S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘ఇతరుల కష్టము ఎవ్వడెరుగునో అతడే వైష్ణవుడు’

పండుగలూ, పర్వదినాలూ ఇతర దేశాల్లో కంటే మనకే ఎక్కువ.
వినాయక చవితి అనగానే గణేశ విగ్రహాల నిమజ్జనం.. అదో పెద్ద తతంగం - సంబరం కూడా. అమ్మవారి శరన్నవరాత్రులు సరేసరి. శ్రీరామ నవమి ఉత్సవాలూ, యిలా ఒకదాని వెంట మరోటి వరుసగా వస్తూ భక్త్భివాన్ని, కొన్ని రోజులపాటు ప్రబోధిస్తూ వచ్చి వెళ్లిపోతూంటాయి. మాతృభూమిని తలుచుకుంటూ, ఒకవైపు బానిసత్వపు సంకెళ్లను ఛేదిస్తూనే, మరోవైపు ఆ బానిసత్వానికి బలవ్వడానికి జాతిలోని ఏయే పాపాచరణలు కారణమో గ్రహించి, వాటి నుంచి, జాతికి విమోచనం కలిగించడానికి దీక్షతో పని చేసిన ‘జాతిపిత’ను మాత్రం ఏ జయంతికో వర్థంతికో తలుచుకుని ఊరుకుంటాం. అంతే. మళ్లీ ఏ ఏడాదికో గాని, ఆయన గుర్తుకు రాడు. గాంధీ జీవితం చూడండి.
తెల్లజాతిని తరిమికొట్టడానికెంత ప్రయత్నించాడో - హరిజనోద్ధరణ కూడా అంతగానూ ప్రయత్నించాడు. పైగా ఈ రెండు ప్రయత్నాలూ ఏకకాలంలో నిర్వహించిన ఘనుడు.
ఆయన అందుకున్న గీతా సందేశమే ఆయన్ని అంతటి స్థితిలో నిలబెట్టి, అంతటి బృహత్తరమైన కార్యాన్ని నిర్వహింపచేసింది.
భారతదేశ స్వాతంత్య్ర సమరానికి ముందు కూడా ఎందరో హేమాహేమీలైన నాయకులున్నారు. లేకపోలేదు. దానిక్కారణం ఆయన రూపమూ కాదు, తెలివితేటలూ, సామర్థ్యమూ కాదు. ‘జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో ఆయన చూపించిన ‘దీక్ష’ - పట్టుదల, క్రమశిక్షణ. ఆ దీక్షకూ, పట్టుదలకూ నాయకులంతా శిరస్సు వంచారు. స్పష్టమైన కర్తవ్యం తెలిసికున్న పూర్ణ పురుషుడు గాంధీ.’ అన్నారు. అన్ని సంప్రదాయాలనూ గౌరవించాడు. సకల సిద్ధాంతాలనూ అధ్యయనం చేశాడు. రెండడుగులు ముందుకేస్తే పదడుగులు వెనక్కి లాగే మనస్తత్వం కలిగిన వాళ్లందర్నీ ఏకతాటి మీద నడిపించాడు. ఔనా? కాదా? త్రికరణ శుద్ధిగా మనిషి సంకల్పిస్తే ఎటువంటి మహత్తర కార్యాలు చేయవచ్చునో నిరూపించి చూపించాడు. మహాత్ముడై గౌరవింపబడుతూ జాతికి చిరస్మరణీయుడయ్యాడు. ఆయన మాటే వేదవాక్కై జాతిని నడిపించింది.
హరికథలలోనూ, ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో, జాతీయ పండుగ దినాల్లో మా నాన్నగారు పాడుతూండే పద్యమిది.
ఎవ్వాడు నవ్విన నివ్వసుంధర యెల్ల జలధర శ్యామమై చలువలీను/ ఎవ్వాని క్రోధాగ్నికే, డువారాసులు పాయలై భూమి గర్భమున నింకు/ ఎవ్వాని నిద్రకు నీక్షోణి మర్త్యాళి ప్రళయకాలపు భంగి కళవళించు/ ఎవని సిద్ధాంతముల్ హృద్యమై వంద్యమై ఆచంద్ర తారార్కమై వెలుంగు/ ఎవ్వడభినవ బుద్ధుడై నివ్వటిల్లి విమల సత్యాగ్రహ వ్రతంబు వెలయజేసి/ మానవాళికి నొరవడై మనుచునుండె అట్టి గాంధిని స్మరియింపు మాంధ్రుడనీవు
జాషువా రాసిన పద్యం.
ఒక మనిషి సంకల్పం ఆ వ్యక్తి సంసారానికి, జాతి సంస్కృతికీ దిక్సూచి ఔతుంది. అటువంటి ప్రతిభా మూర్తులలో జాతిపిత గాంధీ నిత్య స్మరణీయుడు.
ఆయనంటే నచ్చనివారు, ఆయన సిద్ధాంతాలతో విభేదించిన వారు, నచ్చినవారు ఆయనకు శిరస్సు వంచి నమస్కరించారు. కేవలం కండువా, అంగవస్త్రంతో ప్రపంచాన్ని చుట్టిన ఆ వ్యక్తి ఆత్మస్థైర్యం ఎంతటిదో చూడండి.
మనోవాకాయ శుద్ధితో చేసే పనులకు దైవం సహకరించకుండా ఉంటాడా? యిటువంటి పదిమందినీ ఒక్కతాటిపై నడిపించే నాయకులు భూతద్దం పెట్టి వెదికినా ఈ వేళ కనిపించరు. సంగీత ప్రియుడౌనో కాదో తెలియదు కానీ మహాత్ముడికి..
వైష్ణవ జనతో..
రఘుపతి రాఘవ రాజారాం.. వంటి భజనలు ఎంతో యిష్టం.
‘్భరతరత్న’ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి చేత పాడించుకుని వినేవాడు. నా అనుభవంలో.. ప్రతి శుక్రవారాల్లో ఉదయం విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే ‘గాంధీ మార్గం’ కార్యక్రమం ఎంతమంది శ్రోతలు వినేవారో నాకు తెలియదు గానీ నేను పనిచేసే కాలంలో మాత్రం గాంధీ జయంతి రోజునో, వర్థంతికో మాత్రం ఈ భజన్‌లు యివతలకు వచ్చేవి. ప్రసారమయ్యేవి. గాంధీ ఆత్మకథకు తెలుగు అనువాదం పుస్తకంతోబాటు జుతీకారాయ్, లతా పాడిన భజన్ రికార్డులు ప్రసార కక్ష్య (స్టూడియో)కు పంపిస్తూండేవారు. ఈ కార్యక్రమం ఎవరు వింటారులే? అనుకుంటూ మొక్కుబడిగా చదివే కొందరు ఎనౌన్సర్లుండేవారు. శ్రద్ధగా మనసు పెట్టి నిర్వహించేవారూ ఉండేవారు. కదలకుండా స్టూడియోలో కూర్చుని ప్రసారం చేసే ఉద్యోగమవడం వల్ల ఈ ‘గాంధీ మార్గం’ కార్యక్రమం అప్పటికప్పుడు ‘లైవ్’ చదివేవాణ్ణి. నాకు మాత్రం ‘మహాత్ముడి ఆత్మకథ (సత్యశోధన)’ నుండి చదివే కొన్ని అధ్యాయాలు ఒక్కోసారి ఆలోచింపజేస్తూండేవి. ఆశ్చర్యం గొలిపేవి కూడా.
ఒక సూర్యుడు మొత్తం లోకాన్ని వెలుగుతో నింపేసినట్లు, ఎక్కడో పోర్‌బందరులో పుట్టిన ఓ సామాన్యమైన వ్యక్తి, బారిష్టరై నాలుగు చేతుల్తో పుష్కలంగా సంపాదించగలిగీ కూడా ఏవిటో నేను, నా దేశం, నా ప్రజలనుకుంటూ స్వతంత్ర సమర శంఖారావాన్ని పూరిస్తూ కార్య సాధనోన్ముఖుడై ఈ జాతిని ఒక్క తాటిపై నడిపించగలగడం.. అదేమన్నా సామాన్య విషయమా? చెప్పండి. ఆయన నరనరాల్లో దేశభక్తి ఎలా జీర్ణించుకు పోయిందో, ఆయన జీవిత ఘట్టాలు చదువుతున్నప్పుడు తెలిసేది. ఆ రోజంతా అవే మనసు తిరుగుతూండేవి.
‘వైష్ణవ జనతో’ అనే హిందూ భజన 15వ శతాబ్దంలోని గుజరాతీ భాషలో నర్శీ మెహతా రాశాడు.
శబర్‌మతి ఆశ్రమంలో చేసే నిత్య ప్రార్థనలో, ఈ భజన వుండేది. 1999లో గంగూభాయ్ హంగల్, పండిట్ జస్‌రాజ్, పాప్ స్టార్ రెమో ఫెర్నాండెజ్, సరోద్ విద్వాంసుడు అంజాదాలీ ఖాన్, హరిప్రసాద్ చౌరాసియా, శివకుమార్ శర్మ (సంతూర్ వాద్య కళాకారుడు) మొదలైన కళాకారులు ఈ భజన్‌ని బహుళ ప్రచారం చేశారు. ‘వైష్ణవ జనతో తేనే కహియే’ భజన్, ఒక మలయాళం సినిమా కోసం ప్రసిద్ధ గాయని బొంబే జయశ్రీ ‘పల్లవి’ మాత్రం పాడింది.
‘హరి తుమ్ హరో’ మరో ప్రసిద్ధమైన మీరా భజన్ కూడా మహాత్ముడి కిష్టమైనదే. ‘మీరా’ సినిమాలో సుబ్బులక్ష్మి పాడింది. మీలో కొందరు చూసే వుంటారు. నామ రామాయణానికి లక్ష్మణాచార్య చేసిన అనువాద రచనే ‘రఘుపతి రాఘవ రాజారాం’.
ఒక మంచి భావన మనిషిని ఎంత ఉద్ధరిస్తుందో ఎంతటి ధన్యతను అందిస్తుందో మహాత్మాగాంధీ జీవితాన్ని చదివితే అర్థవౌతుందనిపిస్తుంది నాకు. త్యాగంలో గొప్పతనం, ఔన్నత్యం, హుందాతనం, నిర్భరత్వం గుర్తించటం తెలియకపోవటం వల్ల, సంకుచిత భావాలు మితిమీరటంలా? త్యాగ భావంతో బ్రతికిన నాడు ఎవరైనా, జీవన్ముక్తుడౌతాడనడానికి సాక్షి గాంధీ. డా.పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన ‘వైష్ణవ జనతో’ భజనకు తెలుగు సేత (సరస్వతీ పుత్ర, పద్మశ్రీ) సాహిత్యాన్ని పరిశీలించండి. సరళంగా ఉండి, భావంతో నిండిన ఈ పాట చూడండి.
పల్లవి: ఇతరుల కష్టము ఎవ్వడెరుగునో అతడే వైష్ణవుడు
అనుపల్లవి: సతతము పరులకు సాయము చేయుచు
గతి తానేయని గర్వము పడడో ॥
చరణాలు: 1.సకల లోకముల సన్నుతి సేయుచు
అపనిందలచే అపచారము చేయడొ..
మనసున వాక్కున నిశ్చలుడెవ్వడొ
యోగ్యురాలతని కన్న జననియే ॥

2.సర్వము సమమున నెవ్వడెంచునో
ఆశవీడి పరస్ర్తి మాతగ జూచునో
నాలుక వ్రీలిన అసత్యము పల్కడొ
పరధనములకై ప్రాకులాడడో ॥

ఎంత హృద్యంగా ఉందో ఈ పాట! ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు వోలేటి వెంకటేశ్వర్లు గానం చేశారు. మీరు వినదలుచుకుంటే ‘ఒక్క గాంధీ మార్గం’ కార్యక్రమంలోనే ఈ పాట వినే అవకాశముంది.
* * *
అందరూ బాగుండాలని అహర్నిశలూ తపించే వాడెప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. బాగా బతికిన కాలం ఎప్పుడో దాటిపోయింది. మనుషుల మధ్య భేద భావాలు చాలా సులువుగా తేలికగా పొడచూపే యుగం, కలియుగం. మనిషి నుండి మనిషి తొందరగా విభేదిస్తాడు. తొందరగా విడిపోవాలనుకుంటాడు. కుల మత భేదాలు, వర్గ పోరాటాలు, సాంఘిక తారతమ్యాలు, జాతి భేదాలు, స్థాయి, అంతస్తుల భేదాలన్నీ రూపుదిద్దుకునే కాలమే కలికాలం.’
ఎదుటివాడు, పరాయి వాడుగా కనిపిస్తూంటాడు. చివరకు భార్యాభర్తలు కూడా ఎవరి జాగ్రత్త వాళ్లు పడే దుస్థితి దాపురించే ఈ కాలం, కలికాలం.
ఇటువంటి వాతావరణం నుండి బయటపడాలంటే ‘మైత్రీ భావమొక్కటే’ పరిష్కారం. ఎవరూ ఎవరిపైనా పెత్తనం చెలాయించే రోజులు కావివి. తల్లిదండ్రులు బిడ్డలతో గానీ, పరిపాలకులు ప్రజలతో గానీ చేయవలసినది మైత్రి మాత్రమే. ఈ కలియుగంలో వ్యక్తులంతా బృందమవ్వాలి. వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఒంటరిగా సాధించగలిగేది చాలా తక్కువ.
ఈ ధర్మమార్గంలో చేసిన ఏ ప్రయత్నమైనా సరే విశేషమైన ప్రభావం కలిగి యుంటుంది. అధర్మం లేశమైనా సరే కవి ఆవహిస్తాడు. లోక శ్రేయస్సు సాధించాలని ఏ మాత్రం అనిపించినా చాలు, అటువైపుగా మన అడుగులు పడితే చాలు. దేవ దేవుని అభయ హస్తం మన వెన్నుని స్పృశిస్తుంది. మైత్రీ భావంతోనే అంతరంగాలు ఏకమవుతాయి.
మన చిన్నప్పటి నుంచీ వింటున్న ఈ వేళ ‘పిల్లలే రేపటి భావి భారత పౌరుల’నే మాట పాతబడిపోయింది. రాత్రికి రాత్రే దేశభక్తి పుట్టదంటే పుట్టదు. జాతీయతా భావాలు, దేశభక్తి ప్రబోధం చేస్తూ సాగే పాటలు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ వినే భాగ్యానికి నోచుకోలేదు మనం. అందరూ కలిసి పాడే పాటలో చైతన్య భావాలు చాలా తేలిగ్గా మనస్సులో నాటుకుపోతాయి. ఏ రాజకీయ నాయకులైనా జాతీయ పర్వ దినాల్లో జాతీయ గీతాలు శుద్ధంగా పాడటం విన్నారా? అదేం ఖర్మమో? ‘వందేమాతరం’ ‘జనగణమన’ లాంటి ప్రముఖమైన జాతీయ గీతాలు పర్వదినాల్లోనే గుర్తుకొస్తాయి. సరిగా ఆ రోజే పిల్లలచేత పాడించే ప్రయత్నం చేస్తూంటారు. ఈ రెండూ సక్రమంగా పాడటం ఎప్పుడూ గగన కుసుమ సదృశమే.
వందేమాతరం గీతాన్ని 1870లో ‘ఆనందమఠం’ నవలకు బంకించంద్ర ఛటర్జీ రాశాడు.
దీనికి జడూనాథ్ భట్టాచార్య సంగీతం సమకూర్చాడు. ఆలిండియా రేడియో ఢిల్లీ ‘వందేమాతరం’ ‘జనగణమన’ గీతాలను ఆకాశవాణి బృంద గాన కళాకారులతో పాడించి గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేశారు.
రేడియోలో మీరు రోజూ వినేదదే. దేశభక్తి గీతాలు పెదవులతో పాడేవి కావు. నాభి నుంచి పుట్టి హృదయ కంఠ గతమై గొంతెత్తి పాడవలసిన ప్రబోధ గీతాలు. కవులు, గాయకులు కలిస్తే కలికాల ప్రభావం నుంచి జనం రక్షింపబడతారు.
దేశభక్తి భావాలను రగిలిస్తూ, చైతన్యభరితమైన ఎన్నో పాటలు ఒకప్పుడు వెలువడ్డాయి. ఆ కవులేరీ? ఆ పాటలేవీ?
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్

మ్రోయింపు జయభేరి, వాయింపును నగారా
తేలింపుము నభో వీధిని
త్రివర్ణాంచిత పతాకా!

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతీ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ
దివ్యధాత్రి.. లాంటి గీతాలు పాడేవారిలోనూ, ఆ పాటలు వినేవారిలోనూ చైతన్యాన్ని నింపవా?
గురజాడ, రాయప్రోలు, దేవులపల్లి, రజని, జాషువా లాంటి సామాజిక స్పృహ నిండుగా వున్న కవుల రసరమ్య గీతాలు, విద్యుత్తరంగాలై జాతి నరాల్లో స్ఫూర్తి నింపవాః
* * *
బాల్యం నుంచి ఇటువంటి పాటలు పాఠశాలల్లో కాలేజీల్లో నేర్పించే అలవాటు చేయద్దా?
సమాజంలో జాతీయ భావాలు ఒక్కసారిగా ఏర్పడవు. పసిపిల్లల చేత గంతులేయిస్తూ జుగుప్సాకర సాహిత్యాన్ని పాడిస్తూ వికృతానందాన్ని పొందే వారికి దేశభక్తి గీతాలు రుచిస్తాయా?
దేశానికి, ప్రజలకూ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అలనాటి కవుల ఆశయాలు నెరవేరుతాయా?

చిత్రాలు.. జాతిపిత గాంధీ, వోలేటి వెంకటేశ్వర్లు

- మల్లాది సూరిబాబు 9052765490