S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పసికందు హత్య

హత్య ఎప్పుడూ బాధాకరమే. అలాంటిది నీలంరంగు కళ్లు, బూరి బుగ్గలు, అమాయకమైన గుండ్రటి మొహంగల ఆ చిన్నారి శవాన్ని చూడగానే నాకు చాలా బాధ కలిగింది. చెక్క బెంచీ మీద పడున్న ఆ పసికందుకి బహుశ ఆరు నెలలు ఉండచ్చు. చర్చ్‌లోని ఆల్టర్ దగ్గర కొవ్వొత్తుల వెలుగు వల్ల గోడల మీద నీడలు రెపరెపలాడుతున్నాయి. వెలిసిపోయిన గులాబీ రంగు దుప్పటిలో ఆ పాప చుట్టి ఉంది. తెల్లటి గొంతు మది ఊదారంగు మచ్చలు, తెరిచి ఉన్న కళ్లు చూస్తే గొంతు నులిపి చంపబడిందని తెలుస్తోంది.
తెరచి ఉన్న నోట్లోని రెండు పళ్లు, వస్తున్న మూడో పన్ను చూసాక ఆ పాప వయసు ఎనిమిది నెలలకి పైనే అనుకున్నాను. నేను ముగ్గురు పిల్లల తండ్రిని కాబట్టి నాకు మరింత బాధ వేసింది. విశాలంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ చర్చ్‌లోకి ఉదయపు నీరెండ రంగురంగుల కిటికీ అద్దాల్లోంచి పడుతోంది. ఫాదర్ బేరన్ని అడిగాను.
‘ఈ పాపని మీరు కదిలించారా?’
‘లేదు. తాకలేదు. ఉదయం ఆరుగంటల మాస్ ఆరున్నరకి ఐపోయింది. ఏడున్నరకి బయటకి వచ్చి ఆల్టర్ని సర్దాలని చూస్తే ఈ పాప కనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేశాను’ ఫాదర్ బేరన్ చెప్పాడు.
‘చర్చ్ తలుపులు తాళం వేసి ఉన్నాయా?’
‘లేదు. ఎప్పుడూ తాళం వేయం. ఇది దేవుడి ఇల్లు. తలుపులు మూసి ఉన్నాయి. అంతే’
‘అంటే రాత్రంతా తాళం లేకుండానే ఉంటుందా?’
‘అవును. ఒక్కోసారి ఇళ్లు లేని వారు పడుకోడానికి వస్తూంటారు కూడా’
‘ఈ పాపని గుర్తు పట్టగలరా?’
‘లేదు. తెలీదు. ఇక్కడే బాప్టైజ్ చేసి ఉండచ్చు కాని చిన్న పిల్లలంతా ఒకేలా కనిపిస్తారు. గుర్తుపట్టడం కష్టం’
‘మీ తర్వాతి మాస్ సమయానికి మా పని పూర్తి చేస్తాం’
పోలీస్ ఫొటోగ్రాఫర్లు, క్లూస్ టీం వచ్చారు.
‘ఈమె ఆత్మ మీద పరమాత్మ దయ చూపించుగాక’ క్రాస్ గుర్తు వేసుకుని ఫాదర్ బేరన్ బాధగా చెప్పాడు.
* * *
ఈ విషయం బయటకి పొక్కితే స్కూల్‌కి వెళ్లిన పిల్లల తల్లులు చేసే ఫోన్ కాల్స్‌తో నా ఫోన్ బిజీగా ఉంటుందని నాకు తెలుసు. ఆదుర్దాతో వాళ్లు వయసుని విస్మరించి పోలీసుస్టేషన్‌కి ఫోన్లు చేస్తారు. అందువల్ల ఆరుగుర్ని ఈ కేస్ మీద నియమించాను. ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకపోవడంతో దాని కోసం వేచి ఉన్నాను. ఈలోగా తప్పిపోయిన మనుషుల రెడ్ నోటీసులని పరిశీలించాను. ఏడాది లోపు పిల్లలు తప్పిపోయిన ఫిర్యాదులేమీ లేవు.
చర్చ్ బెంచీ మీద చాలామంది వేలిముద్రలు కనిపించాయి. వాటిలో ఏవి అమాయకులవో, ఏవి హంతకులవో ప్రస్తుతానికైతే తెలీదు. క్లూస్ టీం తీసిన ఆ పాప పాద ముద్రలని రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌కీ పంపాను. (అమెరికాలోని ప్రతీ హాస్పిటల్‌ల్లో పుట్టిన బిడ్డ పాద ముద్రలని నమోదు చేస్తారు) ఐతే రాష్ట్రం బయట పుట్టి ఉంటే ఆ పాప ఈ రాష్ట్రానికి చెందింది కాదని తెలుస్తుంది తప్ప ఏ రాష్ట్రానికి చెందిందో మాత్రం తెలీదు. పాప తప్పిపోయిన సంగతి ఇంకా ఆమె తల్లిదండ్రులకి తెలీదా? లేక దత్తతకి వెళ్లిందా? పెంపుడు తల్లిదండ్రులు చంపేశారా? ఎందుకు? ఈ పాప భారీ ఆస్థికి వారసురాలా? అంత చిన్న పిల్లని చంపడానికి కారణం ఏమై ఉండచ్చు?
* * *
డాక్టర్ ఎడ్వర్ట్స్ నించి వచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పాప మెడ విరిగి మరణించిందని తెలిసింది. చెంపల మీద ఎండిన కన్నీరు, పొత్తికడుపు, పిరుదులు మీద ఎండిన మూత్రం, డెసిటిల్ పెట్రోలియం జెల్లీ ఆనవాళ్లు కనిపించాయని, గత రాత్రి సుమారు మూడుకి మరణం సంభవించిందని, డెసిటిల్ పెట్రోలియం జెల్లీని డైపర్ రేష్‌కి వాడతారని ఆ రిపోర్ట్‌లో ఉంది.
పింక్ దుప్పటి మీద బ్లాక్ రివర్ మిల్స్ అనే ట్రేడ్ లేబిల్ కుట్టి ఉంది. దాన్ని రాష్ట్రంలోని వేల దుకాణాల్లో ఎక్కడైనా కొనచ్చు. సాక్స్ మీద ఎలాంటి గుర్తులూ లేవు. గౌన్ మీద జిల్‌మేన్ అనే లేబిల్ కుట్టి ఉంది. అది ప్రపంచంలోని అతి పెద్ద సూపర్ బజార్లలో ఒకటి. అది మా ఊళ్లో కూడా ఉంది. డైపర్ మీద ఎలాంటి లేబుల్ లేదు.
గంట తర్వాత అదృష్టం నా వైపు ఉందని తెలిసింది. పాప పేరు లూయిస్. ఆల్బన్స్‌లోని యూ ఎస్ నేవల్ హాస్పిటల్లో 10 నవంబర్ 2012న సాయంత్రం నాలుగుంపావుకి లూయిస్ పుట్టిందని, ఏడు పాయింట్ ఆరు ఎల్బీల బరువని, తల్లి ఆలిస్, తండ్రి గ్రెగరీ అని తెలిసింది. తల్లి ఎడమ, కుడి బొటన వేలి ముద్రలు కూడా హాస్పిటల్లో రికార్డుల్లో ఉన్నాయి.
వెంటనే చర్చ్ బెంచీ మీద దొరికిన వేలిముద్రలతో వాటిని పోల్చమని ఫోరెన్సిక్ లేబ్‌కి పంపాను. ఓ సార్జెంట్‌ని ఆలిస్‌ని, ఆమె భర్తని వెదికి పట్టుకోమని పంపాను.
‘నేవల్ హాస్పిటల్లో పుట్టింది కాబట్టి తల్లిదండ్రుల్లో ఒకరు నేవీలో పని చేస్తూండాలి. ఆలిస్ గ్రెగరీల పేరు మీద ఫోన్ ఉందేమో డైరెక్టరీలో చూడు’ సూచించాను.
నేవల్ హాస్పిటల్ నించి సార్జెంట్ ఫోన్ చేసి హాస్పిటల్లో నమోదైన ఆ బిడ్డ తల్లిదండ్రుల చిరునామా చెప్తే రాసుకున్నాను. ఏ 31 ఈస్ట్ 217 స్ట్రీట్, బ్రాంక్స్. అది ఆ బిడ్డ శవం కనుగొన్న చర్చ్‌కి మైలు దూరంలోనే ఉంది.
‘తండ్రి గురించి కూడా విచారించాను. అతను ప్రయాణించిన ది హేన్‌ఫీల్డ్ అనే నౌక గత మార్చిలో హుయాంగ్ యాంగ్ అనే చోట మునిగిపోయింది.’
‘అయ్యో!’
‘గ్రెగరీ ఆచూకీ ఇంత దాకా తెలీలేదు. ఆ సంగతి నేవీ వాళ్లు బ్రాంక్స్ చిరునామాకి టెలిగ్రాం ద్వారా తెలియజేశారు. ఆలిస్ ఆ టెలిగ్రాంని అందుకుంది.’
‘సరే. నువ్వా చిరునామాకి వెళ్లి బిడ్డ తప్పిపోతే ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదో కనుక్కో’
‘అలాగే. అవసరం ఉంటే అక్కడ నించే ఫోన్ చేస్తాను’
దాదాపు రెండు గంటల తర్వాత అతన్నించి ఫోన్ వచ్చింది.
‘ఆమె ప్రస్తుతం బ్రాంక్స్ చిరునామాలో లేదు. ఎక్కడికి వెళ్లిందో ఇంటి యజమానికి తెలీదు. ఏప్రిల్లో ఇల్లు ఖాళీ చేసింది’
ఆలిస్ వేట ఆరంభించాను. నేవీ హాస్పిటల్ రికార్డుల్లోంచి ఆమె ఫొటో కాపీ తీసుకుని బ్రాంక్స్ ప్రాంతంలోని డైపర్స్, చిన్న పిల్లల దుస్తులు అమ్మే దుకాణాలకి వెళ్లాను. ఆమెని ఎవరైనా చూసారా అని విచారించసాగాను. ఈలోగా గ్రెగరీకి ఓ మేనత్త, మేనమామ ఉన్నారని తెలిసింది. వారిని కలిస్తే ఆలిస్ ఇప్పుడు ఎక్కడుందో తెలీదని, కూతురు పుట్టాక వచ్చిన ఉత్తరం తప్ప వాళ్లని ఎన్నడూ చూడలేదని చెప్పారు. వాళ్లు ఆలిస్ తండ్రి చిరునామాని ఇచ్చారు. నేను వెంటనే వాల్టన్ ఎవెన్యూలోని ఆ ఇంటికి వెళ్లాను. నా పోలీస్ బేడ్జ్‌ని చూస్తే కాని అతను ఇంట్లోకి అనుమతించలేదు.
‘ఏం ప్రశ్నించడానికి వచ్చారు?’ విసుగ్గా అడిగాడు.
‘ఆలిస్ మీ కూతురేనా?’
‘అవును’
‘ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?’
‘తెలీదు’
‘మీ కూతురు ఎక్కడ ఉందో మీకు తెలీకపోవడం ఏమిటి?’
‘తెలీదు. తెలిసినా పట్టించుకోను’ కఠినంగా చెప్పాడు.
‘ఎందుకని? ఏమైంది?’ అడిగాను.
‘ఏం కాలేదు. ఐనా అది మీకు అనవసరం’
‘అవసరమే. ఆమె కూతురు మెడ విరిగి మరణించింది’ చెప్పాను.
వెంటనే ఆయన మొహంలో ఆశ్చర్యం, బాధ కనిపించాయి. కొద్ది క్షణాల్లో తేరుకుని చెప్పాడు.
‘సారీ! ఆమెకి ఓ కూతురు ఉందని కూడా నాకు తెలీదు’
‘కనీసం ఆమెకి పెళ్లైందని తెలుసా?’
‘తెలుసు. ఆ నేవీగాడితో’
‘మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లైంది?’
‘క్రితం సెప్టెంబర్లో’
‘ఆ తర్వాత ఆమెని చూశారా?’
‘లేదు. ఆ పాపని ఎవరు ఎందుకు చంపారు?’
‘అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఇక్కడికి వచ్చాను’
‘పరమాత్మ ఆ పాప ఆత్మకి శాంతి కలిగించుగాక. జూన్‌లో ఆలిస్ గ్రాడ్యుయేట్ అయ్యాక పంతొమ్మిదో ఏట ఆ నావికుడ్ని పెళ్లి చేసుకుంది. నాకు అతను నచ్చలేదు. వద్దని వారించినా వినలేదు.. మా అమ్మాయి ఏమైనా ఇబ్బందుల్లో ఉందా?’ ఆయన బాధగా అడిగాడు.
‘ఇంకా తెలీదు’
‘పిల్లలు ఒకోసారి తప్పు చేస్తూంటారు. అలాంటిదేమైనా ఉంటే నాకు చెప్పండి’ ఆయన అర్థించాడు.
* * *
లూయిస్ హత్య గురించి మేం ఎక్కువ కాలం దాచలేక పోయాం. అది ఈవెనింగ్ పేపర్లో వార్తగా రావడంతో అప్పటికే స్కూల్ విడవడం వల్ల మాకు ఫోన్ కాల్స్ బెడద తప్పింది.
ఓ సార్జెంట్ నాతో ఆ కేస్ గురించి చర్చిస్తూ అడిగాడు.
‘ఆ శవాన్ని చర్చ్‌లోనే ఎందుకు ఉంచినట్లు? ఎక్కడైనా పాతి పెట్టచ్చుగా?’
ఆ కోణంలోంచి ఆలోచిస్తే ఆమె మతపరమైన నమ్మకంతో చర్చ్‌లో ఉంచి ఉండచ్చని అనిపించింది. ఆ చర్చ్‌కి మైలు పరిధిలోని అన్ని చర్చ్‌లకి ఆలిస్ ఫొటోతో వెళ్లి ఫాదర్లకి ఆమె తెలుసా అని ఫొటో చూపించి అడిగాను. చర్చ్ ఆఫ్ ది హోలీ మదర్ ఫాదర్‌కి ఆమె పేరు తెలీదుగానీ తన చర్చ్‌కి వచ్చే భక్తురాలిగా గుర్తించాడు.
* * *
ఆ ఆదివారం ఉదయం ఆరు గంటల మాస్‌కి నేను, ఇద్దరు సార్జెంట్లు మఫ్టీలో వెళ్లాం.
సన్నటి ఆలిస్ మొహంలో అలసట కనిపించింది. ఆమె హోలీ వాటర్లో తన చేతులని ముంచి క్రాస్ గుర్తుని వేసుకుంది. తర్వాత ఆల్టర్ దగ్గరికి వెళ్లి వర్జిన్ మేరీ విగ్రహం ముందు కొవ్వొత్తిని వెలిగించి మోకాళ్ల మీద కూర్చుంది. సార్జెంట్ కదిలితే చెప్పాను.
‘ఇక్కడ కాదు. బయట’
ఆమె మోకాళ్ల మీద కూర్చుని, కళ్లు మూసుకుని చాలాసేపు ప్రార్థించి, కళ్లు తుడుచుకుని లేచి బయటకి వచ్చింది. నేను, సార్జెంట్లు ఆమెకి రెండు వైపులా నిలబడ్డాం.
‘మిసెస్ గ్రెగరీ?’ ప్రశ్నించాను.
‘అవును’ ఆమె ఆగి ప్రశ్నించింది.
‘మేం పోలీస్ ఆఫీసర్లం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి’ ముగ్గురం మా బేడ్జలని చూపించాం.
ఆమె చాలాసేపు నా మొహం వంక చూసింది. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి చెప్పింది.
‘నేనే చంపాను. గ్రెగరీ మరణించాడు. అతను ఆ వయసులో మరణించడం సబబు కాదు. నాకున్నదంతా అతనే. ఆ రాత్రంతా లూయిస్ ఏడుస్తూనే ఉంది. నేను లోపల ఏడుస్తున్నానని దానికి తెలీదు. ఇక భరించలేక నోరు మూసుకోమని గదిమాను. కాని దాని ఏడుపు ఆపకపోవడంతో.. బాధతో... కోపంతో కాదు, బాధతో...’
మేమంతా ఆమెని నివ్వెరబోతూ చూశాం. ఇలాంటి కారణంగా ఓ పసికందుని ఓ తల్లి చంపడం మేం జీర్ణించుకోలేక పోయాం.
‘లూరుూస్‌ని చర్చ్‌లో ఎందుకు ఉంచారు?’ సార్జెంట్ ప్రశ్నించాడు.
‘అమాయకురాలు కాబట్టి. ఫాదర్ అంత్యక్రియలు చేస్తాడని. మీకు అక్కడే కనిపించిందా?’
‘అవును’
‘మీరు కనుక్కోవడం నాకు ఆనందంగా ఉంది’
‘మీరు మా వెంట రావాలి’ చెప్పాను.
ఆమె తల ఊపి మా వెంట నడిచింది.
*
(ఎడ్ మెక్‌బైన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి