సబ్ ఫీచర్

సమస్యల సుడిగుండంలో వసతి గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. విద్యార్థుల సంక్షేమం రికార్డులకే పరిమితమైంది. వసతులు లేమి, మెనూను పాటించకుండా సమకూరుస్తున్న భోజనం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా అన్ని వసతి గృహాల్లోనూ వీటి కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పలు వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాలు కురిసినపుడు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వసతి గృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ప్రతి యేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.
ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసి, ప్రభుత్వ వసతి గృహాలలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో 100 వసతి గృహాలు ఉండగా, గత ఏడాది 10వేల సీట్లకు గాను 3400 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 52 హాస్టళ్ళు ఉండగా 5200 సీట్లకు గాను 3680 మాత్రమే భర్తీ అయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 26 వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో 3వేల సీట్లు ఉండగా 2597 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో గల స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్ళలో జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌లో మినహా మిగతా వాటిలో విద్యార్థులు కరువయ్యారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ బాలికల వసతి గృహంలో 100 సీట్లకు గాను 250కి పైగా విద్యార్థులను చేర్చుకొన్నారు. దీంతో విద్యార్థినులు గదులు, బాత్‌రూమ్‌లు సరిపోక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మైనార్టీ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు భోజనాలు వడ్డించేందుకు గాను ఏర్పాట్లు లేకపోవడంతో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లో వండిన భోజనాలు చేస్తున్నారు. వీరికి సకాలంలో నీటిని అందించకపోవడంతో సదరు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోగల అంధుల వసతి గృహంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు కాస్మోటిక్ చార్జీల బిల్లులు ప్రిన్సిపాల్ అందించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాలురకు కాస్మోటిక్ చార్జీల కింద 62 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. 12 రూపాయలు క్షౌరానికి, 50 రూపాయలు సబ్బులకు ఇస్తున్నారు. క్షౌరం చేసుకోవాలంటే కనీసం 40 రూపాయలు సొంత డబ్బులతో క్షౌరాలు చేయించుకొంటున్నారు. ఈ బిల్లులను కూడా సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. మూడు, నాలుగు నెలలకోసారి కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
వసతి గృహాల్లో చదువుకొనే విద్యార్థులకు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ట్రంకు బాక్సులను అందజేస్తుంటారు. ఎస్సీ, బీసీ, వసతి గృహాల్లో ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా గడుస్తున్నా కూడా ట్రంకు బాక్సులు అందలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఆయా వసతి గృహాల్లో తాగునీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్ళేందుకు విద్యార్థులు తంటాలు పడుతున్నారు. వేములవాడలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బోరు ఎండిపోవడంతో చుక్క నీరు లేక విద్యార్థులు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడుతున్నారు. గదులకు కిటికీలకు అమర్చిన దోమ తెరలు చిరిగిపోవడంతో దోమలతో తంటాలు పడుతున్నారు. తిప్పాపూర్‌లోని సమీకృత హాస్టల్‌లో, చందుర్తిలో ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దోమ తెరలను సరఫరా చేయకపోవడంతో దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో 120 మంది విద్యార్థులు ఉండగా మూడు మరుగుదొడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 10 బాత్‌రూమ్‌లకు డోర్లు లేక, నీళ్ళు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గదులన్నీ కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. స్లాబ్‌పై పెచ్చులు ఊడి పడుతున్నాయ. సైదాపూర్ ఎస్సీ, హాస్టల్‌లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్ళి మలమూత్ర విసర్జన చేస్తున్నారు.
రామగుండంలోని ఎస్సీ బాలుర వసతి గృహం భవనం పైకప్పు శిథిలావస్థకు చేరి పెచ్చులు రాలిపోతుండటంతో, వసతి గృహ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగటంతో పాములు, తేళ్ళు వస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కోహెడ మండలం శనిగరం బీసి వసతి గృహానికి నీటి వసతి లేకపోవడంతో నల్లా నీటిపైనే ఆధారపడ్డారు. మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లపై కప్పులు ఊడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లో ఉన్న బోరు పనిచేయడం లేదు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నది. భీమదేవరపల్లి మండలం వంగర ఎస్సీ వసతి గృహాన్ని 30 సంవత్సరాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకున్నది. గదులకు తలుపులు, కిటికీలు లేకపోవడంతో విద్యార్థులు దోమలతో సహవాసం చేస్తున్నారు. బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి ఎస్సీ, బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు పనికి రాకపోవడంతో విద్యార్థులు బహిర్భూమికి బయటకు వస్తున్నారు. రంగంపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో గల మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లకు నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తుంది. సిరిసిల్ల డివిజన్‌లోని సిరిసిల్ల ఎస్సీ, బాలుర, బీసీ బాలికల, ఎల్లారెడ్డిపేట ఎస్టీ బాలుర వసతి గృహాల్లో మరుగుదొడ్లు, బాత్రూమ్‌లకు నీటి సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
భవనాల మరమ్మతుకోసం లక్ష రూపాయలు మంజూరై టెండర్లు పూర్తయినా పనులు జరగటం లేదు. సిరిసిల్ల బీసి వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు నుండి నీళ్ళు కారుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంథని బీసి వసతి గృహంలో విద్యార్థులకు సరిపడా వసతులు లేవు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోగా పలు గదులు వాడకంలో లేవు. దీంతో ఒక భవనాన్ని అద్దెకు తీసుకొన్నారు. సొంత భవనంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, మురుగునీరు చేరి నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. మహాముత్తారం ఎస్టీ వసతి గృహానికి ప్రహరీగోడ లేకపోవడంతో ప్రక్కనే ఉన్న అడవి నుంచి అడవి పందులు, విషపు పురుగులు వస్తున్నాయి. హాస్టల్ గదుల్లో సరిపడి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేవు. ముత్తారం ఎస్సీ బాలుర హాస్టల్‌ను ఊరిచివర ఒక పాత అద్దె ఇంట్లో నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రభుత్వ వసతి గృహాలను బాగుచేయించి, విద్యార్థులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా వారికి రావాల్సిన దుస్తులు, ప్లేట్లు, గ్లాసులను తదితర వస్తువులను ఏటా అందించాలని విద్యార్థుల సంఘాల బాధ్యులు కోరుతున్నారు.

- గుండు రమణయ్య