S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖయాలో మేఁ

ఈ మధ్యన పెళ్లి గానీ, మరో సంబరం గానీ, ఎక్కడికి వెళ్లినా, భోజనంలో
మిర్చ్భీజ్జీ లేకుండా గడవడం లేదు. ఈ విషయం వెనుక ఏదయినా విదేశీ హస్తం లాంటి కుట్ర ఉందంటారా? మనవాడు ఆలోచనల్లో తేలుతున్నాడు. మునుగు
తున్నాడు. అటు మనుషులను
పట్టించుకోవడం లేదు. ఇటు సంగతులను, శరీరాలను పరిశీలించడం లేదు. అప్పుడు మరి ఏదో జరగాలి. జరిగింది.
అతని దృష్టి మారింది.

తను ఏదీ? ఏమయ్యాడు? ఏమీ కాలేదు. అక్కడే ఉన్నాడు. మనం కదిలే శరీరాల కొరకు వెదుకుతున్నాము. రేడార్ లేదా రాడార్ అట్లా అమరి ఉంది. అందుకే అతను సిగ్నల్ రూపంలో మనకు అందలేదు. ఫ్రీక్వెన్సీ కొంచెం మారిస్తే, అదుగో ఆ పక్కన నిలబడి ఉన్న అతను (డు) కనిపిస్తాడు. అతను నిజంగా అతనుడు, శరీరం లేనివాడు అయినట్లాయెనా? అది వింత పరిస్థితి. అతనికి అంతటి శక్తి లేదు. సందర్భం అవునో కాదో గానీ, కన్నడలో అక్కమహాదేవి అనే భక్తురాలి వచనాలకు గొప్ప పేరున్నది. వచనాలంటే రూల్స్ లేని కవితలు అనవచ్చు. ‘అండములను లింగముఖమునకు అర్పించి, అంగము అంటే శరీరము అనంగమాయెను, అంగము, మనసు, భావము లేని కాయము అకాయమాయెను’ అంటుంది అక్కమ్మ. ఇంకా తరువాతి మాటలు మనకు సందర్భము కాదు. మన అతను, తనువు లేనివాడు కాలేదు. సకాయముగ అక్కడే ఉన్నాడు. కానీ, ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు. మామూలుగా మనము అతని మనసులోనికి తొంగిచూడము.
అతను రోడ్ దాటి అవతలకు వెళ్లాలి అనుకున్నాడు. రద్దీ, జనం, ట్రాఫిక్ కారణంగా అది కుదరడంలేదు. అందుకే అతను ఆగిపోయాడు. ఆ క్షణాన అతనికి రెక్కలు రమ్మంటే వస్తాయా? వచ్చినా ఎగుర గలుగుతాడా మన్నా? కనుక అక్కడ ఒక ఓవర్‌బ్రిడ్జ్ అను ఆకాశ మార్గము అను స్కైవే అతను మనసులోనే కడుతున్నాడు. నగరంలో ఒకచోట భూగర్భ మార్గం కట్టారు. అందరూ వాహనాల భయం లేకుండా, రోడ్ అవతలి వేపు చేరుకోవాలన్నది ఆ సొరంగాలు, గుయ్యారాల ఉద్దేశ్యం. ఎందుకోగానీ, అవి ఎవరికీ నచ్చలేదు. ఎవరూ వాటిని వాడలేదు. ఇప్పుడేమయినయో గమనించిన గుర్తు లేదు. ఆకాశ మార్గాలు కూడా కట్టారు. రైల్వేస్టేషన్, ముఖ్యంగా మామూలు, లేదా చిన్నతరహా స్టేషన్‌లలో ఇటువంటి మెట్లదారులు ఉంటాయి. కానీ చాలామంది రైల్‌ట్రాక్‌ల మీదకు దూకి, దాటి, అవతలి వేపులకు వెళుతుంటారు. ఇట్లా, ఇష్టం వచ్చినట్టు రైలు పట్టాలు దాటుతుంటే, అక్కడో ఇక్కడో కొందరు, రైలుబండి కింద పడి చావడం కూడా ఉంది. కానీ, లెక్క ప్రకారం, చావవలసినంత మంది, అట్లా చావడం లేదని లెక్క తేల్చారు. ఆ వివరాలను ఏకంగా బీబీసీ ఛానల్‌లోనో నేషనల్ జోగ్రాఫిక్‌లోనో చూపించేశారు. వింత ఏమిటీ అంటే, భయం లేకుండా రయిలు పట్టాలు దాటేవారు ఎవరూ తీరికగా కూచుని టీవీ, అందునా ఇంగిలీసులో ఏవో, ఎవరికీ పట్టని సంగతులు చూపించే ఛానల్స్ అసలే చూడరు. అందుకనే అటువంటి వాళ్లు దాటుతుంటారు. ఛానల్స్ వారు డాక్యుమెంటరీలు తీస్తూనే ఉంటారు. నాలాంటి పనిలేని వాళ్లు చూస్తుంటారు.
అవతలి వేపు వెళ్లాలి. అప్పట్లో అంగడి గురించి ఆరా చెప్పిన అమ్మాయి అక్కడ ఉండదని తెలిసినా అక్కడకు వెళ్లి చూడాలి. ఉంటుందేమో? ఆఁ! అంటే, మళ్లీ అదే అంగడి గురించి అడుగుతాడా ఇతగాడు. అడుగుతాడు. ఆమె చెపుతుంది. చెప్పదు. అయితే ఏమవుతుంది? ఏమీ కాదు. ‘కన్యల పట్ల దర్శన దోషము లేదు గదా!’ అంటాడు శ్రీహర్షుడు. పెళ్లికాని అమ్మాయిని, ఆమె అందాన్ని చూస్తే, తప్పు లేదట. కేవలం చూడడం వరకేనండీ. ఆ తరువాత ఒక ఆలోచన గానీ, ఒక మాట గానీ, ఏదో ఒకటి గనుక వచ్చిందంటే తప్పులో కాలేస్తారు!
అవునూ? ఎందుకండీ, ఎదురయిన వాళ్లనందరినీ, అదే పనిగా, సవివరంగా చూడడం? ప్రశ్న బాగలేదు. కళ్లున్నాయి. వద్దు, అనుకున్నా ఎదుటి దృశ్యమంతా కనబడి తీరుతుంది. అందులో కదిలే అంశాలు మరింత కనబడతాయి. కదిలేది మనుషులయితే మరీనూ! మనుషులకు శరీరం పొందిక అని ఒక మాట ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎదురుగానున్న పాన్‌షాప్‌లో ఒక యువకుడు నిలబడి, పాన్‌లు, మరొకటి అమ్ముతున్నాడు. అతను అందంగా ఉన్నాడు. అంటే ఏమిటి? ఎత్తు, బరువు, కనుముక్కు తీరు, కాలుచేతులు అన్నీ ఉండవలసినట్లు ఉన్నాయి అని అర్థం! ఉండవలసినట్టు అంటే ఏమిటి? ఆ లెక్కలు ఎవరు నిర్ణయించిరి? అంటే సమాజం నిర్ణయించింది. ఏఎన్నార్ అనే నాగేసర్రావ్ అనే అక్కినేని గారు కొత్తగా వచ్చిన ఒక వీరోయినీ, అనగా హీరోయిన్‌ను చూచి, అంతా బాగానే ఉంది కానీ, కాళ్లు కొంచెం పొడుగు ఎక్కువ అని ఆమెకే చెప్పేశారట. అట్లా నిర్ణయాలు జరుగుతాయి. శిల్పశాస్త్రంలో సౌష్టవం అన్నది ఒక భాగం. ఒక దేవుడు లేదా ఒక వ్యక్తి విగ్రహం సిద్ధం చేయాలంటే, ముందు ఎత్తు నిర్ణయించాలి. ఇంత ఎత్తు ఉండే విగ్రహంలో తల, మొండెము, కాళ్లు ఉండవలసిన ఎత్తులను నిర్ణయిస్తారు. ఇక ఆయా భాగాలు వెడల్పు నిర్ణయం అవుతుంది. మామూలుగా బొమ్మలు గీసేవాళ్లు కూడా, ఉజ్జాయింపులు వేసి, గీస్తారు. అప్పుడే ఎట్లా రావలసిన బొమ్మ అట్లా వస్తుంది!
కాట్! అటే మంచం కాదు! కట్ అని మరీ ముక్తసరిగా అంటే ఎవరికీ వినిపించదని, కాస్త ఒత్తి, నొక్కి చెప్పినందుకు అది కాట్, లేదా ఖాట్ అయింది. కాట్ అంటే ఇంగ్లీషు మంచం. ఖాట్ అంటే హిందీ మంచం. ఈ సంగతి ఇంతకు ముందు మీకు తెలుసా? ఖాట్, కాట్, కట్, బట్, ఫట్! సంగతికి రావాలి! సంగతి అంటే సంగీతంలో ఉండేది కాదు. ఏం సంగతులు? అంటే మీరే చెప్పాలి అంటారే, అవి. వాటికే కబుర్లు అని పేరు. ఖబర్, కబర్‌లలో తేడా ఉంది. ఒకటి వార్త. రెండవది సమాధి అను గోరీ! అసలు మిరపకాయ బజ్జీ గురించి చెప్పాలంటే ఏమిటీ భాషాలజీ! సరే ఆపుదము? ఏమిటి సంగతి? అతని దృష్టి, అనగా చూపు, అనగా నజర్ మిరపకాయ బజ్జీల మీద పడింది. తిందామని కాదు. అక్కడ చేరిన యువ సమాజం వారి సౌష్టవాలు పరిశీలించాలని! కానీ, వాడు వండుతున్న మిరపకాయ బజ్జీలు అను వంటకము, మరింత ఆకర్షణీయముగ కనిపించుచున్నవి గదా! అవుట్ సయిడ్ ఫూడ్ అవాయిడ్ చేయాలని ట్రై చేస్తాడు అతను. కనుక ఆ బజ్జీలు అవసరం లేవు. ఆ ఊసెత్తొద్దు! అని ఎవరయినా అనేవరకు వాటి గురించి ఆలోచన సాగవచ్చును గదా! (ముఖం మీద సుడులు తిరుగును). స్క్రీన్‌ప్లే ప్రకారం అన్న మాట!
అవి నేను బనారస్‌లో చదువుకునే రోజులు, అంటూ వెనుకట, మరీ వెనకట కాకున్నా ఒకప్పుడు సినేమాలో ఒక డవిలాగు అను డయలాగు ఉండేది. అచ్చం అదే పద్ధతిలో అవి అతను ఉస్మానియాలో చదవాలని జంట నగరాలకు వచ్చిన రోజులు. అప్పటికే కోఠీలో గోకుల్ చాట్‌కు మంచి పేరుండేది. అది అప్పట్లో ఒకే షెటర్ గల చిన్న అంగడి. లోపల రెండు బెంచీలు. వాటి మీద సెటిలయితే, మిర్చ్భీజ్జీలు, కట్‌లెట్‌లు, గప్‌చుప్‌లు అందేవి. ఎంత బాగుండేవి? ఆ తరువాత గోకుల్ చాట్ బాగా పెరిగింది. క్యూలో అరగంట ఉంటే బజ్జీలు దొరికేవి. ఆ తరువాత అక్కడ బాంబు పేలింది. ఒకేసారి చాలామంది చచ్చిపోయారు. వాళ్లంతా మిరపకాయ బజ్జీల కొరకు వచ్చినవాళ్లే! అమాయకంగా అందరూ అమరులయ్యారు! మరే దేశంలో నయినా, అట్లాంటి ప్రదేశాన్ని ఒక స్మారకంగా, ఘాతుకానికి నిరసన తెలిపే స్మృతి చిహ్నంగా మార్చి ఉండేవారు. ఇవాళ కోకుల్ చాట్ వెళ్లి చూడండి. అక్కడ ఎవరికీ ఏమీ పట్టనట్టు మిరపకాయ బజ్జీలు తింటూనే ఉన్నారు. వీళ్లంతా నిజంగా మనుషులేనా? అనిపిస్తుంది. ఆ దెబ్బతో అతనికి మిరపకాయ బజ్జీల విషయంగా మనసు విరిగింది. అసిడిటీ పెరగడం అన్నది మరో కారణంగా మిగిలి ఉంది. కానీ, నిజంగా నాలుక ఆ రుచిని కోరితే, కడుపు మంటను మరిచి నాలుగు బజ్జీలు లాగించడమే గదా!
అవునుగానీ, ఈ మధ్యన పెళ్లి గానీ, మరో సంబరం గానీ, ఎక్కడికి వెళ్లినా, భోజనంలో మిర్చ్భీజ్జీ లేకుండా గడవడం లేదు. ఈ విషయం వెనుక ఏదయినా విదేశీ హస్తం లాంటి కుట్ర ఉందంటారా? మనవాడు ఆలోచనల్లో తేలుతున్నాడు. మునుగుతున్నాడు. అటు మనుషులను పట్టించుకోవడం లేదు. ఇటు సంగతులను, శరీరాలను పరిశీలించడం లేదు. అప్పుడు మరి ఏదో జరగాలి. జరిగింది. అతని దృష్టి మారింది. ఇక కదలాలని నిశ్చయించుకున్నాడు. కదిలాడు, రోడ్ అంచు నుండి, అక్కడ బయలుదేరిన ఒక పక్కరోడ్, అడ్డరోడ్ వరకు కదిలాడు. ఈ గోలకన్నా యింటి దారి పట్టడం మేలు అనుకున్నట్టు కనబడుతున్నది. అటుగా నడిస్తే, త్వరలోనే అతను ఇల్లు చేరుకుంటాడు. ఆ మధ్యలో అతని ఆలోచనలలోకి, ఎదురుగా సకాయంగా ఎన్ని విశేషాలు వచ్చి చేరుకుంటాయో? అతనుడు ఆలోచనశీలి. కనుకనే ప్రపంచం మధ్యలో ఉంటూనే ప్రపంచం పట్టకుండా బతుకుతుంటాడు. అతని వెంటబడి మనం కూడా ఎన్నో సంగతులను గురించిన ఆలోచనల క్రమాన్ని రాడార్ ద్వారా అందుకుంటున్నాము. అదుగో వెళ్లిపోతున్నాడు. పదండి, మనమూ వెళదాం!

కె. బి. గోపాలం