ఈ లోకంలో..
Published Monday, 17 July 2017ఈమధ్య కొంత ఆందోళనగా ఉంది. సకాలంలో జరగాల్సిన పనులు సకాలంలో జరుగకపోవడం నా ఆందోళనకి ప్రధాన కారణం. మా కుటుంబంలో జరిగిన అకాల మరణాలు మా ఆవిడకి వచ్చిన చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా నా ఆందోళనకి కారణమైనాయి.
అరవై సంవత్సరాలు వయస్సులో అంతుపట్టని అనారోగ్య సమస్యతో మా గుణక్క చనిపోయింది.
కేన్సర్‌ని ఆలస్యంగా గుర్తించడం వల్ల మా ప్రమీల వదిన తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయింది.
మా ఊర్లో వున్న ఇంట్లో ఎవరూ వుండక పోవడం వల్ల ఇల్లు అవసాన దశకు చేరింది. మన ప్రమేయం లేకుండా సమస్యలు ఇట్లా ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి. సమస్యలు వున్నప్పుడు ఆలోచనల్లో పడటం, ఆందోళనకి గురి కావడం సహజం.
సరిగ్గా ఇలాంటి ఆలోచనల్లో వున్నప్పుడు ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఓ వ్యక్తికి అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి. మరో వ్యక్తి 30 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆ ఇద్దరు వాళ్ల సమస్యలతో నా దగ్గరికి వచ్చిన వ్యక్తులే. నేను చేసిన కౌన్సిలింగ్ వల్ల వాళ్ల కూతురు జీవితం బాగుపడిందని కృతజ్ఞతలు చెప్పడానికి ఆ మధ్యవయస్కుడు వచ్చాడు. నేను చేసిన ఫోన్ వల్ల ఆ యువకునికి ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి ఆ యువకుడు వచ్చాడు. ఇద్దరూ కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు.
నేను ఇలా సహాయం చేసే స్థితిలో వున్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పకూడదా అన్న ఆలోచన వచ్చింది. నిజానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అందరికీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కృతజ్ఞతలకి బదులుగా ఆందోళన చెందుతున్నామని అన్పించింది.
మా గుణక్కకి అరవై సంవత్సరాలు దాటిన తరువాత అనారోగ్యంతో చనిపోయింది. ఆమె బాధ్యతలు తీరిపోయాయి. బాధ్యతలు పూర్తి కాకుండా చనిపోతున్న వ్యక్తులు ఎంతమంది లేరు ఈ దేశంలో.
మా వదినకి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తరువాత అనారోగ్యంతో చనిపోయింది. ఆమె బాధ్యతలు తీరిపోయాయి. అనారోగ్యంతో ప్రతిరోజూ మంచంలో ఏడ్చి వేదనతో జీవిస్తున్న వ్యక్తులు ఎంతమంది లేరు ఈ ప్రపంచంలో.
మా ఆవిడ అనారోగ్యం చాలా చిన్నది. మోకాలు నొప్పి. కాళ్లు లేకుండా జీవిస్తున్న వ్యక్తులు ఎంతమంది వున్నారు ఈ లోకంలో.
వూర్లో ఇల్లు పాతబడిపోతుంటే దాన్ని తిరిగి నిర్మించవచ్చు. అది అంత పెద్ద సమస్యనా?
సకాలంలో పనులు జరగకపోవడానికి ఏ మంచి కారణాలు ఉన్నాయో మనం ఊహించగలమా?
నేను పదవీ విరమణ చేయకముందే మరో అత్యున్నత పదవి వచ్చింది. పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. భగవంతుడు నా జీవితానికి ఓ మంచి ప్రణాళికను రచించాడు.
ఈ రకంగా ఆలోచిస్తే ఆందోళన మటుమాయం అవుతుంది. ఈ లిస్టుని ఇట్లా పొడగిస్తూ పోవచ్చు. పొడగిస్తూ ఉంటే ఆందోళన తగ్గి ఆనందం పెరిగిపోతుంది. దేవదేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతలు చెప్పవచ్చు. కృతజ్ఞతా పూర్వకంగా వుండటంవల్ల ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది.
ఓ మిత్రుడు చెప్పినట్టు - కృతజ్ఞతతో వుంటూ, మనం సాధించాలని అనుకొన్న దానికి ప్రయత్నం చేస్తూ వుండాలి.
కృతజ్ఞతతో ఉండటం ఎంత ముఖ్యమో దాన్ని వ్యక్తీకరించడం అంతకన్నా ముఖ్యం.