తెలంగాణ

అదిగో పెద్దపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి26: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెన్‌గంగా నదీ పరీవాహక గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. ఇటీవలే తాంసి, భీంపూర్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తూ ఎనిమిది పశువులపై దాడి చేసి గాయపర్చిన ఘటన మర్చిపోకముందే మంగళవారం రాత్రి జైనథ్ మండలం నిరాల ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఓ యువకుడు కారులో నుండి ఫొటో తీయడం కలకలం రేపింది. పొరుగు మహారాష్టల్రోని తడోబా అభయారణ్యం నుండి దప్పిక తీర్చుకునేందుకు పెన్‌గంగా నదికి వచ్చి తిరిగి వెళ్ళకుండా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పెద్దపులులు సంచరిస్తుండడం పల్లె ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. జైనథ్, బేల మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులకు బుధవారం సైతం పెద్దపులి కనిపించినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆదిలాబాద్ నుండి అవల్‌పూర్ గ్రామానికి కారులో వెళ్తున్న యువకుడు కె.అనిల్‌కు నిరాల ప్రధాన రహదారి వద్ద పెద్దపులి రోడ్డు దాటుతుండగా చూసి కారు ఆపివేసి అద్దాల నుండి ఫోన్‌లో ఫోటోలు తీశాడు. బుధవారం ఉదయం జైనథ్ మండలం కాన్పమేడిగూడ వద్ద వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులకు జొన్న చేనులో పెద్దపులి కనపడడంతో ఉలిక్కిపడి పరుగులు తీశారు. మరికొందరు భయంతో అక్కడే దాక్కున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్దపులి తాంసి, భీంపూర్ మండలాల్లో కంటికి కునుకులేకుండా చేసి హడలెత్తించగా వారం రోజుల తర్వాత జైనథ్, బేల మండలాల్లో ప్రత్యక్షం కావడం పల్లె ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సాత్నాల ప్రాజెక్టు పరిధిలోని లక్మీపూర్ రిజర్వాయర్ వద్ద దప్పిక తీర్చుకునేందుకు పెద్దపులి వస్తోందని పరిసర గ్రామాలకు చెందిన రైతులు అందోళన చెందుతున్నారు. పెద్దపులిని కారులో నుండి సెల్‌ఫోన్‌లో బంధించి ఈ ఫొటోను వైరల్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.
ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కాన్పమేడిగూడ, నిరాల, అవల్‌పూర్ ప్రాంతాల్లో బుధవారం పర్యటించి పెద్దపులి అడుగు ముద్రలను గుర్తించారు. సాత్నాల సమీపంలో రెండు పశువులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్టు అటవీ రేంజ్ అధికారి అరుణ ఆంధ్రభూమికి వివరించారు. పెద్దపులి సంచరిస్తున్నది వాస్తవమేనని, రాత్రి వేళల్లో పొలం పనులకు వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు.
*చిత్రాలు.. జైనథ్ మండలం నిరాల వద్ద రోడ్డు దాటుతున్న పెద్దపులి
* పెద్దపులి అడుగు ముద్రలు గుర్తించే పనిలో అటవీ సిబ్బంది