S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ.. (అమృతవర్షిణి)

జీవితమనే నాటక రంగస్థలంలోని పాత్రలను నడిపించే ఆ జగన్నాటక సూత్రధారి ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. ఎవరెవరికి ఎటువంటి పాత్ర ఇవ్వాలో, ఆయా పాత్రలను ఆసక్తికరంగా ఎలా రక్తి కట్టించాలో బాగా తెలిసిన దర్శకుడాయనే. ఎవరెవరి రాతను ఎలా మలుపు తిప్పాలో, ఎవరి కథకు ఎలా శుభం పలకాలో కూడా ఆయనకే తెలుసు. పరమాత్మతో పోటీ పడగల సమర్థులెవరుంటారు? ‘ఎటుల పుట్టించితో నీవెరుగుదువు. ఘటన లన్నియు నీ సంకల్పమేనయ్యా!’ అంటాడు అన్నమాచార్యులు.
జీవులతో ఆడుకోవడం ఆయనకో సరదా. ఈ సృష్టే భగవంతుడి లీల. ‘లీల’ అంటే క్రీడ. ఎవరిని ఎలా సంతోషపరచాలో, ఎవరిని పడగొట్టాలో ఆయనకు తెలుసు. ఇది గ్రహిస్తే మనలో ఆవేదన, గందరగోళం సద్దుమణుగుతాయి. ఈ రహస్యం సగం జీవితమై పోయిన తర్వాతే కొందరికి కాస్తకాస్త తెలుస్తూంటుంది. మరి కొందరికి అసలు తెలుసుకోవాలనే ఆసక్తే ఉండదు. అదీ వాడి లీలే. మహాభక్తులకు ముందే తెలిసిపోతుంది. అందుకే వారు కారణజన్ములు.
మనకు ఆలస్యంగా తెలియడానికి కారణం కూడా ఉంది. అవిద్య, అజ్ఞానం! తెలిసితే మోక్షం. తెలియకపోతే బంధమే. ఈ బంధాన్ని గట్టిగా బిగించుకుంటూ పోతే సంసార ధర్మాలు అవసరానుగుణ్యంగా పెరుగుతూ పోతూంటాయి. ఈ అయోమయం నుంచి గట్టెక్కించే వాడొక్క పరమాత్ముడే అని తొందరగా తెలుసుకున్నవాడే అసలైన తెలివైనవాడు.
విశ్వాసం ఉంటేనే గాని, భక్తి రాదు.
భక్తిలేని జ్ఞానం ఒంటరిగా నిలబడదు.
ఈ భక్తి సూత్రంతో బంధింపబడేవాడు భగవంతుడు.
అన్ని యోగ మార్గాల కంటే నాదయోగం చాలా గొప్పదని నిరూపించిన భక్తులు గోపరాజు, త్యాగరాజు.
నా చిన్నతనంలో సాయంత్రం చీకటి పడేవేళ దీపపు సెమ్మెలు మధ్యలో పెట్టుకుని, చిరతలు వాయిస్తూ పది పదిహేను మంది యువకులు గొంతు విప్పి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ.. ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ..’ అని పాడుతూంటే ఇళ్లల్లోని జనం యివతలకు వచ్చి, పనులన్నీ మానుకుని నిలబడి వింటూ ఆనందించేవారు. అందరి కంఠాలూ కమ్మని శృతిలో లీనవౌతూండేవి. పది మంది కలిసి పాడితే అపశృతి, దోషం తొందరగా దరి చేరదని నా నమ్మకం. ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ పాడతారు.
అంతా రామమయం.
ఈ జగమంతా రామమయం.
అంతరంగమున నాత్మారాముడ
నంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును - సురలు తారలును
ఆ మహాంబుధులు నవనీజంబులు
॥ రామమయం॥
అని.. జనం హృదయాలుప్పొంగిపోతూ పాడి పరవశించడం నేనెరుగుదును - ఈ భజన కూటములన్నీ కూలీనాలీ చేసుకుని బ్రతికే పల్లెజనానికీ, మోతుబరులైన ఆసాములకూ మధ్య తరతమ భేదాలు చెరిపేస్తూ, అంతరంగాల్లో అనురాగ భావాలను చిగురింపజేస్తూ వుండేవి. ఈ ఒక్కటే కాదు - నలుగురూ కలిసి పాడుకోవాలనే ఉత్సాహం ఉండేది. భజన రూపానికి ఆద్యుడు భద్రాచల రామదాసు. దేవుణ్ణి మనసారా స్మరించుకోవడం నేర్పినవాడు. ఇంట్లో త్యాగయ్య తల్లి రామదాసు కీర్తనలు పాడుకుంటూ వుండేదిట. ఆ ప్రభావం త్యాగయ్య మీద పడదా? మరి. త్యాగయ్య కంటే 150 ఏళ్లకు ముందువాడు రామదాసు. యితర వాగ్గేయకారులతో పోలిస్తే రామదాసు జీవితం, ఆయన సాహిత్యం, సంగీతం.. అన్నీ విలక్షణమే.
ఆయన కంచెర్ల గోపన్నగా వున్నప్పుడే ‘దాశరథీ! కరుణా పయోనిధీ’ మకుటంతో అద్భుతమైన పద్యాలు శతకంగా రాసేశాడు.
తెలుగు సాహిత్యంలో దాశరథీ శతకం వంటి శతకంతో పోల్చతగినది కనిపించదు. అనుభవిస్తూ పాడుకోతగిన పద్యాలివి. చదువుతూ తృప్తిపడేవి కావు.
రాగం జోడించి కమ్మగా పాడితే పద్యం. కీర్తన కంటే సూటిగా తిన్నగా మనసుకు చేరుతుంది. అనర్గళంగా పద్యాలల్లిన వారికి పాటలు వ్రాయటం కష్టం కాదు. కానీ, సంగీతం తెలిసినంత మాత్రాన పద్యాలు మాత్రం అందరూ పాడలేరు. శతక సాహిత్యంలో చిర యశస్సును పొందినదీ ‘దాశరథీ శతకం’.
భద్రాచల రామదాసు చెరసాల వెళ్లక ముందు వ్రాసిన కీర్తనలలో
‘అదిగో భద్రాద్రి, యిదుగో చూడండీ’
‘ఎన్నగాను రామ భజనకన్న మిక్కిలున్నదా’
(ఈ కీర్తన వెనుకటి తరంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, సెమ్మంగుడి చెంబై, ఎన్.సి.వసంత కోకిలమ్ లాంటి సంగీత విద్వాంసులు సంప్రదాయ సంగీత శైలిలో పాడి గ్రామఫోన్ రికార్డులిచ్చారు.)
-ఏ తీరుగ నను దయ చూచెదవో యినవంశోత్తమ రామా!
నా తరమా భవ సాగరమీదను నళిన దళేక్షణ రామా
-చరణములే నమ్మితి మొదలైనవి ప్రసిద్ధం కాగా,
కారాగారంలో వున్నప్పుడు రాసిన వాటిలో
-ఇక్ష్వాకు తిలక, ఎంత పని చేసితివి రామా’
-నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ
-సీతారామ స్వామి నే చేసిన నేరమేమీ
-పలుకే బంగారమాయెనా..
చెరసాల నుండి విడుదలైన తర్వాత రాసిన వాటిలో ఓ రామా నీ నామ మేమి రుచిరా, అంతా రామమయం, రామభద్రరార, భళిరా వైరాగ్యమెంతో బాగైయున్నది మొదలైనవి ఎంతో ప్రసిద్ధమైనవి.
భావావేశంతో తన్మయత్వంగా వచ్చిన కీర్తనలే గానీ, విద్వత్ప్రధానంగా వున్నవి కాకపోవటం వల్ల, శాస్ర్తియ సంగీత విద్వాంసులు వీటిని లలిత శాస్ర్తియ సంగీత ధోరణిలోనే ఎక్కువగా పాడతారు. ముఖ్యంగా ఒకేసారి ఎందరు పాడినా శ్రవణపేయంగా.. వినిపించే సరళమైన రచనలు.
ఆనందభైరవి.. కరుణరస ప్రధానమైన ఈ రాగంలో రామదాసు 7,8 కీర్తనలు పాడుకుని వుంటాడంటారు.
ఆనందభైరవి, రాగం వాడిన మొదటి భక్తుడు రామదాసు.
రామదాసు కీర్తనలు ఏవేవో రాగాల పేర్లతో వున్నాయి గానీ అవే రాగాలలో చాలావరకూ పాడటం లేదు. శిష్య సంతతి లేని కారణంగా పద కవితామహుడైన అన్నమాచార్య కీర్తనలకు నిర్దిష్టమైన స్వరలిపి లేనట్లే రామదాసువి కూడా ఎవరికి తోచిన రీతిలో వారు పాడుకోవటం వల్ల ఆ బాణీలకు స్థిరత్వం లేకుండా పోయింది. ఈ సందర్భంలో తలచుకోగల్గిన వ్యక్తి.. ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి. రామదాసు కీర్తనలకు ఒక రూపాన్నిచ్చి సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా వందకు పైగా శుద్ధమైన బాణీలు కూర్చారు. అంతేకాదు. గత దశాబ్ద కాలంగా భద్రాచలంలో వాగ్గేయకారోత్సవాలలో రామదాసు జయంతిని వందలాది కళాకారులతో నిర్వహించే బాధ్యతను నేండ్రగంటి కృష్ణమోహన్ అనే రామభక్తుడు ఎంతో శ్రద్ధ్భాక్తులతో నిర్వహించడం గమనార్హం. జయంతి పుణ్యదినాన, రామదాసు కీర్తనలలో విశిష్టమైన వాటిలో తొమ్మిది కీర్తనలను ఎంపిక చేసి, భద్రాచలంలోని చిత్రకూట మంటపంలో వందలాది విద్వాంసులు కూర్చుని గానం చేయటం విశేషం. అవే, రామదాసు నవరత్న కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ‘కాంభోజి’ రాగంలో నేదునూరి స్వరపరిచిన ‘ఏమయ్య రామ’ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియవశమా అన్న కీర్తన దక్షిణాది విద్వాంసులను సైతం ఆకర్షించి ప్రసిద్ధమైంది. ముఖ్యంగా సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌కు ఈ కీర్తన ఎంతో ఇష్టంగా పాడేవారు.
ఎన్నగాను రామభజన - పంతువరాళి రాగంలో 5-6 దశాబ్దాల క్రితమే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎన్‌సి వసంత కోకిలం మొదలైన సంగీత విద్వన్మణులు పాడి గ్రామఫోన్ రికార్డులిచ్చారు. రామదాసు కీర్తనలలా ప్రచారమయ్యాయి.
‘రామజోగి మందుకొనరే’ ఖమాస్ రాగంలో పాడటం అనాదిగా అలవాటే. ఎలా పాడామన్నది కాదు, ఆ పాట మనసుకు ఎంత చేరువైనది? అనేదే ప్రధానం.
భద్రాచల రామదాసు చరిత్రను యక్షగానంగా రాసి ప్రచారం చేసిన కథకుడు యాదవదాసు! వివిధ సందర్భాల్లో రాసిన అనేక రామదాసు కీర్తనలు కొందరు హరికథకుల వల్ల బాణీలు మార్పులు పొందకుండా అలాగే ఆంధ్రుల ఇళ్లల్లో, నోళ్లల్లో నాని, ప్రచారమై పోయాయి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎక్కడ విన్నా వరాళి రాగంలో ‘అదిగో భద్రాద్రి’ కాపీ రాగంలో ‘చరణములే నమ్మితి’ కల్యాణిలో ‘ననుబ్రోవమని చెప్పవే’ లాంటి కీర్తనలు అలాగే పాడతారు. ముఖ్యంగా - ‘పలుకే బంగారమాయెనా’లో ఆనంద భైరవి స్వరాలే ఉంటాయి.
సంప్రదాయ సంగీత విలువలను కాపాడుతూ తన సృజనాత్మకత కూడా జోడించి, తనకంటూ ఓ శైలిని సొంతం చేసుకున్న డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా శతాబ్దాలుగా ప్రచారమైన ఈ కీర్తనలు యథాతథంగా అలాగే పాడి ఒక లాంగ్ ప్లే రికార్డు ఇచ్చిన సంగతి మనకు తెలుసు.
రామదాసు తర్వాత ఒకటిన్నర శతాబ్దాల తర్వాతి వాడైన త్యాగరాజు స్వయంగా రామభక్తుడై వాగ్గేయకారుడై, ఆయన తల్లి రోజూ పాడే కీర్తనల బాణీలు, సాహిత్యం మనసుకు వొంటబట్టించుకున్నాడంటే ఆశ్చర్యం లేదు. రామదాసు పేరు చెబితే చాలు, వంగి దాసోహమ్మనే త్యాగయ్యకు ఆదర్శమూర్తి. ఆయన దివ్యనామ కీర్తనలకు మార్గదర్శి కూడా ఆయనే. అందుకే వీటిలో సమిష్టి చరణాలు చాలా ఉంటాయి. గమనించండి. ఒకప్పుడు పౌరాణిక కథలు, గాథలు, భక్తుల చరిత్రలు తెరకెక్కించే అలనాటి సినీ రంగ ప్రముఖులు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. రామదాసు, త్యాగయ్య, వేమన పాత్రలు చేసిన చిత్తూరు వి.నాగయ్య దీనికి ఉదాహరణ. ఆ రోజుల్లో వాళ్లు ‘పామరులకు మాత్రమే నచ్చితే చాలు. మన పంట పండినట్లే అనుకోలేదు. పండితులు, విద్వాంసులు పొరబాటున విన్నా, చూసినా, ఆక్షేపణలకు తావు లేకుండా జాగ్రత్త పడేవారు. ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. పాటైనా, పద్యమైనా, మార్పు చేయడానికి జంకేవారు.
* * *
సంప్రదాయ సంగీత సినిమాలకు గౌరవం తెచ్చిన సంగీత దర్శకులు, గాయకులున్న.. స్వర్ణయుగపు రోజులవి. అనాదిగా ప్రసిద్ధమైన ఈ రామదాసు కీర్తనల బాణీలు మార్చేసి వేర్వేరు బాణీలలో పాడించటం అసలా సంకల్పం కలగడమే వారి అమాయకత్వానికి పరాకాష్ఠ.
రామదాసు సంగీతం నరనరాల్లో జీర్ణింపచేసుకున్న వారు ఇతర బాణీలు పాడరు. వినరు. విద్వాంసులు మెచ్చరు. మన కంటే ముందే ఇదంతా ఊహించి, ఎవరు పడితే వారు, అరకొర జ్ఞానంతో పాడకుండా, శాస్త్ర ప్రమాణంతో (నొటేషన్ రాసి) నియమ నిష్ఠలతో సాధన చేస్తేనే తప్ప పాడే వీలు లేకుండా కట్టడి చేశారు మన మూర్తిత్రయంవారు. సాధికారికంగా పాడగలిగిన శిష్య ప్రశిష్య వర్గంవల్ల ఈ కీర్తనల జోలికి ఎవరూ రారు. రాలేరు కూడా. ఈ విషయంలో విద్వాంసులదృష్టవంతులు.
‘రామదాసు కీర్తనలకు వాడిన రాగ తాళాలు సరిగ్గా సరిపోయాయంటారా?’ అని ఓసారి డా.బాలమురళీకృష్ణను అడిగితే, ‘నా దృష్టిలో సరిపోయింది. నేను పాడిన కీర్తనలకున్న రాగాలు, ఆ సాహిత్యానికి సరిపోయాయి. మరో రాగంతో పాడి చూస్తే, ఆ రస భావం కనిపించదు’ అని నిర్ద్వంద్వంగా చెప్పారు.
శిష్యులంటూ లేకపోవడం, ఎలా పాడివుంటారో ఎవరికీ తెలియకపోవడం కారణంగా మహాభక్తుల రచనలు సాధారణ గాయకుల నోళ్లల్లో పడి విస్తృతమైన ప్రచారమయితే అవ్వచ్చు. ఆ పాటలు పరిణతి లేని సంగీత జ్ఞానం కలిగిన వారివల్ల పలుచనయ్యే ప్రమాదమే ఎక్కువ.
అన్నమయ్య పదాల అర్థం తెలుసుకోవడం ఒక ఎత్తయతే, వాటి పరమార్థం తెలుసుకోవడం మరొక ఎత్తు. తెలుసుకుంటే తెలియనివి, తెలీదు అనుకుని మోకరిల్లితే విచ్చుకుని విప్పారి తమకు తాముగా మనముందు ప్రత్యక్షర ప్రత్యక్షంగా నిలిచేవి. అంతటి గొప్ప సాహిత్యం అన్నమయ్యది. ఆ కీర్తనల్లోని నిగూఢ తత్వాన్ని అందుకుంటూ లోతుగా వెళ్లి అర్థం చేసుకోగలిగిన స్థాయలో సంగీతం ఉండాలి. అలాగే పరమ భక్తుడైన భద్రాచల రామదాసు కీర్తనలు ఎన్నో దశాబ్దాలుగా ఒక పద్ధతిలో సంప్రదాయ రాగాల్లో, రామమందిరాల్లో భక్తులు పాడగా పాడగా ప్రచారమైపోయాయ. అలా సుస్థిరమై ప్రచారమైపోయన కీర్తనల బాణీలు మార్చే దుస్థితి రాకూడదు.
మూలాధారం నుండి పుట్టే నాదాన్ని పట్టుకున్న వారికి మాత్రమే నాద యోగం సిద్ధిస్తుంది. అపుడు వాళ్లకు శారీరక మానసిక బాధలు ఏమీ తెలియవు. ఆ లోతుల్లోకి అందరు వెళ్లలేరు. వెళ్లలేని వారికి అందులోని మర్మం ఎలా తెలుస్తుంది? ముద్రణా యంత్రాల్లో కూర్చుని భగవద్గీతను కంపోజ్ చేసేవారికి గీతలో ఒక్క శ్లోకం కూడా తెలియదు. సంగీతమైనా అంతే. లోతుగా వెళ్లి తెలుసుకోవాలనుకునే వారికి ఒక్క జీవితం సరిపోదు.
సంగీతాన్ని ఆశ్రయించిన ఇటువంటి భక్తులు మళ్లీమళ్లీ పుట్టకుండా వుండే మార్గాలు వెతుక్కుంటూ తిన్నగా భగవంతుడితోనే సంబంధం పెంచుకుంటూ వెళ్లారు. అబ్దుల్ హసన్ కుతుబ్‌షా తన ముందు తరాల వారి సంప్రదాయాల్ని నిలబెట్టడంలో, హిందువుల్ని చేరదీసి ఉన్నత పదవులిచ్చి గౌరవించాడు. ప్రజల దృష్టిలో ఆయన తానాషా అయ్యాడు (తానీషా కాదు.) ‘తానాషా’ అంటే మంచి ప్రభువు అని అర్థం. గోల్కొండ నవాబుల్లో యితనే ఆఖరివాడు. రామదాసు మామయ్యలు అక్కన్న, మాదన్న వల్ల శిస్తు వసూలుచేసే ఉద్యోగం ఇచ్చారు గోపన్నకు. వసూలుకు వెళ్లినచోట కాసేపు భజన కీర్తనలు పాడి, పాడించి వాళ్లను లాలిస్తూ మంచి మార్గంలో రావలసిన బకాయిలు తెలివిగా వసూలు చేస్తూండేవాడు. శిస్తు సొమ్ము ఖజానాకు వెళ్లలేదు. ఆశ పుట్టింది. రాముడి కోసం గుడి కట్టాలనిపించింది. ఆభరణాలు చేయించాలనిపించింది. ప్రభుత్వం దృష్టిలో నేరమే. అదాయన నైతిక పతనం కాదు. ఆధ్యాత్మికంగా ఎదిగిన సంగతి రాజులకెందుకు? చెరసాల గతైంది. నేరం నేరమేగా! మందీమార్బలంతో రెండు వేళ్లూ చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ వెళ్లలేదు. గుండెలో రాముణ్ణి ప్రతిష్టించుకున్నాడు. బెయిలు కోసం ఏడవలేదు. రాముడి కోసమే ఏడ్చాడు. మొరపెట్టుకున్నాడు. రక్షించమంటూ ఆకలిదప్పులు మాని ఆర్తితో పాడుకున్నాడు.
ఈ భక్తుడి బాధ ఆ భగవంతుడికి చేరింది. శత్రు దుర్భేద్యమైన తానాషా శయనాగారంలో సేవక వేషాల్లో ప్రవేశించిన ‘రామలక్ష్మణులు’ రామదాసు పంపిన బంటులమని పరిచయం చేసుకుని పైకం చెల్లించి చక్కా వెళ్లారు.
హిందువునీ, రామభక్తుణ్ణి అకారణంగా బాధలకు గురిచేసిన పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు తానాషా.
ఇక్కడ చెరలో రామదాసు శుష్కించిన దేహంతో శ్రీరామ మానస పూజలో మునిగిపోయాడు. విడుదలై రామభక్తి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజయ్యాడు.
నిత్య సంకీర్తనలూ, భజన కూటములు, సాధుజన సంతర్పణ, భద్రాచల రామసేవ చేస్తూ జీవన్ముక్తుడైన రామదాసు, గోల్కొండ సామ్రాజ్యం మొగల్ సైన్యాల స్వాధీనం అయ్యేనాటికి ఉద్యోగమిచ్చి పోషించిన అక్కన్న మాదన్నలు లేక, ఆదరించి గౌరవించిన తానాషా కూడా లేక, నిరాశావృతమైన ప్రపంచంలో జీవించడం ఇష్టంలేక వైరాగ్యంతో భద్రాచలం కొండ శిఖరాన్ని చేరి, సంకీర్తన గోష్టిలో వుండగా, ‘తరలీ పోదాం చాలా దయ యుంచండీ, ఇంక మరలీ జన్మకు రాము మదిలో నుంచండీ’ అని పాడుకుంటూ ఇహలోకం నుండి నిష్క్రమించాడు. చరితార్థుడయ్యాడు.
భద్రాచలంలో జరిగే ‘సీతారామ కల్యాణం’ ప్రత్యక్ష వ్యాఖ్యానం.. తెలుగువారి ఇళ్లల్లో ‘కల్యాణ శోభ’ను నింపేది. ఆ రోజుల్లో నేను రేడియోలో చేరిన కొత్తల్లో (1970లో) జమ్మలమడక మాధవరావు శర్మ, మల్లాది చన్ద్రశేఖరశాస్ర్తీ, ఉషశ్రీ మొ.వారల వ్యాఖ్యానం అయోధ్యను తలపించి సాగేది. సీతారామచంద్రులు మన కళ్లెదుట వున్న అనుభూతిని తెచ్చి మాట్లాడేవారు. ఆ కల్యాణ వైభోగ శోభ, ఆ వైభవం మరువలేనిది.
*

- మల్లాది సూరిబాబు 9052765490