S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అత్తగారు - కొత్త కోరిక

‘దుర్గా.. ఒసే దుర్గా! ఎవ్వరూ పలకరేమే! అపూర్వా... ఒకసారి ఇటురా.. గొంతు నొప్పి పుట్టేటట్టు అరుస్తున్నా ఏ ఒక్కరూ పలకరు, పట్టించుకోరు.. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేక అందరూ కట్టకట్టుకుని ఎక్కడికన్నా వెళ్లారా?’ కాలుకు అడ్డం పడుతున్న తెల్లటి ధోవతిని సవరించుకుంటూ, గుమ్మాన్ని ఆసరాగా చేసుకుని హాల్లోకి వచ్చి అన్నది డెబ్బై ఆరేళ్ల అనసూయమ్మ.
‘అయ్యో అత్తయ్యా! వస్తున్నా! నేను వంటగదిలో నుంచి పలుకుతూనే ఉన్నాను... మీకు వినిపించినట్లు లేదు... అపూర్వ ఇంట్లో లేదు. ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్లింది.. ఏం కావాలో చెప్పండి’ అంటూ చేత్తో గరిట పట్టుకుని కొంగు సవరించుకుంటూ పరిగెత్తినట్లే వచ్చింది ఆమె కోడలు దుర్గ. పిలవగానే పలకకపోతే అత్తగారు ఎన్ని మాటలంటుందో ఆమెకు తెలుసు మరి!
‘అనవే అను! అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువా అని.. అత్తగారు గొంతు చించుకు అరుస్తుంటే పలకాల్సింది పోయి.. నాకే విన్పించలేదంటావా.. అయ్యో అత్తగారు పెద్దది ఏదో అవసరానికే పిలుస్తున్నది అనుకుని వెంటనే రావాల్సింది పోయి.. ఈ మధ్యే దాపురించిన వినికిడి లోపాన్ని ఎత్తిచూపుతూ నాకే విన్పించలేదంటున్నావు కానీలే...’
‘ఏదో హడావిడిలో ఉండి రావడం కొంచెం ఆలస్యమయింది గాని మీరనుకుంటున్నట్లు అటువంటిదేం లేదండి.. మీకేం కావాలో చెప్పండి!’ అంది దుర్గ, కొంచెం బాధ నిండిన గొంతుతో, అత్తగారి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ.
‘్భజనానికి వేళయిందా? గంట ఎంతయిందో తెలియడం లేదు.. మళ్లా మధ్యాహ్నం కాస్త కునుకు తీసిన తర్వాత పురాణ కాలక్షేపం చెయ్యాలి కూడానూ!’
‘పనె్నండున్నర అయినట్లుంది.. ఇదుగో పది నిమిషాల్లో వడ్డించేస్తాను.. పప్పులో పోపు పెట్టాలి అంతే!’
‘అపూర్వా! భోజనాలకు వేళయింది.. మామ్మకు వడ్డించాలి రా!’ అంది దుర్గ అప్పుడే గేటు తీసుకుని లోపలకు వస్తున్న కూతుర్ని చూసి.
* * *
‘అబ్బబ్బ! ఎవరే అక్కడ టీవీని అంత పెద్దగా పెట్టుకు చూస్తున్నారు?... దుర్గా ఎక్కడున్నావ్? నన్ను కాసేపు పురాణం చదువుకోనివ్వరా ఏమిటి?’ పెద్దగా కేక పెట్టింది అనసూయమ్మ, హాలులో టీవీ చూస్తున్న మనవరాలికి విన్పించేటట్లు.
‘అపూర్వా! టీవీ సౌండ్ తగ్గించి చూడండి... పెద్దగా ఆ నవ్వులేంటి. ఎంత కామెడీ సీన్ అయితే మాత్రం అవతల మామ్మ చదువుకోడానికి ఇబ్బంది పడుతుంటే!’ అత్తగారు కూర్చున్న గది తలుపు కొంచెం దగ్గరకు వేస్తూ అంది దుర్గ కూతుర్ని, కూతురు స్నేహితురాలు రవళిని చూస్తూ.
‘అబ్బ పోమ్మా! హాలీడేస్‌లో కూడా హ్యాపీగా టీవీ చూడనివ్వరు!’ అంది అపూర్వ రిమోట్‌తో వాల్యూమ్‌ను అయిష్టంగానే తగ్గిస్తూ.
తరువాత పది నిమిషాల్లోనే-
‘ఏమేవ్ దుర్గా! ఎన్నిసార్లు చెప్పి తగలడను.. నేను పురాణం చదువుకోవాలా వద్దా!.. ఎంత గొంతు చించుకున్నా ఆ టీవీ గోల తగ్గించరేం!’ అరుస్తూనే టీవీ ఉన్న హాల్లోకి వచ్చింది కాలు సవరించుకుంటూ అనసూయమ్మ చేతి కర్ర సాయంతో.
‘అపూర్వా! పెద్దగా కేక పెడుతూనే దుర్గ హాల్లోకి వచ్చింది వంటింట్లో చేస్తున్న పనిని వదిలేసి.
‘అమ్మా! ఎడ్వర్టయిజ్‌మెంట్ వచ్చిందే.. అందుకే సౌండ్ సడన్‌గా పెరిగింది.. నేనేం పెంచలేదు!’ వెంటనే అన్నది అపూర్వ అందులో తన తప్పేం లేదన్నట్లుగా.
‘పోనీ.. మామ్మ పురాణం చదువుకోడం అయ్యేంత వరకయినా రవళి వాళ్లింటికి వెళ్లి కూర్చోవచ్చు కదా!’ అన్నది దుర్గ వాళ్ల వలన అత్తగారు ఇబ్బంది పడకూడదన్నట్లుగా.
రవళి వాళ్లిల్లు ఆ వీధి చివరే.
‘పోమ్మా! ఎప్పుడూ ఇట్లాగే మాట్లాడతావ్!’ అంటూనే స్నేహితురాలు రవళి చేయి గుంజుతూ తీసుకు వెళ్లింది అయిష్టంగా అపూర్వ.
‘ఏంటే దుర్గా! టీవీలో ఏదో చెబుతున్నారు.. దేని గురించి?’ అంది అనసూయమ్మ టీవీ మీద నుండి దృష్టి మరల్చకుండానే కోడల్ని ఉద్దేశించి.
అత్తగారి మాటలతో టీవీ రిమోట్ తీసుకుని సౌండ్ పెంచుతూ, ‘అదా అత్తయ్యగారూ! పాత మాయాబజార్ సినిమా ఉందిగా.. తెలుపు నలుపులో ఉన్నదాన్ని ఈ మధ్య రంగుల్లోకి మార్చారు.. ఆ సినిమా టీవీలో వస్తుందిట!’ అంది అత్తగారి ప్రశ్నకు సమాధానంగా.
‘అవునా! ఎప్పుడటా?’
‘దానికి ఇంకా ఐదారు రోజులు టైం ఉన్నదిలేండి!’
‘అట్లాకాదే. సరిగ్గా ఎప్పుడు వస్తుందో గుర్తుపెట్టుకో.. అది ఎప్పుడో చిన్నతనంలో చూసిన సినిమా.. టీవీలోనే కదా వస్తోంది.. బయటకు వెళ్లాల్సిన పనేలేదు.. మనమూ చూద్దాం!’
‘సరే అత్తయ్యగారూ! మీకు ఆ రోజు పొద్దునే్న గుర్తు చేస్తాను.. మీరు పురాణం కూడా ముందే చదువుకుని కూర్చోవచ్చు!’ అంది అత్తగారికి సలహా ఇస్తున్నట్లుగా దుర్గ.
‘గుర్తు చేయటమే కాదు.. ఆ రోజు తింటానికి ఏమన్నా చేసి అట్టిపెట్టు.. బజ్జీలు చేయి.. శనగపిండి నాకు సరిపడదు తెలుసు కదా!’
‘గోధుమ పిండితో చేస్తాను లెండి’
* * *
‘అరే! రోహన్! అడ్వర్టయిజ్‌మెంట్ వస్తోంది కదరా.. అందులో కలర్ మాయాబజార్ గురించి చెబుతున్నారల్లే వున్నది చూడు.. ఎప్పుడు వస్తుందో గుర్తు పెట్టుకో.. మామ్మ చూస్తుందిట!’ పెద్దగా అంది వంటింట్లో నుంచి దుర్గ హాల్లో టీవీ చూస్తున్న కొడుకుతో మూడు రోజుల తరువాత.
‘అదా అమ్మా! ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు!’ చెప్పాడు తల్లికి రోహన్.
‘ఏంటి, ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకా.. మీరు చూడటానికి వీల్లేదు అమ్మా! సరిగ్గా అదే టైంకు నా ఫేవరేట్ హీరో సినిమా వస్తుంది. నేను మూడు రోజులబట్టి చెబుతునే ఉన్నాగా!’ అని పెద్దగా అంది అపూర్వ, టీవీని ముందుగా ఆ టైంకు ఫిక్స్ చేసుకున్నానని తల్లికి గుర్తుచేస్తూ.
‘అయితే నీ ఫ్రెండ్ రవళి వాళ్లింట్లో చూడు! దానికి పెద్ద సమస్యేముంది!’ అంటూ కొంగుతో తడి చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది దుర్గ.
‘అక్కడ కేబుల్ కనెక్షన్ ప్రాబ్లం వున్నది. నిన్నటి నుండి వాళ్ల టీవీ రావటంలేదు’ అంది అపూర్వ కోపం, విసుగు కలిసిన గొంతుకతో.
‘ఇంకా రెండు రోజులు టైం వున్నదిగా ఈలోగా వస్తుందిలే.. కంగారు పడతావు దేనికి!’ అంది దుర్గ కూతురుకి సర్ది చెబుతూ.
‘నాన్నా! చూడు అమ్మ! ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న నాకిష్టమైన సినిమా వస్తుంటే, ఆ టైంకే మామ్మ ఏదో పాత తెలుగు సినిమా చూడాలనుకుంటున్నదని నన్ను టీవీ చూడకుండా చేస్తోంది అమ్మ! నువ్వే చెప్పు.. నాకు తెలీదు, నేను చూడాలంతే!’ ఎలాగయినా తల్లికి సర్ది చెప్పమన్నట్లుగా గోముగా అంది అపూర్వ అప్పుడే వచ్చిన తండ్రిని చూస్తూ.
‘అది కాదండి! మాయాబజార్ కలర్‌లో వస్తుంటే అత్తయ్యగారు చూడాలనుకుంటోంది! అంతే!’ అంది దుర్గ విషయాన్ని సింపుల్‌గా తేల్చేస్తూ.
‘ఆఫీసు నుండి రాగానే గోల! రెండు రోజులు టైం ఉందిగా.. ఇంకో టీవీ తెచ్చి పడేస్తాలే!’ అన్నాడు దుర్గ భర్త గోపాల్, సమస్యకు పరిష్కారం చెబుతున్నట్లుగా.
‘కూతుర్ని బాగా గారాబం చేసింది. ఇప్పుడది చెప్పిన మాట వినకుండా వచ్చింది... అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా అని!’ అనసూయమ్మ కొడుకుతో, కోడలి మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పింది.
‘అదేం లేదు లెండి అత్తయ్యగారు! చిన్నపిల్ల దానికి నేను సర్దిచెబ్తాగా.. ఏదో అంటుంటుంది అంతే!’
‘దాన్ని వెనకేసుకొస్తుండు.. ఇప్పుడేం ఖర్మ... మొన్న కూడా అంది.. నాకు విన్పిస్తునే ఉందిలే - ఎట్లాగయినా పెద్దది. పైగా కాస్తో కూస్తో విన్పించడం మానేసిందిగా అని.. పెద్దముండననే గౌరవం కూడా లేకుండా పోయింది నాకు ఇంట్లో’ అంటూనే తన గదిలోకి వెళ్లింది అనసూయమ్మ.
‘అలా అనొచ్చుటే.. మామ్మ చూడు ఎంత బాధపడుతున్నదో.. ఎప్పుడూ ఆమె టీవీ చూడాలంటున్నదా చెప్పు.. అయినా రెండు రోజులు ఉందిగా.. ఈలోగా రవళి వాళ్లింట్లో కేబుల్ బాగవుతుందిలే!’ అంది కూతురున అనునయిస్తూ.
* * *
‘అమ్మా! గుర్తు చేయమన్నావుగా.. ఈ రోజు మధ్యాహ్నమే మామ్మ చూడాలనుకున్న సినిమా వచ్చేది!’ అన్నాడు రోహన్ అటుగా వచ్చిన తల్లిని చూస్తూ.
‘అవును కదే దుర్గా! వేడివేడిగా బజ్జీలు చేసి పెడ్తానన్నావు గుర్తుందిగా! నేను నా పనులు తొందరగా ముగించుకుంటాను!’ అన్నది మనవడి మాటలు విన్న అనసూయమ్మ హాల్లోకి వస్తూ.
‘అలాగే అత్తయ్యగారూ! గుర్తున్నది లేండి!’ అంది దుర్గ అత్తగారి మాటలకు, రవళి వాళ్లింట్లో కేబుల్ ఇంకా బాగయిందో లేదో అని మనసులోనే అనుకుంటూ. ఒకప్పుడు ఎప్పుడూ టీవీ చూడని అత్తగారు ఒక్కసారి దాంట్లో వచ్చే ఆ సినిమాని చూడాలని మనసు పడుతుండటంతో కాదనలేదు. మరోవైపు కూతురి పరీక్షలు అయిపోయి మరో ఛానల్‌లో వచ్చే తనకిష్టమయిన హీరో వున్న సినిమా చూడాలని ముందుగానే ఫిక్స్ చేసుకున్నది. అదీ ఎప్పుడూ పెద్దపెద్ద కోరికలు కోరదు. ఏం చేయాలో తెలియటం లేదు దుర్గకు. ఆలోచనలన్నీ గజిబిజిగా తయారవుతున్నాయి.
రవళి వాళ్ల కేబుల్ కనెక్షన్ బాగుకాకపోతే కూతుర్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకుండా ఉన్నది. పోనీయ్ అదే టైంలో దాన్ని వాళ్ల నాన్నతో ఏదైనా సినిమాకు బయట థియేటర్‌కు పంపిద్దామంటే ఆ రోజంతా బిజీ అని ఆయన పొద్దునే్న చెప్పేశారు. తనే వెళ్దామంటే అత్తగారిని ఒంటరిగా వదిలి వెళ్లటం కుదరదు.
రెండు రోజులబట్టీ ఎటూ తోచక కలవరపడుతోంది దుర్గ.
‘రవళి వాళ్ల కేబుల్ బాగయిందో లేదో ముందు తెలుసుకోవాలి.. కూతుర్ని
అడిగితే గఁయ్‌మంటుంది. అక్కడ బాగు కాలేదో ఇంట్లో జరగబోయే యుద్ధాన్ని ఎట్లా తట్టుకోవాలో!’ అని అనుకున్నది మనసులోనే.
రవళికే ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది ఎందుకొచ్చిన గుంజాటన అని అనుకుంటూ, అపూర్వ స్నానానికి వెళ్లగానే రవళి నంబర్‌కు ఫోన్ చేసింది దుర్గ.
‘హలో అపూర్వా! ఏంటి చెప్పు?’ అంది రవళి అటు ఫోన్ ఆన్ చేస్తూనే.
‘రవళీ! నేను అపూర్వా వాళ్ల అమ్మని.. ఈ రోజు ట్యూషన్ ఉందో లేదో కనుక్కుందామని చేస్తున్నాను.. అది ఇప్పుడే లేచింది.. అందుకని.. ఆఁ సరే.. మీ ఇంట్లో టీవీ వస్తున్నది కదా!’ క్యాజువల్‌గా అడిగినట్లుగా అడిగింది దుర్గ విషయం రాబట్టాలని.
‘ఆంటీ! మీరా... ట్యూషన్ ఉన్నది ఆంటీ.. మా ఫేవరిట్ హీరో సినిమా కూడా టీవీలో వున్నది కదా, అది మొదలవ్వటానికి ఓ గంట ముందు ట్యూషన్ అయిపోతుంది.. ఇవాళ మేం ఫుల్ బిజీ ఆంటీ.. అపూర్వ మీకు చెప్పలేదా! మా ఇంట్లో కేబుల్ అతను వచ్చి కనెక్షన్ సరిచేయలేదు ఆంటీ.. ఫోన్లు చేస్తునే ఉన్నా!’ చావు కబురు చల్లగా చెప్పింది రవళి.
‘అమ్మా! నువ్వు రవళికి ఫోన్ చేసావు కదూ, నేను విన్నానే్ల... వాళ్ల కేబుల్ కనెక్షన్ ఇంకా బాగుకాలేదు.. నేను మధ్యాహ్నం నాకు కావాల్సిన సినిమాను చూసేది చూసేదే... నువ్వు మామ్మను ఎలా సముదాయించుకుంటావో నీ ఇష్టం!’ తెగేసి చెప్పింది అపూర్వ.
‘ఏమే దుర్గా! మాయబజారు సినిమా వచ్చేది మూడు గంటలకు కదూ.. నా పనులన్నీ ఈలోగా పూర్తి చేసుకుంటాను... బజ్జీలు చేయటానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా!... నీ కూతురు ఆ టైంకు అడ్డు పడకుండా ఏం చెప్పుకుంటావో చెప్పుకో.. నేను మాత్రం ఆ సినిమా చూసి తీరాలి!’ మరోసారి కోడలికి గుర్తుచేస్తూ అన్నది అనసూయమ్మ.
* * *
‘ఇప్పటికి టిఫిన్ల పని అయింది.. ఇక భోజనాల ఏర్పాట్లు చేయాలి.. టీవీ గురించి తరువాత ఆలోచిద్దాం!’ అని మనసులోనే అనుకుంటూ వంటింట్లోకి వెళ్లింది దుర్గ.
అనుకున్నట్లుగానే భోజనాలు, వంటగదిలో సర్దుడు కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు దాటింది. తీరిగ్గా ముందున్న సమస్య గురించి ఆలోచిస్తూ హాల్లో సోఫాలో వచ్చి కూర్చున్నది దుర్గ. అప్పటికే అపూర్వ, స్నేహితురాలు రవళి టీవీ ముందు చేరి మూడు గంటలకు రాబోయే తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
‘అపూర్వా! పొద్దుటి నుండి నువ్వు చూస్తూనే ఉన్నావుగా.. ఈ ఒక్కరోజు మూడు గంటలకు మామ్మను మాయాబజారు చూడనీయవే... అదీ సూపర్ హిట్ సినిమానే, తెలుసా!... నువ్వూ, నీ ఫ్రెండు కూడా ఎంజాయ్ చేయవచ్చు...’ అంది దుర్గ వాళ్లిద్దరి మాటల్లో కల్పించుకుంటూ.
‘నువ్వెన్ని చెప్పినా నేను వినను గాక వినను... మాయాబజారు సినిమా మాత్రం పెట్టనీయను... యాభై ఏళ్ల క్రితం సినిమాని ఇప్పుడు చూసేదేమిటి?’ అన్నది అరుస్తున్నట్లుగా కోపంగా అపూర్వ.
తల్లీ కూతుళ్ల నడుమ వాగ్వివాదం ఘాటుగా జరుగుతుండగానే గడియారం ముల్లు టైమ్ మూడు కావస్తున్నట్లు చూపించింది.
‘దుర్గా! ఎక్కడున్నావ్... మూడు కావస్తోంది.. హాల్లో నా కుర్చీ తెచ్చి వేయి.. వేరే వాటిల్లో కూర్చుంటే నాకు హాయిగా ఉండదు!’ అంటూనే హాల్లోకి రావటానికి చేతి కర్ర తీసుకుంటుండగా పెద్ద శబ్దంతో ఆ వీధిలోనే వున్న ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవటం, కరెంట్ పోవటం ఒకేసారి జరిగాయి.
‘అబ్బా! ఈ చెత్త కరెంటు ఇప్పుడే పోవాలా...్ఛ!’ అనుకుంటూ విచారంగా ముఖం ముఖం చూసుకుంటున్నారు అపూర్వ, రవళి.
‘ఇదేంటి.. సమయానికే కరెంటు పోయింది.. ఐదు నిమిషాల్లో ఎప్పుడూ వచ్చినట్లే వస్తుందేమోలే!’ అని దుర్గ మనసును సమాధాన పరచుకుంటూండగానే పక్కింట్లో ఉండే రోహన్ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘ఆంటీ! మన వీధిలో వున్న ట్రాన్స్‌ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంట, పొగ వచ్చి అది కాస్తా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది... రోడ్డంతా ఆయిల్ పడింది.. మళ్ళా కరెంట్ రావాలంటే దాన్ని తీసేసి మరోటి పెట్టాలిట... రేపటి వరకూ కరెంట్ రాదని చెప్పుకుంటున్నారు!’ అన్నాడు పెద్దగా ఒగరుస్తూ.
‘బాప్‌రే.. ఇప్పుడేం చెయ్యాలి.. ఎలాగో అలాగా కూతుర్ని ఒప్పించవచ్చులే అనుకుంటుంటే మధ్యలో ఇదో గోలా?... ఇక అత్తగారి నస భరించటం కష్టం... ఏం చేయాలో’ అని దుర్గ ఒకవైపు కంగారు పడుతుంటే, ‘దుర్గా! నేను పెద్ద గొంతు పెట్టుకుని అరుస్తున్నా. టీవీ ముందు నా కుర్చీ తీసుకు వచ్చి వేయరేం.. బజ్జీలు చేయటం మొదలుపెట్టావా లేదా.. మళ్ళా అదుగో అంటే ఆరునెల్లు చేస్తావ్.. మెత్తగా ఉండాలి సుమా! కరకరలాడుతుంటే ఇష్టమేగాని, నవల్లేను..’ తన ధోరణిలో తను చెప్పుకు పోతోంది జరుగుతున్న గొడవ వినబడని అనసూయమ్మ.
*

-మల్లాది మంజుల.. 9492062414