తెలంగాణ

దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ ఆగస్టు 25: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మల్లురవి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఇందుకు ప్రధాన కారకుడు నరేంద్రమోదీ అని ఆరోపించారు. దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నికలలో పూర్తి స్థాయి మెజార్టీ ఇస్తే దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సింది పోయి ప్రమాదంలోకి నెట్టివేయడం విచారకరమన్నారు. దేశవ్యాప్తంగా మోటార్ వెహికిల్‌కు సంబంధించిన 300 కంపెనీలు మూతపడుతున్నాయంటే దేశం అభివృద్ధి చెందినట్టా లేక ఆర్థిక పరిస్థితి పడిపోయినట్టా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయని దాంతో వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. జీఎస్టీ తీసుకురావడం, నోట్లను రద్దు చేయడంతో ఆ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడిందని, ప్రస్తుతం ఈ రెండు విధానాల కారణంగా దేశం ఇబ్బందుల్లో పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కన్నా అధికారమే పరమావధిగా భావిస్తున్నారని విమర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొని అన్ని రాష్ట్రాలలో తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నారని ఇది చాలా దారుణమైన విషయం అన్నారు. రాజకీయాలలో విలువలకు పాతర వేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీజేపీని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు చేసి దాదాపు 20 రోజులకు పైగా గడుస్తోందని, అయితే కాశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసేందుకు ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు కాశ్మీర్ రాష్ట్రానికి వెళితే శ్రీనగర్ విమానాశ్రయంలోనే వారిని అడ్డుకొని వెనక్కి పంపించడం ఏమిటని మల్లు రవి ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని కాశ్మీర్‌లో పర్యటించకుండా నివారించడం దేశ ప్రజలలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయన్నారు. అసలు కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విచిత్రమైన పాలన చేస్తున్నారని కేంద్రంలో నరేంద్రమోదీ పెద్ద నియంత అయితే రాష్ట్రంలో కేసీఆర్ మరో నియంతలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారని రూ. లక్ష రుణమాఫీ కోసం రైతులు ఎదురుచుస్తున్నారన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల సంగతిని కేసీఆర్ మరిచిపోయారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఈ రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు రీడిజైన్‌తో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మల్లు రవి ఆరోపించారు. ఈ విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితారెడ్డి, ప్రచార కార్యదర్శి బెనహర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మల్లురవి