వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
‘పట్టపగలే బ్యాంక్ దోపిడీ’
అనే వార్త ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించింది!
తెలుగు దినపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో కవర్ చేసిన ఆ న్యూస్ బ్యాంక్ ఖాతాదార్లని, డిపాజిటర్లని భయకంపితుల్ని చేసింది.
సుమారు అయిదు వందల కోట్ల రూపాయల టర్నోవర్ కల్గి ఉందా బ్యాంక్. దాని పేరు ‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్’.
వివిధ జిల్లాలలో పది బ్రాంచీలుగా విస్తరించబడ్డ ఆ బ్యాంక్ హెడ్ట్ఫాస్ హైద్రాబాద్‌లో వుంది.
నగరంలోనే నెంబర్ వన్ బ్యాంక్‌గా చెలామణి అవుతోంది.
అలాంటి బ్యాంక్ దోపిడీకి గురికావడం యావన్మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది!
దినపత్రికల్లో వచ్చిన దోపిడీ తాలూకు వార్తా కథనాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* * *
అందరిలానే బ్యాంకు దోపిడీ వార్త నివేదిత దృష్టిలో కూడా పడింది. పేపర్లో ఆ న్యూస్ హెడ్డింగ్‌ని చూస్తూనే ఉలిక్కిపడిందామె.
అందుకు కారణం..
ఆమె పెళ్లి తాలూకు కట్నం డబ్బు అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేయబడి వుంది!
అసంకల్పితంగా ఆమెలో కంగారు మొదలయ్యింది.
తన చేతిలో వున్న ప్రముఖ తెలుగు దినపత్రికపై పట్టు మరింత బిగిసింది.
కళ్లతో వౌనంగా కాకుండా.. పెదవులతో లోలోపల చదువుతున్నా ననుకుంటూనే అక్షరమక్షరం ఒత్తొత్తి పలుకుతూ ఒకటో తరగతి అమ్మాయిలా బిగ్గరగా చదవసాగింది.
నివేదిత నిండు గర్భిణి!
ద్వాపర యుగం నాడు-
తల్లి సుభద్ర గర్భంలో వున్నప్పుడే.. తన తండ్రి అర్జునుడు తల్లికి చెబుతోన్న పద్మవ్యూహం గురించి ఆకళింపు చేసుకున్న మహామేధావి అభిమన్యుడి కథనాన్ని పునరావృతం చేస్తూ-
ఓ అనూహ్య ఘటనకు ఊపిరిపోస్తూ-
కలియుగ చరిత్ర పుటలపై సరికొత్త అద్భుతాన్ని లిఖిస్తూ.. పరమాద్భుతాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరిస్తూ... నివేదితచే బిగ్గరగా ఉచ్చరించబడుతున్న ‘మనీ మనీ బ్యాంక్’ వార్త వివరాలని ఆమె గర్భస్థ శిశువు ‘వూ’ కొడుతూ వింటోంది.
నివేదితకా విషయం తెలీదు!
తల్లి నోటి వెంట వెలువడుతోన్న అక్షర వాహినిని గర్భస్థ శిశువు యథాతథంగా తన మనోఫలకంపై ముద్రించుకుంటోందని ఆమె పసిగట్టి వుంటే కథనం మరోలా వుండేది.
కానీ అలా జరగలేదు.
జరిగే ఆస్కారమూ లేదు.
నివేదిత తన ధ్యాసలో తానుంది. బాహ్య ప్రపంచాన్ని మరచి పేపర్‌లోని న్యూస్‌ని ఆసక్తిగా చదవడంలో నిమగ్నమై ఉంది.
మధ్యాహ్నం పనె్నండూ పనె్నండున్నర సమయంలో మాస్క్‌లు ధరించిన నలుగురు దుండగులు బ్యాంక్‌లోకి ప్రవేశించారు. వెంట తెచ్చిన మారణాయుధాలతో సిబ్బందిని బెదరగొట్టి.. సుమారు ఇరవై ఆరు కోట్ల క్యాష్‌ని లాకర్లు తెరిపించి మరీ దోచుకుపోయారు.
సంక్షిప్తంగా అలా సాగిందా వార్త!
* * *
ఎనిమిది సంవత్సరాల అనంతరం.
చిన్నపిల్లల్లో కలిగే సందేహాల్ని పెద్దవాళ్లు నివృత్తి చేయకపోతే పిల్లల్లో కలిగే ఆసక్తి క్షణక్షణానికి పెరిగి ప్రాక్టికల్‌గా చేసైనా సరే విషయమేంటో తెల్సుకోవాలన్న జిజ్ఞాసకి దారి తీస్తుంది.
అలాంటి సంఘటనే ఓ కుర్రాడి విషయంలో పునరావృతమైంది.
ఒకరోజు.
బయట ఆడుకుంటున్న వాడల్లా సడన్‌గా మనసు మార్చుకుని తల్లి చెంతకు పరుగు పరుగున వచ్చాడు.
ఆ కుర్రాడి చేతిలో బెలూన్ ఉంది.
‘మమీ! మమీ! ఈ బెలూన్‌ని వదిలేస్తే గాల్లో ఎగురుతుంది కదా! మరి దాంతోపాటుగా నేనెగరడం లేదెందుకని?’ తన చిన్న బుర్రలో తళుకుమన్న సందేహాన్ని తల్లి ముందుంచాడు.
తీరిగ్గా ఉన్న సమయంలోనైతే వాడి ప్రశ్నకి ఓపిగ్గా సమాధానమిచ్చేదేమో కానీ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తోందామె.
అందుకే విసురుగా అందా ఇల్లాలు..
‘నిట్టూ! ఊరికే నన్ను విసిగించకు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక నాకిప్పుడు లేదు. ముందు బయటకు వెళ్లి ఆడుకో’
వాడి ముద్దు పేరు నిట్టూ.
అందాల హరివిల్లు వర్ణ రహితమైనట్లు తల్లి మాట వింటూనే పాలిపోయిందా చిన్నారి మోము.
‘చెట్టుపై నుండి రాలిన పండు పైకి వెళ్లకుండా భూమి మీదే పడ్తోంది. ఎందుకని?’ అనే చిన్న సందేహం న్యూటన్ మహాశయుడి మస్తిష్కంలో మెదిలి చివరికది గురుత్వాకర్షణ శక్తి ఆవిష్కరణకి దారితీసిందని ఆ క్షణంలో ఆ తల్లి మరిచిపోయి ఉండుంటుంది.
లేకపోతే కొడుకుతో ఆ తల్లి ప్రవర్తన మరో విదంగా వుండి ఉండేదేమో!
తల్లి సమాధానానికి చిన్నబుచ్చుకున్నా..
మదిలో ఆలోచనలు సుడులై తిరుగుతుంటే మారుమాట్లాడకుండా రివ్వున బయటకు పరుగెత్తాడా కుర్రాడు.
వాడి పేరు అఖిల్.
ఆ పిల్లవాడి తల్లి నివేదిత!
ఆమెకి ఒక్కడే కొడుకతను.
తన మస్తిష్కంలో మెరిసిన మెరుపులాంటి ఆలోచనకి కార్యరూపం తేవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడా చాకులాంటి కుర్రాడు.
కొన్ని బెలూన్స్, ఓ రింగ్, దారాలు తదితర వస్తువుల్ని సేకరించాడు.. వాటితో దాదాపు గంటసేపు కస్తీ పట్టాడు.
వాళ్లింటికి దగ్గర్లో కిరాణా కొట్టు ఉంది. దాన్లోనే అన్ని రకాల వస్తువులు అమ్ముతారు. అక్కడ ఖాతా ఉంది. ఇంట్లోకి ఏది అవసరం పడ్డా తల్లి చెపితే వెళ్లి అఖిల్ వస్తువులు తెస్తుంటాడు. అందుకని అమ్మ తెమ్మందని షాప్ ఓనర్‌కి చెప్పి పై వస్తువులు తెచ్చుకున్నాడు.
రింగ్ చుట్టూ దాదాపు నలభై మూడు దాకా గాలి నింపిన బెలూన్స్‌ని వలయాకారంగా అమర్చాడు. ఆ రింగ్‌ని ఓ కొక్కానికి తగిలించి ఉంచాడు. అంతవరకూ పూర్తయిన పనిని పరిశీలిద్దామన్న నెపంతో అనాలోచితంగా కొక్కెం నుండి ఆ రింగ్‌ని విడదీశాడు.
అదే అతను చేసిన తప్పు!
ఊర్థ్వపీడన ప్రభావ ఫలితంతో బెలూన్స్ ఆ తేలికపాటి రింగ్‌ని ఒక్కసారిగా పైకి లేపాయి. ఎగిరే రింగ్‌ని ఆపాలన్న ప్రయత్నంలో రెండు చేతుల్లో తన శక్తి కొద్దీ కిందికి లాగాడు దాన్ని.
కానీ ఊహించని విధంగా అప్పుడు జరిగిందా సంఘటన.
రింగ్‌పైన కుర్రాడి బలం కించిత్ కూడా పని చేయలేదు. దాంతోపాటుగా వాడు కూడా నెమ్మదిగా పైకి లేచాడు. తానూ గాలిలోకి లేస్తున్నానన్న విషయం అర్థమైన మరుక్షణం ఊపిరి స్తంభించింది వాడిలో. దాన్ని వదిలేయాలన్న ధ్యాసే మరిచి మరింత బలంగా ఆ రింగ్‌నే పట్టుకున్నాడు.
ఒక్కసారిగా తెలీని భయం ఆవరించి రివ్వున కేకలు వేయసాగాడు బిగ్గరగా.
దారంట వెళ్తున్న ఓ వ్యక్తి కేకలు వినిపించిన దిశ వైపు తలెత్తి చూపు సారించి అక్కడ కన్పించిన దృశ్యానికి మ్రాన్పడిపోయాడు. బెలూన్స్‌తోపాటు నెమ్మదిగా పైకి ఎగుర్తోన్న కుర్రాడ్ని అఖిల్‌గా పోల్చుకున్నాడు.
క్షణం ఆలస్యం చేయలేదు. సంధించి వదిలిన బాణంలా ఆ కుర్రాడి ఇంట్లోకి పరుగెత్తాడా వ్యక్తి.
నిటారుగా కొంత పైకి వెళ్లాక గాలి వీస్తున్న దిశగా ఆ బెలూన్స్ అఖిల్‌ని తీసుకుపోసాగాయి.
కాసేపు గడిచాక గాలి వీచడం తగ్గుముఖం పట్టడంతో అలా గాల్లోనే ఎగుర్తూ ఒక్కచోటే ఉండిపోయాడు.
మొదట భయంతో బిర్రబిగుసుకున్నా, తర్వాత తేరుకున్నాడు. అంతెత్తున అలా గాలిలో ఎగురుతుంటే సరదాగా, ఉత్సాహంగా అన్పించసాగింది. కాస్త తల దించి కిందికి చూశాడు. అన్నీ చిన్నచిన్నగా కన్పిస్తూ గమ్మత్తుగా అన్పిస్తుంటే థ్రిల్‌గా ఫీలయ్యాడు.
ఆ వ్యక్తి ద్వారా బయట జరుగుతోన్న సాహస చర్య ఇంట్లో వున్న నివేదితకి, ఆఫీసులో వున్న నివేదిత భర్తకి చేర్చబడింది.
అఖిల్ ఎగురుతోన్న ఆ ప్రాంతంలో క్షణంలో జనం పోగయ్యారు. తలలు పైకెత్తి విస్మయంగా అఖిల్‌నే గమనిస్తున్నారంతా.
సన్నగా కలకలం మొదలయ్యింది.
జనమంతా ఉద్విగ్నభరితులయ్యారు.
అఖిల్ తండ్రి వసంత్‌కుమార్ తనకు చేరిన కబురుని పోలీసుస్టేషన్ కందించి నేరుగా ఆ స్పాట్‌కి పరుగెత్తుకొచ్చాడు. అప్పటికి నివేదిత ఏడుస్తూ వచ్చిందక్కడికి.
తగిన పోలీస్ ఎస్కార్టుతో, రక్షక దళాన్ని వెంటేసుకుని ఎస్సై వేదవ్యాస్ చేరుకున్నాడక్కడికి. ముందుగా, గుమిగూడిన జనాన్ని అక్కడి నుండి దూరంగా పంపించేశాడు.
తొలుత గాలిలో ఎగరడంలో థ్రిల్ పొందిన అఖిల్ ఎంతసేపైనా, ఆ బెలూన్స్ తనని కిందికి దింపకపోవటంతో.. అదిగో అప్పుడు ఆందోళన మొదలయ్యిందా కుర్రాడిలో.
కింద కన్పించిన పోలీసుల్ని, జనాన్ని చూసి అఖిల్ బెంబేలెత్తిపోయాడు.
రెండే రెండు క్షణాల్లో అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు ఎస్సై వేదవ్యాస్.
పాదరసం కంటే చురుగ్గా కదిలాడు.
ఎడం చేత్తో మైక్ పట్టుకుని, కుడిచేయి పైకెత్తి ‘బాబూ! నే చెప్పేది విను. ఎంత మాత్రం నీ పట్టు విడువకు. ఇప్పుడు తుపాకీతో ఆ బెలూన్స్ పేల్చేస్తాం. నీకేం కాదు. నువ్వు మాత్రం భయపడకుండా కాసేపు కళ్లు మూసుకో’ అంటూ కుర్రాడికి ధైర్యం చెప్పి, తల తిప్పి పోలీసు షూటర్‌కి సైగ చేశాడు.
అప్పటికే తన తుపాకీని పొజిషన్‌లోకి తీసుకొని ఆజ్ఞ కోసమే రెడీగా వున్నాడతను. ఎస్సై నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో తన పనికి శ్రీకారం చుట్టాడు పోలీసు షూటర్.
మధ్యమధ్యలో కాస్త సమయం తీసుకుంటూ ఆ షూటర్ అత్యంత జాగ్రత్తగా ఎనిమిది రౌండ్లు పూర్తి చేశాడు.
దాదాపు పదిహేను బెలూన్స్ పేలిపోయాయి.
సౌంజ్ఞ చేశాడు వేదవ్యాస్. షూటర్ ఆపాడు.
జనమంతా ఏం జరగబోతోందనే టెన్షన్‌లో వున్నారు.
(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055