S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాబోయ్... కల్తీ!

ఆహార ఉత్పత్తులపైనా, వాటి నాణ్యతపైనా రోజురోజుకీ అనుమానాలు పెరిగిపోతున్నాయ. నిస్సంకోచంగా ఆరగించే పరిస్థితి సన్నగిల్లుతోంది. ఏది తింటే ఏమవుతుందోననన్న భయం అనుక్షణం వెంటాడుతోంది. బియ్యం, పాలు, నెయ్య, తేనె, నూనె, పండ్లు, పసుపు, కారం, - ఒకటనేమిటి కాదేదీ కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ సర్వత్రా రాజ్యమేలుతోంది. ఏది అసలు, ఏది నకిలీ అనేది తేల్చుకోవడంలో వినియోగదారుడు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా ప్రధాన ఆధరవులైన బియ్యం, పాలు కూడా కల్తీ అవుతున్నాయనే పుకార్లు వ్యాపించడంతో ప్రజల ఆందోళన తారస్థాయకి చేరింది. ప్లాస్టిక్ బియ్యం మార్కెట్‌ను ముంచెత్తుతోందంటూ వదంతులు వ్యాపించడం వినియోగదారులు డోలాయమాన స్థితిలో పడిపోయారు. బియ్యాన్ని పాలిష్ చేసే సమయంలో ప్లాస్టిక్ లిక్విడ్‌ను మోతాదుకు మించి వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల ఆందోళనను రెట్టింపు చేశాయ. దీనికి తోడు ప్లాస్టిక్ బియ్యంపై ఫిర్యాదులు కూడా లెక్కకు మించి నమోదవుతున్నాయ. రోజువారీ వినియోగించే ఆహార ఉత్పత్తులపై ఎక్కువగా దృష్టిపెట్టిన కల్తీ మాఫియా వాటిని ఏదో రకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. పండ్లను కెమికల్ సాయంతో పండిస్తున్నారనేది తేటతెల్లమే అయనా, కల్తీ జాడ్యం అటు బియ్యాన్నీ, ఇటు పాలనూ చీడలా పట్టుకోవడం ఆందోళనకర పరిణామం.
దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం వ్యాపారం దుమారం లేపుతోంది. ఇటీవల కాలం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం వార్తలు గుప్పుమంటున్నాయి. ప్లాస్టిక్ బియ్యం వదంతులా? వాస్తవమా? అనే మీమాంస ప్రజలను వెంటాడుతోంది. అయితే ప్లాస్టిక్ బియ్యం నిజమేనని ఎక్కడా రుజువు కాలేకపోయినా అధికార యంత్రాంగం మాత్రం ప్లాస్టిక్ బియ్యంపై నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమై ఉంది. ప్లాస్టిక్ బియ్యం వడితే ముద్దలా అవుతుందని, ఆ ముద్ద గోడకేసి కొడితే..రబ్బరు బంతిలా ఎగసి పడుతుందని ఒకచోట.. జీర్ణమవ్వక అనారోగ్య బారిన పడుతున్నట్టు మరోచోట. బియ్యంపై పాలిష్ ఎక్కడంతో అలా ప్లాస్టిక్ బియ్యంలా కనబడుతున్నాయని కొన్ని రాష్ట్రాల్లో, బియ్యంపై పాలిషింగ్ సమయంలో రైస్ మిల్లర్లు మోతాదుకు మించి ప్లాస్టిక్ లిక్విడ్‌ను వాడుతున్నారని మరికొన్ని రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
హోటళ్లు, హాస్టళ్లలో అధిక శాతం ఈ బియ్యాన్ని వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం బియ్యం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో తాము కొంటున్న బియ్యం అసలు బియ్యమా? నకిలీ బియ్యమా? అంటూ అనుమాన పడుతుండగా, కొన్నవారేమో తాము కొన్నది.. అసలు బియ్యమేనా? అని కంగారుపడుతున్నారు. అదేబాటలో నిత్యావసర వస్తువుల్లోని నూనె, నెయ్యి, అల్లం వెల్లుల్లి, పాలు, నీళ్లు, తేనె, పంచదార వంటి వాటిల్లో కూడా కల్తీ కొనసాగుతోంది. ఈ కల్తీ వ్యవహారం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ప్లాస్టిక్ బియ్యం ఓ హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లో ఇటీవలే వెలుగుచూసిన ఈ వ్యవహారంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో ఈ నెల మొదటివారం నుంచి వెలుగులోకి వచ్చిన ప్లాస్టిక్ బియ్యం వివరాలివే.. పాతబస్తీకి చెందిన ఇంద్రసేన్ అనే ఓ యువకుడు నగరంలోని ఓ హోటల్‌లో బిర్యాని తీసుకున్నాడు. ప్యాక్ విప్పి చూడగా ప్లాస్టిక్ రైస్‌తో కూడినదని హోటల్ యాజమాన్యానికి చూపెట్టగా, సమస్యను విచారించాల్సింది పోయి అతణ్ని చితగ్గొట్టేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదేవిధంగా అమీర్‌పేటలో హాస్టల్ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ అనే వ్యక్తి ప్లాస్టిక్ బియ్యంతో కూడిన భోజనం, నాసిరకమైన గుడ్డు పెట్టారని, దీంతో తాము అస్వస్థతకు గురైనట్టు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ వహీదొద్దీన్ దర్యాప్తు జరుపుతున్నారు. మీర్‌పేట్ నందనవనంలో రాకేష్ చౌదరి షాపులో ప్లాస్టిక్ బియ్యం కొన్న అశోక్ అనే వ్యక్తి, ఈ బియ్యం తిన్న తమ కుటుంబ సభ్యులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇన్స్‌పెక్టర్ రంగస్వామి సదరు షాపులో సోదాలు నిర్వహించారు. బియ్యం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు తరలించారు. అదేవిధంగా నగరశివారులోని పలు ప్రాంతాల్లో కల్తీకి పాల్పడుతున్న పాలు, నీళ్లు, నూనె, నెయ్యి, తేనె వంటి గోదాములపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి క్వింటాళ్ల కొద్ది కల్తీ సరుకులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఒకే రోజు 21 మంది వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వదంతులు వ్యాపించాయి. మోర్ రిటైల్ షాపులో బియ్యం కొన్న మాధవరావు అనే వ్యక్తి బియ్యం వండిన తరువాత మొత్తం నీళ్ల మాదిరిగా, ప్లాస్టిక్ వాసన వస్తుందంటూ టౌన్ ఎస్‌ఐ శ్రీరాంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ దర్యాప్తు జరుపుతున్నారు. అదేవిధంగా కర్నూల్‌లోని
ఓ రైస్ మిల్‌లో ఆహార నియంత్రణ, ఫుడ్‌గ్రెయన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. గజానన్ కంపెనీకి చెందిన 50 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. విశాఖపట్నంలోని ఓ కిరాణాషాపులో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారనే ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు. కాకినాడ, సీలేరులో కూడా పలువురు ఫిర్యాదు చేశారు.
కర్నాటకలో..
కర్ణాటక బెంగుళూరులో ప్లాస్టిక్ బియ్యం వదంతులు దావనంలా వ్యాపిస్తున్నాయి. అయితే ఇవి వదంతులు కావనీ, ప్లాస్టిక్ బియ్యమేనని పలువురు ఫిర్యాదు చేశారు. మాగడిలో చౌక డిపోల్లో కొనుగోలు చేసిన బియ్యం కల్తీవేనని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరంగి చిక్కనపాళ్యకు చెందిన శివకుమార్ అనే యువకుడు కడుపునొప్పి, ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమేరకు పోలీసులు బియ్యాన్ని సీజ్ చేసి ల్యాబ్‌కు తరలించారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి యుటి ఖాదర్ విచారణకు ఆదేశించారు. ఇలాంటి బియ్యం విక్రయించిన చౌక డిపో నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
మహారాష్టల్రో..
మహారాష్ట్ర రాజధాని ముంబయి శివారులోనూ కల్తీబియ్యం కలకలం దుమారం రేపుతోంది. చౌకోసి గ్రామంలోని పలు దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యంలో ప్లాస్టిక్ కలిసి ఉందని, బియ్యం చూడడానికి బాగానే ఉన్నా వండిన తరువాత ముద్దముద్దగా, పీచుగా రంగుమారుతోందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ప్లాస్టిక్ అనుమానిత బియ్యం కేవలం లేబర్, వలస కూలీలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే అమ్ముతున్నారని, దీంతో కూలీలు అనారోగ్యానికి గురవుతున్నట్టు కళ్యాణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే వీటిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ రేషన్ షాపుల్లో సోదాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. దాదాపు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఫుడ్ కంట్రోల్ బోర్డు అధికారులు సోదాలు నిర్వహించారు. శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో..
ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది. ఫుల్కన్, గడ్చిరోలి, మస్కాన్ జిల్లాల్లో బియ్యంలో ప్లాస్టిక్ కలిపి అమ్ముతున్నారని ఫిర్యాదు వచ్చాయి. నాగరికతకు దూరంగా ఉంటున్న గ్రామాల్లో ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు సాగుతున్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కోడి గుడ్లపైనా కోటి అనుమానాలు
ప్లాస్టిక్ బియ్యం, కల్తీ నిత్యావసర వస్తువులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నకిలీ పప్పు్ధన్యాలతో పాటు నకిలీ సబ్బులు వంటివి బయటపడగా, ప్రస్తుతం ప్లాస్టిక్ బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. అదేవిధంగా కోడి గుడ్లపైనా కోటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నగర పాలక సంస్థలు, ప్రజాపంపిణీ వ్యవస్థ విక్రయదారులు, మిల్లర్లపై రహస్య నిఘా పెట్టింది. ప్రజారోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని కల్గించే ఈ ప్లాస్టిక్ బియ్యం విక్రయానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు తరలించారు. పరీక్షలు నిర్వహించిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రజారోగ్యానికి హాని కల్గించే బియ్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
పాల కోసం కల్తీ ఇంజెక్షన్లు..
డైరీ పాలకు డిమాండ్ పెరగడంతో కల్తీదారులు పాలపై దృష్టి సారించారు. పాలిచ్చే పశువులకు రెండు ఇంజెక్షన్లు ఇస్తే మూడు రెట్ల పాలిస్తుంది. దీంతో కల్తీ ఇంజెక్షన్లతో పాలు కల్తీ అవుతున్నాయి. పాల దిగుబడి పెంచేందుకు డైరీ నిర్వాహకులు ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్ వినియోగిస్తున్నారు. పశువులకు ఈ ఇంజెక్షన్ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఇవ్వడం ద్వారా పశువు ఆహార పోషక విలువలు తగ్గి, అధిక పాలతో పశువు అనారోగ్య బారిన పడుతుంది. దీంతో పాలల్లో పోషక పదార్థాలు తగ్గుతున్నాయి.
కల్తీ నూనె, నెయ్యి..
నూనె, నెయ్యి పశువుల ఎములను కరగించి నూనె, నెయ్యి కల్తీ చేస్తున్నారు. పశువుల కళేబరాలను ప్రోగుచేసి వాటిని కరగించి వాసన రాకుండా రసాయనాలు వెదజల్లుతూ నూనె, నెయ్యి తయారు చేస్తున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో తేలింది. తెలంగాణవ్యాప్తంగా దాదాపు రెండున్నరేళ్లుగా ఈ కల్తీవ్యాపారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ నగర శివారులో, కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని అనేక గోదాములపై నిర్వహించిన దాడుల్లో ఈ కల్తీ వ్యాపారం వెలుగుచూసింది.
గ్లూకోజ్ వాటర్‌తో తేనె..
బెల్లంను మరిగించి గ్లూకోజ్ వాటర్ కలిపి తేనెను తయారు చేస్తున్నట్టు టాస్క్ఫోర్స్ దాడుల్లో తేటతెల్లమైంది. హైదరాబాద్ ఈదీ బజార్‌కు చెందిన మహమ్మద్ నరుూమొద్దీన్ అనే వ్యాపారి పంచవటి పేరుతో కల్తీ తేనె తయారు చేస్తున్నాడు. బెల్లం, డ్రైఫ్రూట్స్, పంచదారతో మరగబెట్టిన పాకంలో గ్లూకోజ్ వాటర్ కలిపి కల్తీ తేనెను తయారు చేసి విక్రయిస్తున్నట్టు తేలింది.
కల్తీ వెల్లుల్లి పేస్ట్..
వెల్లుల్లి పేస్ట్‌లో అసలు వెల్లుల్లే లేకుండా కల్తీ పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. ఉల్లిని బాగా గ్రైండ్ చేసి రంగుల తయారీలో వాడే సల్ఫూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్లిన బంగారు దుంపలు వేసి వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు.
మురుగు నీటితో మినరల్ వాటర్..
వేసవి దాహాన్ని ఆసరగా చేసుకుని వ్యాపారులు తాగే నీటిని కూడా కల్తీ చేస్తున్నారు. మురుగు నీటిలో నీటిని శుద్ధి చేసే రసాయనాలు (పౌడర్) వినియోగించి మినరల్ వాటర్‌ను తయారు చేస్తున్నారు. అయితే ఈ నీటిని ఆయా రాష్ట్రాలు స్థానికంగా పలు పేర్లతో తయారు చేస్తున్నారు. టాస్క్ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగినప్పుడు వెంటనే బాటిళ్లపై పేర్లు మార్చేసి కొత్త పేర్లతో లేబిళ్లు అతికించి వ్యాపారం సాగిస్తున్నారు.
పంచదార కూడా కల్తీనే...
ప్రతి కుటుంబంలో ప్రతి నిత్యం అనివార్యమైన పంచదారలో సైతం కల్తీ జరుగుతోంది. తక్కువ గేజ్ ప్లాస్టిక్‌లో శాక్రిన్ వంటి తీపి పదార్థాన్ని కలిపి మిఠాయిలు తయారు చేస్తున్నారు. తెల్లటి ప్లాస్టిక్ ముక్కలను పంచదారలా చూర్ణం చేసి వాటిపై శాక్రిన్ పౌడర్ వేస్తున్నారు. అయితే పంచదార బరువు వచ్చేందుకు నోట్లో వేసుకోగానే కరగిపోయే మెటల్ వాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిశ్రమలన్నీ ప్రముఖ నగరాల్లోనే ఉన్నట్టు సమాచారం.
ప్లాస్టిక్ బియ్యంపై దర్యాప్తు..
నిత్యావసర వస్తువుల్లో కల్తీ, ప్లాస్టిక్ బియ్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ స్పందించారు. ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలపై దృష్టి సారించారు. పలు షాపుల్లో తనిఖీలు చేసి బియ్యం శాంపిల్స్‌ను సేకరించారు. వ్యాపారులు కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకు ప్లాస్టిక్ బియ్యంపై సరైన ఆధారాలు లేవని, శాంపిల్స్‌ను పరిశీలించిన పలు ల్యాబ్‌లు కూడా బియ్యంలో ప్లాస్టిక్‌పై నివేదిక ఇవ్వలేదని తెలిపారు. బియ్యం కంటే ప్లాస్టిక్ బియ్యం కంటే ఖరీదైనందున ప్లాస్టిక్ బియ్యాన్ని దిగుమతి చేసే సాహసం ఎవరూ చేయలేరని కమిషనర్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ బియ్యం వదంతులతో ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. వ్యాపారులు, మిల్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే ఉపేక్షించబోమన్నారు.
మార్కెట్లోకి ప్లాస్టిక్ బియ్యం దిగుమతి ప్రజారోగ్యంపై జరిగిన పరోక్ష దాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత ఆరేడు ఏళ్లుగా ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్లాస్టిక్‌ను పశువులు తింటే అనారోగ్యానికి గురై చనిపోతున్నాయ. ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడుల పేరుతో వ్యవసాయం ఇప్పటికే కుంటుపడింది. నిత్యావసరాల్లో పెరిగిపోతున్న కల్తీ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై ప్రజల్లో పెరిగిపోతున్న అనుమానాలు నివృత్తి కావడం లేదు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు సైతం మక్కీమక్కీగా మార్కెట్లో లభ్యం కావడంతో ఏది అసలు అనే మీమాంస ప్రబలిపోతోంది. నిర్భయంగా కొనుగోలు చేయడంగానీ, ధైర్యంగా ఉపయోగించడంలోగానీ వినియోగదారులు పదేపదే సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బియ్యంపైనా అనుమానాలు ప్రబలడం వినియోగ దారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏదీ ఏమైనా ప్లాస్టిక్ బియ్యం కలకలం వెనుక కుట్ర వుందా? లేక కేవలం పుకార్లు మాత్రమేనా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి అనుమానాలు నివృత్తి ప్రజల్లో తిరిగి విశ్వాసం నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు.
కల్తీ జరుగుతోందిలా..
బియ్యంలో ప్లాస్టిక్ కల్తీ జరుగుతున్న విషయంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్లాస్టిక్ రైస్‌ను పరిశీలించిన తరువాత అధికారులు రైస్ మిల్లులపై దృష్టి సారించారు. అయితే మార్కెట్‌లో ప్లాస్టిక్ బియ్యం సరఫరా కావడం లేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. రైస్ మిల్లర్లు డబ్బు ఆశతో దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్, పాలిష్ చేసి అమ్ముతున్నట్టు అధికారులు కనుగొన్నారు. దొడ్డు బియ్యాన్ని ఒకసారి పాలిష్ చేస్తున్నారు. అయితే పాలిష్ చేసిన బియ్యం నున్నగా, తెల్లగా వచ్చేందుకు మరోసారి బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారు. రెండో దఫా చేసే పాలిష్‌లో బియ్యంపై తెల్లని ప్లాస్టిక్ లిక్విడ్‌ను జార విడువడంతో ఆ బియ్యం సన్నగా, తెల్లగా, నున్నగా వస్తున్నాయి. కాగా ఈ బియ్యం వండినప్పుడు స్మూత్‌నెస్ కోసం వినియోగించిన ప్లాస్టిక్ లిక్విడ్ కరగిపోతుంది. దీంతో అన్నం నీళ్ల మాదిరిగా, ముద్దముద్దలుగా మారి బంతి మాదిరిగా ఎగురుతోంది.

- సయ్యద్ గౌస్ పాషా