కథ

మధురస్మృతి - కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనోజ్ఞా?’ భోజనం చేసి తన గదిలోకి వెళ్లబోతున్న మనోజ్ఞ తల్లి పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది.
‘చరణ్ తేజా వాళ్లకి సాయంత్రంలోగా కబురు చెయ్యాలి. తొందరగా ఆలోచించుకుని చెప్పు...’ అంది సులోచన.
‘అలాగే’ అన్నట్లు తలూపి గదిలోకి వచ్చేసింది మనోజ్ఞ.
మనోజ్ఞ పేరుకు తగ్గట్టు కుందనపు బొమ్మలా ఉంటుంది. బీటెక్ చేసి ఉద్యోగం చేస్తోంది. నమ్రత, అణకువ ఆమె సొత్తు. ఇవాళ మనోజ్ఞ మనసంతా ఆందోళనగా ఉంది. క్రిందటి రోజు జరిగిన పెళ్లిచూపులు గుర్తొచ్చాయి ఆమెకు. ఆ అబ్బాయి చరణ్ ‘ఇన్ఫోసిస్7లో మూడేళ్ల నుండి చేస్తున్నాడు. తనకన్నా మూడు అంగుళాలు పొడవుంటాడు. అతనిలో ఏదో తెలియని ఆకర్షణ. అది అతని వ్యక్తిత్వంవల్ల కలిగినట్టుగా ఉంది. చాలా సింపుల్‌గా తయారై వచ్చాడు. ఏదో ఒకటీ రెండు మాటలు అవీ తన తల్లిదండ్రులతో, అన్నయ్యతో మాట్లాడినవే. అంతకీ అన్నయ్య శ్రీకాంత్ ‘మీరూ మనోజ్ఞా ఆ గదిలోకి వెళ్లి మాట్లాడుకోండి’ అన్నాడు.
‘నోనో అవసరం లేదు. ఇంటర్నెట్‌లో తన ప్రొఫైల్ చూసి నచ్చే వచ్చాను. ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేమి లేదు’ అన్నాడు చరణ్ నవ్వుతూనే.
తనకి అతన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని ఉంది. కానీ అదేమీ ఆలోచించకుండానే ‘నో’ అనేశాడు. దీన్నిబట్టి అతని వ్యక్తిత్వం ఎలా అంచనా వెయ్యడం? ఇది మినహా మిగతా అంతా తనకి బాగా నచ్చాడు. ఒక్కసారి అతనితో మాట్లాడితే? అతని తల్లిదండ్రులు మంచివాళ్లలానే ఉన్నారు. ఆవిడ మాటల మధ్యలో చెప్పింది. తను డిగ్రీ చదివిందట. భర్తకి ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని తను దాని జోలికి పోలేదుట. భార్య మాటలను సమర్థిస్తూ ఆయన తనతో అన్నాడు. ‘ఉద్యోగం అవసరం అయిన వాళ్లే చెయ్యాలి. కాలక్షేపం కావాలంటే సోషల్ సర్వీస్ చేసుకుంటే ఎన్నో సంస్థలు బాగుపడతాయి. నిరుద్యోగ సమస్య తీరాలంటే అందరూ ఉద్యోగాలంటూ ఎగబడకూడదు.. ఆయన నవ్వుతూనే స్థిరంగా చెప్పాడు. ఆ మాటలు తనకెంతో నచ్చాయి. ఒక్కడే కొడుకు. ముగ్గురూ వచ్చినప్పట్నుంచీ నవ్వు మొహంతోనే ఉన్నారు.
‘ఏరా మనూ! ఏం నిర్ణయించుకున్నావ్?’ లోపలికొస్తూ అడిగాడు శ్రీకాంత్. ఒక్కగానొక్క చెల్లెలు. మనోజ్ఞ అంటే ప్రాణం అతనికి.
‘రా! నువ్వు నాకో హెల్ప్ చెయ్యాలి. నీ అభిప్రాయం చెప్పరా అన్నయ్యా’ అంటూ తన సందేహాలు అన్నీ అన్నయ్యతో చెప్పుకుంది.
‘ఓస్ అంతేనా! నీ కోరిక ఐదు నిమిషాల్లో తీరుస్తా’ అంటూ పిలుస్తున్నా వినకుండా వెళ్లిపోయాడు శ్రీకాంత్. ఆ వెళ్లడం మేడ మీదకు వెళ్లాడు. చరణ్ నెంబర్ అతని దగ్గర లేదు. ఇంటి ల్యాండ్‌లైన్ నెంబరే ఉంది. దానికి చేశాడు. అతని ‘లక్’ బాగుంది. చరణ్ ‘లిఫ్ట్’ చేశాడు.
‘హలో చరణ్‌గారూ!’ అంటూ ఆపేశాడు.
‘ఎస్ చరణ్నే మాట్లాడుతున్నాను. మీరు..?’
‘నేను శ్రీకాంత్. మనోజ్ఞా వాళ్ల అన్నయ్యని’ ఆపాడు శ్రీకాంత్.
‘ఓ శ్రీకాంత్! ఎలా ఉన్నారు. చెప్పండి. ఏమిటీ విషయం?’ అడిగాడు నవ్వు ధ్వనించిన గొంతుతో.
‘సారీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నానా?’ అడిగాడు నమ్రతగా.
‘నోనో సండే గదా. చాలా తీరిగ్గా ఉన్నాను చెప్పండి...’

‘ఏం లేదు. మా మనూ ఒక్కసారి మతో మాట్లాడాలని అంటోంది. మీకు అభ్యంతరం లేకపోతేనే?’ మొహమాటపడుతూనే అడిగాడు.
‘ఓ అలాగా! దానిదేముంది. ఆమె మొబైల్ నెంబర్ ఇవ్వండి. కాల్ చేసి మాట్లాడతాను’ క్యాజువల్‌గా అన్నాడు.
‘మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను. మీకు వీలున్నప్పుడు చెప్తే తనచేత చేయిస్తాను’ అన్నాడు శ్రీకాంత్ మర్యాదకి.
‘ఇప్పుడు ఫ్రీనే నేను. చెప్పాను కదా పర్వాలేదు తన నెంబర్ ఇవ్వండి’ చనువుగా అన్నాడు చరణ్. నెంబర్ ఇచ్చి మరోసారి థాంక్స్ చెప్పి పెట్టేశాడు శ్రీకాంత్.
‘ఈ అన్నయ్య వెళ్లి ఏం చేస్తున్నాడు? చెప్పి వెళ్లొచ్చు గదా అంతా తొందరే వీడికి?’ అనుకుంటూ ఉండగా సెల్ మోగింది. నెంబర్ చూసింది మనోజ్ఞ. ఏదో కొత్త నెంబర్. ఎవరబ్బా అనుకుంటూ ఆన్ బటన్ నొక్కి ‘హెల్లో?’ అంది మృదువుగా.
‘హలో మనోజ్ఞా?’
మగ గొంతు వినగానే ఒక్కసారి గుండె ఝల్లుమంది మనోజ్ఞకి.
అచ్చం చరణ్ గొంతులానే ఉంది.
‘అవును మీరు...’ సందిగ్ధంగా ఆగిపోయింది.
‘మీ ఊహ కరెక్టే. నేను చరణ్‌ని. ఎలా ఉన్నారు?’
‘ఆఆ... బాగున్నాను. మీరెలా ఉన్నారు?’ ఆమె గొంతులో కంగారు, తడబాటు చోటు చేసుకున్నాయి. అన్నయ్య అతనికి నెంబరిచ్చి చేయించినట్టున్నాడు. ఆమెకు సిగ్గుగా, కంగారుగా అనిపించింది.
‘కంగారేమీ లేదు. మీరు చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. నేను కూడా ఫ్రీగానే ఐమీన్ ఖాళీగానే ఉన్నాను. మీరు ఎంతసేపు మాట్లాడినా మీ ఇష్టం. కమాన్’ అన్నాడు నవ్వుతూ. అతనలా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడేసరికి ఆమెకు ఎంతో రిలీఫ్‌గా అనిపించింది.
‘నిన్న మనం పర్సనల్‌గా ఏమీ మాట్లాడుకోలేదు. నాకు ఇద్దరం మన అభిరుచులూ అవీ మాట్లాడుకొనుంటే బాగుండునని అనిపించింది. మీరు ‘నో’ అనేశారు’ అని ఆగిపోయింది.
‘ఓ సారీ! నేనలా ఆలోచించలేదు. నాకెందుకో ఈ పద్ధతుల మీద నమ్మకంలేదు మనోజ్ఞా! పెళ్లికి ముందే మాట్లాడుకోవడాలు, కలిసి తిరగడాలు, అభిప్రాయాలు తెలుసుకునే వంకతో సినిమాలు, షికార్లు. ఇవన్నీ నాకు నచ్చవు. అసలు ‘ఎంగేజ్‌మెంట్’ అంటూ దాదాపు పెళ్లిలాగా చేసేస్తున్నారు ఇప్పుడు. నా ఇష్టాయిష్టాలు అడిగారు కదా మీరు? చెప్పేస్తున్నాను. విన్నాక మీ అభిప్రాయం చెప్పండి. అమ్మాయి, అబ్బాయి పెళ్లిచూపుల్లో చూసుకున్నాక పెళ్లి పీటల మీదే మళ్లీ చూసుకునేవారు ఇది వరకు. ఆ సంప్రదాయాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ రోజు చూసిన రూపం మనసులో ప్రతిష్టించుకొని పెళ్లి కోసం ఎదురుచూస్తే ఎంత మధురంగా ఉంటుంది? వేదమంత్రాల మధ్య, పచ్చటి పందిరి కింద ఎదురుబొదురూ కూర్చుని మధ్యన కట్టిన తెర పక్కకి జరుగుతున్నప్పుడు దొంగచూపులు చూసుకుంటూ, ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటూ పెళ్లిలో జరిగే ప్రతి తంతుని ఎంజాయ్ చేయవచ్చు తెలుసా? నెత్తి మీద జీలకర్రా, బెల్లం పెట్టినప్పుడు తొలి స్పర్శ అనేది ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది? నడుం చుట్టూ తాడు కట్టిస్తున్నప్పుడు, కాలివేళ్లకు మెట్టెలు తొడిగిస్తున్నప్పుడు, సూత్రాలు వేసిన పసుపుతాడుని మెడకు మూడు ముళ్లు వేస్తున్నప్పుడు కలిగే స్పర్శ తాలూకు ఆనందం జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా కాకుండా పెళ్లికి ముందే హోటళ్లు, సినిమాలు, పార్కులు తిరిగాక ఎంగేజ్‌మెంట్‌లో ఉంగరాలు తొడుక్కున్నాక ఇంకా పెళ్లి తాలూకు మధుర స్మృతులంటూ ఏముంటాయి మనోజ్ఞా? ఇంకా ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడం అంటారా పెళ్లిచూపుల్లోనూ, బైట తిరిగేటప్పుడు వాళ్ల గురిచి అన్నీ నిజాలే చెప్తారా? ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టుగా తిరుగుతారు. అప్పుడు తెలుసుకునే అవకాశమే ఉండదు. పెళ్లినాటికి కొత్తగా పొందే అనుభవం అంటూ ఇంకా ఏమీ ఉండదు. పెళ్లిరోజు బ్రాహ్మణుడు చదివే మంత్రాలు వధూవరులను ఉద్దేశించి చెప్పేవి ఇలాంటి వాళ్లకు వర్తించవు. ఎందుకంటే ఈపాటికి వాళ్లు కొన్ని లక్షల అడుగులు వేసేసి ఉంటారు కనుక సప్తపది అన్నదానికి వీళ్లు ఏమర్థం చెబుతారు? మొదటిసారి నూతన వధువుతో కలిసి ఏడడుగులు వేసిన ఆనందం, అనుభవం వీళ్లకి జన్మలో కలుగుతుందా? పెళ్లిలో నూతన వధువుతో కలిసి వరుడు చేసే ప్రతి క్రియ అతని జీవితాన్ని సార్థకం చేస్తుంది. అలాగే అమ్మాయికి కూడా. ఆ తర్వాత జరిగే కార్యక్రమానికి ఆ రెండు రోజుల దగ్గరితనం ఉత్తేజం కలిగిస్తుంది. జీవితాంతం పెళ్లి ఒక మధుర స్మృతిగా నిల్చిపోతుంది. ‘మనోజ్ఞా! నా అభిప్రాయాలు మీరు ఏకీభవించాలని లేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఇదే కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. అయితే ఇవేవీ మిమ్మల్ని అడగకుండా నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఎందుకంటే మీరు, మీ కట్టూబొట్టూ నా మనస్తత్వానికి విరుద్ధంగా అనిపించలేదు. నా ఆలోచనలూ మీవీ ఒకటే అనిపించింది. ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యమని చెప్పినప్పుడు నాక్కూడా చాలా సంతోషం కలిగింది. హమ్మయ్యా నా మనసంతా విప్పేశాను. ఇంకా జవాబు చెప్పాల్సింది మీరే...’ అంటూ కాసేపు ఆగాడు.
అటు నుంచి జవాబు రాకపోయేసరికి లైన్ కట్టయిందా కొంపదీసి అనుకుని ‘హలో’ అన్నాడు కంగారుగా.
‘హల్లో’ ఎంతో మధురంగా వినిపించింది మనోజ్ఞ గొంతు. ‘్థంక్ గాడ్ లైన్లోనే ఉన్నారా... ఏమో నా మాటలు మీకు జోలపాటలా ఉండి నిద్రపోయారేమో అనుకున్నాను’ అన్నాడు భయం నటిస్తూ చరణ్.
‘లేదులేదు... ఈరోజు ఇలా మాట్లాడి ఉండకపోతే మిమ్మల్ని ఏ కారణం వల్లనయినా కాదనుకుంటే నాకన్నా దురదృష్టవంతురాలు మరొకరు ఉండరు. అవును చరణ్! మీరు, మీ అభిప్రాయాలు నాకు చాలా నచ్చాయి. నేనెంతో అదృష్టవంతురాల్ని. మీతో పెళ్లి నా జీవితంలో ఒక మధురస్మృతి కావాలి. ఇంతకంటే మాటలు రావడంలేదు’ భావోద్వేగంతో అంది మనోజ్ఞ.
‘్థంక్యూ మనోజ్ఞా థాంక్యూ సోమచ్. అంటే ఈ పెళ్లికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకున్నట్టేనని భావిస్తున్నాను. ఈ విషయం మా పేరెంట్స్‌తో మాట్లాడి వెంటనే మీ వాళ్లకు ఫోన్ చేసి త్వరలో ముహూర్తాలు పెట్టించమని చెబుతాను సరేనా?’ అంటూ చిలిపిగా నవ్వాడు చరణ్.
మనోజ్ఞ మనసులో నిన్నటి అలజడి మాయమయ్యి రాబోయే మధుర క్షణాలు తలచుకుంటూ హాయిగా నవ్వుకుంది.
====
జె.ఉషారాణి
ఫ్లాట్ నెం.401, శ్రీలక్ష్మి ప్లాజా, అన్నపూర్ణ ఎన్‌క్లేవ్, చందానగర్
హైదరాబాద్-500 050. 9866187886/9160445798

-జీడిగుంట ఉషారాణి