డైలీ సీరియల్

దూతికా విజయం-72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదాహరణకు తానొక అనాకారి ఐ ఉండి తన ఐశ్వర్యం కారణంగా ఒక గొప్ప అధికారిని వివాహమాడగలిగి జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈ వీరభద్రుడు తన భర్తకు సిఫారసు చేసి ఉద్యోగం ఇప్పించమని వచ్చాడనుకుంటే- అపుడు తనకీ అందగాడిమీద రాగోద్దీపనమై తనతో మన్మథకేళి జరిపితే ఉద్యోగం తథ్యమని ఆశపెడితే ఇతనేం చేసి ఉండేవాడో?
చాలా హస్యాస్పదమైన పరిస్థితిలో పడి, తనకు ఇష్టం లేకున్నా ఆ ఉద్యోగం కోసమన్నా తన కోర్కెను తీర్చి ఉండక తప్పదు. ఆయా అవసరాలు ఎంతెంత సాహసాలను, లేదా నీచాతి నీచమైన కార్యాలను ఇష్టాయిష్టాలతో పనిలేకుండానే చేయించగల మహాశక్తులు కదా! తన ఆధిక్యతను ఆసరా చేసుకునే కదా తాను వెల నిర్ణయించి అదంతా కావలసిన వ్యక్తి చేత కక్కించేది! ధర్మాధర్మాలూ, న్యాయాన్యాయాలు ఏ విధంగా అడ్డగిస్తవి? తనకు మోహం కలగటంలో తన తప్పేమిటి? దాన్ని ఉపశమింపజేసుకొనేందుకు తన దగ్గరున్న ఆయుధాన్ని ప్రయోగించక మరేం చేయాలి?
ఈ దృష్టాంతరాన్ని మనసులో ఉంచుకుంటే- వీరభద్రుడు అక్రమంగా తనను కోరాడని ఏ విధంగానూ అనుకునేందుకు ఆస్కారం లేదు.
తనూ వయసులో ఉన్నది. మగజాతిమీద ద్వేషాన్ని చాలాకాలంగా పెంచుకున్న మాట నిజమే కాని, స్ర్తి పురుష సంబంధాలలో కొందరు ఉన్మాదులవలె ప్రవర్తించటం తనకు తెలుసు; ఎవరో దేనికి ఇప్పుడు రాణికి పిచ్చిపట్టిన కోర్కె అని తానే తలపోసింది కదా!
దూరం ఆలోచిస్తే తన ఊహకు అందని అమర సౌఖ్యమేదో ఇందులో ఇమిడి ఉండాలి; ప్రకృతి వాసనాలకు లొంగిపోయిన వీరంతా ఉన్మాదులే అనుకుంటే తాను జీవించవలసిన ఈ ప్రపంచం తనకు నివాస యోగ్యవౌతుందా? ఎల్లకాలం ప్రకృతిని మోసగించి మనగలగటం సాధ్యమా?
తనలోనూ కోరికలు, తనకు తెలియకుండానే విస్తరిస్తూ తనను లొంగదీసుకునేందుకు తీవ్రంగా పోరాడుతూన్నవి. ఈ సంఘర్షణ తాకిడికి తట్టుకొని నిలవలేకపోవడంకన్నా, వొంగిపోయి, లొంగుతే ఆ స్వర్గ సౌఖ్యం తనకు లభ్యవౌతుంది; తన మనోవేదన కూడా శాంతిస్తుంది.
రాణి కోరిన వలపులరాయుడీ వీరభద్రుడు! రసికురాలు కోరిందంటేనే ఇతని విలువ తేలిగ్గా అంచనా వేయవచ్చు. రాజభోజనం తనకు అందుబాటులో వస్తే ఆ విందే తనను ఆదరంతో ఆహ్వానిస్తే- బోడి ఆదర్శాన్ని పట్టుకొని వేళ్లాడుతూ, కాలదన్నుకోవటంలో గొప్ప ఉంటే ఉండొచ్చేమోకాని, చేయిజారిపోయిన సౌఖ్యాన్ని తలచుకుంటే అంతులేని విచారం ముంచెత్తుతోంది. అయినా తన ఆదర్శం చాటుగా భంగపడినా ఆ సంగతి తనకు మినహా మరెవ్వరికీ తెలియదు కనుక, తానింకా కనే్యనన్న విధంగా నటించి అందర్ని నమ్మించవచ్చు కదా!
ఇది నీతిబాహ్యమైన కార్యం కనుక తాను వీరభద్రునికి ఏదో ఒక లంచం ఇచ్చి కార్యనిర్వాహణ దీక్షను ఆసాంతమూ కొనసాగించాలి. తానిచ్చిన సువర్ణ ముద్రికల లంచంమీద అతని దృష్టి లేదు. పోనీ పనిచేశాక అతను కోరిన లంచం ఇస్తానంటే ఏ కాస్త జ్ఞానమున్న వ్యక్తి ఐనా ఒప్పడు కదా! అందుకని ఆ లంచమేదో ముందే చెల్లించందే అడుగు ముందుకు సాగదు.
ఐతే ఆశకొద్దీ లంచం తీసుకొని ఆ తరువాత తను కోరిన విధంగా గాక, సమయ సందర్భాల కారణంగానో, లేక తన అసమర్థత కారణంగానో ఆ కార్యాన్ని నెరవర్చలేకపోవచ్చు. ముందుగా చేయిజారిన కారణంగా అపుడు తానేమీ చేయలేదు. ఆ సమర్థతను తాను నమ్మి ముందుకు సాగవలసిందే కాని, వేరు మార్గం లేదు!
క్రూరమృగాన్ని మచ్చిక చేసి మెప్పించిన విధంగా ఈ వీరభద్రునికి తాను లొంగినట్లే లొంగి, ఆంతర్యంలో అతన్ని లొంగదీసుకొని కొంగున కట్టుకొని, ఛంగు ఛంగున ఎగురుకుంటూ సప్తదర్పణ శయన మందిరానికి తోడ్కొని పోవాలి! తన పట్ల అతని ప్రణయం ఎంత లోతుగా పాతుకుంటే అతను తనకంతగా లొంగినట్లే లెక్క! ఈ కారణంగా వీరభద్రుణ్ణి తాను స్వీకరించే తీరాలి.
వీరభద్రునితో తాను జరిపిన పోరాటంలోని మొదటి రంగంలో చిత్తుగా ఓడిపోయింది. తాను ప్రయోగిచిన అస్త్రాలన్నీ వ్యర్థమైనవి. బైటనుంచి వేరొక సహాయం వచ్చే అవకాశాలు లేవు. ఓడిన శత్రువును ఏ విధంగా ఉపయోగించుకోవాలో విజయుని వొంతే కదా! తదనుగుణంగానే వీరభద్రునికి తాను లొంగిపోవాలి.
ఐతే మరో రణరంగానికి వీరభద్రుడు తనను ఆహ్వానించాడు. తగిన అస్తమ్రేదో తెలియని అయోమయ స్థితిలో తానుంటే, ఏ అస్త్రం ప్రయోగించాలో కూడా అతనే సూచించి, తనకో పరిష్కార మార్గాన్ని తన చేతుల్లోనే ఉన్నదాన్ని, తేలిగ్గా హాయిగా, సుఖంగా, వీలుగా ఉండేది ఎత్తిచూపాడు. ఇందువల్ల తన ప్రత్యర్థికి మరొక అవకాశం మాత్రమే కాదు- విజయ సాధనను కూడా అందించాననే విషయమే అతను ఆలోచించలేదు. ఇప్పుడీ స్థితిలో ఉన్న వీరభద్రుణ్ని జయించలేని తన స్ర్తిత్వానికో చెరగని మచ్చా, సామర్థ్యానికి తలవొంపులే కదా!
కష్టదశలో చాలామందికి కాళ్ళాడవు. సామర్థ్యం వున్నవారికి కొత్తగా రెక్కలు మొలిచినట్లవుతుంది. తానీ రెండో తెగకు సంబంధించిన వ్యక్తి కానట్లయితే, సర్వసామాన్యురాలుగానే భూభారంగా బతకవలసి వుంటుంది.
అల్పుడు గడ్డిపోచలాటివాడు. గాలి ఎటు కొడితే అటే ఎగిరిపోతాడు. కాని అధికుడు గాలిపటం లాటివాడు. గాలికి ఎదురెళ్ళి పైపైకి లేస్తాడు. తాను గాలిపటం వలె ఈ సుడిగాలిలో క్రమంగా ఆకాశపుటంచులకు ఎగిరి తన ఆధిక్యతను ప్రదర్శించవలసి వున్నది.
తాను నిర్ణయాలను తీసుకోవటంలో తాత్సారం చేసే తరుణి కాదు. కాని ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉన్న వ్యవహారం! ఎటు కదిలినా ఏదో ఒక రకం ప్రమాదం తప్పదు.
ఐతే ప్రతి పనిలోను ఒక సౌకర్యమూ దాన్ని అనుసరించే మరో ఇబ్బందీ మిళితమయ్యే ఉంటవి. రెండు వైపులా సౌకర్యమే వున్నది. ప్రపంచంలో ఇంతవరకూ ఏదీలేదు. అలాటిదాన్ని తాను కనిపెట్టనూ లేదు.
తను ఎటూ తేల్చుకోలేకపోతే ఆగేదేముంది? కాలమూ, పరిస్థితులూ తన చేతుల్లో లేవు. నిజానికి ఇందులోని పాత్రలన్నీ కూడా పరిసరాలను బట్టీ, పరిస్థితులను బట్టీ ఎటు వీలుగా ఉంటే, అటుగానే సర్దుకుంటున్నవి. తను కూడా తదనుగుణంగా ప్రవర్తించక భీష్మించుకుంటే కుదరదు; చెవులు పట్టుకొని రంగంలోకి లాగి నడిపించే మాత్రం శక్తి సామర్థ్యాలు తదితరులకూ ఉన్నవనే విషయం ఇపుడు కొత్తగా తెలిసికోవలసిన పనిలేదు.
తన విజ్ఞతను అనుమానించవలసిన పనిలేదు. ఈ వ్యవహారంలో మొదటి నుంచీ ప్రతి అడుగు ఆచి తూచి జాగ్రత్తగానే వేస్తూ వచ్చింది. రెండింతల నిశ్చయం లేనిదే కదలలేదు. ఐనప్పటికీ తన ప్రత్యర్థిని అదృష్టం వరించింది.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు