S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వణికిస్తున్న వైరస్ ..జికా ఫీవర్

జికా...
ఈ రెండక్షరాల పేరున్న వైరస్
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
రోగంతోను, భయంతోనూ, ఆందోళనతోనూ
ఆ వణుకు మొదలైంది...
ఆ భయం ఎంతలా ఉందంటే...
విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోమని
దాదాపు 30 దేశాలు హెచ్చరించేంతవరకు...
గర్భధారణ అవకాశాలను ఆరునెలలనుంచి
మూడేళ్లవరకు వాయిదా వేసుకోమని
దాదాపు పది దేశాలు తమ ప్రజలకు సూచించేవరకు...
అ సూచనలు పాటించేవారికి తాయిలాలు ఇచ్చేంతవరకు...
ఆరునెలల క్రితం బ్రెజిల్‌లో మొదలైన ఈ జికావైరస్ వ్యాప్తి...ఇప్పుడు ఏకంగా 25 దేశాలకు చేరింది. అతిత్వరలో అమెరికా అంతటా కమ్ముకోబోతోంది. వచ్చే ఐదారు నెలల్లో ప్రపంచంలో చాలా దేశాలకు పాకే అవకాశం ఉంది. వచ్చే రెండుమూడు నెలల్లో 40 లక్షలమందికి జికా వైరస్‌తో సమస్యలుండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హు) చెబుతోంది. ‘హు’ అత్యవసర సమావేశం, వివిధ దేశాలకు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం ఎలా అన్నది అందరి ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఉపశమనానికి తప్ప నివారణకు ఔషధాలు లేని ఈ వ్యాధినుంచి రక్షణ కేవలం ముందుజాగ్రత్తలతోనే. అదీ ‘ఈడిస్ ఈజిప్టి’ దోమల నివారణతోనే సాధ్యం.
నిజానికి ఈ వైరస్ సోకినప్పుడు ఆ వ్యక్తికి వచ్చే జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎర్రబారే కళ్లు పెద్దసమస్య కాదు. ప్రాణాంతకమూ కాదు. కానీ ఈ మధ్య ఈ జికావైరస్ సోకిన గర్భిణులు ప్రసవించాక వారికి పుట్టిన పిల్లల తల, మెదడు వాస్తవ పరిమాణంకన్నా చిన్నగా, వికారంగా, నాడీవ్యవస్థలో లోపాలతో ఉండటం, కొందరు అలాపుట్టి వెంటనే మరణించడం ఇప్పుడు అందరి భయానికీ కారణమవుతోంది. అయితే జికా వైరస్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినది కాదు. కానీ ఇంత విశృంఖలంగా, ఇంత విపరీతంగా, ఇంత వేగంగా వ్యాపించడమే ఇప్పడు అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి దక్షిణ అమెరికాను గడగడలాడిస్తున్న ఈ వైరస్..ఉత్తర అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకూ విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన ‘ఈడిస్ ఈజిప్టి’ దోమలు ఉన్న ఉష్ణమండల ప్రాంతాలన్నింటికీ ఈ వైరస్ పాకే ప్రమాదం ఉందని ‘హు’ హెచ్చరించడంతో ఇప్పుడు అన్ని దేశాల్లో కదలిక మొదలైంది. భారత్‌తోసహా..
ఉగాండాలో ఆవిర్భావం
ఆఫ్రికా దేశమైన ఉగాండాలో మొట్టమొదట జికావైరస్ తొంగిచూసింది. నిజానికి ఉగాండా భాషలో ‘జికా’ అంటే విపరీతంగా పెరగడం (ఓవర్‌గ్రోన్) అని అర్థం. ఆ దేశంలో ఓ అడవికి పెట్టిన పేరు జికా...అ ప్రాంతంలో కనుగొన్న ఈ వైరస్‌కూ జికా అని పేరుపెట్టారు. ఆ వైరస్ ఇప్పుడు కొత్తగా కనుగొన్నది కాదు. 1947లో పెద్దసమస్యగా పరిణమించిన ఎల్లోఫీవర్‌పై పరిశోధనలు ముమ్మరమైనాయి. ఆ వ్యాధికికూడా ఈడిస్ ఈజిప్టీ దోమే కారణం. దీనిపై జికా అడవుల సమీపంలో పరిశోధనలు ప్రారంభించారు. ఎల్లోఫీవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్తవ్రేత్తలు జికా అడవుల్లోని విక్టోరియా సరస్సు ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఒక బోనులో ‘రెసస్ మకాక్వె’ జాతికి చెందిన కోతిని ఉంచారు. కొద్దికాలం తరువాత ఆ కోతికి జ్వరం వచ్చింది. 1948నాటికి దానికి కారణాలు కనుగొన్నారు. కొత్తరకం వైరస్‌వల్ల ఆ కోతికి జ్వరం వచ్చినట్లు తేలింది. జికా అడవుల సమీపంలో తొంగిచూసిన కొత్త వైరస్‌కు ‘జికావైరస్’ అని సంబోధించడం మొదలైంది. 1952నాటికి అది పూర్తిగా రూఢీ అయ్యింది. 1968లో తొలిసారిగా మనిషికి ఈ వైరస్ సోకింది. నైజీరియాలో తొలి కేసు నమోదైంది. 2007నుంచి ‘జికా వైరస్’ విజృంభణ మొదలైంది. 2015 ఆగస్టునుంచి అది విశృంఖలమైంది. ఈ ఏడాది జనవరికల్లా అది దేశదేశాలనూ చుట్టుముట్టడం ప్రారంభించింది. నిజానికి 1950నుంచి ‘ఆఫ్రికా-ఆసియా నారో ఈక్వెటోరియల్ బెల్ట్’ కే పరిమితమైన ఈ జికావైరస్ 2014నుంచి తూర్పుముఖంగా వ్యాపించడం మొదలైంది. పసిఫిక్ సముద్రం మీదుగా ఫ్రెంచ్ పోలినేసియా, ఈస్టర్ ఐలండ్‌లకు చేరింది. గతేడాదికి మధ్య అమెరికా, కరేబియన్ దేశాలు, దక్షిణ అమెరికాకు పాకింది.
ప్రస్తుతం ఎక్కడెక్కడ...
దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో గత ఆగస్టులో తొలి ‘జికావైరస్’ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలికాలంలో అక్కడ పుట్టిన పిల్లలో అసాధారణంగా తక్కువ పరిమాణంలో ఉన్న మెదడుతోకూడిన తలతో పుట్టిన పిల్లలు ఎక్కువగా ఉండటంతో వైద్యవర్గాలు ఉలిక్కిపడ్డాయి. గర్భిణుల్లో ఆందోళన మొదలైంది. ఇక పరిశోధనలు ఉధృతం చేశారు. ఇటీవలికాలంలో అంటే కేవలం రెండుమూడు నెలల వ్యవధిలో దాదాపు 4000 జికావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిసోకిన స్ర్తిలకు పుట్టిన పిల్లలు తల చిన్నపరిమాణంతో ఉండటాన్ని గమనించారు. చాలామంది ఇలాగే ఉండటం, మరికొందరు మరణించడంతో ఆందోళన ఎక్కువైంది. ముఖ్యంగా బ్రెజిల్‌లో జికావైరస్ సోకినవారు ఎక్కువమంది ఉన్నారు. ఇది కేవలం దోమలద్వారా వ్యాపిస్తోందా, అదిసోకినవారి లైంగిక సంపర్కంవల్ల వ్యాపిస్తోందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. గర్భిణికి జికావైరస్ సోకితే ఆమె గర్భసంచిలో ఉన్న పిండంలోని ‘ప్లసెంటా’లోకి చేరుతోందని పరిశోధనల్లో తేలుతోంది. బ్రెజిల్‌లోని ‘పరానా’లో ఓ కేసులో ఈ విషయం రూఢీ అయింది. పిండంలో జికావైరస్ ఆర్‌ఎన్‌ఎ లభ్యం అవడంతో ఈ వాదనకు బలం చేకూరింది. తాజా పరిణామాలను కూలంకుషంగా పరిశీలించిన అమెరికాలోని ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ డెవలప్‌మెంట్’ (సిడిసి) హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. దక్షిణ అమెరికా దేశాల పర్యటనలు వాయిదా వేసుకోవాలని, గర్భిణులు అసలు వెళ్లవద్దని పేర్కొంది. అలాగే దోమలనుంచి రక్షణకు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రెజిల్, కొలంబియా, ఎల్‌సాల్వడార్, ఫ్రెంచ్‌గయానా, గ్యాటెమాలా, హైతి, హోండూరస్, మార్టినిక్యూ, మెక్సికో, పనామా, పరాగ్వే, సురినామె, వెనిజులా, ప్యూర్టోరికో, బార్బడోస్, బొలివియా, ఈక్వడార్, గ్వాడెలోప్, సెయింట్ మార్టిన్, గయానా, కేప్‌వెర్టె, సమోవా ప్రాంతాలకు వెళ్లొద్దని చెబుతున్నారు. భారత్‌కూడా తమ ప్రజలకు ఈ తరహా హెచ్చరికలు చేస్తోంది. అలాగే ఆరునుంచి మూడేళ్ల వరకు గర్భం దాల్చే అవకాశాన్ని వాయిదా వేసుకోవాలని కొన్ని దేశాలు ప్రజలను కోరాయి. ముఖ్యంగా బ్రెజిల్, కొలంబియా, ది డొమినిక్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, జమైకా తదితర దేశాలు ఈ సూచన చేశాయి. కాగా టూర్లు రద్దు చేసుకున్నవారికి వివిధ ట్రావెల్ ఏజెన్సీలు తిరిగి చెల్లింపులు చేస్తున్నాయి. ప్రభుత్వాలుకూడా ప్రత్యేక నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో యూరోపియన్ దేశాలూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. బ్రిటన్, ఐర్లండ్, న్యూజిలాండ్, కెనడాల్లోనూ ఒకటీ అరా జికావైరస్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితి ఎంతలా ఉందో తెలుసుకోడానికి రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి. అమెరికాలో రక్తదానం ద్వారా ఎక్కువ రక్తాన్ని సేకరించే అమెరికన్ రెడ్‌క్రాస్ సంస్థ తమ సేకరణల్లో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. కొన్నాళ్లపాటు రక్తసేకరణను నిలిపివేసే ఆలోచనకూడా ఉంది. జికావైరస్ ప్రభావం ఉన్న దేశాలకు పర్యటనలు రద్దు చేసుకునేవారికి వివిధ విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు ఎటువంటి మినహాయింపులు లేకుండా తిరిగి చెల్లిస్తున్నాయి.
ఆ దోమ తెచ్చిన తంటా
కాళ్లపై నలుపు, తెలుపు మచ్చలతో కాస్త పెద్దదిగా కన్పించే ఈడిస్ ఈడిప్టి దోమవల్ల జికావైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ దోమ పగటిపూట లేదా వెలుతురున్న వేళల్లో మనుషులను కుడుతుంది. ఇది కుట్టిన తరువాత దీనిద్వారా మనిషిలోకి ఆ వైరస్ చేరుతుంది. అంతమాత్రాన తక్షణం వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. చాలాసార్లు దానివల్ల ఇబ్బందులు ఉండవు. రోగనిరోధక శక్తి తగ్గితే అది విజృంభిస్తుంది. ఒళ్లు, తలనొప్పి, కళ్లు ఊదారంగులోకి మారడం, జ్వరం జికా వైరస్ లక్షణాలు.
ఈ దోమ ఉష్ణమండల ప్రాంతాల్లో జీవిస్తుంది. ప్రపంచం అంతటా అది విస్తరించి ఉంది. ప్రాణాంతకమైన డెంగ్యు, చికన్‌గున్యా, ఎల్లోఫీవర్, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, వెస్ట్‌నైల్ వైరస్‌లను వ్యాప్తిచేసే దోమే ఇది. ఇది ఇప్పుడు ప్రపంచానికి కొరకరాని కొయ్య. జికా వైరస్ సోకితే దాదాపు డెంగ్యూ లక్షణాలు కన్పిస్తాయి. కీళ్లనొప్పులుంటాయి. అయితే ప్లేట్స్‌లెట్స్‌పై ప్రభావం ఉండదు. ప్రస్తుతానికి ఉపశమనానికి తప్ప జికావైరస్ నిరోధానికి మందులు లేవు.
వ్యాక్సిన్‌కు పదేళ్లు పట్టొచ్చు...
ప్రస్తుతం జికా వైరస్ వల్ల కలిగే జ్వరానికి ఉపశమనం మందులు వాడుతున్నారు. పారసిట్మాల్, ఆస్పిరిన్‌వంటి సాధారణ ఔషధాలతో సరిపుచ్చుతున్నారు. వ్యాక్సిన్ తయారీకి విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రభావవంతమైన మందులు మరో ఆరునెలలు లేదా ఏడాదిలో తయారయ్యే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ మాత్రం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. జికావైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ తయారీకి కనీసం పది లేదా పనె్నండేళ్లు పట్టవచ్చని అంటున్నారు ‘సెంటర్ ఫర్ బయోడిఫెన్స్ అండ్ ఎమర్జింగ్ ఇనె్ఫక్షియస్ డిసీజెస్’ (అమెరికా)కు చెందిన శాస్తవ్రేత్త నికాస్ వసిలికిస్. అయితే వ్యాక్సిన్‌ను తయారు చేసే పరిశోధనలు చాలా వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జి అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (అమెరికా) శాస్తవ్రేత్త ఆంథోని ఫాసి.
ఇలా చేయాలి...
జికావైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి అమెరికా రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ మున్ముందు, అతి త్వరలో, విస్ఫోటనంలా అది ఉష్ణమండల ప్రాంతాలపై విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. భారత్‌కూడా ఆ ప్రాంతాల జాబితాలోకి వస్తోంది. చికున్‌గున్య, డెంగ్యూ జ్వరాలకు కారణమైన ఈడిస్ ఈజిప్టి దోమవల్లే జికావైరస్ జ్వరాలుకూడా వస్తున్నాయి. అందువల్ల మనదేశంలో ఆ దోమలున్నందువల్ల ఇక్కడకూడా అది వ్యాపించే అవకాశం ఉంది. అది సోకి నష్టపోయాక మేలుకోవడం కన్నా ముందుజాగ్రత్తగా దోమల నివారణతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మంచినీటి ద్వారా మాత్రమే ఈ దోమ వృద్ధి చెందే అవకాశం ఉంది. నీటిమడుగులు లేకుండా చూడటం, దోమల నివారణ మందులు వాడటం, దోమతెరలు ఉపయోగించడం, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటేనే మన బతుకులు భద్రం. దోమలు ఇళ్లల్లోకి చేరకుండా కిటికీలు, తలుపులు ఉన్నచోట మెష్‌ల ఏర్పాటు, ప్రభుత్వ సారథ్యంలో ఫాగింగ్ వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రియాన్ ఫాయ్ పరిశోధన
అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్శిటీలోని బయాలజీ శాస్తవ్రేత్త బ్రియాన్ ఫాయ్ జికావైరస్‌పై పరిశోధనలు చేశారు. ఈ వ్యాధి లైంగికచర్యవల్ల వ్యాపిస్తుందని తేల్చాడు. 2008లో సెనెగల్‌కు వెళ్లి అక్కడ జికావైరస్‌పై పరిశోధనలు చేసిన ఆయన ఆ తరువాత భార్యతో కలిసినప్పుడు ఆమె అనారోగ్యానికి గురైంది. జికావైరస్‌వల్లే ఆమె అస్వస్తతకు గురైనట్లు అతడు తేల్చాడు. రోగలక్షణాలు, పరిణామాలను ఆయన రికార్డు చేశాడుకూడ.
ఇవీ జాగ్రత్తలు
దోమల నివారణకు చర్యలు చేపట్టడం ముఖ్యం. దోమలనుంచి రక్షణకు కొన్ని ఔషధాలు, దోమల నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. లెమన్, యూకలిప్టస్ ఆయిల్‌ను లేపనంగా వాడొచ్చని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు. కొన్ని లేపనాలనూ వారు సూచిస్తున్నారు. జికావైరస్ వల్ల కలిగే జ్వరానికి ఆస్పిరిన్, పారాసిట్మాల్ మందులతోపాటు నాన్ స్టెరాయిడికల్ యాంటి ఇన్‌ఫ్లమెటరి ఔషధాలనూ వాడొచ్చు. ఇక జికావైరస్ వచ్చిన అందరికీ ప్రాణాపాయం ఉండదు. కేవలం గర్భిణలకు, వారికి పుట్టే పిల్లలకు వీటివల్ల ఎక్కువ ముప్పు వాటిల్లుతోంది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే జికావైరస్‌వల్ల పెద్దలకు నాడీసంబంధమైన తీవ్ర అస్వస్థత, మరణాలు సంభవిస్తున్నాయి.
*

మైక్రోసెఫాలి అంటే..

సాధారణ పరిమాణంకన్నా చిన్న సైజులో మెదడు, తల (కపాలం) ఉండటాన్ని మైక్రోసెపాలి అంటారు. కేవలం జికావైరస్‌వల్లే ఇలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఇతర కారణాలవల్లకూడా ఇలా జరగవచ్చు. కానీ ఇప్పుడు బ్రెజిల్‌లో దాదాపు ఒకే కాలంలో నాలుగువేల కేసుల్లో ఇలాంటి లోపంతో పిల్లలు జన్మించారు. దీనికి మాత్రం జికావైరస్ కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం కీలకదశలో పరిశోధనలు చేస్తున్నారు. అలా పుట్టిన పిల్లలో నాడీసంబంధ వ్యాధులు, లోపాలు ఉంటాయి. పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడం, కొందరు మరణించడం జరుగుతోంది. ఈ జికా వైరస్ సోకిన పెద్దలకూ నాడీసంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. నిజానికి జన్యుపరమైన లోపాలవల్లకూడా మైక్రొసెఫాలి పిల్లలు పుట్టొచ్చు. అలాగే జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబులు వేసినప్పుడు, బాంబులు పడిన ప్రాంతానికి రెండు కి.మి. దూరంలో ఉన్న మహిళలు అణుధార్మికతకు లోనయ్యారు. వారికి పుట్టిన పిల్లలూ ఇలా చిన్నతలతో ఉన్నారు. ఇక పెద్దలూ గుల్లియన్ బరె సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఇది నాడీ సంబంధ సమస్య. రానురాను ఇది ప్రాణాంతక పక్షవాతంగానూ పరిణమించవచ్చు. ఇప్పుడు బ్రెజిల్‌లో ఇలాంటి కేసులూ కన్పిస్తున్నాయి. దీనికి జికావైరస్ కారణమని వైద్యవర్గాల భావన.

భారత్ అప్రమత్తం
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా సారథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ, ఎయిమ్స్, భారత ఉన్నతస్థాయి పరిశోధకులు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజి (పూణె) అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో జికావైరస్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఏ చర్యలు చేపట్టాలో చర్చించారు. మరో వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్రెజిల్ సహా 24 దేశాలకు వెళ్లొద్దన్న సూచన చేశారు. ముఖ్యంగా గర్భిణులు ఆ దేశాలకు వెళ్లడం మంచిది కాదని భారత వైద్యమండలి సూచించింది.

బ్రెజిల్ బెంబేలు...
జికా వైరస్ బ్రెజిల్‌ను బెంబేలెత్తిస్తోంది. గడచిన వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ తరువాత ఈ సమస్య విస్తృతమైంది. వచ్చే ఆగస్టు 5 నుంచి 21వ తేదీవరకు సమ్మర్ ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లు చేసిన బ్రెజిల్ తాజా ఉపద్రవంతో హడలెత్తిపోతోంది. రియో ఒలింపిక్స్‌కు జికావైరస్ పెద్ద సమస్యగా పరిణమించిందనే భావించాలి. దాదాపు 50 లక్షలమంది అతిథులు వచ్చే ఈ ఒలింపిక్స్‌పై బ్రెజిల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీరిలో కనీసం 20 లక్షలమంది అమెరికా దేశాలనుంచే వస్తారని అంచనా. తాజా పరిణామాలతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుందన్న భయం వెన్నాడుతోంది. క్రీడాకారుల భద్రత దృష్యా ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయో అర్థం కావడం లేదు. గడచిన ఆరునెలల్లో నాలుగువేల జికావైరస్ కేసులు ఆందోళనకు కారణమయ్యాయి. చాలామంది చిన్నతలతో పిల్లలు జన్మించారు. వారిలో కొందరు మరణించారు. గర్భిణులు ఇప్పుడు జికా వైరస్ ఆందోళనతో ఉన్నారు. లాబ్‌లు, ఆసుపత్రులచుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు దోమల నివారణకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రియో ఒలింపిక్స్ జరిగే ప్రాంతాలు సహా ఊరూవాడా ఫాగింగ్ చేస్తున్నారు. మురికి, నీటిమడుగులు, చెత్తాచెదారం పోగుపడకుండా చేస్తున్నారు. దోమలనివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూ మరోవైపు జికావైరస్‌ను నిరోధించే ఔషధాలకోసం పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇప్పుడు బ్రెజిల్‌ల ఎటుచూసినా మాస్క్‌లు ధరించిన ఆరోగ్యసిబ్బంది మూలమూలలా మందులు జల్లుతూ కన్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు 40 లక్షలమంది ఈ కార్యక్రమాల్లో తలమునకలైనారు. ఇంటింటికి వెళ్లి వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు. వీరికి తోడుగా 3వేలమంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లు రంగంలోకి దిగారు. 2 లక్షల 20వేలమంది సైనికులూ దోమలపై యుద్ధం ప్రకటించారు. దోమల నివారణ మందులను ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించేవారికి నగదు బహుమతి ఇస్తున్నారు. నేరుగా వారి అకౌంట్లలోకి నగదు జమ చేసేస్తున్నారు. రియో ఒలింపిక్స్‌కు ఇంకా ఆరునెలల సమయం ఉన్నందున ఈలోగా జికావైరస్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చని (దోమలను) ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. రియోలోని ప్రధాన ఒలింపిక్ స్టేడియం సాంబా డ్రోమ్ సహా అన్నిచోట్లా జికావైరస్ నిరోధక చర్యలు చేపట్టారు.

చికున్‌గున్య, డెంగ్యూ
జ్వరాలకు కారణమైన ఈడిస్ ఈజిప్టి దోమవల్లే జికావైరస్ జ్వరాలుకూడా వస్తున్నాయి. అందువల్ల మనదేశంలో
ఆ దోమలున్నందువల్ల
ఇక్కడకూడా అది వ్యాపించే
అవకాశం ఉంది.

-ఎస్.కె.రామానుజం