S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భక్తిలేని నరజన్మ ఎత్తి ఏమి?

ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు
మెఱుపు దివ్వెల నూనె తరుగలేదు
పవలు రాతిరి తీరుబడి లేక ఘోషించు
తోయధీశుని గొంతు రాయలేదు.
ఇన బాలకుని దినమ్మును గర్భమున బూను
పొడుపు దిక్సతి కాన్పులుడుగలేదు
ఋతురాజు ధారుణీ సతికి సొమ్ములు పెట్టి
కులికించు పని మానుకొనగలేదు
విశ్వ నిర్మాత చల్లని వీక్షణమున
నేటికిని కెంపు ఛాయ కాన్పించలేదు
మూర్ఖలోకమ! దినమెల్ల ముగియలేదు
దీపమున్నది హృదయంబు దిద్దుకొనుము.
-కవికోకిల జాషువా
కాలం అంతా ఒకటే గాని, అందరికీ ఒకటే కాదు. జీవిస్తున్న వారి కాలం వేరు. గతించిన వారి కాలం వేరు. గర్భంలో వున్న శిశువుదొక కాలం. ఇంకా గర్భస్థం కాని జీవిదింకో కాలం. ఓడలోనో, విమానంలోనో, రైలులోనో ప్రయాణించే వారకీ, నిద్రపోయి కలలు కనేవాడికీ, మతిపోయిన వాడికీ, వైరాగ్య నైరాశ్యాల వల్ల కాషాయం ధరించేవాడికీ ఈ ‘కాలం’ ఒకే విధంగా గడవదు.
‘‘కాలో జగద్భక్షకః’’
ఒక స్థలమే ఒక కాలంలో స్వర్గంలా కనబడుతుంది. అదే ఇంకో సమయంలో నరకమై పోతుంది. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుని బ్రతకాలనే సత్యాన్ని కవికోకిల జాషువా ఈ పద్యంలో ఎంత గొప్పగా ఆవిష్కరించాడో చూడండి. తోడి, కాంభోజి, కల్యాణి, మోహన రాగాల్లో మా నాన్నగారు హరికథలు చెబుతూ తరుచు ఈ పద్యాన్ని అద్భుతంగా పాడేవారు. పద్యాల్లో పాటకున్నట్లుగా తాళం లేకపోయినా పద్యానికో నడక ఉంది. అందులోని ఛందస్సే ఆ ‘లయ’ను నిర్దేశిస్తుంది - అని తెలిసి పాడితే, భావం దానంతట అదే వచ్చేస్తుంది. పాట కంటే ఒక్కోసారి పద్యమే ఘనంగా గుండెల్లో నిలుస్తుంది. తెలిసి కూడా సమయాన్ని ఎంతో వృథా చేసేవాళ్లున్నారు.
ఏ సమయంలో చేయవలసిన పనిని అప్పుడే ఆ సమయంలోనే చేయాలి. ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు.
ఎన్నో జన్మల్లో చేసిన పాపాలైనా మానవ జన్మ ఎందుకొచ్చిందో తెలుసుకుని తెలిసిచేసే రామచింతనతో జన్మ తరిస్తుందంటారు త్యాగయ్య.
పుణ్య పురుషులెప్పుడూ లోక హితం కోరి చెప్పవలసినవన్నీ చెబుతూంటూనే వుంటారు. తెలివైన వాళ్లకు తిన్నగా చేరతాయి. అల్పబుద్ధులకు ఆలస్యంగా అందుతాయి. త్యాగయ్య భౌతిక దేహంతో 80 ఏళ్లు జీవించినా రెండున్నర శతాబ్దాలుగా కీర్తి శరీరంతో మన మధ్యనే వున్నాడనడానికి సాక్ష్యం ఆయన కీర్తనలే.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి యుండి యేమి పొయ్యేమి!
శమత తోడి ధర్మము జయమేగాని
క్రమముతో మనవిని వినవే మనసా!
అసావేరి రాగంలోని ఈ కీర్తన చాలా అపురూపమైన కీర్తన. రాగభావం నిండిన అద్భుత రచన. ఏ మాటలు ఏయే రాగాల్లో పాడితే బాగుంటాయో ఆయనకు తెలుసు కాబట్టే వాగ్గేయకారుడై కీర్తించబడుతున్నాడు.
మనసులోని మాటలు రాగసహితంగా అలవోకగా బయటకు వచ్చేస్తూండేవి. నిశే్చష్టులై శిష్యులు అలా వింటూ ఆనందించేవారు. కావేరీ ఒడ్డుకుపోయి స్వరం ఒకరూ సాహిత్యం మరొకరూ కూర్చి, సాయంత్రం గురువుగారికి వినిపించేవారు.
సాహిత్యంలోని గూఢార్థం బాగా తెలిసి పాడితేనే కీర్తనలోని భావం వ్యక్తవౌతుంది - చిత్రమేమంటే లోతుగా వెళ్లి అర్థం తెలియకపోయినా, తమిళ విద్వాంసులంతా ఆ కీర్తనలను ఒంటపట్టించేసుకున్నారు.
వేదాంతపరమైన అంశాలను ఎంతో సరళంగా చెప్పిన త్యాగరాజును కొనియాడకుండా ఉండలేం. తత్త్వం తెలిస్తే అహంకారముండదు. భక్తుడైనవాడు తన నిత్యకృత్యాలలో ఈ భగవంతుని తత్త్వాన్ని తెలుసుకుంటూ జీవయాత్రను మలుచుకోవాలి.
అలాటి బుద్ధి అలవాటు చేసుకోమంటారు త్యాగయ్య.
బంగారం మోసే గాడిద చూపు ఎప్పుడూ గడ్డిపరకల వపే ఉంటుంది. చదువు వేరు. సంస్కారం వేరు. బాగా చదివితేనే సంస్కారం మబ్బుతుందనుకోవడానికి లేదు. అక్షరం ముక్కలేని సంస్కారులూ లేరూ? ఈ చరాచర ప్రాణికోటిలో పుణ్య విశేషం వల్ల మాత్రమే లభించేదే మానవ జన్మ. అలాగని శరీరం అశాశ్వతం అనే నిర్వేదం కానీ నిరుత్సాహం కానీ అక్కర్లేదు సుమా!
నియమాలెందుకు? ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తే ఏం? అనేది యధేచ్ఛావాదం అంటారు.
త్యాగయ్య ఆశావాది. శుష్క వైరాగ్యం ఎక్కడా ఆయన కీర్తనల్లో కనిపించదు చూడండి. మన వెంట వచ్చేది సంస్కారమే గానీ, సంసారం కాదంటాడు.
‘సారవౌ కవితల విని వెర్రివాడు
సంతోషపడి ఏమి పడకేమి?
చేరడేసి గుడ్డికన్నులు బాగ
తెరచి యేమి తెరువకున్ననేమి’ అంటూ సమయం తెలిసి పుణ్యం చేయాలంటాడు.
విత్తం వుండీ.. ఫలమేది? వితరణ లేకపోతే? పదిమందికీ పెట్టాలనే ఆలోచన అందరికీ రాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడమే తప్ప కోటీశ్వరుడైనా ‘లోభి’ అనుకోండి? వాడు ఉన్నా లేకపోయినా ఒకటే. రాముడి మీద పాడని పాట పాడినా ఒకటే, ఏడ్చినా ఒకటే.
లోకరీతుల్ని కాచి వడబోసిన త్యాగరాజు బోధించే విషయాలన్నీ శిరోధార్యాలే. ఒక్కపొల్లు మాట కనబడదు. కుండబద్దలు కొట్టి చెప్పగల సమర్థుడు.
కొన్ని దశాబ్దాల క్రితం ‘రాజాజీ, ఓచోట రాజకీయాల్లో రాణించాలంటే మహాభారత తత్త్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి’ అన్నారు. మా నాన్నగారికి మిత్రుడైన ఒక పండితుడు చెరుకువాడ నరసింహం పంతులు.... మాటల సందర్భంలో ‘తప్పు చేసేది మానవుడే. పశుపక్ష్యాదులకు తప్పు అనేది తెలియదు. అవి తప్పు చేస్తున్నాయని అనం మనం. ‘మనిషికి వివేకం ఉందిగా! కాబట్టి, తాను చేసేది తప్పు’ అని తెలుసుకుని, తన మీదే కేసు పెట్టుకుని, తనే విచారించుకుని, తనే జడ్జిమెంటు ఇచ్చుకుని ‘శిక్ష వేసుకున్ననాడు ‘నిజమైన మనిషి’ అనిపించుకుంటాడనేవారు.
మహాత్మాగాంధి ‘సత్యశోధన’ అనే పుస్తకం నుంచి ప్రతి శుక్రవారం ‘గాంధీ మార్గం ‘లైవ్’లో ఉదయం కొన్ని అధ్యాయాలు రేడియోలో చదివేవాణ్ణి. ఆశ్చర్యం కలిగేది ఆయన ఆత్మకథలోని విషయాలు చూస్తోంటే. కొన్ని వాక్యాలు నన్ను భలే ఆకర్షించాయి. ఆయన ధీర లక్షణాన్ని గమనించండి.
‘ప్రలోభాలతో తప్పులు చేస్తాం. కానీ నేను ఎప్పుడెప్పుడు ఏయే తప్పు చేశానో ఒప్పుకుని స్వయంగా డైరీలో రాసుకున్నాను. దానికి పరిష్కార మార్గాన్ని కూడా నేనే వెతుక్కున్నాను’ అంటాడు. అందుకే ఆయన మహాత్ముడు. అజ్ఞానాంధకారంలో ఆత్మజ్యోతికి వెలుగుండదు. ధనం, బలం, విద్యాహంకారం, రాజకీయాధికారం, మందీమార్బలం, యివన్నీ ఆభిజాత్యాన్ని, అహంకారాన్నీ పెంచి పోషిస్తూంటాయి. వాటి తత్త్వం తెలుసుకునేంతవరకూ స్థిమితంగా వుండనివ్వవు. అవన్నీ ఉడిగిపోగానే అంతే అసలు బండారం బయటపడుతుంది.
త్యాగయ్య చెప్పిన ‘సమయము తెలిసి పుణ్యాలార్జించటంలో ఎన్నో సాధక బాధకాలున్నాయి - గృహస్థుని జీవితంలో ‘సంసార తాపత్రయమే ప్రధానమై’ కూర్చుంటుంది. దీనికోసమే కూడబెట్టాలి - ‘ఏదో బాగానే సంపాదించాం’ అనుకుంటే దాన్ని కాపాడటం కష్టం. కాపుదల కూడా సమస్యే.
‘ఎంత సంపదకు అంతే ఆపద.. ఎంత వెలుగులకు అంతే చీకటి’ అంటాడు అన్నమయ్య.
రవి గాంచనిచో కవి గాంచునంటారు. యిది ముమ్మాటికి నిజమనిపిస్తుంది.
‘ఘనఘనాఘనము చీకటి మేడ వెలిగించు’ అనే కవికోకిల జాషువాగారి పద్యం చదువుతోంటే, నాకైతే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది ‘నాయనా! చూడు. క్రమం తప్పకుండా సూర్యభగవానుడు ఉదయిస్తూనే వున్నాడు. ఒక్కసారే తన ఏకచక్ర రధానికి అశ్వాలను పూనుస్తాడు - వెలుగునివ్వటమే అతని ధర్మం. భూమాత చల్లగా పంటలు పండిస్తూనే వుంది. విశ్వ నిర్మాత తన కరుణా కటాక్షాలు చూపిస్తూనే ఉన్నాడు. ఇంక కావలసినదేమిటి! అంతా నీలోనే ఉంది. ఓ మూర్ఖ మానవా! దినమెల్ల ముగియలేదురా! బుద్ధి మసకబారకుండా దీపముంది. హృదయం మాత్రం దిద్దుకో’ అని హెచ్చరిస్తాడు కవి. మనసు నిర్మలంగా వుంచుకోవాలి. అంతఃకరణ శుద్ధికి నామస్మరణ ఒక్కటే మార్గం. ఆ వెలుగులో మనకు పరమాత్మ దర్శనం లభిస్తుంది. చీకట్లు చెదిరిపోతాయ్ - దారి తిన్నగా కనిపిస్తుంది!
‘శుద్ధమైన మనస్సుతో సుస్వరంతో పద్దు తప్పక భజించే భక్తులను కాపాడుతూ వుండటమే ఆ పరమాత్ముడి పని’ పోతన చెప్పినదే త్యాగయ్యా చెప్పాడు.
కవిత్వమైనా, సంగీతమైనా పరమాత్మను కీర్తించేదై ఉండాలి. సంస్కారంతో సాక్షాత్కారం కోసం వినియోగింప వలసిన విద్య సంగీత విద్య. చమత్కార విద్య కాదు. ఆయనకు మనం వినిపించే గానం చాలా శుచిగా ఉండాలి. భక్తివల్లనే ఆ గానానికి శుచిత్వం ఏర్పడుతుంది. అదే చక్కని మార్గం - జాషువా ‘కొసమెరుపు’ చూడండి.
గీ॥ నమ్మకము లేనట్టి నీ జీవనమున కవధి
గుండె గడియారమున దాగి యుండెనేమొ
లెక్క ముగిసిన నాట చాలించు కొనును
త్వరపడుము మూర్ఖ! ధర్మ నిర్వహణ కొఱకు!
- ధర్మస్య జయోస్తు -
*

కథాగానంలో హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు మా నాన్నగారి గురువు. ఆయనంటూండేవారట.
‘చూడు రామ్మూర్తీ! ఎవ్వరి చరిత్రైనా సరే! ముప్పై ఏళ్ల వరకే, లోకానికి తెలుస్తుంది. ఆపైని అనవసరం - ఎందుకంటావా? సుగుణాలన్నీ 30 ఏళ్ల వరకే ఉంటాయి. ఆ తర్వాత పేరాస అంసతుష్టి, రకరకాల చాపల్యాలు, ఒకటేమిటి? అంటకూడని బలహీనతలన్నీ అంకురించి క్రమంగా పెరిగిపోతూనే ఉంటాయి. దైవత్వం వుండదు. దేవతలను అందుకే త్రిదశులన్నారు.’
దాసుగారి అభిప్రాయాల్లో నిజానిజాలెలా వున్నా చమత్కార చతురుడైన జార్జిబెర్నాడ్‌షా కూడా ఇదే మాటన్నాడు. భాష ఒక్కటే తేడా. దీనికి సమాంతరంగా ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అనే మాటను తలుచుకొంటూ తృప్తిపడాలి.
నారాయణదాసు లాంటి పుంభావ సరస్వతులకు మాత్రమే ఇది వర్తిస్తుందేమో. అందరికీ కాకపోవచ్చు. సంస్కారాన్ని బట్టే ఏదైనా.
మా నాన్నగారు మంచి ఫొటోగ్రాఫర్. నిండైన మనిషి ఆదిభట్ల వారి ఈ చిత్రాన్ని మా నాన్నగారు స్వయంగా తీశారు. గురుపౌర్ణమి వేళ ఇది గుర్తొచ్చింది. దాదాపు 80 ఏళ్ల క్రితం తీసిన ఈ ఫొటో ప్రస్తుతం తాడేపల్లిగూడెం గ్రంథాలయంలో ఉంది.
**

చిత్రాలు.. త్యాగయ్యా* జాషువా *ఆదిభట్ల నారాయణదాసు

- మల్లాది సూరిబాబు 9052765490