S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్కీ ఛాన్స్

సారా బ్లాక్ తను పని చేసే లాటరీ ఏజెన్సీలో అలసిపోయాక తన భర్తతో చదరంగం ఆడుతూ రిలాక్స్ అవుతుంది. ఆమెకి అదొక్కటే రిలాక్సేషన్.
‘చెక్. నా శకటంతో చెక్ చెప్పాను. నీ రాజు కదలికలని నీ పావులే అడ్డగిస్తున్నాయి. అవి నీ రాజుని అదిమి చంపేస్తున్నాయి’ ఆమె భర్త కెన్ గర్వంగా చెప్పాడు.
‘సరే కెన్’ ఓసారి బోర్డ్‌లోని పావులన్నిటినీ చూసాక సారా తన ఓటమిని అంగీకరించింది.
‘ఇంకో ఆట?’ అడిగాడు.
‘ఒద్దు. ఎప్పుడూ నువ్వే గెలుస్తావు’ చిరుకోపంగా చెప్పింది.
‘నువ్వు ఆటలో రిలాక్సేషన్ కోసం ఆడతానని చెప్పినట్లు గుర్తు?’
‘నిజమే కాని ప్రతీసారి నేనే ఓడిపోవడం నాకు నచ్చడం లేదు.’
భోజనం బల్ల దగ్గర తను ఆరంభించిన సంభాషణని కొనసాగించే ఉద్దేశంతో కెన్ నేల మీద తెరచి ఉన్న ఓ పత్రికని అందుకున్నాడు.
‘మీ ఏజెన్సీ మళ్లీ లాటరీని తీస్తోంది కదా?’
‘అవును. క్లైంట్స్ వ్యాపారాభివృద్ధికి మా ఏజెన్సీ ప్రమోషనల్ పోటీలని నిర్వహిస్తూంటుంది. ఈసారి ఓ కాస్మొటిక్స్ కంపెనీ...’
‘అదంతా నాకు తెలుసు. మీ క్లైంట్ కంపెనీ ఏభై పౌన్ల బంగారం బహుమతిగా ఇస్తోంది.’
‘అవును. ఇది ఆ కంపెనీ ఏభైయ్యవ ఏనివర్సరీ సంవత్సరం’
‘సారా! ఈ రోజు బంగారం ముగింపు ధర ప్రకారం ఏభై పౌన్ల బంగారం విలువ మూడు లక్షల డాలర్లు.’
‘వాళ్లకి ఈ పోటీ ఆలోచన రాగానే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొన్నారు.’
‘నేను చెప్పింది నేటి విలువ. నువ్వా గెలిచే వారి పోస్ట్ కార్డ్‌ని లక్కీడ్రాలో తీస్తావు కదా?’
అది గతంలో జరిగిన సంభాషణ లాంటిదే.
‘కెన్! ఒకోసారి నేను తీస్తాను. మరోసారి మేరియన్ తీస్తుంది. ఆ డ్రమ్‌లో పోటీలో పాల్గొనే వినియోగదారుల నించి వచ్చిన సుమారు ఏభై వేల పోస్ట్ కార్డ్‌లు ఉంటాయి. వారిలోని చాలామంది ఆ పోటీని చూడటానికి వస్తారు. మోసం చేసి నీ కార్డ్‌ని నేను ఎలా తీయగలను? అదీ గాక నువ్వు నా భర్త. కంపెనీ ఉద్యోగస్థులు కాని, వారి కుటుంబ సన్యులు కాని ఈ పోటీలో పాల్గొనకూడదనే నిబంధన ఉంది. కాబట్టి నీ కార్డ్‌ని నేను తీసినా అది రద్దవుతుంది.’
‘అది నాకు తెలుసు. అందుకే చక్కటి పథకాన్ని వేసాను’
ఆమె చదరంగం పావులని పెట్టెలో సర్ది చెప్పింది.
‘నాకు చెప్పక. వినను. నేను వెళ్లి పడుకుంటున్నాను’
ఆ రాత్రి ఆమెకో కల వచ్చింది. తన భర్త కెన్ తన మొహం మీద దిండుని ఉంచి, అదిమి చంపినట్లుగా, ఆమెకి మెలకువ వచ్చి భయంగా చూస్తే పక్కనే పడుకున్న అతను గురక పెడుతున్నాడు. కెన్ ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.
* * *
మర్నాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దగ్గర కెన్ తిరిగి ఆ సంభాషణని కొనసాగించాడు. ఆమెకి వెంటనే కొన్ని వారాల క్రితం తమ మధ్య జరిగిన సంభాషణ ఆమెకి గుర్తొచ్చింది.
‘చూడు. పోటీదారుగా నేను చెయ్యాల్సిందల్లా ఈ లేజి లార్క్ ట్రేడ్ మార్క్‌కి ఎన్ని గీతలు ఉన్నాయో లెక్కపెట్టి ఆ సంఖ్యని పోస్ట్ కార్డ్ మీద రాసి పోస్ట్ చేయడమే. ఈ గీతలు ముప్పై నాలుగని జాగ్రత్తగా లెక్కపెడితే చాలామందికి తెలుస్తుంది. నేను మూడుసార్లు లెక్కపెడితే ప్రతీసారి అదే సంఖ్య వచ్చింది’ కెన్ చెప్పాడు.
‘ముప్పై నాలుగు సరైన సంఖ్య. చాలామంది ఇందులో పాల్గొనాలని తేలిక పోటీని నిర్వహిస్తారు. ఐతే వేల కార్డుల్లోంచి గెలుపొందే పోస్ట్ కార్డ్‌ని బయటకి తీయాలి. కాబట్టి అది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తప్పుగా లెక్క పెట్టే కొంతమంది తప్పుడు అంకె రాస్తారు. వారికి లెక్క పెట్టేప్పుడు ఏకాగ్రత, శ్రద్ధ ఉండదనుకుంటాను’
కెన్ తల ఊపి చెప్పాడు.
‘ఈసారి ఈ పోటీలో నేనే బంగారాన్ని గెలుచుకుంటాను. లేదా మనం గెలుచుకుంటాం’
‘పిచ్చిగా మాట్లాడకు కెన్. ఈ మధ్య నువ్వు మాట్లాడేదంతా డబ్బు గురించే’ సారా విమర్శించింది.
‘అది నేరమా? మనిద్దరి జీతాలతో మనం జీవించే విధానం నాకు నచ్చలేదు’
‘కాని నువ్వు ఆలోచించేది పనికి రాని ఆలోచన’
‘చూద్దాం’
కొన్ని వారాలపాటు అతను మళ్లీ సారాతో ఆ విషయం ప్రస్తావించలేదు. అది అతని మనసులోంచి వెళ్లిపోయి ఉంటుందని సారా ఆశపడింది. ఆమె ఆఫీస్‌లో రోజూ పోస్ట్‌లో వచ్చే పోటీలో పాల్గొనే వారి కార్డ్‌లని కాన్ఫరెన్స్ హాల్లోని రివాల్వింగ్ డ్రమ్‌లో పడేయసాగింది. మేరియన్, ఆమె కలిసి ఎప్పటిలా సమీప రెస్టారెంట్లో లంచ్ తీసుకోసాగారు. ఆ సమయంలో ఇద్దరూ తమ భర్తల గురించి మాట్లాడుకుంటారు.
ఆ పోటీకి డ్రా తీసే రెండు రోజుల ముందు మేరియన్ చెప్పింది.
‘ఇది చాలా పెద్ద పోటీ. ఇప్పటికే అరవై వేల పోస్ట్ కార్డ్‌లు వచ్చాయి’
‘అవన్నీ డ్రమ్‌లో పడతాయా?’ సారా అడిగింది.
‘తప్పకుండా. ఇంకో పది వేలు కూడా పట్టచ్చని నా అంచనా’
రోజూ కుప్పలు తెప్పలు వస్తూండటంతో కార్డ్‌లని పరిశీలించి, సబబైన సమాధానాలు కాని వాటిని విడదీసి, డ్రమ్‌లో సరైన జవాబు గల కార్డులనే వేసేంత సిబ్బంది లేకపోవడంతో అన్ని కార్డులనీ వేయసాగారు. డ్రా రోజున మేరియన్, సారాల్లోని ఒకరు సరైన సమాధానం ఉన్న పోస్ట్ కార్డ్ వచ్చేదాకా కార్డ్‌ని బయటకి తీయాల్సి ఉంటుంది.
* * *
డ్రాకి ముందు రోజు సాయంత్రం సారా థర్డ్ ఎవెన్యూలోని తన ఇంటికి చేరుకుంది. అపార్ట్‌మెంట్లో ఎప్పటిలా కెన్ లేకపోవడం ఆమెని ఆశ్చర్యపరిచింది. తనకన్నా గంట ముందే అతను ఆఫీస్ నించి వస్తాడు. అతను గంట తర్వాత వచ్చాడు. ఎందుకో అతను భయపడుతున్నట్లుగా సారాకి అనిపించింది.
‘ఏమైంది కెన్?’ అడిగింది.
‘ఏం లేదు. రేపు డ్రా గురించి నీతో మాట్లాడాలి’
అతను జేబులోంచి ఓ చిన్న పెట్టెని తీసి అందులోంచి ఓ పెద్ద ఉంగరాన్ని బయటకి తీశాడు. దానికి ఉన్న గుండ్రటి రేకు మీద ఇనీషియల్స్ కాని, సీల్ కాని చెక్కించుకోవాలి.
‘ఏమిటిది?’ అతను దాన్ని తన వేలికి తొడగ్గానే అడిగింది.
‘నీకు బహుమతి’
‘మగాళ్ల ఉంగరంలా ఉంది’
‘్ఫర్వాలేదు. రేపు ఆఫీస్‌కి నువ్వు దీంతో వెళ్లాలి’ కెన్ కోరాడు.
‘ఇదంతా ఏమిటి కెన్?’
అతను జేబులోంచి కొన్ని కార్డ్‌లని బయటకి తీశాడు. అవి పోస్ట్‌కార్డ్ సైజులో కొద్దిగా బూడిద రంగులో ఉన్నాయి. అన్నిటి మీదా చేత్తో అతికించిన తపాలా బిళ్లలు ఉన్నాయి.
‘ఇలాంటి ఐదొందల కార్డ్‌లని చేయించడానికి నాకు చాలా ఖర్చయింది. వీటిలో బయటికి కనపడని అతి చిన్న ఇనప రజను నిక్షిప్తమై ఉంది. ఈ ఉంగరానికి ఉన్న గుండ్రటి రేకు అయస్కాంతంతో చేసింది. నీ ఉంగరానికి ఆ కార్డ్ వచ్చి అతుక్కుంటుంది.’
అతను చెప్పేది సారా ఆశ్చర్యంగా వినసాగింది.
‘రేపు డ్రాకి ఈ ఉంగరాన్ని పెట్టుకుని వెళ్లు. ఆ రేకుని నీ అరచేతి వైపు తిప్పుకో. నేను ఐదు వందల కార్డ్‌లని పోస్ట్ చేసాను. అవి ఆ డ్రమ్‌లో ఉన్నాయి. డ్రమ్‌లోని కార్డ్‌లని తీసేప్పుడు తప్పకుండా ఓ కార్డ్ అయస్కాంతం ఆకర్షణ శక్తితో నీ చేతికి వస్తుంది. రంగు, తపాళా బిళ్లని బట్టి వీటిని గుర్తించగలవు. వీటిని రెండు రోజుల క్రితమే పోస్ట్ చేశాను కాబట్టి పైనే ఉంటాయి’
‘అది పిచ్చి ఆలోచన. నేను తీసే మొదటి కార్డ్‌ని పంపినవారు విజేత అవచ్చు. నేను అనేకసార్లు కార్డ్‌లని తియ్యకపోవచ్చు’
‘పిచ్చి ఆలోచన కాదు. నీ చేతికి వచ్చిన కార్డ్ ఇలాంటి కార్డ్ కాకపోతే దాని మీది నంబర్ రాంగ్ నంబరని మళ్లీ డ్రమ్‌లో పడేయ్. ఇలా అనేకసార్లు జరిగిందని నువ్వు చెప్పావు’
‘కాని రేపు డ్రా తీయడం మేరియన్ వంతని కూడా చెప్పాను’
‘నువ్వే తీస్తావు’ కెన్ మృదువుగా చెప్పాడు.
భోజనం అయ్యాక ఫోన్ మోగింది. సారా మేనేజర్ మిస్టర్ ఫాక్స్ ఫోన్ అది. ఆఫీస్ నించి ఆ సాయంత్రం ఇంటికి వెళ్లే మేరియన్ సబ్‌వే స్టేషన్‌లో రైలు కింద పడి మరణించిందని ఆయన బాధగా చెప్పాడు.
ఆమె రిసీవర్ని హుక్ మీద ఉంచి భర్త వంక తీవ్రంగా చూస్తూ అడిగింది.
‘మైగాడ్! ఎంత పని చేసావు’
‘అది ప్రమాదవశాత్తు జరిగింది. ఆమెకి స్వల్ప గాయాలై రేపు ఆఫీస్‌కి రాకూడదని ఆశించాను. ఈ పథకంలో నువ్వూ భాగస్థురాలివి. నేను పథకం మొత్తం పూర్తి చేసాను. ఆఖరి భాగం నీది. రేపు మనం లక్షాధికారులం అవడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది’
ఆ రాత్రి మళ్లీ సారాకి కెన్ తన మొహం మీద దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేసినట్లు పీడకల వచ్చింది.
* * *
డిటెక్టివ్ సార్జెంట్ గ్రేసన్ ఉదయం తొమ్మిదీ ఐదుకి లాటరీ ఏజెన్సీ ఆఫీస్‌కి వచ్చాడు. మేరియన్‌తో పనిచేసే సారా, ఇతర ఉద్యోగస్థులతో అతను మాట్లాడాడు. ఆమె శత్రువుల గురించి, బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రశ్నించాడు. లేజీ లార్క్ పోటీ ఉదయం పదకొండుకి జరిగేప్పుడు సార్జెంట్ అక్కడే కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు. పోటీదార్లలోని నలుగురు వచ్చి ఆ డ్రమ్‌లోని కార్డ్‌లన్నీ బాగా కలిసేలా తిప్పారు.
‘ఈ రోజు ఇది మేరియన్ పని. ఆమె లేకపోవడంతో ఈ బాధ్యత సారా తీసుకుంది’ మేనేజర్ ఫాక్స్ విచారంగా గ్రేసన్‌తో చెప్పాడు.
‘అవును. మేం వంతుల వారీగా ఈ పని చేస్తూంటాం. ఎవరు డ్రా తీస్తారన్నది ప్రాముఖ్యత లేనిది’ సారా తన భయాన్ని బయటకి కనపడనీకుండా చెప్పింది.
సార్జెంట్ గ్రేసన్ ఆ గదిలోంచి వెళ్లిపోతాడని ఎదురుచూసిన సారాకి భంగపాటే కలిగింది. పోటీదార్లతోపాటు అతను డ్రమ్ వంక ఆసక్తిగా చూడసాగాడు. సారా భయంగా తన కుడిచేతి ఉంగరాన్ని ఎడం చేత్తో కొన్ని క్షణాలు తిప్పుకుంది.
డ్రమ్‌లోకి చూడకుండా సారా తన చేతిని అందులో ఉంచడాన్ని గ్రేసన్ చూశాడు. ఆమె బయటకి తీసిన మొదటి కార్డ్ సంఖ్య ముప్పై మూడు. ఆ నంబర్ చదివి సారా చెప్పింది.
‘ముప్పై మూడు. ఫెయిల్’
దాన్ని డ్రమ్‌లో పడేసి ఇంకో కార్డ్‌ని తీసింది. అది ప్రభుత్వం ముద్రించిన పోస్ట్ కార్డ్ తప్ప కెన్ పంపిన ప్రత్యేక కార్డ్ కాదని చూడగానే చెప్పింది.
‘ముప్పై ఐదు. మళ్లీ ఫెయిల్’ చెప్పి దాన్ని కూడా డ్రమ్‌లోకి విసిరి మళ్లీ చేతిని కార్డ్‌లలోకి పోనించింది. పోటీదారులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. మూడోసారి చేతిలోకి దానంతట అదే ఓ కార్డ్ రావటం గుర్తించింది. దాన్ని పట్టుకుని చేతిని బయటకి తీసి చూసి నిట్టూర్చింది. అది ఉంగరానికి అతుక్కున్న బూడిద రంగు కార్డ్. దాన్ని చదివి గట్టిగా చెప్పింది.
‘ముప్పై నాలుగు. విజేత మిసెస్ ఎరికా మేనింగ్. ఫిలడెల్ఫియా’
ఎరికా మేనింగ్ ఎవరా అనుకుంటూ దాన్ని మిస్టర్ ఫాక్స్‌కి ఇచ్చింది. కెన్ అప్పుడప్పుడూ ఫిలడెల్ఫియాకి వెళ్లడం గుర్తొచ్చింది.
‘ఇది గెల్చుకున్న కార్డ్’ అతను చెప్పాడు.
ఆ సందర్భంగా వచ్చి తన పక్కనే ఉన్న లేజి లార్క్ బ్యూటీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌కి దాన్ని అందించాడు. ఆయన దాన్ని చదివి చిరునవ్వుతో మైక్‌లో ఎనౌన్స్ చేశాడు.
‘్ఫన్ నంబర్ ఉంది. వెంటనే ఆమెకి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్తాను’
‘అప్పుడే కాదనుకుంటాను’ సార్జెంట్ గ్రేసన్ వాళ్ల వైపు చూస్తూ చెప్పాడు.
‘మీరో మరణాన్ని పరిశోధిస్తున్నారని నాకు తెలుసు. కాని మా వ్యాపారానికి మీరు అడ్డు పడకూడదు’ వైస్ ప్రెసిడెంట్ అతని వంక చూస్తూ కఠినంగా చెప్పాడు.
‘కొద్ది నిమిషాలు మాత్రమే. సారా! దయచేసి ఆఫీస్ గదిలోకి ఓసారి వెళ్దామా?’ అతను కోరాడు.
ఆ గదిలో అంతా బల్ల ముందు కుర్చీల్లో కూర్చున్నాక సారా అతని వంక చూడటానికి భయపడి ఖాళీ మేరియన్
బల్ల వైపు చూసింది. తర్వాత అడిగింది.
‘నేనేం సహాయం చేయగలను?’
అతను జేబులోంచి మడతపెట్టిన ఓ కాగితాన్ని బయటకి తీసి చదివి చెప్పాడు.
‘మేరియన్ హత్య చేయబడింది. ఎవరో సబ్‌వే రైలు కిందకి తోసి చంపారు తప్ప అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఇది కూడా ఆమెకి తెలిసిన వాళ్ల పనే. బహుశ ఈ ఆఫీస్‌లోని ఒకరి పనై ఉండాలి’
‘లేదు. మేరియన్‌కి ఆఫీస్‌లో శత్రువులు ఎవరూ లేరు. అందరికీ ఆమె అంటే ఇష్టమే’
‘ఆమె అప్పుల్లో ఉందా? విజేత పోస్ట్ కార్డ్‌ని చూశాక మోసంతో విజేత అవచ్చని నాకు అనిపించింది’
‘లేదు. మేరియన్ ఉండి ఉంటే నేను తీసినట్లుగానే వందల మంది చూస్తూండగా విజేత కార్డ్‌ని తీసేది. ఇక్కడ మోసం జరిగే అవకాశం లేదు’ సారా చెప్పింది.
‘దయచేసి ఓ జెమ్ క్లిప్ ఇస్తారా?’ చేతిలోని కాగితాలు కింద పడిపోవడంతో గ్రేసన్ అడిగాడు.
అతని చూపులని చూస్తే ఆమెకి చదరంగం బోర్డ్ వెనక కూర్చున్న కెన్ గుర్తొచ్చాడు.
‘అలాగే’ చెప్పి ఆమె తన బల్ల మీది చిన్న ప్లాస్టిక్ పెట్టెలోంచి జెమ్ క్లిప్‌ని తీసిచ్చింది. దాన్ని అతనికి ఇచ్చాక తన ఉంగరానికి ఇంకో జెమ్ క్లిప్ అతుక్కుని ఉండటం గమనించింది. వెంటనే చేతిని వీపు వెనక దాచేసింది.
‘ఏం చూడాలనుకున్నానో అది చూసేసాను సారా. ఆ ఉంగరం అయస్కాంతం అని నాకు అనుమానం వచ్చింది. విజేత కార్డ్ తీసాక ఉంగరాన్ని మళ్లీ వెనక్కి తిప్పుకోవడం నువ్వు మర్చిపోయావు. విజేత కార్డ్ కూడా ఇలాగే దీనికి అతుక్కుంది కదా? ఇలాంటి ఎన్ని కార్డ్‌లని పోస్ట్ చేసారు? సగం? ముప్పాతిక? వచ్చే లాభంతో పోలిస్తే అది పెద్ద ఖర్చు కాదు. నా ఊహ నిజమైంది’
‘మీరేం అంటున్నారో నాకు అర్థం కావడంలేదు’ సారా తల అడ్డంగా ఊపుతూ చెప్పింది.
‘నువ్వు రెండో కార్డ్ ఫెయిల్ అని ప్రకటించినప్పుడు మీరు టు అడ్రస్ వైపు చూశారు తప్ప, వెనక వైపున్న నంబర్ని చూడలేదు. దాన్ని తిప్పి చూడకుండా అది ముప్పై అయిదని ఎలా చెప్పగలిగారు?’
అది చదరంగం ఆట లాంటిదని, తనకి చెక్ చెప్పాడని ఆమెకి అప్పుడు అర్థమైంది.
‘విజేత కార్డ్ తీయడానికి మేరియన్ని చంపడం అంత అవసరం అని మీకు అనిపించిందా?’ సార్జెంట్ అడిగాడు.
ఆమెకి విజేత ఎరికా గుర్తుకి వచ్చింది. దిండుతో తనని ఎవర్నీ అదమనివ్వ దలచుకోలేదు. ఆమె తన తర్వాతి కదలికని తేలిగ్గా అర్థం చేసుకుంది.
‘ఇప్పుడు నేను మీకు నా భర్త గురించి చెప్పాలి. అతని పేరు కెన్...’ ఆమె చెప్పడం ఆరంభించింది.
*
(స్టీఫెన్ డెంటింగర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి