రాష్ట్రీయం

సిద్ధాంతం, సమర్థ నాయకత్వం బీజేపీ సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: భారతదేశంలో ఒక సిద్ధాంతం, సమర్థ నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో శుక్రవారం సంఘటన పర్వ్-2019 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సబ్‌కీ సాత్... సబ్‌కీ వికాస్ అన్న దీనదయాళ్ ఆలోచలనకు అనుగుణంగా ప్రతి పేదవాడి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. బీజేపీ ముస్లింలకు, మైనార్టీలకు, గిరిజనులకు వ్యతిరేకమని కాంగ్రెస్ అసత్యప్రచారం చేసి వారి ఓట్లను దండుకుందని విమర్శించారు. అయితే వారికి చేసింది మాత్రం ఏమీలేదన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పాయ్ ఆధ్వర్యంలో అంత్యోదయ, గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల ఏర్పాటుతో మహాత్మా గాంధీ కన్నకలలు నిజం చేసింది బీజేపీ అన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత, స్వచ్ఛ్భారత్ నినాదం ప్రధాని మోదీతోనే సాధ్యమైందని చెప్పారు. కులాలు, మతాల ఆధారంగా బీజేపీ ఏనాడు సంక్షేమం, అభివృద్ధి చేపట్టలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా ధైర్యంగా అమలుచేయలేని ఎన్నో పథకాలను అమలు చేశారని, అందులో జీఎస్టీ, త్రిపుల్ తలాక్ ఉన్నాయన్నారు. మన దేశ సైనికులపై దాడులు చేస్తే ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారితో చర్చలు జరపకుండా ప్రతిదాడులు చేసి బుద్ధిచెప్పింది బీజేపీయేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి దేశం సత్తాచాటిన ఘనత ప్రధాని మోదీ సొంతమన్నారు. దేశ సమగ్రత, సమైఖ్యత, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వెళుతున్నారని, అందుకే నేడు దేశంలో బీజేపీని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతో కులపాలన, అరాచకం, అవినీతి పెరుగుతోందని కన్నా ఆరోపించారు. వైకాపా, టీడీపీలు రెండు అవినీతి, కుల, అరాచక పార్టీలని విమర్శించారు. టీడీపీ అనుసరించిన విధానాలను వ్యతిరేకించి ప్రజలు వైకాపాకు అధికారం ఇస్తే, జగన్మోహన్‌రెడ్డి కూడా అదే విధానాలను అవలంభిస్తున్నారన్నారు. గ్రామాల్లో పోలీస్ రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపైన దాడులు పెరిగాయని, పోలీసులు అక్రమకేసులు బనాయిస్తున్నారని చెప్పారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, ఎదురు తిరిగితే రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. దీనిని ఎదుర్కోవాలన్నా, దేశాభివృద్ధికి కృషిచేస్తున్న ప్రధాని మోదీకి అండగా నిలవాలన్నా ప్రతి ఒక్కరూ బీజేపీని బలపరుస్తూ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీమంత్రి కిషోర్‌బాబు మాట్లాడుతూ బీజేపీలో చేరినవారు అదృష్టవంతులన్నారు. బీజేపీ వైనార్టీలకు, క్రైస్తవులకు వ్యతిరేకమని అసత్య ప్రచారం చేశారని, ఏ వర్గానికి చెందిన వారైనా అత్యున్నత పదవులు పొందే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉందన్నారు. బీజేపీ దళితనేత బంగారు లక్ష్మణ్ నుంచి నేడు ప్రధాని నరేంద్రమోదీ వరకు అట్టడుగు స్థాయి నుంచి వచ్చినవారేనని గుర్తుచేశారు. ఆంధ్రరాష్ట్రం అవినీతికి, కులాలకు, కుటుంబ పాలనకు, దోపీడి నుంచి విముక్తి కలగాలంటే ప్రతి ఒక్కరు బీజేపీని బలపరచాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 303మంది లోక్‌సభ సభ్యులు, 77మంది రాజ్యసభ సభ్యులు, 11కోట్ల పార్టీ సభ్యత్వం ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీ బీజేపీ అన్నారు. దివాళా స్థితిలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని నేడు ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. టీడీపీ విధానాలనే అవలంబిస్తున్న వైకాపా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతాలపై నమ్మకంతో, విశ్వాసంతో పనిచేసే వారికి ఎప్పుడు ఉన్నత పదవులు వెన్నంటే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ పాలనకు, అవినీతి, అక్రమాలకు మారుపేరుగా మారిన టీడీపీ, వైకాపాలకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు ప్రతి బూత్ నుంచి అన్ని వర్గాల ప్రజలను పార్టీ సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి మాట్లాడుతూ 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ 29మందిని సభ్యులుగా చేర్చి క్రియశీల సభ్యులుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరుకి చెందిన టీడీపీ యువనాయకుడు సుమన్‌నాయుడు తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షుడు చంద్రా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిసుబ్రమణ్యం, కోలా ఆనంద్, కొత్తపల్లి అజయ్‌కుమార్, గుండాల గోపీనాథ్‌రెడ్డి, అడప నాగేంద్ర, రఘురామిరెడ్డి, ఎం.ఆర్.రాజా, జాతీయ మహిళ నాయకురాలు శాంతారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, జోనల్ ప్రభాస్ జల్లి మధుసూదన్, జిల్లా కార్యదర్శులు వెంకటముని, పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.