S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసును పలుకరించే మధుర సంగీతం

కర్ణాటక సంగీతం మాత్రమే వినే శ్రోతలు లలిత సంగీతం చాలా తేలికనుకుంటారు. లలిత సంగీతం వినే వారికీ సినిమా సంగీతం లోకువ. ఈ ముగ్గురూ ఎంత మేధావులైనా వినేవారికెప్పుడూ లోకువే.
ఎవరు ఎలా పాడినా ఇష్టం వుంటేనే వింటాడు లేదా లేచి వెళ్లిపోతాడు. అందుకే సంగీతం ఒక గమ్మతైన భాష. ఏవేవో సంకేతాలతో మనసుకు చేరే భాష. గాయకులు, నాదకులూ ఏదో వినిపిస్తారు. శ్రోతలు వింటారు.
మనసుకు సాహిత్యం అర్థమైనంత తేలికగా ‘రాగం’ అందరికీ అర్థం కాదు. ‘పాడగలిగే వారికి మాత్రమే అర్థమయ్యే కొన్ని సాంకేతిక పదాలున్నాయి. మాటలకు భాషలో వున్న అవగాహన లేదా ఒప్పందం సంగీతానికి లేదు. స్వరం, శ్రుతి, అలంకారం, ఆరోహణ, అవరోహణ, స్ఫురితం, జారు, సంవాదం, వివాదం, గమకం లాంటివన్నీ విద్వాంసులకు మాత్రమే అర్థమయ్యే మాటలు. రాగాలకు ఏవేవో రసమనీ, గుణమనీ, అర్థం, భావం లాంటి భౌతిక రూపాలు అంటగట్టారు కానీ, ఆధ్యాత్మిక స్వరూపంలో ఉండే హృదయాకర్షణ శక్తి అనుభవించిన తర్వాత ఈ సంకేతాలకు ఒక్కోసారి అర్థమంటూ కనిపించదు.
ఈ విషయంలో సంగీతాన్ని భావాతీత స్థితిలో ఆనందించిన మన వాగ్గేయకారుల మార్గమే చాలా భిన్నం. వారికి సంగీతం లౌకిక విద్య కాదు అలా భావించిన గురువులూ లేరు. వారినాశ్రయించిన శిష్యులూ లేరు. వారి లక్ష్యం పారమార్థిక చింతన ఒక్కటే.
సంగీతాన్ని ఆసరాగా చేసుకుంటూ సంసార నావను గమ్యం చేర్చుకునే ప్రయత్నంలో సఫలీకృతులైనారు - జమీందార్లూ, ఆనాటి ప్రభువులూ ఇష్టపడే సంగీతం వినేవారు - మొక్కుబడిగా కాదు. అప్పట్లో రాజాశ్రయాన్ని పొంది విద్వాంసులు వాళ్లను తృప్తిపరచిన మాట నిజమే. కానీ శ్రద్ధతో వారు చేసిన సంగీత సేవలన్నీ ఇంటి భజనలలోనో దేవాలయాలలోనో జరుగుతుండేవి. బతుకు కోసం సంపాదన. అంతేకానీ సంపాదన కోసం బతుకులేదు. అటు రాజులకైనా, విద్వాంసులకైనా ‘మూలశక్తి’ ఆధ్యాత్మికమే.
కాలం మారిపోయింది. ఈవేళ ధనవంతులున్నారు. వారికి ఇటువంటి కళల మీద ఆసక్తి లేదు. దేవాలయాలున్నాయి. సంప్రదాయ కళల మీద భక్తి కంటే సంపాదన మీద ధ్యాస పెరిగింది. భక్తి, ఆడంబరాల మీద శ్రద్ధ పెరిగింది.
ఇంక సంగీతం స్థిమితంగా వినేదెవరు? ఇళ్లల్లో ఆత్మతృప్తి కోసం సంగీత కాలక్షేపం చేసుకునేవారెవరు? విత్తం వుంటే సరిపోదు. వితరణ కావాలి. దేవాలయాల్లో ఇతర సేవలకు టిక్కెట్లు పెట్టి అల్లరి చేస్తారే కానీ, కాస్సేపు నలుగురూ కూర్చుని, శ్రుతిశుద్ధంగా పాడాలని గానీ పాడించాలని గానీ పాడితే వినాలని గానీ అనుకునే వారున్నారా? బుద్ధిగా కాస్సేపు కూర్చుంటే గదా!! మనస్సుతో వినేదే మంచి సంగీతం. కానీ ఆ సంగీతమే కరువై పోయింది. మన అలవాట్లు, జీవన విధానం, యాంత్రికంగా బతికేలా చేసేస్తూ, మనస్సుకు ఆనందాన్ని చేకూర్చే హాయైన సంగీతాన్ని వినటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. సంగీత కచేరీలు జరుగుతున్నా ఏవో మొక్కుబడిగానే జరుగుతున్నాయే గానీ, మనసు పెట్టి పాడుతున్నారా?
తిన్నగా సంస్కారవంతమైన హృదయాలకు చేరుతున్నాయా? శాస్ర్తియ సంగీతం శ్రోతలకు ఆసక్తిని పెంచుతోందా? ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పదిమందికీ కర్ణాటక సంగీతం పట్ల ఆసక్తిని పెంచాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న సంగీత సభల సదాశయం నెరవేరుతోందా?
శబ్దార్థ మయమైన భాష కంటే స్వర తాళ సంబంధమైన సంగీత భాష వినేవారిని త్వరగా ఆకర్షిస్తుంది.
వింత వింత లయలూ, చిక్కుపరిచే లెక్కాచారాలు, ఏవేవో స్వరకల్పనలు ప్రధానంగా సాగే సంగీత కచేరీలు సర్కస్ విన్యాసాల్లా మిగిలిపోయాయే తప్ప సంప్రదాయ సంగీతానుభూతి ఇవ్వడంలేదు. పోనీ అటువంటి కచేరీలకైనా ఆసక్తిగా వచ్చి జనం వింటున్నారా? అంటే అదీ లేదు.
యివన్నీ వెంటనే సమాధానం రాని ప్రశ్నలు.
అతిథిని ఇంటికి పిలుస్తాం. వండి వడ్డించే పదార్థాలు రుచికరంగా ఉండేలా జాగ్రత్త పడతాం. వీలైతే వీలైనన్ని ఎక్కువగా పదార్థాలు తయారుచేసి వడ్డించాలనిపిస్తుంది. ఏం చేసినా, ఎంత చేసినా, తినేవాడి ఆకలిని బట్టే ఫలితం? వచ్చి కూర్చునే వాడికసలు ఆకలే లేకపోతే? చేసే ప్రయత్నమంతా వృథాయే. అంతేకాదు - వచ్చిన అతిథికి ఏం తినాలనిపిస్తోందో తెలియదు. దీన్ని కాస్త సంగీతానికి అన్వయం చేసుకుంటే మనకు కావలసిన సమాధానం వచ్చేస్తుంది. పినాకపాణి గారు ఈ విషయాన్ని చెబుతూ-
రాజమహేంద్రవరంలో నాళం వారి పురాతమైన సత్రం ఒకటి ఇప్పటికీ ఉంది. ఆ రోజుల్లో విరామ కార్యక్రమాలు అక్కడ జరుగుతూండేవి. కళాకారులకు వసతి సౌకర్యాలు, భోజన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తూండేవారు. 125 సంవత్సరాల నాటి అనుభవం. శ్రీపాద పినాకపాణి వారికి ఏదో కచేరీ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సత్రంలో వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారట.
ఈ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఈ వేళ లేత అరటికాయ కూర వండారు. తాలింపు పెట్టి దింపగానే, కాస్త నిమ్మరసాన్ని చల్లి అందరికీ వడ్డించారు. అంతే. ‘మిరియాల రసం’తో ఆవేళ తిన్న భోజనం మరపునకు రాదు.
నాతోపాటు ప్రముఖ విద్వాంసుడు డొక్కా శ్రీరామమూర్తి ఆ భోజనాన్ని మెచ్చుకుంటూ ‘ముఖే ముఖే సరస్వతి’ వంటిదే కమ్మనైన భోజనం పాణిగారు! కమ్మగా గుర్తుండిపోయేలా 1,2 కీర్తనలు చాలవా? ఎనె్నన్నో పాడేసి, అల్లరి చేయటం కంటే?’ అన్నారట.
వెనుకటి రోజుల్లో సంగీత కచేరీలన్నీ షడ్రసోపేతమైన విందును మరిపించేవి. ఎంతో తృప్తిగా వినేసి ఇళ్లకు వెళ్లేవారు. వినాలనే ఉత్సాహం వుంటేనే ఆ సంగీతానికి తగిన గౌరవం. వెనకటి రోజుల్లో విద్వాంసుల సంగీతం, సంస్కారవంతమైన శ్రోతలను వెతుక్కుంటూనే ప్రచారమైంది.
దక్షిణాదిలో ఆనయ్యర్, అయ్యయ్యర్ అని యిద్దరు గాయకులుండేవారు. యిద్దర్నీ ఆనయ్యర్ సోదరులు అని పిలిచేవారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ తన కచేరీలలో తరచుగా పాడే ‘ఇంత పరాకా! నా ఎదుట నిలచి పలుకుట నీకింత పరాకా!’ అనే నాద నామ క్రియ రాగంలోని కీర్తన వ్రాసినదీ సోదరులే.
ఈ యిద్దరూ కలిసి పాడుతోంటే జోడు నాదస్వర వాద్యాలు, నాదం వినిపించేదట. వారి కీర్తనలు రాసికంటే వాసిలో మిన్న. ప్రముఖ వైణికురాలు వీణధనమ్మాళ్ అమ్మమ్మ కామాక్షమ్మ. ఈ ఆనయ్యర్ సోదరుల శిష్యురాలు, నాట్యం కూడా చేసేది. శ్యామశాస్ర్తీ పుత్రుడైన సుబ్బరాయ శాస్ర్తీ శిష్యురాలై ఈ ఆనయ్యర్ సోదరుల కీర్తనలు నేర్చుకుని ప్రచారం చేసింది.
తమిళంలో ఆనందభైరవి రాగంలోని కీర్తనకు ధనమ్మాళ్ మనవరాలైన బాలసరస్వతి నృత్యం చేసేది. ‘ఉమాదాస’ ముద్రతో వుండే ఆనై కీర్తన శంకరాభరణం రాగంలోని ‘మహిమ తెలియ తరమా’ ఆనయ్యర్ సోదరులు తన్మయత్వంతో ఒళ్లు మరిచిపోయి పాడేవారట.
తంజావూరు నేలిన 2వ శరభోజి మహారాజు ఆస్థాన విద్వాంసులు. ‘మేళ రాగమాలిక నందించిన మహా వైద్యనాథన్‌కు జ్ఞాతులు.
ఇంగువ కట్టిన మూటలా ఆ యిద్దరూ మహా సంగీత విద్వాంసులవడంలో ఆశ్చర్యం లేదు. తిరువయ్యార్‌లోని ప్రణతార్తి హరునిపై, ధర్మసంవర్దనిపైన రచించిన ఈ సోదరుల కీర్తనలు చాలా ప్రసిద్ధమైనవి.
జ్ఞాన వైరాగ్య బోధకంగా వుండే ఈ కీర్తనలు సంగీత విద్వాంసులు విరివిగా గానం చేస్తారు. పెద్దపెద్ద సంస్థానాల్లో ఠీవిగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి గౌరవాన్ని పొందారు. శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవడమే అవార్డుగా భావించారు.
*

చిత్రం.. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్

- మల్లాది సూరిబాబు 9052765490