వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛ! బావి అంటే నాకు భయమేంటి? గంటల తరబడి సముద్రంలో ఈదినవాణ్ని. నేనా తాచుల గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు కాంతారావు.
‘దాన్ని గురించి ఆలోచించకు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈశ్వర వేళ్లు మన దొడ్లలోనే వున్నాయి’ నవ్వాడు ధర్మారావు.
‘ఈశ్వర వేరు దగ్గరుంటే పాములు రావా?’ నవ్వుతూ అన్నాడు అనిల్.
‘కచ్చితంగా రావు. ఇలాంటివి మీ డాక్టర్లు నమ్మర్లెండి. అయితే ఇవాళే వెళ్లి పని పూర్తి చేద్దాం’ అన్నాడు ధర్మారావు.
అనిల్ వాచ్ చూసుకున్నాడు. రాత్రి తొమ్మిది దాటుతోంది. పదకొండింటికి బయల్దేరాలని నిర్ణయించుకుని ఏవో మెల్లగా మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. బైట తుంపర మొదలయింది. అయినా ఎవరూ కంగారు పడలేదు. వాళ్ల ధ్యాస అంతా తోట బావిలోని పెట్టె తీసి, కొండ వెనుక అగాధంలా వున్న, వందలాది నాగులుండే పుట్టల్లో పడేసి, వీలుని బట్టి తీసుకుని సొమ్ము చేసుకోవాలన్న దాని మీదే ఉంది.
అనుకున్నట్టే పదకొండింటికి ఒకే మోటార్‌బైక్ మీద, పవర్‌ఫుల్ టార్చ్‌తో పెరట్లో వున్న ఈశ్వర వేరుతో సన్నని వానలో బయల్దేరారు. ఊరంతా నిద్రావస్థలో ఉంది. గాలి, వాన వల్ల పవర్ పోయి అంతటా అంధకార బంధురంగా వున్నా, వాన చినుకులు కళ్లల్లో సూదుల్లో గుచ్చుకుంటున్నా వూరికి దూరంగా వున్న ఓ పెద్ద తోటలోకి చేరుకున్నారు.
‘ఇదెవరి తోట?’ విస్మయంగా అన్నాడు అనిల్.
‘నా ప్రత్యర్థి తోట. చిక్కితే వాడే దోషిగా జైలుకుపోతాడు’ నవ్వాడు ధర్మారావు.
‘నిజంగా మీరు చాలా గ్రేట్’ మెచ్చుకున్నాడు అనిల్. బాగా తెలిసిన ప్రదేశంలా టార్చ్ సహాయంతో ఓ పెద్ద మోటబావి దగ్గరి కెళ్లారు. నీళ్లతో నిండుగా వున్న బావిలోకి చూసి-
‘మైగాడ్! ఇంత పెద్ద బావిలోంచి ఆ పెట్టె తియ్యడం సాధ్యమేనా?’ అంటూ హడలిపోయాడు అనిల్.
‘దాన్ని గురించి దిగులు పడకు. మా వాడు చేపలక్కూడా ఈత నేర్పగలడు’ అంటూ కాంతారావుతో కలిసి ఓ పక్కగా వున్న మోటర్ రూమ్‌లోవున్న పెద్ద మోకుని తెచ్చాడు ధర్మారావు. కాంతారావు ఆ మోకుని నడుముకి కట్టుకున్నాడు. ఆ తాడుని అనిల్, ధర్మారావు పట్టుకుంటే, బావికున్న మెట్ల ద్వారా బావిలోకి దిగాడు కాంతారావు. అనిల్ గుండె దడదడలాడింది. అన్ని నీళ్లున్న బావిలో మునిగి ఆ పెట్టెని తీసుకురావడం సాధ్యమేనా అనిపించిందతనికి. అది తాడి ప్రమాణం పైగా లోతున్న బావి.
కాంతారావు నీళ్లలోకి దిగాడు. మిగతా ఇద్దరూ తాడు పట్టుకుని మెల్లగా వదులుతున్నారు, వణుకుతూనే
‘ఆ పెట్టెకి తాడు కట్టడం కష్టమేమో’ ఏదో ఒకటి అనాలని అన్నాడు అనిల్.
‘తాడు కట్టక్కర్లేదు. అది బ్రహ్మాండమైన ఇనప్పెట్టె. దానికున్న ఇనుప గొలుసు తాలూకు హుక్స్ తాడుకి తగిలిస్తే చాలు!’ అన్నాడు ధర్మారావు. అదేదో చాలా ఈజీ అన్నట్టు.
గంటసేపు నీళ్లలో గాలిస్తూనే వున్నాడు కాంతారావు. లోపల కదలికలు తెలుస్తున్నా, అతనేమై పోయాడో అని కంగారుపడుతూనే ఉన్నాడు అనిల్.
మరో అరగంట తర్వాత సంకేతం ఇస్తున్నట్టు తాడు కదిలింది. ధర్మారావు టార్చ్ నూతిలోకి వేసి చూశాడు. నీళ్లలో ఈదుతున్న కాంతారావు కనిపించేసరికి బైట వున్న ఇద్దరి మొహాల్లోనూ రిలీఫ్ కనిపించింది. మరోసారి తొంగి చూశారు. కాంతారావు లాగమన్నట్టు సైగ చేశాడు. ధర్మారావు వాళ్లలో ఉత్సాహం వచ్చేసింది. ఇద్దరూ కలిసి మెల్లగా తాడు లాగడం మొదలుపెట్టారు. వట్టి తాడు తేలిగ్గా వచ్చేసినా నీళ్ల లెవెల్‌కి పెట్టె రాగానే లాగడం కష్టమై పోయింది. ముఖ్యంగా అనిల్‌కి.
‘జాగ్రత్త. వదిల్తే ప్రమాదం’ హెచ్చరించాడు ధర్మారావు.
చేతులు వొరుసుకు పోతున్నా అతి ప్రయాసగా లాగుతున్నారిద్దరూ. ధనరాసులు కళ్ల ముందు కదలాడుతుంటే, జోరుగా కురిసే వానలో బరువైన ఆ పెట్టెని పైకి లాగే ప్రయత్నంలో పడ్డారు.
హఠాత్తుగా బరువు తగ్గినట్టయి లాగడం తేలికైంది.
‘ఇదేంటి ఇంత తేలికగా వచ్చేస్తోంది? కొంపతీసి పెట్టె పడిపోలేదు కదా’ అనుకుంటూ పక్కన పెట్టి టార్చ్, ఎడంచేత్తో తీసి లోపలికి చూసి, పెట్టెతో సహా సగం దూరం వచ్చిన కాంతారావుని చూసి, టార్చ్ పక్కన పెట్టేసి తాడు లాగారు అనిల్, ధర్మారావులు.
ఎంతో కష్టమనుకున్న పని అతి తేలిగ్గా ముగించామని మురిసిపోతూ పెట్టెతో సహా కాంతారావుని పైకి లాగేశారు. కాంతారావు బాగా అలసిపోయి నీరసంగా కూర్చుండిపోయాడు. అయినా అతని మొహంలో వెర్రి ఆనందం చోటు చేసుకుంది.
‘ఇప్పుడు వీటిని పుట్ట దగ్గరికి చేర్చడమెలా?’ దిగులుగా అన్నాడు అనిల్.
‘ఆ శ్రమ మీకెందుకు డాక్టర్! అంతా మేం చూసుకుంటాం’ ఖంగుమంది లూసీ గొంతు.
తుళ్లిపడి వెనక్కి తిరిగారంతా. అప్పుడే లైట్లతో పట్టపగల్లా అయిపోయిందంతా. ఆ వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి బిగుసుకు పోయారంతా. అంతకు ముందు తాడు లాగడానికి సహాయపడ్డ లూసీ, ప్రయాగలే కాక, సి.ఎం. చంద్ర, పోలీసు బలగం కులాసాగా నవ్వుతూ కనిపించారు.
* * *
ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకున్న ప్రభూ వాళ్లూ, ఆటవికులు ఆత్మీయులై పోయారు. నగల గురించి, విగ్రహాల గురించి, మారణాయుధాల గురించి గుర్తున్నంత వరకూ ఎక్కడెక్కణ్నించి తెచ్చారో అన్నీ చెప్పాడు దొర. అన్నింటినీ పెట్టెల్లో సర్దించి సిద్ధం చేశాడు.
తమకి అంత ఆదరణ లభిస్తుందని గానీ, కొండంత దేశ సంపద స్వాధీనం అవుతుందని గానీ, ముఖ్యంగా చనిపోయాడనుకున్న తండ్రి సజీవంగా కనిపిస్తాడని గానీ విజయనాయక్ కల్లో కూడా ఊహించలేదు. అసలు ప్రాణాలతో బైటపడతానన్న నమ్మకం కూడా లేదు. అలాంటిది ఇంత ఆదరణ లభించేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఇంక గౌతమి, ప్రభుల సంగతి చెప్పనే అక్కర్లేదు.
దిగులుగా ఓ చెట్టు కింద కూర్చున్న జింబో దగ్గరికొచ్చింది గౌతమి. ఆమెని చూసి గభాల్న లేచాడతను.
‘ఏవిఁటి జింబో? ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు?’ అంది గౌతమి ఆప్యాయంగా. బలవంతంగా నవ్వాడు జింబో.
‘నిజంగా మా అందరికన్నా మీరే మంచి వాళ్లు జింబో! మీలో ఇంత మానవత్వం ఉంటుందని ఊహించలేదు. కానీ నేనే మీ అందర్నీ బాధపెట్టాను. క్షమించు’ అంది గౌతమి.
‘నువ్వెవర్ని బాధపెట్టావ్? పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేనే నిన్ను, ఆ ప్రభుబాబుని ఇబ్బందులు పెట్టాను. నీ మనసులో ఆయన వున్నాడని తెలిసినా మూర్ఖంగా ప్రవర్తించి, అసలు ప్రేమంటే ఏమిటో ప్రభుబాబు వచ్చాకే తెలుసుకున్నాను’ అన్నాడతను కాస్త సిగ్గుపడుతూ.
‘అదేవిఁటి? మేమిద్దరం ప్రేమించుకున్నట్టు ఏనాడూ ప్రవర్తించలేదే’ అంది గౌతమి.
‘అది కాదు.. ప్రభు బాబుని ప్రేమిస్తున్నానంటూ చిన్ని అతని చుట్టూ తిరగడం, అతనూ తనంటే ఇష్టమన్నట్టు ప్రవర్తించడం, మామ కూడా దానికి వంత పాడడం.. ఇవన్నీ నన్ను అమితంగా బాధించాయి. చిన్నతనం నించీ ప్రాణంలో ప్రాణంగా వున్న చిన్ని నాకు దూరమవుతుందన్న ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడర్థమయింది. చిన్నిని నేనెంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో, నాలాగే మీరిద్దరూ ఎంత బాధపడ్డారో? నా తప్పు నేను తెలుసుకున్నాను. చిన్నికి క్షమాపణలు చెప్పుకుని, ఎలాగైనా దాన్ని ఒప్పించి పెళ్లి చేసేసుకుంటాను’ చిన్నపిల్లాడిలా అంతా చెప్పేశాడు జింబో.
గౌతమి కళ్లు తళుక్కుమన్నాయి. అతని చెయ్యి పట్టుకుని వూపేస్తూ-
‘్థంక్స్ జింబో! ఇప్పుడు నాకింకా నచ్చావ్. చిన్ని కూడా అమాయకురాలైన అడవిమల్లి. తను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది’ అంది మనస్ఫూర్తిగా.
‘నేనూ మా బావని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానక్కా’ అంటూ వచ్చింది చిన్ని. ఆమె మొహంలో ఆనందం, సిగ్గు చేరి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.
‘హాయ్ చిన్నీ! నేను చెప్పానా జింబో నిన్ను తప్ప ఎవర్నీ ప్రేమించలేదని’ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి నవ్వుతూ అంది గౌతమి.
‘నిజమే. కానీ మీరంతా వెళ్లిపోతారంటే మాకు చాలా బెంగగా వుందక్కా’ చిన్ని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
‘నాకూ బాధగానే ఉంది చిన్నీ! ఇది నాకు నిజంగానే పుట్టిల్లులా, మీరంతా నా ఆత్మీయుల్లా అనిపిస్తున్నారు. కానీ మనం విడిపోక తప్పదు’ అంది గౌతమి బాధగా.
అప్పుడే సిద్ధు వచ్చి బాబా పిలుస్తున్నారని చెప్పడంతో అందరూ అతనితో కలిసి దొర వుండే గుహ దగ్గరికెళ్లారు. అప్పటికే బైట ఆటవికులు, లోపల విజయ నాయక్, ప్రభు మరి కొంతమంది ఆటవికులు దొర, శకునిలతో మాట్లాడుతున్నారు. అయితే అందరి మొహాలూ గంభీరంగా వున్నాయి. గౌతమిని చూసి ఆప్యాయంగా పిల్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు దొర.
‘బాబా! నీ ఆరోగ్యం బావుంది. ఇంక నీకేం భయం లేదు. నిండు నూరేళ్లూ ఇలా ఆర్తుల బాధలు తీరుస్తూంటావ్’ అంది గౌతమి హాయిగా నవ్వుతూ.
‘బతుకుతానమ్మా! పాడి చిరాయువు అన్నారు కదా. నూరేళ్లూ బతుకుతాను’ దొర గొంతు వణికింది. అతని మాటలకి అందరూ బాధపడ్డారు. శకుని మందలించాడు.
‘తెల్లవారుజామున మీరంతా ఇక్కణ్నించి శాశ్వతంగా వెళ్లిపోతున్నారు కదా. ఇవాళంతా మీ అందరితో గడపాలనిపించి అందరం ఇక్కడికొచ్చాం’ కళ్లు వొత్తుకుంటూ అంది కొండమ్మ. అందరికీ ఆత్మీయులు దూరమవుతున్నంత బెంగగా ఉంది.
‘గౌతమీ! నువ్వు నగల కోసం సాహసించి వచ్చావు. మీ నాన్న, నువ్వు కలిసి దాచిన నగల్ని పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే దొంగల పాలుకాకుండా తెచ్చి నీకప్పగించడమే కాక, మరెన్నో నగలు, దైవ విగ్రహాలూ కూడా ప్రాణంకన్నా ఎక్కువగా కాపాడి మన ఐ.జి. ప్రభు వాళ్ల కప్పగించేసి బరువు దింపుకున్నాం. కానీ మిగతావి?’ అన్నాడు దొర గంభీరంగా.
‘బాధ్యతలన్నీ మీవే! వాటిని గురించి నువ్వు కంగారు పడకు. నీకు మా సి.ఎం.గారి గురించి తెలియదు! ఆ బాధ్యతలన్నీ మా సి.ఎం.గారేమో చూసుకుంటారు బాబా! ప్రభుగారు, నాయక్ అంకుల్ జరిగిందంతా ఆయనకి చెప్తారు’ అంది గౌతమి గర్వంగా, సి.ఎం.ని గురించి.
‘నిజమే. మీ సి.ఎం.ని గురించి విన్నాను. వయసులో చిన్నవాడైనా మంచి నాయకుడు. అపర చాణక్యుడు అని అంటారని కూడా విన్నాను. ప్రస్తుతం దేశానికి అలాంటి నాయకులే కావాలి’ మెచ్చుకోలుగా అన్నాడు శకుని. ప్రభు మొహం వెలిగిపోయింది.
‘నిజం! మా చంద్ర లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు’ అన్నాడు అప్రయత్నంగా.
‘చంద్రా?’ చిత్రంగా చూశాడు శకుని.
అప్పటిగ్గానీ ప్రభుకి గుర్తు రాలేదు. సి.ఎం.ని చంద్ర అంటూ మాట్లాడానని. అతనేదో చెప్పబోతుంటే-
‘వయసులో కాస్త తేడా వున్నా మా సి.ఎం.గారూ, ఈ ప్రభూగారూ డియరెస్ట్ ఫ్రెండ్స్ డాడీ! బైటి వాళ్ల దృష్టిలో ప్రభుగారు ఆయన పి.ఏ.నే గానీ ఇద్దరూ ఒకే

ప్రాణంలా వుంటారు’ అన్నాడు నాయక్ నవ్వుతూ.
‘ఎంత మంచి నాయకుడైనా, దొంగల బారి నించి దేవుడి నగలు రప్పించలేక పోయాడు. లోకంలో పాపం పెరిగిపోతోంది’ పూర్వపు తన చర్యలని గుర్తు తెచ్చుకుంటూ భారంగా అన్నాడు దొర.
‘లేదు బాబా! ఇంకా పుణ్యాత్ములున్నారు. ఆ నగలు కచ్చితంగా ఆలయానికి చేరుకుంటాయి.’ నమ్మకంగా అంది గౌతమి.
ఆమె నమ్మకానికి నాయక్‌కి కూడా నవ్వొచ్చింది.
‘చూద్దాం. ఇంక ఆ దేవుడే వాటిని కాపాడుకోవాలి’ అన్నాడు మెల్లగా.
‘ఆ దేవుడే ‘క్లూ’ని దూతగా పంపాడు. కానీ ఆ దూతనే పట్టించుకోలేదు’ ఓరగా చూస్తూ అన్నాడు ప్రభు.
‘ఏవిఁటి ‘క్లూ’ అనే దూతని దేవుడు పంపాడా?’ కళ్లు చిట్లిస్తూ అన్నాడు శకుని. గౌతమే తేరుకుని-
‘అదేం కాదంకుల్! ‘క్లూ’ అని పేరు పెట్టుకుని హడావిడి చేసేదో పిచ్చిపిల్ల. ఇప్పుడామె గురించి ఎందుగ్గానీ ఆ నగలు ఈపాటికి సురక్షితంగా ఆలయానికి చేరుకునే వుంటాయి’ అంది సన్నగా నవ్వుతూ.
తుళ్లిపడ్డారంతా.
‘ఆ నగలు దొరికుంటాయా? కలొచ్చిందా?’ అన్నాడు ప్రభు.
‘కల కాదు. నిజంగానే అవి లూసీ అనబడే మా ప్రియ ద్వారా సి.ఎం. గారికి, ఆ పై దేవుడికి చేరి ఉంటాయి’
‘లూసీ?’
‘యా! అవెక్కడున్నాయో కనిపెట్టిన ప్రియ వాటినెంత కష్టపడైనా అక్కణ్నించి మాయం చేస్తుందని నాకు తెలుసు. కాబట్టి వాటిని గురించి ఎవరూ బాధపడద్దు’
వాళ్ల మాటలు ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు, నాయక్ కలిసి ‘క్లూ’ సంగతి, ఆమె ఇచ్చిన వివరాల సంగతి చెప్పేశారు.
‘మైగాడ్! ఎవరా డేరింగ్ గళ్?’ విస్మయంగా అన్నాడు శకుని.
‘ఇంకా అర్థం కాలేదా డాడీ! ఆ నగల గురించి తన ఫ్రెండ్ కప్పగించి, మిగతా నగల గురించి ఇక్కడికి రావడానికి సాహసించిన ‘క్లూ’ ఎవరో కాదు. మీ ఎదురుగా అమాయకంగా కూర్చున్న ఈ గౌతమే..’ నవ్వుతూ అన్నాడు నాయక్.
విస్తుపోయారంతా. ఆమె సాహసానికి అభినందించారు. చిన్ని, జింబోలైతే గుండెల మీద చెయ్యేసుకున్నారు. గౌతమి సిగ్గుపడిపోయింది.
‘ఇందులో నా గొప్పదనం ఏం లేదు. మొదట్లో ‘క్లూ’ పేరిట హంగామా చేసినా, తర్వాత సి.ఎం. గారే కాక చాలామంది నాకు సహకరించారు కాబట్టే నేనా పని చెయ్యగలిగాను’ అంది మెల్లగా.
‘చాలా విషయాలు నాకు తెలుసు గానీ, నగల గురించి నాకు తెలియదు. నిజంగా అవి దొరికితే పెద్ద మిరికిలే’ అన్నాడు ప్రభు.
‘ఎంత మంచి వార్త చెప్పావ్ తల్లీ! నీలాంటి బిడ్డని కన్న నీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. మీరు చేసే పెద్ద యజ్ఞంలో మేమూ చిన్నిచిన్ని సమిధలయ్యామంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇంక మీదటైనా నక్కల్లాంటి వాళ్లు చేరకుండా జాగ్రత్త పడమని మీ సి.ఎం.కి చెప్పండి’ అన్నాడు దొర.
గౌతమి నవ్వింది.
‘నిజమే బాబా! వాళ్లెంతకైనా తెగించే రకాలు. అయినా ఇంక మరింత జాగ్రత్తగా ఉంటారు మన నాయకుడలాంటి వారు. కానీ, నువ్వు, శకుని అంకుల్ కలిసి దేశానికి చేసిన మేలు మాటలతో చెప్పలేం. నిజమైన దేశభక్తులు మీరే. ఇవన్నీ చూసి ప్రభుత్వం, ప్రభుత్వం ఏవిఁటి దేశమే మీకు బ్రహ్మరథం పడుతుంది’ అంది ఉత్సాహంగా.
శకుని మొహం గంభీరంగా అయిపోయింది.
‘అవసరం లేదమ్మా! మా జోలికి రాకపోవడమే మాకు పెద్ద అవార్డు ఇచ్చి అందలం ఎక్కించినట్టు. ఇంక ముందు మీకూ మాకూ ఎలాంటి సంబంధం ఉండదు. వుండకూడదు. మా గురించి ఈ అడవి గురించి పూర్తిగా మర్చిపొండి. అలా అని మాట ఇచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నాడు సీరియస్‌గా.
‘అంకుల్!’
‘అవును గౌతమీ! ఇంక ఈ అడవికీ, మనకీ ఎలాంటి సంబంధం వుండకూడదనీ, తాము చేసిన దానికి ప్రత్యుపకారంగా వాళ్లందర్నీ మనం మర్చిపోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ తమని కలవడానికి ప్రయత్నించకూడదని కండిషన్స్ పెట్టి మా చేత మాట తీసుకున్నారు డాడీ!’ గద్గద స్వరంతో అన్నాడు నాయక్.
గౌతమి మొహం వెలవెల పోయింది.
‘ఎందుకంకుల్! ఇంత పెద్ద శిక్ష వేశారు? మీరెవరూ నేరస్థులు కారు. మేము మీ విరోధులమూ కాము. ఎక్కడివాళ్లు అక్కడే వున్నా మనం తరచూ కలుస్తూ వుండచ్చు కదా’ అంది బాధగా.
‘నేనూ అదే అన్నాను గౌతమీ! కానీ ఆయన వినిపించుకోలేదు. బలవంతం చేస్తే తనని తాను కాల్చుకోవడానిక్కూడా సిద్ధపడ్డారు డాడీ!’ తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నాడు విజయనాయక్.
‘నిజమేనమ్మా! దేశంలోని అడవుల్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, దుర్మార్గుల చేతుల్లో పడి అడవి సంపద పోయి ఎన్ని అడవులు అంతరించాయో మీకూ తెలుసు. కానీ ఈ సింగపడవికి ఆ స్థితి రానివ్వం’ అన్నాడు దొర గంభీరంగా. వాతావరణం వేడెక్కిపోయినట్టు అనిపించిన ఓ వృద్ధుడు.
‘ఇదిగో, ఇంక మనం కలిసి వుండేది కొన్ని గంటలు మాత్రమే. ఈ కాస్సేపైనా అన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుదాం. అందరూ హాయిగా నవ్వుతూ మన అతిథులకి వీడ్కోలు చెప్పాలి’ అంటూ హెచ్చరించాడు నవ్వుతూనే.
అంతే! ఆడ మగ, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఆటవికులంతా ఉత్సాహంగా అరిచారు. డాన్సులు చేశారు. ప్రభూ వాళ్లందరి చేతా తమ పద్ధతిలో నృత్యం చేయించారు. ఆ ఆనందానికి దొర, శకుని కూడా దూరం లేదు. దొర, చిన్ని జింబోల పెళ్లిని గురించి బాహాటంగా ప్రకటించాడు.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్