వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటమ్మ మరి కొందరు యువతీ యువకులు తేనె కల్లు లాంటివి పంచారు. తాత్కాలికంగా తమ బాధని మర్చిపోయి ప్రభు, నాయక్ వాళ్లు కూడా వాళ్ల ఉత్సాహంతో పాలుపంచుకున్నారు.
అప్పుడే ఓ చిత్రమైన సంఘటన జరిగిపోయింది. ఎప్పుడు వెళ్లి తయారుచేశారో గానీ, చక్కని అడవి పూలతో అందమై రెండు పూలదండలు తయారుచేసి, ప్రభు గౌతమిల కిచ్చారు చిన్ని, మరి కొంతమంది కనె్నపిల్లలు, ప్రభూ వాళ్లు బిత్తరపోయి చూస్తుంటే-
‘పిల్లలు మంచి పని చేశారు. మీ పెళ్లి కళ్ళారా చూసే అదృష్టం మాకు ఎలాగూ లేదు. మా ఎదురుగా ఈ దండలు మార్చుకుని దంపతులవండి’ అన్నాడు దొర ముసిముసిగా నవ్వుతూ.
కంగారుగా చూసింది గౌతమి. అంతకన్నా కంగారు పడిపోయాడు ప్రభు.
‘ఆడపిల్ల అక్క సిగ్గుపడడంలో అర్థం ఉంది. కానీ మీరేంటి బావగారూ మరింత సిగ్గు పడిపోతున్నారు?’ అల్లరిగా అంది చిన్ని. ప్రభు గౌతమి కళ్లల్లోకి చూశాడు. ఆమె కళ్లు వాలిపోయాయి.
‘ఇంకా ఏవిఁటి ఆలస్యం. తొందరగా దండలు మార్చుకోండి’ కొండమ్మ, ముద్రా లాంటి వాడు కంగారు పెట్టేసి వాళ్ల చేత దండలు మార్పించి హర్షద్వానాలు చేశారు. అడవి పూల రేకులు అక్షింతలుగా కురిశాయి.
‘సరే. ఇంక విందు భోజనాలకి లేవండి’ ఉత్సాహంగా అంది కొండమ్మ. అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ కదిలారు.
సరదా కబుర్లతో విందు పూర్తయింది. ఆటవికులు శకుని, దొర లాంటి వాళ్లు ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నా ప్రభు, గౌతమిలు, విజయ నాయక్ కాస్త పరధ్యానంలో పడ్డారు.
‘వీళ్లకసలు బుర్ర లేదు. లేకపోతే మాట మాత్రం చెప్పకుండా ఈ దండలు మార్పించడం ఏవిఁటి’ అనుకున్నాడు ప్రభు. నిజానికి జీవితంలో అంత ఆనందాన్ని అతనెప్పుడూ పొందలేదు. కానీ గౌతమి మనసు తెలుసుకోకుండా తొందరపడ్డానే అని అతని బాధ.
‘ఏదో విధంగా తప్పించాలని అతన్ని తన లవర్‌గా పరిచయం చేసి పొరపాటు చేశాను. నా మాటల్నిబట్టే వీళ్లింత ధైర్యం చేశారు.’ అతనేం అనుకున్నాడో అని మధనపడింది గౌతమి.
‘జంట బానే వుంది కానీ మాట మాత్రం వాళ్లనడక్కుండా దండలు మార్పించడమే బాగాలేదు’ అనుకున్నాడు నాయక్.
అయితే ఎవరూ బైటపడలేదు. ఆ రాత్రంతా ఆట పాటలతో సరదాగా గడిపారంతా. నగరానికి చేర్చాల్సిన వస్తువులన్నీ పెట్టెలతో సహా గుర్రాల మీద పెట్టి ప్రయాణానికి సిద్ధం చేశాడు జింబో.
అనుకున్నట్టే తెల్లవారుజామున గౌతమీ వాళ్లకి వీడ్కోలు చెప్పడానికి అందరూ చేరిపోయారు.
దొర వాళ్లకి అడవి సంపద గుర్తుగా ఇచ్చాడు. కొండమ్మ గౌతమి నుదుట బొట్టు పెట్టి పసుపు కుంకుమలతోపాటు జింబో తెచ్చిన చీర ఇచ్చింది. వాళ్ల ఆప్యాయతకి అందరికీ కళ్లు చెమర్చాయి. గౌతమి తన చేతివాచీ, మెళ్లోని గొలుసు చిన్నికిచ్చింది. ఖరీదైన తన సెల్ జింబోకిచ్చింది. పెద్దలందరికీ కాళ్లంటి నమస్కరించింది. మిగతా వారి దగ్గ ఆప్యాయంగా మాట్లాడి సెలవు తీసుకుంది. అందరి కళ్లూ వర్షిస్తూనే ఉన్నాయి. గౌతమీ వాళ్ల కోసం కూడా గుర్రాలు సిద్ధం చేశారు. అందరికీ చెప్పి, తండ్రి దగ్గరకొచ్చి-
‘డాడీ.. నేను వెళ్లిపోతాన్నాను’ అన్నాడు నాయక్. అంతవరకూ ఎంతో గుంభనంగా వున్న శకుని ఒక్కసారిగా అతన్ని కౌగిలించుకుని-
‘చింటూ! నన్ను క్షమించు నాన్నా! నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలి’ అన్నాడు చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తూ, ఈసారి అతనే తండ్రిని ఓదార్చి బయల్దేరాడు. గుర్రాలు వెళ్తుంటే నీళ్లు నిండిన కళ్లతో చూస్తూండి పోయారంతా.
* * *
రాత్రి ఒంటి గంట దాకా ఏవో ఫైల్స్ చూసుకుని పడుకున్నాడు చంద్ర. మంచి నిద్రలోకి జారిపోతుండగా సెల్ మోగడంతో తుళ్లిపడి లేచాడు. సెల్‌లోని నెంబర్ చూడగానే అతని నిద్రమత్తు ఎగిరిపోయి, మొహంలో ఆతృత చోటు చేసుకుంది.
‘హాయ్ ప్రభూ! ఎలా వున్నావ్ మిస్టర్ నాయక్? మిస్ ‘క్లూ’ బానే వున్నారుగా? నిజంగానే ఆ బ్లాక్‌టైగర్ తను దోచిన నగలూ అవీ ఇచ్చేస్తానన్నాడా? మీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మిమ్మల్నెప్పుడు పంపుతాడు? ఆ బ్లాక్‌టైగర్ చాలా భయంకరంగా వున్నాడా?’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రశ్నలతో వుక్కిరిబిక్కిరి చేశాడు.
‘అవన్నీ పర్సనల్‌గా మాట్లాడదాం. మేం ఆల్‌రెడీ వచ్చేశాం. గుట్టమీద గుడి వెనగ్గా వున్నాం. నువ్వు, మిస్టర్ ప్రయాగ వెంటనే ఓ వేన్ తీసుకుని వచ్చెయ్యండి’ అన్నాడు ప్రభు మరింత ఉత్సాహంగా.
ఆనందంతో చంద్రకి ఒళ్లు తెలయలేదు. ప్రయాగకి ఫోన్ చేసి, క్షణాల మీద అన్నట్టు ప్రయాగ, తదితరులతో కలిసి ఓ వేన్ తీసుకుని ప్రభు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు.
గుర్రాల పక్కన నిల్చున్న ఆటవికులు, జింబోతో సహా కాస్త ముందుకొచ్చి వినయంగా నమస్కరించారు. ప్రభు, విజయ నాయక్‌లను ఆనందంగా హగ్ చేసుకుని మరీ అభినందించారు చంద్ర, ప్రయాగ, మరికొంతమంది ముఖ్యులు, గౌతమిని ఆకాశాని కెత్తేశారు. చంద్ర ఆమె చేతిని అందుకుని-
‘్థంక్స్ మిస్ క్లూ! అనుకున్నది సాధించి, తల్చుకుంటే స్ర్తిలు ఏమైనా చెయ్యగలరు అని నిరూపించారు’ అన్నాడు ఉద్వేగంగా.
‘్థంక్యూ సర్. కానీ ఇది సాధించింది నేనొక్కదానే్న కాదు. మీరు, వీళ్లందరి సహకారం, ముఖ్యంగా బ్లాక్‌టైగర్ పెద్ద మనసూ వున్నాయి’ అందామె వినయంగా.
‘అయ్‌నో! మీరంతా పెద్ద సాహసం చేసి, ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా మన సంపదని సురక్షితంగా తీసుకురావడం మనకే కాదు. దేశానికే గర్వకారణం. మీరు అడవి నుంచి నాకు ఫోన్ చేసి చెప్పినా, ఆ టైగర్ సంపదని ఇస్తాడన్న నమ్మకం లేదు. నిజంగా అతను చాలా మంచివాడు. అతని కృతజ్ఞతలు చెప్పుకోవాలి!’ అన్నాడు చంద్ర మనస్ఫూర్తిగా.
‘సర్! ఇంటికెళ్లాక అన్ని విషయాలూ వివరంగా మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రభు.
‘అవును సర్! ఆ విషయాలన్నీ ఇంటికెళ్లాక మాట్లాడుకుందాం. ముందు గుర్రాల మీదున్న పెట్టెల్ని వేన్లోకి చేర్చి వెలుగు రాకుండానే వాళ్లని పంపేస్తే మంచిది’ మెల్లగా అన్నాడు విజయ నాయక్.
‘యస్. యూవార్ రైట్’ అంటూ డ్రైవర్‌కేసి చూశాడు చంద్ర. డ్రైవరు, మరి కొందరు, ఆటవికులు కలిసి గుర్రాల మీదున్న పెట్టెలన్నింటినీ వేన్‌లోకి చేర్చారు. తర్వాత ఆటవికుల తమ పని అయిపోయిందన్నట్టు నమస్కరించి వెనక్కి తిరిగారు. చంద్ర వాళ్లు వాళ్లందరికీ థాంక్స్ చెప్తుంటే మురిసిపోతూ వుత్సాహంగా రెండు మూడు మాటలు మాట్లాడినా, జింబో మాత్రం మాట్లాడకుండా తలదించుకుని చేతులు జోడించి వెనుదిరిగాడు. అతని మనసుని అర్థం చేసుకున్న గౌతమి
‘జింబో!’ అంది బిగ్గరగా. అతను ఆగి వెనక్కి తిరిగాడు. తన కళ్లలో ధారాపాతంగా వూరుతున్న నీటిని ఆమె చూడకూడదని తలదించుకునే వున్నాడు. గౌతమే పరుగులాంటి నడకతో అతని దగ్గరికెళ్లి రెండు చేతులూ పట్టుకుని, సున్నితంగా పెదవుల కానించుకుని -
‘్థంక్యూ జింబో! థాంక్యూ వెరీమచ్! మీరు చేసిన సహాయం, చూపించిన ఆప్యాయత జీవితంలో మర్చిపోను. మనం ఇంక లవకపోవచ్చు. కానీ నా ఆశీస్సులు మీకెప్పుడూ వుంటాయి. నువ్వు, చిన్ని త్వరలో పెళ్లి చేసుకోండి. నిండు నూరేళ్లూ పిల్లపాపలతో హాయిగా ఉండండి. బాబాని జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకి, శకుని అంకుల్‌కి, కొండమ్మత్తకి నా నమస్కారాలు చెప్పు. సిద్దూ వాళ్లకి..’ దుఃఖంతో ఆమెకి మాట రాలేదు.
‘వద్దు గౌతమీ! బాధపడొద్దు. మేమంతా హాయిగా వుంటాం మీరూ హాయిగా ఉండండి. ఎప్పుడైనా మమ్మల్ని తల్చుకోండి’ అంటూ వెళ్లిపోయాడు జింబో తమ వారితో కలిసి. కాస్సేపటికి గుర్రాలన్నీ చీకట్లలో కలిసిపోయాయి. దుఃఖం ఆపుకోలేని గౌతమి ఏడుస్తూ కూర్చుండిపోయి, మోకాళ్లలో తల దాచుకుంది. చంద్ర వాళ్లు అయోమయంగా చూస్తుంటే, ఆమె మనసు తెలిసిన ప్రభు, నాయక్‌లు చనువుగా ఆమెని తీసికెళ్లి కార్లో కూర్చోబెట్టారు.
నిధులతో అందరూ సి.ఎం. బంగళాకి చేరుకున్నారు. అప్పటికి గౌతమి కూడా తేరుకుని అడవిలోని అనుభవాలు ఉత్సాహంగా చెప్పింది. తండ్రిని ఆత్మీయుడిలా దగ్గరుండి చూసుకుంటున్న ప్రయాగకి కృతజ్ఞతలు చెప్పుకుంది. వేడివేడి కాఫీలు తాగుతూ అడవిలో జరిగిన విషయాలన్నీ చెప్పారు ప్రభూ వాళ్లు. అయితే, అందరికీ గుళ్లోని నగల గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. చంద్ర చెప్తాడని చూస్తున్నారు. అయితే గౌతమి ఆగలేదు.
‘సర్! గుళ్లోని నగలు...’
‘ఓ! సారీ! మీకు చెప్పలేదు కదూ? మీ అనుమానమే కరెక్ట్ మిస్ క్లూ! నగలు మొత్తం సేఫ్టీగా వున్నాయి. డాక్టర్ చందన మీ సూచన ప్రకారమే పథకాలు వేసి అతి సాహసంతో సంపదని, చేర్చడమే కాదు. రకరకాలుగా ఆ ధర్మారావు వాళ్లని హడలగొట్టి నిజాలు వాళ్ల నోటి నించే వచ్చేలా చేసి ఏనాడో వాళ్లు దొంగిలించిన అపురూప దైవ విగ్రహాలని కూడా సంపాదించి పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న నేరస్థుల్ని రెడ్‌హేండెడ్‌గా పోలీసులకి పట్టించింది. ఇదంతా మీ పథకమే అని నాకు చెప్పింది కూడా’ నవ్వుతూ ధర్మారావు వాళ్లనెలా బెదిరించిందీ, సంపదని ఎలా రక్షించిందీ అంతా ఉత్సాహంగా చెప్పాడు చంద్ర.
విస్తుపోయారంతా.
‘నిజంగా మీరు గ్రేట్ గౌతమీ.. నో! మిస్ క్లూ! మొదట్లో ఆ ధర్మారావూ వాళ్లని చూస్తే చెయ్యెత్తి దణ్ణం పెట్టాలనిపించేలా వుండే వారు. వాళ్ల వెనక ఇంత చరిత్ర ఉందంటే..’ విస్మయంగా అన్నాడు ప్రయాగ.
‘మొదట్నించీ వాళ్ల మీద నాకు అనుమానంగానే వుంది. తర్వాత వాళ్ల విషయాలన్నీ తెలుసుకుని ‘క్లూ’గా ఎంతో మందిని హెచ్చరించాను. ప్చ్! దేనికైనా టైమ్ రావాలి’ నవ్వింది గౌతమి.
‘అంతా బానే ఉంది గానీ.. ఆ అనిల్...’
‘ఇప్పుడా గొడవెందుకు. తెల్లవారబోతోంది. ఇంక ఇంటికెళ్తాం’ ప్రభు మాటకడ్డొస్తూ లేచాడు ప్రయాగ. అతనితోపాటు గౌతమీ లేచింది.
* * * (ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్