S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రానిది రాదు.. పోనిది పోదు’ (అమృతవర్షణి)

ఓతండ్రి తన బిడ్డలే సమస్తమనుకున్నాడు. వాళ్లను ఎంతో ప్రయోజకుల్ని చేయాలని భావించాడు. ఆ తర్వాత వాళ్లు తనను గౌరవ స్థానంలో నిలబెట్టి అందలమెక్కిస్తే చూడాలనుకున్నాడు.
కడుపు మాడ్చుకుని అంతా పిల్లల కోసమే ప్రోగుచేస్తూన్నాడు. వాళ్ల కోసమే ఖర్చు పెడ్తున్నాడు. దాహం వేస్తే, సోడా తాగితే ఖర్చవుతుందని, అది కూడా పిల్లలకే ఉంటుందని వీధి కుళాయి దగ్గర దాహం తీర్చుకుంటున్నాడు.
భోజనం వేళకు హోటల్‌లో తింటే చాలా ఖర్చు పెట్టవలసి వస్తుందని, ఉంటే తన పిల్లలకే మిగుల్తుందనుకుని ఏవో రెండు అరటిపళ్లు కొనుక్కుని తింటున్నాడు. ఏకంగా రాత్రి ఇంటికి వెళ్లి అన్నం తినవచ్చులే అనుకున్నాడు.
ఇలా ఎక్కడికక్కడ తన సుఖాలనీ, భోగాలనీ కత్తిరించుకుంటూ, తన అవసరాలను కుదించుకుంటూ, పిల్లలను ప్రయోజకుల్ని చేయాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. అతనేం చేస్తున్నా తన పిల్లలే కనిపిస్తున్నారు. వాళ్లను ఎలా పైకి తీసుకురావాలో అన్న ఆలోచన ఒక్కటే తప్ప మరో దృష్టి లేదు, ధ్యేయమూ లేదు, గమ్యమూ లేదు. అన్నీ వున్నా స్థిమితం లేదు. అదీ అతని పరిస్థితి.
ఇదంతా గమనిస్తూ ఎవరైనా అతగాణ్ణి పిలిచి,
‘చూడు బాబాయ్! తనకుమాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? బిడ్డల మీద అంత వ్యామోహమైతే ఎలా? యివన్నీ విడిచిపెట్టేసి ఆ మోహాన్ని దైవం మీద మళ్లించే ప్రయత్నం చేయరాదా? అదే మోక్షానికి మార్గం అని హితబోధ చేశాడనుకోండి. పొరపాటున ఇతగాడు శ్రద్ధగా అది విన్నాడనుకోండి. ఏం జరుగుతుంది? చేసే పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఇదంతా అబద్ధమనిపిస్తుంది. దైవ చింతనకా ‘మనసు’ రాదు. సాధ్యపడదు. కర్మ భ్రష్టుడౌతాడు.
ఎటూ కాకుండా పోతాడు.
మనస్సు చికాకుగా ఉంటుంది.
దేనినీ పొందలేడు. ఉన్నది పోయింది.
మరోటి అందదు. ఈ బాపతు మనుషులు లేరనుకోకండి. ఉన్నారు. రానిది రాదు, పోనిది పోదు. అంటే ఇదే.
* * *
కర్ణాటక సంగీతంలో ఒకేలా కనిపించే రాగాలున్నాయి.
ఆరభి, దేవగాంధారి, శ్రీరాగం, మణిరంగు, ఆనందభైరవి, రీతిగౌళ, దర్బారు, నాయకి; ఒకేలా కనిపించినా స్వర సంచారంలో ఎంతో మార్పుంది. ‘మణిరంగు’లో ప్రసిద్ధమైన ఈ త్యాగరాజ కీర్తనలో విశే్లషించినవన్నీ రామాయణంలోనివే.
ఋషీశ్వరుల శాపవాక్కులు ఎవర్నీ వదలవ్. అటు దేవతలపైనా, ఇటు రాక్షసులపైనా కూడా ఉంటాయి.
దేవేంద్రుడి ప్రారబ్ధం కాకపోతే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి అప్సరసలెందరో ఉన్నా, ముక్కుమూసుకుని తపోనిష్టలో వుండే గౌతముడి భార్య అహల్యపై మోహం ప్రారబ్ధమే.
పరమ భయంకరమైన శాపం పొందాడు అది వేరే విషయం.
గంధపు చెక్కలు మోసే గాడిద చూపులెప్పుడూ గడ్డిపరకల మీదే ఉన్నట్లుగా అత్యున్నత స్థానాల్లో, గౌరవం పొందుతూ అక్రమాస్తులు లెక్కలేనంత కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టేసి, తీరా ఆనక పట్టుబడ్డ తర్వాత బిక్కమొహంతో దిక్కులు చూస్తూ టీవీల్లో కనిపించే పెద్దమనుషుల్ని (బ్రతుకులు) చూడటం లేదా మనం?
రాక్షసులూ దేవతలూ కలిసే క్షీరసాగర మథనం చేశారు. అమృతం మాత్రం దేవతలకు దక్కింది. రాక్షసులకు మాత్రం ఆయాసం మిగిలింది.
శ్రీమహావిష్ణువు మోహినీ అవతార రూపంలో వచ్చి అమృతం దేవతలకే దక్కే ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. అంతవరకూ బాగానే ఉంది. ఎవరూ ఊహించని ఆ సమయంలో పుట్టిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు, జాలిగుండెతో మింగే పరిస్థితి రావడం ఏమిటి? ఆ భోళా శంకరుడు కంఠంలో నిలపడమేమిటి? ఎక్కడో అరణ్యాలలో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటూ జీవించే మునులకు రాక్షస బాధలేమిటి? తలుచుకుంటే శపించగలరు. అసమర్థులు కాదు. విశ్వామిత్రుడంతటి వాడు తన తపశ్శక్తి తగ్గుతుందనే (ఒక్క భయంతో) భావంతో దశరథుణ్ణి ‘దేహి’ అనవలసి వచ్చింది. సరే. ప్రణాళికంతా రాక్షస సంహారమే అనుకోండి. అలా వ్యక్తుల స్థానాలకు చలనం రాలేదా? తెల్లవారితే పట్ట్భాషేకమనుకున్న రాముడు వనవాసానికి సిద్ధపడలేదా? త్యాగరాజ కీర్తనలన్నీ వేటికవే సాటి. ఒక్కో రాగానికి ఒక్కో రంగు. అటువంటిదే ‘మణిరంగు’లోని, రానిది రాదు, పోనిది పోదు!
‘మణి’రంగు రాగంలో కీర్తనలు చాలా అరుదు. వాటిలో ఎంతో ప్రసిద్ధమైన కీర్తన ఇది. ఈ కీర్తన పాడి ప్రచారం చేసిన విద్వాంసులు నాకు తెలిసి ఒకరు -చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లై. మరొకరు - పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.
సమర్థుడైన గాయకుడి కంఠంలోనే ఈ కీర్తన వినాలి.
‘రానిది రాదు, సు రాసురులకైన ॥
పోనిది పోదు భూసురులకైన ॥
దేవేంద్రునికిసు దేహము పూర్వ
దేవుల కమృతము అభావమేగాని
ఆ వనచర బాధలా మునులకేగాని
పావన! త్యాగరాజ భాగ్యమా! శ్రీరామ ॥
త్యాగయ్య సంగీతానే్న ఎందుకు ఆశ్రయించాడు? నాదోపాసన ప్రక్రియకున్న సౌలభ్యం ఒక్క సంగీతానికే ఉంది కాబట్టి.
కలియుగానికున్న ప్రణాళిక, దైవచింతన, లేదా దైవభజన. మరో మార్గం లేదు.
ఉత్తమ సాహిత్యమైనా, సంగీతమైనా పదిమందినీ తరింపచేయాలి. లేనప్పుడు అది పక్కా వ్యాపారమే అవుతుంది.
లాభనష్టాలతో కూడుకున్నదే వ్యాపారం. లోకంలో సంగీత వ్యాపారులను కూడా త్యాగయ్య చూశాడు కాబట్టే, సంగీత పరమార్థాన్ని సరిగ్గా గ్రహించాడు. వారానికి సరిపడ పదార్థాల కోసమే ఉంఛ వృత్తి చేసి బ్రతికాడు. జానెడు పొట్టకు అది చాలు అనుకుని, త్రికరణశుద్ధిగా జీవించాడు. అంతేకాదు. విద్యార్జనకు దానమే పరాకాష్ఠ అనుకున్నాడు. అన్నం పెట్టి ‘విద్య’ నేర్పాడు.
విద్య అంటే బ్రహ్మవిద్యే. మిగతావన్నీ మాయల విద్యలు. పొట్టకూటి కోసం కోటివిద్యలు. మధ్యలో వస్తాయి. పోతాయి. మనిషికి ఉపయోగపడవు.
ఒళ్లు ఎరక్కుండా ప్రవర్తిస్తూ జానెడు పొట్టకు పుట్టెడు పాపాలను చేసే వాళ్లకు బ్రహ్మవిద్య పరమార్థమెలా తెలుస్తుంది? పరలోక భయముంటేగా?
* * *
సంగీతంలో రెండు మార్గాలున్నాయి.
ఒకటి ప్రేయో మార్గం.
తనకు వచ్చిన పాండిత్యాన్ని సన్మానాలతో కొలుచుకుంటూ, విలాసాలూ, భోగభాగ్యాల కోసం తపిస్తూ జీవించటం.
రెండోది శ్రేయో మార్గం. భగవంతుని వరంగా, అయాచితంగా తనకు లభించిన పాండిత్యాన్ని పరమేశ్వర ప్రసాదంగా భావించి, ఆ విద్యను దైవానికే అంకితం చేయటం.
కొందరికి ఎన్నో బిరుదులుంటాయి. కానీ గుర్తుండవు. ఎంతో గొప్పగా పాడతారు. కడుపులో చల్ల కదలకుండా వారికున్న విద్యను పదిమందికీ పంచుతారు. ఏమీ ఆశించరు.
అది శ్రేయోమార్గం. అందుకే చిత్తశుద్ధితో చేసిన పనులకు దైవము మెచ్చును, లోకము మెచ్చును అంటాడు, అన్నమయ్య. చిత్తశుద్ధికీ విత్తశుద్ధికీ తేడా ఉంది. మరి కొందరుంటారు.
‘ఎవరు పిలుస్తారా? సత్కారం చేసి, ఇంద్రుడినీ, చంద్రుడనీ పొగిడేస్తూ, సన్మానాలు చేస్తారా, దండలతో ముంచేస్తారా? అని తపిస్తూనే ఉంటారు.
వారికి లభించిన విద్య పట్ల అంతులేని విశ్వాసం - వారికంటే ప్రజ్ఞాపాటవాలున్న వారిని అభినందించలేరు. అదో ప్రారబ్ధం. బలహీనత కూడా. పైపెచ్చు, అసహనంతో ఊగిపోతూ ఉంటారు. బాగా పాడితే తట్టుకోలేరు. ఏదోరకంగా వాళ్లని విమర్శిస్తే తప్ప నిద్ర పట్టదు. అదో రకమైన అనారోగ్యం. దీర్ఘ రోగం. దానికి మందుండదు.
దీనికి భిన్నంగా జరిగిన ఓ సంఘటన గుర్తు చేస్తాను.
ఓసారి ‘సంగీత కళానిధి’ డా.పాణిగారు మద్రాసు నుంచి రైల్లో వస్తూ కర్నూలు స్టేషన్‌లో దిగగానే సుస్వరంతో పాట వినబడింది. ‘ఎవరా?’ అని చూస్తోంటే డబుల్ రీడ్ హార్మొనియంతో ఒక యాచకుడు ఆనందంగా కళ్లు మూసుకుని హిందీలో ఏవో టుమ్రీలు పాడుతున్నాడు.
నిలబడి వింటూ కాసేపు ఆనందించి, అతన్ని కారెక్కమని తనతోబాటు కర్నూలు తీసుకెళ్లారు.
రోష్‌నారా బేగమ్, కరీంఖాన్, పంకజ్ మల్లిక్ పాటల్ని అడిగి పాడించుకుని, వాడి గానాన్ని మెచ్చుకుని, కడుపునిండా భోజనం పెట్టి, కాస్త డబ్బులిచ్చి, బట్టలిచ్చి పంపారు. ఆ యాచకుడు పాడిన పాటలన్నీ ఆయనకు గుర్తున్నాయి. పాడి కొన్ని వినిపించారు.
అదో సంస్కార గుణం. అవతలి వాణ్ణి మెచ్చుకున్న కొద్దీ మన విద్య పెరుగుతుందనేందుకు ఒక ఉదాహరణ. ‘స్వీయలోపమ్మెరుగుటే పెద్ద విద్య’ అంటాడు వేమన. పాటలో కనిపించే లోపాలు పాడేవారికి విధిగా తెలుస్తాయనుకోకండి. ‘అయ్యా! నా పాటలోని దోషాన్ని చెప్పారు. మీరు చెప్పినది నిజమే సుమా! తప్పకుండా సరిచేసుకుని మరీ పాడతాను’ అనే సహృదయులు సాధారణంగా ఉండరు. ఘంటసాలను కొత్తల్లో ‘నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారు. మూటా ముల్లే సర్దుకుని ఇంటి దారి పట్టి వుంటే ఏమై యుండేది? నలుగురితో కలిసి కోరస్ పాడేందుకూ బిడియపడలేదు. ఆత్మపరిశీలన చేసుకునే సంస్కారం ఉంది కాబట్టి.
తనను తాను ఓసారి పరిశీలించుకున్నాడు. ఏం పాడుతున్నాం? ఎలా పాడుతున్నాం? అని ప్రశ్నించుకుంటూ ‘కాస్త’ దిశను మార్చుకున్నాడు. మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. లక్ష్యం నుంచి తప్పుకోలేదు.
పట్రాయిని లాటి ప్రణవనాదంలోని ‘రుచి’ తెలిసిన గురువు లభించినంత మాత్రాన ఘంటసాలకు అవకాశాలన్నీ వడ్డించిన విస్తరిలా లభించలేదు. యిష్టమైనది కాబట్టి కష్టాలు పడ్డాడు.
మా పరమేష్టి గురువు డా.శ్రీపాద పినాకపాణి గారంటూండేవారు.
మూడు ముఖ్యమైన టీలున్నాయి. Tradition, Taste, Talent (టాలెంట్) ఉంటుంది. కానీ రసజ్ఞత (టేస్ట్) ఉండదు. ఏ పాట గౌరవంగా ఉంటుందో, పదిమందికీ నచ్చుతుందో తెలియదు. మరి కొందరికి ఎంతో ప్రతిభ ఉంటుంది. శృతిలయ జ్ఞానం ఉంటుంది. సంప్రదాయ సంగీత జ్ఞానంపై శ్రద్ధ ఉండదు. అంతేకాదు. మిగతా వారికంటే సుళువుగా నేర్చుకోగలిగినా నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. యివన్నీ గాయక దోషాలే.
తెలుసుకోవాలనే జిజ్ఞాసంటూ ఉంటే ఎప్పటికైనా తెలుసుకునే దారి దొరుకుతుంది. ప్రాప్తమంటూ ఉంటే తప్పనిసరిగా ఫలితముంటుంది. జీవస్వరంతో నిండిన, మధురమైన గాత్రం, రసజ్ఞత, సంప్రదాయ సంగీత జ్ఞానం వెరసి ఈ మూడు లక్షణాలూ పుష్కలంగా వున్న ఘంటసాలను ప్రజలు నెత్తిన పెట్టుకుని ఆదరించి విన్నారు.
*

చిత్రాలు..
* శ్రీపాద
పినాకపాణి
*గాయక సార్వభౌమ
పారుపల్ల్లి రామకృష్ణయ్య పంతులు
* ఘంటసాల

- మల్లాది సూరిబాబు 9052765490