S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చూస్తుండగానే మాయమైపోయే బీచ్ ( ఒడిశాలోని చండీపూర్ బీచ్)

మనిషి ఆలోచనాశక్తి పెంపొందించుకుని తనని మించిన శక్తి లేదని విర్రవీగుతుంటాడు. ప్రకృతిని కూడా జయించగలనని ప్రగల్భాలు పలుకుతుంటాడు. కానీ అది భ్రమ మాత్రమే అని స్పష్టమవుతుంటుంది ప్రతిసారీ. ప్రకృతి ముందు ఎంతటి ధీరుడైనా పిపీలకమే అని అనాదిగా నిరూపితమవుతూనే ఉంది. మానవుడు విర్రవీగుతున్న ప్రతిసారీ ఉత్పాతాలు, ఉప్పెనలు, జలప్రళయాలు ముంచుకొచ్చి మనిషి ఎంత అల్పుడో స్పష్టమవుతూనే ఉంది. ప్రకృతి శక్తి ముందు ఎవరైనా తల వంచక తప్పదు. ప్రకృతి తానెలా కావాలంటే అలా మారగలదు. ఏం చేయాలనుకుంటే అది చేయగలదు. దీనిని మనిషి మరో వెయ్యేళ్లు తర్వాత కూడా ఇసుమంత కూడా మార్చలేడు. దీనికి సరైన ఉదాహరణే ఒడిశాలోని భువనేశ్వర్‌కి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో, భిలాస్‌పూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీపూర్ బీచ్.
ఇదొక విచిత్రమైన బీచ్. ఎందుకంటే ఈ బీచ్ రోజులో రెండుసార్లు మాయమైపోతూ ఉంటుంది. అవును ఇది నిజం. చండీపూర్ తీరం రోజుకు రెండు సార్లు అదృశ్యమైపోతూ మనతో దోబూచులాడుతూ ఉంటుంది. ఈ బీచ్ ఇలా మాయమైపోవడం అనేది వెనె్నల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘటన చాలా విచిత్రంగా జరుగుతుంటుంది. సందర్శకులు సాగరతీరంలో నడుస్తూ వెళుతుండగా సముద్రంలోని నీరు మెల్లగా వెనక్కి వెళ్లిపోవడం మొదలుపెడుతుంది. అయితే మామూలుగా అలలు ముందుకు వచ్చి వెనక్కి వెళ్లిపోవడం సహజమే కదా అనుకుంటే మనం పొరబడుతున్నట్లే. ఎందుకంటే అలా వెనక్కి వెనక్కి వెళుతున్న అలలు ఒకటీ రెండు కాదు ఏకంగా అయిదు కిలోమీటర్ల వెనక్కి వెళ్లిపోవడం వల్ల మన కళ్ల ముందు అప్పటి వరకు కనిపించే సముద్రం క్షణాల్లో మాయమైపోయి ఎక్కడో అల్లంత దూరంలో అయిదు కిలోమీటర్ల దూరంలో కనీకనిపించనంత వెనక్కి వెళ్లిపోతుంది. స్థానికులకు ఇది అలవాటే కనుక వారు పెద్దగా పట్టించుకోరు కానీ, ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చేవారు, టూరిస్టులు మాత్రం ఈ ఘటనకు బిత్తరపోతారు. ఏమిటిలా అయిందని ఆశ్చర్యపోతారు. అయితే చండీపూర్‌లో మాత్రం ఇది రోజువారీ వ్యవహారం. రోజుకు కనీసం రెండు సార్లు అక్కడి సముద్రం అయిదు కిలోమీటర్ల వెనక్కి వెళ్లిపోయి మళ్లీ కొంత సమయం తర్వాత ముందుకు వచ్చేస్తుంది.
ఇలా సముద్రం నీరు హఠాత్తుగా వెనక్కి వెళ్లిపోవడం వల్ల మనకి ఇసుక పర్రలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే గులకరాళ్లు, శంఖాలు, సముద్రం అడుగున మనం సాధారణంగా చూడని అనేక వింత వస్తువులు, సామగ్రి కనిపిస్తుంది. జీవవైవిధ్యాన్ని తలపిస్తూ అనేక సముద్రజీవులు కూడా మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అలాగే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ‘రెడ్‌క్రాబ్స్’ అనబడే ఎర్ర పీతలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. ఆ దృశ్యం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. టూరిస్టులు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి పోటీ పడతారు. ఇలా అప్పటి వరకు కనిపించి, అంతలోనే మాయమైపోయే సముద్రాన్ని మరింత అద్భుతంగా వీక్షించడానికి నవంబర్ నుండి మార్చి మధ్యలో అక్కడికి వెళితే అప్పుడు వాతావరణం మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలోనే అరుదైన ఘనత కలిగిన చండీపూర్ బీచ్ మరొక విషయంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. అదేమిటంటే డిఆర్‌డిఒ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కి చెందిన లేటెస్ట్ మిసైల్స్‌ని ఇక్కడే పరీక్షిస్తుంటుంది. సహజసిద్ధమైన అందంతో అలరారే చండీపూర్ కనిపించి మాయమైపోయే బీచ్‌తోను, దేశరక్షణకు ఉపయోగపడే మిస్సైల్ పరీక్షలతోను దేశంలోనే అరుదైన ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా చండీపూర్ బీచ్‌ని సందర్శించాలని కోరుకుంటూ ఉంటారు.

-దుర్గాప్రసాద్ సర్కార్