శిప్ర వాక్యం

ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాలు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ఏ ముఖ్యమంత్రి అయినా ధిక్కరిస్తే భారత రాజ్యాంగాన్ని ఎదిరించినట్టే అవుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ముఖ్యమంత్రులు నేడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారాన్ని కాపాడుకోవాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, హెచ్.డి.కుమారస్వామి, పినరయి విజయన్, రాహుల్ గాంధీ , కేజ్రీవాల్ వంటి నేతలు తమ హోదాలను మరచిపోయి శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేతలు రాజ్యపాలనకు అర్హులేనా?
పశ్చిమ బెంగాల్ పోలీసులను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు రావడం మమతా బెనర్జీకి ఆగ్రహం కలిగించింది. ఆర్థికపరమైన అవకతవకల్లో వాస్తవాలు తెలుసుకొనేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలపై సీబీఐ అధికారులు కోల్‌కత పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమత నేరంగా పరిగణిస్తున్నారు. బెంగాల్‌లో జరిగిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో దాదాపు 40వేల కోట్ల రూపాయలను మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలు కోల్పోయారు. ఇందులో ఒక్క రూపాయిని కూడా బాధితులకు మమతా బెనర్జీ ఇప్పించలేక పోయారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలోనూ జనం భారీగా నష్టపోయారు.
గతంలో అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కుమారుడు చందన్ బసు సాల్ట్‌లేక్ సిటీలో భూకబ్జలు చేశాడని ఆరోపించిన మమత ఇపుడు శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాలపై ఏమంటారు? సీబీఐ అధికారులు తన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని చెబుతున్న ఆమె- ‘మాతో ఎవరైనా దెబ్బలాట పెట్టుకుంటే వారిని మట్టి కరిపిస్తాం..’ అని కేంద్రానికి హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఆమె వీధికెక్కి ఇలా మాట్లాటడడం సమంజసమేనా?
ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ తదితర రాష్ట్రాలు భారత యూనియన్‌లో అంతర్భాగాలే. ఇవి స్వయం ప్రతిపత్తి గల పాకిస్తాన్ వంటి దేశాలు కావు. భారత రాజ్యాంగంలో ‘ఇండియన్ యూనియన్’ అనే పదం వాడబడింది. దీనిని మరచిపోయి ముఖ్యమంత్రులు కేంద్రాన్ని ధిక్కరించటం దేశ విచ్ఛిత్తికి దారితీస్తుందా?
శారదా చిట్‌ఫండ్ స్కాంలో 10వేల కోట్లు, నారదా స్కాంలో 12,500 కోట్లు, రోజ్‌వ్యాలీ స్కాంలో 17,500 కోట్లు కలిపి సుమారు 40వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నారు. అయినప్పటికీ మమతా బెనర్జీ ఉత్తమ నాయకురాలని మాజీ ప్రధాని హెచ్.డి.దేవగౌడ ప్రశంసాపత్రం ఇవ్వడం విడ్డూరం. ఆర్థిక నేరస్థుడైన విజయ్ మాల్యా ‘మా కన్నడ భూమి పుత్రుడు, సచ్ఛీలుడు’ అని గతంలో దేవెగౌడ కితాబు ఇచ్చా రు. బెంగాల్‌లో జరిగిన కుంభకోణాల ఫలితంగా ఆర్థికంగా నష్టపోయిన వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కేసుల్లో వాస్తవాలను సీబీఐ వెలుగులోకి తెస్తేనే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ, సీబీఐ ప్రయత్నాలను అడ్డుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఆదేశాలతో ‘క్విట్ మోదీ’ అంటూ కోల్‌కతలో పోస్టర్లు అంటించారు. మమత దూకుడును చంద్రబాబు సహా మరికొందరు విపక్ష నేతలు సమర్థించారు. వామపక్ష నాయకులు మాత్రం మమత బెనర్జీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శారదా స్కాంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కుణాల్ ఘోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పై మమత ఆగ్రహం ప్రకటిస్తున్నారు. కోల్‌కతలో ఆమె భారీ సదస్సును నిర్వహించిన తర్వాత సుప్రీం కోర్టు అనూహ్యంగా ఆదేశాలను ఇచ్చింది. కోల్‌కత పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ సీబీఐ అధికారుల ఎదుట విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, పోలీసు కమిషనర్‌ను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు నిరోధించిందని మమతాబెనర్జీ సుప్రీం తీర్పుకు ఇంకో వ్యాఖ్యానం చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా ముకుల్ రాయ్, హేమంత విశ్వాస్‌శర్మ సీబీఐకి సహకరించినా, పోలీసు కమిషనర్ సహకరించలేదు సరికదా మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడన్నది ఆరోపణ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వారి విధులకు భిన్నంగా నడివీధిలో ధర్నా పేరిట సభ జరపడం గమనార్హం.
మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి అనుగుణంగా కాక బంగ్లాదేశీ శరణార్థులకు రక్షణ కల్పించడం కోసం కాక, ‘చొరబాటుదారుల’ను రక్షించటం కోసం పనిచేస్తున్నది. ఇందుకోసం రాజ్యాంగాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమత ధిక్కరించింది. ఆమె చర్యలు దేశద్రోహానికి నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయ నాయకులు సమర్ధించారు?
రాజీవ్‌కుమార్ లోగడ పోలీసు అధికారిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా చెపితే అలా పనిచేశాడు. మమతా బెనర్జీ సహా ఆమె పార్టీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి తన ఉద్యోగ ధర్మం సమర్ధవంతంగా నిర్వహించాడు. ఇప్పుడు మమత చెప్పినట్లు శారదా స్కాం, రోజ్‌వ్యాలీ స్కాంలకు సంబంధించిన కీలక పత్రాలను టాంపరింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆనాడు కమ్యూనిస్టులకు విధేయుడు, ఈనాడు మావోయిస్టుల ఏరివేతలో ప్రముఖుడు. అంటే రాజీవ్‌కుమార్ అధికారంలో ఎవరుంటే వారికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. ఢిల్లీకి చెందిన మాజీ పోలీసు అధికారి నీరజ్‌కుమార్ రాసిన ఓ పుస్తకంలో రాజీవ్‌కుమార్ పనితీరును ఎంతగానో ప్రశంసించాడు. ఇప్పుడు ఇదే రాజీవ్‌కుమార్ వివాదాస్పద వ్యక్తి ఎందుకైనాడు? అంటే మమతా బెనర్జీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం తప్ప- ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఈయన సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. అయితే, సుప్రీం తీర్పు ‘రాజ్యాంగానికి లభించిన విజయం’ అని తృణమూల్ కాంగ్రెస్, భాజపాలు ఎవరికి వారు అభివర్ణించుకోవడంలో మతలబు ఏమిటని జనం ఆశ్చర్యపోతున్నారు.
*

ప్రొ. ముదిగొండ శివప్రసాద్