S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దారి చూపే ప్రయాణీకుడు

ఒక నవలకు మంచి పేరు వస్తుంది. దాన్ని ఆధారంగా ఒక సినిమా వస్తుంది. అది సూపర్‌హిట్ అవుతుంది. అందుకు చాలామంది అవసరమని విడిగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది. అది నాలాంటి ఎంతోమంది మనస్సుల్లో నాటుకుంటుంది. మెదడులో తిరుగుతుంది. వ్యాసం రాయిస్తుంది.
ఆ నవల పేరు ‘ద గైడ్’. రచయిత రాసిపురం కృష్ణస్వామి నారాయణ్. అంటే ఆర్‌క నారాయణ్. ఆయన గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకామే రాయవచ్చు. ఇప్పటికే రాసి ఉంటారు. నా అవగాహన ప్రకారం నేను రాయవచ్చు అంటున్నాను. ఆయన బ్యాచెలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒక నవల రాశాడు. అటువంటి నవలలను అన్ని భాషల వారు చదవవలె. నిజానికి నారాయణ్ రచనలు అన్నింటినీ అందరూ చదవాలె. ఆయన విషయంగా విమర్శలు కూడా ఉన్నాయి. కానీ, ఆయన రచనలు అన్నీ గొప్పవి. ఇక మన గైడ్ వద్దకు వస్తే, అది పాఠ్యపుస్తకాలకు అనుబంధంగా వాడే గైడ్ కాదు. పురాణాలలోని గయుడు అంతకన్నా కాదు. ఊరికి వచ్చిన వారికి విశేషాలు చెపుతూ, ఊరు చూపించే మార్గదర్శకుడు. ఈ నవలలోని గైడ్ ఏ ఊరు చూపుతున్నదీ చెప్పడు. లేదా నాకు తెలియలేదు. చూడ వచ్చిన ఒక ముసలి పరిశోధకుని పడుచు పెళ్లాంతో ప్రేమలో పడతాడు. పారిపోతారు ఇద్దరూ. కథ మలుపులు తిరుగుతుంది. మనసులను నలుపుతుంది. ఇంతకూ తన నవలను సినిమాగా తీసిన తీరు నారాయణ్‌కు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. నవలను పూర్తిగా మార్చేశారు. యథాతథంగా తీస్తే సినిమా అంత బాగా వచ్చేది కాదేమో?
సినిమాలో ‘రాజూ’ గైడ్‌గా నటించినది దేవానంద్. అతను సిక్స్ ప్యాక్ రకం మగటిమి హీరో కాదు. ముఖంగా అందంగా ఉంటుంది. అన్ని సినిమాల్లోనూ, నిండు చేతుల అంగీలు తొడుక్కుంటాడు. అంటే, దారుఢ్యం ఏ మాత్రం లేని మనిషి. కానీ, నడక, కదలికలు, మాటల తీరు మాత్రం అయస్కాంతంలాగ ఆకర్షిస్తాయి. అలనాటి మేటి హీరోయిన్‌లు కామినీ కౌశల్ లాంటి వారి సరసన నటించిన దేవానంద్, మూడు తరాల నాయికలతో అదే ఉత్సాహంతో నటించాడు. మెప్పించాడు. కాలేజ్‌లో (నేను) ఉన్న కాలంలో జ్యుయెల్ తీఫ్ అని ఒక బొమ్మ వచ్చింది. అందులో హీరోయిన్ హేమమాలిని. వాళ్లిద్దరి కొరకు ఆ సినిమాను వరుసబెట్టి రెండుసార్లు చూచినా. అంటే మార్నింగ్ షో నుంచి బయటకు వచ్చి మళ్లీ వెంటనే మ్యాటినీ చూచిన అని అర్థం! అంత అభిమానం ఆ దేవానంద్ మీద. అతనిలాగ మాట్లాడాలని ప్రయత్నం. కుదరలేదు. ఇవాళటి అంగీ లాగులు రెంటికీ పొంతన అను మ్యాచింగ్ లేకుండా డ్రస్ వేసుకుంటున్నానంటే, అది దేవానంద్ ప్రభావమే. ‘గైడ్’ సినిమాలో అతడు ప్రేక్షకుల హృదయాలను ఖాళీ చేసి, అందులో తాను తిష్ఠ వేస్తాడు. మరీ పెద్దవాడయిన తరువాత కూడ నటించాలని ప్రయత్నించి పాపం భంగపడ్డాడు. తెరే ఘర్ కే సామ్నే, మహల్ లాంటి సినిమాలు గుర్తుకువస్తే దేవానంద్ మరోసారి మనసంతా నిండిపోతాడు. గైడ్ అనే సిన్మాలో హీరోయిన్ వహీదా రహమాన్. ఆమె మంచి నటి. కానీ, సినిమాలో ఆమెకు ప్రాముఖ్యం కనిపించదు. హీరోయే కథ నిండా, తెర నిండా కనిపిస్తాడు. బంగారు రంగు శాలువాతో దేవానంద్ తెర నిండా కనిపించిన దృశ్యం మరువలేనిది. అతనిలాగ మెడలో, మరో టీషర్ట్ ఉన్నట్టు కనిపించే పద్ధతిలో స్కార్ఫ్ కట్టుకోవటం వల్ల నన్ను చాలామంది, దేవానంద్ అభిమానిగా గుర్తించేవారు. తేరే మేరే సప్నే అని ఒక సినిమా వచ్చింది. హీరోయిన్ మరీ కొత్తమ్మాయి. దారాసింగ్‌తో బి-క్లాస్ సినిమాల్లో నటించిన ముమ్‌తాజ్ (ముంతాజ్ అనగూడదు!) కానీ దేవానంద్‌తో ఆ సినిమాలో ఎంత బాగుంటుందో! తరువాత ఆమెకు మంచి సినిమాలు చేసే ఛాన్స్‌లు వచ్చాయి. (ఇక్కడ ఆపక తప్పదు!)
గైడ్ అనే సినిమాకు సంగీతం ఇచ్చినది సచిన్‌దేవ్ బర్మన్ అనే ఎస్.డి.బర్మన్. ఆయన త్రిపుర రాజకుటుంబం మనిషి. జానపదంతో బాటు, శాస్ర్తియం దాకా, ఎన్నో సంగీత పద్ధతులను తరచి చూచిన మేటి. అన్ని సినిమాలలో లాగే గైడ్‌కు ఆయన చేసిన పాటలు అన్నీ బాగున్నాయి. ఈనాటికీ వాటిని అందరూ వింటున్నారు. ‘పియాతోసే నైనా లాగెరే’ అంటూ శాస్ర్తియ నృత్యానికి, అసలయిన శాస్ర్తియ రాగా ఆధారంగా చేసిన పాట మొదలు, ‘గాతా రహే మేరా దిల్’ అనే ప్రేమ పాట దాకా అన్నీ బాగున్నాయి. అయితే ఈ సినేమా లోంచి నాకు నచ్చిన పాట మాత్రం ‘వహాఁ కౌన్ హై తేరా, ముసాఫిర్’ అన్న బ్యాక్‌గ్రౌండ్ పాట. దానితోబాటు సినిమాలోని మరో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ‘పానీదే’ కూడా బర్మన్ స్వయంగా పాడాడు. అవి రెండూ బాగుంటాయి. మొదటి ముసాఫిర్ పాట మాత్రం ‘హాంటింగ్ మెలోడీస్’గా నేను ఎప్పుడూ గుర్తుంచుకునే పాటలలో ఒకటిగా మిగిలిపోయింది.
ఎస్.డి.బర్మన్ గొంతు హీరోలకు పాడే పద్ధతిలో ఉండదు. శాస్ర్తియ గానానికి అనువుగా ఉండే ఒక రకం బొంగురు గొంతు అది. కానీ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. కనుక ఆయన బ్యాక్‌గ్రౌండ్ పాటలు కొన్ని పాడి, వాటిని కలకాలం గుర్తుంచుకునే అవకాశం, నాలాంటి వారికి కలిగించాడు. ‘సుజాత’ అని ఒక సినిమా. అందులో ‘సున్ మేరే బంధూరే’ అని ఒక పాట. అప్పట్లో, అంటే రేడియో నేను బాగా వింటున్న కాలంలో వివిధ భారతిలో ‘జయమాల’ అని ఒక కార్యక్రమం వచ్చేది. అది దేశ సైనికుల కొరకు ప్రత్యేకించిన కార్యక్రమం. వారు కోరిన పాటలు వినిపించేవారు. వారానికి ఒకసారి మాత్రం ప్రసిద్ధులు ఒకరు వచ్చి, వారితో కబుర్లు చెపుతున్నట్టు మాట్లాడుతూ పాటలు వినిపించేవారు. అటువంటి ఒక ప్రోగ్రాంలో లతామంగేష్కర్ చెప్పిన ఒక సంగతి బాగా గుర్తుంది. ఈ సుజాతా పాట ఒక అమ్మాయి పాడినట్లు ఉంది. అందుకని లతా చేత పాడించాలని నిర్ణయించారు. సచిన్‌దా అనే ఎస్.డి.బర్మన్ ఆమెకు పాట నేర్పించాడు. మరునాడు రికార్డింగ్. ఆ లోపల ఆమె దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మరునాడు లత ‘మరోసారి చెప్పండి. రేపు రికార్డ్ చేయండి!’ అని అడిగింది. సరేనని మళ్లీ పాట చెప్పాడాయన. మూడవ నాడు ఆ మహాగాయని ‘దాదా! ఈ పాట నేను పాడలేను! మీరు పాడినంత బాగా పాడడం, నావల్ల కాదు. దీన్ని మీరే పాడండి’ అన్నది. ఎంత గొప్ప మనుషులు వాళ్లు. ‘అమ్మాయి పాటగదా? నేనెట్లా పాడను?’ అన్నాడు సచిన్‌దా. ‘్ఫర్వాలేదు!’ అన్నారు అందరూ. ఆయన పాడాడు. ఆ పాట ఇవాళటికీ సాటిలేనిదిగా నిలిచింది. (ఆపుదాము!)
మరోసారి గైడ్ గురించి! మరోసారి వహీఁ కౌన్ హై తెరా? గురించి. శైలేంద్ర అని కవి. ఆయన చాలా ఎక్కువగా రాయలేదని నా అనుమానం. సినిమాలో జైలు పాలయి, విడుదలయి వచ్చిన రాజూ గైడ్ ఎక్కడికి పోవాలన్నది తెలియక, గమ్యం లేకుండా తిరుగుతుంటాడు. ఇక వెనుక నుంచి పాట. ఈ కాలంలో సినిమాల్లో ఇంతగా కథలో కలిసే పాటలు ఉంటున్నాయా? తెలియదు. ‘ఎవరున్నారని వెళుతున్నావు. యాత్రికుడా? ఇక్కడున్న నీడ మరెక్కడ దొరుకుతుంది? ఈ ప్రపంచం నీటి మీద రాతల వంటిది. కనిపించినట్లే, తెలిసినట్లే ఉంటుంది. ఎవరికీ చేతికి అందదు’ వంటి మాటలను హిందిలో పొందికగా చేర్చిన తీరు అందంగా ఉంటుంది. ‘ఓహో! యాత్రికుడా?’ ‘బహుదూరపు బాటసారీ’ లాంటి పాటలు అన్నీ బాగుండడానికి కారణం, వాటిలోని భావం! రవీంద్రనాథ్ టాగోర్ ఈ బాటసారి పాటలు ఎన్నో రాశాడు. ‘తిమిర రాత్రి, అంధయాత్రి’ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుంది. ‘కుఛ్ తేరా న మేరా’ అన్న మాట తర్వాత, సంగీత దర్శకుడు వేయించిన ఒక బిట్, పాటలోని లోతును, ఎంతగా పెంచుతుందీ చెప్పలేము! పాట పహాడీ రాగంలో ఉంటుంది. ఇది సిసలయిన జానపదంలో నుంచి అరువు తెచ్చుకున్న రాగం. లలిత శాస్ర్తియంలో ఈ రాగం అందరికీ ఆనందం పంచింది. పంచుతున్నది.
కదిలించే కథ, అందగాడు, అద్భుతమయిన నటన చేతనయిన హీరో, అతనికి తగిన పాత్ర, ఆలోచింపజేసే సన్నివేశం, లోతయిన రచన, మనసును గట్టిపడేసే బాణీ, వరుస. ఇక గాయకుడుగా ఎస్.డి.బర్మన్. ఏది బాగున్నందుకు, మిగతావి బాగున్న భావం కలిగింది? ఇది జవాబు లేని ప్రశ్న! అన్నీ బాగున్నయి. అందుకే అద్భుంగా ఉంటుంది, చూచేవారికి. ఆ తరువాత రాజేశ్‌ఖన్నా హీరోగా వచ్చిన ‘ఆరాధన’ అనే సినిమాలో బర్మన్ ఒక తెర వెనుక గీతం పాడాడు. పాట మళ్లీ అంతగానూ బాగుంది. కానీ, గైడ్ పాటకు, దానికీ పోటీ లేదు! తలాష్ అనే సినిమాలో ‘తల్లీ పాట ఒకటి’ సచిన్‌దా పాడాడు. చక్కని పాట. పాత సినిమా ‘బంద్‌నీ’లో పడవ పాట! మేరే సాజన్ హై ఉస్ పార్! మళ్లీ ఎంతో బాగుంటుంది. మొత్తం మీద ఆయన పాడిన పాటలు చాలా తక్కువ. కానీ, అన్నీ బాగుంటాయి.
నారాయణ్, దేవానంద్, బర్మన్ లాంటి గొప్పవాళ్లంతా ఒకచోట చేరితే, ఒక గైడ్ వస్తుంది. అట్లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటే అత్యాశ. ఉన్నదానే్న ఎన్నిసార్లయినా చూడవచ్చు. చూడండి మరి!

కె. బి. గోపాలం