S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సేవకుడు

అలవాట్లు వదలడం కష్టం. మరణించి ఏభై ఏళ్లైనా సరే.
నేను మిమోసా హాల్‌లో బట్లర్‌గా పని చేసేప్పుడు డోర్ బెల్ మోగితే దాన్ని తెరవడం నా బాధ్యతల్లో ఒకటి. ఇప్పుడు నేను ఆ పని చేయక్కర్లేదని మర్చిపోతూంటాను. తలుపు దానంతట అదే తెరచుకోవడం చూసి అంతా భయపడుతూంటారు. ఇప్పుడు మిస్ పోలీ లేదా మార్తా తలుపు తెరుస్తూంటారు.
కాని ఈ రోజు నేను తలుపు చప్పుడు వినిపించినప్పుడు దాని దగ్గరే ఉన్నాను. నేను ఎవరో మర్చిపోయి తలుపు తెరిచాను. లోపలకి వచ్చిన మిస్టర్ క్లేబర్న్ ఖాళీ హాల్ వంక తెల్లబోతూ చూశాను. నేను అతని టోపీని తీసుకోకూడదని గుర్తొచ్చింది. అది నా మరో పాత అలవాటు.
మిస్ పోలీ వంట గదిలోంచి వేగంగా హాల్లోకి వచ్చింది. అతన్ని చూసి ఆనందంగా చెప్పింది.
‘మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది’
ఆమె అతని టోపీని తీసి, చిన్న బల్ల మీద ఉంచి అతణ్ణి పార్లర్‌లోకి తీసుకెళ్లింది. నేను వాళ్లని అనుసరించాను.
మిస్ పోలీ అప్పటికే బల్ల మీద టీని సిద్ధం చేసింది. ఒకప్పుడు అదీ నా పనే. నాకు మిస్టర్ క్లేబర్న్ నచ్చలేదు. ఖరీదుగా కనిపించే చవక సూట్‌ని ధరించిన అతను మిస్ పోలీతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న యువకుడు. అతను టీ తాగుతూ చెప్పాడు.
‘ఇంత పెద్ద ఇంటిని మెయిన్‌టెయిన్ చేయడం చాలా చాకిరీ కదా?’
‘ఏది అవసరమో అది చేయాలి కదా?’ ఆమె నవ్వుతూ చెప్పింది.
అతనికి మిమోసా హాల్ గురించే కాక, పోలీకి ఉన్న ఐదు వందల ఎకరాల పొలం, కలప కోసం పెంచే అడవి గురించి కూడా తెలుసు అనుకుంటా. వర్జీనియా రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో మిస్ పోలీ చాలా ధనవంతురాలని, ఆమె అన్న విదేశంలో మరణించాడని ఎవర్ని అడిగినా చెప్తారు.
క్లే ఆమె వేళ్లకున్న ఉంగరాలని దురాశగా చూడటం, ఇంకాస్త టీ పోసుకోవడం గమనించాను. తర్వాత అతను ఆమె చేతిని స్పర్శిస్తూ ఆమెని చూసి నవ్వాడు.
‘మార్తా చాక్లెట్ కేక్‌ని చేస్తోంది. వెళ్లి తెస్తాను’ చెప్పి మిస్ పోలీ లేచి వంట గదిలోకి వెళ్లింది.
నిమిషం తర్వాత అతను కూడా లేచి మేంటల్ దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్న వెండి వస్తువులని తీసి స్టెర్లింగ్ హాల్ మార్క్ కోసం వెదికాడు. తర్వాత గోడల మీది చిత్రాలని, నేల మీద పరిచిన కార్పెట్ మందాన్ని, కంటికి కనపడే ప్రతీ వస్తువు విలువని అంచనా వేయసాగాడు. ఆ గదిలో తను ఒక్కడే ఉన్నాడని అనుకున్నాడు. అతను డబ్బు మనిషని ఇట్టే గ్రహించాను.
మిస్ పోలీకి, నాకు మధ్య ఓ అంగీకారం ఉంది. ఆమెకి నేనెవరో తెలుసు. నేను ఉండేది ఆమె ఇంట్లోనే అని తెలుసు. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు కూడా నన్ను చూసి భయపడతాయని పోలీకి తెలుసు. ఎప్పుడైనా వచ్చే దొంగలని తప్ప నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని ఆమె నాకు స్పష్టం చేసింది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె తల్లిని నేను సంరక్షించినట్లుగా ఆమెని కూడా సంరక్షించాల్సిన బాధ్యత నా మీద ఉందని మిస్ పోలీకి అర్థం కాదు. ఈ విషయంలో అన్ని సందర్భాల్లో కాకపోయినా ఒక్కోసారి నేను భూతంగా స్వతంత్రాన్ని తీసుకుంటూంటాను.
ఇప్పుడు కూడా తీసుకున్నాను. మిస్ పోలీ క్లేబర్న్‌ని తన భర్తగా అంగీకరించచ్చేమో కాని, నా వరకు అతను నిధిని వేటాడేవాడు. ఇదే అతని ఆఖరి సందర్శన అవాలి.
నేను గదిలోని కాంతిని తగ్గించడంతో అది ఆరంభించాను. అతను భయంతో చుట్టూ చూసి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. అతని చుట్టూ ఉన్న గాలి అకస్మాత్తుగా బాగా చల్లబడింది. తన చేతులని ఫైర్ ప్లేస్‌లోని మంట వైపు చాపాడు. వెంటనే అది ఆరిపోయింది. టీ కప్పుని అందుకోబోయాడు. అది గాల్లో అతనికి దూరంగా వెళ్లిపోయింది. క్లే మొహంలోని భావాల్ని బట్టి అతను మిమోసా హాల్లో దెయ్యం ఉందనే వదంతిని గుర్తు తెచ్చుకుంటున్నాడని గ్రహించాను.
గది మూల చెక్క నేల చేసిన చప్పుడుకి అతను ఉలిక్కిపడి గెంతాడు. హాల్లోంచి లివింగ్ రూంలోకి గల తలుపు నెమ్మదిగా తెరచుకోవడం చూశాడు. మంటని ఎగదోసే ఇనప పరికరాలు అకస్మాత్తుగా ఒరిపిడికి చప్పుడు చేయడం విన్నాడు. పోకర్ (ఇనప పటకారు) గాల్లో పైకి లేచి అతని తల చుట్టూ తిరగసాగింది. అతను తన పాలిపోయిన మొహాన్ని కిందకి వంచాడు. మరో నిమిషం ఆగితే బయటకి పరిగెత్తేవాడే. కాని పోలీ వంక గదిలోంచి లివింగ్ రూంలోకి వచ్చే చప్పుడు విని, గదిలో మళ్లీ కాంతిని పెంచి, పోకర్ని యథాస్థానంలో ఉంచాను. ఆమె చాక్లెట్ కేక్‌తో వచ్చేసరికి ఫైర్ ప్లేస్‌లోని నిప్పు మళ్లీ రాజుకుంది.
‘మిస్టర్ క్లేబర్న్? ఏమైంది?’ ఆమె అతని మొహంలోని భయాన్ని గమనించి అడిగింది.
అతను మాట్లాడే ముందు రెండు గుటకలు వేశాడు.
‘ఏం కాలేదు మిస్ పోలీ. నాకు ఓ అర్జెంట్ పని గుర్తొచ్చింది. వెంటనే వెళ్తున్నందుకు నన్ను క్షమించండి’ చెప్పి అతను వేగంగా తలుపు వైపు నడిచాడు.
‘అలాగే మిస్టర్ క్లేబర్న్. మీరు వచ్చినందుకు సంతోషం’ ఆమె ఫైర్ ప్లేస్ మీది మేంటెల్ వంక తీవ్రంగా చూసింది.
నేను వెళ్లిపోయే అతని తల మీద టోపీని ఉంచాను. చిన్నగా మూలిగి అతను గుమ్మంలోంచి బయటకి వెళ్లిపోగానే చప్పుడయ్యేలా తలుపు మూశాను. మిస్ పోలీకి కోపం వస్తుందని అనుకున్నాను కూడా. కోపంగా కుడిపాదాన్ని నేల మీద తాటించి చుట్టూ చూసి చెప్పింది.
‘జోనాథన్! వంట గదిలోకి రా. ఈ క్షణమే’
ఆమె అక్కడికి వెళ్లి రెండు వెండి కొవ్వొత్తులున్న స్టేండ్స్ వంక చూసి చెప్పింది.
‘జోనాథన్. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. సమాధానం చెప్పు’
కొవ్వొత్తి స్టేండ్ కొద్దిగా కుడివైపు వాలి మళ్లీ యథాస్థానంలోకి వచ్చింది. దాని అర్థం నేను ‘అవును’ అని చెప్పడం. అది ఎడం వైపు వంగితే ‘నో’ అని అర్థం. రెండు కొవ్వొత్తుల స్టేండ్స్ ఒకేసారి కుడివైపు వంగితే ‘కావచ్చు’ అని, ఎడం వైపు ఒరిగితే ‘నాకు తెలీదు’ అని అర్థం. మా ఇద్దరి మధ్య సంభాషణ ఎప్పుడూ సమస్యే. మాకు ఉన్నదల్లా ఈ పద్ధతే. మిస్ పోలీ నా గురించి అర్థం చేసుకున్నాక ఆమె తల్లి ఈ ఏర్పాటు గురించి పోలీకి చెప్పింది. ఆ రోజుల్లో సేవకులకి చదవడం, రాయడం తెలీదని కూడా చెప్పింది.
‘నువ్వు క్లేబర్న్ భయపెట్టి తోలేసావు. అవునా?’
నేను అవునని చెప్పాను. ఓ కేండిల్ స్టాండ్ కుడివైపు కొద్దిగా వంగింది.
‘ఈ ఏడాది నువ్వు భయపెట్టి పంపించేసిన మూడో పెళ్లికొడుకు ఇతను. నీకు అతను నచ్చలేదన్నదేగా నీ సమాధానం?’
రెండు కొవ్వొత్తి స్టేండ్స్ కుడి వైపునకు కొద్దిగా వంగాయి. ‘నో’కన్నా ‘కావచ్చు’ మంచి సమాధానం అనుకున్నాను.
‘అతను నాకు సరిపడడని అనుకున్నావా?’
కొవ్వొత్తి స్టేండ్ కుడివైపునకు కొద్దిగా వంగింది. ‘అవును’ అని చెప్పాను.
‘అతను నా డబ్బు చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా?’
‘అవును’
‘నువ్వు అనుకున్నది నిజం కావచ్చు. ఇతను నాకూ నచ్చలేదు. కాని జోనాథన్. నేను జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండాలా?’ కుడి పాదాన్ని నేలకి తాటించి కోపంగా అడిగింది.
‘లేదు’ చెప్పాను.
ఆమె తల్లికి లాగానే పోలీకి కూడా కోపం ఎక్కువసేపు ఉండదు. అకస్మాత్తుగా పోలీ నవ్వసాగింది. ఖాళీ గదిలో కొవ్వొత్తి స్టేండ్‌తో మాట్లాడి తనని చూసిన వారు ఏమనుకుంటారనే ఆలోచన వల్ల వచ్చిన నవ్వది. మధ్యలో మార్తా ఆ గదిలోకి వచ్చి కొవ్వొత్తి స్టేండ్‌లు కదలడం చూడకూడదని నా కోరిక. ఆమె కూడా భయపడి ఉద్యోగం మానేస్తే ఈ రోజుల్లో మంచి పనిమనుషులు దొరకడం కష్టం’
‘జోనాథన్! నువ్వు నా బాగు కోరతావని నాకు తెలుసు. మనిద్దరికీ నచ్చే పెళ్లికొడుకు తారసపడతాడంటావా?’
జీవించి ఉన్న వాళ్లలానే నాక్కూడా భవిష్యత్ తెలీదు. కాని ఈ విషయం మాత్రం ఎందుకో రూఢీగా తెలుసు. కుడి కొవ్వొత్తి స్టేండ్ అకస్మాత్తుగా గాల్లోకి లేచి, గదిలో చుట్టూ తిరుగుతూ టేబిల్ కిందకి వెళ్లి పైకి వచ్చి మళ్లీ యథాస్థానంలో కూర్చుంది.
‘సరే’ ఆమె హాల్ తలుపు వైపు నడుస్తూ ఆగి, వెనక్కి తిరిగి చెప్పింది.
‘ఇంకోసారి ననే్న నిర్ణయించుకోనీ.

నువ్వు కల్పించుకోక. విన్నావా?’
మిస్ పోలీ తల్లి కూడా ఆఖరి మాట తనదే అవాలని అనుకునేది. కొవ్వొత్తి స్టేండ్ కొద్దిగా కుడివైపునకు వంగింది.
ఓ రోజు పోలీ కుటుంబ బైబిల్‌ని తెరచి చదివి అడిగింది.
‘ఏన్సన్ పోలార్డ్ పధ్నాలుగు మే 1872న మరణించాడు.. నువ్వు నా తాతవా?’
‘నో’ నా పద్ధతిలో చెప్పాను.
ఆమె దాని కింది వాక్యాన్ని చదివింది.
‘ఏన్సన్ పోలార్డ్. అతని విధేయత గల సేవకుడు జోనాథన్. ఓ తుఫాన్లో పిడుగుపాటుతో మరణించాడు... జోనాథన్? నువ్వు జోనాథన్‌వా?’
‘అవును’ జవాబు చెప్పాను.
‘నువ్వు ఇక్కడ ఉంటే మా తాత ఏన్సన్ ఎక్కడ?’
చెంచాతో నేల వైపు చూపించాను.
‘కిందా? ఓ అర్థమైంది. జోనాథన్. మా కుటుంబానికి నువ్వు చాలా సేవ చేసావు’
ఆ తర్వాత కూడా చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కాని ఇది పోలీకి ఎలా చెప్పగలను?
* * *
కొద్ది రోజుల తర్వాత పోలీ ఓ గుర్రాన్ని దొంగిలించినందుకు దాదాపుగా అరెస్ట్ కాబోయింది. అది వారి కుటుంబానికి అవమానమే కాక ఆ కౌంటీ అంతా ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకునే విషయం అయేది. గుర్రాలని దొంగిలించడం ఆ రోజుల్లో పెద్ద నేరం. మోటార్ కార్లు అప్పుడే కొత్తగా వస్తున్నాయి.
షరీఫ్ వచ్చి పోలీని ప్రశ్నించాడు.
‘నేను అధికారికంగా వచ్చాను. మీ పక్కింటి సింప్సన్ ఇంటిని మిస్టర్ జేమ్స్ కొన్నాడని తెలుసా?’
‘విన్నాను. కాని నేను అతన్ని కలవలేదు’
‘అతను గుర్రాలని పెంచుతున్నాడు. విలువైన ఓ గుర్రం మాయం అయిందని ఫిర్యాదు చేశాడు’
‘ఐతే?’ పోలీ ప్రశ్నించింది.
‘జేమ్స్ సేవకుల్లో ఒకరు ఆ గుర్రాన్ని మీ గుర్రపుశాల బయట చూశానని చెప్పాడు’
‘అలాగా? అది తప్పించుకుని అటూ ఇటూ తిరుగుతూ వచ్చి ఉంటుంది’
‘కాదు. అది లోపల ఉండగా దాని గేటు బయట గడియ పెట్టి ఉంది’
‘అంటే?... షెరీఫ్! నేనా గుర్రాన్ని దొంగిలించానని మీరు అనుకుంటే అది తప్పు’ కుడి పాదంతో నేలని తన్నుతూ చెప్పింది.
‘ఏదైనా పొరపాటు జరిగి ఉండచ్చు’
‘అవును. నేనా గుర్రాన్ని దొంగిలించానని జేమ్స్ అనుకుంటే అతన్ని ఇక్కడికి వచ్చి ఆ సంగతి చెప్పమనండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ షెరీఫ్’
షెరీఫ్ వెళ్లిపోయాడు. పోలీ తలుపు మూసి గట్టిగా అరిచింది.
‘జోనాథన్! ఇక్కడే ఉన్నావా?’
కొవ్వొత్తి స్టేండ్ జవాబు చెప్పింది. ‘అవును’
‘మన ఆవరణలోకి కొత్త గుర్రం వచ్చిందా?’
‘అవును’
‘అది వాళ్ల పొరపాటేనా?’
‘అవును’
‘సరే’
కొవ్వొత్తి స్టేండ్స్ ఎప్పుడూ నిజమే చెప్పవు.
* * *
ఆ సాయంత్రం తలుపు చప్పుడు విని పోలీ తలుపు తెరిస్తే బయట నిలబడ్డ యువకుడు మర్యాదగా తల మీది టోపీని తీసి అడిగాడు.
‘మిస్ పోలీ? గుడీవినింగ్. నా పేరు జేమ్స్’
‘మీరు సింప్సన్ ఇంటిని కొన్నారని విన్నాను. గుర్రాలని పెంచుతున్నారని కూడా’
‘అవును మిస్ పోలీ. నేను లోపలకి రావచ్చా?’ అతను నవ్వుతూ అడిగాడు.
ఆమె కొద్దిగా ఇబ్బంది పడటం గమనించాను. ఫైర్ ప్లేస్‌లో మంట లేదు. టీ కాని, కాఫీ కాని సిద్ధంగా లేవు. మార్తా రాకపోవడంతో పోలీ ఏప్రన్ ధరించి వంట చేస్తోంది. అయిష్టంగానే మర్యాద కోసం ఆహ్వానించింది.
వాళ్లు లోపలకి వచ్చేసరికి ఫైర్ ప్లేస్‌లో మంట రాజుకుని నాలుగు వైపులా కొవ్వొత్తులు వెలగసాగాయి. వెంటనే ఆమె కొవ్వొత్తుల స్టేండ్స్ వైపు చూసింది కాని ఏం మాట్లాడలేదు. అతని ఎదురుగా టీపాయ్ మీద టీ కప్పుల సెట్ సిద్ధంగా ఉంది. వంట గదిలోంచి టీ కెటిల్‌లోని నీరు మరిగినట్లుగా ఈల వినిపించింది.
‘మిమ్మల్ని టీ పిలుస్తున్నట్లుంది?’ అతను నవ్వుతూ అడిగాడు.
‘అవును. టీ తాగుతారా?’ ఆమె అడిగింది.
‘మీకు ఇబ్బంది లేకపోతేనే’
పోలీ వంట గదిలో ముక్కలు చేసి సిద్ధంగా ఉన్న ఫ్రూట్ కేక్‌ని చూసి గొంతు తగ్గించి అడిగింది.
‘జోనాథన్! ఏం చేస్తున్నావు?’
ఆమె ఆ ట్రేతో లివింగ్ రూంలోకి వెళ్లింది.
‘మీ ఇల్లు చాలా బావుంది మిస్ పోలీ. నేను ఇంకాస్త ముందు రావాల్సింది. కాని ఇంటి పనితో కుదరలేదు. నేను ఒక్కడ్నే ఉంటున్నాను. పనులన్నీ నేనే చేసుకోవాలి’
‘కాని మీరు వచ్చింది గుర్రం కోసం కదా?’ పోలీ ప్రశ్నించింది.
‘అవును. నేను రోజ్‌ని తప్ప మిమ్మల్ని తప్పు పట్టను. ఆ గుర్రాన్ని మీ గుర్రపుశాలలో చూశాను. దానంతట అదే వచ్చి ఉంటుంది’
‘ఏమిటి? మీ గుర్రం మా గుర్రపు శాలలో ఉందా?’ పోలీ కొవ్వొత్తుల స్టేండ్ వంక నిశ్శబ్దంగా కొద్దిసేపు చూసింది. తర్వాత అడిగింది.
‘మిస్టర్ జేమ్స్. దాని కోసం నా గుర్రపుశాలలో చూడాలని మీకు ఎందుకు అనిపించింది?’
‘దాని అడుగుజాడల్ని అనుసరించి వచ్చాను. అవి మీ గుర్రపుశాల దాకా ఉన్నాయి’
‘అది మా ఇంటికే ఎందుకు వచ్చింది?’ పోలీ ఆశ్చర్యంగా అడిగింది.
‘మా ఇంటి నించి మీ ఇంటి దాకా రోడ్డు మీద కొన్ని ఉలవలు కనిపించాయి. రోజ్‌కి ఉలవలంటే చాలా ఇష్టం. తెరచుకున్న గేట్లోంచి లోపలకి వచ్చాక చూసుకోకుండా ఎవరో గేట్‌ని మూసేసి ఉంటారు’
‘అసలు ఆ ఉలవలు మా ఇంటి దాకా ఎలా వచ్చాయి?’ పోలీ ఇంకా ఆశ్చర్యంగా అడిగింది.
అతను అందమైన పొరుగువాడు. బ్రహ్మచారి. సరదాకి గుర్రాలని పెంచుతాడు. పని వాళ్లని నియమించేంత డబ్బుంది. పోలీ, జేమ్స్ ఒకరి వంక మరొకరు చూసి మాట్లాడుకుంటూంటే ఆమెకి తగ్గ వరుడు దొరికాడని నాకు అనిపించింది. వాళ్ల రెండు టీ కప్పులూ ఖాళీ అయ్యాయి. పాత అలవాట్లు ఓ పట్టాన వదలవు కదా? నిప్పు రాజేయడం, ఫర్నిచర్ మీది దుమ్ముని దులపడం, డోర్‌బెల్ విని తలపు తెరవడం, టీ కప్పులని, వైన్ గ్లాసుల్ని నింపడం నా జీవితకాలపు అలవాటు. దాన్ని మర్చిపోలేక పోయాను. అప్పుడు నేను ఓ పొరపాటు చేశాను. చాలా పెద్ద పొరపాటు.
టీ పాట్ టేబిల్ మీద నించి లేచి మా అతిథి వైపు గాల్లోకి వెళ్లింది. రెండు కప్పులూ నింపాక అది మళ్లీ టేబిల్ మీద కూర్చుంది. పోలీ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి చెప్పింది.
‘జోనాథన్! జాగ్రత్త’
తర్వాత ఆమె తన అతిథి వైపు తిరిగి చెప్పింది.
‘్భయపడకండి మిస్టర్ జేమ్స్. భయపడాల్సిన అవసరం లేదు’
జేమ్స్ ఆపమన్నట్లుగా చేతిని పైకెత్తి నవ్వుతూ పోలీ వంక చూశాడు.
అది నిజమైన, నిర్భయమైన నవ్వు అని గ్రహించి నేను ఆనందపడ్డాను.
‘మిస్ పోలీ. మీరు అప్సెట్ అవకండి’
అతను హాల్లో చుట్టూ చూశాడు. తర్వాత పోలీని అడిగాడు.
‘జోనాథనా? మీకిది తెలుసా మిస్ పోలీ? నా అవసరాలని చూసుకునే ఒకరు నాకు కూడా మా ఇంట్లో ఉన్నారు’
పోలీ నమ్మలేనట్లుగా అతని వంక చూసింది.
‘అవును. మిస్ శాలీ సింప్సన్. నేను కొన్న ఇంట్లో ఆవిడ ఉంది’
పోలీ మొహంలోని ఊరటని అతను గమనించాడు.
‘అవును. ఈ శతాబ్దం మొదటి సంవత్సరంలో శాలీ మరణించినా ఇంకా వెళ్లలేదు. నాకు అవసరమైన సహాయాన్ని చేస్తూంటుంది’
మరుక్షణం పోలీ నవ్వింది. వారిద్దరూ కలిసి నవ్వసాగారు. అతను తన చేతిని అందించగానే పోలీ దాన్ని అందుకుంది.
బహుశ రహస్యాన్ని అర్థం చేసుకునే ఇద్దరూ దగ్గర అవుతారు. కొద్ది క్షణాల తర్వాత పోలీ గుసగుసగా చెప్పింది.
‘ఆ ఉలవలని ఎవరు పోసారో బహుశ మనకి ఎప్పటికీ తెలీదనుకుంటా’
మేంటెల్ మీది కొవ్వొత్తి స్టేండ్ కుడివైపునకు వంగింది. కాని వాళ్లు దాన్ని గమనించలేదు. నెమ్మదిగా అది యథాస్థానంలో కూర్చుంది. వారికి అది తెలుసా, లేదా అన్నది అనవసరం. నాకు తెలుసు.

*
(విలియం టీ లీవై కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి