S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎక్స్చేంజ్

వాళ్లు నేల మీద చెక్కల నించి మేకులు లాగే చప్పుడు, వాటిని తొలగించే చప్పుడు మళ్లీ వినిపించసాగింది. ఆ శబ్దాలకి వాళ్లు నా చర్మాన్ని వొలుస్తున్నారనే భావన కలిగింది.
అదంతా నా డోర్ బెల్ మోగిన శబ్దంతో ఆరంభమైంది. నేను తలుపు తెరిస్తే ముందుగా అతని వీపు కనిపించింది. లెదర్ జాకెట్‌ని ధరించిన అతను జేబుల్లో చేతులు ఉంచుకుని వీధుల్ని పరిశీలనగా చూస్తున్నాడు. అతను చందా అడుగుతాడని లేదా పాత ఇనుము కొంటాడని లేదా తోట పని చేస్తానని అడుగుతాడని అనుకున్నాను. అతను నా వైపు తిరిగి జేబులోంచి కుడి చేతిని తీయగానే అందులో ఓ పర్స్ కనిపించింది. దాన్ని తెరిచి నాకు చూపించాడు. ఎర్రటి బేక్‌గ్రౌండ్‌లో నీలం రంగు ఓడ కనిపించింది. పర్‌పెక్చర్ డి పోలీస్ డి పేరిస్ అన్న పదాలని చదివి అది ఫ్రెంచ్ భాష అనుకున్నాను. అందులోని ఫొటోకి, నా ముందు నిలబడ్డ వ్యక్తి మొహానికి స్వల్ప పోలిక కనిపించింది. దాని కింద ఉన్న పేరు యూనెస్ జెమ్.
‘మీకేం కావాలి?’ అడిగాను.
‘మీ వారు’ అతను జవాబు చెప్పాడు.
‘మా వారా?’ నవ్వుతూ అడిగాను.
‘అవును’
‘మేము రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం. దేని గురించో అడగచ్చా?’
‘తప్పకుండా. నేను పోలీస్ డిటెక్టివ్ యొనెస్ జెమ్‌ని. పేరిస్ నించి వచ్చాను’
‘నిజంగా?’ నవ్వుతూ అడిగాను.
‘కావాలంటే మీరు పేరిస్ పోలీస్ వెబ్‌సైట్లోకి వెళ్లి నా పేరు టైప్ చేస్తే నా ఫొటో, వివరాలు, నేను ఇవాళ బ్రిటన్లోని ఈ ఊళ్లో ఉన్న సంగతి తెలుస్తుంది.’
‘మీరు సరైన అడ్రస్‌కే వచ్చారా?’ అతను వచ్చింది సరైనదే అని తెలిసినా ప్రశ్నించాను.
అతను తన జాకెట్ జేబులోంచి ఓ చవక నోట్‌బుక్‌ని బయటకి తీశాడు.
‘మీ పేరు ఎలిజబెత్ హేస్. మీ వారి పేరు టామ్ హేన్. అవునా?’ ప్రశ్నించాడు.
‘అవును. ఆయన డచ్ వాడు. ఇందాకే చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన నా భర్త కాదు’
‘సరే. ఇప్పుడు కాదు’
అతను అది నోట్‌బుక్‌లో రాసుకుని అడిగాడు.
‘నేను లోపలకి రావచ్చా?’
‘ముందుగా విషయం ఏమిటో దయచేసి వివరిస్తారా?’ నేను పక్కకి జరక్కుండా ప్రశ్నించాను.
‘తప్పకుండా...’
అతని కళ్లు అప్పటికే ఇంట్లో కనపడే భాగాన్ని నిశితంగా పరిశీలించడం చూశాను. నలభై ఏళ్లున్న అతన్నించి పొగాకు వాసన వస్తోంది.
‘మీరు ఒంటరిగా వుంటే, మీకు భద్రత కావాలని అనుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి. నేను ఇక్కడ వేచి ఉంటాను’ చెప్పాడు.
‘నాకా అవసరం లేదు. మీరు నన్ను ఎందుకు అనుసరించారో చెప్పండి’ కోరాను.
‘ఈ కేసు అయోమయంగా ఉంది’
‘కేసా? ఏం కేసు?’
‘మీరు అనుమతిస్తే లోపలకి వచ్చి వివరిస్తాను’
నేను అతన్ని లోపలకి రానించాను.
‘కొంతకాలం క్రితం మీరు పేరిస్‌లో ఉన్న గుర్తుందా?’
నేనెలా మరువగలను! స్ప్రింగ్ టైంలో పేరిస్ అనుభవాన్ని ఎవరు మర్చిపోతారు? కేలండర్ కాగితాలు వెనక్కి తిరిగి నేను పేరిస్‌తో ప్రేమలో పడ్డ సంగతి గుర్తొచ్చింది.
‘నాకు అర్థం కావడంలేదు’ చెప్పాను.
‘ఐల్ సెయింట్ లూయిస్‌లోని ఫ్లాట్‌లో మీరు ఉండటం మర్చిపోయారా? నేను ఇది అడగడానికి ఒక కారణం ఉంది. మీరు పేరిస్ ఎందుకు వెళ్లారు?’
‘ఇది మీకు సంబంధించింది కాదని చెప్పగలను’
‘అది నిజమే. కాని పేరిస్‌కి చెందిన పరిశోధనకి సంబంధించిందంతా నా వ్యవహారమే అవుతుంది. అందుకే ఇంగ్లీష్ తెలిసిన నేను ఇంతదూరం వచ్చాను. మీరీ ప్రశ్నకి జవాబు చెప్పి తీరాలి’ అతను బతిమాలుతున్నట్లుగా చెప్పాడు.
‘పరిశోధన? నేను మా లాయర్ని పిలిపించనా?’
‘ఆ అవసరం లేదు. మీ మీద ఏ నేరారోపణా లేదు’
‘ఐతే విషయం స్పష్టంగా సూటిగా చెప్పచ్చుగా?’
‘పేరిస్‌లో మీరున్న ఫ్లాట్ యజమాని పేరు హెర్వీ. అతను మీకు గుర్తున్నాడా?’
‘లేదు. మేం కలుసుకోలేదు. మేము అక్కడికి వెళ్లాం. వాళ్లు ఇక్కడికి వచ్చి మా ఇంట్లో ఉన్నారు. ఇళ్లు మార్చుకున్నాం. వాళ్లు మా ఇంటి తాళం చెవులని మా పక్కింటి వాళ్ల దగ్గర తీసుకున్నారు. మేం కూడా అదే పని చేశాం’
‘అలాగా? మీ పొరుగు వారి పేరు?’
‘మిసెస్ క్రౌన్’
‘ఆవిడతో నేను మాట్లాడచ్చా?’ అడిగాడు.
‘మీరు విషయాన్ని సూటిగా చెప్తే బావుంటుంది’ విసుగ్గా చెప్పాను.
‘హెర్వీ భార్య జీన్ మాయమైంది. ఆమెని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నా అనుమానం హెర్వీ ఆమెని వదిలించుకుని ఉంటాడని.’
‘వదిలించుకోవడమా?’
‘చంపేశాడు. హత్య చేశాడు. సారీ. ఇంతకంటే మృదువుగా చెప్పే ఇంగ్లీష్ నాకు రాదు’
‘సరే. కాని దానికి, నాకు ఏమిటి సంబంధం?’
‘జీన్ జీవించి ఉందో, మరణించిందో మాకు తెలీదు. ఆమె శవం మాకు దొరకలేదు’
‘అలాంటప్పుడు ఆమె మరణించిందని ఎలా చెప్పగలరు? ఆమె అతన్ని వదిలి వెళ్లిపోయి ఉండచ్చుగా?’ అడిగాను.
‘అంటే? ఏ పొరుగు వాడితోనో ప్రేమలో పడి లేచి పోయిందనా? కాని ఆమె అకస్మాత్తుగా మాయమైంది. ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయిన సూచనలేమీ మాకు దొరకలేదు. దుస్తులు, ఆమెకి ఇష్టమైన వస్తువులు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. వాటిని తీసుకోకుండా వెళ్లిపోయింది. మిత్రులని కాని, తను బాగా ప్రేమించే తన తల్లిని కాని మళ్లీ కాంటాక్ట్ చేయలేదు. అప్పటి నించి ఎవరూ ఆమెని చూడలేదు. గత రెండు సంవత్సరాలుగా తన అక్క జీన్ తనని కాంటాక్ట్ చేయలేదని ఆమె చెల్లెలు మాకు ఫిర్యాదు చేసింది.’
‘మా అక్క కూడా నన్ను చూసి సంవత్సరం దాటింది. నేను దానికి ఫోన్ కూడా చేయలేదు. దానర్థం ఆమెని ఎవరో ఎత్తుకెళ్లారనో, చంపారనో కాదు కదా?’
‘అది నిజమే కాని హెర్వీని ప్రశ్నించినప్పుడు వత్తిడికి గురయ్యాడు. ఏదో దాస్తున్నాడనే సూచనలని మేం గ్రహించాం. ఏదో గూడుపుఠాణి చేసాడని మేం నమ్ముతున్నాం. మేం ఆమె కోసం అతని ఫ్లాట్ అంతా వెదికాం. నేంటెస్‌లో ఉన్న అతని వారసత్వపు ఇంట్లో వెదికాం. ఆమె ఆచూకీ దొరకలేదు. ఫ్రాన్స్‌లో గుర్తుపట్టని శవాల్లో ఆమె లేదు. ఆ పని మీద వచ్చాను.’
అతను ఐఫిల్ టవర్ ముందు నిలబడి తీయించుకున్న నా ఫొటోని చూసి మెచ్చుకున్నాడు.
‘మా ఆయన ఫొటోలో లేడు. అలిగి నా పక్కన నిలబడలేదు’ నవ్వుతూ చెప్పాను.
నేను అతనికి కాఫీ కలుపుతూండగా మా ఇంటి ముందో పెద్ద నీలం రంగు వేన్ ఆగింది. అతను లేచి తలుపు తెరవగానే చేతిలో పెద్ద ప్లాస్టిక్ పెట్టెలతో ఆరుగురు లోపలకి వచ్చారు.
‘ఏం జరుగుతోంది?’ నేను కోపంగా ప్రశ్నించాను.
‘ఆమె శవం ఇంకా ఎక్కడ ఉండచ్చా అని మేం ఆలోచించాం. ఎక్కడ ఉండచ్చో స్ఫురించి లండన్ వచ్చాను’
‘అంటే? ఆమెని చంపి మా ఇంట్లో పాతిపెట్టాడని అంటున్నారా?’ చురుగ్గా చూస్తూ అడిగాను.
‘ఎంత మంచి పథకం! ఇంకో దేశంలో. వాళ్లు పధ్నాలుగు రోజులు మాత్రమే ఉండి మళ్లీ వెనక్కి తిరిగి రాని ఇల్లు. ఈ ఇంటికి, అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. అదృష్టవశాత్తు అతని హార్డ్ డిస్క్‌లో మాకో వెబ్‌సైట్ లింక్ దొరికింది. అదేమిటో తెలుసా?’
‘ఏమిటి?’
‘ఇంటి యజమానులు ఒకరింటిని మరొకరు ఎక్సేంజ్ చేసుకునే సేవని అందించే వెబ్‌సైట్. ఓ క్లిక్‌తో దాని రహస్యం బయటపడింది.’
‘అంటే మీరు ఇప్పుడు మా ఇంటిని తవ్వబోతున్నారా? నేను అందుకు అంగీకరించను. వెళ్లండి’ అరిచి స్టవ్ ఆపేసాను.
‘నో కాఫీ?’
అతను తన జాకెట్ జేబులోంచి ఓ కవర్ని తీసి నా చేతిలో ఉంచాడు.
‘ఇవి కోర్ట్ ఆర్డర్లు. మొదటిది మా దేశానిది. రెండోది ఇంగ్లండ్‌ది’
నేను వాటిని శ్రద్ధగా చదివాను. అవి అతను చెప్పినట్లే ఉన్నాయి.
‘కాని వాళ్లు ఈ ఇంట్లో బస చేసింది రెండేళ్ల క్రితం. ఇక్కడ ఎలా పాతిపెట్టి ఉంటాడు?’
‘మీరు మీ ఇంటికి తిరిగి వచ్చాక ఏదైనా అసాధారణమైంది గమనించారా? కొత్తగా సిమెంట్ చేసిన నేల, వాసన లాంటివి’
నేను తల అడ్డంగా ఊపాను. జెమ్, నేను బయట తోటలో కూర్చుంటే వర్క్ బూట్లు ధరించిన పోలీస్ ఆఫీసర్లు ఫ్రెంచ్ భాషలో మాట్లాడుకుంటూ ఇల్లంతా వెదకసాగారు. లోపల ఫర్నిచర్ని లాగుతున్న శబ్దం, నేలకి అంటించిన చెక్కలకి ఉన్న మేకులని లాగే శబ్దం వింటే నాకు ఒళ్లు గగుర్పొడిచింది.
‘మా వాళ్లు వెదకడంలో చాలా సమర్థులు. మీ ఇంటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పని పూర్తి చేస్తారు. ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇస్తాం.’
కాసేపటికి వాళ్లు వేక్యూం క్లీనర్ లాంటి ఏదో యంత్రంతో బయటకి వచ్చారు. దాన్ని ఆన్ చేసి నేల మీద నడిపించసాగారు.
‘మీరు లోపలకి వెళ్లి మా అందరికీ కాఫీ కలిపితే సంతోషం’ జెమ్ కోరాడు.
‘ఆ యంత్రం ఏమిటి?’ అడిగాను.
‘్భమిలో శవం పాతిపెట్టబడి ఉంటే ఆ యంత్రం కనిపెడుతుంది. ఎముకల్లోని ఫాస్ఫరస్, శవంలోంచి వెలువడే వాయువులని అది కనిపెడుతుంది. కాఫీ ప్లీజ్’ అర్థించాడు.
‘నేను ఒంటరిదాన్ని. ఆ శవం ఈ ఇంట్లో ఉందనే ఆలోచనతో ఇక నాకు రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టదు’
‘మీ ఇంట్లో నేను శవాన్ని కనుక్కోలేక పోతే అది ఇక్కడ లేదని మీరు నమ్మచ్చు. ప్రశాంతంగా పడుకోవచ్చు. ఏ ఫ్రెంచ్ వాడికీ ఇన్‌స్టేంట్ కాఫీ నచ్చదు’ జెమ్ చెప్పాడు.
కాఫీ కప్పులున్న ట్రేతో బయటకి వచ్చాను. వాళ్లంతా నా వంక కృతజ్ఞతగా చూస్తూ కప్పులని అందుకున్నారు. ఒకతను కాఫీ వాసన చూసి నా వైపు సంతోషంగా థంబ్స్ అప్ సైన్‌ని చూపించాడు.
‘ఇక్కడ మీకు జెన్ శవం కనపడకపోతే తర్వాత ఏం చేస్తారు?’ ప్రశ్నించాను.
‘నిజానికి హెర్వీ హంతకుడని సూచించే ఆధారం ఏదీ మా దగ్గర లేదు. ఆమె శవం దొరక్కపోతే మేం అతన్ని విడుదల చేయక తప్పదు. అతను మా కస్టడీలో రెండు రోజుల నించి ఉన్నాడన్న సమాచారం కూడా రికార్డుల్లోంచి తొలగించాల్సి వస్తుంది’ జెమ్ చెప్పాడు.
‘అతను నేరస్థుడని మీరు నమ్ముతున్నారా?’
‘అది నిజం. సమస్యేమిటంటే ఏం నేరం చేసాడన్నది తెలీడం లేదు’
‘మీకు సాక్ష్యం లేనప్పుడు ఎలా నమ్ముతారు?’
‘కొన్ని శవాలు దొరకవు. దొరికిన కొన్ని శవాలు ఎవరివో తెలీదు. అలా జీన్ శవం దొరికినా మా వాళ్లు అది ఎవరిదో కనుక్కుని ఉండకపోవచ్చు’
‘ఇది కూడా ఊహే కదా?’
‘పోలీసుల పని ఊహించడం, అనుమానించడం. అనుమానితుల్ని ప్రశ్నించేప్పుడు వారి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి అతను నేరస్థుడో కాదో మాకు తెలిసిపోతుంది’
‘మీరు ఇంతవరకూ పొరబడలేదా?’
‘ఒక్కోసారి. చాలా తక్కువ మందే తాము చేసిన నేరాన్ని దాచగలరు’
‘ఆమె శవాన్ని ఇక్కడ పాతిపెట్టాడంటారా?’ భయంతో వణుకుతూ అడిగాను.
‘ఆ అవకాశం ఎక్కువ’
జేబులోంచి ఓ కవరు తీసి అందులోని ఫొటో చూపిస్తూ చెప్పాడు.
‘జీన్ విక్టర్ హెర్వీ’
సరైన వెలుతురు లేని చోట తీసిన ఆ ఫొటోలో నలభైల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సోఫాలో కూర్చుని ఉన్నారు. వాళ్ల చేతుల్లో గ్లాసులు. నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతున్నారు. అది పార్టీలో తీసిన ఫొటోలా అనిపించింది.
‘వాళ్లు ఆనందంగా కనిపిస్తున్నారు. అతను ఆమెని ఎందుకు చంపుతాడు?’
‘ప్రేమ ఓ పెద్ద మిస్టరీ. దాన్ని ఎవరు వివరించగలరు? కాఫీ స్ట్రాంగ్‌గా ఉంది. నాకు ఇష్టమైనంత స్ట్రాంగ్‌గా. మీరు తిరిగి వచ్చాక ఈ తోటలో ఎవరైనా తవ్వినట్లుగా అనిపించిందా?’
‘నాకు గుర్తున్నంత వరకు లేదు’
‘పేటియో? అది తర్వాత కట్టినట్లుంది’
‘ఎక్సేంజ్‌కి మునుపు చాలా నెలల క్రితం. దయచేసి దాన్ని తవ్వకండి’
‘్భయపడకండి. అన్ని సాధ్యాలని మేం పరిశీలించాలి. అది శవం దాచడానికి సరైన ప్రదేశం. కాంక్రీట్‌లో ఉన్న శవం నించి వెలువడే వాయువులని కనుక్కోవడం కుదరదు. హంతకుడు ఎలా ఆలోచిస్తాడో మేం అలా ఆలోచించాలి. అతను ముందే పథకం వేసుకుని వచ్చి హత్య చేసాడా? లేక తక్షణ కోపంతోనా? చాలా సందర్భాల్లో ముందస్తు పథకం ఉండదు. క్షణికావేశం వల్ల
జీవితకాలం పోలీసుల నించి దాక్కునే యాతన పడాలి’
‘అందుకనేనా మీరు చాలామంది హంతకులని పట్టుకుంటూంటారు?’
‘అవును’
అతను తన చేతిలోని కాఫీ మగ్ మీది కొటేషన్ని చదివాడు. ‘ఈ కాఫీలా ప్రేమ కూడా స్ట్రాంగ్’
‘అది టాన్‌కి ఇష్టమైన కొటేషన్. ఎప్పుడూ ఈ కప్పులోనే కాఫీని తాగేవాడు’ చెప్పాను.
మూడు గంటల తర్వాత అతని ఆశ నిరాశైంది. మళ్లీ కాఫీ కలిపే నా దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘మీరు నిశ్చింతగా పడుకోవచ్చు. ఏం దొరకలేదు’
అతని మనుషులు సామానంతా వేన్లో సర్దారు. కాఫీ తాగాక అంతా నాతో కరచాలనం చేసి గుడ్‌బై చెప్పారు.
‘నేను లండన్‌లోని లైసన్ ఆఫీస్‌కి వెళ్లి నా రిపోర్ట్ కాపీ ఇచ్చి రేపు పేరిస్ వెళ్లిపోతాను. నేను నమ్మలేక పోతున్నాను. ఆమె శవం ఇక్కడ తప్పక దొరుకుతుందని ఎదురు చూసాను’ జెమ్ చెప్పాడు.
‘ఈ కేస్ మీకు చాలా ముఖ్యమైంది అనుకుంటాను’ అడిగాను.
‘అన్నీ నాకు ముఖ్యమైన కేసులే. ఆమె హత్య చేయబడితే ఆ హంతకుడ్ని పట్టుకోవడం నా బాధ్యత’
‘ఒకవేళ ఆమె కావాలని మాయమై ఉంటే?’
‘కాని అదైనా కనుక్కోవాలిగా. హెర్వీ ఏం దాస్తున్నాడో కూడా’
‘్థంక్స్. ఆమె శవం ఇంట్లో లేదని తెలిసాక నాకు హాయిగా నిద్ర పడుతుంది’
‘మీ మాజీ భర్త ఇక్కడే ఉంటున్నారా?’
‘లేడు. వెనక్కి హాలండ్‌కి వెళ్లిపోయాడు. మేం పేరిస్‌కి వెళ్లడానికి కారణం మా సమస్యలని సర్దుబాటు చేసుకోడానికి. కాని కాలేదు. అతను ఇంకెవర్నో పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డ కూడా.’
* * *
బెల్ మోగింది. అతను పేరిస్‌కి వెళ్లలేదా? అనుకుంటూ తలుపు తీసాను. ఎదురుగా ఫెల్ట్ హేట్‌లోని అతను లోపలికి సూట్‌కేస్‌తో వచ్చాడు. నన్ను ప్రేమగా చుంబించాడు. అతనికి కాఫీ కలుపుతూ జరిగింది చెప్పాను. అతను విభ్రాంతిగా విన్నాడు.
‘నువ్వు హంతకుడని జెమ్ అనుకుంటున్నాడు. నిన్ను ఎప్పుడు విడుదల చేసారు? ఇంక పోలీసుల గొడవ ఉండదుగా?’ అడిగాను.
‘లేదు. జీన్ శవం దొరికితే కాని వాళ్లు ననే్నం చేయలేరు. దాన్ని కనుక్కోవడం వారికి అసాధ్యం.’
‘ఎందుకైనా మంచిది. మనం కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి హెర్వీ’ చెప్పాను.
‘అధైర్య పడకు...’
డోర్‌బెల్ మళ్లీ మోగింది. ఇద్దరం ఒకరి మొహాలు మరొకరం చూసుకున్నాం. నాకు హెర్వీ మొహంలో భయం కనిపించింది. వెళ్లి తలుపు తెరిచాను. యూనిఫాంలోని లండన్ పోలీసులు లోపలకి వచ్చారు.
‘ఏమిటి?’ అడిగాను.
‘అరెస్ట్ వారెంట్. మీ భర్త టాన్ హేన్‌ని హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.’
‘ఏమిటి మీరనేది? అది అబద్ధం’ బుకాయించాను.
‘నిజం మిసెస్ ఎలిజబెత్’ చెప్తూ జెమ్ ఫ్రెంచ్ పోలీసులతో లోపలకి వచ్చాడు.
అతను హెర్వీ ముందుకి వెళ్లి చెప్పాడు.
‘మీ ఆవిడ జీన్‌ని ఇంగ్లండ్‌లో హత్య చేసి శవాన్ని పాతిపెట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను’
‘అది అబద్ధం’
‘ఐఫిల్ టవర్ ముందు నిలబడి తీయించుకున్న మీ ఫోటో రెండేళ్ల క్రితంది కాదు. ఆర్నెల్ల క్రితంది. ఫొటోలో వెనక కనబడే రెస్ట్‌రెంట్ పాట్‌బెల్లి పేరుని బట్టి ఆర్నెల్ల క్రితంది అని గుర్తు పట్టాను. ఆర్నెల్ల క్రితం మీరు పేరిస్‌కి వెళ్లిన సంగతి ఎందుకు దాచారు? నేను మీ పక్కింటావిడ ఇంటికి వెళ్లి జీన్, హెర్వీల ఫొటో చూపిస్తే, మీకు పెళ్లయిందని చెప్పింది. నా అనుమానం నిజమైంది. వెంటనే ఇంగ్లండ్ ఇమిగ్రేషన్ అధికారులని కాంటాక్ట్ చేస్తే ఎలిజబెత్ వెంట వెళ్లిన ఆమె భర్త హేన్ ఆమె వెంట కాని, తర్వాత కాని ఇంతదాకా వెనక్కి రాలేదని తెలిసింది. అలాగే పేరిస్ నించి వచ్చిన జీన్ కూడా ఇంగ్లండ్ నించి ఫ్రాన్స్‌కి మళ్లీ వెనక్కి వెళ్లలేదు’
‘అవును. టాన్ అట్నించి అటే హాలండ్‌కి వెళ్లిపోయారు’ చెప్పాను.
‘అలా జరిగి ఉంటే ఆయన జీవించి ఉండేవాడు. మీ ఇద్దరూ చేసింది ఓసారి గుర్తు చేస్తాను. పేరిస్‌లో ఎలిజబెత్ ఆర్ట్ విద్యార్థినిగా ఉండగా మీ ఇద్దరికీ పరిచయం. మీ ప్రణయం పెళ్లి దాకా వెళ్లలేదు. కాని కొంతకాలానికి మీకు మళ్లీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. మీ ఇద్దరి భాగస్వాములు విడాకులకి అంగీకరించక పోవడంతో మీ పథకాన్ని అమలు చేసారు. హెర్వీ పూర్వీకుల ఇల్లు తవ్వితే దొరికిన గుర్తు తెలీని మగాడి శవం ఈస్ట్ యూరప్ నించి వచ్చిన కాందిశీకుడిది అని భావించాం. కాని ఎలిజబెత్ భర్త టాన్ హేన్‌ది అని ఇక్కడి నించి నేను సేకరించి పంపిన డెంటల్ రికార్డ్స్ ప్రకారం నిర్థారణైంది. ఎలిజబెత్ ఫాం హౌస్ ఆవరణలో ఈ ఉదయం తవ్వితే జీన్ శవం దొరికింది. ఎయిర్‌పోర్ట్ నించి హెర్వీని మేం రహస్యంగా అనుసరిస్తే నేను ఊహించినట్లుగానే ఇక్కడికి, తన భార్య దగ్గరికి వచ్చాడు. మీరు అమాయకులైతే వాళ్లు కనిపించడం లేదని పోలీసులకి రిపోర్ట్ చేసి ఉండేవారు.’
దాన్ని ఖండించలేక హెర్వీ ఫ్రెంచ్ పోలీసుల వెంట, నేను లండన్ పోలీసుల వెంట నడిచాం.
(పార్కర్ బిలాల్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి