వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏం ఉంది.. కొండని తవ్వి ఎలుక కూడా దొరక్క వెళ్లుంటుంది. హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టు ఈ కుర్ర డాక్టర్ మన గుట్టు కనిపెడుతుందా?’ నవ్వాడు కాంతారావు.
‘ఆమెనంత తేలిగ్గా తీసిపారెయ్యడానికి వీల్లేదు. ఆమె వెనుక ఎవరో పెద్ద వాళ్ల హస్తం ఉందని నా నమ్మకం. అసలు గౌతమి అడవికెళ్లడం, ఆటవికులకి చిక్కుకోవడం అన్నీ అబద్ధాలే అనిపిస్తోంది. అంటే చాలామందికి మన మీద అనుమానం ఉంది. మనం జాగ్రత్త పడాలి’ అన్నాడు అనిల్.
‘మనం ఆల్‌రెడీ జాగ్రత్తపడ్డాం. ఇప్పుడా దేవుడు కూడా ఆధారాలు సంపాదించలేడు’ నవ్వాడు ధర్మారావు.
‘నిజమే. ఆ నగల జాడ తెలుసుకోవడం దేవుడిక్కూడా తెలియదు’ అన్నాడు కాంతారావు.
అయినా ఎందుకో అనిల్‌కి ధైర్యంగా లేదు.
మొహంలో విపరీతమైన భయం చోటు చేసుకుంది.
‘ఏవిఁటి పులిలా ఉండేవాడివి పిల్లిలా అయిపోయావ్? కొంపతీసి ఆ శంకరయ్య క్కూడా మన మీద అనుమానం వచ్చిందా?’ ఆతృతగా అన్నాడు ధర్మారావు.
‘మన మీద అనుమానం వచ్చిందని చెప్పాడుగా. ఆ గౌతమిని ముందు చంపేశామని కూడా అనిల్ దగ్గర మొరపెట్టుకున్నాడు. నయం అనిల్ మీద అనుమానం రాలేదు’ కసిగా అన్నాడు కాంతారావు.
చాలాసేపు ఏవేవో చర్చించుకున్నారు ముగ్గురూ.
‘ఇంతకీ ఆ నగల విలువ ఎంతుంటుందంటావ్?’ కుతూహలంగా అన్నాడు కాంతారావు.
‘వాటి విలువ కట్టడం అంత తేలిక్కాదు. విదేశాల్లోని వాటిని గురించి తెలిసిన మేధావిని సంప్రదించాలి’ అన్నాడు అనిల్ ఏదో ఆలోచిస్తూ.
‘ఎలా? అలాంటి మేధావులెవరైనా తెలుసా?’ ఉత్సాహంగా అన్నాడు కాంతారావు.
‘చూద్దాం. ఆలయ దోపిడీని గురించి, నగల గురించి జనాలు మర్చిపోయినా ఆ సి.ఎం., పోలీసులు మర్చిపోలేదు. ప్రస్తుతం వాళ్లకి.. ముఖ్యంగా శంకరయ్య మాటల్నిబట్టి మీ మీదే తప్ప నా మీద అనుమానం లేదు. మీ మీద కూడా కేవలం అనుమానమే తప్ప గట్టి నమ్మకం ఉన్నట్టు లేదు. రేపా రాక్షసి, ప్రభుగాడూ వస్తే, అసలు నేరస్థుడు బ్లాక్‌టైగర్ కాదని తెలిసిపోతుంది. అప్పుడు మనం కచ్చితంగా రిస్క్‌లో పడిపోతాం. అందుకే ముందు జాగ్రత్తగా మనం ఏదో ఒకటి చెయ్యాలి’ అన్నాడు అనిల్.
‘గౌతమి అడవిలోకి వెళ్లలేదన్నావుగా?’ అన్నాడు కాంతారావు.
‘అది కేవలం నా అనుమానమే. జరిగినవన్నీ చూస్తుంటే అదీ, ఆ ప్రభుగాడూ ఏకమై ఆ అడవిలో డ్యూయెట్లు పాడుకుంటూ వుంటారని కూడా అనిపిస్తోంది’ పళ్లు నూరుతూ అన్నాడు అనిల్.
‘అయితే ఇప్పుడేం చేద్దాం?’ ఆతృతగా అన్నాడు ధర్మారావు.
‘చెప్తాను. రేపు రాత్రి పొద్దుపోయాక ఇక్కడికి రండి. అదీ ఎవరూ గమనించకుండా’ అంటూ గుసగుసగా ఏదో చెప్పాడు అనిల్. అయితే అక్కడ వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ రికార్డయి పోయాయని వాళ్లకి తెలియదు.
* * *
అనుకోకుండా అక్కడ విజయనాయక్ కనిపించడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు ప్రభు. వెంటనే భయం నేనున్నానంటూ అతన్నావహించింది. మరింత చెట్లలోకి తీసికెళ్లి -
‘ఎలా వున్నారు సార్? అక్కడి పరిస్థితులెలా వున్నాయి? మిమ్మల్నెవరూ చూళ్లేదు కదా?’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
‘అవన్నీ తర్వాత. ముందు మీరెలా వున్నారో చెప్పండి. మీ గురించి సి.ఎం.గారు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? కనీసం మీ క్షేమ సమాచారం గురించి ఓ ఫోనైనా చేయచ్చుగా?’ అన్నాడు నాయక్.
‘రాగానే మా సెల్స్ తీసేసుకున్నారు. తర్వాత ఇచ్చేసినా చార్జ్ చేసుకోవడానికి లేదు’ అంటూ వచ్చిందగ్గర్నించి జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పాడు ప్రభు.
‘్థంక్‌గాడ్! అయితే జనాలు భయపడినట్లు ఈ అడవిలో బ్లాక్‌టైగర్ లేడన్నమాట! అసలు బ్లాక్‌టైగర్ అనేవాడు ఉన్నాడో లేక ఆ పేరు పెట్టుకుని ఆటవికులు జనాలని భయపెట్టి అడవిలోకి రాకుండా చూసుకుంటున్నారో’ అన్నాడు నాయక్.
‘ఎందుకు లేడూ?! ఒకప్పుడు దేశానే్న గడగడలాడించిన బ్లాక్‌టైగర్ ఇక్కడే ఉన్నాడు. గౌతమి ట్రీట్ చేసింది అతనికే. కానీ అతన్ని ఇక్కడంతా దొర అంటారు’ అంటూ మరికొన్ని వివరాలు చెప్పాడు ప్రభు.
‘నిజమా? అంత కర్కోటకుడు ఇంత సాత్వికంగా మారిపోయాడా? నమ్మలేక పోతున్నాను. దేనికో నటిస్తున్నాడనిపిస్తోంది’ అన్నాడు నాయక్ ఏదో ఆలోచిస్తూ.
‘లేదు సర్! అతను నిజంగానే మంచివాడు. దశాబ్దాల కిందట దోపిడీలు చేసినప్పుడు కూడా, దయ, కరుణ లాంటివి అతన్నంటి పెట్టుకునే ఉన్నాయనరి రెండుసార్లు గౌతమిని కాపాడిన సంగతి వింటేనే అర్థమవుతుంది. అతను గౌతమి కుటుంబానే్న మృత్యుముఖం నుంచి తప్పించాడు. కాస్తలో కాస్త రుణం తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడిచ్చాడేమో ఇప్పుడతని ప్రాణాలని గౌతమి రక్షించింది’ అంటూ చిన్నతనంలోనూ, అడవిలో ప్రవేశించినప్పుడూ గౌతమీ వాళ్లనతను ఎలా కాపాడాడో తెలిసినంతవరకూ చెప్పాడు ప్రభు. ఆలోచనలో పడ్డాడు నాయక్. అతనికి శంకరయ్య మాట్లాడిన తీరు గుర్తొచ్చింది.
‘ఇంతకీ మీరెందుకొచ్చారు? మాలాగే మీరూ తొందరపడ్డారు మిస్టర్ నాయక్! అడుగడుగునా ఆటవికులుండే ఈ అడవిలోకి ఎవరి కంటా పడకుండా వచ్చారంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం మేం చాలా సేఫ్‌గా ఉన్నాం. దొర మరికాస్త తేరుకోగానే ఇద్దరం వచ్చేస్తాం. మీరు వెళ్లిపొండి. మా గురించి కంగారుపడవద్దని సి.ఎం.గారికి చెప్పండి’ అన్నాడు ప్రభు.
‘లేదు. నేనీ అడవిలో ప్రవేశించింది కేవలం మీ కోసం మాత్రమే కాదు. ఇక్కడి రహస్యాలు కొన్ని తెలుసుకోవాలని కూడా వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ పాతాళ స్వర్గం అనే ఓ స్థావరం ఉందనీ, అక్కడెన్నో విద్రోహ చర్యలు జరుగుతున్నాయనీ, దాని స్థాపకుడు బ్లాక్‌టైగరే అనీ విన్నాను. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి. ముఖ్యంగా మా నాన్నని చంపిన ఆ టైగర్ని లాక్కెళ్లి ఉరికంబం ఎక్కించాలి’ ఆవేశంగా అన్నాడు నాయక్.
హడలిపోయాడు ప్రభు.
‘మీ నాన్నగారిని టైగర్ చంపాడా?’ అన్నాడు భయంగా.
‘ఎస్! ఆ బ్లాక్‌టైగరే మా డాడీని పొట్టన పెట్టుకున్నాడు. మా డాడీని గురించి మీరు వినే ఉంటారుగా?’ సూటిగా చూస్తూ అన్నాడు నాయక్.
‘అవును. ఎవరో మర్డర్ చేసి రైల్వేట్రాక్ మీద పడేశారని విన్నాను. కానీ అదెప్పటి మాట’ భారంగా అన్నాడు ప్రభు.
‘అఫ్‌కోర్స్! చాలాకాలం అయింది. కానీ ఆయనకి జరిగిన అన్యాయానికి ఇప్పటికీ నా గుండెల్లో మంటలు రేగుతూనే ఉన్నాయి. మీకు తెలియదు ప్రభూ! మా డాడీ అంటే నాకు ప్రాణం. డాడీకీ నేనన్నా అంతే. నన్ను ముద్దుగా ‘చింటూ’ అని పిలిచేవాడు. ముఖ్యంగా ఆయనకి దేశమన్నా, పోలీసు డిపార్ట్‌మెంట్ అన్నా చాలా ఇష్టం. అందుకే తను ఇంజనీరింగ్ చదివినా మా డిపార్ట్‌మెంట్‌లో సి.ఏ.గా చేరాడు.
సిన్సియర్ ఆఫీసర్‌గానే కాదు, ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి గల వ్యక్తిగా ప్రశంసలు పొందాడు. అవి బ్లాక్‌టైగర్ పేరు వింటేనే హడలిపోయే రోజులు. అలాంటి వాణ్ణి పట్టుకోవడానికి డాడీని నియమించారు. క్షణం ఆలోచించకుండా తన పటాలంతో అడవి మీద దాడి చేశాడు. ఆటవికులు అప్రమత్తమై ఎదురుదాడి చేసి పోలీసుల్ని తరిమికొట్టారు. ప్రభుత్వం నీరసించిపోయింది. అడవి మీద దాడి చేసిన వాళ్లంతా తిరిగొచ్చారు కానీ మా డాడీ రాలేదు.
ఆటవికులు ఆయన్ని చంపేసి ఉంటారని కొందరు, కాదు బ్లాక్‌టైగర్ ముఠాలో కలిసి పోయాడని కొందరూ, బందీగా వున్నాడని కొందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు కథ లల్లుకున్నారు.
రెండు నెలల తర్వాత రైలు పట్టాల మీద ఆయన శవం కనిపించింది. యూనిఫామ్, ఐడెంటిటీ కార్డులని గుర్తించి ఆయనకి పోలీసు పద్ధతి ప్రకారం అంతిమ సంస్కారం చేశారు. ఆయన చావుకన్నా అందర్నీ వణికించింది ఆయన జేబులో దొరికిన బ్లాక్‌టైగర్ లెటర్.
‘ఎవరు ఈ అడవిలో ప్రవేశించినా వాళ్లకిదే శిక్ష - బ్లాక్‌టైగర్’ అనుందా లెటర్‌లో.
అంతే! ఇంక అప్పట్నించీ ఈ అడవి జోలికి ఎవరూ వెళ్లలేదు. కానీ మా డాడీ మరణం నా మీద చాలా ప్రభావం చూపించింది. తిండి, నిద్ర, చదువు అన్నీ మానేసి పిచ్చాడిలా తిరిగాను. నాన్న ఫొటో ముందు కూర్చుని ఏడుస్తూండేవాణ్ని. అమ్మ తన దుఃఖాన్ని మింగేసి అతికష్టం మీద నన్ను మామూలు మనిషిని చేసింది. చదువు సంధ్యలు చెప్పించింది. మా నాన్న ఆదర్శాలు తెలిసిన నేను ఎలాగో అమ్మని ఒప్పించి ఐపిఎస్ చేసి ఈ దశకి చేరుకున్నాను. తర్వాత కూడా అప్పుడప్పుడూ బ్లాక్‌టైగర్ పేరిట దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే అతనెలా ఉంటాడో ఎక్కడుంటాడో, అడవికెప్పుడొస్తాడో ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలన్న ప్రయత్నమూ చెయ్యలేదు. ఎన్నాళ్ల నించో మనసులో వున్న కోరిక ఈనాటికి మీ మూలంగా నెరవేరుతుందేమో అన్న ఆశతో వచ్చాను. ఈ విషయంలో చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ల ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాను. మీరిద్దరూ వెళ్లిపొండి. నేను నా ప్రయత్నాలు సాగించి ఇక్కడి రహస్యాలు తెలుసుకుని, బ్లాక్‌టైగర్‌తో సహా వస్తే సరే, లేకపోతే నేనూ పోయాననుకోండి’ పసివాడిలా మొత్తం చెప్పేశాడు నాయక్. అతని కళ్ల నిండా నీళ్లూరాయి. ధైర్యసాహసాలకి మారుపేరులా ఉండే అతను పసివాడిలా అంత బేలగా మాట్లాడుతుంటే నోట మాట రానట్టు చూస్తూండిపోయాడు ప్రభు.
‘అదంత తేలిక కాదు సర్. ఆ పాతాళస్వర్గం గురించి తెలుసుకోవాలని నాకూ ఉంది. కానీ ఇక్కడి వాళ్ల సహాయం లేకుండా అక్కడికి అడుగుపెట్టలేం. ఇక్కడి వాళ్లు సహాయం చెయ్యరు’
‘పర్లేదు! చూస్తాను. ఎవరూ చేయలేని పని నేను చేసి చూపిస్తాను. దశాబ్దాలుగా దారుణ చర్యలు చేస్తూ ప్రభుత్వాలకి చిక్కకుండా పాదరసంలా జారిపోతున్న ఆ బ్లాక్‌టైగర్‌ని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించి తీరుతాను’ ఆవేశంగా అన్నాడు నాయక్.
‘అయితే మీకు మీరే సమాధులు సిద్ధం చేసుకోండి’ ఖంగుమంది చిన్ని గొంతు. తుళ్లిపడి ఆమెని చూసిన ప్రభు హడలిపోయాడు. ఏదో అనబోతుండగా గౌతమి పరిగెత్తుకొచ్చి-
‘ఇంతలో ఎక్కడి పోయావ్ చిన్నీ! నీ కోసం అడవంతా వెతుకుతున్నాను అసలు...’ ఏదో అనబోయి నాయక్ వాళ్లని చూసి ఠక్కున ఆపేసింది. వాళ్ల మొహాలు చూసి కొంతవరకూ అర్థం చేసుకుంది. చిన్ని భుజం మీద చెయ్యేసి-
‘చిన్నీ! ఈయన..’ అంటూ ఏదో చెప్పబోయింది. అయితే చిన్ని వినిపించుకోకుండా భుజం మీది గౌతమి చేతిని విసురుగా తోసేసి-
‘శ్రమ పడకు గౌతమీ! నాకంతా తెలిసిపోయింది. మీరు ఇక్కడికి ఎందుకొచ్చారో అంతా విన్నాను. కానీ మా బాబా మీద చెయ్యి పడిన వాడి చెయ్యి ఉండదని మీకు తెలియదు’ అంది కఠినంగా.
ఆమె మాట్లాడిన తీరుకి నాయక్ కూడా బిత్తరపోయాడు. గౌతమే అతి ప్రయాసగా ఆమెని కాస్త కూల్ చేసి ఒక్కొక్కరికి పరిచయం చేసింది.
పెద్దగా నవ్వింది చిన్ని.
‘ఎంత చక్కని పథకం వేశారు గౌతమీ. నిజంగానే మేం అమాయకులం. మీరు చెప్పిన మాటల్ని పిచ్చిగా నమ్మి, మిమ్మల్ని ఆత్మీయులని భ్రమపడ్డాం. ఎంతలా అంటే మీ దగ్గర మారణాయుధాలున్నా అవి ఆత్మరక్షణకే అనుకుని తిరిగి మీకిచ్చేంతలా; నిన్ను కన్నబిడ్డలా అనుకున్న బాబాని మోసం చెయ్యడానికి నీకు మనసెలా ఒప్పింది గౌతమీ’ అంది. ఆమె నవ్వు దుఃఖంగా మారిపోయింది.
‘నువ్వు పొరపాటు పడుతున్నావ్ చిన్నీ! నిజంగానే మేం అమ్మవారి నగల కోసం వచ్చాం. మా కోసం ఈయనొచ్చారు. ఈయన తండ్రిని గురించి చెప్పిన విషయాలు కూడా విన్నావుగా. ఈయన అపార్థం చేసుకుని ఉంటారు.

అదే నేనూ చెప్తున్నాను’ అంటూ నాయక్ గురించి, అతని తండ్రి మరణం గురించి చెప్పాడు ప్రభు. గౌతమి, నాయక్‌లు కూడా చెప్పడంతో కాస్త శాంతించింది చిన్ని.
‘సరే! అదే నిజమైతే వెంటనే ఈయన్ని పంపెయ్యండి. మా బావ చూస్తే మరీ ప్రమాదం’ అంది కాస్త భయంగా చూస్తూ.
‘నిజం చెప్తున్నాం చిన్నీ! మీ బాబా జోలికే రాం. ఒక్కసారి పాతాళ స్వర్గం చూసి వెళ్లిపోతాం’ అన్నాడు ప్రభు.
‘మళ్లీ అదే మాట. మీకు బతకాలని లేదా?’ చిరాగ్గా అంది చిన్ని.
‘ఎందుకు బతకం. నీ సహాయం ఉంటే క్షేమంగా వెళ్తాం’ నవ్వింది గౌతమి.
‘నా సహాయమా? అడవి దాటించడమా?’
‘కాదు. పాతాళ స్వర్గం చూడ్డానికి’
‘ఏవిఁటి?’ కెవ్వుమన్నంత పని చేసింది చిన్ని.
‘అవును చిన్నీ! నువీ సాయం చేస్తే, నీకూ మీ బావకీ పెళ్లి చేసి మరీ వెళ్తాం’ అంది గౌతమి. ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూసిందామె.
‘నమ్మడం లేదు కదూ! నీకు, జింబోకి పెళ్లి చేసి మరీ వెళ్తాం’ అంది గౌతమి.
ఈసారి భారంగా నవ్వింది చిన్ని.
‘అది జరిగే పని కాదని నీకూ తెలుసు. మీ ఆరాటం చూస్తుంటే నాకూ సహాయం చెయ్యాలనుకుంది కానీ అటుకేసి ఎవరూ వెళ్లరు. లోపలికి వెళ్లాలంటే కూడా చాలా కష్టం’ అంది. ఆమె కాస్త మెత్తపడ్డం గమనించిన ప్రభు
‘జస్ట్ చూసి వచ్చేస్తాం. ఒక్కసారి మాకీ సాయం చేశావంటే ఎవరి కంటా పడకుండా, మళ్లీ నీతోపాటే వచ్చేస్తాం’ అన్నాడు ప్రభు.
‘సరే.. దానికి నేనో పథకం వేస్తాను. రేప్పొద్దునే్న చీకటితోనే ఇక్కడికొచ్చెయ్యండి. మరో మాట. అక్కడ ఫొటోలూ అవీ తియ్యకూడదు. గౌతమి బాబా దగ్గరే ఉండాలి’ అంది చిన్ని.
ఆ మాత్రానికే ఆనందపడిపోయారంతా.
‘ఓకే! నాకేం పెద్ద ఇంట్రస్ట్ లేదు. వీళ్లిద్దరూ వెళ్లి చూసొస్తారు’ అంది గౌతమి.
‘మా బాబా జోలికి రాకూడదు’ కండిషన్ పెట్టింది చిన్ని.
‘అలాగే’ అన్నట్టు తల పంకించాడు నాయక్.
‘సరే! పొద్దునే్న కలుద్దాం. మీరు మాత్రం ఎవరికీ కనిపించకండి’ అంటూ అతన్ని హెచ్చరించింది.
‘అలాగే’ అన్నట్టు తలూపాడు నాయక్.
‘ఈ రాత్రి ఎక్కడుంటారు?’
‘పర్లేదు. నాకు భయం లేదు’ నవ్వాడు నాయక్.
‘అలా కాదు. మీరు నాతో రండి’ అంటూ అతన్ని ఓ చిన్న గుహలోకి తీసికెళ్లి, క్షణాల్లో అన్నట్టు అతనికి తినడానికి, తాగడానికీ ఇచ్చి, ప్రభు గౌతమిలతో కలిసి వెళ్లిపోయింది చిన్ని.
‘నిజంగానే వీళ్లు మంచివాళ్లలా ఉన్నారు’ అనుకున్నాడు నాయక్.
రాత్రి పది గంటలు దాటింది. అడవంతా నిశ్శబ్దంగా ఉంది. నిశాచర జీవులు తప్ప ఆటవికులతో సహా పశుపక్ష్యాదులు కూడా నిద్రావస్థలో ఉన్నాయి. ఆ సమయంలో అడవిలో అడుగుపెట్టిన జింబో కాళ్లు చిన్ని ఇంటికేసి నడిచాయి. అతని మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తోంది.
ఆరు బైట పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకున్న చిన్ని అడుగుల చప్పుడుకి తుళ్లిపడి చూసింది. కాగడా వెలుగులో జింబోని చూసి హడలిపోయి గభాల్న కళ్లు మూసుకుంది. అతనోసారి మెల్లగా పిల్చాడు. ఆమె పలకలేదు.
‘నువ్వు నిద్ర పోవడం లేదని నాకు తెలుసు. ముందు లే’ అంటూ ఆమె రెక్క పట్టుకుని ఒక్క గుంజు గుంజాడు జింబో.
‘్ఛ! ఏవిటీ మోటు సరసం?’ చేతిని విదిలించుకుంటూ అంది చిన్ని చిరాగ్గా.
‘ఆఁ! నీతో సరసాలాడ్డానికే వచ్చాను పద’ కఠినంగా అన్నాడతను.
‘ఎక్కడికి?’
‘ఏట్లోకి?’
‘ఏట్లోకా? నాకు నిద్రొస్తోంది బాబూ. కావాలంటే నువ్వెళ్లు’ అందామె ఆవలిస్తూ. అతనికి చిర్రెత్తుకొచ్చింది.
‘రమ్మంటే నీక్కాదూ’ అంటూ ఆమె రెక్క పట్టుకుని పక్కనే వున్న కొండ దగ్గరికి లాక్కెళ్లాడు జింబో.
‘ఏవిఁటీ దౌర్జన్యం? అసలు నువ్వెప్పుడొచ్చావ్?’ అంది చిన్ని చిన్న రాతిమీద కూర్చుంటూ.
‘ఎప్పుడో వచ్చాను. నేనిక్కడ లేకపోయినా అన్నీ నాకు తెలుసు. చెప్పు! నేను విన్నది, నువ్వన్నదీ నిజమేనా?’ అన్నాడు జింబో గద్దించినట్టు.
‘దేన్ని గురించి నువ్వడిగేది?’ అమాయకంగా అందామె.
‘అర్థం కానట్టు నటించకు. నేనడిగేది ఆ పట్నం కుర్రాడి గురించే అని నీకు తెలుసు. చెప్పు! నువ్వు నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నావా?’ అన్నాడతను సూటిగా చూస్తూ.
‘ప్రేమో దోమో నాకు తెలియదు. అతనంటే నాకిష్టం. నేనంటే అతనికిష్టం అన్నాడు. అందుకే అతనే్న మనువాడాలనుకుంటున్నాను’ స్థిర స్వరంతో అంది చిన్ని.
క్షణం బిత్తరపోయాడు జింబో.
‘నువ్వు మారిపోయావు చిన్నీ’ అన్నాడు మెల్లగా.
‘నిజమే! ప్రభుగారిని చూడగానే నా మనసు మారిపోయింది’
జింబోకి ఏమనాలో అర్థం కాలేదు. ఇంక గద్దించి లాభం లేదనుకుని-
‘అది కాదే చిన్నీ! నీకు పట్నం వాళ్లని గురించి తెలియదు. వాళ్లు మనల్ని మృగాల్లా చూస్తారు. అంతేకాదు మృగాలకన్నా భయంకరమైన వాళ్లు. మృగాలు ఆకలైనప్పుడే వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. కానీ వాళ్లున్నారే పీకల దాకా తిన్నా, మేడలు మిద్దెలు కట్టుకున్నా ఇంకా ఎదుటివాడి మీద దాడిచేసి మరీ దోచేస్తారు. అందుకు ఆ ప్రభు భిన్నం కాదు’ అన్నాడు అనునయం, ఆవేదన నిండిన గొంతుతో.
‘నిజమా?!’ కళ్లు విశాలం చేస్తూ అంది చిన్ని.
‘నిజమే! పట్నవాసులు మహా దుర్మార్గులు’ ఆమె తన దారిలోకొస్తుందన్న ఉత్సాహంతో అన్నాడు జింబో.
‘మరైతే నువ్వు గౌతమిని ఎందుకు మనువాడాలనుకుంటున్నావ్. తను కూడా పట్నం మనిషేగా’ అమాయకంగా అంది చిన్ని. గతుక్కుమన్నాడు జింబో. తర్వాత తేరుకుని-
‘తను వేరు. అతను వేరు. ఆమె పట్నవాసి అయినా చాలా అమాయకురాలు’ అన్నాడు తడబడుతూ.
చిన్ని నవ్వింది.
‘అవును! అమాయకురాలే. కేవలం బ్లాక్‌టైగర్ మాట్లాడాలని వచ్చి, నీ దగ్గరికి చేరి నగలడిగి తీసుకుని, మన మీద ప్రేమ నటిస్తూనే అడవి సంపద కాజెయ్యాలని చూస్తున్న ఆమె అమాయకురాలు. ప్రేమించిన ఆమె కోసం ప్రాణాలకి తెగించి వచ్చిన ఆ ప్రభుగారు దుర్మార్గుడు. అందుకేగా అతన్ని నానా యాతనలూ పెట్టింది’ అంది వ్యంగ్యంగా.
‘అది కాదు చిన్నీ! నువ్వతన్ని ప్రేమించావుగానీ అతను నిన్ను ప్రేమించలేదు. ఇప్పటికీ ఆ గౌతమినే ప్రేమిస్తున్నాడు’
‘గౌతమి నిన్ను ప్రేమించిందా? అతనే్నగా ప్రేమించేది?’
‘అయితే ఇప్పుడేమంటావ్?’ చిరాగ్గా అన్నాడు జింబో.
‘ఏమీ అన్ను! నన్నొదిలేసి నీ పనులు చూసుకోమంటాను’ అంటూ లేచింది చిన్ని.
జింబోకి పిచ్చి కోపం వచ్చేసింది.
‘అయితే వాణ్ని కట్టుకుని ఆ జనారణ్యంలోకెళ్లి కాపురం వెలగబెడతావా? మమ్మల్నందర్నీ వదిలి ఒక్క క్షణం అక్కడ వుండగలననే అనుకుంటున్నావా?’ అన్నాడు ఆవేశాన్ని అతిప్రయాసగా అణచుకుంటూ.
‘కట్టుకున్నాక తప్పుతుందా? ఆ జనారణ్యంలో పుట్టి పెరిగిన గౌతమి ఈ మృగారణ్యంలో కాపురం చెయ్యాలన్నా కాస్త కష్టంగానే ఉంటుంది. మెల్లగా అలవాటై పోతుంది. నువ్వేం నా గురించి బెంగపడకు. నేను సర్దుకుపోతాను’ ఆరిందాలా అంది చిన్ని.

(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్