S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం - 16

అశోక్
జానకి అంటే నాకేమీ ప్రత్యేకంగా అభిమానం లేదు. నా దృష్టిలో ఆమేమీ గొప్ప అందగత్తె కూడా కాదు. కానీ ఆమె డిఫరెంట్ పర్సనాలిటీ.
ఒళ్లమ్ముకుని బ్రతికేవాళ్లు కొంతమంది పూర్తిగా నిర్వేదంలో కూరుకుపోయి ఉంటారు. లేదూ, మరి కొంతమంది మాటలతో ఎదుటి వాళ్లను డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే జానకి ఆ రెండు రకాలుగానూ ఉండదు.
ఆమెకి సమాజం గురించి తెలుసు. దానిలో తన స్థానం గురించి తెలుసు. ఎవరైనా నాలుగు జాలి మాటలు మాట్లాడగానే ఎమోషనల్ అయిపోదు. అలా అని ఎవరయినా అవమానకరంగా మాట్లాడినా పట్టించుకోదు.
జానకితో మొదటిసారి కలిసినపుడు ఆమెని మళ్లీ రెండోసారి కలుస్తాననుకోలేదు. సాధారణంగా నేను ఒకే అమ్మాయిని రెండోసారి ప్రిఫర్ చెయ్యను. అలాంటి నేను ఆమె ఆటిట్యూడ్‌కి ఫిదా అయ్యాను.
నాతో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, వెళ్లిపోయేటపుడు కూడా అంతే ఆనందంగా ఉండే ఆ అమ్మాయిని ఇంకే విధంగా ఉపయోగించుకోవాలా అని ఆలోచించాను.
ఒక ఆలోచన వచ్చింది. తరువాత నా ప్రపోజల్ ఆమెకే చెప్పాను.
అంగీకరించటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు జానకి.
అప్పటి నుండి నా టేస్ట్‌కు సరిపోయే అమ్మాయిలను వెతుక్కునే పని లేకుండా పోయింది. నా తరఫున ఆ పని ఇప్పుడు జానకి చేస్తోంది.
జానకి నా తరపున పని చేస్తున్నా, నన్ను ఎక్కువ కలుసుకునేది కాదు. ఆమెతో ఎక్కువగా బయట కనపడటం నాలాంటి రాజకీయ నాయకుల భవిష్యత్తుకు మంచిది కాదు. సెల్‌ఫోన్‌ల యుగంలో మనుషులు ప్రత్యక్షంగా కలిస్తే కాని జరగని పనులు అతి తక్కువ.
డబ్బు ఎక్కడైనా ఉండవచ్చు. కానీ, డబ్బు, గ్లామర్ కలగలిసి ఉండే రంగాలు రాజకీయాలు కాక, రెండే ఉన్నాయి. అవి సినిమాలు, క్రీడలు.
ఆ రెంటిలో రాజకీయ నాయకులకి కూడా గ్లామరస్‌గా కనిపించే రంగం ఏదన్నా ఉందంటే అది సినిమా రంగం. తమ బ్లాక్‌మనీ వైట్ చేసుకోవటానికి రాజకీయ నాయకులకు ఇది ఒక అనువయిన రంగం.
నా దగ్గర కూడా బ్లాక్‌మనీ పేరుకు పోతోంది. దాన్ని వైట్ చేయటానికి కొన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశిద్దామనుకున్నాను. అప్పుడు జానకే నన్ను ఆపింది.
రాజకీయ నాయకులకి అధికారంలో ఉన్నంత సేపే పవర్ ఉంటుందనీ, అధికారం లేని పరిస్థితుల్లో సినిమా రంగంలో పెట్టుబడులు అనవసరపు విమర్శలకు తావిస్తాయనీ చెప్పింది.
‘మరేం చేద్దాం?’ అన్నాను.
‘రాజకీయాల్లో ఉన్నారు. మీకు తెలియదా? రాజకీయ నాయకులు తమ పేరు మీద ఎప్పుడూ పెట్టుబడులు పెట్టరు’
‘మా ఆవిడ పేరు మీద పెట్టమంటావా?’
‘నా నోటితో చెప్పిద్దామనుకుంటే, మీ ఇష్టం... అలానే చెప్తాను. తెలిసిన ఎవరి పేరు మీదా కాదు. ఏదో ఒక బినామీ పేరు మీద పెట్టండి’
‘ఎవరున్నారు అలాంటి వాళ్లు?’
‘కనుక్కుని రేపు చెప్తాను’ అంది జానకి.
మరుసటిరోజు ఒక వ్యక్తి వివరాలు చెప్పింది. ఒకప్పటి గొప్ప దర్శకుల్లో అతను ఒకడు. పేరు కే.కే. ప్రస్తుతం తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడు. అతను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఎటువంటి డీల్‌కయినా ఒప్పుకుంటాడు.
వెంటనే కే.కే.ని కలిశాను. అతను ఎగిరి గంతెయ్యలేదు కానీ, దాదాపు అంత పని చేసి... నా ప్రపోజల్‌కి ఒప్పుకున్నాడు.
అప్పుడే తెలిసింది నాకు ఫేడవుట్ అయిపోయిన కళాకారులూ, వెనుక ఏ దన్నూ లేని పాతతరం ఆర్టిస్టులూ, నిర్మాతలుగా ఎలా పుట్టుకు వస్తారో...
కే.కే. చేత ఒక కొత్త బ్యానర్ పెట్టించాను. ఆఫీస్ కూడా ఓపెన్ చేయించాను. అతనికి కూడా మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతం అతనున్న పరిస్థితిలో నేనిచ్చిన స్టేటస్ అతనికి మరెక్కడా దొరకదు. పెద్దపెద్ద హీరోలని పెట్టి కొత్త సినిమాలు మొదలుపెట్టాం. అవి నా బ్లాక్ మనీ పర్పస్‌కి సరిపోతాయి. కానీ, నా బలహీనతకి ఈ మెగా మూవీలు సరిపోవు. అందుకే మరో పక్క లోబడ్జెట్ సినిమాలు కూడా మొదలుపెట్టాను. లోబడ్జెట్ సినిమాల్లో కొత్త ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకుంటాం. వాళ్లు నా అవసరాలకి సరిపోతారు.
ఒకరోజు కేకేతో ఆఫీసులో కూర్చుని కొత్త సినిమాల విషయాలు చర్చించుకుంటుంటే, ఒకమ్మాయి కేకేని కలవటానికని వచ్చింది.
ముఖ్యమయిన పని ఉందని ఎంత చెప్పినా ఆ అమ్మాయి కే.కే.ని కలవకుండా తిరిగి వెళ్లటానికి ఇష్టపడకపోవటంతో నేనే కే.కే.ని ఆ అమ్మాయిని కలిసి రమ్మని బయట రూములోకి పంపాను.
బయట జరుగుతున్న సంభాషణ వినిపిస్తోంది.
ఆ అమ్మాయిని బ్లంట్‌గా డిస్కరేజ్ చేస్తున్నాడు కే.కే. అవకాశం ఇవ్వకపోయినంత మాత్రాన అవమానించనవసరం లేదన్నది నా పాలసీ.
యధాలాపంగా కిటికీలో నుండి బయట గదిలో కే.కే.తో మాట్లాడుతున్న అమ్మాయి వైపు చూశాను.
ఒక్కసారిగా కళ్లు చెదిరినట్లయింది.
ఎవరు ఎప్పుడు ఎందుకు నచ్చుతారో ఎవరికీ తెలియదు. ఒకరి కంటికి అద్భుత సౌందర్యవతిగా కనిపించిన స్ర్తి మరొకరి
దృష్టిలో మామూలుగా అనిపించవచ్చు. ఎదురుగా కనిపిస్తున్న అమ్మాయి మాత్రం కేవలం నా కోసం పుట్టినట్లనిపించింది. సెల్‌ఫోన్ తీసి ఆ అమ్మాయి ఫొటో తీసుకున్నాను. బయటకు వెళ్లి ఆ అమ్మాయిని కలుసుకోవాలనుకున్నాను. కానీ, అప్పటికే సమయం మించి పోయింది. అసందర్భపు కే.కే. మాటలకు ఆ అమ్మాయి కళ్లనీళ్లతో బయటకు వెళ్లిపోయింది.
బయటకు నడుస్తున్న ఆ అమ్మాయిని ఆపటానికి నేను కూడా వెళ్లబోయాను. కానీ, అప్పటికే ఆ అమ్మాయి ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతోంది.
నేను హడావుడిగా బయటకు రావటం చూసి కే.కే. కూడా నన్ను అనుసరించాడు.
‘ఎవరతను?’ ఆ అమ్మాయితో మాట్లాడుతున్న వ్యక్తిని చూపించి అడిగాను.
‘చంద్రం అని వసంతరావ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్...’ చెప్పాడు కే.కే.
మరి మాటలు పొడిగించకుండా వెనక్కి వచ్చాను.
కాసేపటికి ఆ అమ్మాయి మీద కలిగిన ‘క్రష్’ కరిగిపోతుందిలే.. అనుకున్నాను. కానీ, నిమిష నిమిషానికి అది మరింత బలపడింది తప్ప తగ్గలేదు.
ఆ అమ్మాయి ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే, నన్ను కలవటానికి వచ్చిన జానకి, నన్ను చూడగానే, ‘ఏం జరిగింది?’ అని అడిగింది.
జరిగింది చెప్పాను.
‘నిన్ను మెస్మరైజ్ చేయగలిగిందంటే, నాకూ ఆ అమ్మాయెవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది..’ అంది.
సెల్‌ఫోన్‌లో ఉన్న ఫొటో చూపించాను. ‘ఈ అమ్మాయా..?’ అంది.
‘ఈ అమ్మాయి నీకు తెలుసా?’ ఆనందంతో అడిగాను.
అప్పుడు నేను గమనించలేదు గానీ.. నా స్వరంలో ఆనందానికో, నా మొహంలో వెలుగుకో జానకి కచ్చితంగా ఈర్ష్యపడి ఉంటుంది.
‘తెలుసు. పల్లెటూరి గబ్బిళాయి. ఏముంది ఆ అమ్మాయిలో నిన్ను పడగొట్టేంత గొప్పదనం. నేనుండే హాస్టల్లోనే ఉంటుంది. పేరు వసుంధర’
‘అయితే ఆ వసుంధరని...’
నా మాట పూర్తి కాకముందే ‘కష్టం. ఆ అమ్మాయి అందరిలాంటిది కాదు. ప్రలోభాలకు లొంగదు...’ అని చెప్పింది జానకి.
జానకి మాటల్లో అంతర్లీనంగా వసుంధర మీద ఈర్ష్య కనిపించింది నాకు. ఇంతకు ముందు అలాంటి భావం ఆమె మాటల్లో ఎప్పుడూ నాకు కనిపించలేదు. తనంతట తాను నాకు ఎందరో అమ్మాయిలను పరిచయం చేసింది. అప్పుడెప్పుడూ ఇలాంటి భావం ఆమె మాటల్లో వినిపించలేదు. అది సహజమేనేమో! తన దృష్టిలో ఒక పల్లెటూరి బడుద్దాయి, నాకు అంతగా నచ్చటం ఆమె జీర్ణించుకోలేక పోతోందని అర్థమయింది.
‘తను నాకు ఎక్కడ దొరుకుతుందో చెప్పు. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను...’ అన్నాను.
వసుంధర పనిచేసే మాల్ పేరు చెప్పింది జానకి.
* * *
వసుంధర గురించిన ఏ మాట వచ్చినా జానకి మొహంలో కనిపిస్తున్న ఈర్ష్య చూస్తే ఈ విషయం స్వయంగా నేనే డీల్ చేసుకోవటం మంచిదనిపించింది.
మరుసటి రోజు సాయంత్రం సెక్యూరిటీ వాళ్లని బయటే ఉండమని చెప్పి, ఒక్కడినే వసుంధర పనిచేసే మాల్‌లోకి వెళ్లాను.
ఆమెని వెతుక్కుంటూ వెళ్తున్న నాకు జ్యుయలరీ సెక్షన్‌లో మెరిసే నగల మధ్య, అంతకంటే ఎక్కువగా మెరుస్తూ కనిపించింది వసుంధర.
కాస్త దూరంగా నిలబడి ఆమెనే చూస్తున్నాను.
కొన్ని క్షణాల తరువాత తలెత్తి నా వైపు చూసింది. ఎవరో తెలిసిన వ్యక్తిని చూసినట్లు కొన్ని క్షణాలు అలా చూస్తూండిపోయింది. కానీ.. ఆ పరధ్యానం నుండి కొన్ని క్షణాల్లోనే తేరుకుంది.
‘ఏం కావాలి సర్?’ అంటూ నన్ను పలకరించింది.
‘ఏదైనా గిఫ్ట్ ఐటెమ్ చూపించండి...’ ఆమె ముందుకు నడుస్తూ అన్నాను.
‘ఎవరికో తెలుసుకోవచ్చా?’
‘నా భార్యకి...’ సౌమ్యంగా చెప్పాను. సాధ్యమైనంత వరకు నాకు ఆల్రెడీ పెళ్లయిపోయిందన్న విషయాన్ని దాయటానికి ప్రయత్నించను. అలా దాయటంవల్ల ప్రయోజనాల కంటే ప్లాన్ బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ.
ఆమె ఒక చెవి పోగుల సెట్ తీసి చూపించింది.
‘నాకు సెలక్షన్ తెలియదు. ఇవి బాగుంటాయంటారా?’ అమాయకంగా అడిగాను.
‘డోంట్ వర్రీ సర్! మీ భార్యకి ఇవి నచ్చకపోతే మార్చుకుని వేరేవి తీసుకునే వెసులుబాటు ఉండనే ఉంది...’ అంది ఆమె.
‘సరే!.. అయితే ప్యాక్ చేయించండి..’ అంటూ ఆగిపోయాను. అప్పుడే నా దృష్టి వేరే పోగుల మీద పడినట్లు నటించి, ‘వావ్!... అవి ఇంకా బాగున్నాయే! అవి చూపించండి..’ అన్నాను.
అవి తీసి చూపించింది వసుంధర.
పాత పద్ధతే అయినా ఎవర్‌గ్రీన్ ట్రిక్ కావటంతో, ‘ఒకసారి మీరు పెట్టుకుని చూపిస్తారా?’ అని అడిగాను.
మనసులో విసుగ్గా ఉన్నా బయటకు కనపడకుండా మానేజ్ చేసి వాటిని పెట్టుకుంది వసుంధర.
‘బ్యూటిఫుల్...’ అ న్నాను తన్మయత్వంగా ఆమెను చూస్తూ.
కళ్లు ఎగరేసింది ప్రశ్నార్థకంగా.
‘అదే! ఇయర్ రింగ్స్.. మీరు పెట్టుకుని చూపిస్తే ఇంతకు ముందు కంటే బాగున్నాయి...’ అన్నాను.
నా మాటలకు కొద్దిగా సిగ్గు పడుతూ వాటిని తీసి టేబుల్ మీద పెట్టింది.
‘ఇంతకు ముందు చూసిన పోగులూ, ఈ పోగులూ రెంటికీ బిల్ చేయించండి...’
ఆ రెండు జతల నగలూ తీసుకుని వెళ్లింది ఆమె. ఆమె వెనుకే నేను కూడా వెళ్లాను.
కౌంటర్ దగ్గర వ్యక్తికి కార్డ్ ఇచ్చాను.
కాసేపట్లో రెండు గిఫ్ట్ ప్యాక్‌లూ నా చేతిలో పెట్టింది ఆమె థాంక్స్ చెప్తూ.
‘ఈ విషయం మీకు ఇప్పటివరకూ ఎవరైనా చెప్పారో లేదో తెలియదు. మీ అంత అందమయిన యువతిని నేను ఇంతవరకు చూడలేదు..’ అన్నాను.
ఎదురుగా పొగుడుతున్న నాకు పెళ్లయిపోయిందనీ, కేవలం కొన్ని నిమిషాల క్రితం భార్య కోసం గిఫ్ట్ కొన్నాడనీ తెలిసినా, వసుంధర సిగ్గుపడకుండా ఆపుకోలేక పోయింది.
ఎర్రబడుతున్న బుగ్గలను కనపడకుండా ఉంచటానికి తలదించుకుంటూ ‘్థంక్స్..’ అంది మరోసారి.
రెండవసారి సెలక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ ఉన్న గిఫ్ట్ ప్యాకెట్ ఆమెకు ఇచ్చి, ‘తీసుకోండి. ఇది మీకే..!’ అన్నాను.
‘సారీ సర్! కస్టమర్ల నుండి మేము గిఫ్టులు తీసుకోకూడదు..’ అంది మొహమాటం లేకుండా.
‘మీ బాస్‌కి నేను చెప్తాను..’
‘వద్దు సర్! అంత విలువయిన గిఫ్ట్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు’
‘వస్తువు అందంగా ఉండటం ఒక ఎత్తు. అది ధరించిన వారికి ఆనందం తేవటం మరో ఎత్తు. మీకు ఈ నగ బాగా సూట్ అయింది. ధరించటానికి అంతకు మించిన అర్హత అవసరం లేదు’ మరోసారి ఆమెకు ఆ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాను.
ఆమె ఒప్పుకోలేదు.
మరో అయిదు నిమిషాలు బ్రతిమలాడినా ఆమె దిగి రాలేదు. ఇంతలో అటుగా వచ్చాడు మాల్ మేనేజర్. ఆయనకు నేనెవరో తెలుసనుకుంటా, ‘తీసుకో వసుంధరా!.. సార్ అంత ఇష్టంగా ఇస్తుంటే వద్దనటం ఏం బాగుంటుంది చెప్పు...’ అన్నాడు.
చివరకు వసుంధర గిఫ్ట్ తీసుకోక తప్పలేదు.
ఆ తరువాత నేను వెనుతిరిగి వచ్చాను. నా వెనుక. ‘ఆయనెవరనుకుంటున్నావ్? రాష్ట్రంలోనే అతి తక్కువ వయసులో మంత్రి అయిన అశోక్...’ అని మేనేజర్ చెప్తున్న మాటలు విననట్లు నటిస్తూ వచ్చేశాను.
అయితే ఆ విషయం అంతటితో వదిలి పెట్టటం నా అభిమతం కాదు. పది రోజుల తరువాత మరలా అదే మాల్‌కి వెళ్లాను. తిరిగి వసుంధర ఉన్న సెక్షన్ వైపు నడిచాను.
అక్కడ ఆమె యధాప్రకారం మెరిసిపోతూ కనిపించింది - నేనిచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండానే.
నా ఆశాభంగాన్ని బయటకు కనిపించకుండా దాచేసి, ‘ఏంటి మీరు నేను ఇచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు?’ అని అడిగాను.
‘అంత ఖరీదయినవి పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది...’
ఆలోచిస్తున్నట్లు కాసేపు వౌనంగా ఉన్నాను. కొద్దిగా బాధ పడినట్లు కూడా ఫేస్ పెట్టాను. చివరికి, ‘మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు?’ అని అడిగాను.
‘ఎందుకు?’ అంది వసుంధర.
‘జస్ట్! కలిసి డిన్నర్ చేద్దామని...’
‘నాకు ఖాళీ ఉండదు సర్!’
ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి బయటకు నడిచాను. ‘వసుంధర డబ్బుకు లొంగదు. ఆమెని లొంగదీయాలంటే వేరే స్ట్రాటజ్ ఆలోచించాలి...’ అనిన నా ఆలోచనలు ఆమెకు తెలిసే అవకాశం లేదు.
* * *
ప్రతి మనిషికీ బలహీనతలుంటాయి. ఏ మనిషి బలహీనత ఏమిటో తెలుసుకోవటంలోనే మన విజయం ఆధారపడి ఉంటుంది.
వసుంధర బలహీనత సినిమాల్లో వేషం సంపాదించటం.
ఆ విషయం జానకి ద్వారా తెలుసుకున్నాను.
కే.కే. మీద చచ్చేటంత కోపం వచ్చింది. కానీ, ఎంత వసుంధర కోసం అయినా ప్రస్తుతం కే.కే.ని వదులుకోలేను. అతని దగ్గర నా రహస్యాలు చాలా ఉన్నాయి.
దానితో కే.కే.ని ఆ అమ్మాయికి వేషం ఇప్పించటానికి మా బేనర్‌లో కాకుండా మరో మార్గం చూడమన్నాను.
ఒకరోజులోనే సమస్యకి పరిష్కారం చూపించాడు కే.కే. ‘సుబ్బరాజని... ఒక కొత్త నిర్మాత సినిమా మొదలుపెట్టాడు. అతనికి వసంతరావ్ బ్యాకింగ్ ఉంది. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ చాలినంత లేదు. అందుకని ప్రాజెక్ట్ మొదలవ్వాలా, వద్దా అన్న స్టేజ్‌లో ఉంది. దానికి మీరు ఫైనాన్స్ చేస్తే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. మీకు కావలసిన అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుంటేనే ఫైనాన్స్ చేస్తానని కండిషన్ పెడితే వాళ్లకి మరో ఛాన్స్ ఉండదు..’ అన్నాడు.
నేను కూడా ఒప్పుకున్నాను.
దానితో సుబ్బరాజు సినిమా మొదలయింది - వసుంధర హీరోయిన్‌గా.

ప్రస్తుతం

‘నీ మెజారిటీ పదివేలు పెట్టుకుని ఇంకా ఇలా దిగులుగా కూర్చుని ఉండటం నాకేం నచ్చలేదు’ అన్నాడు చంద్రం.
అతను వసుంధర ఉన్న ఊరు చేరి పది నిమిషాలయింది. అతను వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అందరికీ అభివాదం చేసిన చంద్రం, పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత అందరినీ కలుస్తాననీ, అందరి సంబరాల్లో పాలుపంచుకుంటాననీ హామీ ఇవ్వటంతో వాళ్లు కాస్త నెమ్మదించారు.
‘మెజారిటీ ఇప్పుడు ఎంత ఉన్నదన్నది కాదు ముఖ్యం. అది ఇక పెరగదు చంద్రం... తగ్గుతూ వస్తుంది చూడు..’ అంది వసుంధర.
‘అదేదో ముందే తెలిసినట్లు అలా ఎలా చెప్పగలవ్?’
ఇంతలో రామభద్రం లోపలకు వచ్చి వీరితో పాటు కూర్చున్నాడు. ‘ఇంకో రౌండ్ ఫలితం వచ్చింది’ అన్నాడాయన.
ఫలితం వచ్చినప్పుడల్లా వినిపించిన టపాకాయల శబ్దం ఈసారి వినపడలేదు.
‘ఇప్పుడు మెజారిటీ ఎంతండీ?’ అడిగాడు చంద్రం రామభద్రాన్ని.
‘ఆరు వేల మూడు వందల పదహారు’
‘అదేంటి ఇంతకు ముందు వరకు పది వేల మెజారిటీ చెప్పారుగా! ఒక్క రౌండ్‌లో మెజారిటీ నాలుగు వేలు పడిపోవటం ఎలా సాధ్యం?’ ఆశ్చర్యంగా అడిగాడు చంద్రం.

........... మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002