S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చీనీ అనగా

ఛణా వణగ వెంధరా, దాని ఛెక్తి వెంధరా? అంతగలిసి తంతె మళ్ల. అంతు దొరకదంటరా’ అని రెండెద్దుల సంజీవరెడ్డి చిన్నప్పుడు బడిలో పాట పాడడం గుర్తుంది. (చైనా అనగ ఎంతరా? దాని శక్తి ఎంతరా?’ అని వాని కవి హృదయము. అప్పట్లో భారతదేశం, చైనాలకు యుద్ధం జరిగింది. కనుక దేశభక్తి పేరున శత్రుదేశాన్ని తక్కువ చేసి, ఉత్సాహం పెంచే ప్రయత్నంగా ఆ పాటలు పాడుకున్నాము. ఇవాళ చూస్తే ఇంట్లో చాట, జల్లెడ కూడ చైనాలో తయారయినవి వాడుకుంటున్నాము. ప్రపంచం అంతే!
మా అమ్మాయి ఉద్యోగం పేరున సింగపూర్ చేరుతు(కు)న్నది. అబ్బాయి సంవత్సరాలుగా అమెరికాయిలో ఉన్నా, నాకు ఎందుకో ఆ దేశానికి వెళ్లి చూడాలని మాత్రం గుబులు పుట్టలేదు. మలేషియా, ఇండొనేషియా, బర్మా లాంటి దేశాలను వివరంగా చూడాలని మాత్రం నాకు చాలా కాలంగా బలమయిన కోరిక ఉంది. స్వర్గీయ పందిరి కృష్ణమోహన్ గారు, ‘మీరు తప్పకుండా, యోగ్యకర్తా చూడాలండీ!’ అని ఒకటికి రెండుమార్లు చెప్పడం గుర్తుంది. యోగ్యకర్త అంటే జకార్తా. అంటే ఇండొనీషియా రాజధాని. అక్కడ భారతీయ సంస్కృతిక ఒక చిత్రమయిన రూపంలో కొనసాగుతున్నదని తెలుసు. ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు చైనా ప్రసక్తి వచ్చింది. ‘చైనాలో తిరిగి చూడడం కుదురుతుందా?’ అని అడిగాను. ‘ఎందుకు మా దేశం చూడదలుచుకున్నావు?’ అని ముందు వారు అడుగుతారట. పర్యాటకులు రావడం వాళ్లకు అంతగా నచ్చదేమో? ఇక చైనా, జపాన్‌లలో స్థానికుల సహాయం లేకుండా, మనంతగా తిరిగి అన్ని ప్రదేశాలు చూడగలగడం ఇంచుమించు అసాధ్యం అని కొంతకాలం క్రితమే అర్థమయింది. అందుకు కొన్ని పుస్తకాలు కారణం!
యువకుడుగా ఉన్నప్పుడు వామపంథా భావాలు నచ్చకుంటే, పొరపాటు కింద లెక్క, అని ఒక మాట ఉంది. యూనివర్సిటీలో ఉన్న కాలంలో చైనా, రష్యాల గురించి చాలా చదివాను. నవోదయలో ‘చైనీస్ లిటరేచర్’ మాసపత్రిక ప్రతులు దొరికేవి. అయితే అవి ఏ నెలకు ఆ నెలగా వచ్చేవి కావు. గుత్తులు గుత్తులుగా వచ్చేవి. వారి కవిత పద్ధతి అర్థమయేది కాదు. కథలు మూసగా ఉన్నట్టు తోచేది! ఆ పత్రికలో ఆర్ట్ పేపర్ అదనంగా వేసి అందమయిన పెయింటింగ్‌లు అచ్చువేసేవారు. అట్లాంటి చిత్తరువులు నా దగ్గర ఇంకా ఉన్నాయి.
ఈ మధ్యన సైన్స్ చరిత్ర గురించి ఒక పుస్తకం రాశాను. అందులో మొదట్లోనే చైనా, భారతదేశాల గురించి రాయవలసిన అవసరం వచ్చింది. చైనా వారి కాగితం, భారతీయుల అంకెలు లేకుంటే, సైన్స్, తద్వారా ప్రపంచం ఇంత త్వరగా, ఇంత దూరం వచ్చి ఉండేది కాదన్నది జగమెరిగిన సత్యం. చైనా వారు వేల సంవత్సరాల నాటి సంగతులను రికార్డు చేసి దాచుకున్నారు. వారు ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. పట్టు, తుపాకిమందు లాంటి వాటి గురించి ప్రపంచానికి తెలిపింది వారే. అయితే సైన్సు తెలివి మరీ ఎక్కువగా అవసరమయిన అంశాలు మాత్రం పడమటి వారి సాయం అందిన తరువాత మాత్రమే ముందుకు సాగాయని చైనా వారే చెపుతుంటారు. పర్వతాలకు దక్షిణంగా గల ప్రాంతాల నుండి ఏనుగు దంతం, సుగంధ ద్రవ్యాలు మరెన్నో విలువయిన వస్తువులను కానుకలుగా తెచ్చి చైనా ప్రభువులకు అందించారట. ఆ వచ్చిన వారు భారతీయులని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ప్రభువు ఎంతో సంతోషించాడు. తన తరఫున, వచ్చిన వారిని బహుమతులతో ముంచెత్తాడు. కానీ, అతిథులు తిరుగుదారిలో తాము సరిగా సాగి తమ దేశం చేరడం గురించి అనుమానంలో ఉన్నట్టు ఆయనకు తెలిసింది. అతిథుల కొరకు ప్రత్యేకమయిన రథాలు తయారు చేయించాడు. వాటిలో ముందు ఒక చిన్న మనిషి బొమ్మ ఉంది. ఆ బొమ్మ చేతిలో ఉన్న సూచిక ఎల్లప్పుడూ దక్షిణానే్న చూపిస్తుంది. కనుక, దాని ఆధారంగా మీరు ముందుకు సాగండి, అన్నాడు ప్రభువు. ఈ కథను చైనాలో జానపద పద్ధతిలో చెప్పుకున్నారు. ఇవాళ బడిపిల్లలు కూడా బొమ్మ చేతిలో అయస్కాంతం ఉంది, అని అర్థమవుతుంది. చరిత్రలో సైన్సు కనిపించే పద్ధతికి ఇది ఒక ఉదాహరణ.
ప్రపంచంలో చాలామంది, చాలా విషయాలు కనుగొన్నారు. మెసొపొటేమియాలో మాత్రం తమకు తెలిసిన సంగతులను మట్టి బిళ్లల మీద ప్రత్యేకమయిన రాతపద్ధతులలో రాసి పెట్టుకున్నారు. కనుకనే వారి విజ్ఞానం అందరికీ అందింది. తరువాతి వారికి దారి చూపింది. చైనా వారి కాగితం అంతకన్నా ఎక్కువగా ప్రపంచ నాగరికతకు సాయం చేసింది. చైనాలో కాగితం తయారీని ఒక కుటీర పరిశ్రమగా కొనసాగించారు. ఇవాళటికీ చైనీస్ రైస్ పేపర్ ప్రపంచమంతటా ప్రత్యేకంగా వాడుకలో ఉంది. ఇక అచ్చు కూడా చైనా పెట్టిన భిక్ష కిందే లెక్క. కర్ర బ్లాకుల సాయంతో చైనా వారు తయారుచేసిన ప్రింట్లు, క్లాసికల్ కళకు ఉదాహరణలుగా చలామణీలో ఉన్నాయి.
భారతదేశం పేరు చెప్పగానే, ముందు ఎవరు గుర్తు వస్తారు? అన్న ప్రశ్నకు రకరకాల జవాబులు ఉంటాయి. ప్రాచీన చైనా అంటే మాత్రం అందరూ కన్‌ఫ్యూషియస్ గురించి చెపుతారు. మా చిన్నతనంలో సున్ యత్ సెన్, చాంగ్ కాయ్‌షేక్ లాంటి నాయకుల పేర్లు కూడా వినిపించేవి. ఒకప్పుడు పీకింగ్ అని పలికే పేరు ప్రస్తుతం బెయిజింగ్ అయింది. మావోత్సే టూంగ్ అన్న పేరు మావుజేడాంగ్ అయింది. ‘హా రాడియో పీకింగ్ హాయ్’ అని వినడం నాకు బాగా గుర్తుంది. వాళ్లు చెప్పే మాటలు ముక్క అర్థంకాకున్నా కాసేపు వినేవాడిని. వీలయినన్ని దేశాల రేడియోలు వినడం అప్పట్లో అదొక సరదా!
చైనా ప్రాచీన కళా సాహిత్యాల గురించి ప్రపంచానికి నిజానికి ఎక్కువగా తెలియదు. వారి పరిశీలన పద్ధతి చిత్రంగా ఉంటుంది. ప్రతి చిత్రకారుడు కవి అయి ఉండాలి అంటుంది చైనా సాంప్రదాయం. ఒక కళాకారుడు కొండను, వాగును, పక్కన విరిసిన పువ్వును బొమ్మగా గీయదలుచుకుంటే, ముందు తాను ఆ వాతావరణంలో బతకాలి. అక్కడే గీతలు, ఆకారాలు, రంగులను మెదడులో ముందు చిత్రించుకోవాలి. ఒక చెట్టు బొమ్మ గీయాలి అంటే, అది ఉదయపు వెలుగులో కనిపించే తీరు, మధ్యాహ్నం ఎండలో, సాయంత్రపు నీడల్లో మారుతూ కనిపించే పద్ధతులను పట్టుకోవాలి. రుతువులు మారుతున్న కొద్దీ చెట్టు కనిపించే తీరు మారుతుంది. వెలుగులు మారుతున్న కొద్దీ చెట్టు నీడలు మారిపోతాయి. ఇవన్నీ మెదడులో ఉంటేగాని చెట్టుబొమ్మ గీయకూడదు, అంటుంది, చైనా కళా సంప్రదాయం! చైనా వారు చిత్తరువులలో చూపించే దృష్టికోణం మిగతా ప్రపంచానికి పూర్తిగా కొత్తదిగా ఎదురవుతుంది.
చైనా కళాచరిత్రలో వు టావుట్సేది గొప్ప స్థానం. ఆయన జంతువుల బొమ్మలు గీశాడు. అవి నిజంగా కదిలి నడుస్తాయేమో అనిపించేదట. నాకు ఈ మాట చదివిననాడు ‘లేపాక్షి బసవయ్య, లేచి రావయ్య’ గుర్తుకు వచ్చింది. వు ఒక ఆరామంలో గోడ మీద ఒక గాడిద బొమ్మ గీశాడు. అక్కడి పండితులకు అది నచ్చలేదు. ‘మా మధ్యన ఈ గాడిద ఏమిటి?’ అన్నారు. మరునాడు ఉదయానికి గోడ మీద గాడిద లేదు. పైగా గదిలోని సామాగ్రి మొత్తం చిందరవందర అయింది. గాడిదకు కోపం వచ్చింది. అది గోడ మీద నుంచి దిగి, కుర్చీలు, బల్లలను తన్ని వెళ్లిపోయింది! మరొకసారి ఈ కళాకారుడు, సరస్సు ఒడ్డున కూచుని కాగితం మీద చేప బొమ్మ గీశాడు. కాయితం ఎగిరి నీటిలో పడింది. దాన్ని జాగ్రత్తగా ఎత్తి తీస్తే, కాగితం మీద చేప లేదు! అది నీటిలోకి వెళ్లిపోయింది!
చైనా వారు కథలంటే చెవులు కోసుకునే రకమట. బజార్లలో కథలు చెప్పేవారు, అని ప్రత్యేకంగా కొందరు ఉండేవారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ ఉందేమో చూడాలి. చైనా కళాకారులు జానపద కథలనే కాక, పండితులు, ప్రముఖుల తెలివి గురించి కూడా కథలు చెప్పేవారట. ఇదంతా చూస్తే చైనాలో జీవితం బాగుంటుందని నమ్మకం కలుగుతుంది. మా బంధువుల పిల్లవాడు ఒకడు చైనాలో ఉద్యోగం కూడా చేశాడు. వ్యాపారం, లేదా సంస్కృతి పేరున వెళితే నన్ను కూడా రానిస్తారనే అనుకుంటున్నాను. ‘ఒక్కసారి బెయిజింగు వెళ్లి రావాలి’ అంటూ పాడుకుంటాను కొంతకాలం!

కె. బి. గోపాలం