S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు 26

ముందు క్రైంబ్రాంచ్‌కి వెళదాం. నువ్వుండటానికి మరోచోట వెతకాలి..’ సాలోచనగా అన్నాడు.
రాసమణిని తీసుకుని కంట్రోలు రూమ్ చేరుకున్నాడు రాజేష్. అప్పటికి యుగంధర్ ఇంకా రాకపోవడంతో వెయిటింగ్ హాలులో కూర్చున్నారు. క్రైం బ్రాంచ్ కంట్రోలు రూము పైభాగంలో ఉంది. అక్కడే మిగతా ఆఫీసులు ఉండటంతో సిబ్బంది అటూ ఇటూ తిరుగుతున్నారు.
ఓ అరగంట తర్వాత వచ్చాడు యుగంధర్. రాజేష్ పక్కన చంటిబిడ్డతో తలవంచుకుని కూర్చున్న రాసమణిని చూసి తలపంకించాడు. పది నిమిషాలు గడిచాక తన మొదటి ప్రశ్న అడిగాడామెని.
‘నీకు భూపతి తెలుసా?’
‘తెలుసు’
‘ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసావ్?’
తన ముందున్న కాగితంలోని ఓ ఫొటో చూపించి అడిగేడు.
‘ఇతనేనా?’
తలూపింది రాసమణి.
‘్భపతి నీకెలా పరిచయం?’
ఆమె బలంగా ఊపిరి తీసుకుని వదిలింది.
‘నేను ఇంట్లోంచి వచ్చేసాక ఒకతను నన్ను భూపతికి అమ్మేశాడు. అప్పుడు అతని కంపెనీ లక్ష్మీ టాకీస్ దగ్గర ఉండేది. ఎందుచేతనో నేనంటే చాలా అభిమానం భూపతికి. అతను నన్ను ఏమీ అనేవాడు కాదు’
‘్భపతి ఎక్కడుంటాడు?’
‘నాకు తెలియదు’
క్రైం బ్రాంచ్‌లోని ఏఎస్సైని పిలిచి చెప్పాడు యుగంధర్.
‘ఈమె వద్ద వివేక్ హత్యికి సంబంధించిన సమాచారం ఉంది. స్టేట్‌మెంట్ తీసుకో...’
అతనితోపాటు అవతలి గదిలోకి వెళ్లింది రాసమణి. బ్యాంక్ నుంచి తను తెచ్చిన స్టేట్‌మెంట్ ఇచ్చి, తెలుసుకున్న సమాచారం యుగంధర్‌కి చెప్పాడు రాజేష్. ఓ గంట తర్వాత రాసమణి నుండి తీసుకున్న స్టేట్‌మెంట్ రఫ్ కాపీ తెచ్చి యుగంధర్‌కి ఇచ్చాడు ఏఎస్సై. అది చదివి సరిపోతుందన్నట్టు తలూపి తిరిగి ఇచ్చేసాడు.
‘రెండు మూడు రోజుల్లో ఈ నెట్‌వర్క్ మొత్తం నామరూపాల్లేకుండా పోతుంది. ఆ తర్వాత రాసమణి జీవించడం ఎలా?’ రాజేష్ కళ్లల్లోకి చూస్తూ అడిగేడు యుగంధర్.
‘నాకు స్పష్టమైన ఆలోచన అంటూ ఏమీ లేదు. కాని నేను ఉన్నంతవరకూ ఆమెకి ఎలాంటి కష్టం రాదు’ చెప్పాడు స్థిరంగా.
యుగంధర్ తలపంకించాడు.
* * *
సాయంకాలం నాలుగు గంటలకి ఇంట్లోంచి బయటకొచ్చాడు షరీఫ్. స్కూటర్ మీద బయలుదేరి చినవాల్తేర్ జంక్షన్‌లో ఆగాడు. కిళ్లీ షాపులో సిగరెట్లు కొనుక్కుని ఒకటి వెలిగించాడు. పక్కనే ఉన్న టీ కొట్టులో టీ తీసుకుని తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయాడు.
అతనికి చాలా విసుగ్గా ఉంది.
గంగిగోవు లాంటి రాసమణి అదృశ్యం కావడం ఊహించని పరిణామం. ఎవరో సాయం చేస్తే తప్ప ఆమె అలాంటి పని చెయ్యదు. తన వల్లనే ఆమె పారిపోయిందని తెలిస్తే ముందు గంగోత్రి ఊరుకోడు. రెండు మూడు గంటల్లో రాజేష్ దగ్గర రాసమణి ఉందో లేదో తేలిపోతుంది. అక్కడుంటే తిరిగి తీసుకురావడం చాలా తేలిక.
లేకపోతే?
ఆ ప్రశ్నకి సమాధానం తోచకపోవడంతో తల విదిలించాడు. నిన్నటి నుంచి పనులన్నీ గాలికి వదిలేసి రాసమణిని వెదకడంలో మునిగిపోయేడు. తనేం చెయ్యాలో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఓపిక పట్టాలి. బ్యాంక్ దగగర ఉంచిన మనిషి రాజేష్ ఇంటికి వెళ్లిన వెంటనే ఫోన్ చేస్తాడు. టీ తాగడం ముగించి అక్కడ నుంచి బయలుదేరాడు.
ఆంధ్రా యూనివర్సిటీ మీదుగా సిరిపురం దాటి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ చేరాడు. స్కూటర్ కుడి వైపునకు తిప్పి రామా టాకీస్ దాటాక ఓ సందులోని కారుషెడ్ దగ్గర ఆగాడు. లోపలికి నడిచి చివరి పార్కు చేసిన బ్లూ కలర్ శాంత్రో వెనుక డోర్ తెరిచాడు. సీటులోని ఎరుపు రంగు వ్యానిటీ బ్యాగ్ అందుకుని తిరిగి డోర్ మూసి షెడ్ బయటకి వచ్చాడు. డిక్కీలో బ్యాగ్ ఉంచి సెల్ తీసి ఓ నెంబర్‌కి చేశాడు.
‘వస్తున్నావా?’ అడిగేడు.
ఆ ప్రశ్నకి జవాబు విని సెల్ ఆఫ్ చేసి స్కూటర్ పోనివ్వసాగేడు. ఎడమ వైపు సందులోకి తిరిగి పదడుగులు వెళ్లేసరికి ఎదురుగా ఓ జీపు వచ్చి స్కూటర్‌కి అడ్డుగా ఆగింది. షరీఫ్ తేరుకునే లోపు ఇద్దరు వ్యక్తులు అతన్ని జీపు ఎక్కించారు. మరో వ్యక్తి డిక్కీ తెరిచి వ్యానిటీ బ్యాగ్‌ని ముందు సీటులో కూర్చున్నతనికి అందించాడు. వాళ్లు మఫ్టీలోని పోలీసులని అర్థమైంది షరీఫ్‌కి. అంత కచ్చితంగా తన కదలికలు వాళ్లకి ఎలా తెలిసాయో బోధపడలేదు.
జీపు కంట్రోలు రూము ముందు ఆగింది. షరీఫ్‌ని తీసుకెళ్లి క్రైం బ్రాంచ్ ఇంటరాగేషన్ రూములో కూర్చోబెట్టారు. అతని జేబులోని వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని సెల్ మాత్రం టేబుల్ మీద ఉంచారు.
కొన్ని నిమిషాల తర్వాత యుగంధర్ ఆ గదిలోకి వచ్చాడు. షరీఫ్ ఎదురుగా కుర్చీలో కూర్చుని చిన్నగా నవ్వేడు. వాళ్లిద్దరి మధ్యా పొడవాటి టేబుల్, దాని మీద షరీఫ్ సెల్ ఉన్నాయి.
‘నీ పేరు?’ అడిగేడు యుగంధర్.
‘తెలియకుండా తీసుకొచ్చారా నన్ను?’ చురుగ్గా ఎదురు ప్రశ్నించాడు.
‘తెలుసు.. నీ ద్వారా తెలుసుకోవడం పద్ధతని అడిగాను. ఏం చేస్తుంటావ్?’
‘మా లాయరు వచ్చేదాకా నేనేం చెప్పను’ విసురుగా అన్నాడు.
‘లాయరు ఎలా వస్తాడు? నువ్విక్కడ ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలియదుగా..’
అదే సమయంలో షరీఫ్ సెల్ మోగింది. కుడిచేత్తో దాన్ని అందుకుని డిస్‌ప్లే చూశాడు యుగంధర్.
‘అడైవర్ చేస్తున్నాడు. బ్యాగ్ కోసం టి.బి. హాస్పిటల్ దగ్గర ఉన్నాడట’ అని షరీఫ్ కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో చిన్నపాటి విస్మయం.
‘నీ పేరు షరీఫ్. వయసు నలభై సంవత్సరాలు. ఇరవై ఏళ్ల నుంచి అమ్మాయిల్ని తార్చే పనిలోను, వ్యభిచార గృహాలకి అమ్మాయిల్ని చేర్చే పనిలోను ఉన్నావు. ఏడేళ్ల క్రితం ఓ అమ్మాయిని మోసగించిన కేసులో ఆర్నెల్లు జైలుశిక్ష అనుభవించావు. నాలుగు రోజుల క్రితం వివేక్ అనే యువకుడ్ని హతమార్చావు’
ఉలికిపాటు నేర్పుగా కప్పి పుచ్చుకున్నాడు షరీఫ్.
‘నిజమేనా?’
‘లాయర్ వచ్చాక చెబుతాను’
‘లాయరు మాత్రం ఏం చేస్తాడు? వివేక్‌ని నువ్వే హత్య చేసినట్టు తిరుగులేని సాక్ష్యాలున్నాయి. రుషికొండ బీచ్ మెయిన్ రోడ్డు మీద వైను షాపులో ఓడ్కా క్వార్టర్ బాటిల్ కొన్నావు. దాని మూత తెరిచేటప్పుడు ఎక్సైజ్ వారి లేబుల్ తీసి బాటిల్‌కి అంటించావు. వాటర్ బాటిల్లో ఓడ్కా కలుపుకుని తాగావు. ఆ రెండు సీసాల మీద నీ వేలిముద్రలున్నాయి. అవి హత్యాస్థలంలో దొరికాయి. ఈ సాక్ష్యాలు చాలవా నిన్ను లోపల వెయ్యడానికి?’
ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్టు చూసి నెమ్మదిగా అన్నాడు.
‘నాకేం తెలియదు...’
మళ్లీ మోగింది షరీఫ్ సెల్. యుగంధర్ దాని డిస్‌ప్లే చూశాడు.
‘టి.బి. హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నానని, నువ్వు సెల్ ఎత్తడం లేదని, గంగోత్రికి కాల్ చేసి చెప్పాడు డ్రైవర్. అతను నీకు చేస్తున్నాడు’ నవ్వేడు యుగంధర్.
మాట్లాడలేదు షరీఫ్.
‘ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ హైటెక్ వ్యభిచారంలో ఉన్నారు?’ సెల్ టేబుల్ మీద ఉంచి అడిగేడు యుగంధర్.
‘నాకు తెలియదు’
‘సరే... నీ ఇష్టం’ అని, రెండు క్షణాల తర్వాత తిరిగి అన్నాడు, ‘నీ సెల్ ఖరీదైంది. ఈ మోడల్ సెల్‌లో నెట్ సదుపాయం ఉంది. ఇలాంటి సెల్ ఉపయోగించడానికి నువ్వేం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కాదు. సో... అబ్బాయిల, అమ్మాయిల ఫొటోలతోపాటు వివరాలు కూడా ఇందులో ఉంటాయి’
షరీఫ్ కళ్లనిండా భయం చోటు చేసుకుంది. తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి అత్యంత ప్రమాదకారి అని అర్థమయింది. అక్కడ నుంచి బయటపడితే తప్ప తనేం చెయ్యలేడు. గంగోత్రి కల్పించుకుని తను అక్కడున్నట్టు తెలుసుకుంటే తప్ప తను బయటపడలేడు.
‘మీరు ఒకసారి గంగోత్రితో మాట్లాడండి’ షరీఫ్ అన్నాడు.
‘దేనికి?’
‘ఈ వ్యవహారం అతను సెటిల్ చేస్తాడు..’
‘నిన్ను వదిలేస్తే ఎంతిస్తాడు? మిగతా నేరాలు పక్కనపెడితే నువ్వు హత్య కేసులో ఇరుక్కున్నావు. ఉరిశిక్ష పడటానికి అవసరమైన సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి. ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం’
మళ్లీ మోగింది షరీఫ్ సెల్. విసుగ్గా దాన్ని అందుకుని స్విచ్ ఆపేశాడు యుగంధర్. ఆ తర్వాత నిదానంగా షరీఫ్ ముఖంలోకి చూశాడు.
‘మనిద్దరం ఓ ఒప్పందం చేసుకుందాం...’
అతను ప్రశ్నార్థకంగా చూశాడు యుగంధర్‌ని.
‘ఈ హత్యా నేరం నీ మీదకి రాకుండా సాక్ష్యాలు తారుమారు చేస్తాను. దానికి బదులుగా మీ నెట్‌వర్క్ సమాచారం ఇవ్వాలి’
తల అడ్డంగా ఊపేడతను.
‘తొందరలేదు ఆలోచించుకో. నేను ఎలాగూ ఆ సమాచారం సేకరిస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినా నాకేం ఉపయోగం ఉండదు’
‘్భపతికి తెలిస్తే ఊరుకోడు’
‘అతను మీ బాసా? ఎక్కడుంటాడు?’
‘దుబాయ్‌లో. దావూద్ ఇబ్రహీంకి కుడి భుజం. నన్ను అరెస్ట్ చేసి ఏదో సాధించానని అనుకోవద్దు. ఒకసారి హిట్ లిస్ట్‌లోకి పేరు ఎక్కితే నూకలు చెల్లిపోయినట్టే. నా మాట విని గంగోత్రితో మాట్లాడండి’
‘్భపతి దుబాయ్‌లో ఉన్నాడని, అతను దావూద్ ఇబ్రహీం కుడి భుజమని ఎలా నమ్మడం?’ అడిగేడు యుగంధర్.
అయిదేళ్ల క్రితం దావూద్ ఇబ్రహీం పిలిస్తే ఇక్కడ నుంచే వెళ్లాడు భూపతి. అతను దుబాయ్ వెళుతున్న సందర్భంగా పార్టీ ఇచ్చేడు. అర్ధరాత్రి ముంబై రైలు ఎక్కించి వచ్చాడు గంగోత్రి’ చెప్పాడు షరీఫ్.
‘అతన్ని రైలు ఎక్కించడానికి నువ్వు వెళ్లలేదా?’
‘లేదు. అప్పటికే అందరం బాగా తాగి ఉన్నాం. అందుకని గంగోత్రి వెళ్లాడు’
‘కారులో వెళ్లి ఉంటారు. ఆ కారు డ్రైవర్ ఉన్నాడా?’
‘లేడు. మరునాడు ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్‌లో పోయాడు’
‘్భపతి దుబాయ్ వెళ్లాక అతనితో ఎన్నిసార్లు మాట్లాడావ్?’
‘అతను గంగోత్రితో మాట్లాడతాడు. ఏదైనా ముఖ్యమైన వ్యవహారం సెటిల్ చెయ్యాల్సి వచ్చినప్పుడు భూపతి సలహా తీసుకుంటాడు గంగోత్రి’
ఇంతలో క్రైం బ్రాంచ్ ఉద్యోగి ఒకతను రెండు కప్పులతో టీ తెచ్చాడు. ఒకటి యుగంధర్ ముందు పెట్టి రెండోది షరీఫ్ ముందు ఉంచాడు.
‘టీ తీసుకో...’ చెప్పాడు యుగంధర్.
‘నాకో సిగరెట్ కావాలి’ అడిగేడు షరీఫ్.
తన సబార్డినేట్ వైపు చూసి తలూపేడు యుగంధర్. అతను ఓ సిగరెట్, అగ్గిపెట్టె తెచ్చిచ్చాడు. షరీఫ్ సిగరెట్ వెలిగించుకుని బలంగా రెండు దమ్ములు లాగి టీ కప్పు అందుకున్నాడు.
‘మీ డీల్ అంగీకరించాక ఆ తర్వాత మీరు మాట తప్పితే?’ ప్రశ్నించేడు షరీఫ్, ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ.
పని పూర్తయినట్టు వెనక్కి వాలేడు యుగంధర్.
* * *
‘గంగోత్రిని..’
‘చెప్పు..’
‘సాయంకాలం నాలుగున్నర నుంచి షరీఫ్ ఏమయ్యాడో తెలీడంలేదు. మొదట్లో సెల్ రింగయింది. ఇప్పుడు ఎన్నిసార్లు చేసిన స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. మీ వాళ్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారా?’
‘అలాంటిది ఏమీ లేదు’
‘డాబా గార్డెన్స్‌లోని ఓ సందులో ఉంది అతని స్కూటర్. షరీఫ్ కాల్ చేసిన పది నిమిషాలకి డ్రైవర్ టి.బి. హాస్పిటల్ దగ్గరకు వెళ్లాడు. న్యాయంగా అప్పటికే షరీఫ్ అక్కడ ఉండాలి. స్కూటర్ ఉన్న సందులోని ఒకతను చెప్పిన దాన్నిబట్టి స్కూటర్ మీద వచ్చిన మనిషిని జీపులో తీసుకెళ్లారని తెలిసింది. అది పోలీసు జీపు...’
‘కనుక్కుంటాను. ఆఫీసులో అర్జంటు మీటింగ్ ఉందని కమీషనర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు అక్కడికే బయలుదేరాను. మీటింగ్ అయ్యాక నీకు కాల్ చేస్తాను’
అంతవరకూ గంగోత్రితో మాట్లాడిన స్పెషల్ బ్రాంచ్ అధికారి తన వాహనం దిగి కమీషనర్ ఆఫీసులోకి నడిచాడు. ఆఫీస్ ఆర్డర్లీ సెల్యూట్ చేసి తలుపు తీసి పట్టుకున్నాడు. అతను లోపలికి ప్రవేశించి ఆ గదిలోని పోలీసు ఆఫీసర్స్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. సిటీ పోలీస్ కమీషనరేట్‌లో అత్యంత కీలకమైన వ్యక్తులు వాళ్లు.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994