్టు కనబడుతున్నాడు. అటువేపు చేరితే వాళ్ల యింటికి వెళ్లే దారి దొరుకుతుంది. మరి బుద్ధిగా ఇంటికి పోతాడా? మనం వెంట నడిస్తే తప్ప తెలియదు గదా! గుడి గోడకు కొట్టిన పిడకలు కనిపించాయి. ముఖం మీద సుడులు తిరుగుతున్నాయా కొంపదీసి? సినిమా పద్ధతిలో ఫ్లాష్‌బాక్‌లోకి వెళితే, పల్లె, బర్రెలు పేడ, పిడకలు, రామాయణం, వేట, సంక్రాంతి, మందులు ఎంత దూరమయినా వెళ్లిపోతాడు. అవును మరి, కలిసి నడిస్తే వారు వీరవుతారని గదా మాట. అతను ఏం చేస్తాడో గానీ, మనకు ఆలోచన అలవాటయినట్టుంది. అందరూ ఆలోచించాలి. కానీ, చివరకు, అందరూ తమ యింటికే వెళ్లాలి అంటాడు అతను.
గుడి పక్కనున్న మాంసం దుకాణం కనిపించింది. గాంధీ సారాయి షాపు గుర్తుకు వచ్చింది. గాంధీ అంటే మోహన్‌లాల్ కరమ్‌చంద్ గాంధీ ఒకడేనా? నినికి గుజరాత్‌లో గాంధీ అనేది ఒక ఇంటి పేరు. ఆ ముసలాయన కారణంగా చాలామంది గాంధీ అని తమ పిల్లలకు పేరు పెట్టుకున్నారు. మోహన్‌లాల్ అని ఒక సినిమా నటుడు ఉన్నాడు. అతనికి గాంధీ కారణంగా ఆ పేరు పెట్టారా? తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకోవాలి. ఎన్నో తెలుసుకోవాలి. కరమ్‌చంద్ అని ఒకప్పుడు టీవీలో సీరియల్ వచ్చింది. సమస్య అదిగాదు. పెద్ద మనుషులు, ప్రసిద్ధులయిన వారి పేరు పిల్లలకు పెట్టుకోవాలి. రవీంద్రనాథ్ అని పేరు పెట్టవచ్చు. అయితే ఆ పేరు రవీంద్ర కవీంద్రుని చూచి పెట్టుకున్నది అని ఎవరికీ తెలియదు గదా? అందుకే బాగోర్ అని కూడా పెట్టుకోవాలి. అందుకే తెలుగు వారిలో టాగోర్‌లు, బోస్‌లు ఉంటారు. అదొక పద్ధతి. లెనిన్, స్టాలిన్ అనే పేర్లు ఉండగా లేనిది బోస్ అంటే ఏం తప్పు?
తమిళంలో క,ఖ,గ,ఘ లకు కలిసి ఒకటే అక్షరం. అట్లాగే త,్థ,ద,్ధలకు కలిపి ఒకటే అక్షరం. అక్కడ గాంధీనగర్ ఉంటే, ఉంటుంది, ఎందుకు ఉండదు. దేశభక్తికి లోటు లేదు గదా, దాన్ని, కాంతీనగర్ అనే అవకాశం నిండుగా, మెండుగా ఉంది. చ,్ఛ,జ,ఝలకు ఒకే అక్షరం కనుక చారి పాపం జారి పడతాడు...
ఏమయింది? ఎక్కడికి వచ్చాడు? ఎవరు? మనం కాదు! ముందు అతను నడవాలి. వెనుక మనం నడవాలి. అతనుడంటే శరీరం లేనివాడు. అంటే మన్మథుడు. అంటే మనస్సును మధించేవాడు. ఇతను అతనుడేమీ కాదు. శరీరం ఉంది. బహుశః ఒక పేరు కూడా ఉండే వీలుంటుంది. ఆధార్ కార్డ్ కూడా ఉండి ఉంటుంది. ఆసుపత్రిలో పేషెంట్లు ఉంటారు. పేషంట్ అంటే ఓపికగల అని అర్థం. పేషంట్లకు ఓపిక ఉండదు. వాళ్ల వెంట వచ్చిన వారికి అసలే ఉండదు. ఇక్కడ పేరుకు అతను అతనుడు. నిజంగా శరీరం లేనిది మనకు! వెళ్లిపోతాడండీ, పదండి, సోది ఇప్పుడు అనవసరం!
ముఖంలో ఇంటి ప్రాంతానికి వచ్చాం అన్న ధీమా కనబడుతున్నది. ఎదురుగా మందుల దుకాణం కనబడుతున్నది. ఇంకొంచెం దూరం తర్వాత మందు దుకాణం కనబడుతున్నది. రెంటి ముందూ ఉచితంగా ఇస్తున్నారేమో అన్నట్లు బోలెడంత మంది జనం! తోసుకోవడం మాత్రం లేదు. ఎంత క్రమశిక్షణ! ఎంతటి ఓపిక! ఇప్పుడు కాళ్లు ఇంటికి తీసుకుపోతాయి. కానీ, దారి సవ్యంగా ఉండాలి గద! కొన్నిచోట్ల ఆలోచిస్తూ నడవవచ్చు. కొన్నిచోట్ల ఎక్కడికి అన్న ఆలోచన లేకుండా నడవవచ్చు. బర్లగడ్డ, పెండగల్లీల్లో అట్లా నడిస్తే ఏకంగా పెండలో కాలు దిగబడుతుంది. అయ్యో, అనుకుని మరో కలా ఎత్తి, ఆ పక్కన దింపితే, అది బురదలో పడుతుంది. అందువలన, చేత, కాబట్టి అక్కడ కళ్లు పెద్దవిగా తెరుచుకుని, అడుగు అడుగును గమనించుచు ముందుకు సాగవలెను. ‘జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురగా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా’ అని మనసులో బ్యాక్‌గ్రౌండ్ పాట కూడా వినిపిస్తుంది..
అవును! అతను అప్పుడెప్పుడో అయిదవ అంతస్తు నుంచి దిగి గదా, నడక మొదలుపెట్టింది! ఎంతమందికి గుర్తుంది? ఎవరయినా అతను బయలుదేరిన నాటి నుంచి వెంట నడుస్తున్నారా? అవును. పెండగల్లీ, బర్లగడ్డ దాటి అయిదు అంతస్తుల ఇంటికి పోగూడదని ఎక్కడున్న రాసి పెట్టి ఉన్నదా? అతను ఇంటికి చేరినట్లయితే, మనం వెంటపోయి తొంగి చూడడం గౌరవంగ ఉండదు. ఎట్ల మరి? అతను మాత్రం అంత తొందరగ ఇంటికి చేరి చేసేందుకు ఏముంటుంది? తన యింట్లో ఎవరయినా ఏమీ చేయకుండ కూడ ఉండవచ్చు గద! కానీ అతను ఆలోచించే తీరు మనకు అర్థమయింది. అలవాటు కూడ అయింది. మనమేదో ఆలోచనలో పడితే, అతను ఎక్కడికో మాయమయ్యాడు? ఏదీ అతను? ఏమయ్యాడు? వీల్లేదు. అతను కనిపించకుండా పోకూడదు. పదండి. వెదుకుదాం!

కె. బి. గోపాలం