S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్నేక్

నాజన్మ నక్షత్రం విశాఖ. నక్షత్రాధిపతి గురువు. మీన లగ్నం. లగ్నాధిపతి కూడా గురువే. ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణుడి జన్మనక్షత్రం కూడా విశాఖే. మంగళవారం పుట్టేను. కుజుడి అధిష్టాన దేవత దేవ సేనాధిపతి కుమారస్వామి.
అధివృక్షం నాగకేసరం. వ్యాఘ్రయోని. అధిదేవతలు ఇంద్రాగ్నులు.
ఇంద్రాగ్నేసైన విద్మహే.. మహాశ్రేష్టాయ ధీమహీ.. తన్నో విశాఖ ప్రచోదయాత్.. అని రోజూ 108 సార్లు నా నక్షత్ర గాయత్రి చదువుకొంటూంటాను.
నా చైనీస్ సైన్ ‘స్నేక్’. నాగుబాము. నాకే యింత గురుబలం వుండి.. నేనే నాగుబామునైతే.. జోషీ నన్ను నారాయణ నాగబలి, రాహు శాంతి కాలసర్ప శాంతి.. చేయించుకోమంటాడేంటి?
* * *
‘నాకు తెలిసిన గురూజీ ఉన్నారు నాసిక్‌లో. మాట్లాడి చెప్తాను. ఎప్పుడు రమ్మంటారో’ అంటూ తన గురూజీ అడ్రెస్ ఇచ్చేడు జోషీ. నా జూనియర్.
జోషి నాకు జూనియర్ అయినా, జాతకాలూ, మంచీ చెడులూ చెప్పడానికి అతనే నా గురువు. ఎప్పుడో మాట వరుసకి అతనితో అన్నాను, ‘ఇంకా రెండు సంవత్సరాలలో రిటయిరవుతున్నాను. పనులు ఏవీ ఒక కొలిక్కి రాలేదు. వచ్చే సూచనలు కూడా కనబడడం లేదు’ అని.
కంప్యూటర్లో వివరాలన్నీ వేసి, కుండలిలో గ్రహస్థానాల్ని పరిశీలించేడు. చాలాసేపటికి ‘మీకు కాల సర్ప దోషం వున్నది. నాసిక్ వెళ్లి రండి సార్’ అన్నాడు జోషి.
ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే, మా పెద్దవాడు ప్రసాద్ వాళ్లమ్మతో చెబుతున్నాడు, ‘నాసిక్‌లో ఒక జర్మన్ కంపెనీ వాళ్లు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. వాళ్లకి కాస్టింగ్ యంబిఏ వాళ్లే కావాలిట. వచ్చే నెల మూడో తారీకున వెళ్లాలి. నాసిక్ సాత్‌పూర్ రోడ్డులో కంపెనీ ఉన్నదిట’ అని.
ప్రక్కనే ఆఫీసు ఫైలు చూసుకుంటున్న నాకు వాళ్ల మాటలు వినబడినై.
నాసిక్ ఆర్‌ఎస్‌లో దిగి త్య్రంబకేశ్వర్ దారిలో సాత్‌పూర్ రోడ్డులో వున్న ఆ కంపెనీకి వెళ్లాలి ప్రసాద్.
రాత్రి భోజనం తర్వాత, శ్యామలతో అన్నాను, టీవీ చూస్తూ, ‘నేనూ, నువ్వూ నా ఆఫీసు జీపులో తీసుకెళ్దాంలే. ప్రసాద్‌ని కంపెనీలో దింపి, అతని ఇంటర్వ్యూ అయ్యే లోపలే, మనిద్దరం త్య్రంబకేశ్వరం మహాదేవుడి దర్శనం చేసుకుని వద్దాం. అక్కడ జోషీ చెప్పిన గురూజీ వున్నారు. ఆయన్ని కూడా చూసి వద్దాం. నా సంగతెలా వున్నా, జోషీ సంతోషిస్తాడు’ అని.
‘ఎటూ ఆఫీసు జీపు వున్నది కదా. డ్రైవర్ ‘ఖటాళే’ వున్నాడు. వస్తాడులే. ఆ రోజు ఆదివారమే. అతని ఊరు కూడా నాసిక్కే’ అని అంటూ వుండగా, ప్రసాద్ నా మాట విన్నాడల్లే వుంది. వాడి రూము నుంచే ‘నేను వెళ్లి వస్తాను లెండి. అందరూ పొలోమంటూ ప్రయాణం కట్టక్కర్లేదు’ అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను.
నేనూ శ్యామలా బయలుదేరడం గురించి రుసరుస లాడేడు ప్రసాద్. ‘ఆదివారం మీ జీపు ప్రయాణం నాకిష్టం లేదు’ అంటూ, విసుక్కుంటూ వెళ్లిపోయేడు, ప్రసాద్.
శ్యామలతో అన్నాను. ‘మా ఏరుూలూ డీరుూలూ, అందరూ నాసిక్ ఆదివారాలు వెళ్లి వస్తూనే ఉంటారు. వంద మైళ్లే కదా. ఏమీ మునిగిపోయింది లేదు’ అని.
* * *
ఎనిమిదింటికల్లా డ్రైవర్ ‘ఖటాళే’ వచ్చేడు. తీరా కంపెనీకి చేరి టైం చూసుకుంటే పదకొండు గంటలయింది. ఇంటర్వ్యూ లంచ్ తర్వాత, మూడింటికిట అన్నారు. క్యాంటీన్‌లో లంచ్ చేసి, మేమిద్దరం ప్రసాద్‌ని తన పని చూసుకుని ఉండమని చెప్పి, ‘ఖటాళే’ నేనూ శ్యామలా, త్య్రంబకేశ్వరుడి దర్శనానికి బయలుదేరాం.
వాతావరణం బాగానే ఉంది. కానీ త్య్రంబకేశ్వర్ అరగంటలో జేరుతామనంగా దట్టమయిన మబ్బులు, జోరున వర్షం. అలాగే ఓ గంట తర్వాత గుడికి చేరేం. ఆలయ ప్రాంగణమంతా నీటితో నిండిపోయింది. అంతా చిత్తడిచిత్తడిగా ఉంది. కిటకిటలాడే భక్తులతో, అలాగే జాగ్రత్తగా గుళ్లోకి వెళ్లి దర్శనం చేసుకున్నాం. పది నిమిషాలు కూర్చోడానికి కూడా పొడిగా చోటు దొరకలేదు.
బయటకు వచ్చి, గురూజీ అడ్రెస్ కనుక్కుని, జీపులోనే వెళ్లి ఆయన్ని కలిసేం. జోషీ ఫోన్ చేసేడు. ‘వచ్చే నెల రెండో వారంలో వచ్చి కలవండి. మూడు రోజులుండాలి. గోదావరి ఒడ్డున పూజ చేయించాలి. ఇక్కడే ఉండటానికి వసతి వున్నది’ అని చెప్పేడు గురూజీ. ఆ మాటే జోషికి కూడా చెప్పేడు.
అలాగేనంటూ సెలవు తీసుకున్నాం. తిరుగు ప్రయాణంలోనూ జోరున వర్షం పడుతూనే ఉంది. సగం దూరం వెళ్లి ఉంటాం. యధాలాపంగా వెనక్కి తిరిగి చూసేను. ఒక ‘ట్రాక్స్’ పెద్ద వెహికల్ చాలా స్పీడుగా వస్తోంది. ఇద్దరు కుర్రాళ్లు ముందు కూర్చుని ఉన్నారు. మమ్మల్ని ఓవర్‌టేక్ చేయబోయేరు. మా డ్రైవర్ ఎలర్ట్ అయ్యేడు. జాగ్రత్తగానే నడుపుతున్నాడు.
ఎదురుగా వస్తున్న మారుతీ కారుని తప్పించబోయి, మా జీపును, చాలా వేగంగా వెనుక నుండి కొట్టేడు, ‘ట్రాక్స్’వాడు.
* * *
మా జీపు వెళ్లి చాలా పెద్ద రావిచెట్టుకు గుద్దుకుని నిలిచిపోయింది. ‘ఖటాళే’ నిలబడి, బ్రేక్ వేసి, ప్రమాదం నుండి బయటపడ్డాడు. కానీ నుదురు చిట్లింది. స్టీరింగ్ పొట్టలో గట్టిగా గుచ్చుకున్నది.
శ్యామల విండ్ స్క్రీన్‌ని పగలగొట్టుకుని, ముందు బోనెట్ మీదికి విసిరివేయబడింది. కుడికాలు, గేర్ బాక్స్‌లో ఇరుక్కునిపోయింది. ఎడమ చేత్తో, నా ముందున్న స్టీల్ రాడ్‌ని పట్టుకున్నందుకు, మణికట్టు విరిగింది. కుడికాలు ఫ్రాక్చర్ అయింది బాగా. నేనూ, డ్రైవర్, పక్క సీట్లో కూర్చుని ఉన్నాను. చాలాసేపు నేను ఎక్కడ వున్నానో తెలియదు. వెతకంగా లోపల కాళ్లు పెట్టుకునే కంపార్ట్‌మెంట్‌లో, ఒక మూల కాళ్లు ముడుచుకుని గువ్వలా పడివున్నానుట. కారు అంతా రక్తం మడుగు. మబ్బులు దట్టంగా ఉండటంతో, నాలుగింటికే చీకటి కమ్మింది.
ఎవరో పల్లెటూరి రైతులు ట్రాక్టర్‌లో వెళ్తూ, చూసి మమ్మల్ని సివిల్ హాస్పిటల్‌కి చేర్చేరుట. వెనుక నుండి యాక్సిడెంట్ చేసిన వాళ్లు, వాళ్ల బండి పట్టుతప్పి పక్కనే వున్న గోతిలో పడగానే, కారు వదిలి పారిపోయేరు.
లైసెన్స్ లేనివాడు నడుపుతున్నాడుట. యిద్దరూ బాగా తాగి వున్నారుట.
నాకు స్పృహ వచ్చిన తర్వాత తెలిసిన గాథ ఇదీ!
ఫోన్ పని చేస్తూనే ఉన్నది. నాకు స్పృహ రాగానే ప్రసాద్‌తో నా జూనియర్ జోషీకి ఫోన్ చేయమని చెప్పేను. ఆఘమేఘాల మీద, పుట్టెడు ఆందోళనతో వచ్చేడు ప్రసాద్. ఆఫీసు వాళ్లంతా గగ్గోలు పెట్టేరు. మా ఏవో సేవానీ, జోషీ డీజీయమ్ వార్వనేతో సహా అందరికీ వార్తని చేరవేసేరు.
సేవానీ, వార్వనే, నాసిక్‌లో మా డిపార్ట్‌మెంట్ వాళ్లకి ఫోన్ చేసి, మా విషయం చెప్పేరు. వెంటనే వెళ్లి మేము ఎలా వున్నామో చూడమని, అవసరమైన సహాయం చేయమని.
సివిల్ హాస్పిటల్‌లో వాళ్ల క్రమం వాళ్లు మొదలుపెట్టేసేరు. ఇంతలో నాసిక్ సర్కిల్, స్ట్ఫా, ఆఫీసర్లూ, ఒక ఇరవై మంది హాస్పిటల్‌కి వచ్చేరు. అందులో వాళ్ల స్నేహితుడు ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ కూడా వున్నాడు.
ఈలోగా పోలీసులు కూడా వచ్చేరు. జరిగింది చెప్పేరు. నా భార్య, డ్రైవరూ, దెబ్బలు తగిలిన ట్రామాలో నేనూ, ఏం చెప్పేనో నాకే తెలియదు. నా లోపలి అలజడి వలన పర్మిషన్ తీసుకోకుండా ఆఫీసు జీపు, హెడ్ క్వార్టర్స్ బయటకు తీసుకొచ్చేననే ఇన్‌స్పెక్టర్ పంచనామాలో నేను చెప్పినట్లు కూడా రాసుకున్నాడు.
ఈ తతంగం అవుతుండగా, డైరెక్టరీ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ బజాజ్ వచ్చేడు. డీజియం వార్వనే ఫోను చేసి మాకు కావాల్సిన ట్రీట్‌మెంట్ సరిగ్గా జరుగుతున్నదీ లేనిదీ చూడాలని చెప్పేరుట, బజాజ్‌కి.
* * *
అర్ధరాత్రి పనె్నండు గంటలకు మా ముగ్గుర్నీ మంత్రి యాక్సిడెంట్ హాస్పిటల్‌కి మార్చారు. అంతా మా డిపార్ట్‌మెంట్ ఎఫిషెన్సీ.
పది రోజులు గడిచేయి. నేనూ, ఖటాళే, త్వరగానే కోలుకున్నాం. శ్యామల కోసం నెల రోజులు అక్కడే వుండాల్సి వచ్చింది. బజాజ్ లోకల్ వ్యక్తి. అతనూ, మా ఇంజనీరు గుప్తా అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్తున్నారు. క్యారియర్ కూడా పంపేవారు.
‘డిశ్చార్జ్ అయే లోపల త్య్రంబకేశ్వర్ యస్సై సావంత్ మిమ్మల్ని స్టేషన్‌కి రమ్మంటున్నాడు’ అన్నాడు ఓ రోజు బజాజ్.
యాక్సిడెంట్ చేసిన వాళ్ల మీద కేసు పెట్టండి. కంపెనే్సషన్ ఇప్పిస్తానన్నాడుట సావంత్. నేను రానన్నాను.
‘నాకు ఎవరి మీదా కేసు పెట్టాలని లేదు. ఆ రోజున ట్రామాలో నేనసలు ఏం స్టేట్‌మెంట్ ఇచ్చానో కూడా తెలీదు. ఆఫీసు వాళ్లడిగితే నేను సంజాయిషీ చెప్పుకుంటాలే. డీజీయం, జీయం, ఎవరైనా సరే. ఇదంతా ఎస్సైకి అవసరం లేదు. అసలు యాక్సిడెంట్ చేసిన వాళ్లని వేధించమని చెప్పండి ఎస్సైకి.. బజాజ్. నేను విక్టిమ్‌ని. నా వెంబడి పడటమేమిటి?’ అనేది నా ప్రశ్న. మధ్య బజాజ్ యిటూ అటూ తిరుగుతున్నాడు ఆందోళనతో.
నెల రోజుల తర్వాత, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు, ఇంటికి చేరేము.
నేను ఆఫీసుకి వెళ్లేను. జీయమ్, డీజియమ్, ఏమంటారోననే భయం. గుబులు. అపరాధ భావంతో వేదన. ఆఫీసులో అందరూ పలుకరించేరు. మా పీఆర్వో ఛటర్జీ అయిదు వేలు ఖర్చు చేసి తుక్కుతుక్కయిన నా జీపును టోయింగ్ చేయించి తీసుకొచ్చేడుట.
సేవానీ ఛటర్జీ అందరూ ‘కారుని చూస్తే మీ ముగ్గురూ ఎలా బతికి బయటపడ్డారా అని అనుకున్నాం’ అన్నారు.
కారుని స్క్రాప్‌లో పడేసేరుట. నన్ను తీసుకువెళ్లి స్క్రాప్ యార్డ్‌లో కారు ఎలా ఉందో చూపించేరు. దానిని ఆ స్థితిలో చూసేసరికి ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అనిపించింది.
నేనూ, సేమనీ, వార్వనే డీజియమ్ దగ్గరకు వెళ్లేము.
నవ్వుతూ ‘కూర్చోండి’ అన్నాడు వార్వనే.
ఏమీ అడగలేదు. ఎందుకు నాసిక్ వెళ్లేరని కూడా అడుగలేదు. పీఆర్వో, జీయమ్ అక్కడే ఉన్నారు. వాళ్లు కూడా ఒక్క మాట కూడా అడుగలేదు.
‘మీరందరూ చాలా అదృష్టవంతులు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీపైన పుష్కలంగా ఉన్నై. ప్రాణాలతో బయటపడ్డారు. అంతే చాలు. ఆల్ ది బెస్ట్ సీఏవో సాబ్’ అన్నాడు జీయమ్.
అయినా నాకు గుబులుగానే వున్నది. వాళ్లు ఆ మాట అనేవరకూ.
ఇంతలో నాసిక్ నుండి ఇన్‌స్పెక్టర్ సావంత్, డీజీయమ్ ఛాంబర్‌లోకి వచ్చేడు. నన్నూ, సేవానీ, వార్వనేని చూసి కొంచెం సంకోచించేడు.
‘మీ ‘సీఏఓ’ సాబ్ పర్మిషన్ లేకుండా నాసిక్ వచ్చేరు. అలా అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేరు’ అని నసిగేడు సావంత్.
డీజీయమ్ వార్వన్ ఒక ఫైల్ సావంత్ ముందు పెట్టేడు. సావంత్ ఫైల్ చూసేడు. అతని ముఖకవళికలు మారినై. ఫైలు మొదట్లో ఒక టైపు చేసిన ఆఫీసార్డరు ఉన్నది. యాక్సిడెంట్ అయిన రెండు రోజులు ముందు తారీఖుతో ఇచ్చిన ఆర్డర్ అది.
‘మా సర్కిల్ సీఏఓ, నాసిక్‌లో ఉన్న త్రిమూర్తి ప్రింటర్స్ ఆఫీసుకు వెంటనే వెళ్లి 1994-95 టెలిఫోను డైరెక్టరీ ప్రింటింగ్ కొరకు, ఆ ప్రింటర్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని కోరడమైనది’ ఇదీ ఆఫీసార్డరులోని అంశం.
ఇన్‌స్పెక్టర్ సావంత్ బిత్తరపోయేడు. ‘కాదు సార్.. మీ సీఏఓ సార్ స్టేట్‌మెంట్‌లో.. పర్మిషన్ లేకుండా తను నాసిక్ వచ్చేనని...’ నత్తులు కొట్టేడు సావంత్.
‘యాక్సిడెంట్ అయిన మనిషి ఏవో చెబుతాడు సావంత్ తన బాధలో..’ అంటూ డీజీయమ్ ఫైల్ సావంత్ దగ్గర నుండి తీసుకుని సేవానికి ఇచ్చేరు.
నన్ను చూస్తూ ‘ఆల్ ద బెస్ట్ సీఏఓ సాబ్. డోన్ట్ వర్రీ. ఎవ్రిథింగ్ విల్ బి ఆల్‌రైట్.. మీరు వెళ్లిరండి’ అన్నారు వార్వనే.
సావంత్ ఆయన ముందే కూర్చుని ఉన్నాడు, దిక్కులు చూస్తూ.
* * *
రెండు రోజుల తర్వాత.. ఇద్దరు కానిస్టేబుల్స్ నా ఆఫీసుకు వచ్చేరు. సేవానీ కూడా నా క్యాబిన్‌లోకి వచ్చేరు. యాక్సిడెంట్ రోజున నేనిచ్చిన స్టేట్‌మెంట్ చింపివేసి, కొత్తది రాయించి నా సంతకం తీసుకున్నారు...
‘సేవానీ.. వాళ్లిద్దరినీ లంచ్ చేయించి, ట్రైన్ ఎక్కించు’ అన్నాను సేవానీతో.
‘అలాగే సార్’ అని వాళ్లని తీసుకుని బయటకు వెళ్లేడు సేవానీ...
* * *
భోజనం చేస్తుంటే.. జోషీ గుర్తుకొచ్చేడు. అతని మాటలూ గుర్తుకొచ్చేయి.
నా జన్మ నక్షత్రం విశాఖ. నక్షత్రాధిపతి గురువు. మీనలగ్నం. లగ్నాధిపతి కూడా గురువే. సాక్షాత్తు ఆ సూర్యనారాయణుడి జన్మనక్షత్రం కూడా విశాఖే. మంగళవారం పుట్టేను. కుజుడి అధిష్టాన దేవత దేవసేనాధిపతి కుమారస్వామి. అధివృక్షం నాగకేసరం. వ్యాఘ్రయోని. అధిదేవతలు ఇంద్రాగ్నులు.
నా చైనీస్ సైన్ ‘స్నేక్’. నాగుబాము. మరి జోషీయేమో నారాయణ నాగబలి, రాహు శాంతి, కాలసర్ప శాంతి, వగైరా చేయించుకోమంటాడు నన్ను.
నాలో నేను నవ్వుకొంటుంటే, శ్యామల అడిగింది. ‘ఇంతకీ మీకు కాలసర్ప దోషం ఉన్నట్లా, లేనట్లా?’ అని.
‘ఉన్నా వాటిని జయించిన వాడినేమో!’ అన్నాను. శ్యామల ఏమీ అనలేదు. తన ఆలోచనల్లోకి తను మరలింది నిట్టూరుస్తూ...

*

వఝ సీతారామశర్మ
(కమలాకాంత్)
09920294346

-కమలాకాంత్