S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉప్పెన

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘హాయ్! నా సెల్‌లో కొన్ని ఫొటోలున్నాయి. కొన్ని ప్రింట్లు వెయ్యాలి. ఒకటి మాత్రం ఎన్లార్జ్ చేసి లామినేట్ చెయ్యాలి’ అంటూ ఫొటో స్టూడియోని కలియజూసి, ‘దీనంత సైజు’ అని ఒక ఫొటో చూపించింది కీర్తి.
ఆమెని ఎక్కడో చూసినట్టుగా అన్పించింది స్టూడియో సుబ్బారావుకి. అయినా వౌనంగా చేయి చాచి సెల్, కనెక్టింగ్ వైరు అందుకున్నాడు. ఫొటోల్ని తన కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసి మానిటర్‌ని ఆమె వైపు తిప్పాడు.
ఎన్లార్జ్ చేయాల్సిన ఫొటో చూపించిందామె. అందులో చాలా హుందాగా అందంగా ఉన్న ఓ యువకుడు ఒక మోకాలు నేల మీద ఆన్చి కూర్చుని, మెరుపు తీగలా ఉన్న కీర్తికి గులాబీ ఇస్తుంటే ఆమె ముచ్చటగా మురిపెంగా చూస్తోంది!
సుబ్బారావు చూపుల్లో పోగుబడిన ఆశ్చర్యం చూసి కిలకిలా నవ్వింది. ‘మేం అంత బాగున్నామా?’
ఆ ఫొటో అంటే ఆమెకెంతో ఇష్టం. అందుకే పెద్ద సైజులో వేయించుకుని తన ఇంటి హాలులో పెట్టుకోవాలనుకుంది.
‘అపురూప జంటలా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచదర్ అనుకోండి. మీరొప్పుకుంటే దీని కాపీని మా స్టూడియోలో పెట్టుకుంటాను. దానికి బదులుగా మీకిది ఊరికే వేసిస్తాను’
‘అలాగా!’ కనుబొమలు చిత్రంగా ఎగరేసి కొంటెగా నవ్వింది. కళ్లల్లో మెరుపులు వెలుగుతోంటే గబగబా సుధీర్‌కి ఫోన్ చేసింది.
‘హాయ్ సుధీర్, స్టూడియో నుంచి.. అహ ఆ స్టూడియో కాదు, ఫొటో స్టూడియో నుంచి. నువ్వు ప్రపోజ్ చేసినప్పటి ఫొటో ప్రింటు వేయిద్దామనొచ్చాను. మన జోడీ అదిరిందట. నేను అనుమతిస్తే పబ్లిసిటీ కోసం స్టూడియోలో పెట్టుకుంటాట్ట!’
‘వాడేమిటి ఎవడైనా అదే మాట అంటాడు. భూమీద మనలాంటి బ్యూటిఫుల్ జంట లేదని బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఉయార్ లక్కీ కపుల్ యార్’
‘చిన్న సవరణ. మనమింకా కపుల్స్‌మి కాలేదు...’
‘ఎంగేజ్‌మెంట్ అయిందిగా, సగం పెళ్లి అయిపోయినట్టే. ఇంక రేపు మన పెళ్లి ఫొటోలు మీడియాలోనూ, సోషల్ నెట్‌వర్కింగ్‌లోనూ చూసి ఎన్ని వేల గుండెలు ఆగిపోతాయో చూడు’
‘వద్దులే సుధీర్. మన గురించి ఎవర్నీ చంపొద్దు. బై...’ మురిసిపోతూ సెల్ కట్టేసింది. ‘ఓకే. దానికేం భాగ్యం అలాగే పెట్టుకో. దీనికి డబ్బిచ్చేస్తానే్ల’ అయిదు వందల నోటు తీసిచ్చింది.
ఆమెని గుర్తు పట్టేశాడు సుబ్బారావు. ఒక్కసారిగా ఆనందోద్విగ్నుడయ్యాడు. ‘మీరు... మీరు.. సినీనటి కీర్తి కదూ?’
నిలువుగా తలాడించింది.
గబుక్కున తన కుర్చీ ఎత్తి కౌంటర్ బయట పెట్టి, ‘కూర్చోండి మేడమ్’ అని చెప్పి బయటికి దూసుకెళ్లాడు.
‘సినిమా స్టార్ కీర్తి నా స్టూడియోకి వచ్చిందోచ్’ అని బిగ్గరగా అరిచి, కూల్‌డ్రింక్ పట్టుకొచ్చి, అతి వినయంగా ఆమెకి అందించాడు.
‘వద్దొద్దు. కూలింగ్‌వి తాగను. గొంతు పాడవుద్ది...’ వంకబెట్టింది.
అతడు అమాంతం మాయమై మరో బాటిల్‌తో సిద్ధమయ్యాడు. మరి తీసుకోక తప్పలేదు.
ఈలోగా జనం లోపలికి తోసుకొచ్చేశారు. ఆమె వంక అపురూపంగా, ఆరాధనగా చూస్తోంటే పలకరింపుగా నవ్వింది. పొంగిపోయారు.
‘మీ సినిమాలన్నీ చూశాం మేడమ్’ ‘మీరు ఎక్కువ సినిమాల్లో ఎందుకు నటించట్లేదు?’ ‘టాప్ హీరోల పక్కన ఎప్పుడు నటిస్తారు?’
‘నేను చూజీగా ఉంటాను. పాత్ర నచ్చితేనే నటిస్తాను’ అందామె.
‘అగ్నిపరీక్ష సినిమాలోంచి ఎందుకు తప్పుకున్నారు?’
కీర్తి మోము మ్లానమయ్యింది. ‘కారణమేంటో ఇదివరకే చెప్పేను’
‘అంత చిన్న కారణానికి పెద్ద హీరో పక్కన నటించే ఛాన్స్ వదులుకున్నారా?’ ఒక యువకుడు ప్రశ్నించాడు.
‘నువ్వా హీరో అభిమానివా?’
తలాడిస్తూ అన్నాడు. ‘మీ ఇద్దరూ కలిసి నటిస్తే మీ జంట సూపర్ హిట్ అవుతుంది’
నవ్వి వూరుకుంది.
‘ఆ సినిమాలోంచి తప్పుకున్నందున మీకు ఆఫర్లు తగ్గిపోయాయని ఒక టీవీ ఛానల్లో చెప్పారు. నిజమేనా?’ అచ్చం విలేకరిలా అడిగారొకరు.
‘ఐ డోంట్ కేర్. నాకొచ్చేవి నాకొస్తాయి’ లేచి వెళ్లడానికుద్యుక్తురాలయ్యింది కీర్తి.
‘మూడే మూడు సినిమాల్లో నటించారు. అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నారేంటి?’ ఎంతో బాధ పడిపోతూ అడిగాడో కుర్రాడు.
చిలిపిగా నవ్వింది. ‘పెళ్లి చేసుకుంటే నా గ్లామర్ తగ్గిపోతుందా?’
మూకుమ్మడిగా తలలాడించారు.
‘మనవలూ మనవరాళ్లూ ఉన్న అరవై ఏళ్ల హీరోలు కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్లు పాడటం లేదూ!’ సూటిగా అడిగింది.
‘అది... మరి..’ బుర్ర గోక్కున్నాడు.
‘పెళ్లైతే ఆడవాళ్లకి గ్లామర్ తగ్గిపోతుంది. మరి మగాళ్లకి? పెరుగుతుందా?’ నవ్వుతూనే ఎదురు ప్రశ్నించింది. కానతడు ముఖం చాటేశాడు.
‘పెళ్లయ్యాక నటనకి గుడ్‌బై చెప్పేస్తారా?’ ఇంకొకరు అడిగారు.
‘చెప్పను. అసలెందుకు చెప్పాలి? ఉద్యోగినులు పెళ్లవ్వగానే జాబ్స్‌కి రిజైన్ చేస్తున్నారా? లేదు కదా? నాకిది ఉద్యోగం లాంటిదే. నాకు నచ్చిన వేషాలొస్తే నటిస్తూనే ఉంటాను. బై...’
అంతా పక్కకి జరిగి దారివ్వగా బయటికెళ్లి కారెక్కింది. ఆ రోడ్డులోని అన్ని షాపుల్లోని జనమూ వచ్చి, కారు చుట్టూ మూగి ఎగబడి చూస్తున్నారు. చేయి ఊపుతూ కారు ముందుకు పోనిచ్చింది.
‘చిత్రమైన జనం. నీతికీ నియమాలకీ కూడా ఆడా మగా అని గీతలు గీస్తున్నారు!’ అనుకుంటూ అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తోంది కీర్తి.
రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చీకటి చిక్కబడుతోంది. వీధి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి.
ఇంతలో సడన్‌గా ఒకర్ని మోసుకుంటూ రోడ్డు మీదకొచ్చారో ఇద్దరు మగాళ్లు. సడన్ బ్రేక్ పడింది. వాళ్లు కారు దగ్గరికొచ్చారు.
‘హార్ట్ అటాక్ వచ్చింది. అర్జంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ప్లీజ్...’ అర్థించాడామె డోర్ పక్కకొచ్చి.
డోర్ అద్దం వేసి ఉన్నందున అతడి మాటలామెకి విన్పించలేదు. అద్దం దించి వారి వంక చూసి, ‘ఏమయ్యింది’ అడిగిందామె.
ఊహించని విధంగా మెరుపు వేగంతో ఒకడు కారులోకి చెయ్యి పెట్టి డోర్ లాక్ తీసి ఆమెని బయటకి లాగాడు.
‘ఏయ్, ఎవరు మీరు? ఏంటీ దౌర్జన్యం...’ వాళ్లని తోసేస్తూ పెనుగులాడింది. మరొకడు కర్చ్ఫీని ఆమె ముక్కుమీద పెట్టి నొక్కి పట్టుకున్నాడు.
ఆమెకి స్పృహ తప్పింది. వాళ్ల చేతుల్లోంచి జారబోయే ముగ్గురూ నవ్వుకుంటూ ఆమె నడుం చుట్టూ చేతులు చుట్టి పట్టుకుని వెనుక సీట్లోకి తీసుకెళ్లారు. ఇద్దరు ఆమె కిరువైపులా కూర్చోగా, మూడోవాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
‘ఆపిల్ పండు బావుందిరా’ కీర్తి పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడొకడు.
‘ఫ్రె...ష్!’ పెదాలని తడి చేసుకుంటూ, ఆమె ఎద మీద చేతులేస్తూ నవ్వాడిండొకడు.
‘త్వరగా పని కానివ్వండ్రా’ డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు అరిచాడు.
‘్భయపడకు. గంట దాకా చచ్చినా మెలకువ రాదు...’ ధీమాగా చెప్పాడు.
‘మన కర్మకాలి ఈలోగా స్పృహ వచ్చేస్తే మనందరం జైలు ఊసలు లెక్కపెట్టాలి...’
నవ్వేడతడు. ‘ఇవన్నీ గుట్టు వ్యవహారాలు. మనం ఏం చేసినా అమ్మాయిలు బయటికి చెప్పుకోలేరు. చచ్చినా సరే ఎవరూ గుట్టుచప్పుడు చేయరు. సినిమా వాళ్లు అసలే చేయరు. నువ్వూరికే భయపడకు. కలలో కూడా రాని అవకాశం వచ్చింది. ఎంజాయ్ చెయ్యనీరా’
‘చెప్పింది చెయ్యి’ కస్సుమన్నాడు.
మారు మాట్లాడకుండా కొత్త బ్లేడు తీసుకుని ఆమె దుస్తుల్ని పరపర కోసెయ్యసాగాడు. కారు లోపలి లైటు వెలుగులో రెండోవాడు సెల్‌తో వీడియో తీస్తూ, మధ్యమధ్య ఫొటోలు క్లిక్ మనిపించసాగాడు.
కారు వూరికే ఊరు చుట్టూ చక్కర్లు కొడుతోంది.
హఠాత్తుగా కీర్తికి స్పృహ వచ్చింది. తుళ్లిపడి తన వంక చూసుకుంది. ముప్పాతిక భాగం నగ్నంగా ఉంది. ఆగ్రహంతో ఊగిపోయింది. ఒకడి చొక్కా, మరొకడి జుట్టూ పట్టుకుని తిడుతూ గుంజింది. త్రోసింది.
వీడియో తీస్తున్న వాడి చేతిలోని సెల్ ఎగిరి కింద పడింది. ఊహించని పరిణామానికి విస్తుపోయారు. లబోదిబోమన్నారు. పరిస్థితి గమనించి కారుని ఓ పక్కగా ఆపాడు.
‘సెల్ పడిపోయింది...’ కంగారుగా కారులో వెదుకుతూ అన్నాడొకడు. వంగిన వాడి వీపు మీద పిడిగుద్దులు గుప్పించింది కీర్తి.
ఇంతలో రెండో వాడు ఆమెని తోసేస్తూ ఆమె పట్టు నుంచి విడిపించుకోడానికి బూతులు తిడుతూనే విఫల యత్నం చేశాడు.
డ్రైవింగ్ చేసిన వాడు వచ్చి వెనుక డోర్ తెరిచి అతడ్ని విడిపించాడు.
ఆమె మొదటివాడ్ని రక్కేస్తూ కరిచేస్తోంటే వాడు కుయ్యో మొర్రో అంటూనే చీకట్లో సెల్ కోసం వెదకసాగాడు.
‘త్వరగా వెదకరా వెధవా. సెల్ దొరక్కపోతే చంపేస్తాను...’ ఆమె రెక్కలు పట్టుకుని లాగుతూ నిలువరిస్తూ అరిచాడు మూడోవాడు.
సీటు కింద సెల్ దొరగ్గానే దాన్నందుకుని కారులోంచి బయటపడ్డాడు.
మరుక్షణం ముగ్గురూ ఉడాయించారు.
కీర్తికి దుఃఖం పొంగి వచ్చింది. అయినా నిభాయించుకుని లేచింది. చీలికలూ, పీలికలూ అయిన దుస్తులని క్రిందా పైనా కప్పుకుని కారు స్టార్ట్ చేసింది.
కళ్ల నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి.
ఏం జరిగి ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించింది. మెడలోని గోల్డ్ చెయిన్, చేతుల గాజులు అలాగే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్గూ పోలేదు.
అంటే వాళ్లు దోచుకోడానికి రాలేదు. మరి?
సందేహం లేదు. తన నగ్న శరీరాన్ని చిత్రించడానికే వచ్చారు!
ఆమె ముఖం ఎర్రెర్రని అరుణ బింబమయ్యింది. క్రింది పెదవిని గట్టిగా కొరుక్కుంది.
ఇంటి ముందు కారాపి లోపలికి పరుగెట్టింది. అస్తవ్యస్త దుస్తుల్తో దూసుకొచ్చిన కూతుర్ని చూసి కెవ్వుమంది ఆమె తల్లి.
కీర్తికి ఒళ్లంతా కంపరంగా ఉంది. జరిగిన అవమానం మనస్సుని దహిస్తోంది. యాసిడ్‌తో శరీరాన్ని కడుక్కుంటే తప్ప ఆ మలినం పోదనుకుంది. కాని ఒంటిమీద పడిన ఏ ముద్రనూ చెరపకూడదనుకుని దుస్తులు మాత్రం మార్చుకుంది. విడిచిన దుస్తుల్ని మూట కడుతోంటే, ‘ఏం జరిగిందే’ బెంబేలు పడుతూ ప్రశ్నించింది తల్లి.
‘ఏమీ కాలేదు కాని నువ్వూరికే కంగారుపడకు...’
సెల్ తీసుకుని సుధీర్‌కి ఫోన్ చెయ్యబోతోంటే, గబుక్కున ముందుకొచ్చి ఫోన్ లాగేసుకుంది తల్లి.
‘ఇదేం పిచ్చి పనే? నీకసలు మతి ఉందా? నీకు నువ్వే అల్లరి చేసుకుంటానంటావేంటి. జరిగింది నలుగురికీ తెలిస్తే... హవ్వ! నీ బతుకు బండలవుతుందే పిచ్చిదానా!’ నోరు నొక్కుకుంది.
‘నీ కొంగు చాటున దాక్కోడానికి నేను చంటిపిల్లను కాదు. నన్ను ఘోరంగా అవమానించిన వాళ్లు శిక్షింపబడాల్సిందే. ఇంత ఘోరం జరిగినా మనం నోరు మూసుకుని వౌనంగా రోదిస్తూ కూర్చున్నామంటే, నా పిల్లల కాలానికి వాళ్లకి నోళ్లు కూడా ఉండవు తెలుసా? ఫోన్ ఇవ్వమ్మా.. సుధీర్ని రమ్మంటాను..’ స్థిర స్వరంతో అంది కీర్తి.
నివ్వెరబోయి చూసిందామె. ‘అతగాడికి చెబుతావా? నీకు నిజంగానే మతిపోయింది. అతడు దారినపోయే దానయ్య కాదు. నీక్కాబోయే మొగుడే. సంగతి వాళ్లకి తెలిస్తే నీ పెళ్లి ఆగిపోతుందేమోనే ఖర్మ!’
‘ఎందుకు ఆగుతుంది? ఏదేదో వూహించుకోకు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. సుధీర్ నన్ను ప్రేమించాడు. అతడి గురించి నాకు బాగా తెలుసు..’
‘ఎంత తెలిసినా అతడు ఒక మగాడని మర్చిపోకే పిచ్చిపిల్లా! చొక్కాలు మార్చినంత తేలిగ్గా రంగులు మార్చేస్తారు!’
‘అమ్మా! నాకు పిరికి పాలు పొయ్యాలని చూడకు. త్వరగా పోలీస్‌స్టేషన్‌కెళ్లి కంప్లయింట్ ఇవ్వాలి. పోనివ్వు...’
బాధగా అయోమయంగా చూసింది తల్లి. పిమ్మట అనునయంగా అంది ‘నా మాట విని తిన్నగా కూర్చుని ఆలోచించు. నువ్వు ఊరూ పేరూ లేని ఆడపిల్లవి కాదు. సినిమా నటివి. టీవీ వాళ్లకీ, పేపర్ వాళ్లకీ తెలిస్తే బ్రేకింగ్ న్యూసుల్తో నీ పరువు నడిబజార్లో వేలం వేసేస్తారే తల్లీ!’
‘అలాగని ఆ మృగాళ్లని వదిలెయ్యమంటావా? ఆ దాడి తాలూకు మచ్చల్ని కప్పి పుచ్చుకోమంటావా?’ తీక్షణంగా చూసింది కీర్తి.
ఆ చూపులకు ఆమె నోరు మూతపడింది. కళ్లల్లో కన్నీరు ఉప్పెనై ఉరికింది.
కూతురు సుధీర్‌కి ఫోన్ చేసి టూకీగా చెబుతోంటే తల కొట్టుకుంటూ కూలబడిందామె.
మరి అరగంటకి సుధీర్, అతడి తండ్రి విశ్వనాథమూ వచ్చారు. విశ్వనాథం ప్రముఖ పారిశ్రామికవేత్త. వందల కోట్లకు అధిపతి.
సుధీర్ కీర్తిని ఒక సినిమా ఫంక్షన్‌లో కలిశాడు. ఆమె రూప లావణ్యాలకు ఫ్లాట్ అయిపోయాడు. మాటలు కలిపాడు. ఎస్సెమ్మెస్‌లూ, వాట్సాప్‌లూ, ఫోన్లూ ఇద్దర్నీ దగ్గర చేశాయి. ఒకరోజున ప్రపోజ్ చేశాడు. తిరస్కరించడానికి కారణం కనిపించలేదు. అతడి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎలాగో వాళ్లని ఒప్పించాడు. పది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఇంకో రెండు నెలల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు.
ఎదురెళ్లి సుధీర్‌ని వాటేసుకుని ఏడ్చేసింది.
‘అసలేం జరిగింది? ఏదీ దాచకుండా చెప్పు’
తుళ్లిపడింది. ఒక్కడుగు దూరంగా జరిగింది. అతడి ముఖం అదోలా ఉంది. అది తనెన్నడూ చూడని ముఖం!
‘నిజంగా నినే్నమీ చెయ్యలేదా?’ రెట్టించాడు.
‘్ఫటోలూ, వీడియోలూ తీశారంతే’
‘అంతే అయ్యుండదు. నువ్వసలు స్పృహలో లేవుగా. ఇంకేదో చెయ్యకుండా ఎందుకు వదుల్తారు?’
అతడి కళ్లల్లోకి సూటిగా చూసింది. ‘నా మాట మీద నమ్మకం లేదా?’
‘నీ మీద ఉంది. వాళ్ల మీద లేదు’
‘ఇంకేం జరగలేదు. జరిగితే నాకు తెలీదా!’
పెదవి విరిచాడు. నిస్పృహగా చూశాడు. ‘అసలు నైట్‌టైం జాగ్రత్తగా ఉండకుండా నీకా షికార్లేంటి?’
‘నేనేమీ అజాగ్రత్తగా లేను. ఒకర్ని మోసుకొస్తే సాయం కావాలేమోనని ఆగాను...’
నుదురు కొట్టుకున్నాడు. ‘ఇప్పుడేం చెయ్యం డాడ్. వార్త బయటికి పొక్కితే, వీడియోలు యూట్యూబ్ కెక్కితే మన పరువు గంగలో కలుస్తుంది’ ఉక్రోషపడుతూ తండ్రితో అన్నాడు సుధీర్.
కీర్తి నిటారుగా అయ్యింది. దెబ్బ తిన్నట్టు చూసింది. ‘పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలి. నువ్వు నాకు తోడుగా అండగా ఉంటావని పిలిచాను’
నడినెత్తిన పిడుగు పడ్డట్టు అదిరిపడ్డారు తండ్రీ కొడుకులు.
‘జరిగిన ఘటనలోంచి పరువుగా బయటపడటం ఎలాగా అని మేం ఆలోచిస్తోంటే తగుదునమ్మా అని వీధెక్కుతావా? నీకు నువ్వే అల్లరి చేసుకుంటావా? పబ్లిసిటీ చేసుకోడానికి ఇదేం సినిమా కాదు. ఇన్సల్ట్!’ సుధీర్ కటువుగా అన్నాడు.
‘నేరస్తుల్ని ఎలా వదిలెయ్యగలం? అలాంటి దుర్మార్గుల్ని ఈ సమాజంలో తిరగనివ్వకూడదు’
విశ్వనాథం కల్పించుకుంటూ అన్నారు. ‘ఏం జరిగిందన్నది నీకూ వాళ్లకీ మాత్రమే తెలుసు. అవతల పెళ్లి పెట్టుకుని ఇవతల రాద్ధాంతం చెయ్యడం అనవసరం. రేపు ఆ ఫొటోలు బయటపడితే మార్ఫింగ్ చేశారని బుకాయించొచ్చు. నీ అంతట నువ్వే ఇలా చేశారు, అలా చేశారు అంటూ పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇస్తే మేం తలెత్తుకోలేం!’
‘అంటే నా నోటికి తాళం వేసుకుని వాళ్లని స్వేచ్ఛగా వదిలెయ్యమంటారా?’ సూటిగా ప్రశ్నించింది.
‘అంతకంటే ఇంకేం చెయ్యలేం’
‘సారీ. పోలీస్ కంప్లయింట్ ఇస్తాను. వాళ్లకి శిక్ష పడాల్సిందే. వాళ్లూ వాళ్లలాంటి వాళ్లూ తగిన గుణపాఠం నేర్చుకోవాల్సిందే. నేను వౌనంగా, నిశ్శబ్దంగా వుంటే అది వాళ్లకి రక్షాకవచం అవుతుంది. నేను బయటికొస్తే వారి కోట కుప్పకూలుతుంది’
‘పెంకెగా మాట్లాడకు. డాడీ చెప్పినట్టు విను’ అసహనంగా అన్నాడు సుధీర్.
వారి భావం బోధపడింది. ఒక నిశ్చయానికొచ్చి అంది ‘ఓకే. గుడ్‌బై’
నిశే్చష్టులయ్యారు. పిచ్చిగా చూశారు. ‘ఏమిటి నీ ధైర్యం? నువ్వు అల్లరై మమ్మల్నీ అల్లరి పెడతానంటే మేం సహించం. పెళ్లి కేన్సిల్ చేస్తాం’ బెదిరించారు విశ్వనాథం.
ఆమె బెదర్లేదు. ‘మీరేమైనా చేసుకోండి. నాతో అసభ్యంగా అమానుషంగా ప్రవర్తించిన వాళ్లని వదిలే ప్రసక్తే లేదు’
‘నీకు పిచ్చెక్కింది. ఇది సినిమా కాదు, లైఫ్’ అరిచాడు సుధీర్.
‘నేను, పాదాలని కడిగి వెనక్కి వెళ్లిపోయే సముద్ర కెరటాన్ని కాదు, ఉప్పెనని, ఆగ్రహిస్తే నిలువునా ముంచెత్తిగాని వదలను’
తల్లి బిగ్గరగా ఏడుస్తోంటే, తండ్రీ కొడుకులు పెదవి కొరుక్కుంటూ కోపంగా చూస్తోంటే, చిరిగిన బట్టల మూటను తీసుకుని విసవిసా వెళ్లి కారెక్కింది కీర్తి.
తిన్నగా పోలీసుస్టేషన్ కెళ్లింది. ఆమె చెప్పిందంతా సావధానంగా విన్నాడు హౌస్ ఆఫీసర్. ఆమె సెలబ్రిటీ కావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశాడు. మీడియాకీ ఉప్పందించాడు.
వైద్య పరీక్షల నిమిత్తం ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తోంటే మీడియా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్‌కి తెరలేచింది.
జరిగిన దారుణ ఘటనకి సభ్య సమాజం నివ్వెరబోయింది. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలంటూ మీడియాలోనూ, సోషల్ నెట్‌వర్కింగ్‌లోనూ చెలరేగిపోయారు. ఒక సెలబ్రిటీకి రక్షణ లేకపోతే ఇక సామాన్య స్ర్తికి ఎక్కడుంటుందని మహిళా సంఘాలు నిలదీశాయి. లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది కనుక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.
వివిధ సినీ సంఘాల నాయకులొచ్చి కీర్తిని కలిశారు. లోలోపలే కుళ్లిపోకుండా బయటికొచ్చి బహిరంగంగా అకృత్యానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు ఆమె ధైర్యస్థైర్యాలని మెచ్చుకున్నారు. ఆమెకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నేరస్తుల్ని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘దుండగుల అసలు ఎజెండా ఏమిటి? కీర్తిని ఏం చేయాలనుకున్నారు? ఫొటోలనీ, వీడియోలనీ ఏయే రకాలుగా వినియోగించుకోవచ్చు? జరిగిన దాన్లో ఎవరి తప్పు ఎంత? ఆ ఘటన వల్ల కీర్తి పెళ్లికి ఆటంకం ఏర్పడుతుందా? ఆమె సినీ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది?’ అంటూ టీవీల్లో చర్చా కార్యక్రమాలు మొదలయ్యాయి.
వార్త జాతీయ మీడియానీ ఆకర్షించింది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. నేరస్తులు ముగ్గుర్నీ అరెస్టు చేసినట్టు డీజీపీ ప్రకటించారు. వారు ఆకతాయి కుర్రాళ్లనీ, ఒక పథకం ప్రకారమో కుట్ర పన్నో చేసింది కానే కాదన్నారు. సినీ నటి ఒంటరిగా రాత్రివేళ కన్పించేసరికి ఆ అఘాయిత్యానికి పూనుకున్నారనీ, అయినా దొంగతనం అత్యాచారం లాంటివి చెయ్యకపోవడం వారు కరడు గట్టిన నేరస్తులు కాదనడానికి నిదర్శనమని సెలవిచ్చారు.
సెనే్సషనల్ న్యూస్ కాస్తా చప్పబడి, పేపర్ కార్నర్‌లోకి జారిపోయింది. ఒక వార్తా సంస్థ ఇంకో అడుగు ముందుకేసి ‘ఇదంతా చీప్ పబ్లిసిటీ స్టంట్’ అని తేల్చేసింది. కీర్తి మీద బురద చల్లడానికీ ప్రయత్నించింది.
చిత్రంగా ఎన్నో ఖండన ప్రకటనలు చేసిన సినీ ప్రముఖులు మూగనోము పట్టారు.
కాని కీర్తి సమాధాన పడలేకపోయింది. డీజీపీని కలిసింది.
‘దయచేసి దీన్ని ఆషామాషీ వ్యవహారంగా చూడొద్దు. వారు దొంగతనం చెయ్యకపోవచ్చు. కాని నా ప్రైవసీకి భంగం కలిగించారు. నన్ను నగ్నంగా మార్చి వీడియోలు తీశారు. వారి వెనుక పెద్ద వాళ్లు ఉన్నారేమోనని నా అనుమానం. దయచేసి క్షుణ్ణంగా దర్యాప్తు చెయ్యండి’ అభ్యర్థించింది.
‘కుట్రకు అవకాశం లేనే లేదు. నిన్ను అల్లరి పెడితే ఎవరికి లాభం? ఉంటే గింటే మీ పెళ్లి ఇష్టంలేని విశ్వనాథం గారికే ఉండాలి’
చివ్వున తలెత్తి చూసింది. వంకర నవ్వు ఆయన పెదాల మీద కదిలింది.
‘వారెవరైనా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే వారి అసలు రూపం బహిర్గతం కావాల్సిందే’ మొండిగా అంది.
‘సారీ మేడమ్. కేసు కోర్టుకెళ్లింది. ఇక మేం చెయ్యగలిగిందేమీ ఉండదు. కావలిస్తే మీ వాదనని కోర్టులో విన్పించొచ్చు. లోతుగా దర్యాప్తు చేయించమని కోరవచ్చు. దీన్నింతటితో వదిలేయడం ఉత్తమం. ఇంకా సాగదీసి నీ కెరీర్ని పాడుజేసుకోకు. పెద్దవాడిగా నీ మేలు కోరేవాడిగా ఇది నా సలహా’
ఆమె అసంతృప్తిగా చూసింది. ‘ఇది చిన్న ఇష్యూ కాదు. నా శరీరం షో కేసులో బొమ్మ కాదు. భోగవస్తువూ కాదు. నాకూ నా వ్యక్తిత్వానికీ...’ ఏదో చెప్పబోతే అడ్డొచ్చారు. ‘ఊరికే పెద్దది చేసి, రేప్ జరిగినట్టు గగ్గోలు పెట్టడంవల్ల నువ్వు సాధించేదేమీ ఉండదు... అసలిప్పుడేం పోయిందని గొడవ చేయడానికి?’ కించిత్తు అసహనంగా ప్రశ్నించారు.
‘నా సిగ్గు, అభిమానం, మర్యాద, గౌరవం అన్నీ పోలేదా? నా స్వేచ్ఛకి గోప్యతా హక్కుకి భంగం కలగలేదా? కావాలనే నా దుస్తులు చింపి నా నగ్నత్వాన్ని ఫొటోల్తీసి వాటిని పబ్లిక్ చేయదలిచారు. నన్ను నలుగుర్లో నవ్వులపాలు చెయ్యాలనీ, నన్ను తలెత్తుకోకుండా చెయ్యాలనీ, నేను సిగ్గుతో కుమిలిపోవాలనీ పథకం వేశారు...’ ఆవేశపడింది.
‘బ్లాక్‌మెయిల్ చేసినా నెట్‌లో పెట్టినా మాకు చెప్పు, వెంటనే వాటిని బ్లాక్ చేస్తాం. సైబర్ నేరస్తుల్నీ వదలం’
కీర్తి మస్తిష్కంలో ఒక ఆలోచన మెరిసింది. క్షణకాలం ఆలోచించి అంది. ‘ఆ ఘటన వెనుక సినీ ప్రముఖుల హస్తం ఉందేమోనని అనుమానమొస్తోంది. ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయకూడదు?’
‘నీకెందుకలా అన్పించింది?’
‘మూడు నెలల క్రితం ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా ప్రొడ్యూసర్ కొడుకు సెట్‌లోకి వచ్చాడు. నాతో సెల్ఫీ అంటూ నా పక్కకొచ్చి చొరవగా నా భుజం మీద చేయి వేశాడు. దాన్ని విసిరికొట్టి ఫొటో దిగకుండా దూరంగా వెళ్లిపోయాను. ఆ సినిమా వాళ్లే ఒక డాన్సులో నన్ను వేసుకోమన్న కాస్ట్యూమ్స్ నాకు బొత్తిగా నచ్చలేదు. నన్ను అర్ధనగ్నంగా, మరీ సెక్సీగా, దారుణంగా చూపించాలనుకున్నారు. డ్రెస్ మార్చమన్నాను. వినలేదు. అవే ధరించి తీరాలని ఒత్తిడి తెచ్చారు. నేను ఎదురు తిరిగాను. వారి బెదిరింపులు లెక్కచెయ్యకుండా ఆ సినిమాలోంచి బయటికి వచ్చేశాను. ఆ వార్త పరిశ్రమలో పాకింది. కొందరు నాకు టెంపర్ ఎక్కువనీ, యారోగెంట్‌ననీ నిందించారు. కాని నేనా సినిమాలోంచి తప్పుకోవడం, ఆ నిర్మాత పేరు నలుగురికీ తెలీడంతో వాళ్లు అవమానంగా ఫీలయ్యారు. ఆ రెండు ఘటనల్నీ దృష్టిలో పెట్టుకుని, నా నగ్న ఫొటోలు నెట్‌లో పెట్టి, పోర్న్ స్టార్‌గా ముద్ర వేసి, నా కెరీర్ మీద చావుదెబ్బ కొట్టాలనుకున్నారేమోనని నా అనుమానం సార్...’
కొన్ని నిమిషాలు తీవ్రంగా ఆలోచించి అన్నారు. ‘అలా జరగడానికి ఆస్కారం లేకపోలేదు. దాని గురించి నువ్వెక్కడా మాట్లాడకు. రహస్యంగా దర్యాప్తు చేయిస్తా’
ఆ తర్వాత దర్యాప్తులో పురోగతి కన్పించలేదు గాని ఒక సినీ ప్రముఖుడొచ్చి కీర్తిని కలిశాడు.
‘రెండు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేసుకోడానికి ఇద్దరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కాని వాళ్లు ఆ కేసూ, ఆ గొడవలూ నీ ఇమేజ్‌కి భంగం కలిగిస్తాయని భయపడుతున్నారు. ఆ కేసుని వదిలేసుకో’
‘దానికీ, దీనికీ ఏమిటి సంబంధం? ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు’
‘మీరు ఉందనుకుంటున్నారు గనుకే ఇలా వచ్చారు. సారీ. ఎమ్యే చదివాను. నటన గాకపోతే ఇంకో వృత్తి చేసుకుంటాను. అంతే తప్ప నా గౌరవ మర్యాదల్ని తాకట్టు పెట్టలేను. కేవలం రాముడి అనుమాన నివృత్తి చేయడానికే సీత అగ్నిలోకి దూకడానికి సాహసించింది. మళ్లీ అదే రాముడు అదే సీతని నీలాపనిందకు భయపడి అడవి పాలుజేస్తే, తిరిగి అతడి దగ్గరికి వెళ్లలేదు. భూమి ఒడిలో తలదాచుకుంది. అదీ ఆడది ఆత్మగౌరవానికిచ్చే విలువ!’
ఆమె లేచింది. అతడు గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
తిన్నగా వెళ్లి డీజీపీని కలిసి జరిగిందంతా చెప్పింది. ‘ఆ అధ్యాయం ముగిసిపోయింది. మళ్లీ తెరవాలని చూడకు. నష్టపరిహారం కావాలంటే చెప్పు ఎంత కావాలన్నా ఇప్పిస్తాను. ఇది సీఎంకి తలనొప్పి వ్యవహారంలా తయారైంది...’
కీర్తి మోము జేవురించింది. ‘ఐసీ, సీఎంకి, మీకు, మీ శాఖకు, సినీ పరిశ్రమకు, నిర్మాతకు - అందరికీ నా గొడవ పరువు ప్రతిష్ఠల సమస్యగా మారిందంటారు. నాకొక్కదానికీ కాదంటారు. ఎంచేతంటే నేను ఆఫ్ట్రాల్ ఒక ఆడదాన్ని గనుక. అంతేనా సార్? సారీ. నేను ఆడదానే్న కాని ఆఫ్ట్రాల్‌ని కాను...’
విసవిసా బయటకి నడిచింది. డీజీపీ ఆఫీసు ముందున్న ఫుట్‌పాత్ మీద మండే ఎండలో బైఠాయించింది కీర్తి. జనం మూగారు. మీడియా వచ్చింది.
తనపై జరిగిన వేధింపుల్ని, వస్తోన్న ఒత్తిడిని, తన అనుమానాలని అన్నిట్నీ ధైర్యంగా బహిర్గతం చేసింది.
జనం కోపోద్రిక్తులయ్యారు. మహిళలూ, వారి సంఘాలూ ఆగ్రహోదగ్రులయ్యాయి. ఆమె పోరాట స్ఫూర్తిని మెచ్చుకుంటూ పిడికిళ్లు బిగించి మరీ జత కలిశారు. మీడియా రెచ్చిపోయింది. కీర్తి వెల్లడించిన వాస్తవాల వీడియో సామాజిక అనుసంధాన వేదికల్లో స్వైరవిహారం చేసింది.
రాష్టప్రతికీ, ప్రధానికీ, గవర్నర్‌కీ, ముఖ్యమంత్రికీ ‘ఈ అర్జీ’ తయారైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సంతకాలు చేశారు. అదింకో సెనే్సషన్ న్యూస్ అయింది.
ప్రతిపక్షం బంద్‌కి పిలుపిచ్చింది. మహిళా సంఘాలు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలకి దిగాయి.
నిరసన సెగ వేడి పెరిగేసరికి హుటాహుటిన నిర్మాతనీ, అతడి కొడుకునీ అరెస్టు చేశారు. దుండగులు తమ సెల్ నుంచి ఆమె నగ్న చిత్రాలనీ, వీడియోనీ వారికి పంపించినట్టు ఆధారం లనించిందని పోలీసు అధికారులు ప్రకటించారు.
కీర్తి శాంతించింది. ఆ వెంటనే, ‘నా గౌరవ రక్షణకు గాను చేదోడుగా నిలవని నీ చేయి అందుకోడానికి నేను సిద్ధంగా లేను. గుడ్ బై ఫరెవర్’ అని రాసిన ఉత్తరాన్నీ, ఎంగేజ్‌మెంట్ రింగునీ సుధీర్‌కి పంపేసింది!

సింహప్రసాద్.. 9849061668